సామెతలు
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. ఆంగ్లంలో సామెతను byword లేదా nayword అని కూడా అంటారు. సామెతలలో ఉన్న భేదాలను బట్టి వాటిని "సూక్తులు", "జనాంతికాలు", "లోకోక్తులు" అని కూడా అంటుంటారు.
సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[1]
సామెతలు అంటే ఏవి
[మార్చు]"లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో రచయిత సామెతను ఇలా నిర్వచించాడు[1] -
- సంస్కృతమున "లోకోక్తులు" లేదా "న్యాయములు" అనువానిని తెలుగున "సామెతలు" అందురు. లోకోక్తి యనగా విశేష లోకానుభవము గల పెద్దల మాట. ఇవి తక్కువ పదములలో నిమిడి యున్నను వీనియందు విశేషార్ధము గర్భితమైయుండును. ఇవి దేశీయ పద సమ్మిళితములైయుండి జనుల ఆచారములను, నాగరికతను, మనోభావమును ప్రకటించుచుండును. వీటిని చదివినా విన్నా గాని నీతిబోధకములుగా ఉండి ప్రాపంచిక జ్ఞానమును వృద్ధిపరచి, ఆనందదాయకముగా ఉండును. Eric Pertridge అనే ఆంగ్ల రచయిత ఇలా చెప్పాడు - "In the potted wisdom of the world's proverb literature, there is shrewdness, Commonsense, good sense and at times we ftnd at times a penetrating profundity, humour and wit beneficient satire and expedient salvation."
ప్రజా బాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉండి, మరల మరల వాడబడే వాక్యాలు లేదా పదజాలాలు సామెతలు అవుతాయి. ఇవి సాధారణంగా సరళమైన భాషలో ఉంటాయి. ఎక్కువ మందికి తెలిసి ఉంటాయి (అంటే సామెత చెప్పిన వ్యక్తి దాని అర్ధాన్ని వివరించనక్కరలేదు). అనుభవాత్మకంగా గాని, సామాన్య జ్ఞానంతో గాని తెలిసిన విషయం సామెతలో కొన్నిమార్లు సూటిగాను, కొన్నిమార్లు అన్యాపదేశంగాను, కొన్నిమార్లు సోదాహరణంగాను చెప్పబడుతుంది. పదాల కూర్పులో పొందిక గాని లయ గాని ఉండడం కద్దు. సామెత ప్రధానంగా సూటిగా నీతిని బోధించేదయితే దానిని "సూక్తి" లేదా "నీతి వాక్యము" అంటారు. మరీ చిన్నవైన వాక్యాలు (రెండు మూడు పదాలు మాత్రమే) ఉంటే అది "జాతీయము" కూడా కావచ్చును.
"లోకోక్తి" పదాన్ని తెలుగులో "నానుడి" అని, తమిళంలో "పళమొళి", పంళచొళ్ళు" అని, కన్నడంలో "నాన్నుది" అని అంటారు. ఇవన్నీ "జనుల మాట" అన్న అర్ధాన్నే ఇస్తాయి.[2] కనుక సామెతలు అంటే "పదుగురాడు మాట", "జనుల నోట నానిన మాట" అని చెప్పవచ్చును.
సామెతల వినియోగం సందర్భానుసారంగా వివిధ ఫలితాలనిస్తుంది. ఒకోమారు కటువైన విషయాన్ని సామెతల ద్వారా మెత్తగా చెప్పవచ్చును. ఒకోమారు ఒక వ్యక్తి తన బలహీనమైన వాదానికి తరతరాల అనుభవాన్ని జోడించిన బలం పొందగలుగుతాడు. ఒకోమారు సంభాషణకు కాస్త చైతన్యం లభిస్తుంది. ఉపన్యాసకులు సామెతల ద్వారా తమ ప్రసంగాన్ని రక్తికట్టించగలుగుతారు. సామెతల అధ్యయనం అనేక ప్రయోజనాలకు వాడుతారు - జానపద సాహిత్యం అధ్యయనం చేసేవారికి ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. ప్రజల నాగరికతలో వచ్చిన మార్పులు, వలస వెళ్ళినవారు క్రొత్త సమాజంలో ఇమిడిన తీరు, ప్రకటనలలో ఆకర్షణ, పాఠ్యాంశాల బోధనలో మెళకువలు - ఇలా అనేక ప్రయోజనాలున్నాయి.
సామెతలు అధికంగా ప్రజల జీవనం నుండి, అనుభవంనుండి పుడతాయి. కాని సాహిత్యంనుండి, మత గ్రంథాల నుండి, రాజకీయ నేపథ్యంనుండి కూడా పుట్టవచ్చును. కొన్ని తెలుగు సినిమా పేలిన డైలాగులు కూడా తెలుగులో సామెతలకు సమాన స్థాయిని సాధించి చలామణిలో ఉన్నాయి ("సాహసము సేయుమురా డింభకా", "మడిసన్నాక కుసంత కలాపోసనుండాలి. తిని తొంగింటే మడిసికీ గొడ్డుకూ తేడా యేటుంటుంది?", "ఒకసారి కమిటయ్యాక నా మాట నేనే వినను")
సామెతలు ఎలా వస్తాయి
[మార్చు]సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు.
సామెతల లక్షణాలు
[మార్చు]సామెత అనే మాట 'సామ్యత' నుంచి వచ్చింది. సామ్యత ముఖ్య గుణాల్లో సామ్యతలో (పోలికను) చెప్పడం కూడా ఒకటి. దృష్టాంతము అనే అర్థంలోనే హంగరీ భాషలో వెల్డబెగెడ్ అని అరబ్బీ భాషలో 'మతల్' అని సామెతకు పేర్లున్నాయి. జన జీవితానికున్నంత వైవిధ్యం ఈ సామెతలకు ఉంది. జానపద విజ్ఞానంలో ఉన్న అన్ని అంశాల లాగే సామెతలు కూడా సంప్రదాయబద్ధమైనవి. వివేకాన్ని కలిగించడం, సంక్షిప్తంగా ఉండడం వాటి ప్రత్యేకత. సామెతలు దాదాపుగా అన్ని సంక్షిప్తంగానే ఉంటాయి. వాటిలో 40 పదాలకంటే ఎక్కువ ఉండవు. అలా ఉంటే అవి సామెతలు కావని కొందరు విద్వాంసుల అభిప్రాయం. అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అన్న వాక్యానికి సామెతలు. ఉదాహరణలుగా ఉంటాయి. సామెతలు సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలోనూ చారిత్రాకాంశాల సంబంధంగానూ పురాణాల ఇతిహాసాలు కథలు తదితరాల ఆధారంగానూ ఉద్భవిస్తూ ఉంటాయి. సామెత రూపాయి నాణెం వంటిది. నాణెం ముద్రించగానే చెలామణిలోకి రాదు. ప్రభుత్వం వారు ముద్రించినా ప్రజల్లో చలామణి అయిన తర్వాత నాణానికి విలువ వస్తుంది. అదేవిధంగా సంప్రదాయం, జనప్రియత్వం ఉన్న వృత్తులు మాత్రమే సామెతలుగా ముందు తరాలకు అందుతాయి.... సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తూ మాట్లాడటం ఒక అద్భుతమైన కళ. ... ఎంత విషయ రహితంగా ఉన్న ఉపన్యాసమైనా సామెతలను జోడించినప్పుడు ఎంతో అందంగా శ్రోతలకు మనోరంజకంగా ఉంటోంది. ఈ కారణంతోనే సామెతను "ఆమెత" (విందు భోజనం) తో పోల్చిచెబుతుంటారు. విందు భోజనం పెట్టడం గృహస్తుడికి, అతిథికి ఇద్దరికీ ఆనందదాయకంగా ఉంటుంది. విందు భోజనం పెడుతున్న వ్యక్తి భాగ్యవంతుడని సులభంగా గ్రహించినట్లు సామెతలను ఉపన్యాసంలో వాడుతున్న వ్యక్తి జ్ఞానసంపన్నుడని ఎవరయినా వెంటనే గ్రహించేస్తారు.
సూత్రపు సామెతలు
[మార్చు]మొట్టమొదట సంఘంలో కొన్ని వాక్యాలు లేక సుత్రాలు వాడబడతాయి. ఈ సూత్రాలే క్రమేపీ సామెతలుగా మారుతాయి.వీటికే సూతపు సామెతలని పేరు.ఈ సామెతలలో భావాలంకారాలుండవు. ఇటువంటి సామెతలయొక్క వయస్సు నిర్ణయించడం కష్టం.సూత్రపు సామెతలలో మరొక చిక్కు ఇప్పుడు వాడుకలో ఉన్న సూత్రాలనే మనం సామెతలగా చెప్పగలం కాని, వాడుకలో లేని వాటిని గురించి చెప్పలేము.
ఉదాహరణము:
- కలిమిలేములు కావటి కుండలు.
- చెప్పకురా చెడేవు, ఉరకకురా పడేవు.
- నిజం నిలకడమీద తేలుతుంది.
- నిజమాడితే నిష్టూరం.
- అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు.
- దభ్భుపోయినవాడు పాపాన్ని పోతాడు.
ధ్వని సామెతలు
[మార్చు]ఈరకం సమెతలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.ఏదోఒక చర్యో లేక అమ్శమో అలంకారికంగా ప్రయోగించ బడడం వీటి లక్షణం.ఇవి ఎంత పురాతనమైనవో చెప్పటం కష్టం. పుస్తకాల ఆధారంగా కొంత చెప్పవచ్చును.ధ్వని సామెతలు అనేక వృత్తులలో నుంచి కూడా బయలుదేరుతాయి.
ఉదాహరణము:
- అందని పూలు దేవుని కర్పణం.
- కమ్మరి వీధిని సూదులమ్మినట్లు.
- కుడితే తేలు కుట్టకపోతే కుమ్మరి పురుగు.
- హనుమంతుని ఎదుట కుప్పిగెంతులా!.
మాదిరి సమెతలు
[మార్చు]పాత సామెతల మీదే మరికొన్ని కొత్త సామెతలు బ్యలు దేరుతాయి. వీటిలో ఏది మొదటో ఏవి తరువాతవో తెలుసుకోవడం కష్టం. ఆపాత సామెతలనబడేవి ఒక్కొక్కప్పుడు ఇతర భాషలలోనివి కావచ్చును.వాటి మూర్తులమీద మనభాషలో కొత్త సామెతలు బయలుదేరి ఉండవచ్చును.ఈమోస్తరుగా బయలుదేరిన సామెతలకు, ఒక్కొక్కప్పుడు పాత వాటికుండే చెలామణీ ఉండదు.
ఉదాహరణము:
- చల్ది కంటే ఊరగాయి ఘనం. దీనిమీద తయారయిన సామెత- ఉపన్యాసం కంటే ఉపోద్ఘాతం ఎక్కువు.
- ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు.
- ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
- ఆతండ్రికి కొడుకు కాడా!
- ఆబుర్రలో విత్తనాలేనా?
సామెతలలోని వ్యత్యాసాలు
[మార్చు]ఎక్కడా వ్రాసి ఉండకపోవటంతో సామెతలలో అనేకమార్పులు వస్తాయి.ఇవి అనేక మోస్తర్లు- ఒక అంశం మరొక అంశం చేతా, సామ్యభేధాల వల్లా, వృద్ధి చేయబడీ, కొంత విడిచి వేయబడీ, ఇంకా అనేక మోస్తర్లుగా అనేక మార్పులు వస్తాయి.
ఉదాహరణము:
- కందకు లేదు, చేమకు లేదు, తోటకురకు వచ్చెనా దురద! - కందకు లేని దురద బచ్చలికేమి.
- కాలు పట్టుకు లాగితే చూరు పట్టుకు వేలాడేడు - మెడపట్టుకు గెంటితే చూరు పట్టుకు వేలాడిందట.
- దొంగ చిక్కెనోయి అంటే కరిచెనోయి అన్నట్టు- కరవకురా దొంగడా!
కథల సామెతలు
[మార్చు]కొన్ని సామెతలు కథల మీద ఆధారపడి ఉంటాయి.వీటిలో కొన్నిటి కథలు ఘనం ఎరగం. మరికొన్ని కథల సామెతల మీదే కల్పనచేయబడి ఉంటాయి.
ఉదాహరణము:
- కాదు కాదు అంటే నాది నాది అన్నాట్ట.
- నంగివంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేశాయి అన్నాడుట.
- మెసలి బావా కడిమి వేరాయెగాని కాలయినా ఇంతే కదా.
సామెతలు, సంప్రదాయపు పాటలు
[మార్చు]సామెతలు కొన్ని సంప్రదాయపు పాటలలో కనబడుతున్నాయి.సామెతలే ఈమోస్తరు చరణాలుగా చేర్చబడ్డాయేమో తెలియదు.
ఉదాహరణము:
- ఉడకక ఉడకక ఓ ఉల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపుపోదు.
- మొండికెక్కిన దాన్ని మొగుడేమి చేసి రచ్చకెక్కినా దాన్ని రాజేమిచేసు.
- వాడ వదినెలకేల వావివరసలు.
సామెతలు, కర్తలు
[మార్చు]లోకులు సామెతలను వాడుతున్నా ఒక్కొక్క సామెతను సృష్టించిన వాడు ఒక్కొక్కడే. వేమన పద్యాలు లోని కొన్ని చరణాలు సామెతలుగా చలామణి అవుతున్నాయి.కాబట్టి వేమన కొన్ని సామెతలను సృష్టించాడనవచ్చును. నీతి శతకంలో కొన్ని చరణాలు కూడా సామెతలుగా వాడబడుతున్నాయి.
ఉదాహరణము:
- ఇనుము విరిగితే అతకవచ్చునుగాని మనసు విరిగితే అతక కూడదు.
- కంచు మోగునట్లు కనకమ్ము మోగునా!
- పుట్టడం చావడం కొరకే, పెరుగుట విరుగుట కొరకే.
చెరువు నిండితే కప్పలు చేరుతాయి.
పౌరాణిక సామెతలు
[మార్చు]రామాయణ కథ, భారత కథ లోని అంశాలను గురుంచి చాలా తెలుగు సామెతలు ఉన్నాయి. వీటిని పౌరాణిక సామెతలని అనవచ్చును.
- ఆవుల మళ్ళించినవాడు అర్జునుడు.
- కాని కాలానికి పయిబట్ట పక్షులెత్తుకు పోయాయి.
దేశచరిత్ర సామెతలు
[మార్చు]ఇటువంటి సామెతలలో దేశచరిత్ర కొంత తెలుస్తుంది. కాని అది సత్యమో, అసత్యమో పరిశీలించి తెలుసుకోవాలి.
ఉదాహరణ:
- అక్కన్న మాదన్న గార్లు అందల మెక్కితే సాటిసరప్ప చెరువు గట్టెక్కాడు.
- ఏమి అప్పాజీ అంటే కాలంకొద్దీ రాయాజీ అన్నాడుట.
- ఓరిస్తే ఓరుగల్లు పట్టణమవుతుంది.
- వింతలేని ఆవలింత పుట్టదు.
ఆక్షేపణ సామెతలు
[మార్చు]ఒకరినొకరు ఆక్షేపణ, వెటకారం చేసుకోవడం వస్తువుగా నున్న సామెతలు చాలా ఉన్నాయి.తీర్పులని ఆక్షేపించే సామెతలు, వైద్యాన్ని ఆక్షేపించే సామెతలు ఇలా పలురకాలు.
ఉదాహరణ:
- కమ్మనీచు కడిగినాపోదు, కాకినలుపు చిప్పపెట్టి గోకినాపోదు.
- కొండమీది గోలేమిటంటే కోమటివాళ్ళ రహస్యాలు.
- చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే చెవుల పోగులు నాజన్మానా ఎరగ నన్నదట.
- వైదికపు పిల్లీ వ్రత్తి పలకవే అంటే మావు మావు అందిట.
సంభాషణా సామెతలు
[మార్చు]సామెతలు ఒక్కొక్కపుడు సంభాషణా రూపంగా ఉంటాయి. ఈ సంభాషించే వ్యక్తులు మనుష్యులే అవ్వాలని నియమం లేదు.
ఉదాహరణ:
- ఏటికెప్పుడెళ్ళావు, ఇసక ఎప్పుడు తెచ్చావు అని అడిగితే, ఆడవాళ్ళు తలుస్తే అదెంతసేపు అందిట; మొగాళ్ళు తలుస్తే ఇదెంతసేపు అని బాదేడుట.
- ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడుట.
చమత్కారపు సామెతలు
[మార్చు]ఈరకమైన సామెతలలో అనేకరకమైన సంగతులు సంగ్రహంగా చెప్పబడడంగాని, పరస్పర విరుద్ధమైన అంశాలు విచిత్రంగా చెప్పబడడం గాని ఉంటుంది.
ఉదాహరణ:
- ఇల్లు ఏడ్చే అమావాస్య, ఇరుగు పొరుగు ఏడ్చే తద్దినం, ఊరు ఏడ్చే పెళ్ళీ లేదు.
- రాతికుండకు ఇనుపతెడ్డు.
- పండగ తొలినాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నం కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు.
- యోగికీ, భోగికీ, రోగికీ నిద్ర లేదు.
జాతుల, తెగల సామెతలు
[మార్చు]జాతుల, తెగ లక్షణాలు తెలియజేసే సామెతలు భాషలో ఉన్నాయి. వీటిలో చెప్పబడ్డ గుణాలన్నీ నిజమే అని చెప్పడానికి వీలులేదు.
ఉదాహరణ:
- అరవలేని దేశం కాకి లేని దేశం లేదు.
- ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెరుస్తాడు.
- పాములలో మెలగవచ్చును గాని స్వాములలో మెలగలేము.
- అరవచాకిరి.
అశ్లీల సామెతలు
[మార్చు]ఇవి చాలా ఉన్నాయి.కాని ఇవి పుస్తకాలలోకి ఎక్కవు. సభలో ఉచ్ఛరించబడవు.
- బుడ్డను నమ్మి ఏట్లో దిగినట్లు
- ఇంటికొక పుష్పం ఈశ్వరుడి కొక్కమాల.
పదబంధపు సామెతలు
[మార్చు]ఈ సామెతలు పదబంధాలు (Phrases) కాబట్టి వాక్యాలలో అనేక మోస్తర్లుగా వాడుతారు. ప్రత్యేకంగా పదబంధపు సామెతలు మన భాషలో లేవనే చెప్పుకోవాలి. ఎంచేతంటే ఇవి ప్రత్యేకంగా చెప్పక ఏదో వాక్యంలో చెప్పబడతాయి.
ఉదాహరణ:
- గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం.
- తడిగుడ్డలతో గొంతుక కోయడం.
- పాలుతాగిన రొమ్మున గుద్దడం.
శుక్తోక్తి సామెతలు
[మార్చు]"కూర్చొని లేవలేడు గాని వంగుండి తీర్ధమెళతానని అన్నాడుట"; "కూడుగుడ్డ అడగకపోతే బిడ్డను సాకినట్టు సాకుతానని అన్నాడుట". ఈరకమైన సామెతలకు శుక్తోక్తి సామెతలని పేరు. అంటే ఈ ఒకరో, ఒకర్తో అన్నాడు, అనుట. ఈరకమైన సామెతలలో మొట్టమొదట ఫలానావాడు ఫలానా వాడితో అన్నాడు, అంది అని ఉండేది. కాని క్రమేపీ ఆపేరు జ్ఞాపకం పెట్టుకొనే శ్రద్ధలేక, అన్నాడు, అంది అన్నదానితోనే వాక్యం పూర్తిఅవడం వల్లా, ఈ సామెతలు సాధారణంగా అన్నాడు, అంది అన్న మాటలతోనే పూర్తి అవుతుంటాయి.
ఉదాహరణ:
- అయ్యో పోతున్నావా అని పచ్చాకు పండాకును చూసిఅంది.
- అరుంధతీ కనబడదు, అధ్వాన్నం కపబడదు, అరవై వరహాల అప్పుమాత్రం కనబడుతూంది అన్నాడు.
- జీతమూ భత్యమూ లేకుండా తోడేలు మేకలను కాస్తానన్నట్టు.
ఉపమానపు సామెతలు
[మార్చు]"నీళ్ళు నీలం ముక్కల లాగున్నాయి", "పాలలా తెల్లగా ఉంది" మొదలైనవి ఉపమానపు సామెతలు.ఇవి అనేకం కవిత్వంలో వాడబడ్డాయి.
ఉదాహరణ:
- గంగాబోండాలలాంటి నీళ్ళు.
- వడగళ్ళ లాంటి నీళ్ళు.
- చింతపువ్వు లాంటి బియ్యం.
- పిల్లలు గారకాయలలాగున్నారు.
- గానుగరోలు లాంటి నడుము.
వివిధ భాషలలో సామెతలు
[మార్చు]స్త్రీల గురించి
[మార్చు]తెలుగు సామెతలలో చాలా భాగం స్త్రీల గురించి ఉన్నాయి. "సామెతలు ఆడువారి సొత్తు. చాలా సామెతలు స్త్రీలే కల్పించియుందదురని నా నమ్మకం. వాడుకలో కూడా చాలా వరకు స్త్రీల నోటనే సామెతలు వస్తుంటాయి." అని లోకోక్తముక్తావళి సంకలనకర్త అన్నాడు.[1]
ఇదే భావాన్ని కోకా విమల కుమారి అనే రచయిత చెప్పింది - నిత్యజీవితంలో ఎక్కువగా పురుషులకంటే స్త్రీలే సామెతలను వాడుతూ ఉంటారు. - "తలలు బోడులైతే తలపులు బోడులా!" ఈ సామెత యవ్వనంలో వున్న స్త్రీలనుద్దేశించి చెప్పబడింది. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదు" ఇంటికి మహాలక్ష్మిలాంటిది ఇల్లాలు. అలాంటి ఇల్లలు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కరువైపోతాయట. "ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు" అనే సామెతలో ఇంటి పరిసరాలు, వాతావరణం పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాల్ని కూడా పరిశుభ్రతకు ప్రతీకగా మంచితనానికి మారుపేరుగా పరిగణించవచ్చును. సామెతల వాఙ్మయంలో అత్తగారికి సంబంధించిన సామెతలు అనేకం. "అత్తలేని కోడలుత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు" ఇందులో ఒకటి. "అత్త ఏలిన కోడలు చిత్తబట్టిన వరి" అంటే అత్తింట్లో అందర్నీ మెప్పిస్తూ తెలివిగా కాపురం చేసిన కోడలు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగల శక్తి, సామర్ధ్యాన్ని కలిగివుంటుందని అర్ధం. "అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది" అత్తగారింట్లో సుఖపడ్తున్నాని కోడలు అనుకున్నా అది మోచేతికి తగిలిన గాయంలా ఉండీ ఉండీ బాధపెడ్తూనే ఉంటుంది. "అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట" అత్త మీద ఉన్న కోపం ఆమె పేరున్న కూతురుపై చూపడం అంటే ఆ కోడలికి అత్తమీద ఎంతటి ద్వేషం ఉందో తెలుస్తూనే ఉంది. "అంగడి మీద చేతులు అత్త మీద కన్ను", "అత్తను కొడితే కోడలు ఏడ్చిందట" ఇలా అత్తకు సంబంధించిన సామెతలు అనేకం. ."రొద్దానికి ఎద్దును పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు" అనేది ఒక సమస్యాయుత సామెత. పెనుగండ ప్రాంతంలో బావులు చాలా లోతుగ వుంటాయి గనుక నీళ్ళు తోడడం చాలా కష్టమనీ, అందుకే అలాంటి వారితో పిల్లనిచ్చి వియ్యమందకూడదనీ, మెరక సేద్యం చేయడం కష్టం కనక అలాంటి ప్రదేశాలకు ఎద్దుల్ని పంపించకూడదనీ ఒక నమ్మకం ఇండేది. - "కూతురు కనలేకపోతే కొడుకు మీద విరుచుకుపడ్డాట్ట", "కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట", "సారె పెట్టకుండా పంపేను కూతురా, నోరుపెట్టుకుని బ్రతకమందట", "కాలు జారితే తీసుకోవచ్చుగానీ నోరు జారితే తీసుకోలేము" [3]
వృత్తులు, కులాలు, మతాలు
[మార్చు]సామెతల్లో మూఢనమ్మకాలు, కులవివక్ష, అవహేళనా కూడా ఉన్నాయి.ప్రస్తుతమైనా అప్రస్తుతమైనా కొన్ని సామెతలు స్త్రీలనూ, నిమ్నవర్గాలనూ, వికలాంగులనూ కించపరిచేవిగా ఉన్నాయి.ఇప్పటికే అనేక పుస్తకాలలో కొన్నివేల సామెతలతో పాటు ఇవికూడా గ్రంథస్తమై ఉన్నాయి.ఇప్పుడు వీటిని మనం వాడలేము.వాడితే ఊరుకోరు.ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:
• నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు • ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు • ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు • నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను? • తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు, తుమ్మను నమ్మిన కమ్మను నమ్మకు • రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు • నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు • తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు • మాలవానిమాట నీళ్ళమూట • చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి? • విధవముండకు విరజాజి దండలేల? • కాశీలో కాసుకొక లంజ • నంబీ నా పెళ్ళికి ఎదురురాకు • నియోగి ముష్టికి బనారసు సంచా? • మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట • కులం తక్కువ వాడు కూటికి ముందు • చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు • మాలలకు మంచాలు బాపలకు పీటలా? • మాలబంటుకు ఇంకొక కూలిబంటా? • ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
తెలుగు సామెతల పుస్తకాలు
[మార్చు]తెలుగులో అనేక సామెతల పుస్తకాలున్నాయి. 18168లో కాప్టన్ ఎం డబ్ల్యూ కార్ ఆంధ్ర లోకోక్తి చంద్రిక అను పేరున ప్రకటించాడు.అతని కంటే ముందుగా కొంతమమంది సామెతల పుస్తకాలను ప్రకటించేరన్న సంగతి కార్ పుస్తకం యొక్క పీఠిక నుండి తెలుస్తుంది.కాని ఎక్కడా ఆపుస్తకాలు లభించడంలేదు.ఉన్న సామెతల పుస్తకాలలో కార్ యొక్క ఆంధలోకోక్తి చంద్రిక యే మొదటిది. అదే పుస్తకాన్ని అదే పేరున నందిరాజు చలపతిరావు గారు 1906 లో ప్రకటించేరు.కార్ పుస్తకంలో 2700 సామెతలున్నాయి.నందిరాజు వారు కార్ పుస్తకాన్నే తిరిగి ప్రకటించినా ఎక్కడ కార్ మాట ఎత్తలేదు.అంతేకాదు కార్ చేసిన కొన్ని లోపాలే దీనిలో కుడా కనబడుతున్నాయి.పరిశోధకులకు పనికివచ్చే అనేక అంశాలు కార్ పుస్తకంలో ఉన్నాయి.అట్టివి నందిరాజువారి పుస్తకంలో లేవు.కార్ 485 సాంస్కృతిక లోకోక్తులను ప్రకటించాడు.కార్ వేసిన మొదటి సంపుటిలో 1185 సామెతలు మాత్రమే ఉన్నాయి. వీటినే వావిళ్ళ వారు తెనుగు సామెతలు అను పేరున 1922 లో అచ్చువేసారు. వ్యవసాయపు సామెతలను పుస్తకాన్ని గవర్నుమెంటు వారు వేసారు.
కాశీనాధుని నాగేశ్వరరావు గారు ప్రకటించిన ఆంధ్రవాజ్మయ సూచికలో ఉన్న పుస్తకాల పేర్లు ఇలా ఉన్నాయి.
- లోకోక్తముక్తావళి - యస్.సోమసుందర కవి
- హైదరాబాదు తెలుగు సామెతలు
- ఆంధ్రలోకోక్తి చంద్రిక - కార్
- ఆంధ్రలోకోక్తి చంద్రిక - నందిరాజు చలపతిరావు
- ఆంధ్రలోకోక్తి పంచాశత్తు - పణుతుల నృసింహ శాస్త్రి
- నానాదేశపు సామెతలు
- సంస్కృత లోకోక్తి చంద్రిక.
- లోకోక్తి ప్రకాశిక - జయంతి భావనారాయణకవి.
పత్రికలలో కొన్ని సామెతలు అచ్చయేయి. వినోదిని పత్రకలో చమత్కారమైన సామెతలు (2సం.9సంచిక) అనీ, మనోరమ పత్రికలో కొన్నీ పడ్డాయి.ఆముద్రిత గ్రంథ చింతామణి, మార్చి 1902లో కొన్ని, అదే పత్రికలో 1896లో కాళహస్తీశ్వర మహత్యం లోని లోకోక్తులు పడ్డాయి. కోట సూర్యనారాయణరావు గారు ఉపాధ్యాయోపయోగిని పత్రికాధిపతి.ఈ పత్రికలో సెప్టెంబరు 1896 వరకు కొన్ని అచ్చయ్యాయి.టి.ఎ.స్వామినాధ అయ్యరు సంపాదకుడుగా అచ్చువేసిన సత్యసాధని పత్రికలో చిత్రరామ స్వామి నాయుడు నానా దేశపు సామెతలని ప్రకటించారు.
మనకు లభిస్తూన్న పుస్తకాలలో మొదటిది కాప్టెన్ కార్ 1868లో ప్రకటించిన ఆంధ్రలోకోక్తి చంద్రిక.ఇతడు దీనికి ఆంగ్లంలో ఒక ఉపోద్ఘాతాన్ని కూడా వ్రాసేడు.
ఇతర విశేషాలు
[మార్చు]- సామెతలను అధ్యయనం చేయడాన్ని ఆంగ్లంలో "paremiology" అంటారు. సామెతలను సేకరించడాన్ని "Paremiography" అంటారు.
- అమెరికాకు చెందిన Wolfgang Mieder సామెతల అధ్యయనంలో ప్రసిద్ధుడయ్యాడు. సామెతల గురించి ఇతను 50 పైగా పుస్తకాలు, ఎన్నో వ్యాసాలు, పత్రికలు ప్రచురించాడు. ఇతను "సామెత"ను ఇలా నిర్వచించాడు - "A proverb is a short, generally known sentence of the folk which contains wisdom, truth, morals, and traditional views in a metaphorical, fixed and memorizable form and which is handed down from generation to generation." — Mieder 1985:119; also in Mieder 1993:24
- పేరడీలకు, హాస్యానికి, ఛలోక్తులకు సామెతలను రూపాంతరీకరించడం కద్దు. ఉదాహరణకు జ్యోతి అనే ఒక తెలుగు బ్లాగరి వ్రాసిన "లేటెస్ట్ సామెతలు"[4]
- సిమ్రాన్ సినిమా తీస్తే, సావిత్రి సంగీతం కొట్టిందంటా
- ఫూలన్ దేవి పుణ్యానికి పోతే, వీరప్పన్ మనకెందుకని వారించాడంటా
- స్వామివారికే సైకిల్ లేదంటే, పూజారి మోటార్ సైకిల్ కావాలన్నాడంట
- బారు పెట్టినవాడు బీరు పోయకమానడు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ↑ సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ↑ తెలుగు సామెతల్లో స్త్రీ - కోకా విమల కుమారి -తెలుగుదనం
- ↑ జ్యోతి బ్లాగు
వనరులు
[మార్చు]- తెలుగు సామెతలు: కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్, వి. రామస్వామి శా స్త్రులు 1955
- తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986
- తెలుగు సామెతలు: సంకలనం - పి. రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
- తెలుగు సామెతలు: గీతికా శ్రీనివాస్, జే.పి.పబ్లికేషన్స్ 2002
- తెలుగు సామెతలు:సంకలనం- రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002
- లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కే. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- సంపూర్ణ తెలుగు సామెతలుః మైథిలీ వెంకటేశ్వరరావు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ 2011
- ఆంధ్రపత్రిక -1955- వ్యాసము -తెలుగు సామెతలు- రచన శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు.
బయటి లింకులు
[మార్చు]- తెలుగు సామెతలు
- ఇంటర్నెట్లో లభించే తెలుగు సామెతల పుస్తకాలు "వనరులు" విభాగంలో ఇవ్వబడ్డాయి.
- "తెలుపు" సైటులో http://www.telupu.com/sametalu.html
- "సామెతలు" సైటులో -http://www.saamethalu.com/
- "ఆంధ్ర లోకోక్తి చంద్రిక" గూగుల్ బుక్స్ సైటులో -http://books.google.com/ebooks?id=VnUIAAAAQAAJ
- వివిధ భాషలలో సామెతలు
- అల్బేనియా సామెతలు: http://en.wikiquote.org/wiki/Albanian_proverbs
- ఆఫ్ఘన్ సామెతలు: http://www.afghanistans.com/Proverbs.htm,
http://afghana.com/SocietyAndCulture/proberbs.htm
- ఆఫ్రికా సామెతలు: http://www.afriprov.org
- బెంగాలీ సామెతలు: http://banglapedia.search.com.bd/HT/P_0297.htm, http://en.wikiquote.org/wiki/Bengali_proverbs
- చైనీయ సామెతలు : Chinese proverbs Archived 2020-02-23 at the Wayback Machine http://en.wikiquote.org/wiki/Chinese_proverbs
- ప్రపంచం సాంస్కృతిక సామెతలు: http://www.world-of-proverbs.com/proverbs.html
- ఆంగ్ల సామెతలు: English sayings and proverbs
- ఇథియోపియా సామెతలు: https://web.archive.org/web/20071219172325/http://unicorn.ncat.edu/~michael/vses/eth4000/know/proverb2.html, https://web.archive.org/web/20090103061826/http://htmlgear.tripod.com/text/control.text?u=sellassie&i=11&a=render&style=list
- గ్రీక్ సామెతలు: http://en.wikiquote.org/wiki/Greek_proverbs
- గుయానీస్ సామెతలు: http://www.guyana.org/proverbs.html
- ఇరానియన్ సామెతలు: https://web.archive.org/web/20111105044910/http://www.worldofquotes.com/proverb/Persian/1/
http://www.farsinet.com/zarbomasal/index.html http://www.caroun.com/1-FreeDownload/Calligraphy/Proverb/01-JAbiri-Age1.html http://www.allmyquotes.com/proverb/persian/
- ఇటాలియన్ సామెతలు: http://www.italyrevisited.org (look under folk sayings)
- లెబనాన్ సామెతలు: https://web.archive.org/web/20090106014009/http://www.cedarseed.com/water/lebproverbsr.html
- లుగాండా సామెతలు: https://web.archive.org/web/20090112162859/http://omugandaagamba.com/
- మాసాయి సామెతలు: https://web.archive.org/web/20081211125210/http://www.laleyio.com/proverbs.html
- మాల్టా సామెతలు: http://www.aboutmalta.com/grazio/qwiel2.html
- రష్యన్ సామెతలు: https://web.archive.org/web/20081218102733/http://www.meirionnydd.f9.co.uk/russian/proverbs.html
- సమోవా సామెతలు: http://www.samoalive.com/samoan_proverbs.htm Archived 2008-12-27 at the Wayback Machine
- సెర్బియా సామెతలు: http://en.wikiquote.org/wiki/Serbian_proverbs
- టర్కిష్ సామెతలు: http://tr.wiktionary.org/wiki/Kategori:Atasözü_(Türkçe)
- ఉజ్బెక్ సామెతలు: https://web.archive.org/web/20081012065216/http://www.orexca.com/proverbs.shtml (translated to rhyme)
- ప్రేమ సామెతలు: http://www.world-of-proverbs.com/loveproverbs.html
- వికిసామెతలు: https://web.archive.org/web/20130403045928/http://www.wikiproverbs.com/