యదువంశము/అయిదవ ప్రకరణ

Wikibooks నుండి

ఐదవ ప్రకరణము[మార్చు]

బృందావన విహారము:-[మార్చు]

 బృహద్వనంబున నుత్పాతంబులు పెక్కులుప్పతిల్లుచుండుట వలన నందుఁడు సునందుఁడు మొదలగు యాదవ ప్రముఖు లందఱును దద్వనంబును విడనాడి బృందావనంబునకు గోగణంబులతో నరుగుటకు నిశ్చయించుకొని యప్పటికప్పుడే బృందావనంబున కరిగిరి. అచ్చోట బలరామకృష్ణులిద్దఱును దోడి గోపకులతోఁ గలసి యాడుకొనుచుఁ బసులవెంట నరిగి బంతిచల్దులారగించుచు, నొకరితోనొకరు బందెములువెట్టి పరుగెత్తుచు నిట్లనేకవిధముల శైశవ క్రీడలందుఁ గాలమును గడుపసాగిరి. కృష్ణుం డప్పుడప్పుడు గోగోపికా సంఘంబులు శరీరంబులు మఱచి యుండునట్లు యమునానదీ పులిన స్థలంబుల మురళీగాన మొనర్పసాగెను. యశోదాకుమారుని మృదుల మధుర మురళీ నిస్వనంబులకు గోపికలందఱును ముగ్ధలగుచు నింటిపనులఁగూడ మాని తదారవంబు శ్రవణపుటంబుల దూఱినంతనే కోకలు జారుచున్నను, వేణీబంధంబులు విడివడుచున్నను, స్తనభారంబున లేనడుము లల్లలనాడ నాయాస మినుమడించుచున్నను లెక్కసేయక మురళీమోహనకృష్ణునిఁ జేరంజనుచుండిరి. తదారవంబును వినినంతనే గోగణంబులును మేతలమాని యఱ్ఱులెత్తి చెవులు నిక్కించుకొని తన్మధుర నిస్వనరసనిర్ఝర ప్రబలవేణికలందుఁ గ్రుంకులిడఁ జొచ్చెను. బాలకృష్ణుం డీవిధంబున నిజ మురళీగానంబున విశ్వంబును మోహింపఁజేయుచు బృందావన విహారంబు నొనర్పసాగెను.

దానవుల క్రూరకృత్యములు.:-[మార్చు]

 కృష్ణుండీవిధంబున విశ్వమోహన మూర్తియై బృందావనంబున వెలుగుచుండ నచ్చోట మధురాపురంబునఁ గృష్ణుని వృత్తాంతంబు వినవచ్చినకొలంది కంసునకు మనస్తాపం బినుమడింపసాగెను. ఇంతవఱ కాతఁ డొనర్చిన కృష్ణవధోద్యోగ ప్రయత్నంబు లన్నియు నిష్ఫలంబు లగుటవలన నాతనికిఁ బట్టుదల మఱింత హెచ్చిపోయెను. అందువలన నాతని క్రూరచర్యలు తొల్లింటికన్న మిక్కుటములయ్యెను. ఎచ్చోటఁ జూచినను దైత్యభటుల యార్భాటములును, సాధుజనహింసాపరాయణత్వంబును, క్షణక్షణమునకు మించుచుండెను. పశుహింసయుఁ, దపోవననిర్మూలనంబును, యాగవిధ్వంసంబును, మునిజన నిష్ఠాపహారణంబును, శిశుమారణంబును, మొదలగు ఘోరకృత్యములు బ్రబలములయ్యెను. జగదపకారంబునకుఁ గంసుఁడు ముందంగ వైచుచుండెను. ఎల్లెడల దానవాపచార సంజనిత సాధుజన దీనారవంబులు మిక్కుటముగ వినవచ్చు చుండెను. ఆహా! సర్వజ్ఞుడైఁడైన శ్రీకృష్ణపరమాత్మ తనమీది వైరంబునఁజేసి సాధుజనంబులిట్లు కంసునివలనఁ బెక్కుబాధలకు లోనగుచుండఁ దద్వృత్తాంతంబంతయు నెఱింగియు సహించియుండుటేలకో గదా?

వత్సాసురవధ.:-[మార్చు]

 బృందావన ప్రాంతారణ్య భూములంగల పచ్చికబయళ్ళయందు శ్రీకృష్ణుండు గోపబాలక బలరామ సహితుండై గోవులను గాయుచుండ నొకనాఁడు కంసప్రేరితుండై వత్సాసరుండను దైత్యభటుఁడొక్కండు కామరూపంబున మందలోఁ బ్రవేశించి గోపకులను గోవులను బాధింపదొడంగెను. ఆవృత్తాంతంబును గృష్ణుఁ డెఱింగి యన్నయగు బలభద్రున కా సమాచారంబంతయుఁ దెలుయఁజెప్పి, వత్సంబు పగిది మందయందు సంచరించుచున్న యా దైత్యభటుని సమీపించి “ఆహా! ఈలేగ యెంత యందముగా నున్నది? ఈదూడను మీకుఁ గాకుండ నేనుహరించెద” నని గోపబాలకులతో నర్మగర్భంబుగాఁ బలుకుచు వత్సాసురునిఁ దోకమొదలు కంఠమువఱకుఁ దన యాజానుబాహు బంధంబున నిరికించుకొని యూపిరి యాడకుండునట్లు నొక్కుచుఁ దృటికాలములో విగతజీవునిఁగా నొనర్చి బంతిచందమున నవలీల గగనమార్గంబున కెగురవైచెను. ఆదైత్యుండును మొదలునరికిన తరువువలె ధరణిపై నొదిగి యసువలఁబాసెను.

బకాసురవధ:-[మార్చు]

 అతఁడట్లు మడిసినతోడనే యతని యనుజుండగు బకాసురుండను వాఁడు భయంకరాకారంబుతో గోగోపసంఘంబుపైఁ గవిసి మహాట్టహాస మొనర్పసాగెను. ఆ దైత్యుని ఘోరాకారమునకు భయంపడి, గోవులును, గోపకులును బరుగెత్తసాగిరి. అట్లు తన్ను గాంచి భయభ్రాంతులై పాఱిపోవుచున్న గోగోపబృందంబుల వదలి యాదైత్యుండు కృష్ణునిపై విజృంభించెను. అట్టియెడ జితవైరియగు నందనందనుఁడు వెఱంగందినవాని చందంబున నందందుఁ జిందులుద్రొక్క నారంభించెను. బకాసురుండును గృష్ణునిఁ దనకుఁ లోబడినవానిఁగాఁ దలంచి యొక్కపెట్టున నాతనిపైఁబడి గుటుక్కున మ్రింగివైచెను. కృష్ణుండు దైత్యునివలన మ్రింగుడుపపడుటఁ గాంచి గోపకులు “హా కృష్ణా! హా కృష్ణా!” యని హాహాకారంబులు సేయందొడంగిరి. గోవులు కనులవెంట నశ్రుధారల గురియింపఁజొచ్చెను. వికసిత కుసుమపరిశోభితములైన లతానివసహంబులు గళావిహీనములై కాన్పింపదొడంగెను. ఇట్లు విశ్వంబంతయుఁ దనకై విచారించుచుండఁ గృష్ణుండును బకునివలన మ్రింగుడుపడి కంఠభాగంబునందే నిలిచి తనయందు లీనమైయున్న ప్రళయకాలానలంబును రగుల్కొల్పి తన్మూలమునను దాను కుత్తుక నొక్కుచును గనుఱెప్పపాటుకాలముననే యాదైత్యుని సర్వప్రాణంబులు హరించి మడియింపజేసెను. ఆతండు మరణించిన వెంటనే తద్గర్భంబునుండి వెలికివచ్చి గోగోపసంఘంబులకు దర్శనమిచ్చెను. తిరిగి కృష్ణునిఁ గాంచినంతనే గోపకులందఱు నానందపారవశ్యమునఁ జిందులుద్రొక్కుచు గొంగడుల నెగురవైవసాగిరి. గోగణంబులును ‘అంబా’ యని యఱచుచుఁ దోకలెత్తి పరుగిడసాగెను. ఇవ్విధంబున దైత్యవధంబు నొనర్చి శ్రీకృష్ణుఁడందఱికిని సంతోషముఁగూర్చెను.

బ్రహ్మదేవుని పరాభవము:-[మార్చు]

 శ్రీకృష్ణ పరమాత్ముని లీలామానుషచర్యలు సకలభువనంబుల యందును బ్రతిధ్వనులీనుచుండ సత్యలోకనివాసియైన బ్రహ్మదేవుఁ డతని నొకయలంతి మానవునిఁ గాఁదలంచి యాతని సామర్ధ్యమెట్టిదో పరీక్షింపఁదలంచినవాఁడై యొకనాఁడు కృష్ణుఁడు గోపబాలకులతోఁ బసులఁగాయుచుండ గోవులను గోపబాలకులను హఠాత్తుగా మాయమొనర్చెను. కృష్ణుఁడొక్కరుండే వనమధ్యంబున నిలచియుండెను. బ్రహ్మయొనర్చిన పని కాతఁడెంతమాత్రమును విస్మయంబునొందక సర్వజ్ఞుడగుటవలనఁ గలరూపెఱింగినవాఁడై పరమేష్ఠి నవమానింపదలంచి గోవులును, గోపకులును దానయై యథాప్రకారము వర్తింపఁదొడంగెను. గోగోపకులు శ్రీకృష్ణస్వరూపులుగానఁ జూచువారలకొక విధమగు దన్మయత్వము గలుగనారంభించెను. తమపుత్రులు కృష్ణాంశసంభవులుగాన గోపికలకుఁ దొల్లింటికన్న సుతప్రేమ యెక్కువయ్యెను. బలభద్రుండును నీ యద్భుత సంఘటనంబున కచ్చెరువొందుచుఁ గలరూపు నెఱుంగఁజాలక ‘ఇదియేమి’ యని తమ్ముని నడిగెను. కృష్ణుండును బలభద్రునకు సర్వమును దెలియపఱచెను. అత్తెఱంగున నొక వత్సరంబు ముగిసినవెంటనే బ్రహ్మ కృష్ణుని పరిస్థితి యెట్లున్నదో యని వచ్చి చూచునప్పటికి గో గోపకులతో యశోదానందనుఁ డెప్పటియెట్ల విహరించుచుండెను. ఆ దృశ్యమును గాంచినంతనే బ్రహ్మయు‘సృష్టికర్తను నేనైయుండ నీ గో గోపకులను సృష్టించినవారెవరా?’ యని పెద్దయుఁబ్రొద్దు దనలోఁదాను వితర్కించుకొనుచుఁ గొంతవడికి శ్రీ కృష్ణ మహిమంబువలన వైష్ణవమాయనుండి విడివడినవాఁడై సర్వమును దెలిసికొనెను. అప్పుడు కమలాసనుండు దానొనర్చిన పనికి లజ్జించుచుఁ బ్రత్యక్షస్వరూపంబునఁ గృష్ణపరమాత్మను జేరంజని ముకుళిత కరకమలుండై “దేవా! నీమాయయందుఁ దగుల్కొని యజ్ఞానుండనై, నీ కపచారమును గావించితిని. మహాత్మా! నన్ను క్షమింపుము. నీవాదినారాయణుండవు. నీ తత్వంబు నెవ్వరును గ్రహింపఁ జాలరు. నీవలనే సృష్టిస్థితి లయములు జరుగుచున్నవి. నీ యందే సకలచరాచరాత్మకమైన యీవిశ్వంబంతయు లీనమైయున్నది. గుణకర్మంబు లనేకంబులు గలిగియున్నవాఁడగుటవలనఁ బెక్కు నామంబులతోడను, బెక్కు రూపంబులతోడను వర్తించుచుందువు. పరాత్పరా! నన్ను క్షమింపుము” అని యాతనిఁ బ్రార్థింప వసుదేవనందనుఁడు గరుణామయుండు గావున వేల్పుపెద్దను క్షమించెను. విరించియుఁ దిరిగి గోగోపకులను గృష్ణున కర్పించి నిజనివాసంబున కరిగెను. బ్రహ్మ గోగోపకుల నర్పించినంతనే శ్రీకృష్ణపరమాత్మ తన విశ్వరూపంబు నుపహరించి యొకవత్సరము తన్నెడఁబాసియున్న గోపకులందఱిని వేర్వేఱనాదరించి యాదవవంశభూషణుం డగుచుఁ బ్రకాశింపఁజొచ్చెను.

బలరాముఁడు ఖరాసురుని వధించుట.:-[మార్చు]

  బలరాముఁ డెల్లప్పుడు దమ్ముఁడైన శ్రీకృష్ణు నెడఁబాయక మంద యందు సంచరించుచు గోపబాలురతోఁగూడి యాడుచుండెడివాడు. ఒకనాఁడేమి కతంబుననో శ్రీకృష్ణుండు గోవులవెంట రాక యింటనే నిలిచియుండెను. బలభద్రుండు మాత్రము గోపబాలురతోఁ గలసి పసులవెంట నరిగెను. అచ్చోట గోపకులందఱును బలరామ సహితులై బంతిచల్లుల నారగించి తలకొకదిక్కున మెలంగుచు నప్పుడప్పుడు గుంపుగట్టి యాడుకొనుచుఁ బ్రొద్దుపుచ్చుచుండఁ గంసునిపంపున నొకదైత్య భటుండు ఖరాకారంబున జనుదెంచి మందయందు శ్రీకృష్ణుండు లేడుగదాయని ధైర్యంబు నవలంబించి గోవులను గోపకులను హింసింపసాగెను. అట్టియెడ గోపకులు భయంపడి “ఓకృష్ణా! ఓరామా! రక్షింపుడు. రక్షింపుడు.” అని పెద్దపెట్టున గోలలెత్తుచు బలభద్రుండున్న తావునకు వచ్చిచేరిరి. ఖరాసురుండు వారిని వెన్నంటి వచ్చి గోపబాలక రక్షణార్థమై తన్ను మార్కొననిలచియున్న బలరాముని నొక్కపెట్టున ఱొమ్మునఁ దన్నియార్చుచు విజృంభించెను. కృష్ణాగ్రజుండును వ్రేటువడినవెంటనే రౌద్రాకారంబున విజృంభించి గార్దభాసురు పదంబులు నాలుగు నొక్కకేల నంటంబట్టి బెట్టుదట్టించి యట్టిట్టు గదల్చుచు నొక్క పెట్టునఁ గందుకంబు చందంబున నభోభాగంబున కెగురవైచి యాదైత్యుని విగతజీవునిఁగా నొనర్చెను.

ప్రలంబునివధించుట.[మార్చు]

 అట్లు ఖరాసురుని నవలీలగా మడియించి బలరాముఁడు తిరిగి యథాప్రకారము గోపబాలకులతో నాడుకొనఁజొచ్చెను. అట్టి సమయంబున ఖరాసురుని యనుచరుండైన ప్రలంబుడను రక్కసుండు పగసాధింపఁదలంచి గోపబాలక వేషముతోఁ జనుదెంచి యచ్చోట నాడుకొనుచున్న బలరామాదులతోఁగలసి తానుగూడ నాటలాడఁజొచ్చెను. గోపకులందఱును రెండుగములవారై, యోడిపోయినవారు, గెలిచినవారిని మోయునట్లు బందెమువెట్టికొని యాడుకొనుచుండిరి. ప్రలంబుఁడు పగసాధింపఁ దలచియున్నవాఁడుగావున బలరామున కెదురగువారివైపునఁ జేరెను. కర్మవశంబున బలరాముని వైపువారే యాటయందు గెలిచిరి. అప్పుడనుకొనిన ప్రకార మోడిపోయినవారు గెలిచినవారిని నొక్కొక్కరిని తమమూపులపై నెక్కించుకొని మోయఁజొచ్చిరి. అట్టియెడ నదియే సమయమని ప్రలంబుఁ డోడిపోయినవారి యందున్నవాఁ డగుటవలన బలరామునిఁ దన మూపున నెక్కించుకొని యున్నటులుండి గగనమార్గంబునకెగసెను. అదిగని గోపకులందఱును రామునికై దుఃఖింపఁ దొడంగిరి.మోసంబునఁ దన్నట్లు మోసికొని గగనమార్గంబున నరుగుచున్న ప్రలంబుని కపటంబు నెఱింగి, బలబద్రుం డుక్కుమిగిలి తనముష్టిహతిని దైత్యునిశిరంబు పగులఁజేసి విగతజీవునిఁగా నొనర్చి యచిరకాలముననే గోపకులఁజేరి వారికి సంతోషమును గూర్చెను. గోపకులును బలరాముని గొప్పవానిఁగాఁదలంచిరి.