Jump to content

యదువంశము/నాలుగవ ప్రకరణ

Wikibooks నుండి

నాలుగవ ప్రకరణము

[మార్చు]

నందయశోదల పూర్వజన్మ వృత్తాంతము:-

[మార్చు]

 శ్రీకృష్ణుండట్లు కారాగృహంబున జన్మంబు నొంది, తండ్రియగు వసుదేవునివలన నందగోకులమునకుఁ జేర్పఁబడి యశోదకుఁ జంటిబిడ్డఁడై దినదినాభివృద్ధిఁ గాంచుచుండెను. నందయశోదలకుఁ పెంపుడుబిడ్డ డగుటకుఁ గారణము లేకపోలేదు. నందుఁడు పూర్వజన్మంబున ద్రోణుఁడను వసువైయుండెను. అతని భార్యపేరు ధర. కొండొక కారణంబున బ్రహ్మదేవుఁడు వారలపైగినిసి మర్త్యయోనిఁబుట్టుండని శపించెను. అప్పుడు ద్రోణుండును, నాతనిభార్యయగు ధరయుఁ దమకు విష్ణుసేవారతిఁ జేకూర్పవే యని యావేల్పు పెద్దను బ్రార్ధింపగా నాతండును నట్లకాక యని వారలకు వరంబొసెంగెను. శాపోహతులైన యాదంపతులు మానవజన్మంబున నందయశోదలనఁ బుట్టియుండిరి. విష్ణుండును గమలాసనుని వరంబును సార్ధకముగా నొనర్ప నందయశోదలకు ముద్దుబిడ్డఁడై తన్ను సేవించు భాగ్యమును వారలకుసమకూర్చెను.

కంసుని క్రూరస్వభావము:-

[మార్చు]

 కృష్ణుం డీవిధమున గోకులమున యశోద ఱొమ్మునఁ బెంపొందుచుండ నచ్చోట మధురాపురంబునఁ గంసునకు నాడునాఁటికి గృష్ణునిపైఁ గల శత్రుత్వము పెంపొందుచుండెను. తొలుదొల్త నశరీరవాణి వాక్యము లాతని కర్ణరంధ్రంబులఁజొచ్చినప్పుడే కంసునిహృదయమున దుష్టస్వభావము తాండవింపఁజొచ్చెను. అదియట్లుండ మాయాదేవి వాక్యంబులను వినినప్పటినుండియు నాతనియెడఁ దాండవించు చున్న వైరభావము గజ్జెకట్టి నృత్యముసేయనారంభించెను. ఇట్లు కృష్ణునియందుఁ బ్రబల శత్రుత్వమును వహించి యాతనిని రూపుమాపుటెట్లాయని పలుతెఱుఁగుల నాలోచించుచుఁ గంసుఁ డొకనాఁడు తనమంత్రుల రావించి కృష్ణునిఁగూర్చి తనకుఁగల మనస్తాపంబునంతయు వారలకుఁ దెలియజేసెను. వారును గొంతవడి దీర్ఘాలోచనమొనర్చి, “దానవనాథా! శ్రీకృష్ణునకు గోబ్రాహ్మణ సాధుజన సంఘంబులును, నధ్వరమంటప తపోవన శ్రద్దశాలలును మొదలుగాఁగలవన్నియుఁ బ్రియంబులై యుండును. కావుననట్టివాని నన్నింటినిం జెరుప నిప్పుడే యనుజ్ఞ నొసంగుడు. దానివలనఁ గృష్నునిపై దమకుఁగల విరోధానలంబు కొంతవఱకుఁ జల్లారఁగల” దని వాక్రువ్వ న్గంసుండును వల్లెయని సాధుల బాధించుటకప్పుడే దైత్య వీరుల కాజ్ఞనొసంగెను. నాటఁగోలెఁ గంసుని దుష్కృత్యములు భూనభోంతరాళంబులందు నిండి ప్రతిబింబింపసాగెను.

పూతనవధ:-

[మార్చు]

 ఇట్లు కంసుఁడు నిజభటులను దుష్కృత్యంబు లొనర్ప బ్రేపించుటయేగాక, తనకుఁదానయే శ్రీకృష్ణ వధోపాయమును గూర్చి రేయింబవలు విచారింపఁదొడంగెను. శ్రీ కృష్ణుండు శిశువై యుండుటవలన లోకంబునఁగల శిశువులనందఱిని సంహరించినచోఁ గృష్ణుండును సంహరింపఁబడునుగదా యని తలంచి తత్కార్య నిర్వహణమునకై యారక్కసఱేఁడు పూతనయను నొక్క రాక్షసాంగనను నియోగించెను. ఆరక్కసియుఁ గంసుని పంపునఁ గామరూపంబుతో నెల్లెడల సంచరించుచుఁ జనుమొనల విషంబు నిడుకొని కనఁబడిన చిన్నిపాపల కందఱికిఁ బాలిచ్చు దానివలెఁ జన్నుగుడుపుచు శిశుసంహార మొనర్పసాగెను. ఇట్లా పూతన వాడవాడలఁ దిరుగుచుఁ దుదకు గోకులమునకు వచ్చిచేరెను. గోకులమును బ్రవేశించినది మొదలారక్కసి ప్రతి గృహముంబును బ్రవేశించి తానువచ్చిన కార్యమును ముగించుకొనుచుండెను. తుదకుఁ గర్మపరిపాకమగుటవలన దానవమృత్యుదేవతా గృహమనఁదగు యశోదాదేవిమందిరమును జొచ్చి, పూతన పాన్పుపైఁ బవళించియున్న బాలకృష్ణునిం గాంచి చన్నిచ్చుదానివలె నాతనిఁ గైకొనెను. గోపికలందఱును, గామరూపిణియగు పూతన సౌందర్యాతిశయంబున కచ్చెరువొందుచుఁ గలరూపెఱుంగఁజాలక మిన్నకుండిరి. పూతన, తనకుఁ జన్నిచ్చుటకుఁ బ్రారంభించినంతనే సర్వవిదుండైన శ్రీ కృష్ణపరమాత్మ యాదానవాంగన దుష్కార్యాచరణమును గుర్తెఱింగి, పాలు ద్రావుచున్నట్లు నటించుచు, గ్రుక్కగ్రుక్కకు నారక్కసిమేనిలోని సత్వమెల్లను ద్రావఁజొచ్చెను. ఆబాలుని యమానుషచర్య కాశ్చర్యపడి, క్షణక్షణమునకుఁ బ్రాణంబులు సన్నగిల్లుచుండ నిలువఁజాలక “కృష్ణా! ఇంకఁజాలును. చన్ను విడువుము. విడువుము” అని యాతనిని మరలింపఁజొచ్చెను. కాని చనుఁబాలు చవిఁగొన్నవానివలెఁ గృష్ణుండు చన్నువిడువక పైకొని పాలుద్రావనారంభించెను. కనుమూసి కనుదెఱుచునంతలోఁ కృష్ణుం డారక్కసకాంత సర్వప్రాణములను హరించెను. అప్పుడు కామరూపంబును దొఱంగినదియై, జీవంబులనెడఁబాసి పెనుగొండ వలె సహజస్వరూపంబున లోకభయంకరంబుగఁ పూతన భూమిపై వ్రాలెను. ఆ భయంకరాకారమును గాంచి గోప గోపికాజనంబు లందఱును మిక్కిలి భయపడిరి. కాని కృష్ణుండు మాత్రమారక్కసితో ఆడుకొనజొచ్చెను. అచ్చోట నున్నవారందఱును గృష్ణుని యామానుషచర్య కాశ్చర్యపడుచు నాతండు నిక్కముగా శ్రీహరియే యని తలంచిరి. యశోదయుఁ జంటిబిడ్డయైన కృష్ణుండు భయపడెనేమో యని విభూతి మొదలగు రక్షాకరణంబు లొనర్పసాగెను. నందుఁడు మొదలగు యాదవ ప్రముఖు లందఱును గోకులమున నుత్పాతములు పుట్టుచున్నవని భయపడఁ జొచ్చిరి. ఈ విధముగాఁ పూతనప్రాణంబుల హరించి కృష్ణుండు కంసుని ప్రయత్నము నిష్ఫలముగఁజేసెను.

తృణావర్తుని వధ.:-

[మార్చు]

 లీలామానుష విగ్రహుండైన కృష్ణుండిట్లు నిజమాయాబలంబువలనఁ గంసుని ప్రయత్నంబులను గొనసాగనీయక నిష్ఫల మొనర్చుచు గోపికలతోడను గోపబాలకుల తోడను గ్రీడింపఁజొచ్చెను. ఒకనాఁడు యశోదాదేవి బాలకృష్ణునకు సిగముడిచి గృహాంగణంబున నాడుకొనుటకు వదలిపెట్టియుండఁగా దృణావర్తుఁడను రాక్షసుఁడు కంసుని పంపున సుడిగాలిరూపమునుదాల్చి యాడుకొనుచున్న కృష్ణునెత్తుకొనిపోయెను. అచ్చోటనున్న గోపబాలకులందఱును ‘కృష్ణుండు పోయెపోయె’ నని హాహాకారంబు లొనర్పసాగిరి. ఆ బాలకుల రోదనధ్వనుల నాలకించి యశోదాదేవి మొదలుగాఁగల వారందఱును బరుగెత్తుకొని వచ్చి, కృష్ణునకుఁ గలిగిన యాపదను దెలిసికొని పెద్దపెట్టున వాపోవందొడంగిరి. ఇవ్విధంబున గోకులంబంతయు బాలకృష్ణునిఁగూర్చి మిక్కిలిగ దుఃఖింపసాగెను. ఇట్లు తన్నుగూర్చి యందఱును విచారించుచుండఁగృష్ణుండు దానవునిచే నెత్తుకొనిపోఁబడిన వానివలె నభోభాగంబునకు వానితోఁగూడనరిగి యచ్చోట నాతనికంఠమును బిగియఁబట్టుకొని క్రిందికి వ్రేలాడఁజొచ్చెను. ఆ దానవుండా బాలకృష్ణుని బరువును భరింపఁజాలక, క్షణక్షణమునకుఁ గ్రిందికి దిగనారంభించెను. కాని కుత్తుకబాధ మిక్కుటముగానుండుటవలన మధ్యేభాగంబుననే యా దైత్యుఁడు ప్రాణంబులఁగోల్పోయి యొకపర్వతంబు వడువునఁ బుడమిపయిఁబడెను. అతనితోఁ గృష్ణుండును పుడమికి డిగ్గి తోడిబాలకులఁ గలసికొనెను. గృష్ణుఁడు తిరిగి కానుపించినంతనే యాగోపబాలకులంద ఱానందముతోఁ జిందులుద్రొక్కుచు బాలకృష్ణునెత్తుకొని యశోదాదేవి కడకరిగిరి. పుత్రునికై మిక్కిలిగ వాపోవుచున్న యశోద తన పాపనిఁగాంచి యపరిమితానందమును బొందెను. గోపికలందఱును గృష్ణుని దిరిగి చూడగలిగినందులకుఁ దమజన్మంబులు సార్థకంబులయ్యెనని తలంచిరి. ఎల్లరును జిన్నికృష్ణుఁ బరమాత్మగా భావింపఁదొడంగిరి.

గర్గ మహాముని:-

[మార్చు]

 గోకులంబున గృష్ణుండిట్లు క్రమక్రమాభి వృద్ధినందుచుండ, నందుఁడు రోహిణీదేవి కుమారుఁడైన బలరామునిఁ గైకొనివచ్చి కృష్ణునితో నుంచెను. నాటఁగోలె బలరామకృష్ణులిద్దఱును గోకులంబున మెలంగఁజొచ్చిరి. దినంబు లివ్విధంబునఁ గడిచిపోవుచుండ నొకనాఁడు యాదవపురోహితుండైన గర్గమహాముని నందుని మందకుఁ జనుదెంచెను. ఆ మహాత్ముని గాంచి నందుఁ డాతని నర్ఘ్యపాద్యాది విధుల బూజించి కుమారులైన శ్రీకృష్ణ బలరాములనుఁ జూపి వారలకు నామకరణంబు లొనర్పుఁడని యాతనితోఁ బల్కెను. గర్గుడును బలరామునిఁగాంచి, యాతండు జనులను రమింపఁజేయువాఁడుగావున రాముఁడనియు, యదుసంకర్షణంబున సంకర్షణుండనియు, ఘనబలమున బలుఁడనియు, హలమునే యాయుధముగాఁ గలవాఁడు గావున, హాలాయుధుండనియు, నాతనికి నామకరణమొనర్చెను. అనంతరము శ్రీకృష్ణు నుద్దేశించి, నల్లని శరీరముఁగలవాడు , గావున గృష్ణుండనియు, వసుదేవునకు జన్మించినవాఁడగుటవలన వాసుదేవుఁడనియు, గుణరూప కర్మంబులనేకంబులుఁ గలిగియున్నవాఁడగుటవలనఁ బెక్కునామంబులు గలవాఁడనియు నాతనికి నామకరణంబొనర్చి, యాశిశువువలన నందగోకుల ముద్ధరింపబడుననియు, దుఃఖంబులు దొలంగి సుఖంబులు సేకూరుననియు, మఱియు వారివలన దుర్జనశిక్షణంబును, సజ్జనరక్షణంబును జరుగుననియుఁ దెలియఁజెప్పి బాలకృష్ణుని విశ్వమయునిఁగాఁ దలంచుచు నాతండు తన యాశ్రమంబున కరిగెను.

మృద్భక్షణ విశ్వరూపప్రదర్శనము:-

[మార్చు]

 బలరామకృష్ణు లిద్దఱును శరీరంబులు రెండుగను, మనంబు లొక్కటిగను మెలంగుచు గోపకులతో శైశవ క్రీడలు నెఱుపుచుండిరి. ఒకనాఁడు గోపకులును, బలరాముడును గలసి, శ్రీకృష్ణుండు మన్నుఁదినెనని యశోదాదేవితోఁ జెప్పిరి. ఆమెయు వారిమాటలను నమ్మి వెన్నుండు మన్నుఁదినెననియే భావించి యాతనిఁ బట్టుకొని “అన్నా! ఇదినీకుఁదగునా! ఇంటియందు నీ కెన్నియో రుచ్యములైన పదార్ధములుండ మన్నెందుకుఁ దింటివి? నానియమములను నీవేలమన్నింపవు? చూడుము. నీ యన్నయు నీ సఖులును నీ మీదఁ కొండెములు సెప్పుచుండిరికదా?” అని మందలించెను. భయరహితుఁడగు శ్రీకృష్ణపరమాత్ముఁడు తల్లి మందలింపునకు భయపడినవానివలెఁ గంటఁదడివెట్టి వెక్కివెక్కి యేడ్చుచుఁ దల్లియైన యశోదతో—

 "అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?

 నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ

 రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం

 ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

  అని జాలిఁగొలుపునట్లు పలికి తననోరును దెఱచి ‘చూడు’ మని తల్లిని సంబోధించెను. ఆమెయుఁ దన ముద్దుపట్టి ముద్దుపల్కులకు మహానందమును బొంది కుమారుని సత్యప్రవర్తన మెంతవఱకుఁ గలదో చూతమని యాతని నోరును దిలకించెను. చూచుటయేఁ దడవుగ యశోద విభ్రమాశ్చర్య చకితయై పోయెను. ఆ చిన్ని కృష్ణుని నోర నామెకు జలధిపర్వతవన భూగోళశిఖతరణిశశిదిక్పాలకాది కరండమైన బ్రహ్మాండంబంతయుఁ గానుపించెను. అట్టి బ్రహ్మాండమును బసిపాపని నోరఁగనుగొని యశోద—

 కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!

 తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర

 స్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర

 జ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్

  అని తనలోఁదాను వితర్కించు కొనసాగినంతనే యామెకుఁ గృష్ణునియెడఁగల పుత్రానురాగంబుఁదొలంగి భక్త్యావేశ మినుమడించెను. అట్లు భక్తిపరవశయై బాలకృష్ణునిఁ బెక్కువిధములఁ బ్రార్థింపఁదొడంగెను. కాని కృష్ణుండది యెంతమాత్రమును దగదని యామెను వైష్ణవమాయయందుఁ దగుల్కొనఁజేసెను. తోడనే యశోదకు భక్త్యావేశము నశించి పుత్రప్రేమ మినుమడించుచు నామె కృష్ణునిఁ జేరదీసి నిజాంకతలంబున నిడుకొని “నాతండ్రీ! నిన్నెప్పుడు మందలింపను లెమ్ము”. అని యోదార్పసాగెను. కృష్ణుండును, నేడుపుమాని, తల్లికుచవేదికయందు నౌదలమోపి కూరుకుసెందెను.

కృష్ణుని దుండగములు.:-

[మార్చు]

 కృష్ణుఁడిత్తెఱంగున, నప్పుడు గోపగోపికా జనంబులకుఁ దన సహజ తత్వంబును దెలియఁబఱచుచు నొకప్పుడు భక్తిపరవశులుగను, మఱొక్కప్పుడు తనయం దనురాగముగలవారిగను వారినందఱ నొనర్చుచుండెను. ఆతండును గోపబాలకులతో నాడుకొనుచు, నప్పుడప్పుడు చోరునివలె నితరగృహంబులందుఁ బ్రవేశించి యందున్న గొల్లపడుచులను, గనుసైగలు సేయుచును, వెనుకప్రక్కగాఁ జేరంజని చెక్కిళ్ళు నొక్కుచును, వచ్చెదవాయని రహస్యముగా భాషించుచును, నొంటరిగనున్నఁ బైఁబడి యధర చుంబనాదుల నొనర్చుచు నిట్లనేకవిధంబుల మగపోడుములు సేయుచుండుటయేగాక, వీలగునప్పుడు పాలుపెరుగులఁ గ్రోలుచు, వెన్న నారగించుచుఁ బట్టుకొనవచ్చిన గోపికలను వెఱపించి పాఱిపోవుచు నొక్కొక్కతఱి వారిలోవారికిఁ గలహంబులుపెట్టుచు, నిరంకుశాధికారంబున దుండగంబులు సేయంజొచ్చెను. గోపికలందఱును బాలకృష్ణుని దుండగంబులు నానాటికభివృద్ధి నందుచుండఁ జూచి సహింపఁజాలక యొకనాఁడు యశోదాదేవి కడకరిగి, యామెముద్దుపట్టి తమయిండ్లయందొనర్చిన దుండగంబుల నన్నింటిఁగూర్చి సవిస్తరంగాఁ జెప్పిరి. చన్నుగుడుచుచున్న కృష్ణుఁడు తల్లి తన్నెక్కడ మందలించునోయని భయపడినవానివలె యశోదయొడియందు ముసుగు పడియుండెను. యశోదయు గోపికలు సెప్పిన వృత్తాంతంబునంతయును విని, వారలగాంచి “అమ్మలారా! మాచిన్నికృష్ణు నెందుకట్లు దూఱెదరు? ఎన్నండును బొరుగిండ్లను ద్రొక్క యెఱుఁగఁడే? చక్కగాఁ గన్నులుగూడఁ దెరువని నాయీ చిన్నికుమారుని ఱవ్వసేయుట మీకుఁదగునా?

 అన్య మెఱుఁగఁడు; తన యంత నాడుచుండు;

 మంచివాఁ డీత; డెగ్గులు మానరమ్మ!

 రామలార! త్రిలోకాభిరామలార!

 తల్లులార! గుణవతీమతల్లులార!”

  అని యనేక విధంబుల వారల నొడఁబఱచి గృహంబుల కనిపి కుమారుని మందలింప జాలకపోయెను. కృష్ణుండును, దన కేమియుఁదెలియనివానివలె నటింపసాగెను.

యమళార్జున భంజనము.:-

[మార్చు]

 గోపికలు శ్రీ కృష్ణుని దుండగంబులఁ గూర్చి పలుమారు వచించుచున్నను యశోద కొడుకు నెంతమాత్రమును మందలింపకుండెను. ఇట్లు దినంబులు సనుచుండ నొకనాఁడు యశోద నిజమందిరంబున దధిమధనంబున మెలంగుచుండెను. అట్టియెడఁ గృష్ణుండు తల్లిఁజేరంజని పాలీయమని పోరుపెట్టదొడంగెను. ఆమెయుఁ గుమారునకుఁ జన్నిచ్చుచు నంతలోఁ బొయ్యిమీదనున్నపాలుఁ బొంగిపోవుచుండఁ గుండను దింపుటకై కుమారుని వదలిపెట్టిపోయెను. కృష్ణుండును గడుపునిండఁబాలీయలేదని కోపించి, యెదుటనున్న పెరుగుకుండను బాదములతోఁ దన్ని పగులఁగొట్టెను. పెరుగంతయు నేలపాలయ్యెను. అంతలో యశోద తిరిగివచ్చి కృష్ణుండొనర్చిన పనికి మివులఁ గోపించి “దుందుడుకా! నీ యాగడ మింకసాగదులే’ యని తనకు భయపడి పరిగెత్తిపోవుచున్న కుమారుని మందలించుటకై వెన్నంటెను. కృష్ణుండును దన లీలా వినోదంబుల వలనఁ దల్లిని విభ్రాంతాత్మురాలినిఁగా జేయుటకో యన నామెకుఁ జేతిదూరముననే యున్నట్లుండి పట్టుకొన వచ్చునంతలో మాయమగుచు, నెందుజూచినఁ గాన్పించుచు, నందందు ముసుఁగువడుచు నిట్లనేకవిధములఁ దల్లిని బాధింపఁజొచ్చెను. యశోదయుఁ గుమారుని యద్భుతచర్యలకు విస్మయంబునొందుచుఁ బట్టినపట్టును మాత్రము విడువక యాతని వెంబడించుచునే యుండెను. కృష్ణుండును దల్లిని శ్రమపెట్టుట భావ్యముగాదని తలఁచినవానివలె ననాయాసముగా యశోదకుఁ జిక్కిపోయెను. ఆమెయుఁ గుమారునిఁ బట్టుకొని “ఓహో! వీరు శ్రీ కృష్ణులేనా?” యని యెత్తిపొడుచుచు నాతనిని ఱోలఁగట్ట యత్నించెను. కాని యామెతీసుకొనివచ్చిన త్రాడుఁ ఱోటికిని, గృష్ణుని బొజ్జకును గొంచెము తక్కువగా నుండెను. యశోద యింకొక త్రాటిని దానికంటఁ గట్టి కట్టుటకు యత్నింపగాఁ దిరిగి పూర్వమెంత తక్కువగా నుండెనో యంతే తక్కువగానుండెను. ఈవిధముగా గృహములోనున్న రజ్జు పరంపరలఁ గొనివచ్చి కట్టుటకు యత్నించినను దిరిగి పూర్వపు స్థితియే సంభవించుచుండెను. కృష్ణుఁడేమియు నెఱుంగని వానివలెఁ దల్లినిఁజూసి నవ్వసాగెను. అట్టియెడ యశోద మిక్కిలి శ్రమ నొందినదై, కుమారునిఁగాంచి “కృష్ణా! ఏమి నాచేత బంధింపబడవా?” యని విచారసూచకముగను భక్తిపరవశత్వమును బొందినదానివలెను బలుక, భక్తపరతంత్రుడగు శ్రీకృష్ణపరమాత్మ— సిరిఁకౌగిఁట బంధింపఁబడని శ్రీకృష్ణపరమాత్మ - సనకాది యోగిచిత్తాబ్జము లందుఁ బట్టువడని శ్రీకృష్ణపరమాత్మ - తల్లివాక్యమును వినినంతనే, లోఁబడి యామెవలన ఱోలఁగట్టఁబడియెను. కుమారునట్లంటఁగట్టి యాయవ్వ యింటిలోని కరిగెను. ఆమె తన్ను బాసి చనిన వెంటనే, నారదశాపంబున యమళార్జునంబు లను సాలవృక్షంబుల రూపముననున్న నలకూబర మణిగ్రీవులను నిర్వురు గుహ్యకులకు శాపవిమోచనం బొనర్పదలంచి, ఱోలడ్డమగునట్లా సాలవృక్షంబుల మధ్యభాగమున కరిగెను. అవియు ఱోటి తాకుడునకు నిర్మూలంబులై పుడమిపయింబడ నందుండి యా గుహ్యకులిద్దఱును, శాపవిముక్తివలన బయలువెడలి యనేకవిధంబులఁ గృష్ణపరమాత్మను బ్రార్థించుచుఁ దమనివాసములకుఁ జనిరి.

గోపగోపికారాధనము.

[మార్చు]

 ఇట్లు కృష్ణుండును సాలవృక్షంబులఁగూల్ప దన్నిర్మూలనధ్వనులకు గోపగోపికాజనంబులందఱును వెఱంగంది పిడుగులు పడెనని తలంచుచు వచ్చిచూడఁ గృష్ణుఁడా వృక్షంబులమధ్యభాగంబునఁ గపట బాల లీలల వినోదించుచుండెను. అప్పుడందఱును, “ఏమిది? పెద్దగాలి వచ్చినదనుకొందమా యది యెంతమాత్రమును సరిగాదు. పిడుగుపడిన దనుకొందమా తగినసూచకము లెవ్వియును గాన్పింపవు. అకారణంబుగ నీవృక్షంబు లెట్లుగూలినవి? ఈతఁడు పడఁద్రోసినాఁ డనుకొందమా కేవలము పసిబాలుఁడు. ఏమీవింత యని తమలోఁదాము తర్కించుకొనుచుండ నంతకుమున్నచ్చటనున్నవారు కృష్ణుని వలననే యాపని జరిగెనని తెలియఁజేసిరి. అప్పుడు నందాదులైన గోపకులును, యశోద మొదలైనగోపికలును గృష్ణుని లీలామానుషవిగ్రహుండైన పరమాత్మునిఁగాదలంచి, రెట్టించిన భక్తి తాత్పర్యంబుతో నాతనిఁ బూజింపఁదొడంగిరి.