యదువంశము/ఆరవ ప్రకరణ

Wikibooks నుండి
Jump to navigation Jump to search

ఆరవ ప్రకరణము[మార్చు]

గోపికావస్త్రాప్రహరణము:-[మార్చు]

 శ్రీకృష్ణ బలరాము లిత్తెఱంగునఁ జేచిక్కిన దైత్యుల, బట్టి చక్కాడుచు గోగోప గోపికాసంఘంబుల రక్షించుచు బృందావనంబున విహరింపఁదొడంగిరి. గోపికలందఱును శ్రీకృష్ణునియం దెక్కువ మక్కువఁగలిగి యెల్లప్పు డాతని దివ్యసందర్శనంబునే యాకాంక్షించుచు ననవరత మాతని మురళీ మధుర నిశ్వనంబునే కోరుచుఁ బొద్దులు పుచ్చుచుండిరి. కృష్ణుఁడును బెక్కు తెఱంగులఁ బల్లవకోమలసదృశాకారిణులగు వల్లవీజనంబుల యుల్లంబు లుల్లాసంబున రంజిల్లునట్లు వర్తింపఁదొడంగెను. ఒకనాఁడు గోపికలందఱును యమునాస్నానంబున కరిగి యొడ్డున వస్త్రంబులను హారాది పరిష్కారంబులను బదిలంబుగా నొనర్చి, కంఠదఘ్నంబులగు సలిలంబుల జలకంబులాడఁ దొడంగిరి. అట్టియెడఁ దుంటరియగు బాలకృష్ణుండు యమునానదిఁ జేరంజని గట్టున నున్న గోపికల వస్త్రంబులను మెల్లన దొంగిలించి తత్తటినీతట నికటంబున నున్న వృక్షంబు నధిరోహించి లీలామాత్రుండై వినోదింపసాగెను. గోపికలును గొంతవడికిఁ గృష్ణునిరాకను గుర్తించి తుంటరి వాఁడగుటవలన ననుమానపడి గట్టునకుఁ జూడ వస్త్రంబులు లేకుండెను. ఏమాయని కృష్ణునిదెసఁ బరికింప నాతం డధిరోహించియున్న తరుశాఖలయందుఁ దమవస్త్రంబు లుంట గాంచి, మోసమయ్యెనని తలంచుచు మానభంగంబునకు వెఱచినవారలై, నదీగర్భంబునందే నిలచి లీలా వినోదియైన శ్రీకృష్ణ పరమాత్మను గూర్చి “కృష్ణా! ఇదియేమిన్యాయము? కేవలము పరమాత్మస్వరూపుండవును, సర్వజ్ఞుండవునగు, నీవే స్త్రీజన మానభంగమున బ్రయత్నింప నన్యులఁగూర్చి వేఱ చెప్పవలయునా? మావలువల మాకొసంగుము. మామగవారు జూచిన నిన్ను మందలింతురు. మా చీరెలఁ గొనితెచ్చియిచ్చి పొమ్ము. ఇదియేనా నీ యట్టివాఁడొనర్చవలసిన ఘనకార్యము? కృష్ణా!

 బహుజీవనముతోడ భాసిల్లియుండుటో

 గోత్రంబునిల్పుటో కూర్మితోడ

 మహినుద్ధరించుటో మనుజసింహబవై

 ప్రజలఁగాచుటో కాక బలిఁదెరల్చి

 పిన్నడై యుండియుఁ బెంపువహించుటో

 రాజుల గెల్చుటో రణములందు

 గురువాజ్ఞ సేయుటో గుఱనిధివై బల

 ప్రఖ్యాతిఁజూపుటో భద్రలీల

 బుధులు మెచ్చ భువిఁబ్ర బుద్ధత మెఱయుటో

 కల్కితనము సేయ ఘనతఁగలదే?

 వావిలేదువారి వారునావారని

 యెఱుఁగవలదె? వలువలిమ్ము కృష్ణ !”

  అని మందలించినట్లుగను, ధర్మోపదేశం బొనరించినట్లుగను, బ్రతిమాలుకొనినట్లుగను, మొరపెట్టుకొన నాతండును వృక్షంబునందే నిలచి నగుచు ‘“గోపికలారా! మీరందఱిచ్చోటి కరుగుదెంచి మీమీవలువలఁ గొనిపొండు. నేను మాత్రము తీసికొనివచ్చి మీకొసంగ” నని ఖండితముగాఁ దెలియఁజెప్ప గోపికలును దమకు మానభంగంబెట్లును దప్పదని నిశ్చయించుకొని, పోవుదమని కొందఱును, వలదని కొందఱును, ముందువెనుకలాడుచుఁ దుదకందఱును నిజకరసంఛాదిత పంచాయుధగేహలగుచుఁ గృష్ణునిఁ జేరంజని వలువలిమ్మనికోర నాతండును “సుందరాంగులారా! ఒక్కమాఱు చేతులెత్తి మీరందఱు నన్నుఁ బ్రార్థింపుఁడు. వలువ లొసంగెద” నని పలుక గోపికలు “ఏమి? ఈ బాలుని తుంటరితనము? అంతకంతకు మితిమీరిపోవుచున్నదే?” యని లోనఁ గినుక వహించినవారలయ్యుఁ దప్పనిదియగుటవలన మానభంగమునకుఁ గూడ శంకింపక చేతులెత్తి వలువలిమ్మని యాతని బ్రార్థించిరి. కృష్ణుఁ డప్పుడు వృక్షంబునుండి డిగ్గి వలువలను వారికొసంగి, “గోపికలారా! మీకు మానభంగమయ్యెనని యెంతమాత్రమును జింతింపవలదు. నన్నుఁ గొల్చువారలకు సర్వంబును నా స్వరూపమై కానుపించును. అట్టియెడ వీరు పురుషులు, వీరు స్త్రీలు అను విచక్షణ యెంతమాత్రమును వారియందుండదు. అట్టి భేదభావము లేనివారలే నాకు నిజమైన భక్తులగుచున్నారు. మీ స్వభావంబును గుర్తెఱుంగుటకై మిమ్మిత్తెఱంగునఁ బరీక్షించితిని. నా వచన ప్రకారము వర్తించి మీరు నాకు నచ్చినవారలైతిరి. ఇదియే నా తత్త్వము” అని తెలియఁజెప్పి గోపికల మనస్తాపంబును మాన్పెను. వారును ధన్యులమైతిమని కృష్ణునితోఁ గలసి గోకులంబున కరిగిరి.

  టీక:- కంఠదఘ్నంబులగు = కంఠం లోతు కలిగిన; తటని = నది; తటము = ఒడ్డు; నికటము = సమీపము.

నందయశోదలు శ్రీకృష్ణుని మందలించుట.[మార్చు]

 వస్త్రాపహరణం బొనర్చివల్లవీ జనంబుల శ్రీ కృష్ణుండు పరిభవించెనను వార్త యెవ్విధంబుననో నందయశోదలకుఁ దెలియవచ్చెను. చూచుచుండఁగనే యావార్త గోపకులంబు నంతటను వ్యాపించెను. ఎల్లరును గృష్ణుని దుండగంబును గూర్చి పలుభంగుల ముచ్చటింపసాగిరి. తమకుమారుఁడొనర్చిన పనికి నందయశోదలు గినుకవహించినవారలై కృష్ణునిఁ జేరం బిలిచి “కుమారా! రోజురోజుకు నీ యాగడంబులు మితిమీరుచున్నవి. చూచి యుపేక్షాభావమును వహించుచుంటిమని తలంచుచుంటివా యేమి? కృష్ణా! గోపికా వస్త్రాపహరణం బొనర్చి మానభంగమును గావించుట నీ యట్టివానికిఁ దగునా? ఇంతటినుండి నీవిట్టి దుండగముల నెన్నండును జేయకుసుమా” యని యనేకవిధంబుల మందలించిరి. అప్పుడు కృష్ణుండు, కనులవెంట నీరునింపుచు “జననీజనకులారా! మీతోడను, మీ గోపగోపికా జనంబులతోడను నా కెంతమాత్రమును బనిలేదు. ఇందఱివలన మాటఁబడిన యీ బ్రతుకుఁగూడ నా కవసరములేదు. నే నిప్పుడోపోయి విషజలపూరితంబగు గాళిందీనదిలో దుమికెదను. ఇంతటినుండి మీరును, మీ కులమువారును, నావలన నెట్టిబాధలను బొందకుండ సుఖంబుండుఁడు” డని పల్కినవాఁడై యప్పుడే కాళిందీనదికిఁ బరుగులిడసాగెను. యశోదానందులును, “కృష్ణా! పోకుము. కాళిందీనదిలో దుముకవలదు. నీయిష్టమువచ్చినట్లు మమ్మందఱను బాధింపుము. నిన్నుఁబాసి యొక్క క్షణమైనను మేము నిలువఁజాలము.“ యని దుఃఖించుచు లీలావినోదియైన బాలకృష్ణుని వెంబడించిరి. బలభద్రుండు తమ్ముని తత్వంబు నెఱింగినవాడయ్యు, నేమియు యెఱుంగనివానివలెఁ దానును బంధుజనంబుల వెంబడించెను. ఇట్లు యాదవకులంబంతయుఁ దన్ను వెంబడించుచున్నను, నొక్కరికేనియుఁ జిక్కక, కాళిందిని సమీపించి, నిజచరణకమలయుగళసంస్పర్శంబున కెన్నినాళ్ళనుండియో యెదురుసూచుచుఁ దత్సమీపంబున విశాల విటపశాఖాసముదాయంబుతోనున్న కదంబ భూజంబు నధరోహించి తదగ్రంబున కెగఁబ్రాకి దూరంబుననుండి బంధుజనులు దన్నుఁగూర్చి యాక్రోశించుచుండ, నెల్లరకుఁ దెలియవచ్చునట్లు కుప్పించి యచ్చోటనుండి కాళిందిలో దుమికెను. వెంటనే యాహ్రదంబంతయు గుభగుభ ధ్వానంబులతో నల్లకల్లోలంబు గాఁజొచ్చెను. ఇచ్చోట యశోదానందులు మొదలగు వారందఱును గృష్ణుండు నదిలో దుముకుట కనులారగాంచి “హ కృష్ణా! హ కృష్ణా!” యని పెద్దపెట్టున నేడ్చుచుఁ గాళిందిని సమీపించి బాలకృష్ణునిఁ గానక ఘోరవిషానల దారుణాకారుఁడగు కాళీయునిచేత భక్షింపబడెనని తలపోసి తద్వియోగ సంజనిత సంతతానంతదుఃఖాతిరేకంబున స్మృతులుదప్పి పుడమిపై మూర్ఛిల్లిరి. బలరాముఁడుమాత్రము సర్వము నెఱింగినవాఁడు గావునఁ జూచి యూరకుండెను.

  టీక:- విటపము = చిగురు; శాఖ = కొమ్మ; హ్రదము = మడుగు; ధ్వానము = ధ్వని.

కాళీయుని పూర్వకథ[మార్చు]

 కాళిందీనదియందుఁ గాళీయుఁడను సర్పరాజొకండు గలఁడు. పూర్వమొకప్పుడు సర్పములన్నియు వినతాసుతునకు భయంపడి, తాముసంపాదించుకొనిన యాహారంబునందు సగపాలతని కిచ్చునట్లును, నాతండు తమ్ముఁ జంపకుండునట్లును, నొడంబడికఁ జేసుకొని, యప్పటినుండి యనుకొనినప్రకారము వర్తింపఁ జొచ్చిరి. కాని కాళీయుఁడు మాత్రము తానుసంపాదించిన యాహారంబులోని సగపాలును విహంగవల్లభువ కర్పింపక తానే యుప్యాయనంబుగఁ గుడువఁదొడంగెను. అందువలన వైనతేయుఁడు కినుక వహించి కాళీయునిఁబట్టి శిక్షించుటకు దండెత్తిరాఁగా నతండు పన్నగాంతకునకు భయంపడి యాతనినెదుర్కొనఁజాలక కాళిందీనది యందుఁజొచ్చి ప్రాణరక్షణమొనర్చుకొనెను. సుపర్ణుఁడు కాళిందీనదిఁ జొచ్చుటకు భయఁపడెను. కారణమేమన నాతఁడొకనాఁడు క్షుద్భాధ నపనయించుకొను నిమిత్తమై కాళిందీమడుగులోని చేపలనుబట్టి భక్షించుచుండఁగా మత్స్యంబులన్నియుఁ బ్రాణరక్షణంబునకై తత్సమీపారణ్యంబునఁ దపంబుసేసికొనుచున్న సౌభరియను మునిపుంగవుని శరణుజొచ్చెను. అతఁడును వానిపైఁ గరుణవహించి “నాఁడు మొదలు వైనతేయుఁడు నదియందుఁ బ్రవేశించినచో శిరంబు పగిలి మడియుఁగాత” యని యుగ్రశాప మిచ్చెను. ఈ వృత్తాంతమునుస గాళీయుఁ డెఱింగియున్నవాడగుటవలన నామడుగునందుదూఱి ప్రాణరక్షణ మొనర్చుకొనెను. అతం డామడుగున నివసింపఁ దొడంగె. నప్పటినుండియుఁ దనవిషంబువలన, జలంబును విషపూరితంబుగా నొనర్చి, యానీరును గ్రోలినవారలనేగాక తుదకానీటికి సూటిగ నభోభాగంబునఁ జరించు ద్విజసంతతులను గూడ మడియఁజేయుచు లోకభయంకరుండై మించి యుండెను. అందువలనఁ బ్రతివారును గాళిందిలోఁ బ్రవేశించుటకేగాక తుదకు సమీపించుటకుఁగూడ భయపడుచుండిరి. ప్రాణోపద్రవకరమగునట్టి యా మడుగునందే కృష్ణుఁడు దుమికెను. అందువలననే గోపకులంబంతయు నాతనిఁగూర్చి దుఃఖింపసాగెను. కృష్ణుఁ డట్లు తన నివాసంబగు కాళిందియందు దుమికినంతనే, కాళీయుఁడు రౌద్రాకారంబున విజృంభించి “ఏమిది? పరప్ర్రాణాపహరణ ప్రయుక్త విషానలజ్వాలా సమేతుండనగు నన్నుమఱచి యీబుడుతఁ డిందు దుముకుటకు సాహసించెఁగా? ఔరా! ఈ కాళీయుని ప్రభావమాతనికిఁ దెలియదు కాబోలు! ఒక్కమాఱు నా శక్తిని జూపెదఁగాక” యని పడగలను జక్కగా విప్పి ముఖంబులనుండి విషానల విస్ఫులింగంబులు ప్రజ్వరిల్లుచుండ శరీరంబునుబెంచి బాలకృష్ణుని నాపాదమస్తకంబుగాఁ జుట్టి యాతని గాత్రంబునందంతటను గంటులుపడునట్లు కఱవసాగెను. కృష్ణుండును లీలావినోదియై చేష్టలులేనివాని తెఱంగున భోగిభోగ పరివేష్టితుండై నదీతోయంబుల నుయ్యలలూగనారంభించెను. అట్టియెడ యశోదానందులు మొదలగు యాదవులందఱును మూర్ఛనుండి తేఱి కనులవిచ్చి నదివంక దిలకించునప్పటికిఁ గృష్ణుండు కాళీయునిచేతఁ జుట్టఁబడి చేష్టలు దక్కియుండెను. అట్టి యపాయస్థితియందున్న బాలకృష్ణునిఁగాంచి స్త్రీపురుష బాలవృద్ధ సమేతంబుగ యాదవులందఱును బెద్దపెట్టున విలపించుచు “హ కృష్ణా! కృష్ణా! ఇంక మాకు దిక్కెవ్వరు? మేమిందర ముండియు నిన్ను రక్షింపఁజాలమైతిమే? అయ్యో! కుమారా! నిన్నీయాపదనుండి కాపాడువారెవ్వరు? విషకుచదుగ్ధంబులఁ ద్రావియు నేహానియులేక బ్రతికియున్న నీకు నేఁడీ కాళీయుని విష మపాయంబును గూర్చుచుండెఁ గదా? కృష్ణా! నేటినుండి మాకు ముద్దుముచ్చటలు సెప్పువారెవ్వరు? కుమారా! అయ్యో! తండ్రీ!

 శ్రవణరంధ్రబులు సఫలతఁ బొందంగ

  నెలమి భాషించు వా రెవ్వరింకఁ

 గరచరణాదుల కలిమి ధన్యతఁనొంద

 నెగిరి పైఁబ్రాకు వా రెవ్వరింక

 నయన యుగ్మంబు లు న్నతిఁగృతార్థములుగా

 నవ్వులు సూవు వా రెవ్వ రింక

 జిహ్వలు గౌరవ శ్రీం జేరఁబాటల

  యెడఁ బలికించు వా రెవ్వరింకఁ

 దండ్రి! నీవు సర్ప దష్టుండవైయున్న

 నిచటమాకుఁ బ్రభువు లెవ్వరింక

 మరిగి పాయలేము మాకు నీ తోడిద

 లోక మీవులేని లోకమేల!”

  అని యందఱును గుంపుగట్టి నదియందుఁ జొచ్చుటకుఁ గడంగిరి. అట్టియెడ బలభద్రుం డడ్డంబువచ్చి కృష్ణున కెంతమాత్రం బపాయంబు సంభవింపనేరదని వారికి నచ్చజెఁప్పి వారి యుద్యమంబును మాన్పెను.

  టీక:- వైనతేయుడు = గరుత్మంతుడు; మించి = అతిశయించి; ద్విజ = పక్షులు; తతులు = సమూహములు; గాత్రము = శరీరము; దుగ్దములు = పాలు; ఉద్యమము = ప్రయత్నము.

కాళీయమర్ధనము.:-[మార్చు]

 కృష్ణుఁడును బంధుజనుల దుఃఖావస్థను గాంచి యుపేక్షించుట మంచిదికాదని యెంచి యుచితంబుగ మేనువెంచిమించి కాళీయుని పంచప్రాణంబుల వంచింప నుంకించి రెట్టించిన యట్టహాసంబున విజృంభించి, వడిగలిగిన పడగల మీద నడిదంబు వడువున నాభీలంబగు నిజకరంబు నెత్తి ప్రచండ ధ్వానంబనూనంబగునట్లు సఱచెను. ఆ వ్రేటునకు శిరంబులు పగిలి నెత్తురులు గ్రక్కుచు గాళీయుఁడు చేష్టలు దక్కిన వాఁడయ్యెను. అట్టియెడఁ గృష్ణుఁడాతని ఫణంబులపై కెక్కి కన్నులు వెఱికి, దౌడలువట్టి నాలుకల నూడఁదీసి, యుప్పొంగుచు గజ్జెలందియలు ఘల్లుఘల్లుమని మ్రోయ నహిమౌళియందు నృత్యంబు సేయఁజొచ్చెను. కాళీయుండును గృష్ణుని దుష్టజనదండ ధరావతారుండైన శ్రీహరిఁగాదలపోసి కంఠగత ప్రాణుఁడై శ్రీకృష్ణపరమాత్మను రక్షింపుమని ప్రార్థింపఁదొడంగెను.

  టీక:- వడి = బిగువు, శౌర్యము; అడిదము = కత్తి; వడువున = వలె; ఆభీలము = భీకరము; ధ్వానము = ద్వని: ఉంకించు = పూను, సిద్దమగు; అహి = పాము

కాళీయునిభార్యలు కృష్ణుని స్తుతించుట:-[మార్చు]

  ఆ సమయంబునఁ కాళీయుని భార్యలైన నాగాంగనలు తమ ప్రాణనాథునకుఁగలిగిన ప్రాణోపద్రవమునకు మిక్కిలిగఁ బరితపించుచుఁ శ్రీ హరిఁజేరంజని కరంబులు మోడ్చి “ కృష్ణా! మాకుఁ బతిభిక్షఁ బెట్టుము. మానాథుఁడు సర్వచరాచరభూతేశుండవైన నీతత్వంబు నెఱుంగఁజాలక యజ్ఞానంబున నీకపచారంబుఁగావించె, దేవా! నిన్ను జయించువారెవ్వరుగలరు? అగోచరుండవయ్యును గోచరుండగుచుంటివి; నిరాకారుఁడవయ్యు ననంతాకారుండ వగుచుంటివి; నిర్విశిష్టుండవయ్యును విశిష్టుండవగుచుంటివి; నిర్విశేషుండవయ్యును విశేషుండవగుచుంటివి; రూపరహితుండవయ్యును నానారూపసమన్వితుఁడ వగుచుంటివి; అనామకుఁడ వయ్యును బెక్కునామంబులు గలవాఁడ వగుచుంటివి; ఒక్కండవయ్యును సర్వంబునీవయగుచుంటివి; విశ్వంబునీవయయ్యును, నీవు విశ్వంబుగాకుంటివి; నిర్గుణుండవయ్యును గుణాచ్ఛాదకుండ వగుచుంటివి; ఆత్మారామత్వంబువలన మునివయ్యును హ్రస్వదీర్ఘస్థూల సూక్ష్మములకుఁగారణ భూతుడవగుచుంటివి. మహాత్మా! విశ్వభావాభావసందర్శనంబుసేయుచు విద్యావిద్యలకు గారణుఁడవైన నిన్నెవఱెఱుంగఁగలరు? సృష్టి స్థితిలయములకు నీమూర్తియే మూలకారణము. నీమహత్వమక్షోభ్యము బ్రహ్మాది దేవతలకే నీ తత్వంబనిర్వాచ్యంబు. శ్రీకృష్ణా! మాకాంతుని రక్షించి మాకు బతిభిక్షఁబెట్టు’ మని యనేకవిధంబులఁ బ్రార్థింపఁ గృష్ణుండును భక్తపాలకుండుగావున ఆ గాళీయుని ప్రాణంబులఁగాపాడి, తన్నుఁబ్రార్థించుచున్న సర్పరాజునుగాంచి “ఓయీ!నిన్ను రక్షించితిని. నీవిప్పుడే నీ దారాపుత్రులతో బయలుదేరి సముద్రమునకుఁబోయి యచ్చోట వసింపుము. నీశిరంబున మదీయ పాదచిహ్నంబులుండుటవలనఁ బక్షివల్లభుఁ డెంతమాత్రమును నిన్ను బాధింపఁడు. ఇప్పుడే పొ”మ్మని యానతిచ్చె. కాళిందీనదీతోయంబు లప్పటినుండి జనోపయోగ్యంబులగునట్లు వరంబొసంగి, యొడ్డునఁదనకై వేచియున్న జననీజనకులను బంధజనులను జేరంజనెను. కృష్ణుండట్లు సురక్షితంబుఁగా దమ్ముఁ జేరి నంతనే యాదవులందరును మహానందముతో మాటిమాటికిఁ గృష్ణునిఁ గౌగలించుకొనుచు నాతని యమానుషచర్యలను బొగడుచు నిజనివాసంబులకరిగిరి.

  టీక:- అక్షోభ్యము = క్షోభ (కలత) చెందుట లేనిది; దారాపుత్రులు = భార్యాబిడ్డలు; పక్షివల్లభుడు = గరుత్మంతుడు.

కృష్ణునికర్మప్రబోధము.[మార్చు]

 కృష్ణుఁడట్లు కాళీయుని శిక్షించి సురక్షితముగా నందగోకులమును బ్రవేశించిన కొన్నినాళ్ళకు నందాదు లింద్రయాగంబును సేయఁదలంచి తద్వృత్తాంతంబు నంతయుఁ గృష్ణునకుఁ దెలియఁ జేసి ‘నీ యభిప్రాయమేమి’ యని యాతని నడిగిరి. అప్పుడాతఁడు వారిఁగూర్చి ‘ఇంద్ర యాగంబునన మీరేల సేయవలయు?’ నని ప్రశ్నించెను. అందుకు నందాదులు బురుహూతునకుఁ బ్రియంబుగా యాగంబు నొనర్చిన నాతండు సంతోషించి వానలు గురియించు ననియు, వానలవలన వసుమతి యందుఁ గసవు పెరుగు ననియుఁ గసవు వలన గోగణంబులు వృద్ధిసెందుననియు, వానివలన వలసినంతపాడి తమకు లభించుననియు, నందువలనఁ దమ కులం బంతయు సకలసంపదలతో విరాజిల్లు ననియుఁ గావున, నింద్రయాగంబు సేయ సమకట్టితి మనియుఁ దెలియజేసిరి. అప్పుడు కృష్ణుఁడు వారినిఁ గాంచి “బంధువులారా! ఇంద్రునివలన మనము పెంపువహింపనేల? అతండు మనకెంతమాత్రమును గర్తకానేరఁడు. కర్మయే యన్నింటికిఁ బ్రధానమగుచున్నది. కర్మవలననే జననమరణంబులును, వృద్ధిక్షయంబులును శరీరధారులకుఁ గలుగుచున్నవి. అట్టియెడ నింద్రుని మనమెందుకుఁ బూజింపవలయును? ఇంద్రుఁడైనను గర్మకు లోఁబడినవాఁడే. అతఁడు కర్మఫలమును పోగొట్టఁజాలఁడు. ఉత్పత్తిస్థితి లయంబులకు సత్వరజస్తమోగుణంబులు ప్రధానములగుచున్నవి. రజంబున జగంబు జన్మించును, రజోగుణ ప్రేరితంబులై మేఘంబులు వర్షించు. అట్టి వర్షంబువలన మీరు వ్రాక్కుచ్చినదంతయు సమకూరును. అప్పుడు ప్రజాభివృద్ధి యగును. కావున నింద్రయాగముతో నిమిత్తంబులేదు. కర్మంబుననుసరించి ప్రజావృద్ధికిఁ బసులకుఁ, గొండకు, బ్రాహ్మణోత్తములకుఁ బూజలు గావించుట సమంజసము. కావున మీరందఱును గోవర్థన పర్వతంబును బూజింపుఁడు. దానివలననే మనకన్నియును సమకూరగల” వని పల్కెను. యాదవులును గృష్ణుని హితంబు ననుసరించి హరిసమేతులై గోవర్థనగిరికిఁ బూజలుసేసి భూసురాశీర్వాదములతోఁ బర్వతంబునకుఁ బ్రదక్షిణపూర్వక నమస్కారంబు లొనర్చి గోవులను బురస్కరించుకొని గృహంబుల కరిగిరి.

  టీక:- వసుమతి = నేల; కసవు = గడ్డి; పెంపువహించు = గౌరవించు; పురస్కరించుకొని = ముందు ఉంచుకొని.

గోవర్థనగిరి నెత్తుట ఇంద్రుడు క్షమింపబడుట:-[మార్చు]

 కృష్ణుని హితంబును బాటించి గోపకులు తన్ను మఱచినారని యింద్రుఁడు కోపించినవాఁడై వారికి బుద్ధి సెప్పఁదలంచి మేఘంబులఁ బురస్కరించుకొని సకలభువనంబులు కంపించునట్లు, పిడుగులతోఁ గూడిన శిలావర్షంబును నందగోకులంబుపైఁ కురియింపసాగెను. ఆ ప్రచండ శిలావర్ష విజృంభణంబునకు గోపకులు వెఱచి హాహాకారంబులు సేయుచు “కృష్ణా!రక్షింపుము. రక్షింపుము.” అని మొరలిడసాగిరి. కృష్ణుండును వాసవుని యఖండగర్వంబును బోఁగొట్టదలంచి, యపాయంబులేదని బంధుజనుల హెచ్చరించుచు, సకలలోకంబులు తన్నుగీర్తించునట్లు, గోవర్థనంబు నవలీలఁగానెత్తి ఛత్రంబు పగిదిఁ గొనవ్రేలియందు నిలిపినవాఁడై రక్షణోపాయంబుఁ గానక విలపించుచున్న నందగోకులంబును గాంచి “బంధువులారా! ఎంతమాత్రమును భయపడవలదు. ఇదిగో ఈ కొండ క్రిందికిరండు, ఇదియే మిమ్మును, మీదారాపుత్రాదులను, మీగోగణంబులను, గొడుగువలె నెగడి శిలావర్షంబునుండి రక్షింపఁగలదు. మఱియు నో బంధువులారా!

 బాలుండీతఁడు కొండ దొడ్డది మహా భారంబు సైరింపఁగాఁ

 జాలండో యని దీని క్రిందనిలువన్ శంకింపఁగాఁ బోలదీ

 శైలాంభోనిధిజంతు సంయుత ధరా చక్రంబు పైఁబడ్డ నా

 కేలల్లాడదు బంధులార నిలుఁడీ క్రిందం బ్రమోదంబునన్.

  అని హెచ్చరించి ధైర్యంబు సెప్ప, హరివచనంబులు నమ్మి తమతమ గోధన పుత్రమిత్రకళత్రాది సమేతులై యాదవులాకొండ గొడుగు చాటున నిలచిరి. ఇంద్రుండు నేడహోరాత్రంబులు శిలావర్షమును గురియించియు గోపకులను శిక్షింపఁజాలక మేఘంబుల మరలించుకొనిపోయెను. వర్షమాగినతోడనే కృష్ణుండును బంధువుల వెలుపలి కంపి పర్వతంబు నెప్పటియట్లుంచి గోపకులను కలుసుకొనెను. తమ ప్రాణరక్షణం బొనర్చిన బాలకృష్ణుని వల్లవులెల్లఁ గౌఁగలించుకొని సముచిత ప్రకారంబుల సంభావించి దీవెనలొసంగిరి. అచ్చోట వాసవుండు కృష్ణుని సామాన్యునిఁగా దలంచి తానొనర్చిన పనికి లజ్జించుచు శ్రీహరిఁ జేరంజని తన తప్పును క్షమింపుమని యనేక విధంబులఁ బ్రార్థించెను. కృష్ణుండును దగిన విధంబున నింద్రునకు బుద్దిసెప్పి యెదిరిబలంబు నెఱుంగక యెన్నండును గయ్యంబునకుఁ గాలు దువ్వకుమా యని హెచ్చరించి యాతనిని వీడ్కొలిపెను. యాదవప్రముఖ లందఱును గృష్ణుని లీలామానుషచర్యలను బదింబదిగఁ దలంచుచు నాతని యందు మివుల భక్తిగలిగి యుండిరి.

  టీక:- నెగడు = అతిశయించు; లీలామానుషచర్యలు = లీలల వంటి మానవాతీతమైన పనులు; పదింపదిగా = అనేక రకములుగా.