తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/పరిచయం

Wikibooks నుండి

తెలుగు మాత్రమే తెలిసినవారు కూడా కంప్యూటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ అవసరాలకు సమర్థవంతంగా వాడుకోగలగాలి. కంప్యూటరు వాడుకునేవారు తెరపై కనబడే సూచనలను, ఎంపికలను చదవలేకపోతే కంప్యూటరును వాడుకోవటమే కుదరదు. ఇందుకోసం ఆయా కంప్యూటర్లు, వాటిలోని అనువర్తనాలు తెలుగులో అందుబాటులో ఉండాలి. తెలుగులో ఉండటం అంటే కేవలం తెర మీద కనబడేవి తెలుగు లిపిలో ఉండటం మాత్రమే కాదు. అందులో వాడిన భాష, పాఠించిన సంప్రదాయాలు (దూరాలు కీ.మీ.లో, వెచ్చదనం సెల్సియస్ డిగ్రీలలో చెప్పడం వంటివి) తెలుగు ప్రాంతాలలో తెలుగువారు తమ రోజువారి వ్యవహారాలలో వాడుతున్నట్టు ఉండాలి. కంప్యూటరు వాతావరణం పూర్తిగా కొత్తగా కాకుండా ప్రజల రోజువారి జీవన వ్యవహారాలలో భాగంగా దానికి పొడగింపుగా అనిపించాలి.

కంప్యూటర్లు, ల్యాపుట్యాపులు, ట్యాబులు, చేతిఫోనులు, టీవీలు, భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ సాఫ్ట్‌వేర్ మీదే నడుస్తాయి. వీటిని స్థూలంగా కంప్యూటర్లు అందాం. వీటిలో నడిచేవి కంప్యూటరు అనువర్తనాలు లేదా ఉపకరణాలు.

గత పదేళ్ళలో చేతిఫోన్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరగడం, కొన్నేళ్ళుగా అంతర్జాలం అందుబాటు క్రమంగా చవక అవుతూండడంతో చాలామంది తెలుగువారు ఇప్పుడు మునుపెన్నడూలేనంతగా కంప్యూటరు ఉపకరణాలను వాడుకుంటున్నారు. పచారీ సామాన్లు తెప్పించుకోవడం నుండి, బ్యాంకు వ్యవహారాల వరకూ అనేకం డిజిటల్ రూపంలోనే నడుస్తున్నాయి. కాబట్టి ఇవి తెలుగులో ఉండాల్సిన అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది.

ఇప్పటివరకూ కంప్యూటర్లను ఆంగ్లంలోనే చూసాం కాబట్టి అవి ఆంగ్లంలోనే ఉంటాయి, ఉండాలి అనుకోవడం తప్పు. కంప్యూటర్లు ఆంగ్లంలో మాత్రమే ఉండాలి అనే నియమం ఏమీ లేదు. అందునా, ఏ భాషలో చూపిస్తుందో అని కంప్యూటరుకి అసలు పట్టదు, ఎందుకంటే చివరికి కంప్యూటరు తను పరిక్రియాపించే (ప్రాసెస్ చేసే) ప్రతి సమాచారాన్నీ సున్నాలు ఒకట్లుగా మార్చుకోవలసిందే. చూపించే విషయం వేరే భాషలో ఉన్నా, కంప్యూటరు ఇంతకుముందులానే నడుస్తూండగలదు.

ఇప్పటికే కంప్యూటర్లు పలు భాషలలో అందుబాటులో ఉన్నాయి. పలు కంపెనీలు తమ కంప్యూటరు ఉపకరణాలను స్థానిక మార్కెట్ల కోసం ఆయా భాషలలో అందించడం మొదలుపెట్టాయి. ఇందుకోసం ప్రతి భాషకు విడిగా సాఫ్ట్‌వేరును తయారుచేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేరును తయారుచేసినప్పుడు అది తెరపై చూపించే సమాచారం పలు భాషల్లో చూపించగలిగేలా తయారుచేస్తే, ఆ తర్వాత ఆయా అంశాలను పలు భాషలలో ఏమంటారో అనువదిస్తే సరిపోతుంది.

కంప్యూటరు లేదా సాఫ్ట్‌వేరు ఉపకరణాలను అనువదించడం అనేది కొత్త కాదు. 'స్థానికీకరణ'గా పిలవబడే ఈ ప్రక్రియ సాంకేతికంగా కష్టమైనదేమీ కాదు. కానీ దీనికి మంచి అనువాదకుల జట్టు, కాస్త నిర్వహణ అవసరం.

మామూలుగా వాణిజ్యపరంగా నడిచే కంపెనీలు తమ సాఫ్ట్‌వేరు లేదా ఉపకరణాలను అమ్మడం ద్వారా (లైసెన్సు ఫీజు వసూలు చెయ్యడం ద్వారా) వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని వారి సాఫ్ట్‌వేర్లను స్థానిక భాషలలో అందించడానికి ఖర్చు పెడతాయి. కానీ చాలా కంపెనీలు వారి ఉపకరణాలను స్థానిక భాషలలో (ప్రత్యేకించి తెలుగులో) అందించడం లేదు. ఇందువల్ల ఆంగ్లం రాని వారు కంప్యూటర్లను అసలు వాడుకోవడంలేదు లేదా తప్పనిసరి పరిస్థితులలో వచ్చీరానీ ఆంగ్లం తోనే నెట్టుకొస్తున్నారు. వాటిని సమర్థవంతంగా వాడుకోలేకపోతున్నారు.

అయితే, కంప్యూటరు ఉపకరణాలను పెద్ద కంపెనీలే కాదు చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా రూపొందిస్తున్నారు. కొన్ని సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం గానీ, సమాజ శ్రేయస్సు కోసం గానీ వారి ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారు. వీరందరికీ పలు భాషలలో తమ సాఫ్ట్‌వేరును అందించేందుకు తగిన వనరులు, సమయం లేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో తమ ఉపకరణాలను స్థానిక భాషల లోనికి అనువదించమని ఆయా సంస్థలు వాటి వినియోగదార్లనే కోరుతున్నాయి. ఇందుకు స్థానికీకరణ వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటి స్థానికీకరణ వేదికలలో ఔత్సాహికులైన తెలుగువారు పాల్గొని ఆయా సాఫ్ట్‌వేరు ఉపకరణాలను తెలుగు లోనికి తీసుకురావడానికి తోడ్పడుతున్నారు కూడా.

తెలుగులో ఇలాంటి స్థానికీకరణ వ్యాపారపరంగానూ (పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలు తమ సాఫ్ట్‌వేర్లను అనువదించడానికి అనువాద సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వడం), స్వచ్ఛందంగానూ (అనేక ఓపెన్ సోర్సు ప్రాజెక్టులు, ఇతరత్రా క్రౌడ్‌సోర్సు ప్రాజెక్టులలోను ఔత్సాహికులు పాల్గొనడం) జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాల మధ్య సమన్వయం, ఇచ్చిపుచ్చుకోళ్ళు ఉన్నట్టు పెద్దగా కనబడదు. అందువల్ల, అనువాదాలలో నిలకడ లేదు. ఒకే భావానికి పలు మాటల వాడుక కనిపిస్తోంది. వాక్య నిర్మాణమూ అసహజంగా ఉంటుంది. అలానే కొత్తగా ఈ ప్రయత్నాలలో పాలుపంచుకునేవారికి అనువాదాలు ఎలా చేయాలి అనే విషయంలో బోలెడు సందేహాలు ఉంటున్నాయి.

కంప్యూటరు, మొబైలు, జాల ఉపకరణాల తెనుగింపులో పాల్గొనే వారందరికీ ఉపయోగడేలా ఈ స్థానికీకరణ మార్గదర్శినిని రూపొందించాలనేది లక్ష్యం.


స్థానికీకరణ[మార్చు]

స్థానికీకరణ అంటే ఒక ఉత్పాదనను (ఇక్కడ సాఫ్ట్‌వేరుని) స్థానిక సంప్రదాయాలకు, భాషలకు, వ్యవహారాలకు తగ్గట్టుగా మలచుకోవడం లేదా అన్వయించడం. స్థానిక సంప్రదాయాలలో తేదీలు, అంకెలు, కరెన్సీ మొదలైనవి రాసే పద్ధతి, వాడే కొలతలు వంటివి కూడా ఉంటాయి. అంటే, సరిగా స్థానికరించబడిన కంప్యూటరు ఉపకరణాలు—అవి చూపించే/వినిపించే సూచనలు, సమాచారం—స్థానిక ప్రజలకు అర్థమయ్యే తీరులో ఉండాలి.

అంతర్జాతీయీకరణ[మార్చు]

అంతర్జాతీయీకరణ అంటే కంప్యూటరు అనువర్తనాలను పలు భాషల లోనికి అనువదించుకోదగ్గట్టు, అన్వయించుకోదగ్గట్టు రూపొందించే ప్రక్రియ. అంతర్జాతీయీకరించిన అనువర్తనాలను మాత్రమే స్థానిక భాషలలోనికి అనువదించుకోగలం.(విషయ సూచిక పేజీ నుండి అతికింపు)[మార్చు]

గమనిక: దీన్ని ఆయా విభాగాల లోనికి తరలించాలి. ఈ అంశాలను పైన పరిచయంలో అవసరమైన చోట ప్రస్థావించాలి.

ఆధునిక వాణిజ్య, వ్యాపార, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విస్తారంగా వాడుకలో ఉన్న ఇంగ్లీషుని సరళమైన, భావస్పోరకమైన, దేశీ నుడికారంతో ఉట్టిపడే తెలుగులోకి మార్చటంలో ఉన్న కష్టసుఖాలని విశ్లేషించి, ఆచరణయోగ్యమైన సలహాలు ఉత్పాదించాలనే కోరిక ఈ పుస్తక ప్రేరణ కారకం. తెలుగు స్థానికీకరణలో ఆయా సాంకేతిక ఉపకరణాలలో , ఆ మెనూ , మాడ్యుల్ అంశాలు ఇతర రంగాలలో ఉన్న ఇంగ్లీషుని తెలుగులోకి మార్చటంలో ఉన్న సమస్యలని, వాటి పరిష్కార మార్గాలని అభివర్ణించటం జరిగింది. తెలుగు స్థానికీకరణలో తెలుగు నుడికారం ఉట్టిపడాలంటే తెలుగు వాడకంలో దొర్లే ఇంగ్లీషు తత్సమాలు 25 శాతం మించకుండా ఉంటే బాగుంటుందని ప్రతిపాదించటం జరిగింది. ఈ గమ్యాన్ని చేరుకోవటం కష్టమేమీ కాదు. మొదట, ఇంగ్లీషు మాటలని యథాతథంగా పెద్ద ఎత్తున గుచ్చెత్తి వాడెయ్యకుండా, సాధ్యమైనంత వరకు ఉన్న తెలుగు మాటలని వాడటానికి ప్రయత్నం చెయ్యటం. రెండు, సమానార్థకమైన తెలుగు మాట లేకపోయినా, వెనువెంటనే స్పురించకపోయినా ఇంగ్లీషు తత్సమాలని వాడటం కంటే తెలుగు ఉచ్చారణకి లొంగే తద్భవాలని వాడటం. మూడు, సందర్భానికి సరిపోయే భావస్పోరకమైన తెలుగు మాటలని అవసర రీత్యా సృష్టించి వాడటం. నాలుగు, ఇంగ్లీషు వాడుకలో స్థిరపడిపోయిన దుర్నామాలని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోకుండా జాగ్రత పడటం. చివరగా, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భాలలో ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాయటం. (ముద్రణకి వీలయినప్పుడు, పక్కని కుండలీకరణాలలో ఇంగ్లీషు లిపిలో చూపించటం.) ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యాలేనని అనుభవం చెబుతోంది. ఇంగ్లీషు మూలాన్ని తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని - కేవలం అర్థం చేసుకునే నిమిత్తం - రెండు, మూడు సార్లు చదువాలి. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెట్టాలి. ఒక భాషనుండి మరొక భాషలోనికి అనువాదం చేసే టప్పుడు Transliteration ఎక్కువగా వాడవలసిన అవసరం ఉంటుంది . దీనికి కారణం సాంకేతిక అంశాలు తెలుగు లోనికి అర్ధవంతంగా వివరించ వచ్చు అందుకు ప్రధానకారణం ఆ మూలభాషలోని సాంకేతిక అంశాల పేర్లు, ఆయా బ్రాండులు మరో భాషలోకి "అర్థవంతంగా" అనువదించే పనిలేకపోవటం. ఆ మాటలక్కూడా తెలుగులో సరిసమానమైన అర్థవిశేషపు పదాలు చెప్పవచ్చు