యదువంశము/మొదటి ప్రకరణ

Wikibooks నుండి
ఓం

శ్రీ విఘ్నేశ్వర్యనమః

మొదటి ప్రకరణము[మార్చు]

యయాతి.:-[మార్చు]

 పూర్వము నహుషుండను మహీకాంతుడు నూరు యజ్ఞముల నొనర్చి సురలోకాధిపత్యమును బొందెను. కాని కొండక కారణంబున నగస్త్యమహాముని శాపోపహతుండై యాతండు మానుషరూపంబును గోలుపోయెను. నహుషునకు యతియు, యయాతియు, సంయాతియు, నాయాతియు, వియతియుఁ, గృతియు, నను నార్వురు కొడుకులుండిరి. తండ్రి యనంతరము పెద్దకుమారుండగు యతి రాజ్యమునకు వచ్చెను. కాని యాతఁడు రాజ్యంబు సకలపాపంబులకు మూలంబనియు, దానివలన దేహికిఁ బునర్జన్మంబు సిద్ధంబనియుఁ దలంచి రాజ్యంబును విడనాడి యోగివృత్తి నవలంబించెను. అన్నయుఁ దండ్రియు నీ విధముగా నగుటవలన యయాతి రాజ్యభారమును వహించెను. ఈతఁడు మొదటినుండియు సత్ప్రవర్తనము గలవాఁడు. రాజధర్మమును జక్కగాఁ నెఱింగినవాఁడు. ఎల్లప్పుడు వినయవిధేయతలతోఁ పెద్దలయందు వర్తించుచుండెడివాఁడు. ఇట్టి శుభగుణసంపత్సమేతుఁ డగు యయాతి రాజ్యమునకు వచ్చినప్పటినుండియు రాష్ట్రమునఁగల ప్రజలందఱును సర్వశుభములతో విరాజిల్లుచుండిరి.

  టీక:- కొండొక = ఒకానొక; మహీకాంతుడు = రాజు; శాపోపహతుండు = శాపముచేత దెబ్బతిన్నవాడు

దేవయాని.:-[మార్చు]

 యయాతి సుక్షత్రియ సంజాతుఁ డైయున్నను గర్మ వశమున బ్రహ్మవంశసంజనితయగు దేవయానిఁ బరిణయమయ్యెను. దేవయాని, దైత్యగురుండును, క్షత్రియ ధర్మవిజ్ఞాన పరిపూర్ణుండును, శాపానుగ్రహసమర్థుండును నగు శుక్రాచార్యునకు ముద్దుపట్టియై యుండెను. తేజోనిధియగు భార్గవుని పుత్రికయైన దేవయాని, దేవగురుండగు బృహస్పతి కుమారుఁడైన కచుని శాపంబునఁజేసి యయాతిని బెండ్లియాడవలసిన దయ్యెను. శుక్రుండును బుత్రికాభిప్రాయానుసారము యయాతికి నామెనిచ్చి వివాహమొనర్చెను. కాని వివాహసమయమున నగ్నిసాక్షిగాఁ గైకొన్న పత్నితోఁ గాక, పరకాంతలతో సంభోగింపకుండునట్లుగను, దేవయానియందే సర్వవిధకామోపభోగంబు లనుభవించునట్లుగను శుక్రుండు యయాతివలన ప్రతిజ్ఞ సేయించెను. నాటినుండియు, యయాతి ప్రతిజ్ఞాభంగము వాటిల్లకుండ నేకపత్నీవ్రతమును సలుపుచు, దేవయానివలన యదువు, తుర్వసుఁడు నను నిరువురు కుమారులఁ బడసి ప్రజారంజకముగా పరిపాలన మొనర్చుచుండెను.

శర్మిష్ఠ.:-[మార్చు]

 దేవయానికి శర్మిష్ఠయను నొక చెలికత్తెయుండెను. ఈమె వృషపర్వుండను దానవేంద్రుని పుత్రిక. కాని తమ గురుపుత్రికయైన దేవయాని నామె యవమానించియుండుట వలన శుక్రుండు వృషపర్వునిపైఁ గోపించి, నిజకుమారికా పరాభవప్రతీకారమునకై యాతని పుత్రికను దేవయానికిఁ బరిచారికగా నొసంగవలయుననియు, లేకున్న శాపబలంబునఁ దానతని వంశచ్ఛేద మొనర్చువాఁడ ననియుఁ దెలియఁజేయ వృషపర్వుండు భయపడి, తనపుత్రికను బరిచారికా సహితంబుగా దేవయానికిఁ బరిచారికగా నొసెంగెను. దేవయాని యయాతినిఁ బెండ్లియాడినప్పటినుండియు శర్మిష్ఠ యామెను గొల్చుచు యయాతియందు బద్ధానురాగముగలదై యుండెను. సహజముగా రాజకుమారికయగుటవలన శర్మిష్ఠ దేవయానికంటెను జక్కనిదై యుండెను. చక్కదనమునకుఁ బరిపూర్ణమైన యౌవనముతోడై యుండెను. ఇట్లుండగా నొకనాఁడు దేవయాని లేని సమయముఁ గనిపెట్టి శర్మిష్ఠ యయాతికిఁ దన చిత్తము నెఱింగించెను. అతఁడును నామె మనోహరరూప లావణ్యాతిశయంబులకు లోఁబడి తాను గైకొన్న ప్రతిజ్ఞను మఱచి నాటనుండి యామెతో రహస్య సంభోగమున మెలంగఁ జొచ్చెను. కాలవశంబునఁ గ్రమముగా శర్మిష్ఠ గర్భంబును ధరించి ద్రుహ్యుండు, ననువుఁ బూరువు నను మువ్వురు తనయులఁ గాంచెను. అప్పుడు దేవయానికిఁ గల రూపు సర్వముఁ దెలిసిపోయెను.

  టీక:- వంశచ్ఛేద = వంశమును తుంచివేయుట

భార్గవ శాపము.:-[మార్చు]

 యయాతి సమయభంగ మొనర్చినందుకై దేవయాని మిక్కిలికోపించి నాథుండు తన్నెంత బ్రతిమాలినను వినక తండ్రియైన శుక్రాచార్యునకు సర్వమును దెలియఁజేసెను. శుక్రుండు నాతని ప్రతిజ్ఞాభంగమునకు సహింపజాలక “నేటినుండి ముదిమి నిన్నలుముకొనుగాక” యని యయాతిని శపించెను. భార్గవశాపోహతుండైన యయాతి కరుణింపవేయని శుక్రుని పాదంబులపైఁబడ నాతఁడు గొంత దయగలవాఁడై యతనికుమారులలో నెవ్వరికైనను దన ముదిమినొసంగి, అట్టివాని యౌవనమును నతండు గైకొని సుఖింపవచ్చుననియు విషయేచ్చాసక్తినశించిన యనంతరము తిరిగి యతనిముదిమిని నాతఁడు గైకొని, కుమారుని యౌవనమును గుమారున కొసంగవచ్చు ననియుఁ దెలియఁ జెప్పెను.

  టీక:- భార్గవుడు = శుక్రుడు

యయాతి కుమారులను శపించుట.:-[మార్చు]

 శుక్రుని వాక్యానుసారము యయాతి కుమారుల నందఱిని రావించి నిజ జరాభారమును వహింపుఁడని కోరఁగా యదువు మొదలగు వారెవ్వరును నంగీకరింపకుండిరి. కాని శర్మిష్ఠ కనిష్ఠకుమారుడైన పూరువు మాత్రము తండ్రికోరినప్రకారమాతని ముదిమిని దానుగైకొని, తనయౌవనమును నాతని కొసంగెను. అప్పుడు చిన్నకుమారుని పితృభక్తికి యయాతి సంతసపడి, యదువు మొదలగు తక్కిన కుమారులు రాజ్యభ్రష్టులగుదురనియు; వారియందు సుక్షత్రియత్వము నశించుననియు; యదుసంతతివారందఱును క్షత్రియులుగాఁ బరిగణింపఁ బడరనియుఁ; దుర్వసు వంశంబువారు ధర్మాధర్మ వివేకశూన్యులగు కిరాతులకు రాజు లగుదురనియు; ద్రుహ్య వంశంబువారు ఉపప్లవసంతార్యంబైన దేశంబులకుఁ బాలకు లగుదురనియు; ననువు వంశంబువారు ముదిమి దొఱకొను నంతవఱకు జీవింపక యౌవనంబుననే యకాలమరణంబునకు లోనగుదురనియు; నీవిధముగా శపించి యంతంబునఁ బూరువునకు రాజ్యంబొసంగి, తన ముదిమిఁ దాను గైకొని తపోవృత్తి నవలంబించెను.

యదువంశము.:-[మార్చు]

 యయాతి పెద్దకుమారుండగు యదువు వంశంబు వారందఱును, శాపగ్రస్తులగుటవలనఁ దమ క్షత్రియత్వంబును గోలుపోయి నాటనుండి యాదవు లనఁబరగుచు గోరక్షణతత్పరులై మెలఁగఁ జొచ్చిరి. కాని వీరియందును శూరులైన వారు రాజ్యములను స్థాపించి ప్రజాపాలన మొనర్చియుండిరి. కాని సుక్షత్రియత్వమును గోలుపోయిన వారగుటవలన క్షత్రియులెవ్వరును దమతో సమానులుగా యాదవులను గైకొనకుండిరి. ఇట్టి యదువంశమునకే భగవంతుడైన శ్రీకృష్ణుడు సంబంధించి యుండెను.