యదువంశము/ఉత్తర పీఠిక

Wikibooks నుండి
ఉత్తర పీఠిక

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మిక్కిలి పురాతనమైనవి. చాలా లోతైన మూలాలు కలిగి ఉన్నవి. ఇక్కడి హిందూ మతము లేదా సంస్కృతిలో ఋషులు, మునులు ప్రాతఃస్మరణీయులు, పూజనీయులు. ఎంతో ప్రాముఖ్యత కలవారు. వేదాది సకల సాహిత్య, ఆధ్యాత్మిక విజ్ఞానమునకు కర్తలు, విధానకర్తలు, ధరించువారు వీరే. అలాగే, గౌరవము పూజనలు అందుకునే వారు ఆనాటి రాజశేఖరులు. వారి పరిపాలనా దక్షత, పరాక్రమము, ధర్మ నిబద్ధతల వలననే, వారి యెడల ఇంతటి గౌరవము. ఇన్ని శతాబ్దములు దాటినా నిలబడుతోంది. వీరి గురించి ఇతిహాస పురాణముల ద్వారా ఈనాటికీ వినబడుతోంది. వారు స్థాపించిన జీవన విలువలే నేటికి మన దేశమునకు ఆదర్శప్రాయమైనవి. కనుక, వారిని నిత్యమూ స్మరిస్తూ పూజిస్తూ ఉండాలి. వారి మార్గములో నడవాలి.  అట్టి భారతీయ పురాతన రాజవంశములలో సూర్యవంశము చంద్రవంశము చెప్పుకోదగ్గవి. సూర్యవంశము త్రేతాయుగములో బాగా వికసించినది. ఇందులో భాగీరథుల వారు, శ్రీరామచంద్రుల వారు మున్నగు మహా మహిమాన్వతులు జనించారు. వారిని వారి ఆదర్శ జీవనమును నేటికి పూజిస్తున్నాము. అలాగే ద్వాపరయుగములో ప్రధానముగా తెలియబడునది చంద్రవంశము. ఆ వంశములోనే శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు మున్నగు వారు ఎందరో పుట్టారు. వీరందరిలోనూ శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అవతారము. వీరు ఈ చంద్రవంశములో యదువంశములో వసుదేవునికి కొడుకుగా జన్మించి వాసుదేవుడు అయ్యాడు. భూభారనివారణము కోసం అవతరించిన శ్రీకృష్ణునికి సేవచేయడానికి ఆదిశేషువే కాదు దేవతలు యదువంశము దాని పరివారములలో పుట్టి ధన్యులు అయ్యారు. అంతటి యదువంశం పరమ పవిత్రమైనది, బహుధా పూజనీయమైనది.

 అట్టి యదు వంశము గురించి భాగవతాది పురాణములలో వివిధ సందర్భములలో వర్ణించబడింది. వాటిని మహానుభావుడు కవికుమార, మహావాది వేంకటరత్నుల వారు ఇరవై శతాబ్దము ప్రథమార్థములో చక్కగా తెలుగులో వచనరూపములో రమ్యముగా వర్ణించారు. మన జాలతెలుగులకు, ఆ పుస్తకశ్రేష్ఠమును లలిత గారు సంకలనము చేసి అందించారు. చక్కగా ఆస్వాదించండి సహృదయులారా! సజ్జనులారా!   - భాగవత గణనాధ్యాయి చదువుకుందాం భాగవతం: :బాగుపడదాం మనమందరం:

-x-