తెవికీ సోదర ప్రాజెక్టులు/విక్షనరీ
విక్షనరీ వికీపీడియా సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాల కలయిక. ఇది తెలుగు పదాలకు అర్ధము వ్యాకరణ అంశాలు, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థము లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే నిఘంటువు. అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర భాషా విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుంటుంది. దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. దీనిని జులై 2005 లో ప్రారంభించారు.
తెలుగు వికీపీడియాలో వలె, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు. ఆగస్టు-అక్టోబరు 2007 మధ్యకాలంలో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని (సుమారు 32,000 పదాలు) చేర్చుకొంది. ఇప్పుడు దాదాపు లక్షా పాతికవేల పదాలు ఉన్నాయి.
విక్షనరీ రూపం
[మార్చు]- దాదాపుగా ఇందులో అర్ధ వివరణతో పాటు భాషా భాగాలు, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి, లింగము, నామవాచకమో, విశేషణం మొదలగునవి ఉంటాయి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం మూల రూపము దాని మార్పులు తెలుస్తాయి. సాధారణంగా మాతృభాషా పదాలకు మూలాలు సరైన వనరులు భాషా పుస్తకాలు సంప్రదించి రాయవచ్చు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము వచన రూపం వ్రాయాలి.
- దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు, అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొనవచ్చు. ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలతో ప్రయోగిస్తూ ఉదహరించాలి.
- ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ ఆయా భాషలకు లింకులు ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. ఇక మూలాలు, వనరుల వివరాలను చేర్చాలి.
- తెవీకీలో ఆ పదంతో వ్యాసం వుంటే లింకులు ఇవ్వాలి.
- పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.
- ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. చిత్రాలు ఇతర వీకీల నుండి లేదా వికీలో ప్రవేశ పెట్టి (అప్లోడ్) చేర్చవచ్చు. చేర్చ వచ్చు.
పదాల సేకరణ
[మార్చు]- విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో వాడే పదాలను చేర్చాలి.
- ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి.
- జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు.
- వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు.
ఆధారాలు
[మార్చు]https://te.wikipedia.org/wiki/విక్షనరీ