తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/మనిషి-యంత్రాల మధ్య సంభాషణ
Appearance
కంప్యూటర్ ఉపకరణాల తెరలు వాడుకరులకు, ఆయా ఉపకరణాలకు మధ్య వారధులు. వాడుకరులు తమకు కావలసిన సమాచారాన్ని కోరడం, లేదా కంప్యూటరుకి ఆదేశం ఇవ్వడం అందుకు జవాబుగా కంప్యూటరు ప్రతిస్పందించడం, తిరిగి వాడుకరి స్పందించడం, ఇలా ఇది ఒక సంభాషణ. ఈ సంభాషణ వాడుకరికి సౌకర్యంగా, తేలికగా ఉండాలి. ఈ సంభాషణలో వాడుకరిని సంబోధించేప్పుడు భాష మర్యాదగా, గౌరవంగా ఉండాలి. కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉండాలి.
వాడుకరిని ఉద్దేశించి
[మార్చు]కంప్యూటరు వాడుకరిని సంబోధించేటప్పుడు గౌరవవాచకం వాడాలి. ఉదాహరణకు, వాడుకరిని మీరు, అండి అని సంబోధించాలి.
- సమాచారం ఇవ్వడం: మీకు రెండు సందేశాలు వచ్చాయి.
- వాడుకరికి ఉన్న వికల్పాలను సూచించడం (ఇవి ఐచ్చికం): నివేదికను చూడండి.
- వాడుకరి ఉద్దేశాన్ని నిర్ధారించుకోవడం: మీరు నిజంగానే ఈ ఫైలును తొలగించాలని అనుకుంటున్నారా?
కంప్యూటరును ఉద్దేశించి
[మార్చు]కంప్యూటరును ఉద్దేశించిన ఆజ్ఞలు, ఆదేశాలలో గౌరవవాచకం ఉండకూడదు. అనవసరం. గౌరవవాచకం ఉంటే, కొన్ని సందర్భాలలో వాడుకరి తనని ఉద్దేశించినట్టు పొరపడే అవకాశం ఉంది.
- పంపించు
- భద్రపరుచు
- రద్దుచేయి
- తొలగించు
- నన్ను ఈ విషయమై మరెప్పుడూ అడగకు
ఇవి కంప్యూటరుకు వాడుకరి ఇస్తున్న ఆదేశాలుగా భావించాలి.