Jump to content

యదువంశము/ఎనిమిదవ ప్రకరణ

Wikibooks నుండి

ఎనిమిదవ ప్రకరణము

[మార్చు]

రామకృష్ణుల ఉపనయనము విద్యాభ్యాసం.:-

[మార్చు]

  కంస వధానంతరము బలరామకృష్ణులు, బృందావనంబున కరుగక, తల్లిదండ్రులను మాతామహుని సేవించుచు మధురాపురమునందే నిలచియుండిరి. వసుదేవుండును గుమారులకుఁ దగినవయస్సు వచ్చియున్నందువలన శాస్త్రసమ్మతంబగు నొక ముహుర్తంబు నేర్పరచి, యుపనయనసంస్కారంబును నిర్వర్తించెను. బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో భూ హిరణ్యదానంబులను, కుమారుల జన్మసమయంబున మనోదత్తలైన గోవులను, మిక్కిలి విలువఁగల మణిమయ దుకూలంబులను మున్నగు వాని నొసంగి సకలభూతంబులను సంతసింపఁ జేసెను. కృష్ణుండు దన కుపనయనాది సంస్కారంబులు సలుపఁబడినంతనే, తాను సర్వవిదుండయ్యు నెంతవారికేని గురు శుశ్రూష యనునది యుండితీరవలయు ననుదాని నిరూపింపఁ దలచి సాందీప మహామునియొద్ద గురుశుశ్రూషసేయుచు విద్యాభ్యాసమునకుఁ గడఁగెను. అచిరకాలముననే సర్వశాస్త్రేతిహాస చతుర్వేదవిజ్ఞాన పరిపూర్ణుండై గురువనుమతిని గృహస్థాశ్రమంబును స్వీకరింపఁ దలంచి స్వగృహంబునకరిగెను. బలభద్రుండును వేఱొక గురూత్తమునికడ విద్యాభ్యాసంబును ముగించుకొని మథురానగరంబునకుఁ దిరిగి వచ్చెను. ఇవ్విధంబున రామకృష్ణులు సకలవిద్యాపరిపూర్ణులై గృహస్థాశ్రమ స్వీకారంబునకుఁ దగిన ఈడును గలిగినవారై యుండిరి.

=== ద్వారకానగర నిర్మాణము. ===తొమ్మిదవ  కంసుఁడు కృష్ణునివలన మడసినాఁడనిన వార్త యెల్లెడలఁ దెలియవచ్చినంతనే యాతని బంధుజనులందఱును గృష్ణునిపైఁ బ్రబలసశత్రుత్వమును వహించియుండిరి. అట్టివారియందు మగధ దేశాధీశుండగు జరాసంధుఁడనువాడు ముఖ్యుండై యుండెను. జరాసంధుఁడును మిక్కిలి బలపరాక్రమములు గలవాఁడగుట వలనను, దనకుఁ గృష్ణునివలనఁ జావులేనివాఁడగుట వలనను, గంసుని మరణంబును గూర్చి కృష్ణునిపైఁ గత్తికట్టియున్నవారి కందఱికిని దాను నాయకుండై రామకృష్ణులు గురుకులవాసం బొనర్చుచున్న సమయంబున మధురాపురంబుపై దాడివెడలి, కృష్ణుని స్వజనంబులను బెక్కువిధంబుల బాధించెను. రామకృష్ణులు తిరిగి మధురానగరంబునకు వచ్చియున్నప్పుడు గూడ, జరాసంధుఁడు పెక్కుమారులు దండెత్తివచ్చెను. రామకృష్ణులు, తమవలన నాతనికి మృత్యువు లేకున్నందువలన నాతనివలన నెట్టిబాధలను గలుగకుండ బంధుజనులను కాపాడుచుండిరి. కాని జరాసంధుఁడు మాటిమాటికి దండెత్తివచ్చుచుఁ బురజనుల కశాంతిని జేకూర్చుచుండెను. అందువలనఁ గృష్ణుండు జరాసంధుని బారినుండి స్వజనుల రక్షింప దలంచి, దుర్జనులకు దుర్గమంబును, సుజనులకు సుగమంబునునై యుండునట్లు సముద్రంబు మధ్య ద్వారకయను నొకపురంబును నిర్మింపఁజేసి తనబంధుజనుల నందఱ నందు జేర్చి జరాసంధునివలన శాంతి భంగమొందకుండునట్లొనర్చెను. నలుపక్కల జలరాశియే యగడ్తగాఁగల ద్వారకానగరంబును సమీపించుట కేమియుఁ జాలనివాఁడై జరాసంధుఁ డంతటితో దన దండయాత్రలను ముగించెను.. కృష్ణుండును ద్వారకానగరంబు నందుండి సురక్షితులైయుండునట్లు బంధుజనులఁ బరిపాలింపఁ దొడంగెను. జరాసంధులకప్పటికి శ్రీకృష్ణుండు కేవలము మనుష్యమాత్రుండు గాడను సర్వంబును జక్కగా బోధపడెను. కాని శత్రుత్వమెంతమాత్రమును నశింప లేదు.

బలరాముని వివాహము.:-

[మార్చు]

 సముద్రమే పరిఖగాఁగల ద్వారకానగరంబున యాదవులందఱును సురక్షితులై యుండిరి. వసుదేవుఁడు తన పెద్దకొడుకైన రామునకు వివాహంబు సేయఁదలంచి కన్యాన్వేషణంబునకు భూసురుల నియోగించెను. వారును సకలదేశంబులు గలయఁదిరిగి తుదకు రైవతుఁడను నొక మండలేశ్వరుని పుత్రికయైన రేవతియను కన్యను రామునకుఁ దగినదని నిశ్చయించుకొని వచ్చిరి. రైవతుండును దనపుత్రికను రామునకిచ్చునట్లు బ్రహ్మదేవునచేఁ దెలుపఁబడినవాఁడై వసుదేవునకు శుభలేఖనంపెను. వసుదేవుండును నాప్తబంధు పుత్రమిత్రపురోహితకళత్రాది వర్గంబులతోఁ దరలివెళ్ళి యొక్క శుభముహుర్తంబున రామునకు వివాహ సంస్కారంబును ముగించెను. రాముండును రేవతితోడ ననుకూల దాంపత్యమును నెఱపుచు నామెయందు శశిరేఖయను పుత్రికారత్నమును బడసెను. ఆ బాలామణియు దినదినాభివృద్ధినొందుచు సకలసద్గుణంబుల కాలవాలంబగుచు జననీజనకులకులకేగాక సమస్తజనులకును ముదమును గూర్చుచుండెను. అట్టి పుత్రికారత్నమను బలరాముఁడు తనకు మేనల్లుఁడును, సుభద్రార్జునులకు ముద్దులపట్టియునగు నభిమన్యునకిచ్చి వివాహంబు గావించెను.

రుక్మిణీదేవి చరిత్రము.

[మార్చు]

  బలరాముఁడట్లు రేవతీ సహితుండై కాపురంబుసేయుచుండఁ గృష్ణుంకుఁ గూడ వివాహంబు సేయవలయునని వసుదేవుఁడు చింతింపసాగెను. కాని శ్రీహరి స్వరూపుఁడైన తనకుమారునకు లక్ష్మీస్వరూపురాలైన కన్యకామణి యెచ్చోట లభించునాయని వసుదేవుఁడు మిక్కిలిగ విచారింపఁదొడఁగె. ద్వారకానగర వృత్తాంతం బిట్లుండ నచ్చోట విదర్భదేశంబునకు రాజధానియైన కుండినగరంబున భీష్మకుండను నొక దొడ్డరాజునకు లక్ష్మీదేవి యంశంబున జనించిన రుక్మిణియను బాలామణి శ్రీహరిని భర్తగఁ బడయవలయునని యాలోచింపసాగెను. భీష్మకుండును నారదాది మహామునీంద్రులవలన శ్రీకృష్ణుని యొక్కయుఁ దనపుత్రికయొక్కయు నిజచరిత్రంబుల నెఱింగినవాఁడై తనబిడ్డను వసుదేవనందనున కొసంగవలయునని నిశ్చయించుకొనెను. కాని యాతని పెద్దకొడుకగు రుక్మియనువాఁడు కృష్ణునియెడ నకారణ విరోధంబును వహించి తనచెల్లెలినిఁ జేది దేశాధీశుండును, కృగృష్ణునకాగర్బశత్రువునగు శిశుపాలున కీయదలఁచి బంధువులను దుదకుఁ తల్లిదండ్రులను నడ్డుపెట్టి వివాహప్రయత్నములఁ గావింపఁదొడంగెను. భీష్మకుండును గుమారున కెదురు పలుకఁజాలక దైవవిధి యెట్లున్నదో యట్లే జరుగఁగలదని మిన్నకుండెను. శేముషీ సింధువులగు బంధువు లందఱును దుస్సంధుఁడగు రుక్మిని ‘నీకిది తగదు’ అని యెన్నియో మారులు బుద్ధిసెప్పిరి. తుదకు నారదుఁడును, “ఈకార్యమునందు నీవు పాల్గొనినచో నిక్కముగాఁ గృష్ణుని వలనఁ బరాభవింపఁ బడెద” వని యాతనికిఁ దెల్పియుండెను. కాని రుక్మి యెవ్వరిని లక్ష్యపెట్టలేదు.

రుక్మిణీదేవి సందేశము.

[మార్చు]

 రుక్మిణికి మొదటినుండియు శ్రీకృష్ణునియందే బద్ధానురాగ ముండెను. అట్టియెడ నామె రెండవవానిఁ జేపట్టనేర్చునా? తన వివాహమునకుఁ దనయన్న యడ్డునిల్చి యున్నవాఁడనుమాట నెఱింగినవెంటనే రుక్మిణి మిక్కిలి విచారమును బొంది కృష్ణుని బొందుటెట్లాయని యాలోచింపసాగెను. తుదకు ధైర్యము వహించి తనకాప్తుడగు నగ్నిజ్యోతనుఁడను భూసురశ్రేష్ఠునిఁ దనకడకు రప్పించుకొని యాతనికి సర్వమును దెలియఁజేసి, ద్వారకానగరమున కరిగి శ్రీకృష్ణునిఁ దోడ్కొని రావలసినదని ప్రార్థించెను. ఆతండును వల్లెయని యా నాఁడే ద్వారకకుఁ బయనమయ్యెను. కొన్నిదినములు ప్రయాణంబు లొనర్చి యగ్నిద్యోతనుండు శ్రీకృష్ణుని సందర్శించెను. శ్రీకృష్నుండును దన్నుఁగూర్చి వచ్చిన యా విప్రపుంగవుని నర్ఘ్యపాద్యాది విధుల సత్కరించి కుశల ప్రశ్నాంతర మేమియు నెఱుంగనివానివలె వచ్చినపని యేమని ప్రశ్నించెను. అగ్నిద్యోతనుండును దాను వచ్చినకార్యమును దెలుపఁదలంచి “కృష్ణా! నీ వెఱుంగని వృత్తాంతం బేమికలదు? అయినను మాయామానుష, విగ్రహుడ వగుటవలన నెఱుంగనట్లు నటించుచుంటివి. నావచ్చినకార్యముదెల్పెద వినుము. విదర్భ దేశాధీశుండైన భీష్మకుని పుత్రిక రుక్మిణి యను కన్యకామణి నిన్ను వరింపఁగోరియున్నది. తల్లిదండ్రు లందులకు సమ్మతించిరి, కాని యామె యన్నయగు రుక్మియనువాఁడు సర్వప్రాణ రంజకుండవగు నీయందేలకో శత్రుత్వమును వహించి తనచెల్లెలిని శిశుపాలున కీయఁదలంచి యుండెను. కుమారున కెదురాడఁజాలక భీష్మకుఁడు మౌనము వహించెను. తనయన్నయొక్క దురాలోచనమును దెలిసికొని రుక్మిణి యనాథ రక్షకుండవగు నీకడకు నన్నంపినది. ఇదిగో! ఆమె నీకుఁగా నావలనఁజెప్పి పుత్తెంచిన సందేశంబును దెల్పెద వినుము. -- “ కృష్ణా!

 ేఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక

 దేవాతాపంబులు దీరిపోవు

 నేనీశుభాకార మీక్షింపఁ గన్నుల

 కఖిలార్థ లాభంబు గలుగుచుండు

 నేనీచరణసేవ లేప్రొద్దుచేసిన

 భువనోన్నతత్వంబుఁ బొందఁగలుగు

 నేనీ లసన్నామ మే ప్రొద్దుభక్తితోఁ

 దడవిన బంధ సంతతులువాయు

 నట్టినీయందు నా చిత్తమనవరతము

 వచ్చియున్నది నీయీన నానలేదు

 కరుణఁజూడుము కంసారి ఖలవిదారి

 శ్రీయుతాకార! మాననీ చిత్తచోర!

 ప్రాణేశ! నీ మంజు భాషలువినలేని

 కర్ణరంధ్రంబుల కలిమియేల?

 పురుషరత్నమా! నీవుభోగింపఁగాలేని

 తనులతవలని సౌందర్యమేల?

 భువనమోహన! నిన్నుఁ బొడగానఁగాలేని

 చక్షురింద్రియములసత్త్వమేల?

 దయిత! నీయధరామృతం బానఁగాలేని

 జిహ్వకు ఫలరస సిద్థియేల?

 నీరజాతనయన! నీవనమాలికా

 గంధమబ్బలేని ఘ్రాణమేల?

 ధన్యచరిత! నీకుదాస్యంబుసేయని

 జన్మమేల? యెన్నిజన్మములకు.

 అంకిలి సెప్పలేదు చతురంగబలంబుల తోడనెల్లి యో

 పంకజనాభ! నీవు శిశు పాలజరాసుతులన్ జయించి నా

 వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే

 యుంకువసేసి కృష్ణ! పురు షోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.”

  కావునఁ గృష్ణా! అనాథయగు నా కన్యకామణిని రక్షింపుము. బయలుదేరుము. లెమ్ము అని విన్నవింపఁ గృష్ణుండును రుక్మిణియం దిదివఱకే బద్ధానురాగంబుఁ గలిగి యున్నవాఁ డగుటవలనఁ దోడనే దారుకచోదితంబైన రథంబునెక్కి, యగ్నిద్యోతనునితోఁ గలసి విదర్భకుఁ జనెను. రుక్మిణిఁ దెచ్చునప్పుడు యుద్ధంబు సిద్ధంబని తలపోసి, శ్రీకృష్ణునకుఁ దోడుగావలయునని యాతఁడరిగిన యనంతరము బలరాముఁడు యాదవసేనా సమేతుండై తానుగూడ విదర్భ కరిగెను.

శిశుపాల జరాసంధాదుల పరాభవము.:-

[మార్చు]

 కృష్ణుండు కుండిన నగరంబును జేరునప్పటికే, పెండ్లికొడుకగు శిశుపాలుఁడు జరాసంధాది మిత్రులతో వచ్చియుండెను. ఆతఁడు పురప్రవేశంబొనర్పక , యగ్నిద్యోతనుని వలనఁ దన రాకను రుక్మిణికిఁ దెలియఁ జేసెను. వివాహ కాలంబు సన్నగిల్లుడుఁ గులాచార ప్రకారంబు గౌరీపూజార్థమై,రుక్మిణి పురంబు వెలుపల నున్న గౌరీదేవాలయంబునకు సకల బంధుసమేతయై వచ్చియుండెను. అట్టియెడఁ గృష్నుండొరులకుఁ గానంబడక యదృశ్యరూపుండై యాలయసమీపంబున నిలచియుండెను. రుక్మిణియుఁ దనకుఁ గృష్నునేపతిఁగా గూర్పుమని నగజాతకుఁ బూజలఁ గావించి యాలయంబునుండి వెలుపలికి వచ్చెను. ఆ సమయంబున లేళ్ళగుంపునందు సింహంబు దుమికిన చాడ్పున విరోధివర్గంబు నడుమ గృష్నుండు దుమికి యవలీలఁగా రుక్మిణిఁగైకొని నిజరథంబునందు నిల్పి ద్వారకా నగరాభిముఖుండై పోవఁదొడంగెను. ఆ యద్భుత సంఘట్టనంబునకు శిశుపాల రుక్మి జరాసంధాదులు నివ్వెఱపడి కొంతవడికిఁ దెలివిఁతెచ్చుకొని యాయుధహస్తులై తమతమ పరివారములతోఁ గృష్ణుని వెంబడించిరి. అట్టియెడ బలభద్రుండు నిజసైన్యంబులతో శత్రువుల కడ్డంబువచ్చి ఘోరాహవంబుసేయఁజొచ్చెను. ఇంతలోఁ గృష్ణుండు కుండినగరంబు నతిక్రమించెను. కాని రుక్మి మాత్రము బలరాముని బారినుండి తప్పించుకొని, నిజసైన్యంబుతో నతిరయంబునఁ జనుదెంచి శ్రీ కృష్ణుని మార్కొనెను. శ్రీ కృష్ణుండును దృటికాలంబుననే యాతని సైన్యంబుల రూపుమాపి, యాతనిని విరథునిఁగను హతాయుధునిఁగను నొనర్చి , కృపాణహస్తుండై యాతనిఁ దెగవ్రేయుటకు రథంబునుండి క్రిందకి దుమికెను. కాని రుక్మిణీదేవి తన యన్నప్రాణంబులఁ గాపాడవలసినదని ప్రార్థించెను. కృష్ణుండును గరుణామయుండుగావున నాతనిఁ జంపక. ‘బావా! రమ్మని‘ పిలచుచు రుక్మిం జేరంజని పదునుగల కత్తితో గడ్డంబును, మీసంబును, దలయును రేవులు వాఱగొరిగి యాతనిని వికృతరూపునిఁగా జేసి విడిచిపెట్టెను. అట్టియెడ బలభద్రుండును శిశుపాల జరాసంధాదులఁ బారఁద్రోలి తనతమ్మునిఁ గలసికొనెను.

శ్రీకృష్ణుని దారాపుత్రాదులు.:-

[మార్చు]

 అవ్విధంబునఁ గృష్ణుండు రుక్మిణిం గైకొనివచ్చి ద్వారకానగరంబున నతివైభవంబుతో నొక్క శుభముహూర్తంబున నామెను బెండ్లియాడెను. కృష్ణుండు రుక్మిణినొక్కదానినే గాక సత్రాజిత్తుని పుత్రికయగు సత్యభామను, జాంబవంతుని పుత్రికయగు జాంబవతిని, నాగ్నజిత్తి, మిత్రవింద, మొదలగు వారల నేడ్గురిని, మఱియు నరకాసురుని వధానంతర మాతండు చెఱపట్టిన పదాఱువేల కన్నియలను బరిణయంబాడెను. రుక్మిణియందు శ్రీకృష్ణుండు ప్రద్యుమ్నుండను కుమారునిఁ గాంచెను. ప్రద్యుమ్నుండును గాలక్రమంబున బెరిగి పెద్దవాడైయుండు నెడఁ గృష్ణుడాతనికిఁ బ్రభావతియను కన్యను దెచ్చి పెండ్లియొనర్చెను. ప్రద్యుమ్నుండును బ్రభావతితోఁ గాపురంబును సేయుచు నామెవలన ననిరుద్ధుండను కుమారు నొక్కనిఁ గాంచెను. అనిరుద్ధుండును బాల్యయౌవనంబులఁ గడచి కౌమార ప్రారంభమున బాణాసురుని పుత్రికయైన ఉషాకన్యను వరించెను. కాని బాణాసురుఁడు విష్ణుద్వేషియగుటవలస ననిరుద్ధునిఁ బట్టి కారాగృహంబునందుంచెను. కృష్ణుండును మనుమని విడిపించు నిమిత్తమై బాణునిపై దాడివెడలి ఘోరాజియందతని సహస్రబాహుల ఖండించి శంకరుఁడు ప్రార్థింప నాతనిఁ జంపక ఉషాకన్యానిరుద్ధులతో నిజపురంబునకు మగిడివచ్చి తనయవతారంబునం దొనర్పవలసిన కుంతీసుత పరిపాలనముఁ గూర్చియుఁ గౌరవ వినాశంబుఁ గూర్చియు విచారించుచుండెను.