యదువంశము/ఉపసంహారం

Wikibooks నుండి
Jump to navigation Jump to search

ఉపసంహారము[మార్చు]

అర్జునుడు విప్రకుమారులఁ దెత్తునని ప్రతిజ్ఞ బట్టుట.:-[మార్చు]

 ధర్మరాజు ధర్మంబును దప్పక రాజ్యపరిపాలనం బొనర్చుచుండ హస్తినాపురంబునఁగల యొక బ్రాహ్మణునకుఁ బుట్టినవారు పుట్టినట్లే కుమారులందఱును గతించుచుండిరి. ఆ బ్రాహ్మణుండును బుత్రశోకంబును భరింపఁజాలక రాజమందిరంబును దరియంజని “ఓ ధర్మరాజా! నీ పరిపాలనంబున నధర్మంబు నిలిచియుండుటఁజేసి నా పుత్రులందఱును మరణించుచున్నారు. ఇట్టి యధర్మయుక్తంబైన నీ పరిపాలనం బేల కాల్పనా?” యని యనేకవిధంబుల వాపోవఁ దొడంగెను. అట్టియెడ నర్జునుం డాతనికడ కరిగి వృత్తాంతంబంతయు నాతనివలన నెఱింగి యా విప్రకుమారుల దాఁ దెత్తుననియు నింక ముందు గలుగు పాపలను మృత్యువాత బడకుండ రక్షింతుననియు, నట్లొనర్పకున్న ననలంబునఁబడి కాయంబు దొఱఁగువాఁడననియుఁ బ్రతిజ్ఞపట్టి యాతనికి దుఃఖోపశమనంబు గావించెను. ఇట్లుండఁ గొన్నినాళ్ళ కా విప్రుని భార్యకు నీళ్ళాడు ప్రొద్దులు రాఁగా, నర్జునుం డెఱింగి, సూతికామందిరంబు చుట్టును బాణంబులఁ బ్రయోగించి తుదకుఁ జీమగూడఁ బ్రవేశింపఁజాలనట్లొనర్చి తానప్రమత్తుఁడై యుండెను. కాని పుట్టిన శిశువు పుట్టినట్లే చనిపోవ విప్రుండర్జునుని నిరర్థకబ్రతిజ్ఞను గలవానిఁగా దలపోసి మురహరునికడ కరిగి పుత్రరత్న మొనర్పవలసినదని యా మహానీయుని అనేకవిధముల బ్రార్థించెను. ఇచ్చోట నర్జునుండును బ్రతిజ్ఞాభంగమునకు విచారించుచు నస్త్రబలంబువలన యమసదనంబున కరిగి యచ్చోట విప్రకుమారులఁగానక యెల్లచోట్లను వెదకినవాఁడై తుదకుఁ దానాడినమాటను నిలుపుకొనఁజాలక, అగ్నిఁ బ్రవేశింపనుండెను. అట్టియెడఁ గృష్ణుండు విప్రునితోఁ గలసి యర్జునుని చెంత కరుగుదెంచి. యతనికిఁ దాను విప్రకుమారులను జూపెదననియు నగ్నియందుఁ బడవలదనియుఁ దెలియఁబలికి విప్రునకు ధైర్యంబు సెప్పి యప్పుడే యర్జునునితో శ్రీకృష్ణుండు విప్రకుమారాన్వేషణార్థమై యరిగెను

శ్రీ కృష్ణుండు విప్రకుమారులదెచ్చి యర్జునుని ప్రతిజ్ఞను నిలుపుట.:-[మార్చు]

 కృష్ణుడుసర్వజ్ఞుండు గావున దుర్గవన జానపదాచల పక్కణ ప్రభూత నదనదీ సరోవరయుత క్షితి నంతయుదాటి, సప్తసముద్రంబులను, గులగిరిప్రకరంబును నుత్తరించి, మేరునగంబు నతిక్రమించి, యమలోకంబును, భూరినీరంధ్ర నిబిడాంధకార ప్రయుక్తంబునునగు ప్రదేశంబును జొచ్చి, నిజచక్రాయుధ ప్రకాశంబువలన మార్గంబును గాంచుచుఁ జనిచని పెంజీకటికవ్వల సకలమునిగణసమేతుండై భోగీంద్రభోగతల్పంబున శయనించి యున్న యాదివిష్ణుమూర్తిని సందర్సించి, యనేకవిధంబులఁ బ్రార్థించెను. అంత, నయ్యాదిదేవుండును గృష్ణార్జునులంగని, “మహాత్ములారా! మీరు నా యంశమున ధర్మ సంస్థాపనార్థమై నరనారాయణులన జనించియున్నవారగుటవలన, నట్టి మిమ్మును జూడవలయునని యీ మునీంద్రులు నన్నర్థింప విప్రకుమార నెపంబున మిమ్మిచ్చటికి రప్పించితిని. నీ చెలికాఁడగు నరుని ప్రతిజ్ఞవృథ కాఁగూడదు. కావున నీ విప్రకుమారులఁ దోడ్కోని పొమ్ము. శుభంబయ్యెడు.” నని పలికి, విప్రకుమారుల నొసంగ, గృష్ణార్జునులు సముదితస్వాంతులై, యయ్యాదిదేవుని కృపావిశేషంబునకు మెచ్చుకొనుచు, నటనుండి బయలుదేరి దీర్ఘప్రయాణంబు లొనర్చి, హస్తినాపురంబు బ్రవేశించి యా విప్రునకు మృతులైన యాతని కుమారులనందఱ నొసంగిరి. కృష్ణుండును దన మిత్రునకుఁ బ్రతిజ్ఞాభంగంబు గాకుండ నవ్విధంబునఁ గాపాడినవాఁడై పాండవుల వీడుకోలును వడసి ద్వారకానగరంబున కరిగెను.

యదువంశ క్షయము.:-[మార్చు]

 శ్రీకృష్ణుండు ద్వారకానగరంబును బ్రవేశించిన కొన్నినాళ్ళకు యదువంశక్షయంబునకుఁ దుర్నిమిత్తంబులు గోచరంబులుగాఁజొచ్చెను. నారదాది మహామునీంద్రు లందఱును శ్రీ కృష్ణుని నవతారంబు సాలించి వైకుంఠమునకు రమ్మని ప్రార్థింపఁదొడంగిరి. అట్టియెడ, నొకనాఁడు కొందఱు మునీంద్రులు శ్రీకృష్ణసందర్సనంబొనర్చి ద్వారకానగర రాజమార్గంబున నరుగుచుండ యాదవులు గొందఱొక్కచో గుంపుగట్టి, తమలో నొక్కనికి స్త్రీవేషంబునమర్చి, యరుగుచున్న మునులఁ గాంచి “మహాత్ములారా” ఈ కాంత కేమి కలుగునో వచింపుఁ” డని యపహాస్యంబుగాఁ బలుక వారును దివ్యదృష్టివలన సర్వంబు నెఱింగి వారియెడఁ గినుకవహించి, యాకాంతకొక ముసలంబుపుట్టుననియు, దానివలన యదువంశ క్షయమగుననియు వచించి వెడలిపోయిరి. మునుల వచన ప్రకారము గొన్నినాళ్ళకు స్త్రీ వేషధారియగు నా పురుషునకు ముసలంబు పుట్ట, యాదవులు భయమంది యా ముసలంబు నంతయు నఱగఁదీసి సముద్రంబునఁ గలిపిరి. కాని తద్గంధలిప్తంబులగు తరంగంబులు పుడమిఁదాకుటవలన సముద్రతీరంబున నదియంతయుఁ దుంగగా నంకురించి నానాటి కభివృద్ధి నొందెను. ఇట్లుండ యాదవులంద ఱొకనాఁడు మదిరాపాన మత్తులై సముద్రతీరంబును జేరి, యకారణంబుగా నంతః కలహంబును బెంచికొని, యచ్చట దట్టముగాఁ బెరిగియున్న తుంగ బొటికలతో నొకరినొకరు మోదుకొనుచు, ఘోరంబుగఁ బోరుసల్పి, తుదకందఱును బ్రాణంబులు వాసిరి. మునుల వచనంబు లివ్విధంబున సార్థకంబులయ్యెను.

బలరాముండవతారమునుజాలించుట.:-[మార్చు]

 ఇట్లు యాదవులందఱును మడిసిన యనంతరము బలరాముండు తన యవతారంబు సమాప్తినొందెనని యెఱింగి శ్రీకృష్ణుని యనుమతిని ద్వారకాపురంబును నిర్గమించి చని చని యోగమార్గంబున దేహంబును జాలించి యనంతునిఁ గలసెను. అప్పుడు వైకుంఠంబునఁ గలవారందఱును మిగుల సంతోషంబు నంది శ్రీకృష్ణుని రాకకై ప్రార్థింపఁదొడంగిరి. జగదభిరాముండగు రాముండివ్విధమునఁ దనయవతారంబును జాలించి, యదువంశ చారిత్రపత్రంబులనుండి విడివడిపోయెను.

శ్రీకృష్ణుండుద్ధవునకుఁ బరమార్థంబునుపదేశించుట.:-[మార్చు]

 యాదవులు నశించుటయు, బలరాముఁడవతారమును జాలించుటయు, నారదాదిమునీంద్రులు వైకుంఠంబునఁ దనకై వేచియుండటయు, దనయవతారంబు సమాప్తియగు కాలంబు సమీపించియుండుటయుఁ దెలిసికొని శ్రీ కృష్ణుండుద్ధవునిఁ జేర బిలిచి “ఉద్ధవా! బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునఁజేసి యిట్టవతారంబునుదాల్చి ధాత్రీభారంబును దొలంగించితిని. నేటితో నాయవతారంబు సమాప్తినొందఁగలదు. నేటికి సప్తమ దినంబున సముద్రుండు ద్వారకాపురంబును ముంపఁగలఁడు. కావున నీ లోపలనే యందున్న స్త్రీవృద్ధ బాలాదుల నహస్తిపురికిఁ జేర్పవలసినదని నా యాజ్ఞఁగాఁ బార్థునకుఁ దెల్పుము. ఇంతటినుండి, కలియుగంబు సంప్రాప్తంబుఁగాగలదు. అట్టి కలియుగంబున మానవులందఱును దుష్టప్రవర్తనములఁ దగిలి, యధర్మపరులై యకాల మరణంబులకు లోనగుచుందురు. అధర్మంబు మూడుపాళ్ళు నడుచుచుండును. మఱియు మానవులందఱును ధర్మవిరహితులు, నాచారవిహీనులు, నన్యాయపరులు, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండురుల మెచ్చక యుందురు. కావున నీవు సుహృద్బాంధవ స్నేహంబు వర్జించి యింద్రియ వికారంబులకు లోనుగాక యెల్లప్పుడు హరినామ స్మరణం బొనర్చుచుచు జన్మరాహిత్యంబు నొందుము. ఇంకను వినుము. మానవులు గృహస్థులై యున్నను, రాగాది విషయంబులందుఁ దమ చిత్తంబులఁ జొప్పింపక, సంసారంబుననుండియు, సంసారబంధంబులకు దూరస్తులగుచు నిరంతర ధ్యానగరిష్ఠులై యగ్రాహ్యుండనగు నన్ను సత్వగుణ గ్రాహ్యునిఁగా నెఱింగి హృత్పద్మంబుల జీవాత్మ పరమాత్మల భిన్నంబుగాఁ దలంపక, యేకంబుగాఁ బరిగణించి, శంఖచక్ర గదాఖడ్గ శార్ఞ్గకౌమోదకీ కౌస్తుభాభరణ యుక్తుండనగు నన్నే సర్వంబునకు మూలంబని భజించిరేని జన్మరాహిత్యంబు నొందఁగలరు. నీవింక నేగుము. నేటితో నేనీయవతారంబును జాలించి వైకుంఠంబున కరిగెద” నని తెలియఁబలికి పరమార్థజ్ఞానోపదేశంబు నొనర్చిన, నుద్ధవుండును సంతోష దుఃఖంబులు హృదయంబున మల్లడింగొన మాఱుమాట పలుకనేరక శ్రీకృష్ణుని యాజ్ఞను శిరసావహించి వెడలిపోయెను.

శ్రీకృష్ణావతారపరిసమాప్తము.:-[మార్చు]

 ఉద్ధవుండరిగిన యనంతరము శ్రీ కృష్ణుండును, నిజపురంబును విడనాడి యెందేనిఁజని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించి చరణంబు వేఱొక చరణంబుమీద నిలిపి వినోదంబు సలుపుచుండెను. అట్టియెడ మృగయుఁ డొక్కరుండా ప్రదేశంబునకుఁ జనుదెంచి, వినోదంబుగా నటునిటుఁ గదలి యాడుచున్న శ్రీహరి చరణంబును హరిణకర్ణంబుగాఁ హృదయంబున భావించి బాణప్రయోగ మొనర్చెను. ఆ వ్రేటునకుఁ గృష్ణుండు హాహారవంబొనర్ప మృగయుండును దదారవంబు నాలించి మానవునిఁగాఁ దలపోసి, యప్పరమేశ్వరుని డాయంజని తానొనర్చిన యపరాధంబునకుఁ జింతించుచు నామహాత్ము ననేకవిధంబుల క్షమాపణంబును వేడి, యా మహానీయుఁడు దన్ను క్షమించినను దృప్తినొందక వైష్ణవాపరాధంబునకు క్షమాపణంబు లేదను భావంబున శ్రీహరిం దలంచుచుఁ బ్రాణంబులఁ బాసి యపవర్గ ప్రాప్తినొందెను. అంతఁ గృష్ణుండును దనకై విలపించుచున్న దారుకుని గనుంగొని, తాను దేహంబు సాలించిన వృత్తాంతమును బాండవాక్రూర సాత్యకి ప్రముఖులందఱికిఁ దెలియఁ జేయమని పలికినవాఁడై యోగమార్గంబున దేహంబును జాలించెను. అట్టియెడ నభోభాగంబున జయశబ్దంబు లొక్కపెట్టునఁ జెలరేగెను. శతకోటి సూర్యదివ్యతేజోవిభాసితంబగు విమానంబొండు సన నాదేరఁ గృష్ణుండును, బ్రహ్మరుద్రేంద్రాది దేవతలందఱును దన్నుఁ గీర్తించుచుండఁ గదలి వైకుంఠంబున కరిగెను. పుడమియంతయుఁ బూలవానలతో నిండిపోయెను. చల్లని మలయపవనంబులతోఁ బ్రకృతి యంతయు హృదయానందకరంబుగ నుండెను. విశ్వము విశ్వరూపునిలో లీనమయ్యెను.

llసంపూర్ణముll


మూలాలు[మార్చు]