యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/మరో హిరోషిమా
ఉపోద్ఘాతం
[మార్చు]భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొంత కాలానికి ప్రధాని ఇందిరాగాంధీ సంస్థానాధీశులకి ఇచ్చే భరణాలను రద్దు చేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో తమ సంస్థానాలను విలీనం చేసినందుకు ప్రభుత్వం వారికి ఆ భరణాన్ని చెల్లిస్తూ ఉండేది. మరి కొంత కాలానికి తమ దగ్గరున్న ఆస్తులను కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని భయపడిన కొంతమంది సంస్థానాదీశులు రహస్యంగా ఒక చోట సమావేశమవుతారు. వారిలో ఒకడు రాజా విక్రమదేవ్. అతను తన సంపదనంతా రహస్య ప్రదేశానికి తరలిస్తుండగా దారి మధ్యలో మంగళ్ సింగ్ అనే బందిపోటు అటకాయించి స్వాధీనం చేసుకుంటాడు. ఆ సంపదనంతా ఒక చోట పాతిపెడతాడు. అది తన అనుచరులకు కూడా చెప్పడు. కానీ మంగళ్ సింగ్ దురదృష్టవశాత్తూ పోలీసు ఎన్‌కౌంటర్ లో మరణిస్తాడు.
అసలు కథ
[మార్చు]బృహస్పతి డిగ్రీ పాసవడానికి నానా తిప్పలు పడుతూ తండ్రి చేత చీవాట్లు తింటూ ఉంటాడు. ఎందుకూ పనికిరాకపోతే రాజకీయాల్లో చేరతాను అంటూ ఉంటాడు. అతనికి ఒక చెల్లెలు హిమసమీర, తమ్ముడు ఉంటారు. ఒకసారి బృహస్పతి మిత్రులతో కలిసి పేకాడుతుండగా సరళరేఖ అనే పోలీస్ ఇన్‌స్పెక్టరు వచ్చి వాళ్ళని అరెస్టు చేస్తుంది. లంచం తీసుకుని వదిలిపెట్టేస్తుంది. ఆమెకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంటాడు బృహస్పతి. సరళరేఖ ఎలాగైనా పెళ్ళి చేసుకుని, భర్తని ఎన్నికల్లో నిలబెట్టి, అతని ద్వారా జీవితంలో పైకి ఎదగాలనుకుంటూ ఉంటుంది.
రామ్ భరత్ అనే మంత్రి దగ్గర రక్షణగా సరళరేఖని నియమిస్తుంది ప్రభుత్వం. అదే అదనుగా అతని ప్రాపకం సంపాదించాలనుకుంటుంది ఆమె. ఆయన ప్రచార సభలో తన వ్యక్తిని శిక్షణ ఇచ్చి వేదిక మీదకు వెళ్ళి అతన్ని పొగిడేలా ఏర్పాటు చేస్తుంది. కానీ బృహస్పతి ఆ స్థానంలో ప్రవేశించి ఆమె పథకాన్ని చెడగొడతాడు. దాంతో ఆమె మంత్రి దగ్గర చీవాట్లు తింటుంది. శ్రీహర్ష అనే విలేకరి బృహస్పతి స్నేహితుడు. అతనికి సరళరేఖను తాను ఎలా దెబ్బ తీసిందీ, ఆమె అక్రమంగా సంపాదించిన డబ్బు ఎలా తిరిగి వసూలు చేసిందీ చెబుతాడు. శ్రీహర్ష డాకూ మంగళ్ సింగ్ జీవిత చరిత్ర పరిశోధన చేసి రాస్తూ ఉంటాడు. బృహస్పతి ఇంటికి వెళ్ళేసరికి రాంభరత్ అనుచరులు వారి ఇంటిని చిందరవందర చేసి ఉంటారు. రాంభరత్ ఇంకెప్పుడూ తన జోలికి రావద్దని, ఇన్‌స్పెక్టర్ రేఖ ముందే చేయి చేసుకుని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.
సిబిఐ ఛీఫ్ రాఘవరావు ఒక వ్యక్తిగత పని మీద బృహస్పతి ఉండే ఊరికి వస్తాడు. అందుకు కారణం ఆయన కూతురు అతన్ని ప్రేమించడమే. ఏ పనీ పాట లేకుండా తిరిగే అతన్ని తన కూతురు ఎలా ఇష్టపడిందో ఆయనకు అర్థం కాదు. కానీ అతని తెలివి తేటలు చూసి రాఘవరావు ఒక రకంగా ఆశ్చర్యపోతాడు. ఒకసారి రాఘవరావుకు దేశద్రోహానికి సంబంధించిన కేసు వస్తుంది. దాన్ని బృహస్పతితో చేయిస్తే ఎలా ఉంటుందా అని అతన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ సరళరేఖ తన దగ్గర అతను కొట్టేసిన సొమ్మును తిరిగి వసూలు చేయడానికి వచ్చుంటుంది. బృహస్పతి తండ్రి అతన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతాడు. అది చూసిన రాఘవరావు అతను తనకు సరిపడడని తిరిగి వెళుతుంటాడు. ఎలాగైనా ఒక సంవత్సరంలోపు రాజకీయాల్లో చేరి మంత్రి నవుతానని ఆయనతో శపథం చేస్తాడు బృహస్పతి. అంతకుమునుపు రెండు సంవత్సరాల క్రితమే రాఘవరావు కూతురు హేమంత సంధ్యని రైల్లో చూసి ఆమెతో ప్రేమలో పడి ఉంటాడు బృహస్పతి. అతని తెలివితేటలతో ఆమెను బోల్తా కొట్టించి ఆమె దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేస్తాడు.
ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టబడిన బృహస్పతి, అతని స్నేహితుడు హనుమంతరావులు కలిసి దేశాటన చేస్తూ ఉంటారు. ఒక ఊరిని ఎంచుకుని అందులో హనుమంతరావుని బాబా అవతారం ఎత్తమని సలహా ఇస్తాడు బృహస్పతి. కొద్ది రోజుల్లోనే అతను అందరి దృష్టిలో పడతాడు.