యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/డేగ రెక్కల చప్పుడు

Wikibooks నుండి

రామకృష్ణ శాస్త్రి భారత సైన్యంలో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రిని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పనిచేసాడు, అతని అసలు ఉద్దేశ్యం ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపథ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది.

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్ఛ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.