నాన్నకో కధ

Wikibooks నుండి

నాన్నకు ఎనభైయ్యారేళ్ళు. మంచం పట్టాడు. ఏపని చెయ్యాలన్నా శరీరం సహకరించటం లేదు. తల దిమ్మెక్కినట్టుగా వుంటున్నదట. లేచి తిరగటం వీలుపడదు. ఈ అనారోగ్యానికి కారణం కేవలం వృద్ధాప్యమే కాదనీ, పొటాషియం లోపం కూడాననీ నాకు తెలుసు. దిళ్ల మీద ఒత్తిగిలి పడుకుని నాకు సలహాలిస్తుంటాడు.

"మరొక్క కధ రాయవా! నువ్విదివరకు రాసినట్లాంటి కధలు. మపాసా, చెహోవ్‌లు రాసినట్లాంటివి. మనంరోజూ చూసే మనుషుల గురించి. వాళ్ల జీవితాల్లో జరిగే సామాన్య సంఘటనల గురించి."

"ఓయస్‌ రాస్తాను. దానికేం భాగ్యం." అన్నాను నాన్న తృప్తి కోసం. కాని నేను అలాంటి కధలు యింతవరకు రాస్తేగద! "అనగనగా ఒక ఊళ్లో ఒకావిడ వుండేది......" అంటూ ప్రారంభించి, ఒక ప్లాట్‌ తయారుచేసి కధ రాయాలనే వున్నది. కాని... స్త్రీని ప్లాట్‌ అనబడే విధిలీలకు వదిలెయ్యటం ఎంత దుర్మార్గం! పాత్రలు మాత్రం మనుషులు కారా. వాళ్ల జీవితాలు గాలిలో దీపాలా?

మాయింటి కెదురుగా ఓ దంపతులుంటారు. రెండేళ్లుగా వాళ్లు గురించి రాయాలనుకుంటున్నాను. ప్రారంభించి,

"నాన్నా, యిలారాస్తే బావుంటుందా చూడు" అంటూ చదివాను, " న్యూయార్క్‌లోని ఒక చిన్న అపార్టుమెంటులో ఒకావిడుంటోంది. ఆవిడకో కొడుకు. పదిహేనేళ్లు నిండకుండానే ఆ కుర్రాడు మాదకద్రవ్యాల కలవాటుపడ్డాడు. (ఆ బస్తీలో చాలా మంది పిల్లలకా అలవాటుంది) కొడుకును దూరం చేసుకోవడం యిష్టం లేని తల్లి తనూ మాదకద్రవ్యాలు తీసుకోవటం ప్రారంభించింది. ఈ తరం పిల్లలంతా యిలాగేవున్నప్పుడేంచేస్తాం అంటూ సరిపెట్టుకుంది. కొన్నాళ్ల తరువాత, అనేక కారణాలవల్ల, కొడుకు ఆ అలవాటుమాని, నగరం విడిచి వెళ్లిపోయాడు. తల్లికి తనమీద తనకు అసహ్యం వేసింది. నిరాశానిస్ప్రహలు తప్ప మరేం మిగిలాయావిడకు. ఆమె గురించిన కధయిది....."

"చూశావా నాన్నా, ఏ నగిషీలు పెట్టకుండా సింపుల్‌గా రాశాను."

నేను చెప్పింది నీకర్ధం కాలేదు. ఇంకా రాయాల్సింది చాలావుంది. తుర్జెనీవ్‌ యిలాగే రాస్తాడు? చెహోవ్‌ అయితే అసలు యిలా ప్రారంభించడు. రష్యన్‌ శీతకాలాల గురించి విన్నావుగా సరళంగా కధ చెప్పటం ఆ చలివల్ల నేర్చుకుంటారేమో. శరీరాల్లేని, ఆత్మల్లేని మనుషులుంటారాకధల్లో! వాళ్లెవరు....?

"ఇంకేం రాయాలినాన్నా! చెప్పకుండా వదిలేసిందేమిటి"

"ఆ స్త్రీ ఎలా వుంటుందో చెప్పనేలేదు..."

"ఆవిడా, యస్‌, అందంగావుంటుంది..."

"జుత్తు ఎలావుంటుంది!"

"నల్లటి జుత్తు. పొడవాటి జడ. చిన్నపిల్లలేసుకున్నట్టుగా".

"ఆమె తల్లిదండ్రులు? వాళ్ల కుటుంబ నేపధ్యం? ఆమెనలా తయారుచేసిన పరిస్ధితులు... అవన్నీ రాస్తే బావుంటుంది తెలుసా."

"వాళ్లు మరోవూరి నుండి వచ్చి యిక్కడ సెటిలయ్యారు. ఏదో పని చేసుకుని బతికేవాళ్లు. బహుశా భర్త ఆమెకు విడాకులిచ్చివుంటాడు. చాలా?"

"నామాటలన్నీ నీకు జోకులాగా వినిపిస్తున్నాయా ఏమిటి? ఆ కుర్రాడు తండ్రి గురించి ఒక్క మాటకూడా చెప్పలేదేం? అతడెవరు? ఏంచేస్తాడు? కుర్రాడు పెళ్లికి ముందర పుట్టాడా! తరువాత పుట్టాడా!"

"సరే. వాడు పుట్టేనాటికి తల్లిదండ్రులింకా పెళ్లి చేసుకోలేదు."

"నీ కధలన్నీ అంతే. నీదృష్టిలో ఆడా, మగా పెళ్లిళ్లు చేసుకోరాఏమిటి?! పెళ్లికి ముందే సంసారం, పిల్లలు...."

"వాస్తవానికి అలాజరగదులే. కాని నాకధల్లో మాత్రం సాధారణంగా పెళ్లిళ్లు జరగవు... "

"ఏమిటా పెడసరి జవాబు.. "

"ఇదొక చిన్న కధ మాత్రమే నాన్నా. ఒక అందమైన, తెలివైన స్త్రీ, గుండెనిండా ఆశల్ని, కలల్ని మూటగట్టుకుని న్యూయార్క్‌ మహానగరానికి వచ్చింది. కొడుకును పెంచటానికి నానా కష్టాలు పడింది. ఆమెకు పెళ్త్లెందా లేదా అన్నది యిక్కడ అప్రస్తుతం కాదా?"

"ఎంత మాత్రం కాదు. అది చాలా ముఖ్యమైన అంశం"

"ఓకే ఓకే."

"ఓకేగీకే కాదు జాగ్రత్తగా విను. ఆమె అందంగావుంటే వుండవచ్చుగాని తెలివైంది మాత్రం కాదు"

"నిజమే. కాని కధలో వచ్చిన చిక్కేఅది. పాత్రలగురించి గొప్పగా రాస్తాం. కాని వాళ్లు చాలాసాధారణ వ్యక్తులాగే బతుకుతారు. మూర్ఖుడిలా కనిపించే మరోవ్యక్తి కూడా వాళ్లను మోసం చెయ్యగలడు. ఇలాంటి కధలకు ముగింపు వెదకటం కష్టం."

"అయితే ఏంచేద్దామనుకుంటున్నావు?" నాన్న కొన్నాళ్లు డాక్టరుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఆర్టిస్టుగా బతికాడు. శిల్పం, శైలి, కధనం, పరిశీలన అంటే యిష్టంయింకా.

"కొన్నాళ్లీ కధను పక్కన పెడదాం. ఈలోగా నీకూ ఆ జగమెండి హీరోకూ మధ్య సమోధ్య కుదరనీ."

"నాన్సెన్స్‌. కధ మళ్లీ రాయి. నాకూ ఈ సాయంత్రం వేరే పనేంలేదు. కమాన్‌, స్టార్ట్‌."

"ఓకే. కాని ఇది అయిదు నిమిషాల్లో తేలే విషయం కాదు." అంటూమళ్లీ ప్రారంభించాను.

"పక్కింటావిడ అందమైన మనిషి. కొడుకంటే ఆమెకు ప్రాణం. కడుపులో పడినప్పటినుండి, నెత్తుటి గుడ్డగావున్నప్పుడు, పొత్తిళ్లనుంచి ఎదిగి తన చేతుల్లో యిమిడిపోయినప్పుడు, వాణ్ణి గుండెల మీద వేసుకొని పడుకున్న ఆక్షణాలు తన కళ్ల నిండా వాడే.. మీసాలన్నా రాలేదుగాని కుర్రాడప్పుడే మాదకద్రవ్యాల అడిక్టుగా మారాడు. మరీ అంత సీరియస్‌ కేసేమీకాదు. ఆశ వదులుకోవలసిన అవసరంలేదు! తను చదువుకొంటున్న హైస్కూలు పత్రికలో వ్యాసాలు రాసేవాడు. వాడి ప్రతిభకు ఆపత్రిక సరిపోలేదు. స్వయంగా ఒక మాగజైను తనే ప్రారంభించాడు.

మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళందరూ గిల్టీగా ఫీలవుతారు. (అమెరికాలో కాన్సర్‌తో బాధపడుతున్న వాళ్లతో పదింట తొమ్మిది మందికి ఈ గిల్టీ మనస్తత్వమే ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారించారు.) కాని చిన్నచిన్న వ్యసనాలను ఆనందించటంవల్లనే మనిషి ఆనందంగా బతుకుతాడని తల్లి నమ్మకం. అందువల్ల ఆమె కూడా అడిక్టుగా మారింది.

మేధావి అడిక్టులందరికీ ఆమె యిల్లుకేంద్రమైంది. వచ్చినవాళ్లందరూ కోలరిడ్జులమనో (19721834;ఇంగ్లీషు కవి. నల్లమందు ప్రియుడు) టిమొదీలీరీ (జననం: 1920; హార్వర్డులో సైకాలజీ ఫ్రొఫెసర్‌. ఎల్‌.ఎస్‌.డి. వల్ల లాభాలున్నాయని ప్రచారం చేసినవాడు)లమనో అనుకునేవాళ్లు. స్వయంగా మత్తులో వున్నప్పటికి, తల్లితో సహజంగా వుండే సేవాభావం ఆమెను వీడలేదు. మంచి మంచి భోజనపదార్ధాలు, విటమిన్‌ మాత్రలు, ఆరెంజి జూస్‌ అందరికీ అందుబాటులో వుంచేది. తరాల అంతరాన్ని చెరిపేసి తనూ పడుచు పిల్లలలో ఒకటైపోయింది.

ఒకనాడు (మైకెలేంజిలో) ఆంటోనిమోనీ (ప్రముఖ యిటాలియన్‌ చలనచిత్ర కళాఖండాల సృష్టికర్త) సినిమా చూస్తున్నప్పుడు ఓ పిల్ల వాణ్ణి మోచేత్తో డొక్కలో పొడిచింది. పరిస్ధితి అర్ధం చేసుకొని, తల్లి, కొడుకుని మందలించి, యింటికి తీసుకెళ్లింది.

కొడుకు అభిప్రాయాలే తన అభిప్రాయాలు. వాడి ఆశయాలే తన ఆశయాలు. అనూహ్యమైన పద్ధతుల్లో తల్లి ప్రేమఫలించింది. కుర్రాడికి ఆరోగ్యం మీద శ్రద్ధకలిగింది. నరాలు వశం తప్పుతున్నాయని గ్రహించ గలిగాడు.

నిరాకారమైన ఆత్మ ఆనందించినంత మాత్రన సరిపోదు.

శరీర కూడా ధృఢంగావుండాలి.

ఆరోగ్యవర్ధక ఆహారం తీసుకున్నాడు. ఆపిల్స్‌, రకరకాల మొలకధాన్యాలు, జీడిపప్పు, బాదం, సోయాబీన్స్‌. ఇదికూడా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ప్రకటించాడు.

"అమ్మా, మరి నువ్వెప్పుడు మారతావు" అంటూ అమాయకంగా అడిగాడు.

కుర్రాడు త్వరలోనే కోలుకున్నాడు. మెహంలో కళ వచ్చింది. కండపట్టాడు.

కొడుకు సాంగత్యం లేని తల్లి ఏకాకిగానే కొకెయిన్‌ యింజక్షన్లు తీసుకుంది.

కుర్రాడు, వాడిగర్ల్‌ఫ్రెండూ మరోచోట కొత్త జీవితం ప్రారంభించటానికి వెళ్లిపోయారు. మాదక ద్రవ్యాలకు బానిసఅయిన తల్లిని చూస్తే అసహ్యం. 'ఈ అలవాటు మానకపోతే నీ మొహం చూడం' అన్నారు.

ఏకాంతంలో, ఫ్లాట్‌నిండా విస్తరించిన శూన్యంలో కొడుకు రాసిన వ్యాసాలు చదివి విలపించింది తల్లి. కుర్రాడిలో ఎంతనిజాయితీ వుంది! మేం అప్పుడప్పుడు ఆమెను ఓదార్చటానికి వెళ్లేవాళ్లం. పడుచుపిల్లలుఎవరైనా అడక్టులున్నారని వింటేచాలు ఆమెకు కన్నీరాగదు. "నా చిన్నినాన్నా ఈ అలవాటు మానరా" అని గుండెపగిలేలా రోదిస్తుంది.

కళ్లు మూసుకుని వింటున్న నాన్న "కధలో అంత హాస్యం, వ్యంగ్యంఎందుకే? మరోవిషయం, కాలయాపన చెయ్యికుండా సింపుల్‌గా కధ చెప్పలేవా? ఇక చివరి విషయం "అంటూ కాస్త వివరంగా," అంటే యిక ఒంటరి జీవితమే ఆమెకు మిగిలిందా? ఆమె జబ్బు మనిషే అని నువ్వు చెప్పదలచుకున్నావు"అంటూ వ్యాఖ్యానించాడు.

"అవును"

"పాపం, ఎంత అర్థంలేని పనిచేసింది. మూర్ఖురాలు. మూర్ఖులమధ్య గడిపితే మరేమవుతుంది? మొత్తం మీద కధ ముగించావు. అవునా?"

ఆర్గ్యూ చెయ్యిటం యిష్టంలేక,

"లేదునాన్నా. ఆమెకింకా నలభైకూడా నిండలేదు. ఇంకా ఎంతో జీవితం మిగిలివుంది. ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలదు. దురలవాట్లు మాని ఘనకార్యలు చేసినవాళ్లెందరులేరు! ఈ అనుభవం, యూనివర్సిటీలో బీయేలు,ఎమ్యేలు చేసిందానికన్నా ఎక్కువ పనికొస్తుంది."

"కాని రచయిత్రిగా నువ్వెదుర్కొంటున్న సమస్యే అది. ట్రాజెడీ కధలు రాయిటంలో వున్న మజా మనుషులు మారతారని రాయిటంలో లేదు. ఎంతగొప్ప ట్రాజెడీ అయితే అంత పాఠకరంజకంగా వుంటుంది. పరాజితులను గురించి చదవటం పాఠకుల కెంతయిష్టమో!"

"ఆమె మారే అవకాశముందని చెప్పానుగా నాన్న."

"కధల్లోనూ, జీవితంలోనూ బలహీనతలను అధిగమించి, పరిస్థితులను మార్చగలగిన మనుషులు కావాలి" అన్నాడు నాన్న.

ఆయన మాటకు ఎదురు చెప్పకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని కధ పట్ల నా బాధ్యతను విస్మరించలేను. ఆమె నాకు పరిచయస్థురాలే. అయినా ఆమె నేను సృష్టించిన పాత్ర. ఆమెను చూస్తే బాధగావుంది. బోసిపోయిన ఆ యింట్లో రోదిస్తున్న ఆ మనిషిని అలా వదిలెయ్యటం నాకిష్టంలేదు.

అందువలన

"ఆమె వ్యసనాన్ని అధిగామించింది. కొడుకు తిరిగి రాలేదుఅది వేరేవిషయం. ప్రస్తుతం ఆమె మాదకద్రవ్యరోగుల చికిత్సాకేంద్రాంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. పేషెంట్ల సమస్యల్ని అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగింది తనే."

"నీ లాంటి వాళ్లు మరో యిద్దరుంటే ఎంతబాగుండునో"అంటాడు డాక్టరు.

"డాక్టరు అలానిజంగా అన్నాడా? నువ్వు జోక్‌ చేస్తున్నావా?" అన్నాడు నాన్న.

"అలా జరిగే అవకాశముంది నాన్నా. లోకంలో చాలా చిత్రాలు జరుగుతున్నాయి, చూడటం లేదూ."

"లేదు పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె అలవాటు మానుకునే అవకాశంలేదు."

"ఇప్పుడామెకు మంచి వుద్యోగం వచ్చింది. గతాన్ని మరచిపోగలిగిన శక్తి ఆమెకుంది."

"ఎన్నాళ్లులే. ఒకసారి అలవాటు పడితే మానటం ఎవరితరం. జీవితవాస్తవాల్ని ఎప్పుడర్థం చేసుకుంటావో." అంటూ ఆక్సిజన్‌ ట్యూబులు ముక్కుపుటాల్లో అమర్చుకుని, నైట్రోగ్లిసెరిన్‌ బిళ్లలు రెండువేసుకుని కళ్లు మూసుకున్నాడు నాన్న.

"https://te.wikibooks.org/w/index.php?title=నాన్నకో_కధ&oldid=3160" నుండి వెలికితీశారు