కొత్తగడ్డ, నార్ల వెంకటేశ్వరరావు

Wikibooks నుండి

కొత్తగడ్డ[మార్చు]

పై పంట[మార్చు]

(జీవిత ఖండం)

పాత్రలు : రైతు : పల్లెటూరి ఆసామి, అతని భార్య, అతని కొడుకు,అతని కూతురు, సెట్టి, షాహుకారు.

స్థలం : రైతు ఇంటి చావిడి

కాలం: వర్తమానం

ఎదురుగా పడమటింటి ద్వారం పక్కగా కూర్చున్న రైతు భార్య (వయస్సు 35 ప్రాంతం) బియ్యపుచేట ముందు పెట్టుకుని, బెడ్డ లేరివేస్తూ వుంటుంది. ఆమె పాత చీర కట్టుకున్నది. నీరు దిగిన ముక్కు పుడకలు, వెల వెల బోతున్న ఏడురాళ్ళ పోగులు, ముఖాన రూపాయంత కుంకుమబొట్టు, చేతులకు నాలుగైదు జతల మామూలు గాజులు, మెడలో నల్లపూసలు, పెద్ద మంగళ సూత్రం : ఇవే ఆమె ఆభరణాలు : కుడివైపునున్న సింహద్వారం దాపున కూర్చుని రైతు కొడుకు (ఈడు పద్దెనిమిదో, పంథొమ్మిదో) గోగునారతో ఎడ్ల తలతాడు పేనుతూ వుంటాడు. చెంగు యెగలాగి దోపుకున్న పంచె కట్టు; భుజంపై కొద్దిగా చిరిగిన బనియను. గుడ్డల దండెంతో, మంచాలతో, గడమంచితో, బుట్టలు, తట్టలు, నార, తాళ్లు మొదలైన వాటితో చావడి చిక్కు రొక్కరుగా ఉఁటుంది. రైతు (ఇంచుమించు నలభై సంవత్సరాల వయస్సు) చుట్ట కాల్చు కుంటూ, తల వాకిలిగుండా వస్తాడు. మోకాళ్లు దిగిదిగని నీర్కావి ధోవతి; కుడిభుజాన్ని కప్పి కప్పని సర్కావి ఉత్తరీయం. చొక్కాగాని, బనియనుగాని లేదు. చంకలో కోలుపు కర్ర; కాళ్ళకు కిర్రు చెప్పులు. కొడుకు (తండ్రి ప్రవేశించినంతనే) : వడ్లు బేర మిచ్చేశావటేఁ?

రైతు : ఆ.. ఒక మంచం వాల్చుకు కూర్చుంటాడు.

కొడుకు : ఏకాడికి?

రైతు : కానీ తక్కువ ఏడణాలు.

కొడుకు : మరీ అంత తక్కువ కెందు కొదిలేశావేఁ అయ్యా? పేటలో పధ్నాలుగణాల పై చిలుకు పడుతున్నదట.

భార్య : మనకి మంచీ సెబ్బరా లేదుగా! ఆళ్లు ఏకాడికి అడిగితే ఆకాడికి పారబోసి రావడమే! ఇంట్లో గింజవుంటే మనకి నిద్ర పడుతుంది?

రైతు : చాల్లే, అఘోరించావ్! ఎక్కడా అప్పైనా పుట్టకపోతే, నన్నేం చెయ్యమంటావ్?

భార్య : పేటకు తోలుకుపోయి అమ్ముకురాక పోయావూ?

రైతు : అమ్ముకొచ్చేదాకా మునసబు, కరణాలు ఆగొద్దూ? ఈ పూట కిస్తీ కట్టకపోతే, చెంబూ తప్పేలా బయట వేస్తారట! గొడ్డూ గోదా జప్తు చేస్తారట!! ఆగితే ధరొస్తుందని నలుగురిలో నన్ను నవ్విం చుకో మంటావా? చాల్చాలు!

కొడుకు : రెండు కిస్తీలు కట్టనే కట్టాంగా, అయ్యా! మరొకటేగా బకాయి?

రైతు : ఏమైనా మరి ఆగరటరా! తెస్తావా, ఛస్తావా అని ఎట్టాళ్ళ నురికిస్తున్నారు. సందేళకి జమాబందీ పూర్తికావాలంట.

భార్య : అయితే, శిస్తుకు సరిపడ రెండు, మూడు బస్తాలమ్మి, మిగతావి అట్టే పెట్టక పోయావూ?

రైతు : రెండు, మూడు బస్తాలకోసం నీ యింటి కెవ డొచ్చి కాటా కడతాడు? పైగా, మన మమ్మే పుట్ల కిన్ని మాట్లు బేరాలు కూడానా?

భార్య : సరే, నీ యిష్ట మొచ్చినట్టు చేసుకో - నాకు దేనికి? నేను ఆర్చేదాన్నా, తీర్చే దాన్నా?

వెట్టివాడు (బయటినుంచి) : హిరోయ్, మున్సబుగారు కూకేసుకు రమ్మన్నాడు.

రైతు : అమ్మా, కొడుకూ చేరి, ఆగమన్నారుగా! ఆగితే, ఇదే మర్యాద! (వెట్టివాడితో) ఊఁ. వొస్తున్నా, నువ్వు పోరా!

వెట్టివాడు : నిలుచున్న పాళాన రమ్మన్నాడు. మరి ఊరుకోడానికి ఈల్లే దన్నాడు.

కొడుకు : ఊరుకోక పోతే, ఉ రెట్టుకోమను.

భార్య : ఆరి ఈడి జిమ్మడ, కొంపమీదికి యములాళ్ళని పంపకం చేస్తున్నాడు.

వెట్టివాడు : దొరోయ్! . బేగి రా, దొరోయ్!

రైతు : పదరా, పద! నీ యెనకాలే వొస్తున్నానని చెప్పు.

వెట్టివాడు (వెళ్ళిపోతూ) : ఆ అయ్య నన్ను కొంపడతాడు

కొడుకు : ఈ మునసబు కరణాలు ఏం సవారి చేసినా, మనంటి పేదా బిక్కీ మీదే. అదే మోతుబరు ఆసాములనైతే, ఇట్టా దూకుడు చేస్తాడూ?

భార్య : ఆళ్ళ దగ్గర ఈళ్ళ అంకిలి నొక్కుకు పోతుంది. నిరుడు మానానికి నిరుడు కూడా ఈళ్లు పీకమీద కూర్చుండబట్టేగా అయినకాడికి తెగనమ్ముకున్నాం. తీరా మనం అమ్ముకున్నాక వారానికే బస్తాకి రూపాయి పావలా పెరిగింది.

కొడుకు : ఒక్క రూపాయి పావలా ఖర్మ మేమిటి? కార్తీకమాస మొచ్చేసరికి రెట్టికి రెట్టి ధర పలికింది.

రైతు : నిజమేరా! కాని, కార్తీకమాసందాకా కిస్తీ ఆపగలమా? అప్పులవాళ్లని ఆపగలమా? గింజలు మన చేతికొచ్చేసరికి ఎవరికి రావలసింది వాళ్ళు గుంజుకోడానికే చూస్తారు. కాదు గూడదంటే పరువు పోతుంది; పరపతీ పోతుంది.

కొడుకు : ఇంతకీ మన కమిషనన్ దారు బాగుపడే గీత వుంది. నిరుడు నిల్వబోసిన మూడువేల బస్తామీద పది, పదకొండు వేలు కళ్ళ జూశాడు. అందుకని ఈ యేడు మరీ తెగబడి కొంటున్నాడు.

భార్య : ఎన్నేలు పోసుకోందే ఆడి పెళ్లాం మెడ తిరగకుండా అన్ని నగలు చేయించి పెట్టుకుందీ? అద్దం తరపు సిరొచ్చిందని అది నేలమీదే నడవడం లేదు. ఆడైతే సరేసరి. చుక్కల్లోకి చూస్తున్నాడు.

కొడుకు : వాణ్ణి చూసి, మన షాహుకారు కూడా వడ్లబేరం ప్రారంభించాడే, అయ్యా!

రైతు : ఔ నౌనురా! నిన్న మనకు కబురు చేశాడు. వాడి ఆశకైతే అసలే అంతూ పొంతూ లేదు. అయిదణాల కాడికి తనకి కొలవాలట.

కొడుకు : వాడి పుణ్యమాయిరి! పావలాకాడికే అడిగాడు కాదు.

భార్య : ఆరి ఆడి శిరుసు పగల! పోసుకుంటున్న వడ్డీలు చాలవు కాబోలు! ఒక మేడకు మరొక మేడ కట్టాలని చూస్తున్నాడు.

రైతు : సర్లేరా, అబ్బాయ్! నాకు బద్ధకంగా వుందికాని, నువ్వెళి కిస్తీ కట్టిరా! (బొడ్డు నుంచి డబ్బు తీస్తూ) “ఒక యాభై సర్దరా” అని కమిషన్ దారు నడిగితే, “లేవే” అని, ఒక యిరవై మాత్రం బయానాగా యిచ్చాడు. ఇది బొటా బొటిగా కిసీకే సరిపోతుంది.

కొడుకు (పేనుతున్న తాడూ, నారా గడమంచంపై పెట్టి, తండ్రి చేతినుంచి పైకం అందుకుంటూ): ఇంకా ఎంత కట్టాలేమేఁ అయ్యా?

రైతు : పద్దెనిమిది చిల్లరటరా!

కొడుకు : ఇంకా అంత దేనికేఁ?

తండ్రి : ఏవో సెస్సులట; జమాబందీ మామూళ్ళట.

భార్య : ఆళ్ళ పాడె, ఆళ్ళ పిండాకూడు!

కొడుకు : మనకేం సాయం చేస్తున్నా రేమిటి? మనం మామూళ్ళివ్వడానికి.

రైతు : సర్కారు ముడుపైనా తప్పుతుందేమో కాని, మామూళ్ళ ముడుపు తప్పుతుందట్రా? నిరుడు పల్లవీధివాళ్ళు మామూళ్ళివ్వలేదనేగా మునసబు కరణా లేకమై చురక తగిలించారు?వాళ్ళ చేతి కడ్డేమిటి? వాళ్ళది ముడుపులా వాళ్ళకి ముట్టజెప్పక పోతే, గండిలోగో, గిండిలాగో అని పరపర రాసేస్తారు.

భార్య : ఆ మునసబు కేమి పోయే కాలమో కాని, మొన్న వుత్తి పుణ్యానికి సుబ్బమ్మత్త గేదల్ని బందెలదొడ్డికి తోలించాడు. లబో దిబో మంటూ అదొక్కటే గోల!

కొడుకు : ఎవరైనా మనం వొంగిన కొద్దీ, మరింత వొంగ దీస్తారు. మామూళ్ళూ గీమూళ్ళూ మన మివ్వొద్దే, అయ్యా!

రైతు : వాళ్లతో మన మెక్కడ గెలవగలంరా? మన కెందు కొచ్చిన పేచీలు గాని, ఆ మామూ లేదో తగలేశేరా! వాళ్లతో పేచీకి దిగితే పీకమీదికి తెస్తారు.

భార్య : చేశేరా - ఆళ్ల దెవస మేమో చేశేరా!

రైతు : (దండెం పైనుంచి పై పంచె తీసుకుని, మునసబు కచ్చేరీకి బయల్దేరిన కొడుకుతో) వొస్తూ, వొస్తూ కోమటింటి కెళ్లి, ఒక కాడ పుగాకు తేరా, అబ్బాయ్! కాస్త చూసి తే, బొత్తిగా నాసి రకమిస్తున్నాడు. నిలిచి కాలడమే లేదు.

కొదుకు : సరే నయ్యా. (వెళ్లి పోతాడు.)

భార్య : పొద్దున్నేగా ఒక అర్ధణాకి తెచ్చావ్! మళ్లీ అప్పుడే కావాలీ? మన పుగాక్కి చాలడం లేదు ఏంత డబ్బైనా?

రైతు : నువ్వెప్పుడూ నా పుగాక్కి పడి యేడుస్తూనే వుంటావ్. ఇవాళ్ళ కొత్తే ముందిలే?

భార్య : సర్లే. ఏది ఎలా తగలబడితే నాకు దేనికి కాని, నా కట్టు కోకలు చిరిగిపోయాయి. ఒక జత కొనకపోతే, ఇఖ జరగదు.

కూతురు : (పడమటింటిలోంచి వస్తూ). బియ్య మేరడం కానే లేదటేఁ అమ్మా?

భార్య : ఆఁ వొస్తున్నా.

కూతురు : (చావడిలోకి వచ్చి). ఎసరు సలసల కాగిపోతోం దేఁ అమ్మా!(పదిహేడేళ్ళ పడుచు, మూడేళ్ళనాడు పెళ్ళి అయింది.తండ్రివద్ద గారాం హెచ్చు.కల్లా కపటం యెరగదు.)

భార్య : నా మాట చెవి నట్టించుకున్నావా? ఎంత అతుకు లెట్టు కుందామన్నా మరి ఆగేలా లేవు. ఒక జత కట్టుకోకలు...

రైతు : చెము డింకా రాలేదు.

భార్య : సరే, తేబోకు, మసిపూసుకు తిరుగుతాలే.(బియ్యపు చేట చేత బుచ్చుకుని విసురుగా లేచి వెళ్ళిపోతుంది.

కూతురు : అయ్యా!

రైతు : ఏమమ్మా?

కూతురు : పంట అమ్మేశావా?

రైతు : ఔను.

కూతురు : ఎప్పుడు?

రైతు : ఇవ్వాళే.

కూతురు : ధరొచ్చేదాకా ఆగుతా నన్నావుగా?

రైతు : మరి చెయ్యరూ?

కూతురు : వాళ్లు తొందర చేస్తున్నారన్న మాట.

రైతు : మనం ఆగుదా మన్నా, మనకు అప్పూ సప్పు పెట్టిన వాళ్లు ఆగనిస్తారా?

కూతురు : సరే.

రైతు : సరే ఏమిటమ్మా?

కూతురు : ఆఁ! ఏమీ లేదు. రైతు (ఆప్యాయంగా) నా దగ్గరనా నీ దాపరికాలు? మనసులో మాటేమిటో చెప్పు!

కూతురు : నిజంగానా?

రైతు : నిజంగా కాక, అబద్ధంగానా?

కూతురు : అయితే, నిరుడు నువ్వు ...

రైతు : ఆఁ, నిరుడు నేను...

కూతురు : నీకు గ్యాపకం లేదటే?

రైతు (చిరునవ్వు నవ్వుతూ) : ఏమిటది?

కూతురు : పై పంటనాటికి నల్ల పూసల గొలుసు చేయించి పెడతాననలేదూ?

రైతు : అయితే, ఇప్పుడు చేయించమంటా వన్నమాట.

కూతురు : నువ్వే అన్నావుగా, అయ్యా?- పంటనాటికి చేయించి పెడతానని.

రైతు (నవ్వుతూ) : మరి అన్నాక తప్పుతుందీ? అలాగే చేయిస్తాలే.

కూతురు : వెంకట్రావమ్మ పిన్నిగారి రెండో కోడలు మొన్నే చేయించుకుంది. ఎంతో కాలేదు మజూరి కలుపుకుని నూరు రూపాయల లోపే. అయినా, కొట్టొచ్చినట్టు నదరుగా కనబడుతున్నది. ఈ పక్క పక్కవాళ్లంతా దాన్ని పసందు చేశారే. అయ్యా!

రైతు (నవ్వుతూ) : అంత బాగుందేఁ!

కూతురు : అంతా, యింతానా? చాలా బాగుంది. ఒకసారి తెచ్చి చూపించినా? నీకే తెలుస్తుంది.

రైతు : తెద్దువుగాని లేఁ. ఇప్పు డంత తొంద రేమిటి?

కూతురు : అస లొకసారి నీ కళ్ళతో చూడవే లా వుందో? నవర్సు మీద అయిదు చిన్నాలు పడిందట. కొత్త పేట కమలాచారి చేశాడు. మనంకూడా ఆ కంసాలిబత్తుడికే యిద్దామే, అయ్యా! పిన్నిగారింటి కెళ్లి, మా అయ్యకొక్కసారి చూపించి తెస్తానంటూ దాన్ని పట్టుకు రానా?

రైతు : మంచిదమ్మా!(కూతురు వెళ్ళబోతూ వుంటే, భార్య వంటింటిలో నుంచి తిరిగి వస్తుంది.

భార్య : ఇప్పుడు ఆళ్లింటికి దేనికి? అక్కడేం పాచిపోతున్నది?

కూతురు : అయ్యకు చూపించడానికి వాళ్ల నల్లపూసల గొలుసు తెస్తానే. కొత్త పంట డబ్బు పెట్టి మా అయ్య నాకు అలాంటి దాన్నే చేయించి పెడతా నంటున్నాడు.(వెడుతుంది.

భార్య : ఆ చేయించుకునేది నిరుడు చేయించుకున్నా బాగుండేది. నిరుడు బంగారం ఇంత మండిపోవడం లేదు. పెళ్లినాడు చేయించిన ఆ ఒక్క జత గాజులు తప్పితే, మళ్లీ దానికొక వస్తు వేదీ యేర్పడనే లేదు. మెడ బోసిగా వుంది. పైపంటనాటికి, పై పంటనాటికి అంటూ అప్పుడే మూడేళ్లు వెళ్లిపోయాయి. మన యిబ్బందులూ, సబ్బందులూ వాళ్ళకేం తెలుస్తాయ్? రేపు దాన్ని కాపరానికి పంపితే, దిసిబొమ్మలా వొచ్చిందని అత్తా, ఆడబిడ్డలూ ఆరడి పెట్టరూ? కావాలంటే ఒక అప్పైనా దిగివిడిచి దాని మెడ కాస్త పచ్చబడేటట్టు చూడు. అలాగే నా కొక జత కోకలు కూడా....

రైతు : చెప్పినమాటే ఎన్నిసార్లు చెప్తావ్? తెస్తాలే, తెస్తా.

భార్య : ఆ నాయుడమ్మ కోట్లోవి నా కొద్దు. అవి మూడు రోజులైనా నిలవడం లేదు. పోసుకునే డబ్బూ పోసుకుని, వొళి వలలాంటి గుడ్డల్ని అంటగడుతున్నాడు. వేరే ఎక్కడైనా కొనుక్కురా.

రైతు : వేరే కొనడానికి డబ్బేదీ? :

భార్య : అంతేలే! నాకాడి కొచ్చేసరికి నీకు డబ్బే వుండదు. పాడి చేసీ, పిడక లమ్ముకునీ, దమ్మిడీ దమ్మిడీ చొప్పున పోగుజేసి, గుడ్డా గుడుసూ కొనుక్కుందామని పాతిక రూపాయలు కూడబెట్టుకుంటే, మాసూలు ఖర్చులకని దాన్నీ నువ్వే మండబెట్టుకున్నావ్.

రైతు : అది కాదే! సర్దవలసిన బాకీ లన్నీ సర్దాక, మరేం మిగుల్తుంది? ఆ నాయుడమ్మ కిప్పుడు ఏ ముఫ్ఫైయ్యో, నలభయ్యో యివ్వదేలాం. ఆ బాకీ తీర్చి మళ్ళీ వాడి దగ్గరే తెచ్చుకుంటే పై పంటదాకా ఆగుతాడు.

భార్య : దొరికాడులేఁ, మన కొక నాయుడమ్మ, ఎక్కడలేని ధర లేసుకుని కొట్టుచీకుడు గుడ్డ లంటగట్టడానికి. ఆడి జిమ్మడ! మరి, ఆడి కెలా దక్కుతుందో, ఏమో?

సెట్టి (ప్రవేశిస్తూ) : ఎవర్ని పిన్నీ, శాపనాకారాలు పెడుతున్నావ్? (సెట్టి వయస్సు ఇంచు మించు నలభై సంవత్సరాలు. ముందు క్రాపు, వెనక పిలక. బొత్తాలులేని చొక్కా జీరాడుతున్న పంచెకట్టు, సగం చెరిగిన పంగనామాలు. చేతిలో ఖాతా పుస్తకం. )

భార్య : ఆ, ఎవర్నీ లేదు. ఎవర్ని అంటే ఎవ రూరుకుంటారు?

సెట్టి (రైతుతో) : ఎక్కడి బాకీ లక్కడ నిలిచిపోయాయే, బాబాయ్! మూడు రోజుల్నుంచీ ఎక్కే గడప, దిగే గడపే కాని - రామరామ - ఎర్రటి ఏగాడైనా వసూలైతే వొట్టు. ఊరుమీద అమాంబాపతు రెండు వేలెట్టి నా మొఖం - నే నిఖయాపారం చేసినట్టే!

రైతు : ఆఁ, రెండు మూడు వేలు నీ కొక లెఖా? పత్రమా? సెట్టి : నా ఇంట్లో సొమ్మంటే బాబాయ్! ఎప్పటి కప్పుడు ఫిరాయింపు సెయ్యందే అక్కడ నా మొగు డూరుకుంటాడంటే? మొన్న సరు కేసుకొద్దా మనెళ్ళితే, నానా మాటలన్నాడు. నువ్విప్పుడిస్తే, ఊరికే యిచ్చినట్టు! లెక్కేమైనా యిస్తావటే. బాబాయ్?

రైతు : పెద్ద పెద్ద పద్దులు వసూ ల్చేసినా, చేసి నందం. ముందు వాటిని... సెట్టి : బాబ్బాబు, నువ్వలా అంటే కాదు. చిల్లర శివాలచ్చి మన్నారు. కొంత కాకపోతే, కొంతైనా వసూల్టేసి సరు కేసుకు రాకపోతే, యాపారం బొబ్బుంటుంది. కొట్లో - రామ రామ - ఉప్పుంటే చింతపండు లేదు; చింత పండుంటే ఉప్పు లేదు. ఏ వొట్టు పెడితే ఆ వొట్టు. చెయ్యిరగ గొట్టుకున్నట్టుగా వుందంటే నమ్ము.

భార్య : ఇంతకీ ఎంతివ్వా లేమిటి?

సెట్టి (పద్దుపుస్తకం చూస్తూ) : ఆఁ! వెరసి ఇరవైమూడు రూపాయల పన్నెండణాల కానీ అయిందే, పిన్నీ.

భార్య : అంత యెచ్చ మేమి మండబెట్టుకున్నాం.

రైతు : నెల రోజులనా డొకసారి లెఖ జూస్తే, పదిహేనేగా యివ్వదేలాం?

సెట్టి : నే నగావ్ వేస్తున్నానటే, బాబాయ్? పద్దు పుస్తకం తేనే తెచ్చాగా. కావాలంటే, నువ్వే బేరీ చేసి చూసుకో.

రైతు : నాకు చదునొస్తే, కానీకి మరొక కానీ నువ్వెలా రాసుకుంటావులే!

సెట్టి : అరి నీ యిల్లు బంగారం గాను! ఎంత మాటన్నావేఁ బాబాయ్. (పద్దు పుస్తకం పేజీలు తిరగవేస్తూ) ఆవకాయ పట్టుకోడానికని మొన్నేకాదటే, మా పిన్ని రెండు వీసెల మంచినూనె, వీసెడు మిర్చి, అరవీసెడు ఆవాలు, అర్ధ సేరు నవటాకు మెంతులు, సవాసేరు వెల్లుల్లి వగైరా వగైరా తెప్పించుకుంది? వీసె రెండుంబావలా చొప్పున రెండు వీసెల మంచినూనె...

రైతు : రెండుం బావలా వేసుకున్నావ్? పేటలో రెండు రూపాయలకాడి కిస్తుంటే!

సెట్టి : ఆ.. అక్కడైనా, రెండుం బేడా అమ్ముతున్నారే, బాబాయ్.

భార్య : మరి ఆకాడికే మా కెందు కివ్వలా?

సెట్టి : ఆకాడి కిస్తే నాకెలా గిడుతుందేఁ, పిన్నీ? కిరాయిలు పెట్టాలయ్యె; వడ్డీలు కట్టాలయ్యె; పారూ గీరూ పోతుందయ్యె. నాకు వీసె కొక కానీ, అర్ధణా మిగితే, అక్కడి కవి పెద్ద లాభాలే!

భార్య : పోసుకో! ఇంకా పోసుకో!

సెట్టి : ఆఁ, ఆ మాదేమున్నదేఁ పిన్నీ! ఏడాదయ్యాక జమా ఖర్చు లెత్తితే శెట్టి మిగుల్తాడు. ఏమైనా రైతు రైతే. మంట్లో మానెడు, ఇంట్లో పుట్టెడు.

సెట్టి (రైతుతో) : ఏం, బాబాయ్, మరి నన్ను పంపించవటే?

రైతు : ఇంతకు ముందే ఆ గింజ లేవో బేర మిచ్చాచ్చా! రేపో, మాపోకాని పైకం చేతి కందదు. అందగానే, పదో, పరకో జమ కడతాలే.

సెట్టి : బాబ్బాబు! దీన్లో మళ్ళీ కాస్త బకాయి పెట్టొద్దు. బాకీ చుప్తా చేసెయ్. కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. నీకు ఎప్పుడైనా నేను అడ్డుచెప్పానటే, బాబాయ్?

రైతు : మంచో, చెడో, ఆ యిరవై మూడు రూపాయలిస్తాగాని, బాకీకి శ్రీరామ చుట్టు.

సెట్టి : నాకైనా కాస్త గుటక దిగొద్దటే, బాబాయ్? ఆ పై చిల్లర డబ్బులే నాకు మిగిలేది.

రైతు : అయితే, దమ్మిడీలతోసహా గోళ్ళూడగొట్టి పుచ్చుకుంటానంటావ్!

సెట్టి : నీ మా టెందుకు కాదనాలి? ఆపై కానీ తో సెయ్యవే, బాబాయ్.

భార్య (సెట్టితో) : ఊఁ! మహలావ్ చేశావులే ఎలాగైతేనేం మాకొక ముష్టికానీ రాయితీ! (రైతుతో) లెక్కా డొక్కా తిన్నగా చూపించి మరీయివ్వు! ఎంతంటే అంతా యిస్తాననక! మనం కళ్లు మూసుకుంటే చేతి కెంతొస్తే, అంతా పరపర రాసేసుకుంటారు.

సెట్టి : కావాలంటే, నీ యిష్ట మొచ్చినవాళ్ళచేత పద్దు చూపించుకునే యివ్వవే, బాబాయ్! ఇందులో తటా బేమున్నది? మరి నన్ను వెళ్ళి రమ్మంటా

రైతు : ఊఁ.

సెట్టి (వెళ్ళిపోబోతూ) : నామాట దక్కించాలి, బాబాయ్! పోనీ, నన్నే రమ్మంటే, మళ్ళీ రేపు...

రైతు : మళ్ళీ నువ్వు దేనికిలే? నేనే వొస్తా.

సెట్టి (ఆగి) : కందులూ, పెసలూ కొత్త వొచ్చాయ్, పిన్నీ! మొదటి రకం సరుకు. అన్నప్పుడల్లా దొరకవ్. అవొక యిరస, ఇవొక యిరస పంపనా?

భార్య (మూతీ ముక్కూ విరుస్తూ) : మా కేమీ వొద్దులే.

సెట్టి : పోనీ, బెల్లం కావాలా? పాలకొల్లు నుంచి నిన్నే ఒక బుంగ వచ్చింది. తెల్ల బెల్లం; గెడ్డంటి బెల్లం. అయిపోతే,ఇంతలో మళ్ళీ అంత మంచిసరుకు రాదు. ఒక యెత్తెడు తూయించుకోండి.రాయితీ ధర కిస్తా.

భార్య : ఎత్తెడూ వద్దు; ఎత్తుబారమూ వద్దు. మరి నే నెళ్లాలి. వణ్ణ మేమైపోయిందో!(వెడుతుంది.)

సెట్టి : సర్లేవేఁ బాబాయ్! నే నొస్తా. నా బాకీ నిలపబోకు సుమీ! (తలవాకిలి దాపుకు చేరేసరికి ఎదురుపడిన షాహుకారును చూచి) కోమటి నెదురొచ్చా నయ్యా, నీకు కోటి లాభాలు.

షాహుకారు : ఆఁ! అన్నీ లాభాలుగానే వున్నాయ్! (షాహుకారు ఒక్కి మనిషి. గట్టిగా గాలి వేస్తే యెగిరిపోయేలా వుంటాడు.కాని, మాట కరకు; చూపు చురుకు, వయస్సు నలభైలోపు; యాభై అన్నట్టు కనబడతాడు.

సెట్టి : నీకేం తక్కువయ్యా? ఊరు మొత్తం మీద పెద్ద షాహుకారువు. ఇంట్లో లచ్మి మూల్గుతున్నది. (రైతుతో) నేను బక్కవాణ్ణి. మర్చిపోబాకు-బాబాయ్-నా మాట. (వెళ్ళిపోతాడు.)

రైతు (మంచంపై నుంచి లేస్తూ) : రావయ్యా, రా! కూర్చో.

షాహుకారు : ఆఁ! కూర్చోడానికి రాలేదులే.

రైతు (మంచం చూపుతూ) : రాక రాక, దారి తప్పి మా యింటి కొచ్చావ్. కూర్చో. షాహుకారు (నిలుచుండే). రాక తప్పుతుందీ? కాలం మారి పోయింది. కూర్చుంటే లేవలేని వాడికైనా కాళ్లొచ్చాయి.

రైతు : ఎందుకయ్యా అంత కాక పడుతున్నావ్?

షాహుకారు : ఒకసారి వచ్చి కనబడి పొమ్మని కబురు చేస్తే నిన్నొచ్చావ్?

రైతు : వచ్చేవాళ్లే. కాని, మునసబు తొంద రొక టొచ్చిపడింది. కిస్తీ కట్టలేదని థోమ్ ధూమ్ చేస్తున్నాడు. అదేదో సర్దుబాటు చేసుకుని ఇవ్వా లొద్దా మనుకున్నా.

షాహుకారు : నీకు మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా సర్దుబాటు కోసం నా వద్దకే వచ్చేవాడివిగా! ఈసా రెందుకు రాలేదు? మూడేళ్లనాడు నీ కూతురు పెళ్లికి అయిదువందలు కావాలంటే నే నడ్డం వెయ్యాలా? బండి మూల పడిందనీ, మరమ్మతులు చేయించుకోవాలనీ అఘోరిస్తే యాభయ్యో, అరవయ్యో తిరిగి నిరుడు భరోసాగా నే నివ్వలా? వందలకు వందలే సర్దినవాణ్ణి నువ్వు కిస్తీ కట్టుకోడానికి పాతికో పరకో సర్దలేక పోయానూ?

రైతు : అమాసనాడు అట్టు పెట్టానని, పౌర్ణానికి బూరి పెట్టానని ఎందుకయ్యా ఇప్పు డీ దెప్పుళ్ళన్నీ? అప్పు సప్పూ కావాలంటే నువ్వు ఆదుకున్న మాట నేను కాదన్నానా?

షాహుకారు : కాదనాలన్నా నోటూ పత్రాలూ వున్నాయిగా! ఎలా కాదంటావులే! కాని, నీకు అప్పూ సప్పు అవసరమైతే నేను కావాలి; గింజా గిట్రా అమ్ముకోవాలంటే కమిషన్ దారు కావాలి. నిన్న వాడికి బేర మిచ్చేశావటగా!

రైతు : అబ్బే! నిన్నివ్వ లేదు.

షాహుకారు : అయితే, ఇవ్వాళా?

రైతు : ఇంతకు ముందే మాటిచ్చాను. నాలు గైదేళ్లుగా వాడే కొంటున్నాడు. ఆనువాయితీ ఎందుకు తప్పించాలని మళ్లీ వాడికే బేర మిచ్చా.

షాహుకారు : నేను కబురంపితే, నన్ను కాదని వాడికే బేరమివ్వడానికి నీకు ఆనువాయితీ అడ్డం వొచ్చిందన్న మాట!

రైతు : ఆఁ! అది కాదు.

షాహుకారు ; అయితే, మ రేమిటి?

రైతు : నన్నేమి చావమంటా వయ్యా? నువ్వు అయిదణాలకే అడిగా వయ్యె! చూస్తూ, చూస్తూ అంత తక్కువకు ఎలా వొదిలిపెట్ట మంటావ్? నువ్వే చెప్పు!

షాహుకారు : నిన్నటి ధరది.

రైతు : నిన్నైనా కమిషనుదారు అర్ధణా తక్కువ ఏడణాలదాకా తూగాడు.

షాహుకారు : తూగుతాడు; తూగుతాడు. తూలి పడేదాకా తూగుతూనే వుంటాడు. మిడిసిపడ్డవాళ్లని చాలామందిని చూశాలే. నాపై పోటీ కొచ్చి నాకు రావలసిన బేరం వీడు పడగొడతాడూ?

రైతు : ఆఁ! నే నిచ్చిందీ ఒక బేరమేనా? పెద్ద బేరమైతే పుచ్చుకున్నా పుచ్చుకున్న అందం.

షాహుకారు : పెద్దదో, చిన్నదో - బేర మన్నాక బేరమే. ఇవ్వాళేంతదాకా ధర పెట్టా డేమిటి?

రైతు : కానీ తక్కువ ఏడణాలు.

షాహుకారు : అలాగేఁ! అయితే, వాడు బస్తాకి 170 పౌనులు ఖచ్చితంగా తూసుకుంటాడు. ముక్కానీ, అణా పెచ్చిస్తున్నాడని నువ్వు ఎగిరి గంతేశావే కాని, నాలుగు పౌనులు ఎక్కువ తూసుకుంటాడని పారజూసుకున్నావ్?

రైతు : ఏమో, ఆ మాయ మర్మాలన్నీ నా కేం తెలుసు?

షాహుకారు : అయితే, నే నిప్పుడు తెలియ జెబుతున్నాగా. బేరం వదులుకున్నా నని వాడికి చెప్పెయ్.

రైతు : ఉహుఁ! వీల్లేదులే. చెయ్యి దాటి పోయింది. ఇంతకు ముందే వాడి దగ్గిర యిరవై రూపాయలు బయానా కూడా పుచ్చుకున్నా.

షాహుకారు (జేబులోకి చెయ్యి పోనిచ్చి డబ్బు తీస్తూ) : ఇదుగో! ఇరవై కాదు; నూట యిరవై బయానాగా నే నిస్తున్నా. వాడిచ్చింది వాడికి వాపసు చేశెయ్!

రైతు : మాటిచ్చాక, అంత తఫావత్తా? ఊళ్లో వాళ్లందరూ ముఖాన ఉమ్మెయ్యరూ?

షాహుకారు : అయితే, వాడి కిచ్చిన బేరం వదులుకోవన్న మాట?

రైతు : అది మర్యాదేనటయ్యా?

షాహుకారు : నీకే యింత పట్టుదల వుంటే నాకేనా లేంది? నువ్వూ, వాడూ కట్ట గట్టుకుని ఏ గంగలో కలిస్తే నాకు దేనికి కాని, నా నోటు బాకీ నాకు పూర్తిగా తీర్మానం చేసెయ్.

భార్య (పడమటింటిలో నుంచి వస్తూ షాహుకారుతో) : ఏ మన్నయ్యా! అంత కోపం చేసుకుంటున్నావ్?

షాహుకారు : కోపం లేదు; తాపం లేదు! నా కిప్పుడు పైకం అవసరంగా కావాలి.

రైతు : అంతా ఒబ్బు దఫాగా తెమ్మంటే, నే నెక్కడ తెస్తానయ్యా?

షాహుకారు : ఏఁ? మీ కమీష రున్నాడుగా?

భార్య : ఈ తడవకి అయిందేదో అయిపోయిందిలే. అన్నయ్యా! పైపంట నీకే తోల్తాంలే.

షాహుకారు : నా కేమీ తోలొద్దులే. నా బాకీ అసలు ఫాయిదాలు నాకు పారెయ్యండి. ? ?

భార్య : మరీ అంత నిక్కచ్చి చేస్తావేమిటేఁ, అన్నయ్యా

షాహుకారు : మీరు చెయ్యలా నిక్కచ్చి బేరం

రైతు : అయితే, నువ్వు ముందే అచ్చుకో లేదటయ్యా అప్పు వాయిదాల మీద తీర్చుకోవచ్చని?

భార్య : నిరుడు, ముందటేడు గింజలమ్ముకోగానే, అత్తార బత్తంగా నీకు డబ్బు తెచ్చివ్వలేదటేఁ అన్నయ్యా? మిగతాది కూడా నింపాదిగా తీర్చుకుంటాం! ఈ భాగ్యానికి మేము ఊరొదిలి పెట్టి పారిపోతామటే?

షాహుకారు(కాకగా): ఈ వాయిదాలు, గీయిదాలు నా కిఖ పనికిరావ్. నన్ను మీరు ఖాతరు చెయ్యనప్పుడు, నాకు మీ లావేమిటి?

రైతు : ఏఁ? ఏ యేటి వడ్డీ యేడే కచ్చితంగా పుచ్చుకుంటున్నా నొప్పేనా?

షాహుకారు : నీ వడ్డీ డబ్బుల కెవ్వడూ వాసిలేడు. రే పీపాటికి దస్తు తెస్తేనే తెచ్చావ్. లేకపోతే దావా పడేస్తా. తర్వాత నీ యిష్టం.

రైతు : కోర్టు కెక్కించాలని అంత ముచ్చటగా వుంటే యెక్కించవయ్యా!

షాహుకారు : ఒక్క కోర్టుకాదు; ఏటి కేడు పధ్నాలుగు కోర్టులూ తిప్పి, నీ అంతు కనుక్కోక పోతానూ? నీకు ఏ కమిషన్ దారు అడ్డుపడతాడో అదీ చూస్తాగా! (విసురుగా వెళ్ళిపోతాడు. ఒక క్షణంపాటు రైతు, భార్య నిశ్చేష్టులై వుంటారు.)

భార్య : ఆరి ఈడి సిరి మండ! ఎట్టాగైతేనేం పెట్టా డప్పు!

రైతు : త నడిగినకాడికి గింజలు పారబొయ్యలేదని వీడి కెంత గుర్తొచ్చింది. ఈ రెండు మూడేళ్ళనుంచీ, వీడి కేం పనొచ్చినా మనం హాజరుగా నిలబడ్డామనే యిశ్శోసమైనా వుందేమో చూడు?

భార్య : ఆడి దెవసం చేశారులే! మొన్న మాసూలులో పాడి గొడ్డుశుద్దా తోలుకు వెళ్ళి కుప్పలు తొక్కించుకో లేదూ? మాయదారికుమ్ము యిరగడై పోతుంది కాని, ఆడి డబ్బు ఆడి మొఖాన గిరగిర తిప్పికొట్టు. ఇం కెం తివ్వాలి? మా అయితే నూట యాభయ్యేగా

రైతు : కాదే! వాడి మడతవడ్డీలతో చేరి, రెండువందలదాకా దేకుతుంది. పంటమ్మిన దంతా వాడి యెదాన పెడితే, మిగతా చిల్లర మల్లర బాకీల మాటేమిటి?

భార్య : ఊఁ! అంతగా అయితే, పిల్లదాని చేతిగాజులు కుదవ బెట్టుకుందాంలే.

రైతు : దాని కింకొక వస్తువేదైనా యేర్పరచడం లేకపోగా, అవి కూడా కుదవబెట్టుకుని మొండిచేతుల్తో ఎలా నిలుపుతామే?

భార్య:ఆఁ, ఇబ్బం దొచ్చినప్పుడు మరేం చేస్తా వేమిటి? ఇప్పుడు అడ్డం వేసుకుని, అది అత్తారింటి కెళ్ళే నాటికి వొదిలించిద్దాం.

రైతు : సరే. ఏదో ఒకదారి చూద్దాంలే. వాడిది తాసుపాము పగ. మొత్తంబాకీ చెల్లుబెట్టకపోతే, వాడు కోర్టు కీడ్వక మానడు.

కొడుకు (ప్రవేశిస్తూ) : ఏమిటయ్యా? కోర్టేమిటి?

భార్య : అడి యెలుగు మండ! వా డడిగిన కాడికి గింజ లివ్వలేదని షాహుకారుకు పుస్సొచ్చింది. మొత్తం బాకీ యిప్పుడే కక్కమంటున్నాడు.

రైతు : రేపీపాటి కివ్వకపోతే దావా పడేస్తాట్ట.

భార్య : ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాట్ట! కొడుకు. ఎంత హజం!

రైతు : డబ్బును బట్టే హజం.

భార్య : నడమంత్రంగా ఈనా డొచ్చాయిలే వీడికి నాలుగు డబ్బులు. చెడి బతకబట్టే కిందూమీదూ కానడం లేదు.

కొడుకు : మరి ఇప్పుడేం చేస్తావే. అయ్యా?

రైతు : తల తాకట్టు పెట్టయినా వాడి బాకీ తీర్మానం చెయ్యాల్సిందేరా. కసి పట్టాడు. వాడిఖ నిలవడు.

కొడుకు : పీడ వొదుల్తుంది. వాడిది వాడికి పారెయ్యవే. మనకి ఎలాగైతే తనే అప్పెట్టాను గదా అని పెద్ద పాలేరులా నన్ను పనిలో నిలబెట్టుకుంటున్నాడు. తనింటి చాయల్లో కనబడితే చాలు బులావ్ అని, ఆ పనీ, ఈ పనీ పురమాయిస్తున్నాడు. ఊడిగం చెయ్యడానికి వీడు మనకి ఉచ్చితార్ధంగా యిచ్చాడేమిటి? అంతకంత పుచ్చుకోడూ?(ఆవేశంతో మాట్లాడుతుండగా పై పంచె చెంగున కట్టి వున్న మూట జారిపడుతుంది. దానిలోని (మువ్వలు గణగణ మ్రోగుతాయి.

భార్య : మువ్వ లెక్కడివిరా?

కొడుకు : కంచర లింగయ్య పొద్దు నొచ్చి, నడివీధిలో డేరావేశాడే, అమ్మా! సీతన్న కొనుక్కుంటూ వుంటే నేనూ మన యెడ్లకని సరదాపడి తెచ్చుకున్నా. సరే - ఇప్పు డేం చేస్తాం? వాప సిచ్చేస్తా. (మువ్వల మూట అందుకుంటాడు.)

రైతు : ఉఁచుకోరా, అబ్బాయ్! ఉఁచుకో! పద్దు రాసుకోమను. పైపంటనాటికి చెల్లిద్దాం.

కొడుకు : ఆఁ! వాడికి రొబ్ధం కావాలంటే, అరువిస్తే రెట్టికి రెట్టి కక్కాలట. పైపంటనాటికే కొనుక్కుంటాలే. ఇప్పుడొచ్చిన తొందరేమిటి? ?

రైతు : శిస్తు కట్టావట్రా?(వెళ్ళబోతాడు)

కొడుకు : ఆఁ! మర్చేపోయా? ఇదిగో రసీదు.

రైతు : ఎంత కట్టుకున్నారు?

కొడుకు : అణా తక్కువ యిరవై.

రైతు : అంతదాకా దేకించారూ?

కొడుకు : ఆహాఁ! పట్టాకి రూపాయికాడికి ఈ యేడు జమా బందీ మామూలు వసూలు చేస్తున్నారట! తిన్నకొద్దీ వాళ్ళకు ఆక లెక్కువౌతున్నది!

భార్య : తిననీ! ఇంకా తిననీ! ఇలా పీక్కు తిన్నాళ్ళు ముందుకు రారులే!

రైతు (కదలి వెడుతున్న కొడుకుతో) : ఆ కంచర లింగయ్యకి పైపంటనాటికే యివ్వొచ్చులే. అప్పటికి వా డడిగిందే పారేద్దాం. ఈ భాగ్యానికి మళ్ళీ వాపసు దేనికి? ఎవడు తినవలసింది వాడు తింటాడు. ఇంతతో వాడు బాగుపడతాడా? ఇంత కంటె మనం చెడిపోతామా?

కొడుకు : మువ్వలు లేకపోతే, ఇప్పుడు మన కొచ్చిన ముప్పేమిటి? తర్వాతే కొనుక్కుంటా. అప్పుచేసి పప్పుకూడు దేనికి? అప్పు పెట్టిన కాడినుంచీ అడ్డమైన వాడూ అములు చేస్తాడు.(వెళ్ళిపోతాడు.)

భార్య : పిచ్చి తండ్రి! మూడేళ్ళ నుంచి మువ్వలు మువ్వలని ముచ్చట పడుతుంటే, ఈనాటికైనా ఒకదారి లేకపాయె! తవ్వుకోవడం, పూడ్చుకోవడం - ఇదే సరిపోతున్నది.

రైతు : ఆ దేవుడు చల్లగా చూస్తే పై పంటతో మన చిక్కులన్నీ తీరిపోతాయి లేవే!

భార్య : దేవుడికేఁ! వాడు చల్లగానే చూస్తున్నాడు. మనుషులే పీక్కు తింటున్నారు!

రైతు : ఆఁ! మంచిరోజు ఎప్పటికైనా కనబడక పోతుందటే! అన్నట్టు, అబ్బాయి పుగాకు తేనే లేదు, మర్చిపోయాడుకాబోలు.

భార్య : తేకపోతే ఇప్పు డేమీ ముంచుకు పోలేదులే!

రైతు : నీదంతా మర్రతనం కాని, నే నడిగేది రోజుకు కానీ, అర్ధణా పుగాకే కాదటే?

భార్య : ఆ కానీ, అర్ధణా లేకేగా ఈ తిప్పలన్నీ! ఆ డబ్బులు పెడితే ఇంత కూరో నారో రాదూ? పూట పూటా పచ్చడి మెతుకులు దేనికి?

రైతు : సర్లే! చుట్ట కాల్చడం మానేస్తాను.

భార్య : మానాలని నీకు లేనప్పుడు నాకోసం మానెయ్యడ మెందుకు?

రైతు : అదేమైనాగాని, ఇఖ చుట్ట ముట్టను!

భార్య (చిరునవ్వుతో) : ఆఁ! ఈ మురిపె మెన్ని రోజులులే! కూడైనా లేకపోతే నువ్వుంటావు గాని, చుట్టముక్క లేకపోతే బతగ్గలవూ? కాల్చులే కాల్చు; కాని, కాస్త తగ్గించి కాల్చు. ఇంటికీ, వొంటికీ మంచిది. కూతురు(నల్లపూసల గొలుసుతో హుటాహుటిగా ప్రవేశిస్తూ): చూడవేఁ! అయ్యా! ఎంత నదరుగా వుందో!

రైతు (నీరసంగా) : ఔ నమ్మా! బాగానే వుంది.

కూతురు : ఈ బిళ్ళ చూడవే! కొట్టిస్తున్నట్టుగా లేదూ?

రైతు : ఔనమ్మా!

కూతురు (గొలుసు మెడలో పెట్టుకుంటూ) : అయ్యా! నా కిది బాగుందా?

రైతు (నీరసంగానే) : భేషుగ్గా వుంది.

కూతురు : బాగుండ లేదా యేమిటి? - గట్టిగా చెప్పడం లేదు

రైతు : బాగుండ కే మమ్మా? బాగానే వుంది.

కూతురు (అద్దం తెచ్చుకుని చూచుకుంటూ) : మరి కాస్త బారుండొద్దూ? లేకపోతే బిగు తనిపిస్తుందేమో?

భార్య : బిగుతూ, వొదులూ ఆ తర్వాత చూచుకోవచ్చులేవే.

కూతురు (తల్లి మాట వినిపించుకోకుండా) : ఇంకొక అంగుళమైనా వుండాలి. అయితే, అప్పుడు తీగ మరీ పల్చనై పోదూ? మరి పది చిన్నాలైనా పెట్టందే ఈ పాటి మందం రాదు.

భార్య : ఓపికుంటే ఎన్ని చిన్నాలైనా పెట్టుకోవచ్చు.

కూతురు : అయితే, నాకు తెల్లరాళ్ళొద్దు; ఎర్ర రాళ్ళు కావాలి.

భార్య : ఏ రాళ్లకైనా, ఇప్పుడు డబ్బేదమ్మా?

కూతురు : ఊఁ! నువ్వు చెప్పొచ్చావ్ లే మాలావ్. నాకు గొలు సొద్దుగాని, నీకు కొత్త కోకలు కావాలేఁ?

భార్య : ఈ యేటికి నా కిఖ కొత్త కోకలు కూడానా? జీరలో, బారలో ఆ పాతగుడ్డలే గతి.

రైతు (కూతురుతో) : ఇంత వెర్రిబాగులదాని వేమమ్మా? నీకు లేకుండా మీ అమ్మ తనకి కావాలంటుందా? నామాట విను. పై పంటనాటికి...

కూతురు : అయితే, ఇందాక నే నడిగితే...

రైతు : ఔను! ఈ పంటలోనే చేయిస్తా నన్నాగాని, షాహుకారు తొందరచేస్తున్నాడు - వాడి బాకీ నిలపడానికి వీల్లేదు.

భార్య : అది తీర్చినా ఇంకా లేవూ తలమోపి డప్పులు?

కూతురు (తండ్రితో) : అయితే, నాకు ఆశాశ ఎందుకు పెట్టావేమిటి?

రైతు : నాకుమాత్ర మేం తెలుసునమ్మా, వాడిప్పుడు గొంతుమీద కూర్చుంటాడని?. మా తల్లివి కాదూ? నామాట విను! తప్పకుండా పైపంటలో నీకు...

కూతురు : నా కేమీ వొద్దులే!

భార్య : దారి లేనప్పుడు మరి ఆయన మాత్రం ఏం చేస్తాడేఁ?

కూతురు : వాళ్ళంద రిప్పుడు నన్ను చూచి నవ్వుతారు. గొలుసు చేయించుకుంటున్నానని - సిగ్గుచేటు - అందరికీ చెప్పొచ్చా.

రైతు : లేదమ్మా! సత్తే ప్రమాణంగా నీకు పైపంటలో...

కూతురు : అన్నీ చేయిస్తావులే. నిరుడు మానానికి నిరుడిలాగే అనలా?(చేతిలోని అద్దం అక్కడ పారవేసి కోపంగా చర చర పడమటింటిలోకి వెళ్ళిపోతుంది. )

రైతు : పిచ్చిసన్నాసి! గంపెడాస పెట్టుకున్నదేమో చెడ కోపమొచ్చింది. ఏమైనా పై పంటనాటికైనా దానిముద్దు తీర్చాలి.

భార్య (నిట్టూరుస్తూ) : పైపంట... పై పంట... పై పంట... ఎక్కడి పైపంట? కళ్ళన్నీ దానిమీద పెట్టుకోవడమే కాని, అది నోటిదాకా వొస్తేనా? కాకులు, గద్దలు తన్నుకు పోయినట్టు చేతిలో దాన్ని చేతిలోనుంచే తన్నుకుపోతారయ్యె! పండించేవరకే పంట మనది.

రైతు : ఏమైనా, లేదనుకోగూడదే! రోగం రొష్ఠూ లేకుండా రెక్కాడుతూ వుంటే, బండిని ఎట్టాగో దొర్లించుకు పోలేకపోతామూ? (రైతు ఈ మాటలు అంటుండగా “ఎందుకైనా వుంచి నావూ బందిఖానాలో” అనిపాడుకుంటూ తలవాకిలిలోకి బిచ్చగాడు వస్తాడు. )

భార్య : చెయ్యి ఊరికే లేదు. పో! పో!

రైతు : దేహి అంటూ వాకిట్లోకి వచ్చినవాణ్ణి కసిరికొట్టగూడదే! ఏదీ! లే! బద్ధకించబోకు. నాలుగు గింజ లేసిరా!

భార్య : ఆడి కేం తీపరం? మొద్దులా వున్నాడు. కూలీ నాలీ చేసుకో లేడూ? అడుక్కోవడం దేనికి?

రైతు : అది వాడి ఖర్మ! దానికి మన మేం చేస్తాం? పిడికెడు బియ్యం పెట్టి పంపించు.

భార్య : డబ్బా సోలెడు బేడ కమ్ముతున్నారు. వచ్చినవాడికల్లా పిడికెడుకాడికి పెడితే, రోజుకు మానెడైనా చాలవ్.

రైతు : నోటితో లేదనడం దేనికి?- చేత్తో లేదను. ఈ కాస్తకే మనకు దరిద్రం రాదులే! పొట్టకు తిన్నది మిగలదు; నలుగురికి పెట్టిందే మిగిలేది. నామాట విను, లే! (బిచ్చగానితో) ఆగవోయ్! ఆగు! వొస్తున్నారు. (ఒక మూలుగు మూలిగి భార్య లేస్తుండగా - తెర)


ప్రారబ్ధం[మార్చు]

(విషాదాంత నాటిక)[మార్చు]

పాత్రలు: లక్ష్మయ్య : పల్లెటూరి రైతు, మాణిక్యమ్మ: అతని భార్య,కృష్ణమూర్తి : అతని కుమారుడు,కమల : అతని కుమార్తె, డాక్టర్, బండివాడు.

స్థలం : లక్ష్మయ్యగారి యింటి చావిడి

కాలం: వర్తమానం

లక్ష్మయ్య ఇంటి చావిడి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున పెరటి గుమ్మం. ఎదుటి గోడ నడుమ ఒక అలమర. దాని కుడిపక్క పడమటింటి గుమ్మం; ఎడమపక్క పడకగది గుమ్మం. గోడలకు శ్రీరాముడు, గోపాలకృష్ణుడు, తిరుపతి వెంకటేశ్వర్లు, లంకాదహనం మొదలైన పటాలు. పటంపైన దాని మేకుకే తగిలించి ఒక విసనకర్ర వేలాడుతూ వుంటుంది. చావడిలో ఒక మూల గడమంచి; దానిమీద తవుడు, ఉలవల బస్తాలు. తెర లేచేసరికి లక్ష్మయ్య చావడిమధ్య కూర్చుని వుంటాడు. అతని వయస్సు నలభై అయిదు పైన, యాభైలోపు. అయిదుంబావు అడుగుల మించని యెత్తు. స్థూలకాయుడు కాదుగాని, పొట్టినిబట్టి గుమ్మటంలా కనబడతాడు. చిన్న బొర్ర. జులపాల జుట్టు, వెనుకముడి. క్షురకర్మకు శుభముహూర్తం ఒక పట్టాన కుదరదు గనుక, సామాన్యంగా మాసిన గడ్డంతోనే వుంటాడు. నీర్కావి ధోవతి కట్టి, భుజం పైన తడి అంగవస్త్రం వేసుకుని వుంటాడు.


తెర లేచేసరికి అతడు పంగనామాలు పెట్టుకోవడం పూర్తిచేస్తూ వుంటాడు. అతని ముందు బొట్టు పెట్టె; నీళ్ళచెంబు. బొట్టు పెట్టె చుట్టూ అద్దం, నాముకట్టి, తిరుచూర్ణం కాయ, బొట్టుకణిక వగైరా.


లక్ష్మయ్య (కళ్లుమూసుకుని, చేతులు జోడించి) : పరమాత్మా! పరమపావనా! పరమకల్యాణ గుణాభరణా! పాపహరణా! పుండరీకవరదా! భక్తవత్సలా! భవబంధవిమోచనా! పుండరీకనయనా! భుజగేంద్రశయనా! కరుణాకరా! కామితార్థప్రదా! నందకుమారా! నవనీతచోరా! ఇందిరారమణా! ఇభరాజగమనా! సుందరాకారా! మందరోద్గారా! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! ఆదిమధ్యాంత రహితా! అప్రమేయా! ఆనందరూపా! అనాధరక్షకా! కవిలోకరంజనా! కాళింగగర్వభంజనా! సదానందా! సచ్చిదానందా! ముకుందా! గోవిందా! గజరాజవరదా! గరుడధ్వజా! దానవమర్ధనా! జనార్ధనా! ధర్మవర్ధనా! దీనజనశరణ్యా!

(మాణిక్యమ్మ గది గుమ్మంలోకి వస్తుంది.ఆమె వయస్సు నలభై ప్రాంతాల, అచ్చమైన, పల్లెటూరు ఇల్లాలు, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా పట్టలేదు.


మాణిక్యమ్మ (గది గుమ్మంలో నుంచి) : ఇంకా మీ జపతపాలు కానే లేదండీ?

లక్ష్మయ్య (వినిపించుకోకుండా) : గోవర్ధనోద్ధరణా! గోపికా వస్త్రాపహరణా! మునిజనవందితా!

ముచికుందవందితా! ముక్తి ప్రదాయకా! మురళీగానవినోదా! కనకమయవసనా! కంసవిధ్వంసనా! రాధామనోహరా! రాకేందువదనా! నీలమేఘశ్యామా! నిర్మలనామా!

మాణిక్యమ్మ (గదిగుమ్మంలో నుంచే) : మీకు పున్నెం వుంటుంది! ఇవ్వాళైనా కాస్త తొరగా తెములుద్దురూ!

లక్ష్మయ్య (బిగ్గరగా) : సర్వేశ్వరా! సర్వతోముఖా! సర్వలోక పూజితా! సత్యసంకల్పా! సత్యపరాయణా!

సత్యజనకా! సత్యనిలయా! సత్యాశ్రయా! సత్యనేత్రా! సత్యసంధా! సుజనప్రియా! శాంతస్వభావా!

మాణిక్యమ్మ (గుమ్మం దాటివచ్చి) : ఏమండీ! మిమ్మల్నే!

లక్ష్మయ్య : (మరింత బిగ్గరగా) అర్జునసఖా! అభిమానరహితా! పాండవపక్షా! ద్రౌపదీ మానసంరక్షకా! దేవకీనందనా! యశోదానందవర్ధనా! అనంతా! అచ్యుతా! అవాజ్మానసగోచరా! అమోఘశాసనా! నరకాంతకా!

మాణిక్యమ్మ (రెండడుగులు ముందుకువచ్చి) : అబ్బబ్బ! ఇక్కడ దీని ప్రాణంమీది కొస్తున్నా. మీ గోడు మీదే గదా!

లక్ష్మయ్య (కోపం సూచిస్తూ) : పరమేశ్వరా! నిర్గుణా! నిష్కళంకా! నిరుపద్రవా! నిరంజనా! నిరింద్రియా! నిర్వికల్పా! నిరాకారా! నిర్వికారా! పరమపురుషా!

మాణిక్యమ్మ (మరింత దగ్గరికి వచ్చి) : మీకు చెముడేమైనా వొచ్చిందా?

లక్ష్మయ్య (పొలికేకలు వేస్తున్నట్టు) : పరంజ్యోతి స్వరూపా! పరంధామా! పురుషోత్తమా! పుణ్యస్వరూపా!, పుణ్యనిలయా! పుణ్యభావనా! దేవదేవోత్తమా! దేవతాసార్వభౌమా!

మాణిక్యమ్మ (నెత్తికొట్టుకుంటూ) : నా ఖర్మిది!

లక్ష్మయ్య : స్వయంప్రకాశా! పరతత్వదీపా! పరిపూర్ణా! జ్ఞానప్రదా! యోగీశ్వరేశ్వరా! కుచేలవరదా! గుప్తవర్తనా! విశ్వనేత్రా! విమల చరిత్రా! హరేకృష్ణ! హరేకృష్ణ! పాహిమాం! పాహిమాం! పాహి! (ముమ్మారు నమస్కరించిన మీదట కళ్లు తెరచి) ఎందుకలా గొడ్డులా అరుస్తున్నావ్?

మాణిక్యమ్మ : గొడ్డులా అరిస్తేనే? కాకిలా గోలపెడితేనే? మీ తంతు మీరు మానారు గనుకనా? ఇలా ఒకసారొచ్చి అమ్మాయిని చూడండి. మరీ హైరాన పడుతున్నది.

లక్ష్మయ్య : ఇవ్వాళ అమావాస్యకదూ! మరెలా వుంటుంది? శేషాచార్యులుగారిచ్చిన ! మాత్రవెయ్యలా?

మాణిక్యమ్మ : ఏం మాత్రో - నా పిండాకూడు! అదేసిన కాడినుంచీ ఎగశాస ఎక్కువైంది. కా సెళ్ళి, డాక్టర్ గార్ని పిల్చుకొద్దురూ?

లక్ష్మయ్య : నడమంత్రంగా వెలిశాడులే. మనకొక డాక్టరు! మామానాడు ఈ డాక్టర్లే వైద్యాలు చేశారేమిటి?

మాణిక్యమ్మ : ఎడ్డెమంటే తెడ్డెం. మనకి మొదట్నుంచీ వున్నదేగా! - ఇవ్వాళ్ళ కొత్తేమిటి?

లక్ష్మయ్య : చాల్లే! ఇఖ కట్టి పెట్టు. డాక్టరట - డాక్టరు! ఆ బొడ్డూడని వాడికి తూర్పు పడమరలైనా తిన్నగా తెలుసా? సూటూ బూటూ వేసుకుని, మెడలో ఇంత బారు గొట్ట మొకటి తగిలించుకుని, బొట్లరు ముక్కలు నాలుగు మాట్లాడే సరికే పెద్ద వైద్యుడై పోతాడూ? దాని కెంత శాస్త్రం తెలియాలి! ఎంత అనుభవం వుండాలి! బుద్ధిలేని వాళ్ళందరు “డాక్టరు, డాక్ట”రంటూ వాడికోసం యెగబడు తున్నారని నే నెగబడతానా?

మాణిక్యమ్మ : అంతే లెండి! ఎప్పుడు మీరు నామాట సాగనిచ్చారు కాబట్టి, ఇప్పుడు సాగనిస్తారు? అబ్బా యొస్తే నాడైనా...

లక్ష్మయ్య : (అద్దాన్ని అంగవస్త్రంతో తుడిచి, బొట్టు పెట్టెలో పెడుతూ). వాడొచ్చి రోగాన్ని గిల్లేస్తా డేమిటి? ఎవరొచ్చినా చేసే దేమీ లేదు. ఎవరి ప్రారబ్దాన్ని ఎవరు తప్పిస్తారు?

మాణిక్యమ్మ : ఎప్పటి కప్పుడు ఈ మెట్ట యేదాంతమే నా కొంప తీస్తున్నది. ఈవిసురుగా గదిలోకి వెడుతుంది.

లక్ష్మయ్య (వెనకనుంచి) : చాల్లే నోరు ముయ్! (బొట్టు పెట్టె సర్దడం పూర్తి చేసి) కమలం ( క్షణం ఆగి బిగ్గరగా) కమలం! (ఇంకొక క్షణం ఆగి, మరింత బిగ్గరగా) కమలం!!

మాణిక్యమ్మ (గది గుమ్మంలోకి వచ్చి) : దేని కండీ అలా కేకలు? అది పెరట్లోకి వెళ్ళింది కామాలు! ఏం కావాలి?

లక్ష్మయ్య (కోపంగా) : ఏమీ వొద్దులే.

మాణిక్యమ్మ : మీకు పున్నెం వుంటుంది! కేకలూ, బొబ్బలూ సాలించండి. ఇక్కడిది తుళ్ళి పడుతున్నది. (మాణిక్యమ్మ గదిలోకి వెడుతుంది. లక్ష్మయ్య బొట్టు పెట్టె అలమరలో పెట్టి వెనక్కు తిరుగుతూవుండగా కృష్ణమూర్తి వస్తాడు. వయస్సు 25 సంవత్సరాలు. ఆకారంలో తండ్రిని, స్వభావంలో తల్లిని పోలినవాడు. బి.ఏ. ప్యాసై బస్తీలో వుద్యోగం చేస్తున్నాడు. సైను పంచె; కాలరు షర్టు, డబుల్ బ్రెస్ట్ కోటు.

కృష్ణమూర్తి : నాన్నా! అమ్మాయి కెలా వుంది?

లక్ష్మయ్య : అమావాస్య కదూ? కొంచెం బరువుగానే వుంది.

లక్ష్మయ్య : చూస్తూ చూస్తూ అమావాస్యపూ టొచ్చా వేమిరా? రేపో, మాపో రాకపోయావా?

కృష్ణమూర్తి : అమ్మాయి కెలా వుంది, నాన్నా?

మాణిక్యమ్మ (గదిలోనుంచి హుటా హుటిగా వచ్చి) : ఏం చెప్పను రా బాబూ! దాని మాట? మంటల జొరం, మూసిన కన్ను తెరవడం లేదు. ఏమి నొప్పో, ఎక్కడ నొప్పో?“ఆఁ! ఆ!” అన్న నోటికి యిసుగే లేదు. యమ తెర యెళ్ళబోస్తున్నది.

కృష్ణమూర్తి (తన సూట్ కేస్, హోల్డాల్ లోపలికి తెచ్చి పెట్టిన బండివానికి బాడుగ యిచ్చి పంపివేస్తూ): మరి డాక్టరుగా రేమన్నారు?

మాణిక్యమ్మ : అసలు ఆయన్ని పిల్చుకొస్తేగా?

కృష్ణమూర్తి : లక్షణంగానే వుంది. అయితే వైద్య మెవరు?

లక్ష్మయ్య : శేషాచార్యులుగారు మందు వాడుతున్నారు. ఆయన హస్తవాసి మంచిది.

కృష్ణమూర్తి : వాకిట్లో డాక్టరుంటే ఈ కూరగాయ వైద్యాలు దేనికి?(తల్లితో) జానకి ఎక్క డమ్మా?

మాణిక్యమ్మ : ఇదిగో రా, బాబూ! ఈ గదిలో,(మాణిక్యమ్మ గదిలోకి దారి తీస్తుంది. కృష్ణమూర్తి అనుసరిస్తాడు. బొట్టు పెట్టుకోడానికి తానుప యోగించిన నీళ్ళ చెంబును లక్ష్మయ్య అందుకోబోతూ వుండగా కమల ప్రవేశిస్తుంది... ఆ పిల్ల చురుకైనది. ప్రతి విషయాన్నీ ఇట్టే ఆకళింపు చేసుకోగలదు. కాని, తేలికగా బయట పడదు. అన్న అంటేనూ, అక్క అంటేనూ చాలా ప్రేమ. బాల్యం పూర్తిగా వెళ్ళని, యవ్వనం పూర్తిగారాని వయస్సు. తనకంటే పెద్దవారితో ఎక్కువ చనువుగానూ వుండలేదు; పూర్తిగా వైదొలగీ వుండలేదు.

కమల : నన్ను కేకేసినట్టున్నావ్, నాన్నా!

లక్ష్మయ్య : ఔనమ్మా!

కమల : దేనికి?

లక్ష్మయ్య : మరేమీ లేదులే... అన్నయ్య వొచ్చాడమ్మా!

కమల : ఏడీ? :

లక్ష్మయ్య : అదుగో! అక్కయ్యదగ్గ రున్నాడు.

కమల : వదినకూడా వచ్చిందా?


లక్ష్మయ్య : లేదమ్మా!

కమల : ఏమో?

లక్ష్మయ్య : రానూపోనూ రైలు ఖర్చులు దండగ. మీ వదినకూడా ఎందు కిప్పుడు?

కమల:వదిన్ని చూచి చాలారోజులైంది.వెంటపెట్టుకొస్తాడేమో ననుకున్నా. పోనీ, బేబీనైనా తీసుకొచ్చాడా?

లక్ష్మయ్య : ఆఁ! వాళ్ళమ్మని వొదలి పెట్టి అది వుంటుందా, పెడుతుందా? సరే గాని, కాస్త ఈ బొట్టునీళ్ళు తులిసికోటలో పోసిరా! (చెంబు అందిస్తాడు. దాన్ని అందుకొని కమల వెడుతుంది. )

కృష్ణమూర్తి (ముఖం చిట్లిస్తూ చావిడిలోకి వచ్చి) : అదేమిటమ్మా ఆ గది అంత చెడ్డకంపు కొడుతున్నది!

మాణిక్యమ్మ (వెనకనే వొస్తూ) : అక్కడికీ ముప్పొద్దులా సాంబ్రాడిపొ గేస్తూనే వున్నారా, బాబూ!

కృష్ణమూర్తి : దాన్ని చీకటి కొట్టులా చెయ్యకపోతే. కాస్త గాలీ వెలుతురూ రానివ్వరాదటమ్మా?

మాణిక్యమ్మ : మంటల జొరంతో వున్నదానికి చల్లటి గాలి తగిలే శీతలం కమ్ముకు రాదట్రా!

కృష్ణమూర్తి : నీకు తెలియదులే అమ్మా! మంచి వాళ్ళకైనా ఆ గబ్బుకు తప్పకుండా జబ్బు చేస్తుంది. అమ్మాయి పడక పెట్టి ఎన్ని రోజులైంది? (అన్నయ్యను చూచి పలకరించాలనే ఆపేక్షతో కమల వచ్చి పడమటింటి గుమ్మంలో నిలబడుతుంది.

మాణిక్యమ్మ : రేపటికి సరిగా వారం, మూసిన కన్ను తెరవకుండా పడున్న నా తల్లిని నాల్గురోజులనాడు జల్లబండెక్కించి, మీ బావ తగిలేశాడురా, బాబూ!

కృష్ణమూర్తి : వాడు మనిషా? పశువా?

లక్ష్మయ్య : వాడినని లాభమేమిటిలే? అది మన ప్రారబ్ధం.

మాణిక్యమ్మ : దిక్కూ మొక్కు లేకుండా ఎర్రటి ఎండని పడొచ్చిందేమో, రోగం నెత్తికెక్కి పోయిందిరా, బాబూ! ఇప్పుడు దానికి మన సోరకమే లేదు. మాతల్లి మాలోకంలో వుంది.

లక్ష్మయ్య : ఇంతకూ పెద్దమ్మ వచ్చి నెత్తిని కూర్చుంది!

కృష్ణమూర్తి (తల్లితో) : జానకి పిచ్చిమాట లాడుతున్నది ఎప్పటినుంచి?(తనను అన్నయ్య గమనించకపోవడాన్ని చూచి, ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని, కమల లోపలికి వెళ్ళిపోతుంది.

మాణిక్యమ్మ : మొన్నటి నుంచీరా, బాబూ! అదేమిటోకాని “నేనీ నింద మొయ్యలే” నంటూ ఒక్కటే పాట. కొట్టుకుని కొట్టుకుని కాసేపు కన్నుమూసినా అదే కలవరింత! ఏమి గాలో దూలోనని అక్కడికీ దిగదుడుపులూ, అవీ తీయిస్తూనే వున్నా. ఏడుకొండల వాడికి ముడుపుకూడా కట్టా. “ఈ గండ మెలాగైనా గడిపి, నా తల్లిని వొడ్డుని పడేశా వంటే నీకొండ కొచ్చి, నిలువు దోపి డిప్పిస్తా - వెంకటేశ్వర్లు తండ్రీ!” అని దణ్ణం పెట్టుకున్నా, మరి, ఆ సామి దయ ఎలా వుందో!

కృష్ణమూర్తి : ఇంత ఉధృతంగా వుందని ఆ వుత్తరంలో రాస్తే నిన్నే ఆఫీసుకు సెలవు పెట్టి వచ్చేవాణ్ణిగా!

లక్ష్మయ్య : నువ్వు ఆదుర్దాపడతావని రాయలేదులే. ఇంతకూ దాని రోజులు బాగా లేవు. ఎంత రాసిపెట్టి వుందో, అంతా అనుభవించి తీరాలి.

మాణిక్యమ్మ : డాక్టరుగార్ని పిలుచుకురమ్మని నేను మొన్నటి నుంచీ మొత్తుకుంటూ ఉఁటే మీనాన్న ఈ మెట్టయేదాంతమే...

లక్ష్మయ్య : అడుగో! ఆ మాట అనొద్దనే నీనోట గడ్డి పెట్టేది.

మాణిక్యమ్మ (కొడుకుతో) : చూశావా! బాబూ! ఇదీ వరస! నేను అటు దాని బాధ చూడలేక, ఇటు ఈయన కూతలు పడలేక చస్తున్నా నంటే నమ్ము.

కృష్ణమూర్తి : సర్లే! అమ్మా! నే వెళ్ళి డాక్టరుగార్ని పిలుచుకొస్తాగాని, నువ్వు ఆ గది కిటికీలు నే రెండూ తెరచి, సాంబ్రాణి పొగ వెయ్యి.

లక్ష్మయ్య : శేషాచార్యులుగారు తక్కువవాడట్రా? ఆయన తండ్రి వైద్యుడు; తాత వైద్యుడు; ముత్తాత వైద్యుడు; వాళ్ళది వైద్యులవంశం. వాళ్ళ యింటవున్న లేహ్యాలు, గుళికలు, రసభస్మాదులు సామాన్యమైనవట్రా? ఈ మధ్య నాకు కాళ్ళతీపు పుడితే, ఆయనిచ్చిన కూష్మాండలేహ్యం వెంటనే జవాబిచ్చింది.

కృష్ణమూర్తి : ఒకసారి డాక్టరుగార్ని పిలుచుకొచ్చి చూపించడం ఎందుకైనా మంచిది కాదూ, నాన్నా?

లక్షయ్య : ఆఁ! మరేమీ లేదట్రా! అసలు దానొ నిక్కాక వొళ్ళు. దానిమీద పైత్యం ప్రకోపించిందట. నాడి నిదానంలో ఆయన చాలా గట్టివాడు. క్షణంలో ఏ జబ్బునైనా ఇట్టే కనిపెడుతాడు. మందు నడిపించడంలో ఆయన్ని మించిన వాడు లేడు. డాక్టరు వచ్చిన కాడినుంచీ సూదులనీ, సీసాలనీ ఎంత తతంగం చేస్తారు! ఎంతడబ్బు గుంజుతారు! పిలుచుకు రాగానే సరేనా? ఇంతకూ రోగమైనా, నొప్పైనా దాని రోజొచ్చినప్పుడు తిరుగుతుంది కాని...

మాణిక్యమ్మ : మళ్ళీ మొదలు.

లక్ష్మయ్య : ఏమిటది?

మాణిక్యమ్మ : నానోట చెప్పించడం దేనికి? మీకు తెలవదూ?

లక్ష్మయ్య : అదుగో! ఆ కూత కుయ్యవద్దనే నీకు బుద్ధి చెప్పేది.

మాణిక్యమ్మ : చూశా వట్రా! ఇప్పుడు నే నేమన్నానని? సర్లే - ఇది నాకు రోజూ వుండే బాగోతమేకాని, నువ్వెళ్ళి డాక్టరుగార్ని పిలుచుకురా! ఇక్కడున్నట్టుగా రావాలి, బాబూ!

కృష్ణమూర్తి : మంచిదమ్మా!(వెడతాడు.)

లక్ష్మయ్య (గింజుకుంటూ) : మనం దొరలమా? దొరసానులమా? ఇంగ్లీషు వైద్యాలు మనకు దేనికి? అసలు ఆ పాడుమందులు మనకి పట్టివ్వవు. ( క్షణం ఆగి) ఇంతకూ పిదప కాలం వచ్చి పడింది. మన మందులూ, మన వైద్యాలూ, మన ఆచారాలూ, మన కట్టుబాట్లూ - ఏవీ పనికి రావడం లేదు. (గోడనున్న విసనకర్ర తీసి విసురుకుంటూ) పెద్ద లన్నారుగా “కొత్తొక వింత, పాతొక రోత” అని. మంచీ చెడ్డా లేదు. కొత్త కనబడితే చాలు - వేలంవెర్రిగా యెగబడ్డమే! మన మతం, మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఇప్పుడు పుట్టాయా? - భూమి పుట్టినప్పుడే పుట్టాయి కాని! (లక్ష్మయ్య ఈ మాటలు అంటూవుండగా మాణిక్యమ్మ ముక్కూ మూతీ విరిచి గదిలోకి వెళ్ళి, కిటికీ తలుపులు తెరచి, మళ్ళీ చావడిలోకి వస్తుంది.

లక్ష్మయ్య (ఇంకా గుణుస్తూ) : అయినా, మనిషికి రాక మానుకొస్తుందా? రాత బాగుండక రోగం రొష్టూ వస్తే పూర్వం రెండు లంఖణాలు కట్టించేవారు. దాంతో ఎంత జబ్బయినా యెగిరిపోయేది. ఇప్పు డేముంది? ముక్కున పడిశం పట్టినా డాక్టర్లు గీక్టర్లు కట్టకట్టుకు రావాల్సిందే! అంత కంత గుంజడానికి వాళ్ళసలు రోగాన్ని యెక్కదోస్తారు.

మాణిక్యమ్మ (పడమటింటి గుమ్మం వద్దకు వెళ్ళి) : కమలం! కాస్త తేవే (“నీ మెట్టవేదాంతం మండిపోను” అన్నట్టుగా మాణిక్యమ్మ చాటుగా మెటికలు విరుస్తుంది. )

లక్ష్మయ్య : ఆయువు గట్టిదైతే మునిగే తెప్పైనా తేలుంది. మాయలో పడి, మందులనీ, మాకులనీ మన దేవులాటేకాని, లలాట లిఖితం తప్పదు. . (విసనకర్ర మళ్ళీ పటంమేకుకు తగిలించి, అలమరలో నుంచి నల్లమందు డబ్బీ తీసి, మాత్ర కట్టుకుంటూ వుంటాడు.)

కమల (గరిటెతో నిప్పు తెచ్చి) : ఇదుగోనమ్మా! నిప్పు!

మాణిక్యమ్మ : ఇలా తే, తల్లీ! (నిప్పుగరిటె అందుకుని) ఇంకా నీవంట తెమల్లే దమ్మా?

కమల : అన్నయ్య కోసమని ఇంకొక కూర చేస్తున్నానమ్మా!

మాణిక్యమ్మ : బండెడు చాకిరి పైబడి, ఇప్పటికే హూనం హూనమౌతున్నావ్. నువ్వు చెయ్యలేదని మీ అన్నయ్య అనుకుంటాడా? దేని కమ్మా. ఇప్పుడు కూరలూ నారలూ?

కమల : ఆఁ! మరేమీ లేదే! వంకాయవేపుడు వేస్తున్నా. చిటికలో అయిపోతుంది.(మాణిక్యమ్మ గదిలోకి వెడుతుంది. )

లక్ష్మయ్య(కమలతో):నాకు నల్లమందు వేళ మించిపోతున్నది. రెండు మెతుకులు వడ్డిస్తావమ్మా?

కమల : అలాగే, నాన్నా! కాళ్ళు కడుక్కురా!(కమల పడమటింటిలోకి వెడుతుంది.)

లక్ష్మయ్య (నల్లమందు డబ్బీని అలమరలో పెట్టి, కట్టినమాత్ర వేసుకుని) : హరేకృష్ణ! హరేకృష్ణ! పాహిమాం పాహిమాం పాహి!(పడమటింటిలోకి వెళ్ళబోతాడు.)

మాణిక్యమ్మ : (గదిలో నుంచి వచ్చి) కాస్త ఆగుదురూ! భోజనానికి అంత తొందరేమిటి? (తలవాకిలివైపు చూచి) అదుగో! డాక్టరుగా రొస్తున్నారు.

లక్ష్మయ్య : ఉహూఁ! తయారవుతున్నాడూ?(గదిలోకి వెడుతుంది. డాక్టరు, కృష్ణమూర్తి గదిలోకి వెడతారు.లక్ష్మయ్య ధుమధుమ లాడుతున్న ముఖంతో చావడిలో పచారు చేస్తుంటాడు.)

కృష్ణ మూర్తి (గదిలోనుంచి తిరిగి వచ్చి, పడమటింటి గుమ్మం వద్దకు వెళ్ళి) : కమలా! గ్లాసుతో కాసిని నీళ్ళు తీసుకురా! ( క్షణం ఆగి) త్వరగా రా!

కమల (లోపలనుంచి) : వచ్చే! అన్నయ్యా! వచ్చే!

కృష్ణమూర్తి : (ఇంకొక క్షణం తర్వాత, కొంచెం విసుగ్గా) త్వరగా తెమ్మని నీక్కాదూ... (అతని మాట పూర్తికాక ముందే కమల నీళ్ళ గ్లాసుతో వస్తుంది. దాన్ని అందుకుని కృష్ణమూర్తి గదిలోకి వెడతాడు. కమల గదిగుమ్మం వద్దకు వెళ్ళి, వోరగా నిలబడి లోపలికి చూస్తూ వుంటుంది.

కృష్ణమూర్తి (గదిగుమ్మంలోకి వచ్చి కమలతో) : డాక్టరుగారు చేతులు కడుక్కోడానికి పెరటిగుమ్మంలో చెంబుతో నీళ్ళూ, సబ్బూ పెట్టు; తువాలుకూడా తే!

కమల (చెడుతూ) : అలాగే నన్నయ్యా! (కృష్ణమూర్తి తిరిగి గదిలోకి వెడతాడు. కమల పెరటిగుమ్మంలో నీళ్లు పెట్టి, వెనక్కి వస్తూవుండగా, గదిలో నుంచి డాక్టరు బయటికి వస్తాడు. అతని చూడగానే ఆ పిల్ల చప్పున పడమటింటిలోకి తప్పుకుంటుంది. డాక్టరు వెంటరాగా కృష్ణమూర్తి పెరటిలోకి దారితీస్తాడు.

కమల (పడమటింటి గుమ్మంలోకి వచ్చి) : అన్నయ్యా! ఇదుగో తువాలు.(కృష్ణమూర్తి దాన్ని అందుకుని, చేతులు కడుక్కుని వస్తున్న డాక్టరుకు అందిస్తాడు.)

డాక్టరు (చేతులు తుడుచుకుని తువాలు తిరిగి యిచ్చివేస్తూ) : నా బ్యాగ్...(గదివైపుకు ఒక అడుగు వేస్తాడు.)

కృష్ణమూర్తి : నే తెస్తా నుండండి. (కృష్ణమూర్తి గదిలోనుంచి లక్ష్మయ్య (డాక్టరు గడప దాటినంతనే) : రావడమైంది; పోవడమైంది. కాసేపు కూర్చోడం, మంచి చెడ్డా మాట్లాడ్డం - ఏమీ లేదు. పలుకే బంగారం! ఈ భాగ్యానికే డాక్టర్లూ గీక్టర్లూ అని పడి ఛస్తారు. (మెడిసిన్ ఛెస్ట్ తెచ్చి, డాక్టరు ముందు నడవగా ఆయన వెంట వెడతాడు.)

కమల (పడమటింటి గుమ్మంలోనుంచి) : నాన్నా! మరి, అన్నాని కొస్తావా?

లక్ష్మయ్య : (వినిపించుకోకుండా) శేషాచార్యులుగారు వస్తే, కష్టసుఖాలు మాట్లాడుతూ పక్కా గంట కూర్చుంటారు. ఆయన మాట, ఆయన మర్యాద, ఆయన మన్నన - ఈ రాలుగాయలు వొంటి కాలిమీద తపస్సు చేస్తే మాత్రం వొస్తాయా?

కమల : నిన్నే నాన్నా! అన్నం వడ్డించమంటావా?

లక్ష్మయ్య:మించిన వేళ మించనే మించింది-అన్నయ్యని రానీ ఇన్నిసార్లు వడ్డన దేనికి?కలిసే భోంచేస్తాం.

మాణిక్యమ్మ : (గదిలోనుంచి వచ్చి) ఇంకా వాడి స్తానం పానం కాలేదు. వాడికోసం మీరు కనిపెట్టుకు కూచోడం దేనికి? మీకు పెట్టి, చిన్నమ్మాయి కూడా రెండు మెతుకులు తింటుంది.మిట్టమజ్ఞాన్నం దాకా అది మాడ్డం దేనికి?

కమల : అc! నా కేం, తొందర? అన్నయ్యని రానివ్వవే!

మాణిక్యమ్మ : మందు తేవాలి కదమ్మా! ఆలిసిమౌతుందేమో?

లక్ష్మయ్య : రంగు నీళ్ళే కదూ సీసాలో పోసివ్వడానికి ఏమంత ఆలస్య మౌతుంది?

మాణిక్యమ్మ : చాల్లెండి! ఎవరైనా వింటే నవ్విపోతారు.

లక్ష్మయ్య : నే నీ యిల్లు కట్టి పాతికేళ్ళయింది. ఎన్నడైనా, ఏ డాక్టరైనా నా గడప తొక్కాడా? ఇవ్వాళ నువ్వూ, నీ కొడుకూ చేరి, వాణ్ణి రప్పించారు. డాక్టరు అడుగు పెట్టిన కొంప ఏది నీ ముందు కొచ్చింది? కదిలితే బిల్లు, మెదిలితే బిల్లు - వాడు రేపటినుంచీ యిల్లు గుల్ల చెయ్యడూ? ఏ తృణమో, పణమో, మనకు తోచింది చేతిలో పెట్టినా, శేషాచార్యులుగారైతే కళ్ళ కద్దు కుంటారు. మొన్న నాకు మూడు నెలలు మందిస్తే, నేనే మిచ్చాను? పొలంలో పండిన మినుములు మూడు కుంచాలు కొలిస్తే ఆయన బ్రహ్మానంద పడ్డాడు. ఈ డాక్టరుగాళ్లు బిళ్ళ కుడుముల లాంటి రూపాయలు బల్ల మీద పెడితే తప్ప పలకరు, ఉలకరు.

మాణిక్యమ్మ : ఆప దొచ్చినప్పుడు కూడా అణా పైసల లెఖ్ఖ లేనా? అది బతికి బయటపడితే, నా కదే పది వేలు. వెధవ డబ్బు - డబ్బేం చేసును?

లక్ష్మయ్య : కా నివ్వండి, కా నివ్వండి! చిప్ప పుచ్చుకుని అడుక్కు తిందురు గాని లెండి! చూడగా మీ కది రాసి పెట్టినట్టే వుంది. ఎవరి గీత నెవరు తప్పిస్తారు.

మాణిక్యమ్మ : మళ్ళీ మొదలు.

లక్ష్మయ : ఏమిటది?

మాణిక్యమ్మ : ఏమిటా? నా పిండాకూడు.

కృష్ణమూర్తి తిరిగివస్తూ) : ఏమిటమ్మా అది?

మాణిక్యమ్మ : మందు తెచ్చావా, బాబూ?

కృష్ణమూర్తి : ఆఁ!

లక్ష్మయ్య : మీ డాక్టరుగా రేమన్నారురా?

కృష్ణమూర్తి (కోపంగా లక్ష్మయ్యతో) : ఆఁ! ఏ మంటారు? (అనునయిస్తూ మాణిక్యమ్మతో) సరిగాని, ఏమిటమ్మా నీ అవతారం! ముందు నువ్వు పడకపెట్టేలా వున్నావ్. వెళ్ళి స్నానమైనా చేసిరా. నే నమ్మాయిని చూస్తూ వుంటా.

మాణిక్యమ్మ : ఆఁ! నా కేమి తీపరంలేరా?

కమల : నిన్నటినుంచీ అమ్మ నోట్లో పచ్చి నీళ్ళయినా పోసుకోలే దన్నయ్యా!

కృష్ణమూర్తి : ఏమిటమ్మా అది! నువ్వు మూలబడితే, ఇఖ జానకి ఆలనా పాలనా ఎవరు కనుక్కుంటారు?

మాణిక్యమ్మ : ఏం చెప్పనురా, బాబూ! నా మతి మతిలో లేదు. సరే! ఆ మందిలా తే! తాగిస్తా. మంచి నీళ్ళైనా తిన్నగా గుటక పడ్డం లేదు. ఏం తాగుతుందో!

కృష్ణమూర్తి : ఇదుగో నమ్మా! ఈ గీతవరకు గాజు గ్లాసులో పో సివ్వు. ఇవిగో! ఇవి ఆరు పొట్లాలు.అరు కిచ్చిన అర గంట కొక పొట్లం చొప్పున నీళ్ళతో వెయ్యాలి. (కృష్ణమూర్తి చేతిలోనుంచి మందుసీసాను, పొట్లాలు తీసుకుని మాణిక్యమ్మ గదిలోకి వెడుతుంది.

లక్ష్మయ్య (రెండు మూడుసార్లు పొడిదగ్గు దగ్గి) : డాక్ట రేమి చెప్పా డేమిరా?

కృష్ణమూర్తి : కాస్త నిదానించండి - మనవి చేస్తాగా?(ఒక నిమిషం నిశ్శబ్దం.)

లక్ష్మయ్య : పొద్దున్నే శేషాచార్యులు గా రొకసారి చెయ్యి చూచి వెళ్ళారు. నాడి కొంచెం దూకుడుగా వుంది కాని, భయ మేమీ లేదన్నారు. ఇవ్వాళ అమావాస్య. దాని విసురు ఇంతో, అంతో కనబడకుండా వుంటుందా?” అన్నాడు. ఇవ్వాళొక్క రోజూ గడిస్తే రేపటికి జబ్బు తిరుగుముఖం పడుతుందన్నారు. దేనికైనా గ్రహబలం బాగుండాలి.

మాణిక్యమ్మ (గదిలోనుంచి వస్తూ) : మందు తిన్నగా తాగలేదురా. బాబూ! సగానికి సగం కిందే పోయింది.

కృష్ణమూర్తి : ఫరవా లేదులే. నువ్వు వెళ్ళమ్మా! వెళ్ళి, స్నానం చేసిరా.

మాణిక్యమ్మ : దాన్ని ఒక కంట కనిపెట్టి చూస్తూవుండరా, బాబూ!(పడమటింటి గుమ్మంగుండా లోపలికి వెడుతుంది.

కృష్ణమూర్తి:(బెదరినలేడివలె చూస్తూ నిలుచున్న కమలతో):కమలా! అమ్మకు నీలూ పాలూ చూడరాదూ!

లక్ష్మయ్య : ఏ మన్నా రేమిరా డాక్టరుగారు?

లక్ష్మయ్య : ఆఁ! అది పైత్య ప్రకోప మటరా? !(కమల వెళ్ళిపోతుంది.

కృష్ణమూర్తి : ఏ మన్నారా? రోగం ముదిరి పోయిందన్నారు! మరి ఏ క్షణానికేమి జరుగుతుందో చెప్పలే మన్నారు!

లక్ష్మయ్య : ఆఁ! డబ్బు గుంజడానికి వాళ్ళు అలాగే అంటారులే!

కృష్ణమూర్తి : పాడు డబ్బు ముఖం చూచుకునే దాని ప్రాణం మీదికి తెచ్చావ్.

లక్ష్మయ్య : డబ్బు డబ్బంటారు - డబ్బు విరజిమ్మితే పోయే ప్రాణాలు నిలుస్తాయటరా? మొన్న మన చంద్రయ్య పెళ్ళాన్ని పట్నం దాకా తీసు కెళ్ళి అయిదారు వందలు వ్యయం చేశాడు. మరి అది బతకలేదే? కాలం,ఖర్మం కలిసొస్తే డాక్టర్లు ఆపగలరా? సర్లే - ఇంతకూ జబ్బేమి టంటాడు?

కృష్ణమూర్తి (బరువుగా) : అది టైఫాయిడ్ జ్వరమట. డబుల్ నిమోనియాతో ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయట. ముందే ఆయన్ని పిలుచు కొస్తే, ఇంత ముంచు కొచ్చేది కాదు. నువ్వే చేతులారా దాని బ్రతుకు బుగ్గిచేశావ్!

లక్ష్మయ్య : ఆఁ! ఒకరు చేసిందే ముంది? ఎవరి కెలా రాసి పెట్టివుంటే అలాగే జరుగుతుంది.

కృష్ణమూర్తి : చాల్ చాలు! ఈ వెర్రి మొర్రి వేదాంతంతోనే జానకి గొంతుకోశావ్! దాని వొళ్ళంతా పుచ్చిపోయింది. ఎందుకో తెలుసా?

కృష్ణమూర్తి : దానికి కాదు; మనకు

లక్ష్మయ్య : అయితే, అది ఏమి టంటావ్?

కృష్ణమూర్తి : ఏమిటా? నీ మేనల్లుడు అచ్చోసిన ఆబోతని నీకు తెలవదూ? వాడి వొళ్ళంతా కుళ్ళిందని నీకు తెలవదూ? నేను ఆనాడే అన్నా “ఈ పాడు సంబంధం మనకు వద్దు మొర్రో” అని! నామాట విన్నావా? తోబుట్టువు ఇంటికొచ్చి అడుగుతున్నదనీ, తక్కువ కట్నంతో సరి పెట్టొచ్చుననీ బంగారంవంటి పిల్లని ఆ పోకిరీ వెధవ కిచ్చి ముడి పెట్టావ్.

లక్ష్మయ్య : చిన్నతనంలో అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళయినా, ఒక ఇంటివాళ్ళయినాక లక్షణంగా బ్రతకరట్రా? నారాయణ రావైనా అంతే ననుకున్నా. అయినా, మన చేతిలో ఏమున్నది? అదంతా పూర్వజన్మ కర్మానుభవం.

కృష్ణమూర్తి : మన చేతులతో మనం గొంతు కొయ్యడం; అది వాళ్ళ పూర్వజన్మ కర్మానుభవ మనడం. ఎంత చక్కని సూత్రం కని పెట్టారు! వాడు చదువు సంధ్యలు లేనివాడని నీకు తెలుసు. గుణం లేనివాడని నీకు తెలుసు. అయినా, వాడి ఆస్తిని చూచి, వాడికి పిల్లనిచ్చి కడితే, ఆ తప్పు నీది కాదూ?

లక్ష్మయ్య : ఆఁ! ఎవరి గీతలో ఎలా వుంటే అలా జరుగుతుంది. మనం కేవలం నిమిత్త మాత్రులం.

కృష్ణమూర్తి : చేతులారా చేసిన పనికి చింతించేది పోయి, “దాని గీత”, “దాని ఖర్మ” అనడానికి నీకు నో రెలా వొస్తున్నది,నాన్నా? వివాహ మనుకున్న తర్వాత జానకి ముఖంలో ఎన్నడైనా కళా కాంతీ చూశావా? ఈ అయిదారేళ్ళ నుంచీ అది చేసింది సంసారమా? నరకంలో నివాసం కదూ?

లక్ష్మయ్య : ఆఁ! కలిగినవాడి కిస్తే, సుఖ పడుతుం దనుకొన్నా గాని, ఇలా జరుగుతుందని నే నేమైనా కల గన్నానా? ఇంతకూ అది తిన బుట్ట లేదు.

కృష్ణమూర్తి : సుఖ పెట్టగోరిన వాడివైతే దాన్ని వాడి కిచ్చి కట్టే వాడివా? పోనీ, కట్టింతర్వాత, వాడి కట్న మేదో వాడికి పారెయ్యక, లేనిపోని పేచీలకు దిగేవాడివా? వాడు మన జానకిని మరింత వేపుకు తినడానికి, “ఇంకొక పెళ్లి చేసుకుంటా!” నంటూ దాన్ని రాచి రంపాన పెట్టడానికి నువ్వే కారణం కాదూ?

లక్ష్మయ్య : అంతా బ్రహ్మలిఖితం కాని, అదంటే నాకు పగటరా?

కృష్ణమూర్తి : ఆఁ! నేను వాడి మాట మర్చేపోయా! మన పాపాలన్నీ అంటగట్టడానికి వాడొక డున్నాడు! మంచి జరిగితే అది మన ప్రజ్ఞ; చెడు జరిగితే అది బ్రహ్మరాత.

మాణిక్యమ్మ (జుట్టు వేలుముడి వేసుకుంటూ, చావడిలోకి తిరిగివచ్చి): బాబూ! అమ్మాయి కెలా వుందిరా?

కృష్ణమూర్తి : కొంచెం తగ్గే వున్నట్టున్న దమ్మా?

మాణిక్యమ్మ : నువ్వెళ్ళి స్తానం చెయ్యి, బాబూ! నేను దాన్ని చూస్తూవుంటా!

కృష్ణమూర్తి : చేస్తాలే, అమ్మా! అంత తొంద రేమిటి?

మాణిక్యమ్మ : పొద్దెక్కి పోలేదట్రా! నీ కోసం మీ నాన్నా, కమలమూ కనిపెట్టుకు కూర్చున్నారు. కృష్ణమూర్తి : నా కోసం కనిపెట్టుకు కూర్చోవడం దేనికి? ముందు నీ భోజనం కానివ్వు, నాన్నా! నేను తర్వాత చేస్తాలే.

మాణిక్యమ్మ : దూరాబారం పయానం! నిన్నెప్పుడు బోంచేశావో, ఏమో? స్తానం చేసి, కాస్తా ఎంగిలి పడరా, బాబూ!

కృష్ణమూర్తి : ఆఁ! సర్లే, అమ్మా!

మాణిక్యమ్మ : ప్రాణం కడబడుతుందేమోరా, బాబూ!(ఈమాట అంటూ గదిలోకి వెడుతుంది.

లక్ష్మయ్య (అర నిమిషం తర్వాత, ముందు పొడిదగ్గు దగ్గి) : ఏమోరా? డాక్టరు మా టంటే, నా కేమంత నమ్మకం...

కృష్ణమూర్తి : నీ కొక నమస్కారం. ఆ ప్రస్తావన తేవొద్దు. అమ్మ వింటే ఆవిడ గుండె బేజారౌతుంది.

లక్ష్మయ్య : సర్లే! కానున్నది కాకమానదు. (కళ్ళు మూసుకుని) హరేకృష్ణ! హరేకృష్ణ!పాహిమాం! పాహిమాం! పాహి! ?

కమల : ఆలస్య మున్నదంటే, పోనీ వేన్నీళ్ళు పెడతా నన్నయ్యా!

కృష్ణమూర్తి : ఎందుకమ్మా? ఈ యెండలో వేన్నీళ్ళు?

కమల : వేన్నీళ్ళ స్నానం చేస్తే, ప్రయాణం బడలిక తీరుతుందన్నయ్యా!

కృష్ణమూర్తి : అబ్బే వద్దు! చన్నీళ్ళే చాలు.

కమల (పడమటింటిలో నుంచి వచ్చి) : అన్నయ్యా! నీకు నీళ్ళు తోడనా?

కృష్ణమూర్తి : కొంచె మాగు - తోడుదువుగానిలే!

కమల : అన్నయ్యకు ఆలస్య మున్నదట, పోనీ, నువ్వైనా భోజనానికి రా, నాన్నా!

లక్ష్మయ్య : వేళ మించిపోయి, ఆకలి చచ్చిపోయిందమ్మా! ఇఖ ఎప్పుడైతే నేమిటి? నేనూ తర్వాతే భోం చేస్తాలే!(నీరసంగా కమల పడమటింటిలోకి వెళ్ళిపోతుంది.

లక్ష్మయ్య (కృష్ణమూర్తితో) : ఏదీ - ఇలా దగ్గరికి రా! (కృష్ణమూర్తి దగ్గరికి వస్తాడు). ఈ డాక్టర్లని, దీక్టర్లని నమ్మిం దెవరు గాని, ఆ శేషాచార్యులుగార్ని మళ్ళీ ఒకసారి పిలుచుకొచ్చి...

కృష్ణమూర్తి : చాలు! ఆయ నింతవరకు చేసిన వైద్యం చాలే!

లక్ష్మయ్య : అది కాదురా! ఆయన్ని మళ్ళీ సంప్రతిస్తే...(అయ్యొ! నా తల్లీ!” అని గదిలో మాణిక్యమ్మ రొమ్ము గుద్దుకుంటున్న చప్పుడు.ఏమిటే, అది?

లక్ష్మయ్య, కృష్ణమూర్తి (ఒకేసారిగా) ఏమిటమ్మా!

మాణిక్యమ్మ (గదిలోనుంచి వస్తూ) : అయ్యె నా తల్లీ! అయ్యొ మా అమ్మా!

లక్ష్మయ్య : కృష్ణమూర్తి : ఒకేసారిగా ఏమే, ఏమిటి? ఏమమ్మా! ఏ మమ్మా!!

మాణిక్యమ్మ (ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, నెత్తి, నోరూ కొట్టుకుంటూ): ఇఖ నే బతికి దేనికి? చచ్చి దేనికి? ఆ పాడుదేవుడు న న్నెత్తుకు పోరాదూ! (మాణిక్యమ్మ ఇలా విలపిస్తూవుండగా లక్ష్మయ్య, కృష్ణమూర్తి గబగబ గదిలోకి వెడతారు.

మాణిక్యమ్మ : అయ్యో! అయ్యొ! నే నేం పాపం చేశాను! నే నేం పాపం చేశాను!! అయ్యో నా తల్లీ! అయ్యొ మా అమ్మా!

లక్ష్మయ్య (గదిలోనుంచి కోపంగా వచ్చి) : నీ కేమైనా పోయే కాలం వచ్చిందా? దేనికే అలా యేడుస్తావ్?

మాణిక్యమ్మ : దేనికా? నా దెవసానికి?

లక్ష్మయ్య : సర్లే - నీ వెధవ వేషా లిఖ కట్టి పెట్టు. ఇందాకటి కంటె ఇప్పుడది తేటగా వుంటే ఈ ఏడ్పు లేమిటి? పెడబొబ్బ లేమిటి? కొంపకు కీడు చుట్టుకోడానికా?

మాణిక్యమ్మ : మా తల్లి గొంతు నువ్వే కోశావ్. మా అమ్మని నువ్వే గంగలో దించావ్. నీ మెట్ట యేదాంతం మండిపోను!

లక్ష్మయ్య : ఛీ! నోరుముయ్! ఎవరి కర్మ కెవరు కర్తలు!

కృష్ణమూర్తి (గదిలోనుంచి వచ్చి) : ఏమిటమ్మా నీ గోల? మరేమోనని నేను ఖంగారు పడ్డా.

మాణిక్యమ్మ : ఏం చెప్పను రా, బాబూ! నా తల్లికి ఎంత కష్టమొచ్చింది! ఎంత కష్ట మొచ్చింది! అయ్యో! అయ్యో!!

కృష్ణమూర్తి : అసలు విషయ మేమిటమ్మా!

మాణిక్యమ్మ : "ఈ నింద మొయ్యలేను! ఈ నింద మొయ్యలేను!!” అంటూ మా అమ్మ ఆవజాన పలవరిస్తూ వుంటే నే నేమిటో ననుకున్నా. ఆ మాట పడ్డాకే అది మంచ మెక్కింది కామోసు!

కృష్ణమూర్తి : ఏమిటమ్మా, నీ గొడవ? మాటేమిటి? నిందేమిటి?

మాణిక్యమ్మ : నా నోటితో నే నెలా చెప్పనురా, బాబూ? మీ బావ - అయ్యో! అయ్యో! దాన్ని పట్టుకుని, నువ్వే - అవ్వ! ఎక్కడ సంపాయించావో - వాడి దగ్గరికే పో అన్నాట్ట! స్కౌండ్రల్!

కృష్ణమూర్తి, లక్ష్మయ్య . (ఒకేసారిగా) : ఆఁ! రాస్కెల్! ఆరి అప్రాచ్యుడా!

కృష్ణమూర్తి (పళ్ళు నూరుతూ) : ఆ వెధవని నిలువునా చీల్చాలి.

మాణిక్యమ్మ : అయ్యో! అయ్యో!

లక్ష్మయ్య (ముక్కుపై వేలు వేసుకుని) : ఔరా! ఎంత పాపాని కొడిగట్టాడు. (వెంటనే తిరిగి తన మెట్ట వేదాంతం ధోరణిలోకి మారిపోయి) సరే, వాడి పాపాన వాడే పోతాడులే!

కృష్ణమూర్తి (వెటకారంగా) : వాడి పాపాన వాడే పోతాడూ?

లక్ష్మయ్య : అంతే మరి! పాపం చేసినవాడు ఈ జన్మలో కాకపోతే, మరో జన్మలోనైనా అంత కంత అనుభవిస్తాడు.

కృష్ణమూర్తి : ఇంకో జన్మ! ఎవరు చూచొచ్చారు?

లక్ష్మయ్య : ఇవి పెద్ద విషయాలు - నీ కీ ధర్మసూక్ష్మాలు తెలియవు లేరా! కర్మనుబట్టే జన్మ వుంటుంది. పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి ఈ జన్మ. ఈ జన్మలో...

మాణిక్యమ్మ: నీ మెట్ట యేదాంతం మండిందిలే! అయ్యో! అయ్యో!! నా తల్లి నెంత మాటన్నాడు.

కృష్ణమూర్తి : ఆ వెధవని కంటబడనీ - పాతేస్తాను.

మాణిక్యమ్మ : వాడొట్టి వెధవే! కాని, మన పిల్ల నిచ్చాక ఏమను కుంటే, ఏం లాభం? మన బిడ్డ ముఖం చూసైనా వాడి కడుపూ కాళ్ళు పట్టుకుని...

కృష్ణమూర్తి : ఛీ! ఛీ! ఆ వెధవ పేరైనా ఇఖ నావద్ద తలవొద్దు.

మాణిక్యమ్మ : కాదు, బాబూ! కాదు. నా మాటిను. మనం కోసి వేసుకుందా మనుకున్నా, తెగే సంబంధ మట్రా యిది? వాణ్ణి ఎలాగైనా బతిమలాడి...

కృష్ణమూర్తి : వాణ్ణా? బ్రతిమలాడ్డమా? ఆ పశువునే? చాల్లే అమ్మా!

మాణిక్యమ్మ : వాణ్ణి చూడందే మనపిల్ల మనకి దక్కదురా! నా తల్లి గుండెల్లో పెద్దరాయి పడింది. వాడు రావాలట. దానికంట బడాలట. నీ తప్పేమీ లే దనాలట. నీకు పున్నెముంటుంది - వాడి దగ్గరి కెళ్ళి...

కృష్ణమూర్తి : అదేమైనా సరే - నే వెళ్ళను; వెళ్ళను; వెళ్ళను.

లక్ష్మయ్య : మన అవసర మది! మనకు తప్పుతుందా?

కృష్ణమూర్తి : అవసరమని గాడిద కాళ్ళు పట్టుకుంటామా?

లక్ష్మయ్య : మనం పట్టుకోవడం ఒక లెఖ్కా? ఆనాడు సాక్షాత్తు శ్రీవసుదేవుడే పట్టుకున్నాడు.

కృష్ణమూర్తి : అయితే, నే నంతటి మహానుభావుణ్ణి కాను. నాకు చీమూ, నెత్తురూ వుంది; మానాభిమానా లున్నాయి.అన్నయ్యా!”అంటూ పడమటింటినుంచి కమల వస్తుంది. వడిలోవున్న ముగ్గురి వాలకాన్ని చూచి (తెల్లబోయి, గుమ్మంలోనే ఆగిపోతుంది.

మాణిక్యమ్మ : మంచో, చెడ్డ వాడి కిచ్చి కట్టింతర్వాత దానికి మరి వాడే దిక్కు ముఖమైనా చూసి యెళ్ళరా, బాబూ!

కృష్ణమూర్తి: నీదంతా వెర్రి కాని, ఇంతవరకు పడని సుఖం ఇఖ వాడితో మన జానకి ఏం పడుతుందమ్మా! బుద్ధిలేని ఆ వెధవను వృథాగా దేవిరించడం దేనికి?

లక్ష్మయ్య : గుడ్డివాడైనా, కుంటివాడైనా, చివరికి కుష్టువాడైనా ఆడదానికి భర్తే దైవం.

కృష్ణమూర్తి : కాదు, దెయ్యం!

మాణిక్యమ్మ : నా మాటిను, బాబూ? లేకపోతే మన పిల్ల మనకి దక్కదు.

కృష్ణమూర్తి : నువ్వైనా వెళ్ళడానికి వీల్లేదు. . .

మాణిక్యమ్మ : నువ్వు పసివాడివి. నీకు తెలవదురా, బాబూ! నా మాటిను.

కృష్ణమూర్తి : అదేమైనా గాని, నేను వెళ్ళనమ్మా!

లక్ష్మయ్య : అయితే! మరి నాకు తప్పుతుందా, నే వెడతాలే!

మాణిక్యమ్మ : అదేమిటిరా, బాబూ! పోనీ ఆయన్నైనా యెళ్ళి రానియ్యి.

కృష్ణమూర్తి : వీల్లేదమ్మా!

మాణిక్యమ్మ : ఆఁ! వాడి మాటల కేం లెండి? మీరున్నవా రున్నట్టుగా బయల్దేరండి

కృష్ణమూర్తి : వద్దు, నాన్నా! వెళ్ళొద్దు!

లక్ష్మయ్య (కరకుగా) : ఇందాకటినుంచి తమాయించుకు చూస్తున్నా! గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు, ఏమిటిరా మాకు నీ అదుపాజ్ఞలు? సమయాన్ని బట్టి సర్దుకు పోవాలికాని, నీలిగితే పనులౌతాయా?

కృష్ణమూర్తి : అయితే, వాణ్ణి పిలుచుకొచ్చి, నెత్తిని పెట్టుకు పూజించండి. నా దారిని నే పోతా!

మాణిక్యమ్మ : నన్ను నట్టేట ముంచిపోతావా? వొద్దురా, బాబూ! ఎళ్ళెద్దు!

కృష్ణమూర్తి : లేదమ్మా! నే నీ పాడుకొంపలో మరొక క్షణమైనా వుండలేను!

మాణిక్యమ్మ (దారికి అడ్డంగా వెళ్ళి) : నువ్వెళ్ళితే నన్ను చంపుకు తిన్నట్టేరా, బాబూ!(కళ్లు చెమ్మగిలగా కమల చీర చెంగుతో తుడుచుకుంటుంది.

లక్ష్మయ్య: పోయేవాణి పోనివ్వ రాదటే! ఎవర్ని బెదిరిస్తాడు ఈ గుడ్డి బెదిరింపుల్తో.(ఈ మాటకు కృష్ణమూర్తికి మరింత కోపం రాగా, మాణిక్యమ్మను తప్పించుకుని వీధిగుమ్మం వైపు రెండడుగులు వేస్తాడు.

మాణిక్యమ్మ, కమల (ఒకేసారిగా) అయ్యో! అయ్యో! బాబూ! అన్నయ్యా! అన్నయ్యా! (కృష్ణమూర్తి ఆగిపోయి కమలవైపు చూస్తాడు.

కమల : న న్నేంచేసి పోతా వన్నయ్యా!

కృష్ణమూర్తి : నీమాట మర్చేపోయానమ్మా! ని న్నిక్కడ విడిచి వెళ్ళితే, అక్కయ్య గొంతుకోసినట్టు నీ గొంతు కోస్తారు. నా వెంట రా పోదాం! (కమల కళ్ళను గిర్రున నీళ్లు తిరుగుతాయి. గుడ్లు అప్పగించి చూస్తూ జవాబు చెప్పదు. కృష్ణమూర్తి : నీకు అభం శుభం తెలియదమ్మా! వీళ్లు కిరాతకులు. నీ అన్నను కాదూ? నామాట విను. రా! వెడదాం!

కమల (గాద్గదికంగా) : మనం వెళ్ళిపోతే, మరి అక్కయ్యో?

కృష్ణమూర్తి (మనిషి చప్పున తగ్గిపోయి) : ఔనమ్మా! పిచ్చి కోపంలో నేను దాని మాటే మర్చిపోయా! (నిట్టూరుస్తూ) ఔను! దాన్ని ఈ స్థితిలో విడిచి మన మెక్కడికి పోతాం?

మాణిక్యమ్మ : పోనీ లేరా దాని మొగమైనా చూసి అగిపోయావ్. నా కదే పది వేలు. వొంటిగా రొమ్మున నే నీ కుంపటి మొయ్యగల నట్రా?

కృష్ణమూర్తి : సర్లే, అమ్మా! (చేతిగడియారాన్ని చూచి) అరుకిచ్చి అరగంటైంది. మరి పొట్లం వెయ్యొద్దూ?

మాణిక్యమ్మ (పెద్దగా నిట్టూర్చి) : నాకు కాళ్ళూ, చేతులూ ఆడ్డంలేదు. నువ్వే కాస్తెయ్యరా, బాబూ!(కృష్ణమూర్తి గదిలోకి వెడతాడు.

మాణిక్యమ్మ (లక్ష్మయ్యతో) : ఇంకా మీరు చూస్తారు దేనికి? మీ రెళ్ళిరండి.

లక్ష్మయ్య : రెండు ఝాము లైంది. వేళకాని వేళ. ఇప్పు డేమిటి? చల్లబడినాక వెడతాలే.

మాణిక్యమ్మ : ఎంత దూరమండీ! రెండు కోసులైనా నిండాలేదు.నా మాటిని, నిలుచున్న పాళంగా యెళ్ళి రండి.

లక్ష్మయ్య : సర్లేవే! రెండు మెతుకులైనా తిననీ! ఇంతలో ఏమీ ముంచుకు పోదు. కమలం! నా కొడ్డించ వమ్మా!

కమల (ఇంకా తడి ఆరని కన్నీళ్ళను తుడుచుకుంటూ) : రా, నాన్నా!

మాణిక్యమ్మ : భోజనాని కేమొచ్చె. రోజూ చేసే భోజనమే! ముందెళ్ళి రద్దురూ! ఆలిసిమైతే ఎక్క డేమి కొంప మునుగుతుందోనని నా గుండెలు కొట్టుకుంటున్నాయ్.

లక్ష్మయ్య : ఎందుకే? పాడు భయం! శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు.

మాణిక్యమ్మ : అబ్బ? యెళ్ళి రద్దురూ!

లక్ష్మయ్య : సరే - తగలడు! (విసురుగా రెండడుగులు వేస్తాడు)

కృష్ణమూర్తి (పొంగి పొరలివస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ గదిలోనుంచి వచ్చి): నాన్నా! (లక్ష్మయ్య వెనక్కి తిరిగి చూస్తాడు) నువ్విక వెళ్ళనఖ్ఖర లేదులే!(అర్థం తెలియక మాణిక్యమ్మ, కమల వెర్రివాళ్ళవలె చూస్తుంటారు.

లక్ష్మయ్య : సరే - ఏం చేస్తాం? ప్రారబ్ధం!

   (అనడానికి నోరురాని భయసంశయాలతో మాణిక్యమ్మ, కమల  వెర్రివాళ్ళవలె కృష్ణమూర్తి తర్వాత లక్ష్మయ్యను, లక్ష్మయ్య తర్వాత కృష్ణమూర్తిని ప్రశ్నార్ధకంగా చూస్తూవుండగా ...- తెర) 


దాంపత్యం[మార్చు]

(గృహచ్ఛిద్రం)

పాత్రలు: చదువుకున్న భర్త, చదువురాని భార్య

(గమనిక : ఇతివృత్తం, పాత్రలు మొదలైనవాటిలో ఇది స్వతంత్ర రచన. టెక్నిక్ మాత్రం స్వీడిష్

రచయిత ఆగస్ట్ ఫ్రెండ్ బర్గ్ కు అనుసరణ. ఒక పాత్రచేతనే మాట్లాడించి, రెండవదాన్ని మౌనంగా వుంచడం ఈ పద్ధతిని “ది స్ట్రాంగర్” అనే నాటికలో ఆయన వినియోగించాడు. ఈ పద్ధతి మాత్రమే “దాంపత్యం”లో అనుసరించబడింది.)

అది వారి యింటిముందు వసారా. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతం, పడక కుర్చీలో వాలి, భర్త పత్రిక చదువుకుంటూ వుంటాడు. వయస్సు ముప్ఫై ప్రాంతాల. గూడకట్టు కట్టుకున్నాడు; ఆఫారం వేసుకున్నాడు. తమలపాకుల పళ్ళెంతో భార్య ప్రవేశిస్తుంది.

భార్య : ఏమండీ! ఈ పూటైనా తిన్నగా భోజనం చెయ్యనే లేదు. విస్తరి ఇలా అలా కెలికి లేచొచ్చేశారు. చూడగా వండుకోవడం, వార్చుకోవడం నాకోసంలానే వుంది. అంతకంతకు చిక్కి సగమై పోతున్నారు. ఇలా చేస్తే, ఎలా చెప్పండి? (కుర్చీ దగ్గర కూర్చుని తమలపాకుల ఈనెల్ని తీస్తూ వుంటుంది.

భార్య : పోనీ, మీకు హితవైన కూరలేవో మీరు తెచ్చుకుంటే వండి పెట్టనన్నానా? కాని, ససేమిరా మార్కెట్టుకు వెళ్ళనంటారు. పనిమనిషిని పంపిస్తే, అది సగం తిని, సగం తెస్తుంది. అబ్బబ్బ! అది వొద్ది దొంగ ముండ! ఇంటి వద్దకు మంచి కూర లేవీ రావడమే లేదు. ఎవడు తెచ్చినా వంకాయలూ, బెండకాయలూ తెస్తున్నాడు. అవైనా అన్నీ చచ్చులూ, పుచ్చులూ. వాటినీ మండబెడుతున్నారు. ఇఖ నేనేం చచ్చేది - మీరే చెప్పండి? (తమలపాకులకు సున్నం రాస్తూ వుంటుంది.

భార్య : అన్నం మానేసి పాడు కాఫీ హోటల్ లో, పాడు కాఫీ తాగుతూ వుంటారు. ఆ కాఫీ నీళ్ళతో ఏం కడుపు నిండుతుంది? ఏ పచ్చడి మెతుకులు తిన్నా అన్నం అన్నమే! మా తాత ముప్పొద్దులా తవ్వెడు బియ్యం అన్నం పెట్టించుకుని, చిక్కటి మజ్జిగ పోసుకుని, జుర్రున జూరతాడు. ఎనభై యేళ్ళోచ్చినా ఇంకా రాయిలా వున్నాడు. కంటి చూపైనా తగ్గలేదు. ఇప్పటికీ సూదిలో దారం అలాగ్గా గుచ్చుతాడు. (పోక చెక్క భర్తకు అందిస్తుంది.

భార్య : అబ్బ! చదవొచ్చు లెద్దురూ! పొద్దున్నే పోతారు; పోదోయి వస్తారు.“ఇదుగో వొస్తారు; అదుగో వొస్తారు” అంటూ ఎదురు చూసి చూసి, నా కళ్ళు కాయలు కాసిపోతున్నాయ్. ఆఫీసు పని అయిదు గంటలకే అయిపోయినా ఎనిమిది, తొమ్మిది గంటలదాకా ఏం చేస్తారో, ఏమో, మీకే తెలియాలి. అసలు గడప దాటగానే మీ రింటిమాటే మర్చిపోతారులెండి! ఇవ్వాళమట్టు కివ్వాళ “నా న్నొస్తాడు. మిఠాయి తెస్తా” డంటూ పెద్దపిల్ల దారి కాసి కాసి, మీ రొచ్చే ముందే చిటుక్కున నిద్దరోయింది. చంటిదికూడా “నాన! నాన!” అంటూ పాపం! కలవరించింది. దాని కీ పూట వొళ్లు కాస్త వెచ్చగా వుందండీ! నిద్రలో - వెర్రితల్లి - తుళ్ళి పడుతున్నది. దీపాలెట్టగానే గుప్పెడు మిరపకాయలు దిష్టి తీసి, పొయ్యిలో పోస్తే గొట్టే రాలేదు. బిడ్డమీద ఏ పీడాకారి ముండ కళ్ళు పడ్డాయో, ఏమో!

(భార్య అందించిన తమలపాకుల మడుపు అందుకుని, భర్త పత్రికలో మరింతగా దాక్కుంటాడు.)

భార్య : ఎప్పుడూ పత్రిక చదువుతూ కూర్చుంటే, కళ్ళకు జబ్బు కూడా. పిండారబోసినట్టు వెన్నెల కాస్తున్నది. చల్లటి గాలి వేస్తున్నది పెందలాడే యింటి కొచ్చి, వాకిట్లో కుర్చీవేసుకు కూర్చుంటే హాయిగా వుండదండీ? ఇవ్వాళ వెన్నెల్ని చూసి పెద్దపిల్ల ఎంత సంబర పడిందనుకున్నారు! “చందమామ రావె!”అంటూ మీరు దాని కెప్పుడో పాట చెప్పారట. దాన్ని చెప్పమని నన్ను తెగ వేధించింది! (ఒక క్షణం పాటు ఆగి) పాలు చల్లారిపోతున్నాయి. తోడేసొస్తా. (లేచివెడుతూ) ఈ పూట మరీ పల్లెపు మెతుకులు తిన్నట్టు తిన్నారు. పాలయినా తాగరాదటండీ! (జవాబు కోసం అన్నట్టు ఒక్క క్షణం ఆగి) ఏఁ! తెమ్మంటారా? (వద్దని భర్త తల ఊపుతాడు.

భార్య : పోనీ, కాసినన్నే తాగండి. ఒక అరకప్పు తెస్తా. (వద్దని భర్త మరింత గట్టిగా తల ఊపుతాడు. భార్య లోపలికి వెడుతుంది. ఆమె వెళ్ళగానే అతడు పత్రికను ఒక మూలకు గిరాటు కొట్టి, పడక కుర్చీలోనుంచి లేచి, పక్కనే టేబులు పై వున్న పుస్తకం తెచ్చుకుని, దాన్ని చదువుతూ మళ్ళీ కుర్చీలో జేరగిలబడతాడు.

భార్య (తిరిగి వచ్చి) : పత్రిక చదవడం అయిందనుకుంటే పుస్తకం మొదలెట్టారటండీ? అదేం పాపమో నాతో ఒబ్బుమాటైనా మాటాడరు. ఇంటికి వచ్చినప్పటినుంచీ చదువు, చదువు - అంతూ పంతూ లేని చదువు. నే నేమైనా అంటే, “అదుగో! నా చదువు చెడగొడుతున్నా!” వంటారు. అదే స్నేహితులెవరైనా వొస్తే, చదువేమౌతుందో తెలవదు. ఊరు మాటుమణిగేదాకా వాళ్ళతో నవ్వుతూ కేరుతూ కూర్చుంటారు. నాతో మాట మాట్లాడ్డ మంటేనే మీకు...(భర్త చటుక్కున పుస్తకం మూసి “ఈ సోది వినక తప్పదు” అన్నట్టు ముఖం పెడతాడు.

భార్య (దైన్యంగా) : ఇప్పుడు నే నేమన్నానండీ మీరంత విసుక్కోడానికి! పిచ్చిదాన్ని కనక, ఎప్పుడు సాయంత్ర మౌతుందా, ఎప్పుడు మీ రొస్తారా అని గంటలు లెక్కె పెట్టుకుంటూ కూర్చుంటాను. కాళ్ళ అలికిడైతే చాలు, మీ రేమోనని ఆలకిస్తాను. గేటు తీసిన చప్పుడైతే చాలు, మీ రేమోనని ఎదురుచూస్తాను. దానికి చూడబోతే రెండున్నరేళ్లు నిండా వున్నాయో, లేవో, ఆ అల్లరికాన “అమ్మా! నాన్నొస్తున్నాడేఁ” అంటూ చీటికీ మాటికీ పరుగెత్తుకొస్తూ వుంటుంది. ఉత్తిదే అని తెలిసీ వుండబట్టలేక వాకిట్లోకి ఆదరాబాదరాగా లేచొస్తాను. లేచొచ్చి, “ఎక్కడే?” అంటే, పకపక నవ్వుతుంది. (భర్త పెదవులపై చిరునవ్వు కనబడుతుంది). చంటిది కూడా “నాన్న ఎక్కడమ్మా?” అంటే, ముఖం ఇంత చేసుకుని, వేలేట్టి గేటువంక చూపిస్తుంది. నా తల్లికి సందేళ కాక తగిలింది. అజీర్తి చేసిందేమో అనుకోడానికి నిన్నే ఆముదం పెట్టానయ్యె! ఇవ్వాళ పొద్దునకూడా ఝాడించి విరోచనమైంది. వాసనన్నా లేదు.(భర్త ముఖం చిట్లించుకుని, చేతి గడియారం వంక చూస్తాడు.

భార్య : ఇంటికి రావడానికి మీకొక టైము లేదుకాని, వచ్చాక టైము చూసుకోవడమే సరిపోతుంది. సంసారం మంచి చెడ్డలు చెప్పుకోడానికైనా మీకు తీరుబాటుండదు.పగలంతా మీ కోసం నేను యెదురు తెన్నులు కాస్తుంటాను. కాని, నాతో మాట్టాడితేనే మీ నోటి ముత్యాలన్నీ రాలిపోతా యనుకుంటారు! (ఏదో జవాబు చెప్పబోయినట్టు భర్త పెదవి కదపబోతాడు.

నా భార్య : మీరు ఏ మనబోతున్నారో నాకు తెలుసు లెండి.“నీతో ఏమి సంగతులు మాట్లాడమంటావ్? వండడం, వార్చడం తప్పితే నీ కేమొచ్చు? చీరలు, నగలు తప్పితే నీ కేం కావాలి?” అనేగా? మా అమ్మా, నాన్నా నాకు చదువు చెప్పించారు కాదు. ఖర్మది. ఏఁ! ఇప్పుడు మాత్రమే! నే చెబుతా - చదువుకోరాదా?” అంటారు. “పోనీ, మీకంత ముచ్చటగా వుంటే చెప్పం” డని వచ్చి కూర్చుంటే, ఏ కాస్త తప్పొచ్చినా, చెడ్డ చికాకుపడతారు గదా! అబ్బబ్బ! ఎంత తల బద్దలు కొట్టుకున్నా, నీకేమీ అర్ధంకాదు. వొట్టి మట్టి బుర్ర” అంటూ చిందులు తొక్కుతారు! ఔను! నాది మట్టిబుర్రే! లేకపోతే, మీ కెందుకింత లోకువౌతాను? “భూమి గుండ్రంగా వుంటే, అడుగుపక్క నున్నవాళ్లు తలకిందులుగా నడుస్తారా?” అన్నానని ఆ పూటంతా ఒక్కటే నవ్వు!(భర్త ఆవలిస్తాడు.

భార్య : “ఏమండీ! కామ్రేడ్ అంటూ చాలామంది పేరుముందు వుంటుంది గదా? కామ్రేడు ఇంటి పేరు వాళ్లు దేశంలో అంత తామరతంపరగా వున్నారటండీ?” అని ఒకనా డడిగినందుకు ఏమి హేళన చేశారు! ఏమి హేళన చేశారు! (భర్త వొళ్లు విరుచుకుంటాడు.

భార్య : (భర్త విసుగుదలను గమనించకుండానే). మీలా అందరూ చదువుకున్నవాళ్ళే వుంటారా? నిజానికి - నాబొంద! ఇంకా నా కేం చదువు? అప్పుడే ఒకరికిద్దరు బిడ్డలయ్యారు. ఇటు నేను ఇంటిపనే చేసుకోనా? అటు వాళ్ళనే సంబాళించుకోనా? పగటిపూట ఇలా కాస్త కన్ను మూసే ప్రాప్తి లేదు. బద్దకించి ఎప్పుడైనా కాసేపు నడుం వాలిస్తే, పిల్లలిద్దరూ పీకి పాకాన పెడతారు. మరీ నెల రోజుల్నుంచి చంటిపిల్ల రాత్రిపూటైనా కంటి మీద కునుకు పడనివ్వడంలేదు. పాలు చాలక "కుయ్యో, మొర్రో” అంటూ తెల్లవార్లూ ఒక్కటే గోల! వొట్టి రొమ్ము దాని నోట్లో పెట్టి పడుకుంటే, దవళ్ళు పీక్కు పోవడమేకాని కడుపు నిండుతుందా, పెడుతుందా? (తలనొప్పి వచ్చినట్టు భర్త కణతలు నొక్కుకుంటాడు.

భార్య : మండీ! తలనొప్పిగా వున్నదా?. మరి ఆ మాట చెప్పారు కారేఁ? తలనొప్పిగా వుంటే అన్నమెలా సయిస్తుంది? అందువల్లే ఈ పూట ఆ కాసిని మెతుకులైనా తిన్నారు కాదు. తలనొప్పి మందు రాయనా?(కణతలు నొక్కుకోవడాన్ని వెంటనే మానివేసి, మందూ గిందూ వద్దన్నట్టు భర్త సంజ్ఞ చేస్తాడు.

భార్య : అయితే, నా మాటలే మీకు తలనొప్పిగా వున్నాయంటారు. అంతే లెండి. నే నన్నా, నామాట లన్నా మీకు తలనొప్పి. మీకు పుస్తకాలు కావాలి; పత్రికలు కావాలి. దేశం సంగతులతో, ప్రపంచం సంగతులతో మీకు పొద్దుపోతుంది. నాకు నా యిల్లే దేశం; నా పిల్లలే ప్రపంచం...... పెళ్ళయినాక ఒక్క ఏడాదిపాటు నాతో ఏమి తిన్నగా వున్నారో! ఆ తర్వాత నేనేం పాపం చేసుకున్నానోకాని, నా పొడైనా మీకు గిట్టడం లేదు. పిచ్చిదాన్ని కనక, మీరెంత తోసేస్తున్నా, మిమ్మల్నే పూసుకు తిరుగుతాను. మీరు సంతోషంగా ఒక్కమాట మాటాడితే, అదే పండ గనుకుంటాను. కాని, నే నెదురుగా వస్తేనే మీకు చిరచిరలు, బురబురలు! (పడక కుర్చీలో నుంచి చరాలున లేచి, భర్త పచారు చేయ నారంభిస్తాడు.

భార్య : అయ్యో! కూర్చోండి పాపం! - కూర్చోండి. నామూలాన మీకు లేనిపోని కాళ్ళ తిప్పటకూడా దేనికి లెండి!... చదువురానిదాన్నని మీకు మొదటే తెలుసుగా! తెలిసికూడా నన్నెందుకు చేసుకున్నారు? ఆ కిరస్తానీదాన్నే కట్టుకోక పోయారూ?... కీసరబాసర ఆ మాట్లాడుతూ దాంతో హాయిగా... (పళ్ళు నూరుతూ, భర్త “హుఁ!” అంటూ హూంకరిస్తాడు.

భార్య (తెగించినట్టు) : జడిపించినంతకాలం జడిపించారు ఇంకేమి జడిపిస్తారు లెండి. ఇదేనాటి ఖర్మమో! లేకపోతే అది ఇప్పుడీ వూరు బదిలీ ఎందుకు చేయించుకుంటుంది?“నాతోపాటు కాలేజీలో చదువుకుంది. ఇస్కూళ్ళ ఇన స్పెక్ట్రమ్మ” అంటూ దానికి నాచేత అడ్డమైన వూడిగం చేయించారు. కాఫీలు, ఫలహారాలు, భోజనాలు ఓఁ! ఏం చేయించలేదు.... దాని కాళ్ళు పట్టించడ మొక్కటే మినహా. నల్లగా కోతిముండ! ముట్టుకుంటే చేతికి ఎక్కడ మసి అవుతుందో అన్నట్టుగా వుంటుంది. మరి, దాని అందం ముందు నా అందం పట్టడం లేదు కాబోలు! ముఖానికి ఇంత బూడిద కొట్టుకుని, చేతికి నలుసంత గడియార మొకటి తగిలించుకుని, కాళ్ళకు గాడిద గిట్టల బూడ్సులు వేసుకుని, టిక్కుటక్కుమంటూ ఆ వొక్కి పీను గొచ్చి (వెక్కిరిస్తున్న గొంతుతో) “అలో” అనేసరికి ముఖం చేటంత అవుతుంది. ఇఖ దాంతో ఒక్కటే పకపకలు, యికయికలు! నే నెక్కడ వినిపోతానో అని ఇంగ్లీషులో తప్ప మాట్లాడరు. ఆ యింగిలి పీసు రాకపోతే మాత్రం నాకు కళ్ళు లేవూ మీ నాటకమంతా చూడ్డానికి. ఈ మధ్య మరీ ఆ యింటినుంచి ఈ యింటికి, ఈ యింటినుంచి ఆ యింటికి నడిచే పుస్తకాలు పుస్తకాలు కావు; పత్రికలు పత్రికలు కావు. వాటితోపాటు ఎన్ని వుత్తరాలు నడుస్తున్నాయో! మీరు విడిచిన చొక్కా మొన్న చాకలికి వేస్తూ జేబు చూద్దును గదా, సినిమా టిక్కట్లు రెండు కనబడ్డాయి. దాన్ని వెంటబెట్టుకు వెళ్లారు కాబోలు! లేకపోతే రెండెందుకుంటాయి? ఇంతకాడి కొచ్చాక ఇంకా చాటుదేనికి? నేరుగానే ఆ పోలిని తెచ్చి ఇంట్లో పెట్టుకోరాదూ? (కోపం పట్టలేక భర్త నేలను తన్నుతాడు.

భార్య : నేలని తన్నడం దేనికి! మీకు కాలు నొప్పి కూడా! నన్నే తన్నండి. తన్ని తగిలేస్తే, మీకు పీడ విరగడైపోతుంది. (ఈసడింపుగా) పాపం! ఆ పోలిది కష్టాలమారి బ్రతుకట. దానికి “నా” అన్న వాళ్ళెవ్వరూ లేరట. అమ్మా, నాన్నా చిన్నతనంలోనే పోయారట. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత పెద్ద జీతం తెచ్చుకుంటున్నా దానికి సుఖమే లేదట. తన ఉద్యోగానికీ, సంపాదనకీ ఆశపడి వచ్చేవాళ్ళని చూస్తే దానికి కంపరమట. దాని ఫాయా వాళ్ళెవ్వరూ దాన్ని వలచి రారట. అదంటే ఎంత జాలి! పోనీ, మీరే ఆ సింగిని కట్టుకోరాదూ! (భర్త కొట్టడానికి చెయ్యెత్తబోయి, మళ్ళీ అంతలోనే దించి వేసుకుంటాడు.

భార్య (ఇంకా విరగబడి) : ఆగిపోయారేఁ! కొట్టండి. బిడ్డలతల్లికి ఆ ముచ్చటే తక్కువగా వుంది. ఇంతకాలం నుంచి దిగమింగి వూరుకున్నా! ఏమైనా సరే. ఇఖ వూరుకునేది లేదు. అది వుండడమో, నే నుండడమో ఇవ్వాళ తేలిపోవాలి. మీకు వొండి పెట్టడానికి నేను కావాలేఁ? మీకు పిల్లల్ని కనడానికి నేను కావాలేఁ? మీతో మాట మాట్లాడ్డానికి మాత్రం నేను పనికి రాను! ఎంత చదువురాని మొద్దునైతే మాత్రం మీకు వూడిగం చేస్తూ మూలపడి వుండాలని ఎక్కడున్న దేమిటి? పొట్టకూటికి నే నేమీ ముఖం వాచి లేను. కావాలంటే ఇంత ముద్ద పెట్టడానికి నాకు అమ్మా బాబూ వున్నారు.“ఆయన మనస్సు విరిగిపోయాక - ఛీ - ఇంకా నే నిక్కడ దేని?”కని ఆ పీడాకారి ముండ ఈ వూరొచ్చిన మూడు నెల్లనుంచీ నే ననుకోని రోజు లేదు. కాని, పిల్లలే తగలాటమైపోయారు. వాళ్ళ నొదిలి పెట్టి వెళ్ళలేక... (తువ్వాలు పైన వేసుకుని భర్త వీధిలోకి దారితీస్తాడు.

భార్య : దాని దగ్గరికేనా, ప్రయాణం? వెళ్ళండి! వెళ్ళండి! నా కాపరం తియ్యడానికే అ దిక్కడికి తగలడింది.(వీధితలుపు గుభేలున వేసి భర్త వెళ్ళిపోతాడు.

భార్య : అనాకారి ముండ! నా ప్రాణానికి అ దెక్కడినుంచి దాపరించిందో? దాని శిరుసు పగల! దా నింట్లో పీనుగెళ్ళ! (ఒక క్షణం ఆగి) దాని కొంపకే వెళ్లుండాలి. ఇంత రాత్రి వేళ ఇంకెక్కడికి వెడతారు? ఆఫీసు పనయ్యాక అక్కడే కూర్చొనొస్తూ వుండాలి. లేకపోతే, రోజూ ఎనిమిది, తొమ్మిది గంటలదాకా ఏమి పను లుంటాయ్! దిక్కుమాలిన ముండ! సిగ్గుమాలిన కుంక! దానికి బుద్ది లేకపోతే ఈయనకైనా ఇదుండొద్దూ? వీధితలుపు తీసి, వీధివంక తేరిపారజూచి వచ్చి) దాని కొంప పడమరవీధిలో వుంటే, ఇలా తూర్పుకు వెళ్ళారు దేనికో? ఆఁ! అదొక వేషం!... రెండు బజార్లు చుట్టి వెళ్ళి, దాని తలుపు కొడతారు. ఈసరికి అసలటు తిరిగే వుండాలి. మాయదారి ముండ! పండంటి నా కాపరానికి చిచ్చు పెట్టడానికే అదిప్పుడు... (చప్పున ఏదో జ్ఞాపకానికి వచ్చినట్టు) ఆఁ! అన్నట్టు, ఇస్కూళ్ల తణిఖీకి వారం రోజుల నాడే వెళ్లిందనీ, ఇప్పటిలో అది తిరిగి రాదనీ ఈ దారినిపోతూ నిన్న దాని బంట్రోతు చెప్పిపోయాడుగా? (పెద్ద తప్పు చేసినదానివలె నోరు నొక్కుకుంటూ) అయ్యొ! అయ్యొ!! ఎంత పాపిష్టి దాన్ని! ఉత్తపుణ్యానికి నోటి కొచ్చిన కారుకూత లన్నీ కూసి ఇంత రాత్రివేళ ఆయన్ని బయటికి తగిలేశాను. మబ్బు మూసుకొస్తున్నది. కొంపతీసి చినుకు పడుతుందేమో! తడిస్తే, ఆయన కిట్టే జలుబు చేస్తుంది! నే నిప్పుడేం చెయ్యను? అయ్యొ! నే నిప్పుడేం చెయ్యను? నిరుడొకసారి ఏదో మాటామాటా వచ్చి, ఇలాగే తెల్లవార్లూ వీధులెంట తిరిగి తిరిగి, తెల్లవారేసరికి పుట్టెడు జలుబుతో, జ్వరంతో యింటి కొచ్చారు! అప్పుడు వారం రోజులకుగాని ఆయన కోలుకోలేదు. పాపిష్టిదాన్ని! ఇప్పు డాయన కేమి తెచ్చి పెట్టడాని కింత రాద్దాంతం చేశానో గదా! (నెత్తీ నోరూ కొట్టుకుంటూ) నా బొంద పడ! నే నెంత పాపిష్టిదాన్ని! అయ్యో! అయ్యో!! తెర)

శకున పక్షి[మార్చు]

(ఒక సన్నివేశం)

పాత్రలు: రామయ్య : ఒక పల్లెటూరి గృహస్థు, మహలక్ష్మమ్మ : అతని భార్య, వెంకటరావు : అతని కుమారుడు, సీతాపతి : అతని వేలువిడిచిన బావమరిది

స్థలం : రామయ్యగారి ఇంటి చావడి

కాలం: వర్తమానం

పల్లెటూరి ఆసామి ఇంటిచావిడి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున పెరటిలోకి ద్వారం. ఈ రెండు ద్వారాలకు ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క కిటికీ. ఎదురుగా మరి రెండు ద్వారాలు; మొదటిది పడకగదిలోకి, రెండవది పడమటింటిలోకి. ఈ రెండు ద్వారాల మధ్య పసుపు కుంకుమలతో ఇనపపెట్టె. దాని పైన గోడ కాన్చి ధనలక్ష్మి పటం. దానికి ముద్దబంతి పూలదండ. వీధితల గోడమూలకూ, పడకగది ద్వారానికీ మధ్యగా ఒక పెద్ద బీరువా. చావడిమధ్య ఒక పడకకుర్చీ; దానిచెంత ఒక బెంచీ.రామయ్య పడకకుర్చీలో కూర్చుని, బెంచీ పై వున్న దస్త్రంలోనుంచి వరసగా దస్తావేజులు తీసి, వాటి పేజీలు తిరగ వేస్తూవుంటాడు. అతడు భయ్యోపడిలో పడినవాడు. కురచగా, బొద్దుగా, గుమ్మటాన్ని పోలినవాడు. గండుముఖం, గుండ్రని పెద్దకళ్లు. నుదురుకూడా పెద్దదే. అంట కత్తిరించిన క్రాపు.

మీసం గడ్డాలు లేవు. కొంచెం బొంగురు గొంతు. మాటతీరులో “వ్యవహర్తను సుమీ!” అనే భేషజం కనబడుతూ వుంటుంది. నీర్కావిధోవతి కట్టి, తెల్ల లాల్చీ వేసుకున్నాడు.

మహలక్ష్మమ్మ చావిడిలోనే ఒక పక్కగా కూర్చుని, కందిపప్పు చేట ముందు పెట్టుకుని, రాళ్లు యేరివేస్తూ వుంటుంది. వయస్సు నలభై ప్రాంతం. అభం శుభం యెరగని పల్లెటూరి యిల్లాలు.

ముక్కు పైకి జారిన కళ్లజోడును సరిగా తోసి, కొత్త దస్తావేజును అందుకోబోతూ, “కాసిని మంచినీళ్లు తేవే!” అని రామయ్య అంటాడు. పప్పుచేట చావిడిలోనే వదలి పెట్టి, మహలక్ష్మమ్మ పడమటింటి గుమ్మంగుండా లోపలికి వెడుతుంది.

ఇంతలో సీతాపతి వస్తాడు. వయస్సు నలభై లోపు. పొడుగ్గా, కాయలాంటి శరీరంతో, తనాబిలాంటివాడు.

సంస్కారంలేని వొత్తు కాపు; మాసిన గడ్డం; రొయ్యమీసం. పైకి వెర్రి బాగులవాడివలె కనబడినా, జిత్తులలో నక్కను మించినవాడు. నీర్కావి ధోవతి కట్టి, నీర్కావి బనియన్ వేసుకున్నాడు. భుజంపై తుండుగుడ్డ, చేతిలో వెదురుకర్ర.

రామయ్య (అలికిడి కాకుండా వచ్చిన సీతాపతిని చూడగానే) : ఏం సీతాపతీ! ఇంత పొద్దుపోయాక ఇలా వొచ్చావ్?

సీతాపతి (తెచ్చి పెట్టుకొన్న నవ్వుతో) : "పొద్దున్నే వచ్చిన వాన, పొదోయి వచ్చిన చుట్టం పోయేది లే”దని మా రామయ్య బావయ్యకు అప్పుడే దిగులు పుట్టిందేమిటి?

రామయ్య : నీ సామెతల కేమిలే! అయినదానికీ, కానిదానికీ ఒక సామెత విసురుతూ వుంటావ్. ఇప్పు డెందు కిలా ఊడి పడ్డట్టు?

సీతాపతి : ఆఁ! ఏమీ లేదు, వూరికేనే.

రామయ్య : ను వ్వూరికే రావేఁ!

సీతాపతి : నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు. నన్ను ముట్టుకోకు నా మాలకాకి” అంటావ్. మరి అందరం అలా వుండ గలమా?

రామయ్య : సర్లే! ఇంతకూ ను వ్వొచ్చిన పనేమిటో చెప్పరాదూ? దాపరికం దేనికి?

సీతాపతి : “చల్ల కొచ్చి ముంత దాస్తున్నా”ననే! నీ దంతా చోద్యం రామయ్య బావా!

రామయ్య : నువ్వు వెయ్యి చెప్పు; లక్ష చెప్పు. వూరికేనే వచ్చా వంటే నేను నమ్మలేను.

సీతాపతి (నవ్వుతూనే బెంచీ పై కూర్చుంటూ) : “లాభంలేని పెట్టి వరదను పోడంటావ్” -అంతేనా? ఇఖ ఒక చుట్టం, పక్కం; రావడం, పోవడం; మంచి, చెడ్డా; ఏమీ లేదన్నమాటే!

రామయ్య : మాటలు నేర్చావులే! ఇంతకూ ఏమిటి సంగతి?

సీతాపతి : ఆఁ! మరేమీ లేదు. మా లక్షువమ్మకు సుస్తీ చేసినట్టు విని, వుండబట్టలేక చూచిపోదా మనొచ్చా! వలచి వస్తే మేనమామ కూతురు వరస కా”దనే రకం నీది. నువ్వు నన్నెంత పరాయి వాణ్ణిగా చూసినా, అది నాకు వే లిడిచిన చెల్లెలు. (పడమటింటి గుమ్మం గుండా మంచినీళ్ళ గ్లాసుతో మహలక్ష్మమ్మ వస్తుంది). నీ మాటే అంటున్నానమ్మా! నీకు నూరేళ్ళాయిస్సు. ఏ మమ్మా? కొంచె మేమో సుస్తీ చేసిందట.

మహలక్ష్మమ్మ : ఔ నన్నయ్యా! అసలే కొన ఊపిరిదాన్ని. ఈ గాడ్పులకు ప్రాణం మరింత బేజారై పోతున్నది.(ఈ మాటల్ని అంటూ భర్తకు మంచినీళ్ళు అందించి, తను వెళ్లి పప్పు చేటముందు తిరిగి కూర్చుంటుంది.

సీతాపతి : కాదూ, మరి?“రోహిణీ కార్తెలో రోళ్లు బద్ద లౌతా” యని ఊరికే అన్నారూ? ఈ యేడు మరీ నిప్పుల్ని చెరుగుతున్నది. ఈ పడమటి గాడ్పులికి మా పిల్లలు ఆవిటిల్లి పోతున్నారు. చల్లబొట్టు కూడా లేదేమో, యెండి వొరుగైపోతున్నారంటే నమ్ము, (వంగి కాసిని కందిపప్పు తీసి నోట్లో వేసుకుంటాడు.

మహలక్ష్మమ్మ: మీ కిప్పుడు పాడి లేదేమే, అన్నయ్యా?

సీతాపతి : లేదమ్మా! నల్లపడ్డ యెండిపోయింది; పెద్ద గేదేమో యెత్తడి పోయింది; బోడావు పాలు దూడకే చాలడం లేదు.“పాడిలేని యిల్లు పాతాళలోకం”. బక్కనీళ్ళయినా లేక నానా శెరా పడుతున్నాం.

మహలక్ష్మమ్మ : పోనీ, యెక్కడైనా అణా పెరుగు వాడిక పెట్టుకోకపోయారా, అన్నయ్యా?

సీతాపతి : ఏమోనమ్మా! అమ్మబోతే అడివి; కొనబోతే కొరివి.”అణా పెరుగన్న పేరేకాని, యిల్లు గడుస్తుందా, పెడుతుందా? అక్కడికీ ఈ మధ్య మా చిన్నల్లుడు పండక్కి వచ్చాడని ఆ ముసిలిముండ లేదూ?- కాపు వీధి కామమ్మ - దానిదగ్గిర వారం రోజులు పెరుగు పోయించుకుంటే, లొట లొట నీళ్ళు పోసింది. అయితే అమ్మాయ్! మన పాలెం పడ్డ ఈనిందటగా?

మహలక్ష్మమ్మ : ఈనింది. కాని, ఏం లాభం? నిన్న దూడ నిడుస్తూ వుంటే, ఆ పాడుముండ – చెరువుగట్టు శేషమ్మ - కన్నుపడింది. దాంతో ఇఖ ఒక్క జీరైనా రాలిస్తే వొట్టు

సీతాపతి : ఆ మాయదారిముండ మన కెక్కడ దాపరించిందమ్మా!“నరుడికంట నల్లరాయి పగుల్తుంది.”పాటి మీది సాయబును పిలిపించి దిష్టితాడు వేయించక పోయావా?

మహలక్ష్మమ్మ : మా చిన్న పాలేర్ని వెళ్ళిరమ్మంటే, ఆ వెధవ ఠలాయించాడు.

సీతాపతి : “తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.” ఈ పిదప కాలంలో పాలేళ్ళు తిన్నగా మాట వింటారుగాఁ! వాళ్ళ కళ్ళు నెత్తికొచ్చాయ్. "పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే, ఆహా అన్నాడట; గంత కట్టనా బసవన్నా అంటే, ఊఁహు అన్నాడట”. అలా వుంది వాళ్ళ పనిప్పుడు. రేపు నే నెళ్ళి ఆ సాయబును పిలుచుకొస్తాలే! ఇబ్బందో, సబ్బందో నువ్వు రోజూ కాసిని మజ్జిగనీళ్ళు పంపించకపోతే మేం బతకడం కష్టం.

రామయ్య (అప్పటి వరకు పడకకుర్చీలో వాలి, దస్తావేజుల్ని చూచుకుంటున్నవాడు చప్పున నిటారుగా కూర్చుని) : అదీ వరస! నేను ముందే అన్నాగా? ఎదో పని పడకపోతే నువ్వు రాకే!

సీతాపతి : వినవమ్మా, విను - మాబావగారి మాటలు!“అయినవాళ్ళకు ఆకుల్లోను; కానివాళ్లకు కంచాల్లోను”. మొన్న రెవిన్యూ ఇన స్పెక్టరుగా రొస్తే, పెద్ద డబ్బా నెయ్యి సమర్పయామీ చేశాడు. కాని, కాసిని కుండ కడిగిన నీళ్ళు నే నడిగితే, ఎన్ని చదువుతున్నాడో!

రామయ్య : నాకు తెలుసులే నీ సంగతి! కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి. ఇంతకీ మాటలు నేర్చావ్. మజ్జిగకోసం వచ్చినవాడివి ముందే ఆమాట చెప్పరాదూ? పరామర్శ, గిరామర్శ అంటూ ఈ నాటకమంతా దేనికి?

సీతాపతి : వెనకటి కెవడో “కడుపులో లేంది కావిలించుకుంటే వొస్తుందా?” అన్నాట్ట. నీకు నావాళ్లన్న మాటే లేనప్పుడు నే నెందుకోస మొచ్చినా, ఏదో బాముకోడాని కొచ్చినట్టే వుంటుంది. అసలు నీ చెల్లెలుకూడా “మా వొదినకు సుస్తీగా వుందట, చూచొద్దా” మంటూ బయల్దేరింది. కాని, “పొద్దు పోయింది లేవే, ఇప్పు డేమొస్తావ్?” అని నే నొక్కణ్ణి చక్కా వొచ్చా.

మహలక్ష్మమ్మ : ఔ నన్నయ్యా! పొద్దు పోయింది. (భర్తతో) ఏమండీ! అబ్బాయి ఇంకా భోజనానికి రాలేదు. పొద్దున్నెప్పుడో రెండు మెతుకులు తినెళ్లాడు. లైబ్రీలో వున్నాడేమో అటొక అడుగేసి రండి.

రామయ్య : వాడేమి చిన్నవాడా? చితకవాడా? వాడికి ఆకలైతే వాడే వొస్తాడు. సంసారం సంగతి సుతరామూ పట్టించుకోకుండా వాడు ఊరుమీద బలాదూర్ తిరుగుతూవుంటే వాడి వెనక నేను పరుగులెత్తలేను.

సీతాపతి : “సముద్రం ఈదవచ్చుగాని, సంసారం ఈదరాదు.” ఈ కాలపు నాగమ్మల కేం తెలుస్తాయ్, సంసారంలోని సాధక బాధకాలు? అన్నదమ్ముల్లో పంచుకున్నది నాలు గెకరాల కొండ, దాన్ని నీ ప్రయోజకత్వం వల్ల నలభై యెకరాల కండ్రిక చేశావ్.

రామయ్య (పొగడ్తకు లోలోపల సంతోషిస్తూ, పైకి మాత్రం): ఆఁ! మన ప్రయోజకత్వమే మున్నదిలే!

సీతాపతి : నీ ప్రయోజకత్వం కాకపోతే మరేమిటి, రామయ్య బావా? పట్టిందల్లా బంగారం చేస్తావ్. వ్యవహారాన్ని నడిపించడంలో కొమ్ములు తిరిగిన ప్లీడరైనా నీ తర్వాతే! నువ్వు నీ కాబట్టి అన్ని కోర్టులూ తిరిగి, ఆ వారసత్వం వ్యాజ్యంలో నెగ్గుకొచ్చావు గాని, మరొకడైతే పేడకడిలా చతికిలబడేవాడు కాదూ?

రామయ్య : నువ్వైనా సామాన్యుడివా? ఐదుగురు ఆడపిల్లల్ని విరగడచేశావ్; అప్పూ సప్పు లేకుండా గుట్టుగా సంసారం చేస్తున్నావ్.

సీతాపతి : ఆఁ! చెప్పుకోక, చెప్పుకోక నా మాటే చెప్పుకోవాలీ!“వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే; కరెడ్ల కామమ్మ వంకాయలభారం తూగిందట. నీకంటె నాలుగెకరా లెక్కువే పంచుకున్నా. కాని, “నానాటికి తీసికట్టు నాగంబొట్టు” అన్నట్టుగా వుంది నాపని. చివరికి పుగాకు పాయకైనా ఠికానా లేదు. వెనకటికి నాబోటి వా డెవడో “దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్న"దట. దశంటే నీదే దశ! ఏదీ, రామయ్య బావా! ఒక పుగాకుకా డిలా పారెయ్!

రామయ్య : ఇస్తాలే - కాస్త ఆగు (భార్యతో). అయితే, ఏమే! పడమటిపొలం క్రయం దస్తావేజు కనబడదేం?

మహలక్ష్మమ్మ : ఏమో, నాకేం తెలుసు? - నేను వాటి జోలికీ సొంటికీ పోతాను గనకనా!రామయ్య (చావడిలోని బీరువా వద్దకు లేచివెళ్ళి, దాని తలుపులు తెరచి, లోపలవున్న రికార్డులను ఒక నిమిషం ఇటూ అటూ తిప్పి) : ఈ బీరువాలోనే పెట్టిన జ్ఞాపకం. (మరొక క్షణం వెదకి). ఊహుఁ! ఇక్కడ లేదు. గదిలో పెట్టలేదుగదా?

మహలక్ష్మమ్మ : ఎక్కడ పెట్టుకున్నారో, ఏమో? మీకే తెలియాలి! మీ కాగితాల కిల్లంతా చాల్డం లేదు.

రామయ్య : చాల్లే! ఇఖ కట్టి పెట్టు! ఆ కాగితాల విలవ నీ కేం తెలుసు. కొంపను నిలబెట్టినా, కూల్చినా వాటికే చెల్లు! (ఈ మాటలు అంటూనే పడకగదిలోకి వెడతాడు.

సీతాపతి : మా బావయ్యకు కాగితాలుంటే చాలు కడుపు నిండుతుంది. ( చారెడు పప్పు తీసుకుంటూ). సరిగాని, అమ్మాయ్! కాస్త మాట దక్కిస్తావుగా?

మహలక్ష్మమ్మ : మజ్జిగ మాటేనా? నువ్వింత యిదిగా అడుగుతూ వుంటే కాదనగలనా, అన్నయ్యా?

సీతాపతి : కాదన్నమాట నీనోట రావడమే! కన్నుచూసి కాటిక; “పిర్రచూసి పీట” వ్యవహారం కాదు నీది. కలవారైనా, లేనివారైనా, చుట్టపక్కాలందర్నీ ఒబ్బు మాదిరిగా చూసుకుంటావ్. నువ్వు అడుగుపెట్టిన వేళావిశేషం వల్లనే ఈ యింటి కింత అయిశ్వర్య మబ్బింది.

మహలక్ష్మమ్మ : ఆఁ! నాదే మున్నదిలే! అది మా అబ్బాయి అదృష్టం. వాడు కడుపున పడ్డాకే మాకు కలిసొచ్చింది.

సీతాపతి : ఔనమ్మా! బిడ్డ పుట్టినవేళ, గొడ్డు వచ్చినవేళ” అన్నారు. వాడి దసలు సిరిగల ముఖం. వాడికంటె తెలివి గలవాడు ఈ వూళ్ళో వున్నాడా! వాణ్ణి మించి చదువుకున్నవా డున్నాడా? వాడి మాట, వాడి మంచి, వాడి మర్యాద - వాడికి వాడే తగు!

మహలక్ష్మమ్మ : ఔనన్నయ్యా! ఊళ్ళో వాళ్లందరు వాణ్ణి నెత్తినెట్టుకుంటారు. కాని, మీ బావయ్యకుమాత్రం వాడి పొడయినా గిట్టదు. అది మరి వాడి ఖర్మమో, నా ఖర్మమో!

సీతాపతి : ఆఁ! మా బావయ్య మాటల కేమిలే? నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామాలు” అంటాడు. ఆయన మాటల్ని నువ్వు పట్టించుకో వద్దమ్మా! మన వెంకట్రావుకేఁ? నిక్షేపంలాంటివాడు. తల్లికి తగినబిడ్డ; ఇంటికి తగిన పందిరి” అన్నారు. వాడి వన్నీ అచ్చంగా నీ పోలికలే! కట్టుకున్న పెళ్ళాం మంచితనం మా బావయ్యకు తెలిసింది కనకనా. కన్నకొడుకు మంచితనం తెలియడానికి? పెద్ద లన్నారుగా “చూడగా, చూడగా గుర్రం గాడెదైం” దని.

మహలక్ష్మమ్మ : నువ్వు నిజం పలుకుతా వన్నయ్యా! వాడికి వడసారం యిరవై యేళ్ళయినా లేవు. అభం శుభం యెరగని పిచ్చి సన్నాసి. ఇప్పణ్ణుంచీ వాణ్ణి సంసారం తీర్చి దిద్దమంటాడు మీ బావయ్య.

సీతాపతి (తిరిగి కందిపప్పు అందుకోబోగా, మహలక్ష్మమ్మ తానే చారెడు తీసి, అతని చేతిలో పోస్తుంది) : తనలా అందరూ నమలకుండా మింగాలంటాడు. ఇప్పుడేమంత పట్టించు కోకుండా తిరిగినా, నాలుగేళ్లు పైబడితే, అంతా వాడే దిద్దుకు పోడూ?“తుళ్ళే యెద్దే గోనె మోసేది.”

మహలక్ష్మమ్మ : ఇప్పుడైనా ఏవో మీటింగులు. గీటింగులైతే వెళ్ళడం తప్ప, వాడైనా ఏమీ అల్లరి చిల్లరిగా తిరగడం లేదు.

సీతాపతి : అల్లరి చిల్లరిగా తిరగడానికి వాడు దద్దమ్మ టమ్మా? చిన్నతనం నుంచీ చక్కగా చదువుకున్నాడు. మా దేభ్యాన్ని చూడు! మూడేళ్ళ నుంచీ ఇంకా మూడోక్లాసులోనే మిటకరిస్తున్నాడు. “అన్నం చొరవే కాని, అక్షరం చొరవ లేదు.” ఆఁ! అమ్మాయ్! అన్నమంటే చప్పున జ్ఞాపక మొచ్చింది. ఈ మండు టెండాకాలంలో కూరా నారా లేక ఏమి యిబ్బంది పడుతున్నా మనుకున్నావ్!

మహలక్ష్మమ్మ : ఔ నన్నయ్యా! అందరికీ చెడ్డ యిబ్బందిగానే వుంది.

సీతాపతి : నిజమే నమ్మా! ఇంతో అంతో అందరికీ యిబ్బందిగానే వుంది. కాని, మాకు మరీనీ! ముతక సామెత చెబుతారు చూచావ్ : “మొగుడు లేకపోతే అప్ప మొగుడు; కూర లేకపోతే పప్పుకూర” - అలా వుంది మా పని. సాంబారు కారం, మామిడికాయ పచ్చడి పూటపూట యెదానవేసి కొట్టుకుంటున్నాం. నోరు చవి చచ్చిపోయిందంటే నమ్ము. అయితే, అమ్మాయ్! మా బావ వామిదొడ్డిలో కందా పెండలం పండించాడటగా? నీకు పుణ్య ముంటుంది మాకు కాస్త పంపిద్దూ!

మహలక్ష్మమ్మ : ఆఁ! దాని కేమి భాగ్యం! రేపో మాపో అలాగే పంపిస్తాలే, అన్నయ్యా!

సీతాపతి : తోడబుట్టిందైనా అంత మాట మా మంగినోట వొచ్చింది కాదు. “మాటలు తేటలు మాయింటను; మాపటి భోజనం మీ యింటను” అంటుందది. సరిగాని అమ్మాయ్! నే నెళ్ళి మన వెంకట్రావును కూకేసి రానా? రామయ్య (దస్తావేజుతో చావిడిలోకి తిరిగి వస్తూ):వొద్దులే! వాడికేం తీపరమా?వాడి కడుపు కాల్తే వాడే వస్తాడు.

మహలక్ష్మమ్మ : మీదంతా అడివిగోల! కాస్త వెళ్ళి పిలుచుకు రానిద్దురూ! వాడికోసం నేను కనిపెట్టుకు కూర్చున్నా.

రామయ్య (తిరిగి పడకకుర్చీలో కూర్చుంటూ):వాడు పెత్తనాలు చేస్తుంటే, వాడికోసం నువ్విగరడం దేనికి? నువ్వెళ్ళి భోంచెయ్యి.

మహలక్ష్మమ్మ : నా మాట కే మొచ్చె? భోంచేస్తా లెండి.

రామయ్య : వాడికోసం కనిపెట్టుకు కూర్చుంటూ వేళకూ, పాళకూ తిండి తినకపోతేనే ఈకాడి కొచ్చావ్. నువ్వు మూలబడితే ఇంటి చాకిరి నీ సవితి ఎవతొచ్చి చేస్తుంది?

మహలక్ష్మమ్మ (కోపంగా, చేట పుచ్చుకు లేచి) : చాల్లెద్దురూ! ఎవరైనా వింటే నవ్విపోతారు. బాగూ, ఓగూ లేదు. నోటి కెంతొస్తే అంతా అనేస్తారు.(పడమటింటిలోకి చరచర వెళ్ళిపోతుంది.

సీతాపతి (ఒక క్షణం తర్వాత) : ఏదీ, రామయ్య బావా! పుగాకు తునక.

రామయ్య (జేబులో నుంచి పొగాకు లెదర్ కేస్ తీసి, ఒక తునక అందిస్తాడు. తనకోసం ఒక తునక తీసుకుని, కేసును మళ్ళీ జేబులో పెట్టుకుంటూ) : కుర్రవాడు పెరిగొచ్చాడు గదా, ఇఖ చిన్నపనికీ పెద్దపనికీ ఆదుకుంటా డనుకున్నా. నేనైనా ఇంకెంత కాలం మొయ్యగలను ఈ బరువంతా?

సీతాపతి (పొగాకు వాసన చూస్తూ) : ఆఁ! నీ బరువు నీకే కాని వాడికేం తెలుస్తుంది. "మోసేవాడికే తెలుసు కావిడి బరువు.”

రామయ్య : నేనైనా ఒఖ్కసారిగా వాణ్ణి బరువంతా యెత్తుకో మన్నానా? ఇప్పటినుంచీ కాస్త కాడికింది కొస్తే మంచిదని మొత్తుకుంటున్నా.

సీతాపతి (పొగాకును పాయతీసి, ఉఁడచేసి, రొంపిని దోపుకుంటూ) : అదీ నిజమే!“మొక్కై వొంగనిదే మానై వొంగుతుందా?"పొలంపని చేతనైనా, కాకపోయినా, ఇప్పటి నుంచీ ఏదో కాస్త కలుగజేసుకుంటూ వుండాలి మరి.

రామయ్య : పొలంపని చేతకాకపోతే పాయె! కరణం లెఖ్కలూ, కోర్టు దస్తావేజులూ అయినా చూసుకోరాదూ? బియ్యే వరకు మిడికినవాడికి ఆమాత్రమైనా చేతకాదూ?

సీతాపతి : “చదువుకున్న వాడికంటె చాకలివాడు మేలు.” ఏమిటో ఈ కాలం చదువులు! బియ్యె, గియ్యె సతికా మంటారుగాని, చివరికి చూడబోతే నోటుమీద వసూలెయ్యడమైనా చేతకాదు.

రామయ్య : ఏం చదువులో చట్టుబండలు! మొన్న ప్లీడరుగారి దగ్గరి కెళ్ళి, దావా వాయిదా వేయించుకు రారా అంటే, తెడ్డేమిరా కదిలాడు కాదు.

సీతాపతి : “మాటలు కోటలు దాటతాయి; కాలు గడప దాటదు.”

రామయ్య: అబ్బే! అదీ లేదు. ఇంటి పనికైతే మొండి కాని, ఊళ్ళో పనికైతే యెగిరి గంతేస్తాడు. అడ్డమైన పనికీ, అడ్డమైన వాడితో, అడ్డమైన చోటుకు తిరిగి, కొంపకేమి చేటు తెస్తాడోనని బెంగపడి ఛస్తున్నా.

సీతాపతి : నిజమే రామయ్య బావా!“పోరాని చోట్లకు పోతే, రారాని మాటలు రాక మానవు”. తన కేమి తక్కువ? మహరాజులా అనుభవిస్తూ ఇంటి పట్టున కూర్చోక, లేని పోని గొడవలన్నీ మనవాడి కెందుకో? కాలిది తీసి, నెత్తికి రాసుకోవడ” మంటారు దీన్నే.

రామయ్య : అబ్బబ్బబ్బే; ఇంటిపట్టున కూర్చుంటే యెలా? అయితే, మరి సభ లెవరు తీరుస్తారు? ఉపన్యాసా లెవరిస్తారు?

సీతాపతి : "పగటి మాటలు పనికి చేటు; రాత్రి మాటలు నిద్రచేటు.” ఎందుకొచ్చినట్టు ఈ సభలూ, గిభలూ. (రామయ్య తుమ్ముతాడు) చూచావ్, నామాట నిజం! "తుమ్ము తమ్ముడై చెబుతుంది”. సరిగాని, రామయ్య బావా! నా ఆకుమడి బొత్తిగా అంటనే లేదు. దరిద్రుడు తలగడగబోతే, వడగండ్లవాన వెంబడే వచ్చిం”దట. పదిపోగుల ఆకు తక్కువ పడితే, నువ్వు ఎలాగైనా కాస్త మాట దక్కించాలి.

రామయ్య : తడు పందక మా ఆకుమడీ అంతంత మాత్రంగానే వుంది. మీ తమ్ముడు లక్ష్మయ్య నడగరాదూ? ఎకరం మడిపోశాడట.

సీతాపతి : "నంబీ! నంబీ! నా పెళ్ళి కేమి సాయం చేస్తావంటే, నే నెదురు రాకపోవడమే సాయమన్నా"డట. అబ్బే! వాడి నడిగితే మాట పోతుంది. కాస్త రాలిస్తే నువ్వే రాల్చాలి.

రామయ్య : సరే! వీలును బట్టి చూస్తాలే!... ఏమైనా పొలంపనీ, ఇంటిపనీ, కోర్టుపనీ - అన్నీ నేనే చూచుకోవాలి. వాడేమీ పట్టించుకోడుగదా? ఇటు వ్యవసాయానికీ, అటు ఉద్యోగానికీ కాకుండా చెడిపోయాడు. తాలూకా సభలనీ, జిల్లా సభలనీ చీటికీ మాటికీ బస్సెక్కి బస్తీలకు పరిగెత్తడం ప్రారంభించాడు కూడా. తన కోసం రామయ్య తీసి పెట్టుకున్న పొగాకు తునక కుర్చీపక్కకు జారి పడుతుంది. అతడు దాన్ని గమనించడు.

సీతాపతి (రామయ్య దగ్గరికి జరిగి, జారిపడిన పొగాకు తునకను కాజేస్తూ): “చెబితే సిగ్గు, దాస్తే దుఃఖం." వాడున్నాడే - వాడు, రామయ్య బావా! - కొత్తపేట కోటయ్యగారి రెండోవాడు వాడి పేరేదో యేడ్చింది! ఆ వెధవ జతపట్టి మన వాడు మరీ విధం చెడుతున్నాడు.“మింగబోతే మెతుకు లేదు; మీసాలకు సంపెంగ నూనె" అన్నట్టుగా వాడి నీటు, వాడి గోటు నువ్వెప్పుడైనా చూశావా?

రామయ్య : వాడా? వాడి పేరు గుర్నాధం కాదూ?

సీతాపతి : ఆఁ! వాడే! కన్నేల పోయెనోయి కనకలింగమా అంటే, చేసుకున్న ఖర్మమోయి శంభులింగమా” అన్నాట్ట. ఆ వొంటికంటి వెధవ జతపట్టాకే మనవాడిలా తయారయ్యాడు.

రామయ్య : మన కొక అంటా, సొంటా? వాడితో వీడికి జత లేమిటో?

సీతాపతి : అంటూ, సొంటూ కాకపోవడ మేమిటి?“వాడి తండ్రీ, వీడి తండ్రీ సయానా మగవాళ్లు” కారూ?

రామయ్య : అప్పులపాలై వాడు కొంపా గోడూ తెగనమ్ముకున్నాడు. వాడితో...

సీతాపతి : కొంపా గోడూ లేకపోతే మాత్రమేఁ? పొద్దస్తమానం చేతిలో సంచొకటి వుంటుందిగా?ఇల్లు కాలింది జంగమయ్యా అంటే, నా జోలే, కప్పెరా నావద్దే వున్న"వన్నాట్ట.

రామయ్య : ఆ గుర్నాధం తాడూ బొంగరం లేని సన్నాసి, సభలనీ, సంఘాలనీ రెండు, మూడు దఫాలు జెయిలుక్కూడా వెళ్ళాడు! వాడికేఁ! వా డెన్ని వేషాలైనా వేస్తాడు.

సీతాపతి : ఔను! “కోటి విద్యలు కూటి కొరకే.” వాడికేఁ! వాడన్నింటికీ తెగించి కూర్చున్నాడు. ఆ గుర్నాధంగాడు “నాడువుంటే నవాబుసాయబు, అన్నంవుంటే అమీరుసాయబు, బీదపడితే పకీరుసాయబు; చస్తే పీరుసాయబు." ఏం జరిగినా, వాడికి పోయే దేదీ లేదు.

రామయ్య (మనస్సు ఎక్కడో వున్నట్టు) : ఔనౌను.

సీతాపతి : దేశసేవ, గీశ సేవ అంటూ ఆ సన్నాసి ఏమేమో పేలుతూ వుంటాడనుకో! కాని, “చెప్పేవాడికి సిగ్గు లేకపోతే, వినేవాడికైనా వివేకం వుండొద్దూ". పైగా, తనే బ్రహ్మాండ నాయకుడైనట్టు వాడు ఊళ్ళో వాళ్ళందరికీ పేర్లు పెడుతూ వుంటాడు. సామెత చెబుతారు చూచావ్ - "కురూపియేమి చేస్తున్నాడంటే, సురూపాలన్నీ లెక్కపెడుతున్నా" డన్నట్టు వాడికి మరొక పనే లేదు.

రామయ్య (నిట్టూరుస్తూ) : ఊఁ! ఆ బికారితో సమానంగా తిరిగితే ఇఖ మావాడు ముందు కొచ్చినట్టే! చూడగా నా బ్రతుకంతా బుగ్గయిపోయేలా వుంది. వాడికోసం కాకపోతే, ఈ దేవులాటంతా నాకు దేనికి?

సీతాపతి : ఎవరైనా రేపన్న రోజున్నదని కొనాలి.“రూకలేనివాడు పోక చెయ్యడు."పోనీ, మంచో చెడ్డా తనకోసం తను ఖర్చు పెట్టుకుంటున్నాడు సరే! కాని, వాడికోసం కూడా మనవాడు ఖర్చు పెట్టడం దేనికి? అంతో, ఇంతో ముట్టినంత వరకు వాడు బాగానే అంట కాగుతాడు. వెనకటికి “ఎక్కడికి పోతావు విధవమ్మా?” అంటే, “వెంటనే వస్తాను పదవమ్మా” అనిందట. వాడితో ఈతం చేస్తే మన వెంకట్రావు... (వెంకట్రావు ప్రవేశిస్తాడు.ఇరవై యేళ్ళవాడు. తల్లి పోలికల కంటె తండ్రి పోలికలే యెక్కువ. ఖద్దరు ధోవతి కట్టుకుని, రౌండ్ కాలర్ ఆఫారం వేసుకున్నాడు.

వెంకటరావు : సీతాపతి మామయ్యా! నా ప్రశంస చేస్తున్నా వేమిటి?

వెంకటరావు : ఏమీ లేకపోవడ మేమిటి? ఇప్పుడే ఏమిటో అంటున్నావుగా?

సీతాపతి : ఆఁ! ఏం లేదురా, బాబూ!

వెంకటరావు: ఏమీ లేకపోవటమేమిటి? ఇప్పుడే అంటున్నావుగా?

సీతాపతి : అబ్బే! మరేమీ లేదు. నువ్వింకా అన్నానికి రాలేదని మీ అమ్మంటే మాటెంట మాటొచ్చింది.

వెంకటరావు : ఏమైనా నావూసు నీకు దేనికి?

సీతాపతి : “దూడా, బర్రె వుండగా గుంజ అరిచిం” దన్నట్టు, నీవూసు నాకు దేనికిరా, బాబూ! ఇంత పొద్దుపోయింది, ఇంకా అన్నానికి రాలేదని మీ అమ్మంటే...

మహలక్ష్మమ్మ (పడమటింటిలో నుంచి వచ్చి) : ఔనురా, నాయనా! ఇంత పొద్దయేదాకా వుండకపోతే, వేళ కొచ్చి రెండు మెతుకులు తిని వెళ్ళరాదూ?

వెంకటరావు : ఏమంత పొద్దు పోయిందమ్మా? నీ దంతా చోద్యంకాని! ఇంకా తొమ్మిదైనా కొట్టలేదు.

రామయ్య : ఉహుఁ! పొద్దు పోనేలేదు. మరి కాసేపు పెత్తనాలు మిడికిరా!

మహలక్ష్మమ్మ : సర్లేమీ రూరుకుందురూ! వా డింటి కొచ్చేసరికి కసురుకుంటారు. (కొడుకుతో) రా, నాయనా! నువ్వు రా! కాళ్లు కడుక్కో! అన్న మొడ్డిస్తా.(మహలక్ష్మమ్మ పడమటింటిలోకి వెడుతుంది; వెంకటరావు అనుసరిస్తాడు.

రామయ్య: చూశావా, వాడి వాలకం! నిజానికి దాని అలుసు చూసుకునే వా డింత నెత్తి కెక్కాడు. పనిపాటులు లేక పోయినా, వేళకు భోజనం చెయ్యడానికైనా తీరుబాటు కావడం లేదు.

సీతాపతి : "కుక్కకు పనీ లేదు! తీరుబాటూ లేదు” అని వెనుకటికి నీబోటి పెద్దవా డెవడో సామెత చెప్పలేదూ, రామయ్య బావా?

వెంకటరావు(పడమటింటిలోనుంచి చరాలున తిరిగివచ్చి):ఏమిటది? పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్!

సీతాపతి : "మనుషు లుండరు గాని, మాట లుంటా” యని పెద్దలన్నారు. కాస్త పెద్దంతరం, చిన్నంతరం చూసి మాట్లాడు.

వెంకటరావు : "మంచి మనిషికొక మాట; మంచి గొడ్డుకొక దెబ్బ” అని కూడా పెద్ద లన్నారు, మా గడప తొక్కొద్దని నీ కెన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ ఎందు కొచ్చావ్?

సీతాపతి : “మాటకు మాట తెగులు; నీటికి నాచు తెగులు.” నీతో నాకు మాట లెందుకులే?

వెంకటరావు : నీ సామెతలు, గీమెతలు కట్టి పెట్టు, ఆ పప్పులు నా దగ్గి రుడకవ్. జాగ్రత్తగా మసులుకోకపోతే...

రామయ్య : సర్లే! ఇఖ ఆగు! సంతోషించాం!(సీతాపతి పైకి ఉరకబోతాడు.)

సీతాపతి : కాగే కాగే పాలు, రామయ్య బావా! “పిల్లకాకి కేమి తెలుసు వుండేలు దెబ్బ.”

వెంకటరావు (ఆగిపోయి) : ఛీ! నోరుముయ్!

రామయ్య (కోపంతో గద్దిస్తూ) : ఆఁ!

మహలక్ష్మమ్మ (కేక విని లోపలినుంచి అడుగులో వచ్చి) : నాకు వొక్కగాను వొక్క కొడుకు. వాడింటి కొచ్చేసరికి ఏదో ఒక రభస ప్రారంభం!

సీతాపతి : “ఒక కన్ను కన్నూ కాదు; ఒక కొడుకు కొడుకూ కాదు.”

రామయ్య : (ఒకేసారిగా) ఛా ఛా! అశుభం మాట!

మహలక్ష్మమ్మ : ఛీ ఛీ వంకరకూత!

సీతాపతి : “పడ్డవారు చెడ్డవారు కాదు.” సరే! అనండనండి!“వోరిస్తే వోరుగల్లే పట్న మౌతుంది.”

రామయ్య (తమాయించుకుని) : అంటే నీకు కోపం కాని నువ్వన్న మా టేమిటి, సీతాపతీ?

వెంకటరావు : "శుభం పలకరా మంకెన్నా అంటే, పెళ్ళికూతురు ముం డేదన్నాడట.” ఈ సామెత నీకు రాదేమిటి? సీతాపతి మామయ్యా!

సీతాపతి (దీన్ని వినిపించుకోకుండా) : ఏదో నోరు జారిందిలే, రామయ్య బావా!

వెంకటరావు (విడిచి పెట్టకుండా) : కాని, సీతాపతి మామయ్యా!“కాలు జారితే తీసుకోగలం కాని, నోరు జారితే తీసుకోగలమా?”

సీతాపతి (దీన్నికూడా విననట్టే) : రామయ్యబావా! "బ్రహ్మకైనా వుండు రిమ్మతెగు” లన్నారు. నే నన్నది పొరపాటే.నువ్వు దాన్ని మనసులో పెట్టుకోబోకు.మరి నే వెళ్ళొస్తాగాని, నారు మాట మర్చిపోబోకు సుమీ.

రామయ్య : అబ్బే! వీల్లేదు సీతాపతీ! మాది మాకే చాలదు.

సీతాపతి : “దంచి నమ్మకు బొక్కిందే కూలి.” సర్లే! ఇంకొక పుగాకు తునకైనా ఇలా పారెయ్.

రామయ్య : ఇందాక చెయ్యి జారింది చాల్లే.

సీతాపతి : నాకు తెలుసుగా నీ సంగతి. “ఎక్కడైనా బావగాని, వంగతోట దగ్గర మాత్రం బావ కాదు.” మరి నే నెల్లొస్తాగాని, లక్షువమ్మా! నీ వొళ్లు కాపాడుకో! అసలే బక్క ప్రాణం. రేప్పొద్దున్నుంచీ మజ్జిగనీళ్ళకు పిల్లవాణ్ణి పంపుతా మమ్మా!

మహలక్ష్మమ్మ : ఒక్క గేదె పాడి. అబ్బే! మాకే తిన్నగా యిల్లు గడవడం లేదు.

సీతాపతి : పోనీ లేవమ్మా! వీలు లేనప్పుడు నువ్వేమి చేస్తావు గాని, కాస్త కందా పెండలమైనా పంపిస్తావుగా?

మహలక్ష్మమ్మ : ఊఁ! కందా పెండలం మే మిక్కడ ఆరబెట్టుకు కూర్చోలేదు. (వెంకటరావు పకపక నవ్వుతాడు.

సీతాపతి : నవ్వకు, బాబూ! నవ్వకు. "నవ్వు నాలుగు విధాల చేటు.”(దారిని పడుతూ) ఇలా నవ్వినవాళ్ళను చాలామందిని చూశాం. "నడమంత్రపు సిరి నరాలమీది కురుపు.”

వెంకటరావు : నీ బొంద!

వెంకటరావు: (ఒకేసారిగా)నీ బొంద!,

రామయ్య : ఆరి భడవా!,

మహలక్ష్మమ్మ : నీ తల పగల!తెర) 


వెలుగు నీడలు[మార్చు]

(జీవిత ఖండం)

పాత్రలు: వెంకయ్య - సన్నకారు రైతు, రత్తమ్మ-అతని భార్య, గోపాలరావు- అతని కొడుకు,  నరసమ్మ - అతని తల్లి. 

స్థలం : వెంకయ్యగారి యింటివసారా

కాలం: వర్తమానం

గమనిక : ఈ నాటిక ఈ సంపుటిలోని తక్కిన అన్నింటివలె స్వతంత్ర రచన. ఇది దేనికీ అనువాదం కాదు;

అనుసరణైనా కాదు. కాని, దీనిలో హెరాల్డ్ ఛాపిన్ వ్రాసిన "ది డంబ్ అండ్ ది బ్లయిండ్” అనే ఏకాంక నాటిక “ఇన్ఫ్లుయెన్స్” కనబడుతుంది. దాన్ని చదివి వుండకపోతే, దీని రచన బహుశా జరిగివుండేది కాదు. అది వెంకయ్యగారి యింటివసారా. రాత్రి ఏడుగంటల ప్రాంతం. వసారాలో కుడివైపున వాల్చి వున్న కుక్కి నులకమంచం; ఎడమ వైపున తవుడుమూట, ఉలవలబస్తా, వడ్లసంచులు వగైరా. వసారా మధ్యగా (ప్రేక్షకులకు ఎదురుగానున్న గోడ నడిమిని) లోపలి యింటి ద్వారం. ఈ ద్వారబంధానికి ఎడమ పక్కగా గోడకెత్తి పెట్టివున్న మరొక నులకమంచం. ఇంటిలోపలికి వెళ్ళే ద్వారానికి కాస్త కుడిపక్కగా పాతకాలపు దీప స్తంభంపై కిరసనాయిల్ దీపం బుడ్డి.

వాల్చివున్న నులకమంచం నడిమిని నరసమ్మ చిరుగుపట్టిన జంఖానా పక్కగా వేసుకొని కూర్చుని వుంటుంది.

వయస్సు డెబ్భై ప్రాంతాలగాని, అరవై మించినట్టు ఒప్పుకోదు. వయస్సు పూర్తిగా మళ్లినదైనా ఓపిక ఉడగ లేదు; చూపుకూడా ఏమంత తగ్గలేదు.

దీపపు బుడ్డి వద్ద పుస్తకాలు చుట్టూ పరుచుకుని, గోపాలరావు - ఈ అబ్బాయి ముద్దు పేరు “గోపి” - పాఠాలు చదువుతూ వుంటాడు. ఏ డెనిమిదేళ్ళవాడు. నాయనమ్మ శిక్షణ కారణంగా ముదిమాటలు మాట్లాడ్డం కద్దు. రత్తమ్మ గయ్యాళివలె పైకి కనబడినా, మనస్సు మెత్తనిదే. సంస్కారం శూన్యం. దానికి లేమి తోడైంది. కోడికూతతో లేచినా రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటలవరకు తెమలని పని. అంతూ పంతూలేని పనివల్లనే చెడ్డ విసగటగా వుంటుంది. వయస్సు ముప్ఫై అయిదుకు మించదుగాని, నలభై నిండినట్టు కనబడుతుంది. లేక లేక ఒక పిల్ల, ఒక పిల్లవాడు కలిగారు.

వెంకయ్య నలభై ఏళ్ళవాడు. రెండు, మూడెకరాల ఆసామి. చిన్న పాలేరైనా లేకుండా సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న వాడు. వ్యవసాయపు పనులు లేని రోజులలో కిరాయి ఆడతాడు. పొద్దస్తమానం నడుములు విరిగేలా పాటుపడేవాడు కాబట్టే, చిర్రు బుర్రు లాడుతూ వుంటాడు.

తెర లేస్తుందనగానే ఎక్కాలు చదువుతున్న గోపి పొలికేకలు, మంచం నడిమిని కూర్చుని గాలితోనైనా పోట్లాడగల నరసమ్మ సణుగుడు ప్రారంభమౌతుంది.

గోపి (తాపీగా) : ఒక ఏడు ఏడు; రెండేళ్ళు పధ్నాలుగు; (గబగబ) మూడేళ్ళు ఇరవై ఒకటి; నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది; అయిదేళ్ళు ముప్ఫైయేడు (తనకే సందేహం తోచగా, కళ్ళు తెరిచి, ఎక్కాల పుస్తకం చూచి, తప్పు దిద్దుకుంటూ) అయిదేళ్ళు ముప్పై అయిదు; ఆరేళ్ళు నలభై రెండు; ఏడేళ్ళు నలభై తొమ్మిది; ఏడేళ్ళు నలభై తొమ్మిది; ఎనిమిదేళ్ళు... ఎనిమిదేళ్ళు... ఆఁ!... ఎనిమిదేళ్ళు... ఊఁ!... ఎనిమిదేళ్ళు (కళ్ళు మరింత గట్టిగా మూసుకుని) ఆఁ!... ఊఁ!... ఎనిమిదేళ్ళు (తుపాకి పేల్చినట్లు) యాభై ఆరు; తొమ్మిదేళ్ళు అరవైమూడు (గమ్యస్థానాన్ని చేరేటప్పుడు కలిగే సంతృప్తిని ధ్వనిస్తున్నట్టుగా) పదేళ్ళు డెబ్బై (దీపం బుడ్డి పైకి వంగి) పదకొండేళ్ళు...

నరసమ్మ : జుట్టు కాలేను. తిన్నగా కూర్చోరా, బాబూ!

గోపి (విసుగ్గా) : ఏమిటే నాయనమ్మా! చెవికింద నీ రొద. నేను చదువుకుంటావుంటే...

నరసమ్మ : సదువూ, సట్టుబండలూ! దీపంమీదికి వొంగబడతావు దేనికిరా? కాస్త అవతలికి జరుగు. నీకు పున్నె ముంటుంది.

గోపి : అబ్బ! సరేలేవే! (మళ్ళీ తన ధోరణిలో పడి) పదేళ్ళు డెబ్బై; పదకొండేళ్ళు డెబ్బైయేడు (పట్టు విడుస్తున్నట్లు) పన్నెండేళ్ళు ఎనభైనాల్గు. ( గోపి వెనుకకు వెళ్ళి ఎక్కం వల్లిస్తుంటాడు. నరసమ్మ తనలో తనేమో గొణుక్కుంటూ వుంటుంది. ఇంతలో లోపలినుంచి చంటి పిల్ల ఏడ్పు ప్రారంభమౌతుంది.

గోపి (ఎక్కం వల్లించడం చాలించి) : అమ్మా! అన్నం పెట్టవే!

రత్తమ్మ (లోపలినుంచి) : ఆగరా! కాస్త ఆగు! చె య్యూరికే లేదు. పెడతాలే.

గోపి : నా కాక లేస్తున్నదే, అమ్మా!

రత్తమ్మ (లోపలినుంచే) : ఆగమనేది నిన్ను కాదట్రా!

గోపి (మారాం చేస్తున్నవాడివలె) : ఉహుఁ! ఇప్పుడే పెట్టాలి!

నరసమ్మ : ఆడి కడుపు సచ్చిపోతున్నది. ఆడికి రెండు మెతుకు లెట్టరాదటే, రత్తమ్మా!

రత్తమ్మ (చరచర వసారాలోకి వచ్చి) : నీకేం? మంచం నడిమిని కూర్చుని ఎన్నైనా చెబుతావ్!ఇక్కడ ఈ మాయదారి పిల్ల కుయ్యో, మొర్రో మని యేడుస్తుంటే, ఎట్టా పెట్టమంటావ్?

నరసమ్మ : దాని కడుపుకి ఆమదం పెట్టకపోతే...

రత్తమ్మ : పెట్టకేం! పొద్దున్నేగా మండబెట్టింది.

నరసమ్మ : దాని కింకా ఏడాదైనా వెళ్ళలేదు. వారాని కొకసారి ఆమదం పెట్టుకుంటా రటేఁ? మా కాలంలో...

రత్తమ్మ (వెటకారంగా) : ఊఁ! మీ కాలంలో?

నరసమ్మ : నాకు దేనికిలే తల్లీ? నే నేమన్నా నీకు కంపరంగానే వుంటుంది.

గోపి : అబ్బ! అన్నమే అమ్మా!

రత్తమ్మ : ఏమంత పొద్దుపోయిందని? ఇప్పుడేగా దీపా లెట్టింది! ఆ సతుకుడేమిటో మరి కాసేపు సతుకు.

గోపి : ఇవ్వాల్టికి పాఠాలన్నీ చదివేశానే.

రత్తమ్మ : రెండు పొలికేక లెట్టేసరికి ఇవ్వాల్టికి చదువైపోయిం దన్నమాట. మొన్న పరిచ్చలో అన్నీ గుండు సున్నాలొచ్చాయి. సదువంటే నీకు గొంతు పట్టుకుంటుంది. తినమంటే తింటావ్ ఒక బొచ్చెడైతే.

గోపి : ఉహుఁ! నేనిక చదవను.

రత్తమ్మ : ఇఖ చదవ్వేం? ఏదీ పుస్తకం పట్టు! పడతావా, ఈ చెంపా, ఆ చెంపా వాయించమంటావా?

గోపి : ఉహుఁ!

రత్తమ్మ (చెయ్యెత్తి) : పట్టు! పుస్తకం పట్టు!

గోపి (ఏడుపు ముఖం పెట్టి) : ఊఁ! ఊఁ! ఉఁ!

నరసమ్మ : ఆడి పైన సేయి సేసుకుంటా వెందుకే? ఆడి కాకలై ఆడు కొట్టుకుంటూంటే...

రత్తమ్మ ( పిల్లవాడి వైపునుంచి అత్తవైపు తిరిగి) : సర్లే! గారాం చేసి నువ్వే వాణ్ణి సగం చెడగొడుతున్నావ్!

నరసమ్మ : మేమూ కన్నాం పెంచాం కాని, ఇంత యిడ్డూరం ఎక్కడా యెరగ మమ్మా!

రత్తమ్మ : నేనూ చాలామంది అత్తముండల్ని యెరుగున్నాకాని...

నరసమ్మ : అయ్యొ! అయ్యొ! ఎంతమాట! పెద్దదాన్ని నన్ను పట్టుకుని ముం డంటావటేఁ?

రత్తమ్మ : ఆమాట నే నన్నానా?

నరసమ్మ : అనలా? అని లేదంటావు దేనికి?

రత్తమ్మ : ఒట్టు వేసుకుంటావ్ ఆమాట నే నన్నానని?

నరసమ్మ : ఎదురు ఒట్టుకూడా దేనికిలేఁ! ఇంతకూ నాకు సావురావడం లేదు. ఆ మారాజుండగానే, నేను మట్టి కలిసిపోతే అందరిచేతా ఈ మాటలుపడే ఖర్మ నాకెందుకు పట్టేది? కాలూ, సెయ్యీ ఆడుతుండగానే తను దాటుకుని, నన్ను ఈ ముళ్ళ కంపలో పెట్టిపోయాడు. (ఇలాగే నరసమ్మ ఏమేమో గొణుగుతూనే వుంటుంది. మధ్య మధ్య ముక్కు చీదివేస్తూ వుంటుంది.

రత్తమ్మ (తిరిగి చెయ్యెత్తి) : చదువుతావా? రెండొడ్డించ మంటావురా?

గోపి (వాచకం తీసి గొణుగుడుగా) : ఒక పట్టణమున ధనవంతుడగు వైశ్యు డొక డుండెను. అతని...

రత్తమ్మ : ఏం! అంకిళ్ళు నొక్కుకు పోయాయా? గొంతే లేవడం లేదు!

గోపి (బిగ్గరగా, కాని, గాద్గదికంగా) : బిడ్డ లొక్కచో జేరి యాడుకొనుచుండగా, నొక కాకిపిల్ల వారి సమీపమున బడెను. దానిని సంతోషమున...

రత్తమ్మ : అంతేలే! నీకు చదువు పేరు చెప్తేనే వలవల యేడు పొస్తుంది.

గోపి (ఏడుపు దిగమింగడానికి ప్రయత్నిస్తూ) : దానిని సంతోషమున దీసుకొని, యా బిడ్డలు దినదినము తమ యెంగిళ్ళు పెట్టి దానిం బెంచిరి. అదియు మిక్కిలి కొవ్వి, గర్వించి...

రత్తమ్మ (లోపల పిల్ల ఏడ్పు ఎక్కువ కాగా) : ఆసి దీని పీకపిసక! ఏమి యేడుస్తున్నది! ఏమి యేడుస్తున్నది!!(రత్తమ్మ లోపలికి వెళ్లిపోతుంది.

గోపి (మధ్య ఒక క్షణంపాటు ఆపిన చదువును తిరిగి సాగిస్తూ) : అదియు మిక్కిలి కొవ్వి, గర్వించి, ప్రపంచమున దానిపాటి పచ్చులు లేవనియు, బ్రమ్మదేవుడు స్రుష్టించిన సమస్త పచ్చులకు దాను సార్వభౌముడనియు భావించి, యెవ్వరిని సరకు సేయకుండెను. అటులుండ నొకనాడు అంసలు కొన్ని సముద్రతీరమున వాలియుండ వైచ్యపుత్రులు కాకికి అంసల జూపి యిట్లనిరి : “ఓ పచ్చిరాజా! పచ్చులకన్నింటికీ నీవు చక్రవర్తివి. నీవలె బాడగల పచ్చి లేదు. నీవంటి యందమైన పులుగు లేదు. నీలాగున నెగిరి పరుగెత్తగల వియంగములేదు. ఈ అంసల జూడుము...” (లోపల పిల్ల ఏడుపుతోపాటు రత్తమ్మ విసుగుదల, రత్తమ్మ విసుగుదలతోపాటు పిల్ల యేడుపు ఎక్కువౌతూ వుంటాయి. బుజ్జగింపుల మధ్య “నీ తిల్లికార!”, “నీ కడుపుడక”, “నా ప్రాణానికి నువ్వెక్కడ దాపరించావే!” మొదలైన దీవనలు వినబడుతూ వుంటాయి. తల్లి వేరే ధ్యాసలో వున్నది కదా అని గోపాలరావు చదువు మానివేసి వాచకాన్ని విసిరి కొడతాడు.

నరసమ్మ(రహస్యం చెబుతున్నట్టు): దెబ్బలెందుకు పడతావురా,బాబూ! సదువుకో! మరి కూసేపు సదువుకో!

గోపి : ఉహుఁ!

నరసమ్మ (అంకిలి నొక్కుకుంటూ) : అదొచ్చిందంటే... మళ్ళీ యిరుసుకు పడుతుందిరా! సదువుకో! నా మాటిని సదువుకో!

రత్తమ్మ (లోపలినుంచి వచ్చి) : వీపు దెబ్బల కేడుస్తున్న దేమిరా? మళ్ళీ మానేసి కూర్చున్నావ్?

గోపి (చేతికందిన పుస్తకం చప్పున తీసి, మధ్యలో విప్పి) : మొండె మందలి వెన్నెముక, వెన్నుపూస లనబడు ముప్పది మూడు చిన్న యెముకలచే కూర్పబడి యున్నది. (రత్తమ్మ లోపలికి వెళ్ళిపోతుంది.) ఎడమబాగమందు ఏడు, రొమ్ముబాగమందు పండెండు, నడ్డి బాగమందు ఐదు, తుంటి బాగమందు అయిదు, తోక బాగమందు నాలుగు...

నరసమ్మ : తుంటేమిటి? తోకేమిటి? ఏమి సదువు యివి? మాకాలంలో మే మిలాంటి వెరగం. ఏదో బారతమనీ, బాగోతమనీ, రామాయనమనీ - అంతేగాని మేమీ సోద్యా లెరగం. ముసిలిముండని, నేనుకూడా కాస్త యింటా. పద్దెమేదైనా సదవరాదటరా, బాబూ!

గోపి : ఊఁ! పోవే, నా కాకలై నే చస్తూవుంటే...

నరసమ్మ : నిజమేరా, బాబూ! సదువుకునే వాళ్ళ కసలు యేడి తల కెక్కుతుంది. ఏళకూ పాళకూ ఆళ్ళకు తిండీ తిప్పలూ లేకపోతే, మెదడు కరగిపోతుంది. మా కాలంలో... సర్లే! ఎందుకొచ్చింది కాని మరి కూసేపు సదువుకో బాబూ! నా నాన్నవుగా! నేను యింటా! ఏదీ!... ఒక పద్దెం సదువు.

గోపి ఏం పద్దెం సదవను?

నరసమ్మ : ఏదో వొకటి.

గోపి : నీ కొచ్చింది.

ఎలుక తోలు తెచ్చి ఎందాక నుతికినా *నలుపు నలుపెగాని, తెలుపు కాదు;కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా *విశ్వదాభిరామ వినురవేమ.

నరసమ్మ : తుంటీ తోకా ఐందీ - ఎలికీ, పిల్లీ, కుక్కా నక్కా అని మొదలెట్టావ్! రామా, క్రిష్ణా అనే ముక్క చెవినేసుకుందామంటే, అది యినపడనే యినపడదుగదా!

గోపి : "విశ్వదాభిరామ వినురవేమ”లో “రామా” లేదటే?

నరసమ్మ : రామాయనంలో ఎలికీ, పిల్లీ ఎందుకొస్తాయిరా?

గోపి : ఊఁ! పోవే నీ మొగం! నీ కేం తెలుసునని!(సర్వం తనకే తెలుసునన్న దర్పంలో పద్యాన్ని వల్లె వేయడం ప్రారంభిస్తాడు.

నరసమ్మ (తనలో తను) : చిన్నాళ్ళ మొదలు, పెద్దాళ్ళ దాకా అందరూ నన్నిదిలించి పారేశేవాళ్లే! కాలం మారిపోయింది. మా కాలంలో ఆ రోజు లిప్పు డెందుకొస్తాయి? అప్పుడు పెద్దాళ్ళకు సచ్చినా ఎదురు సెప్పేవారా? సెబితే బతక నిచ్చేవారా? మా అత్తముండమానానికి మా అత్తముండ కూసుంటే ఒక మొట్టికాయ, నుల్చుంటే ఒక మొట్టికా యేసేది. ఇఖ మా మామగున్న వున్నాడంటే, “సొబ్బన్న” అని పేరు సెబితే సాలు, కాకులు నీళ్ళు తాగేవి కావు. ఆ రోజులూ పోయాయి, ఆ మడుసులూ పోయారు. (ఒకటి రెండు క్షణాలపాటు ఆగి) తెకతెక లాడిపోతోంది. వాన కురుస్తుందేమో! కురిసేది, బాగా కురిసినా బాగుండును; రెండు ఉబ్బ సినుకులు పడిపోతున్నది. పని సెరుపు తప్ప మ రేమీ లేదు. మా కాలంలో ఆసాడ మాస మొచ్చేసరికి కుండలతో దిమ్మరించేది. శావణ మొచ్చినా, ఇప్పుడు సరిగా వానే లేదు. కాలం మారినట్టే, అదీ మారింది (ఒక క్షణం ఆగి) పొన్నిగారిసత్తి కూతురిసేత శావణ సుక్రారం నోము నోయించింది కామాలు. అప్పయ్యగారి కోడలు పప్పు లుచ్చుకుని, ఊరెంట తైతక్కమంటున్నది. అమ్మో! అదెక్కడ! అది గజ్జెలగుర్రం! దాన్ని పట్ట పగ్గాలు లేకుండా వున్నాయి. ఏమేఁ కూతరా!”అని పలకరితే, యినిపించుకోకండా సక్కాపోయింది. ఏమి సూసుకునో అంత పొంగు! (ఇంకొక క్షణం ఆగి) అదుగో! సినుకు మొదలైంది. మా యెంకయ్య పొలంనుంచి రానే లేదు. ఖర్మం! వానలో తడుస్తాడో, ఏమో! నాల్గు రోజుల్నుంచి తీస్తున్నా కలుపు కాకండానే వొచ్చింది. రోజుకు బిళ్ళకుడుంలా రూపాయిస్తున్నా. యిప్పుడసలు కూలోడు పలుకుతున్నాడూ? మా కాలంలో అణా, బేడా యిస్తే... చంటిది సందేళ నుంచి తెగేడుతా వుంది. పిచ్చిముండ! దడుసుకున్నదో, యేమో! దానికి వారాని కొకసారైనా దిష్టి తీస్తేగాఁ! (ఒక క్షణం మళ్ళీ ఆగి) జల్లు పెద్దదైంది. మా యెంకయ్య.... (వెంకయ్య వస్తాడు.) ఏరా! అబ్బాయ్! ఇవ్వాళ మరీ ఇంత పొద్దయిందేఁ? వానకి తడవలేదుగందా? (వెంకయ్య జవాబు చెప్పడు. పై పంచెతో తల తుడుచుకుంటూ వుంటాడు) ఉహుఁ! నాతో ఎందుకు పలుకుతాడు! ఏదో ముసిలిముండ దాని వాగు డది వాగుతుందని... వెంకయ్య : ఊ! నీ చాదస్తం కాస్త కట్టి పెట్టవే! (పైపంచె వడ్లబస్తాలమీద ఆరవేయడానికి వెడుతూ, రత్తమ్మ నుద్దేశించి) ఒసేయ్! పొంతని వేన్నీళ్ళు యేమైనా వున్నాయా?

రత్తమ్మ (వసారాలోకి వస్తూ) : ఆఁ! వున్నాయ్!

వెంకయ్య (కునికిపాట్లు పడుతున్న గోపితో):భడవా! చదువు పేరు చెబితేనే నీకు కళ్ళు కూరుకొస్తాయ్! పోనీ నిద్దరోయే వాడివి తిన్నగా పోక, గంటంలా దీపం పెట్టి, దానిముందు కునికిపాట్లు పడ్డం దేనికి?

గోపి : అమ్మ నా కింకా అన్నం పెట్టలేదు, నాన్నా!

రత్తమ్మ : పిల్లది పోరు పెట్టి యేడుస్తుంటే, దాన్ని కాస్త దగ్గరికి తీసే దిక్కేనా వుంటేనా! ఎలా పెట్టను?

నరసమ్మ : కూసుంటే లేవలేను; లేస్తే కూసోలేను. నా మొగం దాన్ని నే నెత్తుకోగలనా, పెట్టగలనా? కాలూ సెయ్యీ ఆడుతున్నంతవరకూ సెయ్యలేదూ? వొళ్ళు దాసుకున్నానా? నేను సతమతం కాందే, ఈ కొంప ఒక దిక్కు కొచ్చింది!

వెంకయ్య (రత్తమ్మతో) : సర్లే! ఆ పొంతలో నీళ్ళిలా తగలెయ్యి!

రమ్మ : దూడ నింకా యిడవలేదు. వెంకయ్య : ఏఁ! నే నేయేళ కొచ్చినా, నాకోసం ఆ పని అట్టే పెట్టాలా?

రత్తమ్మ : నాకైనా పదికాళ్ళూ, ఇరవైచేతులూ లేవు. అన్ని పన్లకీ నే నొక్కదాన్నే ఎక్కడ చచ్చేది!

వెంకయ్య : చాల్లే! చెంబిలా తగలెయ్!,రత్తమ్మ విసురుగా చెంబు తెస్తుండగా ఠంగుమని గడప తగుల్తుంది).

వెంకయ్య : ఏఁ! అంత దూకుడు! చెంబు పగిలే నీ అబ్బగాడెవడు తెస్తాడు? (రత్తమ్మ చేతిలోనుంచి చెంబు గుంజుకుని, గోపాలరావుతో) ఓరే! గోపీ! రారా! కాస్త దూడని పట్టుకుందువుగాని.

గోపి : వాన కురుస్తున్నది నాన్నా!

వెంకయ్య (గద్దిస్తూ) : మొక్క మొలిచిపోవులే! రా!!

గోపి : ఉహుఁ. చీక టంటే నాకు బయం.

వెంకయ్య : వస్తావా? రెం డుతకమంటావా?(గోపాలరావు యిష్టం లేకుండా కదులుతాడు. వెంకయ్య కూడా పశువుల చావడిలోకి వెడతాడు.

రత్తమ్మ (పిల్లదాని ఏడ్పు మరింత ఎక్కువ కాగా): ఆసి దీని దుంప తెగ! దీని కడు పుడక! సుయ్యి మనిపించి నన్ను చుక్కల్లో పెడుతున్నది.(లోపలికి వెడుతుంది.

నరసమ్మ : నిన్నటి ముండనా, మొన్నటి ముండనా! అప్పుడే అరవై యేళ్ళొచ్చినై. సూపైనా తిన్నగా ఆనడం లేదు. ఇంకా నేను సేసి పెట్టడం లేదని సాదింపులు. ఒకళ్ళ సేత సేయించుకోకుండా వుంటే, నేను సేసినంత పలం. (పిల్లను రత్తమ్మ రెండు చరుస్తుంది; పిల్ల గుక్కపట్టి ఏడుస్తుంది) మొగుడిమీద కోపం ఆ పసిదానిమీద సూపించడం దేనికో? నోరూ వాయీ లేని సిన్నముండ! అదేం పాపం సేసింది? మా కాలంలో మే మిట్టాంటి వెరగ మమ్మా! ఆ దిక్కుమాలిన దేముడు ఒక మగబిడ్డని, ఇద్ద రాడపిల్లల్నే మిగిల్చాడు కాని, నేనూ ఆరుగుర్ని కన్నా. పెంచా! ఎవళ్ల నెప్పుడూ ఒక దెబ్బే సెరగను. ఇప్పు డొచ్చింది ఈ మాయదారికాలం... ఇది పిదప కాలం కాకపోతే, ఆడు - పెదకిట్టప్పగారి సిన్నోడు - ఆడంత మిడిసిపడతాడూ? ఆడి కున్నది ఇరవయ్యెకరాలు. పెద్దకూతురికి రెండెకరా లిచ్చి, మూడేలు పోశాడట. ఇంకా ముగ్గు రున్నారు కూతుళ్లు. అందర్నీ ఈ లెక్క నిరగడ సేస్తాడూ? సేస్తే, కొడుకుల కేం మిగులుస్తాడు. సిప్ప సేతికిస్తాడా?... సినుకు మరి కాస్త పెద్దదైంది. సినుకులో సిన్న సన్నాసి తడుస్తున్నాడేమో! రేత్రి రెండు జాములైనా ఆడికింత ముద్దే పెట్టదయ్యె! నేనూ సంసార మీదా కాని... (రెండు కునికిపాట్లు పడి) “బుయ్యిం” మంటూ పాడు దోమలు! తెగ పీక్కుతింటున్నాయి. తెల్లార్లూ జాగారమై పోతావుంటే! కంటి మీద నాకు కునుకే పడకపోయినా - నే నంట! - తెగ గుర కెడుతున్నానంట! నే నెంత సెమిటి ముండనైనా అంత గుర కెడితే నాకు కూసైనా యినబడదూ? నే నంటేనే అంతా ఒంటికాలి మీదొస్తారు....(తిరిగి కునికి పాట్లు పడుతుంది.

గోపి (పరుగెత్తుకొస్తూ) : అమ్మోయ్! నాన్ననే...

నరసమ్మ : ఏమిట్రా బాబూ!

గోపి : అమ్మోయ్!

రత్తమ్మ (చప్పున బైటికి వస్తూ) : ఏరా! ఏమిటి?

గోపి : నాన్ననే...

రత్తమ్మ : ఏమిట్రా?

గోపి : ఆవు గట్టిగా తన్నిందమ్మా!

నరసమ్మ : అయ్యొ నా బిడ్డా!

రత్తమ్మ : ఆఁ! ఆఁ!

గోపి : ఎదురొమ్ముమీద తన్నిందే! ఎల్లికిలగా పడిపోయాడు!(రత్తమ్మ గొడ్లచావడిలోకి పరుగున వెడుతుంది.గోపాలరావు అనుసరించబోతాడు. ఎక్కడలేని ఓపికతో నరసమ్మ మంచం మీదనుంచి లేస్తుంది.

నరసమ్మ : దీపం తేరా, బాబూ! దీపం తే! సీకటి మేళాంలో కన్నొడుసుకున్నా కనబడ్డం లేదు. పద పద! (గోపాలరావు దీపం పట్టుకుంటాడు.నరసమ్మ రెం డడుగులు వేసేసరికి, రత్తమ్మ భుజంపై చెయ్యి వేసుకొని వెంకయ్య లోపలికి వస్తాడు.

నరసమ్మ : అడుగో! నా బాబే వొస్తున్నాడు! అయ్యె నా బిడ్డా! పొద్దున్నే ఎవడి మొగం సూశావురా!

వెంకయ్య : ఆఁ! మీదంతా వొఠ్ఠి ఖంగారు, తాపు మోపుగా తగల్లేదు; దూసుకుపోయింది. రత్తమ్మ (దీపం పెట్టి చూస్తూ) : ఇంత కమిలిపోతే, దూసుకుపోవడ మేమిటి?(ఆగి అక్క డక్కడ బారుగా గీరుకుపోయింది. (ఇంకా పరీక్షచేస్తూ) రెండు చోట్ల నెత్తురు చిమిర్చింది. (వేలితో గుండ్రంగా గీసి చూపుతూ)ఇంత లెక్క నల్లగా కమిలిపోయింది. మోపుగా తగలకపోతే ఇంతెందుకు కమిలి పోతుందీ? (దీపంబుడ్డి కింద పెట్టి, పైటచెంగుతో నెత్తురు చిమిర్చిన చోట అద్దుతుంది.

నరసమ్మ (గాద్గదికంగా) : అయ్యొ! నా బిడ్డా! నా బిడ్డా!!

వెంకయ్య : ఆఁ! దాని మాటల కేమిలే? గట్టిగా తగల్లేదమ్మా!

రత్తమ్మ : అత్తయ్యా! ఈయనగార్ని కాస్త రెక్కట్టుకో! నేను మంచం వాలుస్తా.

వెంకయ్య : రెక్కట్టుకోడమా నీ మొఖమా! చాల్లే యిఖ!

నరసమ్మ:(దీన్ని వినిపించుకోకుండా,రెక్క పట్టుకుని) : ఇంకా నయం! లేసినేళ బాగుంది. బిడ్డవు దక్కావ్!

వెంకయ్య : ఊఁ! కాస్తంత గంపెడంత చేస్తున్నారు!

రత్తమ్మ (గోపితో) : బాబూ! ఆ దీపం అక్కడెట్టి దిండు తే. (మంచం వాల్చిన తర్వాత, వెంకయ్య రెక్క ఊతంగా పట్టుకుని) రండి! పడుకోండి! కాస్త ఆమదంతో కాపైనా కాస్తా!

నరసమ్మ : ఆమదం కాపుకంటె కోడిగుడ్డు పట్టు నయమేఁ-అదైతే తెల్లారేసరికి నెప్పిని లాగేస్తుంది.

వెంకయ్య (మంచంపై నడుం వాలుస్తూ) : ఆఁ! ఎందుకేఁ కాపులూ, పట్టులూ? అదే పోతుంది.

నరసమ్మ: సున్నం, బెల్లం, చింతపండూ నూరి పట్టేసుకున్నా,వాపు తొరగా తగ్గుతుందిరా, బాబూ!

వెంకయ్య: ఎందుకమ్మా! లేని పోని ఖంగారు? ఏమంత దెబ్బ తగిలిందని?

రత్తమ్మ : పాడుదాన్ని! కాస్త నేనే ఉసులు చేసుకుని దూడ నిడుచుకుంటే, ఈ ఖర్మెందుకొచ్చేది?

నరసమ్మ : నీ తప్పేముంది లేవే! ఒంటిదానివి. అన్నీ ఎక్కడ దిద్దుకుంటావ్! అది నా సేతిలో నీనిలవదుగాని, ఆ పిల్లదాన్ని నేను సమదాయిస్తే, నువ్వు దూడ నిడుసుకొనే దానివిగాఁ?

రత్తమ్మ : ఆఁ! పెద్దతన మొచ్చింది. ఇంకా నువ్వేమి దేవుళ్లాడతావులే! నిన్ను కూర్చోబెట్టి నీకు చేసేదిపోయి, ఇంకా నీచేత చేయించుకోవడమా?

నరసమ్మ : ఇంకా కాలూ సెయ్యీ ఆడుతున్నయిగాం! పెద్దపనులు కదలవనుకో! అయినా సిన్నపనికీ, సితకపనికీ నేను నిలబడితే, నీకు కూస్తి తెలిపిగా వుంటుంది.

రత్తమ్మ : నువ్వుగనక ఇంకా నీ పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావుగాని, నీ వయసొస్తే మేము నీ మంచాన పడతాం.

వెంకయ్య : పసి దేడుస్తున్నది.

రత్తమ్మ : పాపం! అదింకా గోలపెడుతూనే వుంది. దాన్ని కాస్త తీసుకో, అత్తయ్యా!

నరసమ్మ : అట్టాగే నమ్మా! (వెడుతూ) నా బిడ్డకు లేచినేళ మంచిదైంది. గండం తప్పింది. (వెడుతుంది.

గోపి (దిండుతో వచ్చి) : ఇదుగో నాన్నా! దిం డేసుకో! వెంకయ్య : ఆఁ! దేనికిరా, బాబూ?(ఇలా అంటూనే తల యెత్తుతాడు.

రత్తమ్మ (దిండు అంచు పట్టుకుని): ఏదీ! కాస్త తలెత్తండి! దిండు సరిగా లేదు.

వెంకయ్య (తలెత్తుతూ, బాధాసూచకంగా): అమ్మ!

రత్తమ్మ (దిండు సరిచేస్తూ): ఏఁ! కదిలే నెప్పిగా వుందా?

వెంకయ్య: అబ్బే! లేదేం!(గోపాలరావు దిండును తలకిందికి తోస్తాడు.

రత్తమ్మ : లేకపోవడ మేమిటి? - ఒక పక్కని మూలుగుతూ! ఎందుకైనా మంచిది నా మాటిని తవుడు కాపైనా కాయించు కోండి. పొయ్యిలో కాస్త నిప్పేసొస్తా!

వెంకయ్య : ఆఁ! అంతగా అయితే తెల్లారి పొద్దున చూసుకో వచ్చులేవేఁ!

రత్తమ్మ : తెల్లారేసరికి బరువు చేస్తేనో!

వెంకయ్య : ఊఁ! నీ మొఖం కాదూ? అదే పోతుంది.

రత్తమ్మ : సరే! ఇఖ మీ యిష్టం!

వెంకయ్య (దిండును మరింతగా తలకిందికి తోసుకుంటూ) : నాయనమ్మ వెళ్లి యెత్తుకునేసరికి చంటిది యేడుపు చాలించింది.

రత్తమ్మ : అవును, వెర్రితల్లి! ఆలనా పాలనా ససిగా లేక, చిక్కిసగమైపోయింది. నా చెయ్యడ! దాన్ని యెడా పెడా బాదాను. ఏడ్చేడ్చి పిచ్చితల్లి చిటుక్కున నిద్దరోయింది.

వెంకయ్య (గోపాలరావును దగ్గరకు తీసి తల నిమురుతూ) : చూడవేఁ! ఈ పిచ్చి సన్నాసి తల తడిసింది. కాస్త తుడువు. జలుబుచేసేను!

గోపి (కౌగిలినుంచి తప్పించుకుంటూ) : ఆఁ! లేదు, నాన్నా!

వెంకయ్య (దగ్గరికి లాక్కుని, తన పంచె చెరగుతోనే తల తుడుస్తూ) : చూడవేఁ! పాపం! పొట్ట వెన్నుకు అతుక్కు పోయింది.

రత్తమ్మ : పాపిష్టిదాన్ని! వాడి కింకా తిండీ తిప్పలైనా పెట్టాను కాను.

గోపి : ఆనికి తింటా ఇప్పు డాకలి లేదమ్మా!

రత్తమ్మ (నవ్వుతూ) : ఇప్పుడేగా ఆక లాకలని మారాం చేశావ్?

గోపి : ఉత్తినేనే అమ్మా!

వెంకయ్య (కొడుకును గుండెకు హత్తుకుంటూ) : పిచ్చి సన్నాసి!

రత్తమ్మ (కొడుకువీపు నిమురుతూ) : బంగారు తండ్రి!తెర)

కొత్త గడ్డ[మార్చు]

(ఏకాంక నాటిక)


పాత్రలు: పల్లెటూరి రైతు, అతని భార్య, అతని కొడుకు, అతని మనుమడు.

స్థలం: రైతు యింటి చావడి

కాలం: వర్తమానం గంటల ప్రాంతాల రాత్రి ఎనిమిది

తెర లేచేసరికి అప్పుడే భోజనం చేసి వచ్చిన రైతు తన యింటి చావడిలో మంచంపై కూర్చుని చుట్ట కాల్చుకుంటూ వుంటాడు. అతని వయస్సు యాభైకి పైగా, అరవైకి లోపు. బాగా పొడగరి; చేవ తేలిన వొళ్లు. పెద్ద నుదురుతో, పెద్ద కళ్ళతో, అక్కడక్కడ కొంచెం నెరసిన గుబురు మీసాలతో కళగల మొహం. నీర్కావి పంచె కట్టుకుని, నీర్కావి పై పంచె కప్పుకున్నాడు.

చావిడికి నాలుగు ద్వారాలు కనబడుతూ వుంటాయి. కుడివైపున సింహద్వారం; ఎడమవైపున పెరటి గుమ్మం, ఎదుటి రెండింటిలో ఒకటి పడకగది గుమ్మం, రెండవది పడమటింటి గుమ్మం. ఈ రెండింటి మధ్య పడకగదిలోకి కిటికీ. పడమటింటి గుమ్మందగ్గరగా చావిడిలో ఒక ముక్కాలు పీటపై హరికేన్ లాంతరు వెలుగుతూ వుంటుంది. రైతు కూర్చున్న మంచం కాక, మరొకటి పెరటిగుమ్మం వైపు గోడకాన్చి నిలబెట్టి వుంటుంది. ఇతర సామాగ్రి యేమీలేకుండా చావిడి అద్దం వలె వుంటుంది. రైతు గొడ్ల చావిడి తలవాకిలివైపున, యింటికి యెడమ పక్కగా వుంటుంది.

తెర లేచిన కొన్ని క్షణాలకు, పడమటింటిలోనుంచి మనుమడు పరుగు పరుగున వచ్చి, తాత వొడిలో గారాబంగా వొరుగుతాడు. నాలుగేళ్ళవాడు, చాలా చురుకైనవాడు.

మనుమడు : నాకేఁ--మరే! --కత సెప్పు, తాతా!

రైతు (మనుమని ముఖాన్ని రెండుచేతులలోకి తీసుకుని, నుదురును ముద్దు పెట్టుకుంటూ) : కథ లొద్దు; కాకరకాయ లొద్దు. పద్యం చెబుతా; నేర్చుకోరా బాబూ! (మనుమని యెత్తుకుని వొడిలో కూర్చోబెట్టుకుని) “శ్రీరాముని దయచేతను....”

మనుమడు : “చీలాము....”

రైతు : “చీ” కాదురా, తండ్రీ! “శ్రీ”

మనుమడు : అట్టాగే అన్నాను తాతా!

రైతు: ఏదీ? మళ్ళీ అను; "శ్రీరాముని దయచేతను.....”

మనుమడు : “చీలాముని....”

రైతు : అదుగో! మళ్ళీ తప్పే అంటున్నావ్!

మనుమడు : నాకు లావడం లేదు, తాతా!

రైతు : అదే వస్తుంది. ఏదీ అను! “శ్రీరాముని దయచేతను.....” మనుమడు : “చీలాముని దయ....”

రైతు (మరింత స్ఫుటంగా ఉచ్ఛరిస్తూ) : “శ్రీ”(మనుమడు సిగ్గుపడి, కళ్లు చేతితో కప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుతాడు.

రైతు : సరే, నాయనా!నీ కొచ్చినట్టే అనులే! “శ్రీరాముని దయచేతను.....” మనుమడు : “చీలాముని దయసేతను....”

రైతు : “లాముని” కాదు; రాముని.

మనుమడు : ఊఁ! పో - తాతా!

రైతు : సరే! “నారూఢిగ సకలజనులు నౌరా యనగా....”

మనుమడు : “నాలూడిగ చకల....”

రైతు (“ఢీ”ని నొక్కుతూ) : “నారూఢిగ....”

మనుమడు: “నా లూడిగ....”

రైతు (మరి లాభం లేదనుకొని) : “సకల జనులు నౌరాయనగా....”

మనుమడు : “చకల జనులు నౌలా యనగా....”

రైతు : “ధారాళమైన నీతులు....

మనుమడు : “దాలాళమైన నీతులు....”

రైతు : “నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతీ

మనుమడు : “నోలూలగ చెవులుపుట్ట....”

రైతు (నవ్వుతూ) : చెవులు కాదురా! “జవులు

మనుమడు (తాత నవ్వు వల్ల మాట అసలే తెలియక) : “జలుబు”

రైతు (మరింత బిగ్గరగా నవ్వుతూ) : జలుబట జలుబు! జలుబెవరికిరా, బాబూ? (నవ్వు ఆపుకుంటూ) “జవులు” రా! “జవులు"

మనుమడు (మూతి బిగించుకుని) : నే ననను!

రైతు : ఏం బాబూ?

మనుమడు : నువ్వు నవ్వుతున్నావుగా, అమ్మా!

రైతు : నవ్వనులే, బాబూ! ఇఖ నవ్వనుగాఁ! ఏదీ? అను! “జవులు”

మనుమడు : “జవులు"

రైతు : “పుట్ట"

మనుమడు : “పుట్ట”

రైతు : “నుడివెద సుమతీ”

మనుమడు : “నుడివెద చుమతీ”

రైతు : పోనీ, వేరే పద్య మేదైనా చెబుతా లేరా, బాబూ! “అక్కరకు రాని చుట్టము...”

మనుమడు : నాకు పద్దా లొద్దు. కాకి కత సెప్పు.

రైతు : కథలంటే చెవి కోసుకొంటావ్. ఎందుకొచ్చిన కథలు! కూటికా? గుడ్డకా? చక్కటి పద్యాలు నేర్చుకోరా, నాయనా!

మనుమడు : ఊఁ! నా కిదొద్దు తాతా!

రైతు : “శ్రీరాముని దయచేతను...”

మనుమడు : ఉహుఁ! నాకు కతలే కావాలి.

రైతు : సర్లే! నువ్వు పడుకో - అట్టాగే చెబుతాలే (మనుమని యెత్తి, మంచంపై పడుకోబెడతాడు.)

మనుమడు : ఊఁ! చెప్పు మరి.

రైతు : కాస్త నిదానించరా, బాబూ! ఏదీ దుప్పటి కప్పుకో.

మనుమడు : ఉహుఁ! నాకొద్దు.

రైతు : చలేస్తున్నది. నా బాబు కాదూ? కప్పుకో!(దుప్పటిని చక్కగా కప్పుతాడు.

రైతు: ఎంత ఆరాటంరా నీకు కథలంటే! సర్లే! ఏం కథ చెప్పను?

మనుమడు : కాకి కత.

తాత : రోజూ అదేనా? వినడానికి నీకు విసుగు లేకపోతే, చెప్పడానికి నాక కాదట్రా?

మనుమడు : ఏం తాతా, కత సెప్పవే?(కప్పుతున్న దుప్పటిని తీసివేయబోతాడు. కొత్తది... కోతికథ... చెబుతాలే. అనగా అనగా ఒక కోతి...

మనుమడు : నాకు కోతి కతొద్దు! కాకి కతే కావాలి.

రైతు : నీ పంతమే నెగ్గాలంటావ్. సరే! నీ యిష్టం వచ్చినట్టే కానివ్వు. అనగా అనగా ఒక కాకి...

మనుమడు : ఉఁ!

రైతు : ఆ కాకికి ఒక మాంసంముక్క దొరికింది...

మనుమడు : ఎక్కడ దొరికింది తాతా?

రైతు : కటికవాడి కొట్టుదగ్గర.

మనుమడు : కటికివాడంటే?

రైతు : మొన్న చెప్పాగదట్రా!

మనుమడు : నాకు గ్యాపకం లేదు. మళ్ళీ చెప్పు.

రైతు : మేకల్ని, గొర్రెల్ని కోసి అమ్ముతాడేఁ! వాణ్ణి కటికవాడంటారు.

మనుమడు: అవి ఏడవ్వూ? తాతా, వాటిని కోస్తే?

రైతు : పాపం! ఏడవ్వూ మరీ?

మనుమడు : వాటికి తాత లేడూ?

రైతు (నవ్వుతూ) : లేకేఁ! ఉన్నాడు.

మనుమడు : ఉంటే - మలేఁ-మానాన్న నన్ను కొట్టిస్తే నువ్వడ్డమొస్తావే! అట్టా మలి వాటి తాత అడ్డం లాడూ?

రైతు (మరింతగా నవ్వుకుంటూ, మనుమని చెక్కిలి ముద్దు పెట్టుకుని) : ఎక్కడినుంచి పుట్టుకొస్తాయిరా నీకీ మాటలు! సరే! కథ విను! మాంసం ముక్క తెచ్చుకుని...

మనుమడు : ఉఁ!

రైతు : ఆ కాకి ఒక చెట్టుమీద కూర్చుంది...

మనుమడు : ఏ చెట్టుమీద తాతా?

రైతు : మన చెరువుగట్టున లేదూ? పెద్ద మర్రిచెట్టు. దాని మీద కూర్చుంది. కూర్చుంటే ఒక నక్కొచ్చింది.

మనుమడు : అయితే, నక్క అక్కడి కెట్టా వొచ్చింది?

రైతు : రాత్రిపూట ఎవ్వరూ లేనప్పుడు వచ్చిందిలే..

మనుమడు : చీకట్లో కాకులు తిలగవుగా, తాతా!

రైతు (నవ్వుతూ) : ఎంత గడ్డుగ్గాయివిరా నువ్వు! తాతను బోల్తా కొట్టించావు. ఔను, బాబూ! నక్కలు పగటిపూట ఊళ్ళోకి రావు; కాకులు రాత్రిపూట గూట్లోనుంచి కదలవు. ఈ కథ పట్టపగలే ఊరుబయట జరిగింది. కాకి మాంసం ముక్క తెచ్చుకుని...

మనుమడు : ఉఁ!

రైతు : ఊరుబయట ఒక చెట్టు మీద కూర్చుంటే...

మనుమడు (ఆవలిస్తూ) : ఊఁ!

రైతు : నక్క అక్కడి కొచ్చి...

మనుమడు : ఊఁ!

రైతు : “కాకిబావా! కాకిబావా!...”

మనుమడు : ఉఁ!

రైతు : “నువ్వు ఎంత అందంగా వున్నావ్! నీ అందంకంటె కూడా నీ పాట మరీ బాగుంటుందట! ఏదీ! ఒక పాట పాడు! వింటా” ననిందట...

మనుమడు (నిద్రమైకంలోనుంచి) : ఊఁ!

రైతు : అనే సరికి...(మనుమడు ఊఁ కొట్టడు.

రైతు : అనేసరికి ఆ కాకి “కాఁ,కాఁ” అని కూసిందట. (మనుమడు నిద్రపోయిన సంగతి కానక) కూసేసరికి కాకి నోట్లో నుంచి మాంసంముక్క.. (మనుమడు నిద్రపోయినట్టు తెలుసుకుని) ఏరా, బాబూ! నిద్దరోయావా? మనుమని వీపు నిమురుతూ) పసివాళ్ళు మాట్టాడుతూ, మాట్టాడుతూనే చిటుక్కున నిద్దరోతారు. వాళ్ళకు చీకా, చింతా? కల్లా కపటం యెరగని వాళ్ళ బ్రతుకే బ్రతుకు. వాళ్ళు సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపులే! సంసార లంపటంలో పడిపోయినవాళ్ళకు ఇటు మసలి, అటు మసలి, చివరి కెప్పుడో పడక కుదిరితేనే తప్ప కంటిమీద రెప్పపడదు. ఈ సంసారం, ఈ మమకారం ఆ శ్రీ రఘురాముడి చిద్విలాసం (కళ్లు మూసుకుని నమస్కారం చేస్తూ) అంతా

శ్రీ రఘురామ, చారుతులసీదళదామ, శమక్షమాదిశృం గారగుణాభిరామ, త్రిజగన్నుత శౌర్యరమాలలామ! దు ర్వార కబంధరాక్షస విరామ, జగజ్జనకల్మషార్ణవో తారకనామ, భద్రగిరి, దాశరథీ కరుణాపయోనిధీ!"

రాముడు, ఘోరపాతక విరాముడు, సద్గుణకల్పవల్లికా రాముడు, షడ్వికార జయరాముడు, సాధుజనావనవ్రతో ద్దాముడు, రాముడే పరమదైవము మాకని, మీయడుఁగు గెం దామరలే భజించెదను, దాశరథీ కరుణాపయోనిధీ!

(ఆవలిస్తూ, చిటికెలు వేస్తూ, రైతు రామసంకీర్తన చేస్తూ వుండగా భార్య ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు దాదాపు యాభై సంవత్సరాలు. కాని, అరవై నిండిన దానివలె కనబడుతుంది. పొట్టిగా; బొద్దుగా వుంటుంది. గుండ్రని ముఖం. ముడతలు పడి కొంచెం దిగజారిన బుగ్గలు. ముప్పాతిక నెరసిన జుట్టు; మధ్య పాపట, కొప్పు ముడి. పెద్ద కుంకుమ బొట్టు.

భార్య : దాని ముందేసిన మేత యేసినట్టుగా వుంది. అదేమో కాని మన పెద్దగేదె ఒక్క పరకైనా కొరకడం లేదు.

రైతు : కొంపతీసి గాళ్లు తగల్లేదుగదా? ఊరంతా ఇప్పుడీ పాడు జబ్బే. కిష్టప్పగారి దొడ్డిని ఊడ్చేసిందని ఇందాక చెట్టుకాడ చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున్నే కామయ్య నొకసారి పిలుచుకొచ్చి చూపిద్దాంలేఁ! ఎడ్లముందు మే తున్నదా?

భార్య : ఆఁ!

రైతు : ఎగదోసి, మరొక జనప కట్టేసి రాకపోయావూ?

భార్య : ఎలిసిమీ దుంది. నా కందుతుందా, పెడుతుందా?

రైతు : అబ్బాయి అత్తారింటి కెళ్ళిన ఈ అయిదారు రోజుల్నుంచీ వాటికి తిన్నగా నీళ్ళూ మేతా లేవు. వాడుంటే అడుగడుక్కీ వాటి అజా పజా కనుక్కుంటూ వుంటాడు.

భార్య : ఆ డెళ్ళి రేపటికి సరిగా వారం. ఈ వారం రోజుల్నుంచీ మనదొడ్డికి అదు పేదీ? ఊరు మందంతా వొచ్చిపడి, యేసిన నాలుగు పరకలు మేసిపోతున్నాయ్. ఆళ్ళ కేం పోగాలమో, మరీ ఆ రత్తయ్యగారి గుంపు పలుపు లిప్పి ఊరుమీది కెగదోలేస్తున్నారు.

రైతు : ఊరు మాటుమణిగాక వాళ్ళ గొడ్డుగోదలు అస లెన్నడైనా కట్టుగొయ్యల నుంటేగాఁ! దొంగ రత్తయ్యగారి సంపదని వాళ్లకి మరి వూరికే పేరొచ్చింది?

భార్య : ఆళ్ళ తాడు తెంచారుగాని, ఇదుగో వొస్తానని మన అబ్బాయి రానే లేదేమో? కోడలు తేలిగ్గానే పురుడు పోసు కుందాయె! దాని కెదురుగుండా ఈ డెందుకు కూకున్నాడు!

రైతు : సంక్రాంతి రేపు సోమవారంనాడేగా? పండగముందు వాళ్ళు రానివ్వొద్దూ?

భార్య : ఆఁ! పండగనీ, అల్లుడనీ, ఆళ్ళ కిదే పట్టింది! ఏడెనిమిదేళ్ళనాడు పెళ్ళి పీటలమీద కట్టబెట్టిన ఆ వొక్క పంచెలచాపు తర్వాత, ఆడు మళ్ళీ ఎప్పుడైనా ఒక గుడ్డపీలికైనా ఎరుగున్నాడూ? మన కివ్వాల్సిన కట్నం డబ్బు మనకు పారెయ్యడానికి చేతులు రాకేఁ. ఇదుగో, అదుగో” అంటూ ఆళ్లు రోజులు గడుపుతున్నారు. నే నొద్దన్న కొద్దీ ఈ పాడుచుట్టరికం నువ్వే తెస్తివిగా!

రైతు (బయట చప్పుడుకాగా ఆలకించి) : ఏమిటది? మనగొడ్ల చావిడిలో అలికి డౌతున్నది.

భార్య : ఆ దొంగ రత్తయ్యగారి మాయదారిమంద మళ్లీ వొచ్చి పడిందేమో?

రైతు : ఆరి వీటిని మాదిగాడికి తోల! ఇవి మన కెక్కడ పంపక మైనై. (ఈ మాట అంటూనే మంచంపై నుంచి దిగ్గునలేచి, మూలనున్న కోలుపుకర్ర తీసుకుని వెలుపలికి వెడుతూ). జిఝైఁ, జిఝైఁ!

భార్య : నువ్వటరా! బాబూ!(వెలుపలినుంచి కొడుకుగొంతు: “నేను నాన్నా!”

(రైతు గొంతు : నువ్వెప్పు డొచ్చావురా?"

కొడుకు : (ప్రవేశిస్తూ) ఇప్పుడే! వస్తూ వస్తూ, గొడ్లముందు మే తెగదోసొద్దామని చొప్పరంలో కెళ్ళాను.(వయస్సు 30 సంవత్సరాలు, ఈ ప్రాయంనాటి రైతును ఊహించుకుంటే కొడుకు రూపును వేరే వర్ణించ నవసరం లేదు. భార్య : పొద్దోయి, పోరబోయి ఇప్పు డొచ్చా వేమిరా?

రైతు : (తిరిగి వచ్చి, కోలుపు కర్రను దాని తాపులో పెట్టివేస్తూ). ఇంత చిమ్మచీకటిని పడి రాకపోతే, తెల్లారినా కొస్తే కాదట్రా? దస్తుకూడా వెంటున్న దేమో!

భార్య : తల్లీ బిడ్డా బాగున్నారట్రా?

కొడుకు : ఆఁ!

భార్య : పిల్లవా డెవరి పోలిక?

కొడుకు : ఏమో?

భార్య : ఎరుపా? నలుపా?

రైతు : (వెళ్ళి, మళ్ళీ తన మంచంపై కూర్చుంటూ) ఆఁ! పదిహేను రోజుల గుడ్డు. వాడు తిన్నగా చూశాడో లేదో! నువ్విన్ని వైనా లడిగితే వాడేం చెబుతాడు?

భార్య : సర్లే! మగబిడ్డ - ఎట్టావుంటే యేంగాని, సరిసి బాగుందట్రా? నన్ను తలుస్తున్నదా?

కొడుకు : ఆఁ! నాయసమ్మ దగ్గరికి వచ్చేస్తానంటూ మారం చేసింది. కాళ్ళను చుట్టేసి కదలనివ్వలేదు. బతిమలాడి, బామ లాడి ఎలాగో సముదాయించొచ్చా.

భార్య : తీసుకురాక పోయావట్రా? నాతల్లి నాదగ్గి రుండేదేమో? దాన్ని చూసి ఏళ్ళూ పూళ్ళూ అయినట్టుగా వుంది. ఎందరున్నా అది లేకపోతే యింట్లో సందడే వుండదు. నా యావంతా దానిమీదే వుంది.

రైతు : సర్లే! నీ సోది కేమి కాని, ముందు వాడికి అన్న మొడ్డించు.

భార్య : పొద్దున్నెప్పుడు తిండి తిన్నావో! రారా! కాళ్లు కడుక్కురా! !

కొడుకు : సందేళ భోంచేసే బయల్దేరా నమ్మా.

భార్య : ఇందాకెప్పుడో రెండు మెతుకులు తింటే, అంతదూరం నుంచి, ఇంతదూరం నడిసొచ్చేసరికి అరిగిపోకుండా మీ అత్తారు అంత పెట్టు పెట్టారేమిటి? రారా! రా! వొడ్డిస్తా!

కొడుకు : అబ్బే! ఎందుకు? - ఆకలి లేందేం!(ఈ మాట అంటూ షర్టు విప్పి, దాన్ని పడకగదిలో వుంచి, తిరిగి చావడిలోకి వస్తాడు.

రైతు : నువ్వింకా రాలేదని వాడు ధూంధాములు చేస్తున్నాడురా!

భార్య : అవునురా! ఉడుగుడు గొచ్చి పోతున్నాడు. సందేళకూడా ఆడొచ్చి నానా కూతలు కూస్తే “రేపో మాపో వొస్తాడులేవేఁ, బూసయ్య బావా! ఎళ్ళినాడు రాకండా అక్కడే కూకుంటాడేమిటి?” అని సర్దిసెప్పి పంపించా.

రైతు : ఎల్లుండికి నోటు లిమిటేషను పట్టి పోతుందట్రా! చూడగా మీ అబ్బాయి కావాలనే ముఖం చాటేసినట్టున్నాడు. చాల్ చాల్ లేవయ్యా! ఇదేనా మీ మర్యాద! ప్లెయింటు పడేస్తా!” నంటూ వాడు వీధిని పడుతున్నాడు.

భార్య : ఆడినోటికి శుద్దీ బద్దీ వుంటేగా? నోటి కెంత కూతొస్తే అంతా వూడేస్తాడు.

రైతు : మరి మీ మా మేమన్నాడు? కట్నంబాపతు కొదవ పైకమిచ్చాడా? భూషయ్య బాకీ తీర్మానం చెయ్యకపోతే, పరువు దక్కేటట్టులేదు.

కొడుకు : ఆ ఊళ్లో పొలా లిప్పుడు బాగా పండుతున్నాయి. నాన్నా! ఈ యేడు పుట్టీ ముప్పందుంకాడికి రాలింది.

రైతు : ఆఁ! పండినేడు పండుతుంది; పోయినేడు పోతుంది. అది పాడు గరువునేల. అక్కడి పంటలమాట కేమిలే? ఇక్కడ భూషయ్య...

కొడుకు : లేదు, నాన్నా! ఇప్పుడు మురుగుకాల్వ పడింది కాదూ? ముల కెయ్యడం లేదు. బంగారం పండుతున్నది.

భార్య : మా యియ్యిపురాలు వాకిట్లో పురులు కట్టేసిం దేమిటి? అయితే, ఆమెగారి ముందు నే నిఖ అసలే నిలవలేను.

కొడుకు : రెండో పంటకింద జనుం వేశారు, నాన్నా! ఏమి యేపుగా పెరిగిందనుకున్నావ్! చేలో దిగితే మనిషి కనబడ్డంలేదు. అక్కడా భూముల ధరలు రోజు కొక రకంగా పెరిగిపోతున్నాయి. నిరుటికీ, ఈ యేటికే ఎకరానికి మూడొందలు పెరిగింది. అయిదా రేళ్ళనాడు వందకీ, వందంబాతిక్కీ మూజూడనిదాన్నే ఇప్పు డయిదారు వందలదాకా అడుగుతున్నారు. ముందు ముందు ధర లింకా...

రైతు : ఆ చవిటి పర్రలమాట నాకు చెప్పకురా! ఏమైనా నల్లగడ్డ నల్లగడ్డే! ఊఁ! సరే కాని, పైకం పట్టుకొచ్చావా?

కొడుకు : ఉహుఁ!

భార్య : ఇంకెన్నిసార్లు తిప్పించుకుంటారు? ఏడేళ్ల నుంచి దగ్గిరెట్టుకున్నారు చాలదూ?(భర్తతో) నేను ఆనాడే అనలా?“ఒక పొలి కే కేయిస్తే మనకి నిండిందా? ఇలాంటి సదివింపులు చాలా చూశాం! ఆ మూడు ముళ్ళు పడకముందే రొబైం పోస్తేనే సరి” అని నే నంటే ను వ్విన్నావూ?

రైతు : మరి, భూషయ్య ఆగుతాడట్రా? నోటు తిరగ రాసిస్తామన్నా రాయించుకునే ధోరణిలో లేడు. ఈ మాట మీ మామతో చెబితే పైక మిచ్చే వాడేమో?

భార్య : ఆఁ! ఇచ్చే వాళ్ళయితే ఎప్పుడో యిచ్చేవాళ్లు. ముప్ఫైమూడు మాట్లు తిప్పించుకుని, మూడేళ్ళనాడిచ్చిన అయిదారొందలే మన కేం ముట్టినా! మిగతాది గుండాన పడిపోయినట్టే!

కొడుకు : ఎందు కొచ్చిన మాటలమ్మా, యివి? కావాలంటే, వడ్డీతోసహా పట్టుకుపొమ్మని వాళ్ళన్నారు. తొందర లేదని నేనే చక్కా వచ్చా.

భార్య : తొందర లేకపోవడ మేమిటిరా?

రైతు: సరే కానియ్యి! ఊళ్ళో టముకేయించి, కొంపా గోడూ అప్పులవాడు వేలం వేయించుకు పోతాడులే!!

భార్య : ఆ బూసయ్య అంత పనీ సేయించడనా? ఆ డెంతకైనా తగు!

రైతు : వేలం, జప్తులు నే నెన్న డెరగను. ఇంత బ్రతుకూ బ్రతికి, ఇంటి వెనకాల చచ్చినట్టు, ఇన్నే ట్ళొచ్చాక ఇప్పుడు కోర్టుకు లాగించుకుంటానా? నీ పెళ్లాం తెచ్చేమూట నువ్వు భద్రం చేసుకో! సెంటో కుంటో తెగనమ్మి వాడిబాకీ వాడికి రేపీపాటికి పారేస్తా!

కొడుకు : ఆ డబ్బేనా నాది? ఈ కొండ్ర నాది కాదూ? ఎప్పటి కప్పుడు ఇలా అప్పులై పోతూ వుంటే చివరి కేమి నిలుస్తుందనే నా యేడుపు!

రైతు : నే నేమి జుర్రుకుంటున్నానా? సంసార మన్నాక అప్పూ, సప్పూ కాకుండా వుంటుందా?

భార్య : నే నెవ్వరికీ ఏమీ దోసి పెట్టడం లేదు. ఇద్దరు ఆడపిల్ల లున్నారంటే వాళ్ళు పండక్కీ పబ్బానికీ ఆకులో ఇంత కుంకమైనా యెరగరు. పెద్దపిల్ల తొలుసూరిదానికి మొన్న పెళ్ళిసేసుకుంటే, “గాజులు తొడిగించుకోవే" అని పెళ్ళికూతురు సేతిలో పెట్టడానికి రూపాయి డబ్బులైనా నాకు గతిలేకపాయె! అమ్మమ్మకని అది దణ్ణం పెట్టొస్తే నలుగురిలో నా కెంత సిగ్గేసింది?

కొడుకు : నాకుకాకుండా మీ రందరికీ దోచిపెడుతున్నారని నే నన్నాన టమ్మా? రెక్కలు విరుచుకోవడమే కనబడుతున్నదికాని, ఎవ్వరు బాముకుంటున్నదీ ఏమీ లేదు. మన రెండెకరాలమీద మనకొచ్చే అయివే జెంతో నాకు తెలవదూ?

రైతు : మరి అన్నీ తెలిసినవాడివేనా, ఇంత లక్షణంగా వ్యవహారం చేసుకొచ్చావ్?

కొడుకు: నే నొకటి అడుగుతాను, నాన్నా! మనం రాత్రింబగళ్లు పాటుబడుతున్నామా? వొళ్ళు దాచుకుంటున్నామా?

రైతు (వెటకారంగా) : ఆఁ! నా దేమున్నదిలే! అంత పాటూ నీదే.

కొడుకు : నే నొక్కడే పాటుపడుతున్నానని నేనన్నానా? అయినా, వయస్సులో వున్నవాణ్ణి; ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పాటుపడతాను? కాని నలభై, యాభై యేళ్ళనుంచి రెక్కల కష్టం చేసినా ఈనాటికైనా నీడపట్టున కూర్చునే యోగ్యత నీకు లేదయ్యె! ఎండనక, వాననక, పొద్దస్తమానం దేవులాడినా మన కేం మిగులుతున్నది? మూడేళ్ళ కిందట పేరుకున్న అయిదారొందల అప్పు నెట్టాగో యెత్తి పారవేశామనుకుంటే, మళ్ళీ అప్పుడే నాలుగొందల అప్పు కనబడుతున్నది. ఇంతేనా? భార్య : కలిసిరావడం లేదు - ఏం చేస్తాంరా? కొడుకు : కలిసిరావడం, గిలిసిరావడం కా దమ్మా! మన కిప్పుడు వస్తున్న ఆదాయంతో మన కుటుంబం గడవదు. అప్పుకాక మరేమౌతుంది. భార్య : కొద్ది సంసారంలో తవ్వుకోవడం, పూడ్చుకోవడం అందరికీ వుంటుంది. ఒఖ్ఖ మనకేనా? కొడుకు : ఊఁ! నీకు తెలియదులే. అమ్మా! మా ముత్తాత డెబ్బై ఎకరాల ఆసామట. మా తాతలు పదేసి ఎకరాలవాళ్ళు. మా నాన్నల దగ్గరికి వచ్చేసరికి తలొక రెండెకరాలు అయింది. ఇఖ, నాకాడి కొచ్చేసరికి నేను రేపు కుంటా సెంటూ పంచిపెట్టాలి. అదైనా ఈకాస్తా ఈలోగా ఋణాలకింద హరించిపోకుండా మిగిలేనే. ఇప్పటి లెఱ్ఱని చూస్తే, అసలేమీ మిగలనే మిగలదు. రైతు : అయితే, అప్పుడు నీ పెళ్ళాం తేచ్చే ఆరొందలు నిన్ను... కొడుకు : అవి నన్ను ఉద్ధరించవులేఁ! భార్య : మ రేమిటిరా నీ గొడవ? కొడుకు : మన కుటుంబం ఖర్చుకు సరిపడ రాబడి యేర్పరుచుకోవా లంటున్నాను. రైతు: లేని రాబడి రమ్మంటే, ఎలా వస్తుంది? నారుపోసినవాడు నీరు పొయ్యడూ? అన్నిటికీ ఆ శ్రీరామచంద్రుడే వున్నాడు! కొడుకు : దేవుడిమీద భారంవేసి వూరుకుంటే సరిపోతుందా, నాన్నా? మన దేవులాటకూడా వుండాలి. రైతు : అయితే నువ్విప్పుడేం చేస్తానంటావురా? ? కొడుకు : మన రెండెకరాలు బేరం పెడితే... రైతు : తాత ముత్తాతలనాటిగడ్డ అమ్ముకుంటావట్రా? కొడుకు : ఎకరానికి మూడు వేలచొప్పున ఆరువే లొస్తాయి. చేలో చేను కలుస్తుందని ఆ ధర పెట్టడానికి భూషయ్యే తయ్యారుగా వున్నాడు. మన యిల్ల, దొడ్డి కూడా అమ్ముకుంటే... భార్య (నోరు నొక్కుకుంటూ) : అవ్వ! పెద్దలు కట్టిన కొంపా తెగనమ్ముకుంటావట్రా? కొడుకు : పాటి మట్టి వున్నది కాబట్టి, కనీసం మరొక రెండున్నర వేలయినా అలాగ్గానే రావచ్చు.ఇక్కడున్న ఋణం తీర్చుకుని, మిగతా డబ్బు పెట్టుకుంటే, ఆ వూళ్ళో... రైతు : అలా చెప్పు! అత్తవారి పంచకు చేరా లనుకుంటున్నా వన్నమాట! భార్య : మాయదారిమూక! ఆళ్ళే నూరిపోసి పంపించారు. కొడుకు : ఈ మాట ఎక్క డొస్తుందోననే యిన్నాళ్ళూ తటపటాయించా. సరే! రావలసినమాట రానే వచ్చింది కనక, మరి బరిలో పడతాను. ఏఁ! ఇక్కడి రెం డెకరా లమ్ముకుని అక్కడ ఇరవై ఎకరాలు కొనుక్కోడం లేదా? భార్య : ఉన్నవూ రొదిలిపెట్టుకు పోతారట్రా? కొడుకు : ఏఁ! ఊరు బువ్వ పెడుతుందా? భార్య : అదీ ఒక ఊరేనా! ఈగలు, దోమలు మొగంనిండా ముసురుకుంటూ అడివూరు. కొడుకు : అక్కడున్నవాళ్ళూ మనుషులే. భార్య : ఏం మడుసులురా ఆళ్ళు? వొ? అడివి మడుసులు! పని సుబ్రం తెలుసా? మాట సుబ్రం తెలుసా? అసలు ఆ ఊరు మొత్తంమీద తీరైన కొంప ఒక్కటైనా మండిందీ? అన్నీ చుట్టు గుడిసెలే! కొడుకు : అయితే మనదేనా ఆరామడ పట్నం? భార్య : మంచీ చెడ్డా తెలిసినా డెవడైనా అలిగి అత్తారింటికి, చెడి చెల్లెలింటికి పోతాడట్రా! కొడుకు : ఇప్పుడు ఎవరిమీద ఎవరు అలుగుతున్నా రమ్మా? రైతు : సర్లే! ఇల్లరికం వెళ్ళడం నీకు ముచ్చటగావుంటే, నువ్వు ఆ వూరు చేరు! కొడుకు : నన్నిల్లటం చేసుకోడానికి వాళ్ళ కేం ఖర్మ? వాళ్ళకే వున్నారు ఆరుగు రబ్బాయిలు. చిన్నవా ళ్ళిద్దరు బస్తీ కెళ్ళి చదువుకొంటూ వుంటే, పెద్దవాళ్లు నలుగురూ దిట్టంగా యవసాయం చేస్తున్నారు. మనస్సు తెంపు చేసుకుని, ఇక్కడున్న కాస్తా అమ్ముకుని, అక్కడి కెళ్ళాకే వాళ్ళకు అయిదేళ్ళూ నోట్లో కెళ్ళుతున్నాయి. ఆయేటి కా యేడు వాళ్ళకు బాగా కలిసొస్తున్నది. మనమళ్ళు, మనమరాళ్ళు పుట్టుకొస్తున్నా, సంతుతోపాటు ఖర్చులు పెరిగిపోతున్నా, ఏడాదికి అయిదెకరాలకు తక్కువ కాకుండా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ లెక్కని మరి నాలుగేళ్ళు గిర్రున తిరిగొచ్చేసరికి వాళ్ళు నూ రెకరాల ఆసాము లౌతారు. మూడు జతల యెడ్లు, ఎనిమిది ఆవులు, అయిదు కోడెదూడలు, పది, పన్నెండు పాడిగేదెలు - వాళ్ళ దొడ్లో లక్ష్మి కళకళ లాడుతున్నది. దానిలో కెళ్ళితే, నాకు తిరిగి రా బుద్ధి కాలేదు. రైతు : అయితే, అక్కడే వుండక పోయావూ? కొడుకు : అక్కడుంటే అది నా దౌతుందా? నా మామ కుంటే నా మామే తింటాడు; నా కెందుకు పెడతాడు? రైతు : ఎందుకులే ఈ మాటలన్నీ? నీ చూపంతా మామగారి వూరుమీదే వుంది. అక్కడికే జెండా పీక్కుపో! కొడుకు : ఆ ఊళ్లో కాకపోతే, ఆ చుట్టుపక్కల మరెక్కడైనా చేతినిండా కొండ్ర సంపాయించుకో గూడదేమిటి? రైతు : చేసుకునే సత్తా వుండాలేకాని, ఇక్కడ లేదా కట్టుబడి కెంత పొలమైనా? కొడుకు : వాడి పొలం, వీడి పొలం కట్టుబడిచేస్తే మనకు నిండుతుందా? మూడేళ్లు పడరాని పాట్లుపడి, పాటి మట్టి తోలి, పెంట కట్టించి, దేవుడినాం బలం చేస్తే, అది తీరా మన కక్కర కొచ్చేసరికి, దాన్ని పాటకు పెట్టించి, ట్రస్టీ తన బావమరిది పేర కొట్టేయించుకోలా? పిచ్చిభూమో, యెచ్చిభూమో, అది మనదైతేనే మనం చెమటోడ్చినా, చెమటోడ్చిన ఫలం. అందుకనే ఎక్కడికైనా వెళ్ళి, మరొక చారెడు నేల సంపాయించుకుందామని నా ఆరాటం. ఇక్కడ ఈ పడే కష్టమే అక్కడ పడితే, అది గనిగడ్డ కాదూ? రైతు : మా కేమీ వద్దులే! అచ్చొచ్చిన భూమి అడిగిడే చాలు. కొడుకు : ఏమి అచ్చిరావడం? ఎంత రెక్కలు విరుచుకున్నా కడుపు నిండక పోవడమేనా? రైతు : ఏమైనా అత్తారిపంచని చేరతావట్రా? అది మగసిరి పనేనా? అంతకంటె అడుక్కుతినడం మేలు! భార్య : ఇంతకీ ఆళ్ళ మాయమాటల్లో పడిపోయాడు. కొడుకు : మాయమాట లేమీ కాదు; మంచిమాటలే! వాళ్ళు రమ్మన్నప్పుడే వెళ్ళితే, ఏ నూరెకరాలో కట్టుకునే పని. అప్పు డక్కడ ఈ పాటిగా నైనా రైతు వొత్తిడి లేదు. ముందుగానే జాగ్రత్త పడ్డవాళ్ళందరు ఇప్పుడెంతో బాగుపడ్డారు. అన్ని వనరు లేర్పడుతున్నాయి; అన్ని పంటలు పండుతున్నాయి; అందరూ పచ్చగా వున్నారు. రైతు : ఇప్పుడైనా మించుకుపోయింది లేదులే! కావాలంటే నీది నువ్వు పంచుకుపో! ఈ కళ్ళకు ఈ రెప్పలు దూరం కాకపోతే, అక్కడ నీకు ఏం గతి పట్టేదీ చూడకపోతానూ? పో! నీ సగం నువ్వు పంచుకు పో! (మనుమడిని చూపిస్తూ) వాడే నాకు కొడుకూ, మనుమడూ అనుకుంటా! వాడైనా వుంటాడు నా గడ్డమీద. కొడుకు : ఆమాట కొస్తే వాడిని నే నిక్క డొదిలేసి పోతానా? రైతు : ఏఁ! నేను చచ్చింతర్వాత నా యింట్లో దీపం పెట్టేవా డుండగూడదనా? కొడుకు : సొంత ఊరునుంచి లేచిపోవడమంటే నీకేనా బాధ? నాకు లేదూ? ఇక్కడొక యెకర మమ్మి, అక్కడ నాలుగెకరాలు కొనాలనే ఈ తాపత్రయం నాకు దేనికి? మన రెక్కల కష్టం (కుర్రవాడిని వేలితో చూపిస్తూ) వాడికి దక్కాలని కాదూ? వాడి బాగెరిగిన వాడివైతే నువ్వు వూరు పట్టుకుని ఊగులాడతా నంటావా? ఏది మనకు కడుపునిండా కూడు పెడుతుందో అదే మన వూరు; అదే మన గడ్డ. ఉసులుబాటు లేకపోయినా, ఉక్కిరిబిక్కిరౌతున్నా ఊరు నంటి పెట్టుకోవడం దేనికి? కొత్తగడ్డకు పోతే, కొత్త రోజులు కనబడతాయేమో! రైతు (పట్టరాని కోపంతో) : సర్లే! నువ్వే నాకు కానప్పుడు వాడు నా కౌతాడా? తీసుకు పో వాణ్ణి కూడా వెంట తీసుకు పో! పోయి ఏట్లో కలువ్!! : భార్య : ఊఁ! చాల్లే! ఏమిటా కీడు మాటలు? ఎవరైనా యింటే నవ్విపోతారు. రైతు : నవ్వకేఁ? నవ్వుతారు! పైగా ఒక్కనోటితోనే నా నవ్వేది! కాలాన్నిబట్టి బళ్లు ఓడ లౌతాయి; ఓడలు బళ్లు అవుతాయి. అలాగని జెండా పీక్కుని, ఊళ్ళవెంట అడుక్కు తినబోతారా? ఎకరాలేనా ముఖ్యం? మంచీ చెడ్డా లేదూ! మర్యాదా, మన్ననా లేవూ? మా తాత ముత్తాతలు ఈ ఊరు పెత్తందారులు. సత్రాలమీదా, చెరువులమీదా ఇప్పటికీ పెత్తనం మాదే. ఏ పంచాయితీ వచ్చినా, ఈనాటికీ మమ్మల్నే పిలుస్తారు. సీతారామ కల్యాణంలో పీటలమీద కూర్చునేది మేమే. అమ్మవారి సంబరం జరిగితే, తొలేట మాదే. ఎకరానికి నాలుగెకరా లొస్తాయని చూసుకుంటే సరేనా? వంశమర్యాద నిలబెట్టుకోవద్దూ? కూడులేక చచ్చిపోతా రేమిటి? చచ్చినా, ఎవడి పంచని వాడు చస్తే, అదొక తీరూ దారీ. లేకపోతే, కాలు పుచ్చుకుని కుక్కనీర్చినట్టు, అవతలి కీడుస్తారు. ఎక్కడైనా తాగిన రొమ్మునే గుద్దుతారా? కన్నతల్లివంటి ఊరును కాలదన్నిపోతారా? పోరా! పో!! కావాలంటే, నువ్వు పో!!! (రైతు కేకలకు మనుమడు తుళ్లిపడి లేచి, ఏడుపు ప్రారంభిస్తాడు భార్య : చాల్లే! ఏమిటా గొంతు చించుకోవడం! పిల్లోడు తుళ్ళిపడి లేచాడు. (దగ్గరికి వెళ్ళి, కుర్రవాడి వీపు నిమురుతూ) మా బాబుగా ఊరుకో! ఊరుకో!!(కుర్రవాడు ఏడుపు మానడు) బజ్జోరా, నాన్నా! బజ్జో! మనుమడు (తాతవైపు చేతులుజాచి ఏడుస్తూ) : తాతా! ఉఁ! ఉఁ! (తాత దగ్గరకి తీయడు. అతి కష్టం మీద ముఖం తిప్పేసుకుంటాడు. ) భార్య : నాన్నవుగా! పడుకో! పడుకోరా బాబూ! మనుమడు (ఇంకా యేడుస్తూనే) : తాతా! తాతా! ఊఁ! భార్య : దగ్గిరికి తియ్యవేఁ - ఆడంత గోలెడుతూ వుంటే? మనుమడు : ఊఁ! ఊఁ! తాతా!ఊఁ! భార్య : నే నున్నాగాదురా! బజ్జో, బాబూ! మనుమడు : ఊఁ! ఊ! నాకు తాతే కావాలి... ఊఁ! తాతా! ... ఊఁ! భార్య : ఇంతకీ నాకొచ్చిపడింది ఈ ఖర్మ! మనుమడు (ఏడుపు పెద్దదిచేసి) : ఆఁ! ఆఁ! తాతా! ఉఁ! ఊఁ!! భార్య : అబ్బ! ఎత్తుకున్న దాన్ని నేను మడిసిని కాదట్రా? ఊరుకో! కొడుకు : వెధవని రెండు చరిస్తే సరి! గారాం మరీ ఎక్కువై పోయింది! మనుమడు(భయదైన్యాలతో నిండినకళ్లతో రెండుచేతులు చాచి,తాత వైపు విరగబడుతూ):తాతా! తాతా!! రైతు (గాద్గదికంగా) : నీ తాత లేడురా, బాబూ! నీ తాత చచ్చి పోయాడు (రైతు మరి వుండబట్టలేక మనుమని యెత్తుకుంటాడు. కప్పవలె కరుచుకుని, భుజంపై తల పొదువుకుని, మనుమడు ఇట్టే తిరిగి నిద్రపోతాడు. రైతు: (రెండు, మూడుసార్లు చావడిలో పచారుచేసి, కొడుకుతో) : నీపట్టు నీదేనట్రా? కొడుకు : నే నేమి ఏడ్పేడ్చినా నాకోసం కాదు. అదుగో! అక్కడ ఆ పుట్టినవాడికోసం. ఇదుగో! ఇక్కడ ఈ పెరుగుతున్న వాడికోసం. వీళ్ళిద్దరుకాక విరగడ చెయ్యవలసింది మరొక ఆడపిల్లకూడా వుంది. ఈ ముగ్గురికి మరొక ముగ్గురైతే మన పని “అమ్మా బువ్వ - అయ్యా బువ్వ” అవుతుంది. - భార్య : ఆఁ! చెట్టుకు కాయలు బరువటరా? కొడుకు : అసలు చెట్టొకటి మిగిలేనా? మనం ఆరోజుకారోజు చేవ దేల్తున్నామా? నీళ్ళు కారుతున్నామా? మనకేఁ? కష్టమో, సుఖమో మన బ్రతుకులు ఎలాగో వెళ్ళమారిపోతాయి. రేపు వాళ్ళ మా టేమిటి? వాళ్లు పాలేరుతనానికి నిలబడవలసిందేనా? రైతు : నువ్వేమన్నా ఆదికాలంనుంచీ ఇది మన ఊరురా! ఊరు మొత్తంమీద ఒకప్పుడు మనదే పెద్దకుండ. కష్ట మొచ్చినా, సుఖ మొచ్చినా - చల్లని తల్లి - ఈవూరే మనల్ని కడుపులో పెట్టుకు కాపాడింది. దీన్ని విడిచి పెట్టక తప్పదట్రా?(కొడుకు మాటాడకపోగా, దీర్ఘంగా నిట్టూర్చి) ఈ గడ్డమీద పుట్టాను; ఇక్కడే పెరిగాను; ఇక్కడే మట్టి కూడా అయిపోదామనుకున్నా. కొత్తగడ్డమీద అడు గెట్టాల్సొస్తుందని కలలోనైనా అనుకోలేదు. (మరి రెండు, మూడుసార్లు పచారుచేసి) నాగలి పట్టిననాటి నుంచీ నేను దున్నుకుంటున్న చేలో మరొకడు పాదం డితే నాగుండె తరుక్కుపోదట్రా? కొడుకు మనస్సు మారుతుందేమోనని, ఒక్కక్షణం పాటు ఆగి, మరి లాభం లేదనుకుని) ఇంతవరకు నన్నెవ్వరు లొంగదీయలేదు. ఈనాడు (మనుమని వీపు చేతితో తడుతూ) ఈ పసికందు లొంగదీస్తున్నాడు. (ఒక త్రుటిపాటు ఆగి, ప్రారబ్దానికి తల వొగ్గుతున్నట్టుగా) సరే! రేపు భూషయ్యకు బేర మివ్వు! (కొడుకు పెదవులపై విజయసూచకంగా చిరునవ్వు మొలక లెత్తుతుండగా తెర)   ద్రోహం (ఏకాంకిక)

పాత్రలు:

లా కాలేజీ విద్యార్థులు - గిరి, మూర్తి, శాస్త్రి, రావ్, ప్రసాద్.
స్థలం :  స్టూడెంట్స్ లాడ్జిలో గది
కాలం: వర్తమానం

మద్రాస్ లింగిచెట్టివీధిలో ఒక గది. దానిలో మూర్తి, శాస్త్రి వుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక టేబుల్, ఒక చెయిర్, ఒక బుక్ షెల్ఫ్, ఒక క్యాంప్ కాట్. మూర్తిది ఒక లెదర్ సూట్ కేస్; శాస్త్రివి రెండు స్టీల్ ట్రంకులు. మూర్తి టేబుల్ మీద ఒక టెన్నిస్ రాకెట్, చిక్కురొక్కురుగా కొన్ని పుస్తకాలు, ఉపయోగించి అలక్ష్యంగా విడిచిపెట్టిన షేవింగ్ సెట్ వగైరా. శాస్త్రి టేబుల్ మీద ఒక పెద్ద అద్దం, ఒక అలారం టైమ్ పీస్, చక్కగా సర్ది పెట్టుకున్న పుస్తకాలు మొదలైనవి.

తెర లేచేసరికి శాస్త్రి డ్రెస్సింగ్ పూర్తిచేసుకుని, అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ వుంటాడు. ఒక నిమిషం తర్వాత ఎడమ వైపునున్న గది గుమ్మం గుండా మూర్తి చాలా అలసటగా వస్తాడు. అతని అడుగుల అలికిడికి శాస్త్రి వెనక్కి తిరిగి చూస్తాడు.

శాస్త్రి : ఏరా, మూర్తీ! చౌదరికి... (మూర్తి కొరకొర చూపులకు బెదరిపోయి, మాట మధ్యలో శాస్త్రి ఆగిపోతాడు. మూర్తి తన క్యాంప్ కాట్ ను చేరి, దానిపై చతికిలబడి, ముందుకు వాలి, గుండె బరువుగా వున్న వాడివలె ముఖాన్ని అరచేతులతో కప్పుకుంటాడు. దీన్నిచూచి శాస్త్రి తెల్లబోతాడు. శాస్త్రి (బెదురుగా) : చౌదరి కండిషన్ ఎలా వున్నదేమిరా? మూర్తి (విదిలించి వేస్తున్నట్టుగా) : ఊఁ! ఎలా వుంటే నీకు దేనికిలే! శాస్త్రి : నాలుగైదు రోజుల్నుంచి చూస్తున్నా - నేనంటే నీ వెందుకో చెడ్డ చికాకుగా వుంటున్నావు. నేనేం చేశానని నీకింత కోపం? పోనీలే, ఎలా వున్నాడు చౌదరి? మూర్తి : ఎలా వున్నాడా? రాత్రినుంచి డెలిరియం ప్రారంభమైంది. శాస్త్రి : అయితే కొంచెం సీరియస్ గానే వుందన్నమాట. మూర్తి : ఆరి ఫూల్! శాస్త్రి : ఏమిటిరా ఆ తిట్లు ? నే నిప్పుడేమన్నానని! మూర్తి : రాత్రి నుంచి డెలిరియంలో వున్నాడంటే, ఏ కొంచమో సీరియస్ గా వున్నదనేనా దాని తాత్పర్యం? నిన్ను ఫూల్ కాదు; ఫూలున్నర అనాలి. శాస్త్రి : ఫూల్, గీలని ఇప్పుడంటే అన్నావుగాని, ఈసారి అంటే మాత్రం నే నూరుకోను. మూర్తి : పోనీలేరా! వేరే పేరు పిలుస్తాలే. నీకు అతికే పేర్లు చాలా వున్నాయ్. శాస్త్రి : హుం! చాలా వున్నాయేఁ! మూర్తి : ఆఁ! చాలా లేకేమిరా? డన్స్, యాస్, స్టుపిడ్, ఇడియెట్, డండర్ హెడ్, మీన్ మైజర్లీ రెచ్ ఓఁ! వీటికి అంతేమిటి? శాస్త్రి : అన్నింటికీ తెగించి కూర్చున్నావ్! అంటావ్! నీ వనకేఁ? నీ మాటలకు వాల్యూ యేమిటి? నీ నోటికి హద్దూ పద్దూ లేదని ఒకనాడు చౌదరి నాతో... మూర్తి : షటప్! : గిరి (ప్రవేశిస్తూ) : ఏమిటిరా? అప్పుడే మీ కిద్దరికీ మళ్ళీ మొదలైందీ లడాయి? మూర్తి : లేకపోతే, ఈ సిల్లీ ఫూల్ చూడు! నర్సింగ్ హోంనుంచి నేను తిరిగి వచ్చానో, లేదో... శాస్త్రి : అది కాదోయ్, గిరీ! చౌదరి రాత్రినుంచి డెలిరియంలో వున్నాడని... మూర్తీ! నిజమే? గిరి (డెలిరియం అనే ముక్క తర్వాత మాటను తెంచివేస్తూ) : ఏరా మూర్తి (బరువుగా) : ఆఁ! జుట్టు పీక్కోవడం, వొళ్లు రక్కుకోవడం చాలా అవలక్షణాలు ప్రారంభమైనాయ్. బెడ్ మీద నిలవడం లేదు. పట్టుకోలేకుండా వున్నాం. చేతులు మంచానికి కట్టేశారు. గిరి (దైన్యంగా) : పూర్ ఫెలో! చూస్తూ చూస్తూ వుండగానే ఎంత ముంచుకొచ్చిందిరా! మూర్తి : మొన్నే మనం అతన్ని వాళ్ల వూరు పంపించేస్తే బాగుండేదేమోరా? గిరి : ఆఁ! వాళ్ళది కుగ్రామమట. అక్కడ మెడికల్ ఎయిడ్ ఏముంటుంది? పైగా, ఈ స్థితిలో రైలు ప్రయాణం డేంజరస్ అని డాక్టర్ అన్నాడు కూడాగా, శాస్త్రి : అయినా, మన బాధ్యత తప్పేది. మూర్తి : ఔను! ముఖ్యంగా నీ బాధ్యత తప్పేది! ఇప్పు డతని బరువంతా నువ్వే మోస్తున్నావ్. శాస్త్రి : ఏమోయ్ గిరీ! చూశావా? - నేనంటే వొంటి కాలిమీద ఎలా వస్తున్నాడో! మూర్తి : రెండు కాళ్ళ మీ దొచ్చినా మొండి శిఖండివీ, నీకేమి సిగ్గా, తెరమా? షేమ్ లెస్ మాన్? గిరి (విసుగ్గా) : అబ్బబ్బ! సమయం లేదు; సందర్భం లేదు. క్యాట్స్ అండ్ డాగ్స్. మీ కిద్దరికీ ఎప్పుడూ ఒక్కటే కాట్లాట! చెడ్డ న్యూసెన్స్ అయిపోతున్నారు. మూర్తి : లేకపోతే, ఏమిటి? ఈ డామ్ ఫూల్ మాటలు! చౌదరి ఫీవర్ తో మన లాడ్జిలో వుండగా, అది తన కెక్కడ అంటుకుంటుందోనని తప్పుకు తప్పుకు తిరిగాడు. అతను నర్సింగ్ హోంలో అడ్మిట్ అయ్యాక ఒక్కసారైనా విజిట్ చేశాడు కాదు. ఇంకా ఏమిటో - వీడి తలకాయ - తన బాధ్యతట! బాధ్యత !! గిరి : సర్లేరా మూర్తీ! ఇప్పు డెందుకులే, ఈ లేనిపోని రగడ. అయితే, ఇప్పుడక్కడ ప్రసాదు గారున్నారా? మూర్తి : ఉహుఁ! గిరి : ఆయన్ని వెళ్ళమని చెప్పానే! రానే లేదా? మూర్తి : రాకేఁ? వచ్చాడు. కాని, గ్లూకోజ్ రాత్రే అయిపోయింది. అంచేత కొనుక్కురమ్మని ఆయన్ని పంపించి, స్నానంచేసి పోదామని నే నిలా వచ్చా. గిరి : మరి, అక్క డెవ్వరూ అటెండ్ కావడం లేదన్నమాట! నేనైనా పోతా. మూర్తి : ప్రసాద్ తిరిగి వచ్చేదాకా సిస్టర్ నే జాగ్రత్తగా చూస్తూ వుండమన్నాలే. అయితే సెంట్రల్ కి ఎవరినైనా పంపించావా? గిరి : ఓ యస్! మన రావ్ వెళ్ళాడు. మూర్తి : ఆమె ఈ పూట మెయిల్ కే వస్తే బాగుండును. శాస్త్రి : ఆమెవరు? మూర్తి : ఎవరైతే నీ కెందుకురా? గిరి (శాస్త్రితో) : మన చౌదరి తల్లి. వెంటనే బయల్దేరి రమ్మని ఆవిడకు నిన్న టెలిగ్రాం పంపించాం. (మూర్తివైపు తిరిగి) మూర్తీ ! అది ఎక్స్ ప్రెస్ టెలిగ్రామ్ కాదూ? (“ఔ”, నన్నట్టు మూర్తి తల పంకిస్తాడు) మెసెంజర్ కని మైలేజీ కూడా కట్టామయ్యె. బహుశా నిన్న మధ్యాహ్నానికే అందివుంటుంది. ఆమె ఈ పూట మెయిల్ లోనే రావచ్చు. శాస్త్రి : నైన్ థర్టీ అయింది. లేట్ కాకపోతే మెయిల్ ఈసరికి వచ్చేవుండాలి. గిరి : నీకు ఈ మూర్తి పోరైనా తప్పేది; రావుకు తోడుగా కాస్త రైలు స్టేషన్ కైనా వెళ్ళకపోయావా, శాస్త్రీ? శాస్త్రి : ఆఁ! ఈ భాగ్యానికి తోడుకూడా కావాలా? మూర్తి : తోడు వెళ్ళడంలో నీకు ఆల్ ఆఫ్ ఎ సడెన్ నమ్మకం పోయిందేమిరా? చౌదరి కాఫీ హోటల్ కి వెళ్ళినా, సినిమాకు వెళ్ళినా, తప్పనిసరిగా తోడు వెళ్ళేవాడివిగాఁ! గిరి : అబ్బబ్బ! నువ్వూరుకోరా, మూర్తీ!! నీకు బొత్తిగా మతిపోతున్నది. మూర్తి : నీవేమైనా అనుగాని, వీణ్ణి చూస్తే నాకు అరికాలిమంట నెత్తి కెక్కుతున్నది. ఇదివరకైనా వీడిసంగతి నేను కొంత కనిపెట్టక పోలేదుగాని, వీడు మరీ ఇంతటి మీన్, సెల్ఫిష్, స్టుపిడ్, కవర్డ్ లీ, డర్టీ యాస్ అనుకోలేదు. శాస్త్రి (మూర్తి వాక్యం పూర్తికాకముందే అందుకుని): చూడవోయ్! ఎంత రెచ్చెడ్ గా తిడుతున్నాడో! గిరి : చాల్లేరా, మూర్తీ! నీకు సమయాసమయాలు బొత్తిగా తెలియవ్! (శాస్త్రితో) శాస్త్రీ! నువ్విక కాలేజీకి పోరాదటోయ్! శాస్త్రి : ఆఁ! టైం కావొస్తున్నది, పోవాలిక. (పుస్తకాలు పుచ్చుకుని బయల్దేరతాడు. గిరి : అన్నట్టు, శాస్త్రీ! మాకు అటెండెన్స్ కాస్త ప్రాక్సీ చెబుతావటోయ్. శాస్త్రి : నా కది అలవాటులేని పని, మన నాయుణ్ణి చెప్పమంటాలే. మూర్తి : ఉద్ధరిస్తావ్. వీడు మరీ ఇంత అంట్లవెధవని ఇంతకు ముందు నాకు తెలియదు సుమీ! గిరి : మంచిదోయ్, శాస్త్రీ! వీడిమాటల కేమిలే? నువ్వు వెళ్ళు. మూర్తి : ఇదివరకైతే వీడికి బ్రెయినే తక్కువనుకున్నాగాని, కారెక్టర్ కూడా లేదు. (శాస్త్రి వెడతాడు. గిరి : మరీ నాలుగైదు రోజుల్నుంచి శాస్త్రి నీకు పెద్ద అబ్సెషన్ అయిపోయాడురా. అతని ప్రవర్తన నాకైనా అసహ్యంగానే వుంది కాని, మనం నోరు పారవేసుకుంటే లాభ మేమిటి?“ఇట్ టేక్స్ ఆల్ సార్ట్స్ టు మేక్ ఎ వరల్డ్” అన్నారు. మనం ఎలాగో సర్దుకుపోవాలి. మూర్తి : శాస్త్రిగాడివంటి పశువుతో కూడానా? గిరి : ఆహా! అలాంటి వాళ్ళతోనే మరీ ముఖ్యంగా. మూర్తి : ఇలాంటి పశువులను కూడా కలుపుకు పోవాలంటే మనం కూడా నాలుగు కాళ్ళమీద నడవవలసి వస్తుందేమో ! గిరి : సర్లే! ఈ చర్చ మరొకసారి చేద్దాముగాని, చౌదరికి క్లోరోమైసిటిన్ ఇంజెక్ష నిస్తే మంచిదని నిన్న సాయంత్రం డాక్టరన్నాడు. నీవద్ద పైక మేమైనా వున్నదట్రా? మూర్తి : మంతెండ్ కాదూ? అయిపోయింది! చిల్లర మల్లర మాత్రం మిగిలింది. కాని, ఏఁ? చౌదరివద్ద పైకమేమీ లేదూ? గిరి : ఉహుఁ! నర్సింగ్ హోమ్ లో అడ్మిషన్ కే అతనివద్ద ఏమీ లేకపోయింది. నేనే పే జేశా. మూర్తి : మంత్ బిగినింగ్ లో వచ్చిన నూటయాభై కాక, వారం రోజులనాడు అతనికి మరొక వంద మనియార్డర్ రాలా? గిరి : ఆఁ! ఎంతవస్తేనేఁ? రెండోనాటికి కానీ మిగల్చడు. అతనెంత శ్రీమంతుడైనా మరీ ఇంత ఖర్చు తగదు. మూర్తి : అయితే, ఇప్పు డేమి చేస్తాం? గిరి : అదే తోచడం లేదురా. అప్పిచ్చేవాడైనా కనబడడు. అక్కడికీ మొన్న మన నాయుడువద్ద పాతిక రూపాయలుంటే పుచ్చుకుని చౌదరికిందే ఖర్చు పెట్టేశాను. మూర్తి : ప్రసాద్ పర్సుకూడా ఖాళీయే. గ్లూకోజ్ టిన్నుకు తన వద్ద టూ రుపీస్ లేక, నన్నడిగి పట్టుకు వెళ్ళాడు. మన రావ్ ని అడిగిచూశావా? గిరి : ఆఁ! రావ్ చాలా బీదవాడు. పాపం! అతని పని కటకటగా వుంటున్నది. చివరివరకు చదువు సాగుతుందో, లేదో అని ఆఁదోళన పడుతున్నాడు. గుంభన గల మనిషి కాబట్టి, బయటపడడుగాని, కాలేజీ జీతానికైనా డబ్బుండడం లేదు. మందు కొనడానికి ఇప్పు డేమి చెయ్యాలో - ఏమిటో నా కేమీ పాలుబోవడం లేదు. మూర్తి : అన్నట్టు, చౌదరి మదర్ కాసేపటిలో వస్తున్నదిగా! ఆమెకు డబ్బు కేం తక్కువ? ఆమె నడిగితే సరి. గిరి : కాని, ఆమె ముక్కూ ముఖమైనా మన మెరగం. రైలు దిగీ దిగడంతోటే పైక మడిగితే, ఆమె ఏమనుకుంటుందో? మూర్తి : ఔనురా! అదీ నిజమే. ఆఁ! అన్నట్టు శాస్త్రిగాడి దగ్గర డబ్బు పుష్కలంగా వుంది. ఫైవర్స్, టెన్నర్స్ మొన్నొకనాడు ఆ వెధవ చేతిలో పెద్ద పొతిక కనబడింది. గిరి : అయ్యో! చేబదులైనా చేయడానికి అతను కాలేజీకి వెళ్ళిపోయాడేం! మూర్తి : వెళ్ళితేనేం? ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఏ బిల్లు పే జెయ్యవల సొస్తుందో నని అణా, బేడా, మనీ పర్సులో వేసుకుని వాడు బయటికి బయల్దేరతాడు. వాడి దాపరికం - అదుగో - ఆ పెద్ద స్టీల్ ట్రంకులో, ఎలాగైనా దాని తాళం పగలగొడితే... (ఆశ్చర్యంగా) హెవెన్స్! ఏమిటీ చిత్రం! ఇవ్వాళ పెట్టెకు తాళం బిగించడం మర్చేపోయాడు! (గబగబ మూర్తి ట్రంకుల వద్దకు వెడతాడు. గిరి : నోనో! దట్స్ బ్యాడ్! అతను లేనప్పుడు అతని పెట్టె తెరవడం తప్పు. మూర్తి (పైనున్న చిన్న ట్రంకును దించి, అడుగునున్న పెద్దదాన్ని తెరుస్తూ) : నీకు తెలవదులేరా! ముందు ఈ ప్రాణావసరం గడిస్తే, తప్పొప్పులమాట తర్వాత కన్సిడర్ చెయ్యొచ్చు. (బట్టల అడుగునుంచి నోట్లపొతిక తీసి, లెక్కపెడుతూ) చూడరా! వెధవదగ్గర... (ట్రంక్ వద్ద నుంచి, గిరి వైపుకు నడిచి వెడుతూ, ముందు కొంత సేపు నోట్లోనే లెక్కపెట్టి. తర్వాత పైకి అంటూ) టూ ఫార్టీ - ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ – సిక్స్ టీ- సిక్స్ టీ టూ – సిక్స్ టీ ఫోర్ - సిక్స్ టీ ఫైవ్ - సిక్స్ టీ సిక్స్ – సిక్స్ టీ సెవెన్...టూ సిక్స్ టీ సెవెన్ రూపీస్ వున్నాయ్! గిరి : మూర్తీ! నువ్వు ఏం చేసినా, చెడ్డ ఇంపల్సివ్ గా చేస్తావురా! ఇప్పుడు శాస్త్రి వచ్చాడంటే, మనకి దొంగరికం కడతాడు! మూర్తి : ఆఁ! వాడిమొఖం కాదూ? నోరు మెదిపాడంటేనా? నా సంగతి తెలియదూ? ఈ టెన్నిస్ రాకెట్ వాడి వీపుమీద విరిగిందన్న మాటే! గిరి : అత నొకవేళ ఏదైనా మాట తూలినప్పటికీ నువ్వు తొందరపడబోకు! ఏవీ, ఒక యాభై రూపాయలిలా తే! (వాటిని అందుకుని). వీలుపడితే, అతని పైకం సాయంత్రం లోగానే రీప్లేస్ చేద్దాం. లేకపోతే, లైఫ్ అండ్ డెత్ కొశ్చన్ కనక, నేనే పెట్టె తెరిచి, ఒక యాభై మాత్రం పట్టుకెళ్ళానని చెప్పు. మూర్తి : ఏఁ! నేనే తీశానంటే తలకొట్టి మొలవేస్తాడా? గిరి : నాన్ సెన్స్! నీకు తెలియదురా! - నేను చెప్పమన్నట్టే చెప్పు. నువ్వు వాణ్ణి రెచ్చగొడితే, ఎటుపోయి యెటువస్తుందో! ఇప్పుడు తప్పు మనమీద వున్నదయ్యె! అన్ని రోజులూ మనవి కావు. డోన్ట్ బి హేస్టీ. ఊఁ! నే వెళ్లోస్తాగాని, ఆ మిగతా డబ్బు మళ్ళీ భద్రంగా వాడి పెట్టెలో వుంచెయ్. (మిగిలిన డబ్బును మూర్తి తిరిగి శాస్త్రి ట్రంకులో పెట్టి వేస్తాడు. క్రిందకు దించిన చిన్న పెట్టెను పెద్దదాని పైకి యెక్కిస్తాడు కూడా. గిరి తన చేతిలోని నోట్లను మనీపర్సులో పెట్టుకుంటూ, గుమ్మం వైపుకు రెండడుగులు వేస్తాడు. ఇంతలో పెద్దగా నిట్టూరుస్తూ రావ్ ప్రవేశిస్తాడు. రావ్ (కుర్చీలో బరువుగా చతికిలబడి) : అబ్బ! మూర్తి (భయాందోళనలతో) : ఏరా? ఏమిటి? రావ్ : చౌదరి తల్లి.... గిరి : ఏఁ! ఆవిడ ఈ బండికి రానేలేదా? రావ్ : రాకేఁ? వచ్చింది. కాని, ఏం చెప్పను? గిరి : అయితే మరేమిటి? ? మూర్తి : యస్! ఏఁ? గిరి : ఏమిటోయ్? అసలు విషయ మేమిటి? మూర్తి : అబ్బ! చంపక చెప్పరా? రావ్ : మన చౌదరి... మూర్తి : ఏఁ! సింక్ అయిపోతున్నా డేమిటి? రావ్ : అబ్బే! లేదురా! ఉదయాన వున్నట్టే వున్నాడు. రావ్ : చౌదరి మహాభాగ్యవంతుడని కాదూ, మీ అభిప్రాయం గిరి : ఇప్పు డతని స్థితిగతుల మాట దేనికి? రావ్ : ఆఁ! ఏమీ లేదు. నేనూ మీలానే పొరబడ్డాను. మూర్తి : ఏమిటిరా? నువ్వు స్ట్రేంజిగా మాట్లాడుతున్నావ్! రావ్ (కుర్చీపై నుంచి అశాంతిగా లేస్తూ) : పాపం! ఆ తల్లిని చూస్తే నువ్విలా అనేవాడివి కాదురా? చింపిరితల, చీరికల గుడ్డలు, మ్స్ - ఏం చెప్పను ఆమె అవతారం! వొఠ్ఠి ఎముకలగూడు! కళ్ళలో వున్నదేమో కాస్త కొనూపిరి. మహా యిల్లాలు! ఉన్నపూట తిని, లేనిపూట పస్తుండి కొడుక్కు చదువుకు డబ్బు పంపించేదట. గిరి: ఒకేసారిగా { రియల్లీ! } మూర్తి : అబ్సర్డ్! రావ్ : ఈ సంగతి ఆమె నోటినుంచికాక, మరెవరి ద్వారానైనావిని వుంటే నేనూ మీలానే నమ్మలేక పోయేవాణ్ణే ! మూర్తి : ఇంత ఘోరమా? గిరి : ఎంత దారుణం! రావ్ : వాళ్ళకి ఆరెకరాల మాగాణి వుండేదట. అతను బి.ఏ. పూర్తిచేసేసరికి దానిలో సగం అప్పులకింద పోయిందట. పోతే, ఇప్పుడు ఈ లా కాలేజీ చదువుకోసమని నిరుడు మిగతా మూడెకరాలు అమ్మేశారట. ఈ యేటికి లోగిలి తాకట్టు పెట్టి, దొడ్లో పాటి మట్టి అమ్మించి పాపం! ఆమె డబ్బు పంపిస్తున్నదట. మూర్తి : మై గాడ్! రావ్ : డబ్బు చాలక పిల్లవాడు ఎక్కడేమి యిబ్బంది పడతాడోనని పాలూ, పెరుగూ అమ్మి, పట్నం పంపించేదట. పిడకలు చేసేదట; ఏకులు వడికేదట; కూలికి దంపుడు కూడా దంచేదట. ఈమాట చెవిని పడితే కొడుకు మనస్సు చివుక్కుమంటుందేమోనని కడుపులో పెట్టుకునేదట. తాను కష్టపడ్డా, కడుపు కట్టుకున్నా, ఇంకెంత కాలంలే అనుకొంటూ వుండగానే ఈ ఆపద వచ్చిపడిందని ఆవురుమంటున్నది. మూర్తి (నమ్మలేక) : ఏమోయ్ రావ్! ఈ సంగతులన్నీ ఆమె ఇప్పుడు నీకెందుకు చెప్పింది? రావ్ : ఉహుఁ! నన్నూ, నిన్నూ వినమని ఆ మేమీ చెప్పలేదు. కొడుకుని చూచుకుని పాపం! ఆ తల్లి గుండె పగిలేలా యేడుస్తున్నది. ఆ యేడుపుమధ్య ఇంకా చాలా విషయాలు బయట పెట్టింది. గిరి : ఏమిటవి? రావ్ : ఎన్నని చెప్పమంటావోయ్! శోకం పట్టలేక తన సోదంతా వెళ్ళబోసుకుంటున్నది. “మనకు ఒక్కగాను ఒక మగబిడ్డ. వాడు పెద్ద చదువు చదివి, పెద్ద ఉద్యోగం చేస్తే, మన వంశానికే గౌరవమే. ఆస్తి వుంటుందీ, పోతుందీ అని వెనకా ముందూ ఆడకుండా, ఎంత డబ్బైనా సరే, వాడికి చదువు చెప్పించవే” అని వాళ్ళ ఆయన చెప్పిపోయాడట. తనూ అంతే ననుకుని బిడ్డను దొరలా పెంచుకున్నదట. చదువు పూర్తిచేసి, కొడుకు ఏ జిల్లా జడ్జియో అయితే, చూచి ముచ్చటపడ్డానికి ఆయన లేడు గదా అని విచారించేదట. చదువుకున్న పిల్లని చేసుకుని, కొడుకూ, కోడలూ చిలకా, గోరంకల్లా కాపరం చేస్తూవుంటే, వాళ్ళచేతుల మీదగా తను దాటిపోదామనుకున్నదట. దుఃఖం పట్టలేక ఇలాగే ఏమేమో చాలా వెళ్ళబోసుకుంటున్నది. గిరి : చౌదరి సిన్సియర్ మ్యాన్ అనుకున్నా. నావద్ద అతడికి రహస్య మనేదే లేదనుకున్నా ! కాని, ఎంత నటన చేశాడు? తన స్థితిగతుల సంగతి పొరపాటుగానైనా ఎన్నడూ నాతో అన్నాడు కాదు. మూర్తి : ఉహుఁ! నాతోనూ అనలేదు. రావ్ : నిజమే! ఎవ్వరితోనూ అనలేదు. గిరి : కాని, ఎంత స్టయిలిష్ గా వుండేవాడు! ఫక్తు ట్వీడ్ సూట్స్ వేసేవాడు. కాస్ట్ లీ స్నోస్, సెంట్స్, పొమేడ్స్, హెయిర్ ఆయిల్స్ వాడేవాడు. ఆ మధ్య పి.ఆర్. అండ్ సన్స్ లో ఎనభై రూపాయలు పెట్టి సిల్వర్ హెయిర్ బ్రష్ కొన్నాడు. మూర్తి : నీకు అంతే తెలుసునన్నమాట! పోయిననెలలో రెండు వందల యాభై రూపాయలకు స్పెన్సర్స్ లో బాండ్ స్ట్రీట్ రెయిన్ కోటు కొన్నాడు. గిరి : తనకోసం తనే తగలేసుకుంటే, అక్కడి కది కొంత నయమే! సినిమాకి వెళ్ళినా, కాఫీ హోటల్ కి వెళ్ళినా, అందరి బిల్సు పట్టుపట్టి తనే చెల్లించేవాడుగాఁ! రావ్ : డబ్బు నీళ్ళలా వాడుతూ ఇంకా చాలా చాలా చేసేవాడు లెండి. మూర్తి : అతని ఖర్చుచూచి, లక్షాధికారి అనుకున్నా, గిరి : నేనైతే జమీందారే అనుకున్నా. మూర్తి : ఎంత చిత్రం! గిరి : కాదు, విడ్డూరం! మూర్తి : తల్లి నిన్ని కష్టాలుపెట్టి, చౌదరి ఎందుకిలా ప్రవర్తించాడో? నా కేమీ అర్థం కావడం లేదు. గిరి : నాకూ అయోమయంగానే వుంది.

రావ్ :  నా కతని ప్రవర్తన కొంతవరకు అర్థమౌతుందనుకుంటాను. అతడిలా నేనూ పేదవాడినే; 

నేనూ పల్లెటూరివాడినే. లా కాలేజీలో చేరడానికని ఈ మద్రాసుకు వచ్చిన కొత్తలో ఇక్కడి సిరీ, ఇక్కడి సంపత్తీ నన్నూ, నా పేదరికాన్ని వెక్కిరిస్తున్నట్టే అనిపించింది. కొంత సిగ్గు, కొండంత బిడియం, అర్థంలేని అసూయ, అకారణమైన ఆవేదన అప్పటి నా మనఃస్థితిని గురించి చెప్పడం కష్టమే. మొత్తంపై నే నంటే, నాబ్రతుకంటే నాకే అసహ్యం పుట్టింది. మా పల్లెటూరు, మా పూరి కొంప, మా ముతకగుడ్డలు, మా మోటు తిండి; అదొక నరకంలానే తోచింది. దానినుంచి ఎంత దూరంగా పారిపోతే, నాగరికతకు అంత దగ్గరగా వస్తాననుకున్నా, పస్తులుండి, పడరాని పాట్లుపడి, ఎప్పుడడిగితే అప్పుడు ఎంతడిగితే అంత పైకం పంపడానికి చౌదరిలా నాకూ ఎవరైనా వుంటే, నేనూ అతడిలానే తయారయ్యే వాడినేమో చీకటిలోనుంచి ఒక్కసారిగా వెలుగులోకి వస్తే కళ్లు చిరత లాడినట్టుగానే వుంటుంది జీవితమంతా ఏ కుగ్రామంలోనో, ఏ చిన్న బస్తీలోనో గడిపి, మొదటిసారిగా ఈ మద్రాసును పోలిన మహానగరానికి వస్తే. గిరి : ఏమైనా చౌదరి చేసినపని అతి ఘోరం! మూర్తి : నా ఒపీనియన్ నన్ను చెప్పమంటావా? దిస్ ఈజ్ సింప్లీ మాన్ స్ట్రస్. రావ్ : సరే! ఇప్పు డేమనుకుంటే ఏం లాభంలేరా? అతడిప్పు డెలాగైనా వొడ్డున పడితే అదే పదివేలు. లేకపోతే, ఆ తల్లి చేసిన త్యాగమంతా బూడిదలో పోసిన పన్నీరౌతుంది. ఆవిడ కోసమైనా అతడు బ్రతకాలి. ఏమోయ్, గిరీ! డాక్టరు నీతో ఏదో మందు మాట చెప్పాడట. గిరి (బరువుగా) : ఔనోయ్! “అప్పా అండ్ కో” లో కొనుక్కుపోవాలి. ఏఁ! నువ్వుకూడా రారాదూ? రావ్ : నామనస్సు చెడ్డ కలతగా వుంది. నే నిప్పుడు రానులే. కాసేపైనాక సరాసరి తిరిగి నర్సింగ్ హోంకే వస్తా. గిరి : మంచిది. ఇప్పటికే ఆలస్యమైందేమో. మరి, నే వెడతా! కన్నతల్లి నింతగా కష్టాల పాలుచేసి, చౌదరి లోకానికి మంచివా డయ్యాడన్నమాట! రావ్ : ఆఁ! ఇది ఆలోచించి చేసిన పనే అంటావా? కాదు, కేవలం అనాలోచిత ప్రవర్తన, గిరి (వెళ్ళిపోతూ) : ఏదో ఒక ప్రవర్తన! ఏదైతేనే? కన్నతల్లి కింత ఘోరాన్యాయం చేసింతర్వాత! (గిరి వెడతాడు. మూర్తి : పూర్ మదర్! కొడుకుకోసం ఎంత శాక్రిఫైస్ చేసిందిరా! ఆవిడ మా అమ్మే అయితేనా? ... మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. మా కున్నది నన్నూ, నా యిద్దరు చెల్లెళ్ళనూ కాల్చుకుతినే సవతి తల్లే... చౌదరి హార్ట్ లెస్ గా ప్రవర్తించాడు గాని, ఆవిడ మా అమ్మే అయితేనా, పువ్వుల్లో పెట్టి పూజించేవాణ్ణి. రావ్ : పాపం! కొడుకుమీద కొండంత ఆశ పెట్టుకున్నదిరా! మ్చ్! ఏమి కానున్నదో! తమకు చదువు సంధ్యలు లేక పోయాయే అన్న విచారం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని బాధిస్తుంది కాబోలు. అందువల్లే కొందరు పల్లెటూరివాళ్లు తమ బిడ్డల చదువు కోసం ఎన్ని కష్టనష్టాలైనా సంతోషంగా పడతారు. బస్తీలకు పోయి, వేలకు వేలు గుమ్మరిస్తేనే తప్ప పూర్తి కాని ఈ చదువులకు వాళ్లు బలి అయిపోతూ వుంటారు. త్యాగమంటే నిజంగా వాళ్ళదే త్యాగం. (శాస్త్రి ప్రవేశిస్తాడు. శాస్త్రి : ఎవరిదండీ త్యాగం? మూర్తి (అవహేళనగా) : నీదేరా? నీ ప్రశంసే మన రావుగారు చేస్తున్నారు. నువ్వు గొప్ప త్యాగమూర్తి వట! సరిగాని, నువ్వు కాలేజీకి వెళ్ళలేదేమిరా? శాస్త్రి : వెళ్ళకేఁ! వెళ్లా. తీరా లెక్చెర్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఏదో మాట జ్ఞాపకం రాగా వెనక్కి చక్కా వచ్చా. మూర్తి (తీక్షంగా చూస్తూ) : ఏమిటది? శాస్త్రి. మరేమీ లేదురా : ట్రంక్ లాక్ చేసుకోవడం మర్చిపోయా. మూర్తి : వెంటనే తిరిగి రాకపోతే, నీ పెట్టె నేను కొల్లగొట్టేస్తా ననుకున్నావా? శాస్త్రి : అబ్బే! లేదురా! కాని... మూర్తి : కానీ, గీనీ ఏమిటది? రావ్ : మూర్తీ! నువ్వు మరీరా! శాస్త్రిగారి మీదికి కయ్యానికి కాలు దువ్వుతావ్. మూర్తి : లేకపోతే ఏమిటిది? ఈ రూంలో వుంటున్నది వీడూ, నేనూ. అయితే, ఇఖ వీడి భయమేమిటి? పెట్టెకి తాళం లేకపోతే, వీడి ముల్లె నేను కాజేస్తాననేనా? శాస్త్రి : ఏమండీ రావుగారూ! ఆ మాట నే నన్నానా? మూర్తి : అంటేనా? డొక్క చీరేస్తాను. (శాస్త్రి మీదకు కొట్టబోయినట్టు మూర్తి వెడతాడు. అతడిని రావ్ వారిస్తాడు. ఇంతలో ప్రసాద్ వస్తాడు. ప్రసాద్ (ఆఁదోళనగా) : గిరి లేడూ? రావ్ : లేడే! దేనికండీ, ప్రసాద్ గారూ? మూర్తి : ఇప్పుడే వెళ్ళాడురా మందుకోసమని. నీకు దారిలో యెదురుపడవలసిందేనే! రావ్ : ఏమిటండీ సంగతి? మరేమీ తొందరలేదుగదా?

ప్రసాద్ (బరువుగా) :  చౌదరి కొలాప్స్ అవుతున్నాడు.

{: రావ్ : ఒకేసారిగా పాపం! మూర్తి} శాస్త్రి : అయ్యో! ప్రసాద్ (నిట్టూరుస్తూ) : ఈ సరికి అయిపోయిందేమో కూడా!

రావ్ :  ఆ తల్లి ఆశలన్నీ... పాపం! మంటగలిసిపోయాయి. 

ప్రసాద్ : అసలు ఆవిడ దుఃఖాన్ని చూడలేకే సగం నేనిటు పరిగెత్తుకొచ్చా. మూర్తి : బ్రతికీ, చచ్చీకూడా ఆ తల్లికి ద్రోహం చేశాడన్నమాట! రావ్ : ఆఁ! అంతేరా. ప్రసాద్ : ఔ నంతే! మహాద్రోహం చేశాడు. ... రావ్ : మరి దేనికి? పోదాం పదండి. మన మెవ్వరం కూడా లేకపోతే - పాపం - ఆవిడ గతి ఏంకాను! (రావ్, ప్రసాలు కదులుతారు. శాస్త్రి ఏమి చేస్తాడో అన్నట్టుగా మూర్తి అతని వంక చూస్తూ వుంటాడు. శాస్త్రి వెళ్ళి, తన కుర్చీలో కూర్చోబోతాడు. మూర్తి : ఏరా! నువ్వు రావడంలా? శాస్త్రి : ఊహూఁ! నాకు కాళ్లాడ్డం లేదు. మూర్తి : చౌదరి డబ్బు విరజిమ్ముకు పోతూవుంటే, వాటిని యేరుకోడానికి బాగానే కాళ్లాడేవేం! రావ్ : (వెడుతున్నవాడు వెనక్కు వచ్చి). నువ్వు రారా! ఇదేనా తగవులకు సమయం? మూర్తి : ఈ రాస్కెల్ ను నిలువునా చీల్చినా పాపం లేదు. అంత కన్నూ, మిన్నూ కానకుండా చౌదరి ప్రవర్తించడానికి సగం వీడే కారణం. (కొట్టడానికి శాస్త్రి పైకి దూకుతాడు. ఇంతలో రావ్, ప్రసాద్ అడ్డుపడతారు. రావ్ (మూర్తిని అవతలకి తోసి) : నీకు పిచ్చెక్కుతున్నదేమిరా! చాల్లే - కాస్త నిదానించు. (శాస్త్రితో) రావోయి, శాస్త్రీ ! నువ్వుకూడా రా! నువ్విప్పుడు ముఖం చాటువెయ్యడం బాగుండదు. సరే - పదండి. పాపం ! దిక్కులేని ఆ తల్లి ఏమౌతున్నదో? ప్రసాద్ : ఆవిడవద్ద డబ్బేమీ లేనట్టున్నది. ఏ పెద్ద డాక్టరు కాళ్ళో పట్టుకుని బిడ్డను దక్కించు కోడానికి డబ్బైనా తెచ్చుకున్నాను కాదని ఆవిడ గోల పెడుతున్నది. గిరే ఎక్కడైనా సాధించాలిప్పుడు. మూర్తి : ఆఁ! వెధవ డబ్బు! డబ్బు కేమిలే! మీరు పదండి! ఐ విల్ గెట్ ఇట్! (రావ్, ప్రసాద్, శాస్త్రి వెడతారు. మొదటి వారిద్దరు సాగిపోయినా, శాస్త్రి కావాలని వెనుక బడతాడు. మూర్తి దీన్ని గమనించకుండానే చటుక్కున శాస్త్రి ట్రంకుల వద్దకు వెళ్లి, పైదాన్ని ఒక పక్కకు విసిరి పారవేసి, అడుగు దానిలోనుంచి డబ్బుతీస్తాడు. శాస్త్రి “ఆఁ ఆఁ!” అంటూ నోరు తెరిచి, తెల్లమొహం వేసి నిలిచివుండగా – తెర)   ఏకాభిప్రాయం (గ్రామీణ రాజకీయాలు)

పాత్రలు : ఈశ్వరరావు,రామబ్రహ్మం, వెంకటాద్రి, సుబ్బన్న, ప్రసాదరావు, జానకిరామయ్య, బిల్లు కలెక్టరు.

స్థలం :  ఈశ్వరరావు యింటి చావడి
కాలం: వర్తమానం

ఈశ్వరరావు యింటి చావడి. కుడివైపున సింహద్వారం; ఎదురుగా రెండు గదులలోకి రెండు ద్వారాలు; ఎడమవైపున పెరటిలోకి ద్వారం. చావడిలో గదులగోడ సరసను ఒక టేబుల్; నడిమిని ఒక పడకకుర్చీ, రెండు, మూడు మామూలు కుర్చీలు, ఒక బెంచీ, కొన్ని కాలెండర్లు, ఫొటోలు, వెండితో చేయబడిన లక్ష్మీ, సరస్వతి పటాలు. తెర లేచేసరికి ఈశ్వరరావు పడకకుర్చీలో పడుకుని, ఒక ఇంగ్లీషు దినపత్రిక చదువుతూ వుంటాడు. అతని వయస్సు ఇంచుమించు ముఫ్ఫై రెండు సంవత్సరాలు, పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్న వాడు గనక, వేషభాషలలో పట్టణ సంస్కారం కొంత కనబడుతూ వుంటుంది. తెర లేచిన కొన్ని క్షణాలకు రామబ్రహ్మం, వెంకటాద్రి ప్రవేశిస్తారు. వారిద్దరు అచ్చమైన పల్లెటూరి వారు . రామబ్రహ్మం, వెంకటాద్రి కాళ్ళ అలికిడి విన్న ఈశ్వరరావు పత్రిక పుటలలోనుంచి తలెత్తకముందే వా రిద్దరు ఎడా పెడా కొట్టి తుపానువలె సంభాషణకు అందుకుంటారు.

రామబ్రహ్మం : దొరికాడయ్యా, మిడతం భొట్లు! దొరికిపోయాడు! వెంకటాద్రి : కొట్టా డయ్యా! డింకీ కొట్టాడు!! రామబ్రహ్మం : ఆఁ! బొమ్మిఖ దిగాల్సిందే! వెంకటాద్రి : ఆహా! బో ర్డిఖ తిప్పాల్సిందే!

ఈశ్వరరావు :  ఎవరు? ఏమిటి?
రామబ్రహ్మం :  ఇంకా ఎవరంటా వేమిటి? అయిపోయా డయ్యా, ఈ దెబ్బతో చిత్తయిపోయాడు.

వెంకటాద్రి  : ఇఖ పత్తా అయినా వుండదులే! రామబ్రహ్మం : మరి సోదిలోకైనా రాడులే! ఈశ్వరరావు : ఏమిటయ్యా మీ గొడవ? రామబ్రహ్మం : ఊరంతా గుప్పుమంటే నువ్వింకా వినలాఁ?

వెంకటాద్రి :  గుంపు చింపులుపడి ఊరంతా చెప్పుకుంటున్నా నువ్వు వినకపోవడమేమిటి?
రామబ్రహ్మం :  చోద్యమే నువ్వు వినలేదంటే! – 

వెంకటాద్రి© : - చోద్యమంటే చోద్యమా! ఈశ్వరరావు (విసుగ్గా) : చాల్లే! ఊరికే చంపక, ఎవరో, ఏమిటో సరిగా చెప్పరాదటయ్యా?

రామబ్రహ్మం :  మీవాడే నయ్యా! మీ జానకిరామయ్య!

వెంకటాద్రి : మీ ప్రాణ స్నేహితు డయ్యా! రామబ్రహ్మం : మీ పంచాయతీబోర్డు ప్రెసిడెంటు! వెంకటాద్రి : మీ షాహుకారు! రామబ్రహ్మం : మీ షోకుదారు! వెంకటాద్రి : మీ పెత్తందారు! రామబ్రహ్మం : మీ మేయరుగారు! ఈశ్వరరావు (మరింత విసుగుదలతో) : ఆఁ! అయితే? రామబ్రహ్మం : దెబ్బ తీశాంలే! వెంకటాద్రి : నషాళాని కంటింది. రామబ్రహ్మం : పిల్లి మంతరం వేసినట్టే. వెంకటాద్రి : మట్టి కరిచినట్టే. రామబ్రహ్మం : అయిపోయిందిలే బడాయ్! వెంకటాద్రి : తేలిపోయిందిగా సరుకు! రామబ్రహ్మం : నాపాటివాడు లే డన్నాడు. వెంకటాద్రి : రొమ్ము విరుచుకు తిరిగాడు. రామబ్రహ్మం : అసలు నేలమీద నడిస్తేనా? వెంకటాద్రి : చుక్కల్లోకి చూశాడు! రామబ్రహ్మం : గద్దెక్కి కూర్చున్న తర్వాత వాడికి ఈ రామబ్రహ్మం అసలొకడు కనబడితేనా? వెంకటాద్రి : పట్టం కట్టుకున్న తర్వాత ఈ వెంకటాద్రి వాడికంట దూరనే లేదు. ఈశ్వరరావు (కోపంగా) : అబ్బ! చాలించండి మీ వెధవ సోది! అసలు విషయ మేమిటో తేల్చకుండా, ఏమిటయ్యా, మీ వెర్రివేషాలు? రామబ్రహ్మం (తగ్గి, వెంకటాద్రితో) : మన ఈశ్వరరావుకు కోప మొచ్చిందిరా! ! వెంకటాద్రి : మన మే మన్నాం అంత కోపానికి? రామబ్రహ్మం : నువ్వు మాట చొరనిస్తేనా? వెంకటాద్రి : నేనా? నువ్వా? రామబ్రహ్మం : నువ్వే! వెంకటాద్రి : నువ్వే! రామబ్రహ్మం : నువ్వేనంటే! వెంకటాద్రి : అహఁ! నువ్వే. ఈశ్వరరావు(మందహాసం చేస్తూ): సరే! ఇప్పుడు మీ మధ్య లేనిపోని తగవులాట దేనికి కాని, ఏమి జరిగిం దేమిటి? రామబ్రహ్మం : అబ్బో! చాలా కథ వుందిలే! వెంకటాద్రి : అదొక పెద్ద రామాయణం! ఈశ్వరరావు : దానిలో మీ రిద్దరు వాలి, సుగ్రీవులుగాని, ఇంతకూ అసలు విషయం తేల్చారు కారు. రామబ్రహ్మం : సరే. వినవయ్యా! మొన్నపోయిన పున్నం రేపు కద్దనగా... వెంకటాద్రి : కాదు! పున్నంనాడే. రామబ్రహ్మం : నీకు తెలవదులేరా! నువ్వూరుకో! వెంకటాద్రి : మహలావ్! నీకేనా తెలిసింది? ఈశ్వరరావు : సరే! ఒకరోజు ఇటో, అటో దానికేమి లెండి. రామబ్రహ్మం : కాలవగట్టుమీది చెట్లు... వెంకటాద్రి : గాలీవానకు పడిపోయినవాటిని... రామబ్రహ్మం : డి.పి. డబ్లీ వాళ్లు వేలం వెయ్యమంటే, పాట పెట్టకుండానే జాయి చూడా పేర కొట్టేసినట్టు బినామీగా రాసిపారేసి, రివెన్యూ ఇనస్పెక్టరు కొకటి... వెంకటాద్రి : ఓర్సీరు కొకటి... రామబ్రహ్మం : పోలీసు యినస్పెక్టరు కొకటి... వెంకటాద్రి : లాకు సూపర్నెంటు కొకటి... రామబ్రహ్మం : నువ్వాగరా! నన్ను చెప్పనీ! వెంకటాద్రి : ఏఁ! నే నెందుకు చెప్పగూడదు? ఈశ్వరరావు : ఎవరు చెబితే నేమిటిలేఁ! వెంకటాద్రీ! ఊరుకోవయ్యా నువ్వాక క్షణం. . రామబ్రహ్మం : పంచాయితీ బోర్డు వైసు ప్రెసిడెంటు కొకటి, గుమాస్తా కొకటి, బిల్లు కలెక్టరు కొకటి - వీళ్ళందరి నోళ్ళు కట్టెయ్యడానికి తలొకరికి తలొకటి పంచిపెట్టి, తనైతే ఒక నాలుగు పెద్ద చెట్లు... . వెంకటాద్రి : నాలుగు ఖర్మ మేమిటి? అయిదో, ఆరో రామబ్రహ్మం : ఆఁ! నీ మొఖంకాదూ? నాలుగే! వెంకటాద్రి : నా కళ్ళతో నేను చూస్తే! ఆరింటికి తక్కువ లేవు. అన్నీ పెద్ద పెద్ద మానులు! కొండలా వాముల దొడ్డిలో పేర్చి పెట్టుకున్నాడు. ఒక లక్ష యిటికాము అలాగ్గా కాల్తుంది. రామబ్రహ్మం : సరిగాని, వేలాని కొచ్చినవి మొత్త మెన్ని చెట్లంటావ్? వెంకటాద్రి : ఏమో, ఆ తబ్సీలు నాకు తెలవదు. రామబ్రహ్మం : అయితే, మరి నోరుమూసు కూరుకో! వెంకటాద్రి : ఏం పందెం కడతావ్? జానకిరామయ్య తోలించుకున్నవి ఆరేడు చెట్లని నేను... రామబ్రహ్మం : నేను కాదంటూ వుంటే... వెంకటాద్రి : నే నౌనంటూ వుంటే.... రామబ్రహ్మం : కాదు! కాదు! ముమ్మాటికీ, కాదు. వెంకటాద్రి : ఔను! ఔను! ముమ్మాటికీ, ఔను! రామబ్రహ్మం : నువ్వేమన్నా, అవి నాలుగే! వెంకటాద్రి : నువ్వు కాదన్నా, అవి ఆరు! ఈశ్వరరావు : ఎన్నో వొకన్ని పోనిద్దురూ! ఆఁ! అయితే ఏమి జరిగింది? రామబ్రహ్మం : జరగాల్సిందే జరిగింది. వెంకటాద్రి : చురక అంటించాగా! రామబ్రహ్మం : తిక్క కుదిరింది! వెంకటాద్రి : నెత్తి అణిచేశాలే! రామబ్రహ్మం : నవనాళ్ళూ కుంగినవి. వెంకట్రావు : కాలికింద పెట్టి రాచేశా! రామబ్రహ్మం : ఏరోయ్! అంతా నువ్వే చేసినట్టుగా మాట్లాడుతున్నావ్! వెంకటాద్రి : నేనుగాక నువ్వా? అటునుంచి నరుక్కొచ్చిందెవరోయ్? పంచాయితీ ఆఫీసరు దగ్గిరికి నిన్న పిటిషను పట్టుకెళ్ళి యిచ్చింది నేను కాదూ? రామబ్రహ్మం : పిటిష నివ్వడానికేఁ? పోస్టు బంట్రోతుకూడా యిస్తాడు. అది రాసిం దెవరోయ్? ముందు ఆ మాట చెప్పు! వెంకటాద్రి : మహలావ్! నువ్వే రాశావులే, సుబ్బన్న రాయింపిస్తే! రామబ్రహ్మం : కావాలంటే నేనే రాయలేనేమిటి? ఇలాంటివి లక్షా తొంభై రాశాను. వెంకటాద్రి : ఇంత పెద్ద రాతగాడివేనా మొన్న సుబ్బన్న వూళ్ళో లేకపోయేసరికి ఏకుసాలు కౌలుకబోలియతులు రాయలేక గుడ్డెళ్ళబెట్టావ్. రామబ్రహ్మం : నువ్వంటే నా కిందుకే వొళ్ళుమంట! నా రాతకోత లంటేనే కళ్ళల్లో కారం పోసుకుంటావ్! వెంకటాద్రి : రాతసంగతి నీ కేం తెలుసు లేరా? రాత బలిగోరుతుంది! రామబ్రహ్మం : పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేనివాడివి, నువ్వు కూడా నన్ను... వెంకటాద్రి : బయల్దేరా డయ్యా, ఈయనే కొమ్ములు తిరిగిన పండితుడు! ఈశ్వరరావు : మీ రిద్దరూ మహామేధావులే. వెంకటాద్రి : అంటే? ఈశ్వరరావు (నవ్వుతూ) : పండిత పుత్రులన్నమాట. రామబ్రహ్మం : వీడి మొఖం! వీ డేం పండితపుత్రుడు? ఆ పేరు నాకే తగు. మా నాన్న ఆఁజనేయ దండకం రాశాడు. ఈశ్వరరావు (మరింతగా నవ్వుతూ) : చెప్పావ్ కాదూ? ఆఁజనేయ వరప్రసాదంవల్ల జన్మించిన సుపుత్రుడ వన్న మాట! (నవ్వు ఆపుకుని) సర్లే - మీరు పిటిషన్ పెడితే ఏమైంది? వెంకటాద్రి : పంచాయితీ ఆఫీసరు తనిఖీకొస్తా నన్నాడు. రామబ్రహ్మం : ఇవ్వాళే వొస్తాడు. వెంకటాద్రి : ఈపాటికి బయల్దేరాడేమో! ఈశ్వరరావు : సరే! వస్తాడయ్యా! వస్తే జానకిరామయ్య కొచ్చిన భయ మేమిటి? బోర్డులో మెజారిటీ వాడిదే నయ్యె! ఊళ్లో ఉద్యోగస్థులందరు వాడి పక్షమే నయ్యె! రామబ్రహ్మం : నీకు తెలియదులే వయ్యా! దానిలో ఒక కిటుకుంది. వెంకటాద్రి : కీలెరిగే పెట్టాంలే వాత! రామబ్రహ్మం : ఆయువుపట్టునే కొట్టాంలే దెబ్బ. రామబ్రహ్మం : వలవల యేడుస్తాడు. వెంకటాద్రి : ఈ దెబ్బతో కుర్చీ దిగాలి. రామబ్రహ్మం : అసలు గోదావరిస్తానమే చేస్తాడేమో! ఈశ్వరరావు : ఇంతకూ ఆ కిటు కేమిటి? వెంకటాద్రి : ఇఖ గిలగిల తన్నుకుంటాడు. వెంకటాద్రి : దానిలో చాలా తిరుగు డుందిలే! ఈశ్వరరావు : ఏమి టది? కాస్త విడమర్చి చెప్పరాదూ? వెంకటాద్రి : చెట్లను పబ్లీకుగా పాట పెట్టందే పెట్టానని దొంగరాతలు రాశాడు గాదటయ్యా! రామబ్రహ్మం : నీ మొఖం! అది కాదు పాయింటు. చెట్లని సేలు చేశాక, దాన్ని అప్రూవు చెయ్యడానికి బోర్డు మీటింగు పెట్టాలి. ఈలోగా సొత్తును దాని స్తానంనుంచి కదిలించగూడదు. కదిలిస్తే కే సౌతుంది. ఈశ్వరరావు : అయితే, ఇంకా మీటింగు జరగలే దేమిటి? రామబ్రహ్మం : ఉహుఁ! మీటింగు రేపటికి వేశాడు. వెంకటాద్రి : ఈలోగా పంచాయితీ ఆఫీసరు రానే వొస్తున్నాడు. ఈశ్వరరావు : ఓహో! అదా సంగతి! రామబ్రహ్మం : ఇప్పు డాయ నొచ్చి సొత్తు చూపించమంటే నీళ్ళు నమలాలి! వెంకటాద్రి : గుడ్లెళ్ల బెట్టాలి. రామబ్రహ్మం : అసలు శాల్తీలైనా వుంటేగా? దుంగలకింద అప్పుడే కోయించేసుకున్నాడు. ఈశ్వరరావు : అయితే, గట్టి చిక్కేనన్నమాట! రామబ్రహ్మం : చెమటలు పోస్తాయిలే! వెంకటాద్రి : చచ్చినంత ప నవుతుంది. వెంకటాద్రి : చిక్కంటే చిక్కా? యమచిక్కు. రామబ్రహ్మం : పీకమీద కత్తే! వెంకటాద్రి : మెడకి ఉచ్చే! : రామబ్రహ్మం : వదిలిపోతాయిలే జలుబు నీళ్లు! వెంకటాద్రి : కరుగుతుందిలే కండకావరం! రామబ్రహ్మం : దిగుతుందిలే కళ్ల పొగరు! వెంకటాద్రి : ఎంత పొగరు లేకపోతే పెంటపోగు పిసరంత వీధిలో కొచ్చిందని నాపైన న్యూసెన్స్ కేసు పెడతానంటాడు! సంసారి అన్నాక పెంటపోగు కాస్త ఇటూ అటూ రాకండానే వుంటుందా? రామబ్రహ్మం : నాకుమట్టుకు నోటీ సెట్టలేదూ? మురుగు మూడు రోజుల్లో తీసెయ్యకపోతే ప్రాసిక్యూషను చేయిస్తా!! ఆసామి అన్నాక కాస్త వెనకా, ముందూ వుండదూ? ఆ రెండు మోపుల చెత్తకే చెరువునీళ్ళన్నీ చెడిపోతాయీ? వెంకటాద్రి : నా వామిదొడ్డిలో కలిసే పోరంబోకు రెండు సెంట్లు కలపరా అని కాళ్లకు బలపాలు కట్టుకుని ఎన్నాళ్ళు తిరిగినా ససేమిరా అన్నాడు, రామబ్రహ్మం : చెరువులపాటలో దండగ పడ్డానని ఎంత మొత్తుకున్నా, అయినవాళ్లండునని చెప్పించినా, చిల్లిగవ్వకూడా తోసెయ్య నన్నాడు. ఈశ్వరరావు : అయితే, ఊరుసొమ్ము తిననివ్వలేదనేనా, ప్రెసిడెంటుపైన మీ కింత కక్ష? వెంకటాద్రి : ఏఁ! వాడు తినడంలా? రామబ్రహ్మం : వాడు బాగానే నొల్లుతున్నాడు. వెంకటాద్రి : ఇంతకీ వాడికి కాళ్ళు తెచ్చింది మనమే! రామబ్రహ్మం : పోనీలే, అయినవాడని నేను మా కుదుటివాళ్ళ వోట్లన్నీ వేయించకపోతే, ఈ ముండమోపి అసలు మెంబరైనా అయ్యేవాడేనా? వెంకటాద్రి : ఊరు కాల్వగట్లని వాడి గొడ్లు ఊరికే మెయ్యడంలాఁ? రామబ్రహ్మం : తూర్పు వీధిలో సగాన్ని వాడు తన వియ్యంకుడికి కలపలాయా? వెంకటాద్రి : చాల్లే! ఇలాంటి మాటలు నాదగ్గిర చెప్పకు, చెయ్యి తడి అయిందేమో, వోట్లు వేయించావేమో! రామబ్రహ్మం : చీ చీ! వాడి పాపిష్ఠిసొమ్ము తిన్నవా డెవడు? ఏమైనా కతికితే, నువ్వే కతికుండాలి. ఈశ్వరరావు : మిమ్మల్ని చూస్తే ఒకందుకు మాత్రం నాకు చాలా ముచ్చ చేస్తున్నది. మీకు ఒకరి పొడ ఒకరి కెంతమాత్రం గిట్టకపోయినా, జానకిరామయ్యమీద కలిసే కత్తి కడుతున్నారు. రామబ్రహ్మం : పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ కొరికినట్టు, మరి వాడు చేసే పనులేమి టయ్యా? వెంకటాద్రి : ఇప్పుడే గనుక వాణ్ణి నొక్కకపోతే, మరి పట్ట పగ్గాలుంటాయా? రామబ్రహ్మం : వాడి అంతు ఇప్పుడే కనుక్కోవాలి. వెంకటాద్రి : వాణ్ణి ఇప్పుడే పుటమెయ్యాలి. రామబ్రహ్మం : వాడి పెళ్ళి యిప్పుడే చెయ్యాలి. వెంకటాద్రి : వాడి భరత మిప్పుడే పట్టాలి. ఈశ్వరరావు : కోరితే లంకాదహనం చేయగల సమర్థులు. మీకు ఎదు రేమిటి కాని, సుబ్బన్న యింటివద్ద లేడూ? రామబ్రహ్మం : మేము అక్కడినుంచేగా వస్తున్నాం. వెంకటాద్రి : లేకేం! వున్నా డయ్యా! వెంకటాద్రి : నీ కబు రందింది. ... రామబ్రహ్మం : మీ పాలే రొచ్చి... వెంకటాద్రి : సుబ్బన్నతో... రామబ్రహ్మం : మాదొర ఒకమాటు వెంకటాద్రి : రమ్మంటున్నాడని... రామబ్రహ్మం : నీకిదే తెగులు! పెద్దమనిషితో మాట్లాడుతూ వుంటే మాటమాటకూ అడ్డొస్తావ్!

వెంకటాద్రి :  అసలు నీ వెంట రావడం నాదే బుద్ధితక్కువ! (చెంపలు వేసుకుంటూ) ని న్ననే 

పనేమిటి? తప్పు నాదేలే! రామబ్రహ్మం (తనుకూడా లెంపలు వేసుకుంటూ) : కాదు, కాదు! తప్పు నాదే! వెంకటాద్రి : మ్! నాదే! రామబ్రహ్మం : ఉహుఁ! నాదే! (ఈశ్వరరావు నవ్వుతాడు. రామబ్రహ్మం : చూశావా? ఆ పెద్దమనిషి నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో! వెంకటాద్రి : నన్ను చూసి కాదు; నిన్ను చూసే! వెంకటాద్రి : నువ్వు నిజం చెప్పవయ్యా? ఎవర్ని చూసి? (ఈశ్వరరావు ఇంకా బిగ్గరగా నవ్వుతాడు. రామబ్రహ్మం : ఈ పెద్దమ్మను చూసి కాదూ? వెంకటాద్రి : ఈ దద్దమ్మను చూసి కాదూ? (ఈశ్వరరావు కడుపు చెక్కలయ్యేటట్లు విరగబడుతుండగా సుబ్బన్న ప్రవేశిస్తాడు. అతడు ఈశ్వరరావుకంటె రెండు, మూడేళ్లు పెద్ద. ఊళ్లో ఒక పార్టీ నాయకుడు, ఆరితేరిన వ్యవహర్త. ఈశ్వరరావు : రారా! సుబ్బన్నా! రా! పరమానందయ్య శిష్యుల్ని చేర్చి వ్యవహారం చాలా ముదరబెట్టావేం! సుబ్బన్న : మీ రిక్కడ పోగైనారూ? వార్డి సోదిరాముళ్ళు! మీతో పనులైనట్టే! రామబ్రహ్మం! ప్రెసిడెంటు తన పార్టీ మెంబర్లందర్నీ యింటికి పిలిపించుకున్నాడు. ఏమి గూడుపుఠాణీ చేస్తున్నారో కాస్త ఆరా తీసి రా! రామబ్రహ్మం : ఆఁ! చెయ్యడాని కేముంది? తలపట్లు పట్టుకుంటున్నారు! (వెడతాడు. సుబ్బన్న : వెంకటాద్రీ! నువ్వెళ్ళి మన ప్రసాదరావుని ఒకసారి పిలుచుకురా! నే నిక్కడే వుంటా – చప్పున వెళ్ళిరా! వెంకటాద్రి : పొద్దు నొకసారి వెళ్ళితే, పొల మెళ్ళాడన్నారు. తిరి గొచ్చాడో, లేదో! (వెడతాడు. సుబ్బన్న (వెంకటాద్రి అవతలికి వెళ్ళిన తర్వాత, ఈశ్వరరావుతో): విన్నావా, ఊళ్ళో విశేషాలన్నీ? ఈశ్వరరావు : విన్నాలే! కాని, మీ పగలు మీరు సాధించుకుంటూ రాజీ చెయ్యడానికి నన్ను రమ్మనడం దేనికిరా? సుబ్బన్న : ఆఁ! నీకేం తెలుసు లేరా రాజీ మాట లొచ్చాక వాడెంతగా నోరు పారేసుకున్నాడో! ఈశ్వరరావు : వాడికి కొంచెం నోటి దురుసుతన మున్నమాట నిజమే. కాని, ఇప్పుడు మీరు వాణ్ణి ప్రాసిక్యూషన్ చేయిస్తే కక్షలు మరింత పెరిగిపోయి, ఊరు ధ్వంసధూళి కాదూ? సుబ్బన్న: చూస్తూవుంటే మేస్తూ పోయిందని, మేము ఊరుకున్న కొద్దీ వాడు మరీ తెగబడు తున్నాడయ్యె! దీని కేం చెబుతావ్? ఈశ్వరరావు : జానకిరామయ్య నీ కిప్పుడు దుష్టుడయ్యాడు గాని, నిన్న మొన్నటివరకు మీరిద్దరు ప్రాణ స్నేహితులేగా? వీరభద్రయ్యను కలిసే పడగొట్టారయ్యె! సుబ్బన్న : ఆఁ! జానకిరాము డిప్పుడు వెనకటి మనిషి కాడులేఁ? ఈశ్వరరావు : నిన్నుగురించీ వాడు బహుశా ఇదే మా టంటాడు. పదవుల కోసం పాకులాటే తప్ప ఊరు కుపకారం లేదని ఒకప్పుడు మనం పెద్దవాళ్ళని విమర్శించేవాళ్ళం - నీకు జ్ఞాపకం లేదట్రా? ఉద్యోగమై నేను పట్నవాసానికి వెళ్ళిపోడానికి ముందు గ్రామసేవా సంఘమంటూ మన మందరమూ చేరి స్థాపించాం కూడాగా? దానికి ప్రెసిడెంటువు నువ్వైతే, జానకిరామయ్య సెక్రటరీ. ముసలీ, ముతకా పెత్తందార్లు స్వలాభం కోసం స్పర్ధలు పెంచుతున్నారనీ, స్వప్రయోజనాలకు సమష్టి క్షేమాన్ని బలిపెడుతున్నారనీ ఆనాటి మన ఉపన్యాసాలు, మన తీర్మానాలు - అన్నీ మరిచిపోయావా? సుబ్బన్న : ఆ రోజులలో ఏమేమో చాలా చాలా అనుకున్నాంలే! కాని, సాగొద్దూ? ఈశ్వరరావు : ఎందుకు సాగవు? ఈ కక్షల సాధింపు పట్టుదలలో పదోవంతైనా వుండాలే కాని! ఇప్పటికి మీ పార్టీ కెంత ఖర్చైంది? సుబ్బన్న : చాలాదాకా అయిందిలే. ఈశ్వరరావు : ఆ మొత్తమెంతో చెప్పరాదూ? సుబ్బన్న : ఆఁ! తాడో పేడో తేలేసరికి రెండు, మూడు సంచులైనా కావూ? ఈశ్వరరావు : మీకు రెండు, మూడు వేలైతే, జానకిరామయ్య పార్టీవాళ్ళకు కనీసం మరంతైనా కాక తప్పదుగా? సుబ్బన్న : ఆఁ! వాళ్ళు యింట్లో సొమ్ము తెచ్చిపెడుతున్నా రేమిటి? పవరు చేతిలో వుందిగా! చెరువుల పాటల్లోను, కాలవగట్ల పాటల్లోను మిగిల్చి, పార్టీ ఫండు కూడబెడుతున్నారు. ఈశ్వరరావు : ఏమైనా ఊరు సొమ్ము దండగ కావడమే గదరా? ఈ మొత్తం ఆ జిల్లా బోర్డు వాళ్లకిస్తే గరల్స్ స్కూలుకి ఒక బిల్డింగ్ పడేది కాదూ? స్థలం వుండనే వున్నదయ్యె, దాన్ని భరంతు కూడా చేశారయ్యె. జిల్లేళ్ళూ పల్లేళ్ళూ మొలిచి, అది పాడుపడి పోవలసిందేనా? సుబ్బన్న : నీ దంతా పిచ్చి కాని, స్కూలుకోసమంటే డబ్బిచ్చే వా డెవడురా? ఈశ్వరరావు : ఎందుకివ్వరు? - మనం అందరినీ సరిగా కూడగట్టుకు రావాలే గాని! పంచవర్ష ప్రణాళికల కింద గ్రామాలకు ప్రభుత్వ మిప్పుడు విరివిగా సహాయం చేస్తున్నదిగాఁ! కలిసి పనిచేసుకుంటే ఒక గరల్స్ స్కూలే అన్న మాటేమిటి? ఆసుపత్రి తెచ్చుకోవచ్చు; ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవచ్చు; ఏమైనా తెచ్చుకోవచ్చు. సుబ్బన్న : బస్తీలో కూర్చున్నావ్! పల్లెటూరు వ్యవహారాల సంగతి నీ కేం తెలుసులేరా? ఇక్కడుండి అన్నీ పడుతుండే మాకే ఆకళింపుకావు, వాటి లోతుపాతులు! నువ్వు పుస్తకాల్లో చదువుకున్నట్టు జరగమంటే జరుగుతుందా? ఈశ్వరరావు : ఇంతకూ నా కేమీ తెలియదంటావ్? అయితే, నన్ను రాజీచెయ్యడానికి రమ్మనడం దేనికి? సుబ్బన్న : ఇం కేం రాజీరా? వ్యవహారం నా చెయ్యి కూడా దాటిపోయింది. నేను ఆపాలన్నా, ఇఖ ప్రాసిక్యూషను ఆపలేను. వాడి కళ్ళు ఎంత కప్పుకు పోకపోతే... (రోజుకుంటూ రామబ్రహ్మం ప్రవేశిస్తాడు. రామబ్రహ్మం ( డొక్కలు యెగరవేస్తూ) : పోయాడు! సుబ్బన్న (ముఖమే ప్రశ్నార్థకం కాగా) రామబ్రహ్మం (ఇంకా సాలిపడుతూనే) : పోయాడు! ఇంకేముంది? పోయాడు! సుబ్బన్న : ఎవడు పోయాడు? ఎక్కడికి పోయాడు? ఏమొచ్చి పోయాడు? రామబ్రహ్మం (ఇంకా గుక్కతిప్పుకో లేక) : వాడే? ప్రశ్నార్థకం కాగా) : ఆఁ? సుబ్బన్న : ఎవడు? రామబ్రహ్మం (కాస్త తెప్పరిల్లి) : వాడే! జానకిరామయ్య! సుబ్బన్న : తప్పించుకు ఎక్కడికి పోయాడంటావ్? రామబ్రహ్మం : బోర్డు మీటింగు మొన్నే జరిగినట్టు రాసి పారేశాడు! సుబ్బన్న (ఆశ్చర్యంగా) : ఆఁ! (ఈశ్వరరావు చిరునవ్వు నవ్వుతాడు. రామబ్రహ్మం : మెంబర్ల సంతకాలు కూడా చేయించేసుకున్నాడు! సుబ్బన్న : ఓహో! (అతని ముఖంలో తీవ్రాలోచన కనబడుతుంది. రామబ్రహ్మం : తెచ్చి వాములదొడ్డిలో పెట్టుకున్న మానులన్నీ పాలేళ్ళతో పగలేయించి, బళ్ళమీద వాళ్ళకీ, వీళ్ళకీ తోలించేశాడు. మరి కాసేపటికి అక్కడ చితుకు పుల్లయినా మిగలదు. సుబ్బన్న : ఉహుఁ! అలాగేఁ? ఈశ్వరరావు : మీటింగు అయిపోయిందా? ఇంకా జరుగుతున్నదా? రామబ్రహ్మం : ఇంకా జరగడమేమిటయ్యా? మొన్నే జరిగినట్టు రాయడమూ అయింది; ఎవడి దారిని వాడు లేచి పోవడమూ అయింది. ఈశ్వరరావు : అయితే, దొడ్లో వేయించుకున్న మానులు కూడా అక్క డిప్పుడు లేవన్న మాట. రామబ్రహ్మం : వాటినీ దాటేయించేశాడు. మొన్న మొన్నటిదాకా మొద్దు రాచ్చిప్పలా వుండేవాడు. చూస్తూ చూస్తూ వుండగానే జానకిరాము డెంత తెలివి మీరాడు! ఎత్తు, పైయెత్తులకు మా సుబ్బన్నే అనుకుంటే, సుబ్బన్న తలదన్ను తున్నాడు. ఈశ్వరరావు : ఏరా! సుబ్బన్నా! మరిప్పుడేం చేస్తావ్? సుబ్బన్న : (విజయసూచకమైన చిరునవ్వుతో తల పంకిస్తూ) నే నేమీ చేయనఖ్ఖరలేదు. తన చేత్తోనే తన మెడకి ఉచ్చు మరింత బిగించుకున్నాడు! ఈశ్వరరావు : అదేమిటిరా? సుబ్బన్న : ఏమిటో చెబుతాలే! (రామబ్రహ్మంతో) ఆ వెంకటాద్రి అదే పోకడ పోయాడేమిటి? కాస్త వెళ్ళి ప్రసాదరావుని ఇక్కడున్నట్టు పిలుచుకురా! మర్చిపోక, మీటింగు యెజెండా తెమ్మన్నానని ప్రసాదరావుతో చెప్పు! చూస్తావేఁ! త్వరగా ఈ పని చేసుకురా! రామబ్రహ్మం : ఇంకేం చెప్పడం? ఇంకేం చూడ్డం? పోయాడు; చిక్కినట్టే చిక్కి గుప్పిటిలోనుంచి చిటుక్కున తప్పించుకు పోయాడు! సుబ్బన్న : ఆఁ! ఎక్కడికి పోతాడు? ఏట్లోకి! నీళ్లు నములుతూ నిలుచోకుండా నువ్వెళ్ళి చెప్పినపని చేసుకురా! నేను నడిపిస్తాగా వ్యవహారం! - నీకెందుకు? ( రామబ్రహ్మం వెడతాడు. ఈశ్వరరావు : సుబ్బన్నా! ఏమి కొత్త యెత్తు యెత్తుతున్నావురా? సుబ్బన్న : మీటింగు రేపని యెజండా పంపించలేదట్రా? దాన్నిబట్టే కాలవగట్టు చెట్లపాట బోర్డు మీటింగులో ఇంకా అప్రూవు కాలేదని మాకు తెలిసింది. మాపార్టీ మెంబర్లు నలుగురిలో ముగ్గురు వూళ్ళో లేకపోయినా, ప్రసాదరావుకు యెజెండా అందింది. ఇప్పుడిక ఆ యెజెండాయే మన జానకిరాముణ్ణి జెయిలుకు పంపించడానికి! ఈశ్వరరావు : గట్టి చిక్కే తెచ్చుకున్నాడేం! సుబ్బన్న : గట్టి చిక్కేనని నెమ్మదిగా అంటున్నా వేమిటి? ఇది కొరివి పెట్టి తల గోక్కోవడమే!

		(రామబ్రహ్మం, వెంకటాద్రి, ప్రసాదరావు ప్రవేశిస్తారు. ప్రసాదరావు 

దాదాపు నలభై యేళ్ళవాడు. చిరుబొజ్జతో నిండైన విగ్రహం. కాని, ఆలోచన తక్కువ. రామబ్రహ్మం : ఇరుగో! సుబ్బన్నా! నాకు వాకిట్లోనే ఎదురయ్యారు. ప్రసాదరావు : వ్యవహారం బెడిసిపోయినట్టేనా? రామబ్రహ్మం : ఏఁ సుబ్బన్నా! ఇప్పు డెలా చక్కదోస్తావ్? వెంకటాద్రి : ఏదో ఒక దారి నువ్వే చూడాలి, సుబ్బన్నా! సుబ్బన్న (ప్రసాదరావుతో) : ఏదీ ఆ యెజెండా? ప్రసాదరావు : ఎజెండా యేమిటి? సుబ్బన్న : కొంపతీసి పారేశావేమిటి? ప్రసాదరావు : అబ్బే! కాగితం గిరాకీ అయ్యాక తలొక మీటింగు నోటీసు, యెజెండా పంపించడం లేదుగా? అంతా ఒకే కాగితంమీద రాసి, దానిమీదే అందరు మెంబర్ల సంతకాలు పెట్టించుకు పోతున్నారు. సుబ్బన్న (తెల్లబోయి) : ఈ సంగతి నేను కానలేదే! (ఈశ్వరరావు మందహాసం చేస్తాడు. ప్రసాదరావు : పాత యెజెండా చించి పారేసి, కొత్తది సృష్టించాడంటావా? సుబ్బన్న : ఔను! కొత్తది సృష్టించి వుండాలి; దానిమీద పాత తారీ కేసి తన పార్టీ మెంబర్ల సంతకాలు చేయించుకునీ వుండాలి. ప్రసాదరావు : మరి నా సంతకం వుండదుగా? సుబ్బన్న : హాజరులేవని రిమార్కు రాసేస్తాడు. ఈశ్వరరావు : సుబ్బన్నా! మరి నీ ఆట కట్టినట్టేనా? (సుబ్బన్న జవాబు చెప్పడు. తిరిగి ఆలోచనలో పడ్డట్టు కనబడతాడు. రామబ్రహ్మం : వలలో పడ్డట్టే పడి, చేప జర్రున జారిపోయింది. వెంకటాద్రి : చేతిలో చిక్కినట్టే చిక్కి పిట్ట తుర్రున పారిపోయింది! రామబ్రహ్మం : ఇఖ చూడు వాడి ప్రతాపం! వెంకటాద్రి : మరి వాడు ఆడిందే ఆట. రామబ్రహ్మం : పాడిందే పాట. వెంకటాద్రి : రేపటి నుంచి మరీ మండిస్తాడు! వెంకటాద్రి : వాడు నక్కను చంపి పుట్టాడు. రామబ్రహ్మం : ఆవలిస్తే పేగులు లెఖెడతాడు. వెంకటాద్రి : ఏట్లో పారేసినా ఎదు రీదుకొస్తాడు. రామబ్రహ్మం : కాటిమీద పెట్టినా లేచొస్తాడు. వెంకటాద్రి : వాడు అఖండుడని నేను ఆదికాలంనాడే చెప్పలా? రామబ్రహ్మం : వాడు మా కుదుటివాడు. వాడి జిత్తులు నాకంటె నీకే యెక్కువ తెలుసా? వెంకటాద్రి : కాడిగట్టు వాళ్ళం. వాడితో నే నెన్ని పేచీలు పడివున్నానో నీకేం తెలుసు! రామబ్రహ్మం : అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గిర... సుబ్బన్న : అబ్బబ్బ! మీరు కాసేపు ఊరుకోండి! ఆఁ! ప్రసాదరావ్! ఈ పూట మీటింగు జరిగింది ప్రెసిడెంటు యింట్లోనేగా? ప్రసాదరావు : ఔను! సుబ్బన్న : అయితే, మినిట్సుబుక్కు యింటికి పట్టించుకు వెళ్ళాడన్నమాట! దాన్ని ఆఫీసులోనుంచి కదిలించగూడదు. ప్రసాదరావు : ఔనౌను! రామబ్రహ్మం : అమ్మ! వాడి యెత్తులు మరెవరి కొస్తాయి! సుబ్బన్న : సరే! పంచాయితీ ఆఫీసరు వచ్చేలోపల దాన్ని మళ్ళీ ఆఫీసులోకి చేర్చనివ్వకుండా చేస్తే సరి! అప్పుడు బయటపడుతుంది వాడి బడాయ్! ప్రసాదరావు : ఆ పని చేస్తేనా, పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టే. సుబ్బన్న : రామబ్రహ్మం! వెంకటాద్రీ! చూస్తారేఁ? మన వాళ్లందరినీ పోగుజేసుకు రండి! బోర్డు ఆఫీసు చాయలకైనా ఆ పార్టీ మనిషిని అడుగు పెట్టనివ్వరాదు అదేమైనా సరే! రామబ్రహ్మం : అడుగుపెడితే, బడితపూజే! వెంకటాద్రి : బుర్ర రామకీర్తన పాడిందన్న మాటే! రామబ్రహ్మం : అటువైపుకు తొంగైనా చూస్తే, రక్తం కళ్ల జూడం! వెంకటాద్రి : అక్కడే పాతి పెట్టం! వెంకటాద్రి : ఇంటిదగ్గిర చెప్పుకు రావాలి. రామబ్రహ్మం : అక్కడే గోరీ కట్టం! వెంకటాద్రి : ఎవడికి కలేజా వుంది అటు రావడానికి! రామబ్రహ్మం : ఎన్ని గుండె లుండాలి అక్కడడుగెట్టాలంటే! రామబ్రహ్మం : మంటిలో కలవడానికి రావాలి. వెంకటాద్రి : ఉరుకుతాం బరిలోకి! రామబ్రహ్మం : తీస్తాం దెబ్బ. వెంకటాద్రి : వేస్తాం వీరంగం. రామబ్రహ్మం : చూపిస్తాం మా తడాఖా! వెంకటాద్రి : ఇవ్వాళ పుచ్చె లెగరాల్సిందే. రామబ్రహ్మం : పీనుగులు నడవాల్సిందే. సుబ్బన్న : మాటలు కాదు; చేతలు కావా లిప్పుడు, పదండి త్వరగా! ప్రసాదరావ్! నువ్వూ పద! – నేనూ మీ వెనకాలే వస్తున్నా. (రామబ్రహ్మం, వెంకటాద్రి, ప్రసాదరావు వెడతారు. సుబ్బన్న : వాళ్ళు గడప దాటి వెళ్ళేవరకు ఆగి, ఈశ్వరరావుతో) : ఆట ఇంకా కట్టలేదు! ఈశ్వరరావు : ఎందుకు కడుతుంది? కొట్లాటకు దిగబోతున్నావుగా? ఎందుకైనా మంచిది. లాఠీలు, బరిసెలు, గండ్రగొడ్డళ్ళు జాగ్రత్త పెట్టించు. సుబ్బన్న : వాడు చేస్తున్న పనులు నీకు బాగున్నాయేం? ఈశ్వరరావు : ఎవరు చేస్తున్న పనులూ బాగుండలేదు. ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ కక్షలు, ఈ కలహాలు... (“ఈశ్వరరావుగారూ!" అని సింహద్వారంలోనుంచి కేక. ఈశ్వరరావు : ఎవరది? సుబ్బన్న : ఆఁ! బిల్లు కలెక్టరులే! ఈశ్వరరావు : ఏమోయ్! దేనికి? బిల్లు కలెక్టరు (బయటనుంచే) : మీ రున్నారేమో మా ప్రెసిడెంటుగారు సూడమన్నారండీ! ఈశ్వరరావు : ఏడీ ఆయన? బిల్లు కలెక్టరు (బయటినుంచే) : మీ దగ్గరికే వొస్తున్నారు. ఈశ్వరరావు : సరే! రమ్మను. సుబ్బన్న : మరి నేను పోతున్నారా? ఈశ్వరరావు : ఏఁ? సుబ్బన్న : వాణ్ణి రమ్మన్నావుగా! ఈశ్వరరావు : వాడొస్తే నువ్వు వెళ్ళాలా? మీ వుభయులకు నేను కావలసినవాడినేగాఁ? సుబ్బన్న : ఆఁ! నేనుంటే వాడు రాడులే! నువ్వు వొంటరిగా వున్నావేమో చూచి రమ్మనే బిల్లు కలెక్టర్ని పంపించాడు. ఈశ్వరరావు : మరి నే నేమి చెప్పీ లాభం లేదన్నమాట! సుబ్బన్న : నీకు తెలియవులేరా పల్లెటూరి వ్యవహారాలు! (సుబ్బన్న నిష్క్రమిస్తాడు. ఈశ్వరరావు తిరిగి పత్రిక తీసి, దేనిపైనా దృష్టి లగ్నం కానందున పేజీలు ఊరికేనే తిరగవేస్తూ వుంటాడు. ఇంతలో జానకిరామయ్య ప్రవేశిస్తాడు. అతడు ఈశ్వరరావు ఈడువాడే. వేషంలో కొంత దర్పం కానవస్తుంది. ఆ దర్పం ప్రవృత్తిలోకూడా లేక పోలేదు. జానకిరామయ్య : చూశావుగా సుబ్బన్న నడిపిస్తున్న తతంగం? ఈశ్వరరావు : ఒక్క అదేనన్న మాటేమిటి? సర్వం చూస్తున్నా, జానకిరామయ్య : కట్టెపుల్లలకు కరువుగా వుందని ఊళ్ళో ఉద్యోగస్టులు మొహమోట పెడితే, వాళ్ళకు సప్లయి చేసినందుకు నా పీకమీదికి తెచ్చాడు. ఈశ్వరరావు : ను వ్వేమీ తోలించుకో లేదా? జానకిరామయ్య : ఈ ముష్టి మూడుబళ్ళ పుల్లలులేకపోతే, నాకు గడవదట్రా? నేను ఊళ్లో లేనప్పుడు పంచాయితీ బోర్డు గుమాస్తా చేయించాడు ఈ పాడు పని. ఈశ్వరరావు : నీకు తెలియకుండా జరిగితే వాటి నెందుకు అట్టే పెట్టుకున్నావ్? జానకిరామయ్య : అది తప్పే! ఆ మాట నాకు తోచలేదు. ఈశ్వరరావు : మరి ఇవ్వాళ ఈ మీటింగు మా టేమిటి? జానకిరామయ్య : నా ప్రాణం మీదికి తెస్తే, మరి నన్ను చావమంటావా? ఏదో ఒక విధంగా తప్పుకోవద్దూ? ఈశ్వరరావు : సరేగాని నువ్వు రాజీ ప్రయత్నం చెయ్యమంటేనేగా నే నివ్వాళ పనికట్టు కొచ్చింది? నన్ను రమ్మని చెప్పినవాడివి ఊళ్లోకొచ్చి సుబ్బన్నను తిట్టడం తగునా? జానకిరామయ్య : ఆఁ! పుండాఖోర్! నేను తిట్టానని చెప్పాడూ? ఈశ్వరరావు : ఒక పక్కని పుండా బోర్ అంటూనే తిట్టలేదంటా వేమిరా? జానకిరామయ్య : ఆ వెధవ ఆడే అబద్ధాలు చూస్తే, ఎవడికి వొళ్లు మండుకురాదు? వాడొక దరిద్రుడు. ఈశ్వరరావు : ఊరికే ఇప్పుడు నోరు పారేసుకోవడం దేనికి కాని, “రెండేళ్ల నుంచి ప్రెసిడెంటుగా వున్నానుగదా! ఊరుకు ఏమి ఉపకారం చేశా?" నని ఎన్నడైనా ఆలోచించుకున్నావూ? జానకిరామయ్య : ఎవడైనా చేసే దేమున్నదిరా? పంచాయితీ బోర్డు ఆదాయం వడసారం ఆరు వేలు! దానిలో సగమైనా జీతాలకు, ఎస్టాబ్లిష్ మెంటుకు పోతుంది. మిగతాదాంతో ఏం పను లౌతాయి? పోనీ, ఏమైనా చేయిద్దామంటే, ఖర్చు నూరురూపాయలు మించితే చాలు, దానికి సవాలక్ష ఎస్టిమేట్సు, అప్రూవల్సు కావాలి. దీనిలో ఎక్కడ ఏ కాస్త పొరపాటు జరిగినా, సర్ ఛార్జీలు తప్పవు. ఇదే పంచాయతీబోర్డు ప్రెసిడెంటుగిరీ బండారం! ఈశ్వరరావు : అయితే, రాజీనామా పెట్టరాదూ! జానకిరామయ్య : పెడితేనే బాగుండును. కాని, పరువుకోసం పట్టుకు పాకులాడుతున్నా. ఇది కత్తిమీద సాములా వుంది. ఇవ్వాళ చూశావుగా ఎంత గట్టి దెబ్బ తట్టుకోవాల్సొచ్చిందో! ఈశ్వరరావు : చూడ కేమిరా? ఎత్తుకు పైయెత్తు ఇంద్రజాలపు యెత్తు లెత్తారు. సామ్రాజ్య చక్రాన్ని తిప్పే తెలివితేట లున్నాయి. కాని, ఏమి లాభం? ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకోడానికే తప్ప, ఊరి కుపయోగించడం లేదు. జానకిరామయ్య : ఒకడు పదవిలో వుంటే, వాణ్ణి ఎలా పడగొట్టాలని తప్పితే మనకు వేరే ఆలోచనే వుండదయ్యె. ఇక, మన మేం ముందు కొస్తామురా ఈశ్వరరావు : ఆ మాట నిజమే! వీరభద్రయ్యను రిమూవ్ చేయించేగా నువ్వు మొదటిసారి ప్రెసిడెంట్ అయింది! జానకిరామయ్య : అప్పుడు ఈ సుబ్బన్నే నా మెడలు విరిచాడు. కావాలని నే నేడ్చానా? తనే బలవంతాన నన్ను ఈ కుర్చీ యెక్కించాడు. ఎలాగైనా ఈ మహాపదవి నాకు న న్నిప్పుడు దించి, తానే దానిలో కూర్చోవాలని చూస్తున్నాడు. వీరభద్రయ్యను పడగొట్టడానికి వీడికి నా వత్తాసు కావల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను పడగొట్టడానికి ఆ వీరభద్రయ్యతో ఏకమయ్యాడు. నాకు తెలుసులే వీడి యెత్తులన్నీ. వీరభద్రయ్యకు పెద్ద ఖాతా నడుస్తున్నది; నా కేమో పెద్దలు సంపాయించి యిచ్చిపోయిన కొండ్ర వున్నది. కాస్త పచ్చగా వున్న మా యిద్దరి జుట్లూ ముడివేసి, మమ్ముల నిద్దరినీ గాడిదల్ని చేసి, తాను గద్దెక్కాలని చూస్తున్నాడు. వా డిప్పుడు పాత సుబ్బన్న కాడు. ఆస్తి పాస్తులు లేకపోయినా, ఊరూ నాడూ యేలా లంటున్నాడు. ఈశ్వరరావు : నామాట విని, ను వ్విప్పుడు కాస్త తగ్గరాదూ? ఉభయ పార్టీలకు అనుకూలమైనవాణ్ణి ప్రెసిడెంటుగా చేద్దాం. లేకపోతే, ఇప్పుడు రైటింగ్ వరకు పోతుందేమో! నువ్వు మిన్సిబుక్ ఆఫీసుకు చేర్పించబోతే, అంత పనీ తప్పదు. సుబ్బన్న తన వాళ్ళందర్నీ పోగుజేసుకు వెళ్ళాడు. పంచాయితీ ఆఫీసరు వచ్చేలోగా బోర్డు ఆఫీసు చాయలకు ఎవడైనా వస్తే, నలిపివేస్తా మంటున్నారు. ఇప్పుడు దొమ్మీ జరగవలసిందేనా? జానకిరామయ్య : ఆఁ! ఏడ్చారులే! ముందే ఆలోచించి అందుకు తగిన కట్టుదిట్టం చేశా. పోలీసు సబ్ యిన స్పెక్టర్ తను దగ్గరుండి దాన్ని లోపలికి చేర్పిస్తానన్నాడులే! ఆయన వద్ద వీళ్ళ పప్పు లుడకవ్. ఎవడైనా అడొస్తే బొక్కలో తోయిస్తాడు. ఈశ్వరరావు : కావచ్చులేరా! ఈనాడు నీదే పై చెయ్యి కావచ్చు; ఈ వ్యవహారంలో నువ్వే నెగ్గవచ్చు. కాని, ఇలా కక్షలు పెంచుకుంటే ఊరు ముందు కొస్తుందా? జానకిరామయ్య : ఆ! నీకు తెలియవులేరా, పల్లెటూరి వ్యవహారాలు! ఈశ్వరరావు : సుబ్బన్నకూడా సరిగా ఇదే మాట అనిపోయాడు సుమీ! మీ కిద్దరికీ అన్నీ భేదాభిప్రాయాలే అయినప్పటికీ, ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వున్నట్టుంది.

జానకిరామయ్య :  ఏ విషయంలో?

ఈశ్వరరావు : వొట్టి శుంఠకింద నన్ను లెఖ్క కట్టడంలో! తెర)


  భంగపాటు (లైట్ కామెడీ)

పాత్రలు: వెంకట్రామయ్య - పల్లెటూరి రైతు, రాజేశ్వరి - అతని కుమార్తె,సత్యనారాయణ అతని అల్లుడు, నాగేశ్వరరావు - అతని మేనల్లుడు, చింతాలు అతని పాలేరు, భీమన్న ఒంటెద్దుబండివాడు. కాలం: వర్తమానం స్థలం : వెంకట్రామయ్యగారి యింటి చావడి (వెంకట్రామయ్యగారి యింటి చావడి, ఎడమవైపున సింహద్వారం, కుడివైపున పెరటిలోకి ద్వారం. ఈ రెండు ద్వారాలకు ఒక్కొక్క పార్శ్వంలో ఒక్కొక్క కిటికీ. ఎదురుగా మరి రెండు ద్వారాలు; ఒకటి పడకగదిలోకి, రెండవది పడమటింటిలోకి, చావడిలో వీధిగోడ చెంతగా యెత్తిపెట్టివున్న రెండు నవారు మంచాలు. చావడి గోడలకు లక్ష్మి, సరస్వతీ, మోహిని, మేనక - విశ్వామిత్రుడు, శ్రీరామ పట్టాభిషేకం, గోపికా వస్త్రాపహరణం మొదలైన పటాలు (సన్ లైట్, వినోలియా వైట్ రోజ్ సబ్బుల అడ్వర్టైజ్ మెంట్స్ తో సహా) తెర లేచినప్పుడు చావడి ఖాళీగా వుంటుంది. వీధి తలుపును ఎవరో తట్టినచప్పుడు కాగా, “ఎవ రది?" అంటూ పడమటింటిలో నుంచి రాజేశ్వరి చావడిలోకి వస్తుంది. ఆమె ముద్దు పేరు చిట్టెమ్మ. వయస్సు పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాలు. చామనచాయ. కళకళలాడుతున్న కోలముఖం. కాంతివంతమైన చేరెడేసి కళ్లు. తిరిగి తలుపు తట్టిన చప్పుడు కాగా “వచ్చే” అంటూ ఆమె త్వరగా అడుగు వేస్తుంది.

రాజేశ్వరి (తలుపుతీసి) : ఓహో! మీరా! సత్యనారాయణ;(దర్పాన్ని నటిస్తూ, చావడిలోకి వచ్చి) : ఔను! మేమే! రాజేశ్వరి : అయితే, దయచెయ్యండి, మరి. సత్యనారాయణ: బయటికేనా? రాజేశ్వరి (చిరునవ్వుతో) : మీ చిలిపి మాటలు పోనిచ్చారు కారు. పడమటింటిలోకి వెడుతూ అమ్మా! వారొచ్చారే! (సత్యనారాయణ చావడి మధ్యకు వస్తాడు. అతడు పాతికేళ్ల వాడు. పొడుగ్గా, పలచగా, నాజూకైనవాడు. బిళ్ళగోచి పంచెతో, వొదులు లాల్చీతో, వల్లెవాటు ఉత్తరీయంతో బెంగాలీ వేషం. ఉత్తరీయాన్ని తీసి, ఎక్కడ తగిలించాలా అన్నట్టు అతడు చావడిని కలయజూస్తూ వుండగా సామానుతో, థైర్మస్ ప్లాస్క్ తో బండి భీమన్న వస్తాడు. బండి భీమన్న (సామాను చావడిలో పెడుతూ) : సామాను సరిగ్గా సూసుకోండి, బాబయ్యా! ఇదో! ఇది పెట్టి; ఇది పరుపు సుట్ట; ఇది - మరిగలే - ఏంటో గొట్టం. ఇది పూలబుట్ట, మొత్తం నాల్గు సాల్తీలు. లెక్క సూసుకోండి బాబయ్యా! సత్యనారాయణ : సరి లేవోయ్! బాడు గెంత? బండి భీమన్న : మీ సిత్తం బాబయ్యా! సత్యనారాయణ (పర్సు తీసి, రూపాయి యిస్తూ) : మంచిది. పోవోయ్! బండి భీమన్న (రూపాయి అందుకుని దణ్ణం పెడుతూ) : ఈనాం దయసేయించండి, బాబయ్యా! సత్యనారాయణ (పర్సు జేబులో పెట్టివేసుకుంటూ): ఈనాములు, అగ్రహారాలు యివ్వడానికి నే నేమీ మహరాజును కాదోయ్! బండి భీమన్న : పెబువులు మీకేం లోటు? మీరు సల్లగా సూడకపోతే పేదా బిక్కీ బతికే దెలా, బాబయ్యా? రాజేశ్వరి (కాళ్లు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళు తెచ్చి) : ఏం, భీమన్నా! ఏమిటది? సత్యనారాయణ : రూపాయిచ్చినా, ఇంకా ఈనాం తెమ్మంటున్నాడు! రాజేశ్వరి : రూపాయి పుచ్చుకున్నాడూ? స్టేషన్ నుంచి వూళ్లోకి అర్ధరూపాయే మామూలు, ఏం, భీమన్నా? కొత్తవార్ని చేసి, ఇలా గుంజుతున్నావ్! వుండు. మా నాన్నతో చెబుతా! బండి భీమన్న : నీకు దణ్ణం పెడతా! వొద్దమ్మా, వొద్దు! సత్యనారాయణ : ఏమోయ్! చెబితే యేఁ? బండి భీమన్న : ఎంకట్రామయ్య బాబయ్యతోటే! అబ్బో! ఆయన కరకట్టు మనిషి. మాట తబాబొస్తే నిలువునా పాతేస్తాడు. సత్యనారాయణ : ఆఁ! ఆయనంత కరకట్టుగా వుంటాడూ? బండి భీమన్న : ఆయన సంగతి మీకేం తెల్సు, బాబయ్యా? బలే నికార్సు మనిషి. అయితే, సిట్టెమ్మొగోరూ! ఈ రూపాయి తీసుకుని, అర్థే యిప్పించండమ్మా! సత్యనారాయణ : సరి లేవోయ్! నువ్వు పో! బండి భీమన్న : సిత్తం! బాబయ్యా! సామాన్ల లెక్క సరిగ్గా సూసుకోండి. రాజేశ్వరి (నీళ్ళచెంబు అందిస్తూ) : కాళ్ళు కడుక్కోండి. (దణ్ణం పెట్టి వెళ్ళిపోతాడు. సత్యనారాయణ : నా కాళ్ళకేఁ? పరిశుభ్రంగానే వున్నాయ్! రాజేశ్వరి (చిరునవ్వుతూ) : తమరు బస్తీవారు కాబోలు! మేము పల్లెటూరి వాళ్ళం, మోటువాళ్ళం, మా మోటు ఆచారాలివి. మోటువాళ్ల మధ్య - ఇష్టమైనా, కష్టమైనా - వాళ్ల పాటు ఆచారాలు పాటించక తప్పదు. (చెంబు అందిస్తుంది. సత్యనారాయణ (ఉత్తరీయాన్ని రాజేశ్వరి చేతి కిస్తూ):అబ్బే! మోటువాళ్లు కాదు, మాటశారు! (కాళ్లు కడుక్కోడానికి సత్యనారాయణ పెరటి గుమ్మం గుండా వెడతాడు. రాజేశ్వరి ఉత్తరీయాన్ని ఒక పటం మేకుకు తగిలిస్తుంది. ఒక నవారు మంచాన్ని వాల్చి, దానిపై జంఖానా పరిచి, తలవైపున దిండు వేస్తుంది. ఈలోపల కాళ్ళు కడుక్కువస్తున్న సత్యనారాయణకు యెదురుగా వెళ్లి, తువాలిచ్చి, చెంబు తీసుకుని, పడమటింటిలోకి వెడుతుంది. సత్యనారాయణ మంచంపై కూర్చుంటాడు. బండి భీమన్న (బయట నుంచి) : బాబయ్యా! సత్యనారాయణ : ఎవరది? బండి భీమన్న (చావడిలోకి వస్తూ) : నేనే బాబయ్యా! సత్యనారాయణ (బుర్ర గోక్కుంటూ, ఎదురుగా వచ్చి నిలిచిన భీమన్నతో) : దేనికోయ్? బండి భీమన్న : ఏం లేదు బాబయ్యా! మరిగళ్తే మీరు మల్లీ పట్నమెప్పు డెడతారు, బాబయ్యా? సత్యనారాయణ (చికాకుగా) : నీ కెందుకోయ్ ఈ ఆరాలన్నీ? నే నెప్పుడు వెళ్ళితే నీకేఁ? బండి భీమన్న : ఏం లేదు. బాబయ్యా! మరిగళ్తే..... సత్యనారాయణ : ఏమిటోయ్ ఆ గల్లీలూ, కలీలూ? : బండి భీమన్న : అది కాదు. బాబయ్యా! మళ్ళీ బం డెప్పుడు తోలుకు రమ్మంటారు? సత్యనారాయణ : ఓహో! అదా సంగతి! ఎల్లుండి పొద్దున్నే మెయిల్ వేళకు తోలుకురా! రాజేశ్వరి (పడమటింటిలోనుంచి వస్తూ) : మళ్ళీ ఎల్లుండే ప్రయాణమటండీ? ఏమంత తొందర? వీల్లేదు. బండి భీమన్న : అయితే, మరెప్పుడు రమ్మంటారు, బాబయ్యా! : సత్యనారాయణ : ఎల్లుండి పొద్దునని నీకు చెప్పలా? బండి భీమన్న : ఎల్లుండి ఈల్లేదని మా సిట్టెమ్మగా రన్నారు గదండీ? సత్యనారాయణ : మీ సిట్టెమ్మగారు, పొట్టెమ్మగారు అలాగే అంటారులే! నువ్వు మాత్రం నే చెప్పినట్టుగానే ఎల్లుండి పొద్దున్నే రా! సరేనా? బండి భీమన్న : సిత్తం సిత్తం! దణ్ణం, బాబయ్యా! (పోబోతాడు. రాజేశ్వరి : ఇదుగో! భీమన్నా! రామాలయందగ్గిర మా నాన్న వుంటే, పట్నం అల్లుడు గారొచ్చారని కాస్త చెప్పిపో! బండి భీమన్న : సిత్త మమ్మా! సిత్తం! (వెళ్ళిపోతాడు. రాజేశ్వరి (చిన్న మొహం చేసుకుని) : అంత తొందరేమండీ? ఎల్లుండే తిరిగి వెళ్లాలా? వారం రోజులపాటైనా మీకు సెలవు దొరక దేమండీ? సత్యనారాయణ : ఒక్క వారం రోజుల ఖర్మేమిటి? అసలే సెలవు దొరికింది! రాజేశ్వరి (ఆశ్చర్యంగా) : అ దేమిటండీ? సత్యనారాయణ : ఏమిటా? ఉద్యోగం వూడింది. రాజేశ్వరి (నమ్మలేక) : నిజమే? సత్యనారాయణ (బండి భీమన్న గొంతుతో) : సిత్తం! సిత్తం! రాజేశ్వరి : ఆఁ! పోదురూ! మీరు వేళాకోళ మాడుతున్నారు. సత్యనారాయణ : నిజం చెప్పినా నువ్వు నమ్మకపోతే, మరి నేను చేసే దేమిటి? రాజేశ్వరి : అ దేమిటండీ? ఏడాదిపాటు ప్రయత్నం చేసి ఉద్యోగం సంపాయించడమూ, నెలైనా గిర్రున తిరక్కముందే అది పోవడమూనా! సత్యనారాయణ (సిగరెట్టు తీసి ముట్టిస్తూ) : మన అదృష్టం అలా వుందన్న మాట. ఆ పత్రిక కట్టేశారు. రాజేశ్వరి : మొన్నే కదండీ దాన్ని ప్రారంభించింది? సత్యనారాయణ : నిజమే! కాని, కనీసం లక్షలైనా పెట్టుబడి లేకుండా ప్రారంభిస్తే, దినపత్రిక సవ్యంగా నడుస్తుందా? రాజేశ్వరి : మరి మీ వుద్యోగం పోతే, ఎల్లుండే జరూరుగా తిరిగి వెళ్ళాలంటా రేమిటి? సత్యనారాయణ : మా క్లబ్బు నాటకంలో రాజు వేషం వొప్పుకున్నాలేఁ! రాజేశ్వరి : అలాగేఁ! అయితే రాణిగా రెవరో? సత్యనారాయణ (రాజేశ్వరిని వేలితో చూవుతూ) : వీరే రాణిగారు! తమ నామధేయమే రాజేశ్వరి గారయ్యె! రాజేశ్వరి : నాపని నాటకంగానే వుంది. నే నొకటి అనుకుంటే, మరొకటి జరిగింది. సత్యనారాయణ (సిగరెట్టు పొగ రాజేశ్వరి ముఖంలోకి “ఉఫ్" మని ఊది) : నీ వేమనుకున్నా వేమిటి? రాజేశ్వరి (పొగకు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ) : ఊఁ! పోదురూ! సత్యనారాయణ : పోనా?

(మంచంపై నుంచి లేస్తాడు. !

రాజేశ్వరి (భర్త భుజాలమీద చేతులు వేసి నొక్కుతూ) : మహబాగుంది సత్యనారాయణ (నిలబడే) : నీ వేమనుకుంటున్నావో చెబితే తప్ప కూర్చోను. రాజేశ్వరి : చెబుతా గదండీ! ముందు కూర్చోండి. సత్యనారాయణ : అన్నట్టు, కూర్చోకపోతే (రాజేశ్వరి గొంతు పెట్టి) “ఉండు, మా నాన్నతో చెబుతా!” అస్త్ర మిప్పుడు నా పైనే సంధిస్తావు కాబోలు! రాజేశ్వరి (నవ్వుతూ) : అబ్బ! కూర్చుందురూ! సత్యనారాయణ (కూర్చుంటూ) : సరే! అదేమిటో చెప్పు మరి? రాజేశ్వరి : మరే... మరే... (నవ్వుతూ) ఎలా చెప్పనండీ? సత్యనారాయణ : అందమైన ఆ చిన్ని నోటితో; విందు కూర్చే ఆ తేనె కంఠంతో. రాజేశ్వరి : ఉహూఁ! నేర్చారు నాటకాల్లో మాటలు! సత్యనారాయణ : ఇంతకూ అదేమిటో చెప్పావ్ కాదు. రాజేశ్వరి : మరే... మరే... మీకు ఉద్యోగమైంది గనక, ఇక నన్ను పట్నం కాపరానికి తీసికెడతారని... సత్యనారాయణ (నవ్వుతూ) : ఓహో! అదా సంగతి! రాజేశ్వరి : మీకేం! మీకు నవ్వులాటగానే వుంటుంది.వొదిలి నే నిక్కడిక మరి వుండేదే లేదు. ఉద్యోగం నాకిక్క డేమీ తోచడం లేదు మిమ్మల్ని , సద్యోగం మాట నాకు తెలవదు.మీరు పట్నం వెళ్ళితే, ఈసారి నేనూ మీ వెంట రావల్సిందే! సత్యనారాయణ : భేష్! ఉద్యోగం లేకుండా మద్రాసులో కాపరం పెట్టడ మెలా? రాజేశ్వరి : ఉద్యోగం లేకపోయినా, మీ రక్కడ వుంటం లేదా? సత్యనారాయణ : నా దారి వేరు. ఒంటరిగావుంటే నా తిప్ప లేవో నేను పడతా. రాజేశ్వరి : జంటగావుంటే ఆ తిప్ప లేవో మనం చెరిసగం పంచుకో వచ్చుగాం? సత్యనారాయణ : ఆస్తిలో ఆడవాళ్లకు సగ భాగమంటూ ఈ మధ్య శాసనం వచ్చిందనుకో! తిప్పలలో కూడా సగం పంచి పెట్టాలంటూ ఇంకా శాసనం రాలేదు. రాజేశ్వరి (ముఖం చిన్నబుచ్చుకుని) : పోనీ లెండి. మీకు నే నంత భారమైతే. సత్యనారాయణ (అనునయిస్తూ) : ఇంతలోనే అలకా? రాజేశ్వరి : నాకు తోడు అలక్కూడా! సత్యనారాయణ : రాజేశ్వరీ! ఏదీ, ఇలా నావంక చూడు! (చూడదు) ఇలా నావంక చూడమంటూ వుంటే? (ఆమె ముఖం తనవైపుకు తిప్పుకుని) పిచ్చిదానా! నిన్ను విడిచి వుండడం నాకు మాత్రం కష్టంగా లేదనుకున్నావా? వెర్రిబాగుల దానివి కాబట్టి, నువ్వు తేలిగ్గా బయటపడ్డావు; నేను పడలేదు. అంతే భేదం. రాజేశ్వరి (సత్యనారాయణ కళ్ళలోకి చూస్తూ) : పోనీ, మనం పట్నం కాపరం పెట్టడానికి మా నాన్నని డబ్బివ్వమని అడిగితేనో? సత్యనారాయణ : అడగడం తేలికే! కాని, ఆ కరకట్టు మనిషి యివ్వొద్దూ? రాజేశ్వరి : చిన్నదాన్ని - మానాన్న నా కన్యాయం చేస్తాడేమిటి? కాపరానికి మా అక్కయ్యలు ముగ్గురూ వెడుతూవుంటే, వాళ్ళకి అయిదేసి వేలివ్వలేదూ?. సత్యనారాయణ : నిజం? రాజేశ్వరి : నిజమేనండీ! సత్యనారాయణ : ప్రయాణమై వెడుతూవుంటే వాళ్ళు అడక్కుండానే యిచ్చాడా? రాజేశ్వరి : పెద్దక్కాయి కాపరాని కెళ్ళడం నాకు బాగా గుర్తు లేదు గాని, రెండో అక్కాయికీ, మూడో అక్కాయికీ వాళ్ళు ప్రయాణమైనాక పసుపూ కుంకంలో పెట్టి మా పెదనాన్నచేత యిప్పించాడండీ! సత్యనారాయణ : అయితే, నువ్వు ప్రయాణమైతే నీకూ... (బయటినుంచి “చిట్టెమ్మా!” అంటూ వెంకట్రామయ్య గొంతు. రాజేశ్వరి : అడుగో! మానాన్న! సత్యనారాయణ : భేష్! నువ్వు లోపలికి పో! రాజేశ్వరి : దేని కండీ? సత్యనారాయణ : మన మిప్పుడు నడిపించవలసిన నాటక మున్నదిలే. తమరు అంతఃపురంలోకి వేం చెయ్యండి. (ఆశ్చర్యంతో వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, రాజేశ్వరి పడమటింటిలోకి వెడుతుంది. వెంకట్రామయ్య పుగాకు తునక పాయతీస్తూ లోపలికి వస్తాడు. ఆయన వయస్సు దాదాపు యాభై సంవత్సరాలు. ఆరడుగులకు పైగా పొడవు; పొడవుకు తగిన లావు. పెద్ద నుదురు, చేరెడేసి కళ్లు, గండుమాసం. చూచి చూడ్డంతోటే హుందా గల వాడిలా కనబడతాడు. వెంకట్రామయ్య : ఏం నాయనా! ఎప్పుడూ రావడం! సత్యనారాయణ : ఇంతకు ముందేనండీ. వెంకట్రామయ్య : క్షేమమా? సత్యనారాయణ : ఆఁ! వెంకట్రామయ్య : మద్రాసునుంచేనా? సత్యనారాయణ : ఔనండీ. వెంకట్రామయ్య : ఏమిటీ విశేషాలు? సత్యనారాయణ : ఏమీ లేవుగాని... వెంకట్రామయ్య : ఏమి టది, నాయనా? సత్యనారాయణ (కొత్త సిగరెట్టు తీసి ముట్టిస్తూ) : మీ అనుమతైతే రాజేశ్వరిని మద్రాసు తీసుకువెళ్ళాలని.... వెంకట్రామయ్య : ఇందుకు నా అనుమతి దేనికి? సత్యనారాయణ : అదేమన్న మాటండీ? మీ సమ్మతి లేకుండా.... వెంకట్రామయ్య : మంచిది, నాయనా! ఎప్పుడూ ప్రయాణం? సత్యనారాయణ : ఇవ్వాళ రాత్రికే, వెంకట్రామయ్య : సరి సరి! దాని కొక వారం, వర్జ్యం, మంచీ చెడ్డా లేదన్నమాట! !ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేనా? సత్యనారాయణ : నేను మంచి రోజు విచారించే వచ్చానండీ! దక్షిణదిశ ప్రయాణానికి దివ్యమైన రోజు, వర్జ్యం ఉదయమే వెళ్ళిపోయింది. వెంకట్రామయ్య : కాని, మధ్యాహ్నం రావడమూ, రాత్రికే ప్రయాణమూనా! పిల్లని కొత్తగా కాపరానికి పంపించడమంటే మాటలా? పోనీ, రెండు, మూడు రోజులతర్వాత వెళ్ళగూడదూ? సత్యనారాయణ : కొత్త ఆఫీసు గదండీ? సెలవు దొరకదు! వెంకట్రామయ్య : ఎంత కొత్త ఆఫీసైతే మాత్రం ఆపాటి సెలవు దొరకదూ? సత్యనారాయణ : అసలు ఈ ఒక్క రోజు సెలవు దొరకడమే గగనమైంది. ఇద్దరు, ముగ్గురు వెంట వెంటనే సెలవు పెట్టారు. రేపే మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాలని మా ఎడిటర్ గట్టిగా చెప్పాడు. వెంకట్రామయ్య : అయితే, ఫలానానాటికి అమ్మాయిని పట్నం తీసుకువెళ్ళడానికి వస్తున్నానంటూ ముందే ఒక ఉత్తరం ముక్క రాయకపోయావూ? - ప్రయాణ సన్నాహాలన్నీ పూర్తి చేసుకునే వాళ్ళంగా! సత్యనారాయణ : పొరపాటు సుమండీ! ఆ మాట నాకు తోచనే లేదు. వెంకట్రామయ్య : ఎంత చదువుకుంటే మాత్రమేఁ? మీకు లోకానుభవం తక్కువ, నాయనా! అందువల్లే వచ్చిన యెడం లేకుండా ప్రయాణం సాగించా లంటున్నావ్ . . రెండు, మూడు రోజుల తర్వాత చూద్దాంలే! సత్యనారాయణ : మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు. వెంకట్రామయ్య: ( : పుగాకు తునక లాల్చీ జేబులో పెట్టి మంచంపై కూర్చుంటూ). కన్నకడుపు – చూడు !. పైగా, అది మా కడసారి బిడ్డ. ఎన్నడూ మమ్మల్ని విడిచివుం డెరగదు. .ఒకరి చేతిలో పెట్టింతర్వాత పంపించమన్నప్పుడు పంపించి తీరాలనుకో. అయితే, మన ఊరూ నాడూ కాని చెన్నపట్నంలో కాపరం. ఇక ఇరుగా, పొరుగా? నువ్వేమో పగలంతా ఆఫీసులో వుంటావ్. బిక్కుబిక్కుమంటూ ఒబ్బుతే అది యింట్లో వుండాలి. బెంగ పెట్టుకుంటుందేమోనని మా భయం, సత్యనారాయణ : లేనిపోని భయాలండీ మీవి. మా ఆఫీసుదగ్గర్నే యిల్లు మాట్లాడాను. ఇరుగుపొరుగున నాలుగైదు తెలుగు కుటుంబా లున్నాయి కూడా. వెంకట్రామయ్య : ఇల్లు కూడా మాట్లాడావ్! (నవ్వుతూ) మరి నా సమ్మతికోసం నువ్వు వేచివున్న దెక్కడ? ఏమైనా బస్తీదారి వేరు. ఒకరి సంగతి మరొకరు పట్టించుకోరు. పైగా, తొలిగా కాపరానికి వెళ్ళడం - ఏమి నిర్వాకం చేస్తుందో మా వెర్రిబాగుల్ది. సత్యనారాయణ (లౌక్యంగా) : పోనీ, మీరూ, మా అత్తగారూ రెండు, మూడు నెల్లపాటు మాతో వుండిరాకూడదూ? వెంకట్రామయ్య : మాసూలు యెద్దడిలో క్షణమైనా తీరడం లేదు. ఇప్పుడు వూరు కదిలితే పొలంలో పంట పొలంలో మట్టి కావల్సిందే! లేకపోతే రావడానికేఁ? పోనీ, మరి రెండు, మూడు నెల్లపాటు అమ్మాయిని... సత్యనారాయణ : ఏమో, అది ఇహ మీయిష్టం; మీ అమ్మాయి యిష్టం. వెంకట్రామయ్య : నా యిష్టాని కేమిలేఁ! నీ యిష్టం, దాని యిష్టం ముఖ్యం. సత్యనారాయణ : అదేమన్న మాట? మీరు గట్టిగా కాదంటే, మీ మాటకు మేము వ్యతిరేకంగా వెడతామా? వెంకట్రామయ్య : నేను గట్టిగా కాదనడం తగునా, నాయనా? మరి, అమ్మాయి ఏమంటున్నది? వెంకట్రామయ్య : సరి సరి! (బిగ్గరగా) అమ్మా! చిట్టెమ్మా! సత్యనారాయణ : నే నడగలేదు; మీ రడిగి చూడండి. (రాజేశ్వరి వచ్చి పడమటింటి గుమ్మంలో నిలబడుతుంది. చావడిలో జరుగుతున్న సంభాషణను చాటు నుంచి వింటున్నందువల్ల సిగ్గు బిడియాలతో తల కొద్దిగా వంచుకుంటుంది) వెంకట్రామయ్య : అమ్మా! ఇవ్వాళే ప్రయాణం చేయించ మంటున్నాడు, సత్యనారాయణ, మరి, నీ యిష్ట మేమిటి? రాజేశ్వరి (పైట అంచును రెండు చేతులతోనూ పట్టుకుని, దాన్ని వేళ్ళకు చుట్టుకుంటూ, వంచిన తల యెత్తకుండానే) : ఏమో, మీ యిష్టం; వారి యిష్టం. వెంకట్రామయ్య (చిరునవ్వుతూ) : మా యిష్టం మాట కేమిలే! నీ యిష్ట మేమిటో చెప్పుతల్లీ!రాజేశ్వరి జవాబు చెప్పదు : సత్యనారాయణ వంక భావపూర్వకంగా చూచి, చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. వెంకట్రామయ్య : సరే, నాయనా! మీ వుభయుల యిష్టమూ అయిన తర్వాత మరి మధ్య నా అభ్యంతరం దేనికి? కాని, నీ ఉద్యోగం ఖాయమేనా? సత్యనారాయణ : ఆఁ! . వెంకట్రామయ్య : ఏమి జీత మేర్పాటు చేశారు? సత్యనారాయణ : అలవెన్సులతో చేరి నెలకు నూటముప్పై రూపాయలు వెంకట్రామయ్య : సరి సరి! బి.ఏ. చదివినా ఇంతేనా జీతం? సత్యనారాయణ : తెలుగు పత్రికల్లో జీతాలంతేలెండి. వెంకట్రామయ్య : ఏం గొడవో! వేలకువేలు చదువుకు పోస్తే చివరికి వడ్డీ డబ్బులైనా గిట్టవ్. సరేగాని, ఈ కరువు కాలంలో ఈ నూటముప్పై రూపాయలతో మీ సంసార మెలా గడుస్తుంది? సత్యనారాయణ : వ్యాసాలు వ్రాసి, పైన ఏమైనా సంపాయిస్తాలెండి. వెంకట్రామయ్య : వ్యాసాని కేమాత్ర మిస్తా రేమిటి? సత్యనారాయణ : పదిహేను రూపాయలు. వెంకట్రామయ్య : సరి సరి! అదీ అంతంతమాత్రమే నన్న మాట! నెల కెన్ని వ్యాసాలు రాయొచ్చు? సత్యనారాయణ : మూడో, నాలుగో, వెంకట్రామయ్య : మూడనుకో! అంటే, మూడు పదిహేన్లు, నలభై అయిదు. అదొక నూటముప్పై, ఇదొక నలభై అయిదు, మొత్తం నూటడెబ్బై అయిదు. బస్తీ సంసారానికి ఇదైనా ఏం సరిపోతుంది? సత్యనారాయణ : మరేమైనా కూడా గడిస్తాలెండి. వెంకట్రామయ్య : మ రేమైనా అంటే, ఏ విధంగా? సత్యనారాయణ (కొంచెం చికాకుగా) : ముందుగానే ఎలాగండీ చెప్పడం? వీలునుబట్టి ఏదో చూసుకోవాలి కాని! వెంకట్రామయ్య : మీకు లోకానుభవం తక్కువ. నాయనా! మంచి చెడ్డల్ని ముందుగానే విచారించుకోకపోతే, చివరికి చిక్కు పడతారు. నూటడెబ్బై అయిదు రూపాయల సంపాదనతో ఈ గడ్డు రోజులలో చెన్నపట్నం సంసార మెలా గడుస్తుంది? ఏదీ లెఖేసి చెప్పు! ఇంటి బాడుగెంత? సత్యనారాయణ : యాభై రూపాయలు. వెంకట్రామయ్య : యాభై రూపాయలే! పాతిక తక్కువ రెండు వందల రూపాయల సంపాదనలో యాభై ఇంటద్దె కిందే పోతే, ఇంకేం తింటారు? (సత్యనారాయణ చికాకు పడి, ఇంకొక సిగరెట్టు తీసి ముట్టిస్తాడు. వెంకట్రామయ్య : ఇప్పుడేగాఁ, నాయనా! ఒక సిగరెట్టు కాల్చావ్, అప్పుడే ఇది రెండోది! ఈ లెఖ్ఖని రోజు కెన్ని అవుతాయ్? సత్యనారాయణ (మరింత చికాకుగా) : ఇక్కడ మీవూళ్ళో ఉబుసుపోక ఇన్ని కాలుస్తున్నా గాని, రోజూ ఇన్ని కాలుస్తానటండీ? వెంకట్రామయ్య : పోనీ మీ చెన్నపట్నంలో అయితే, ఎన్ని కాలుస్తా వేమిటి? సత్యనారాయణ (ఎన్ని చెబుదామా అని కొంచెం సంకోచించి, లెక్క బాగా తగ్గించి) : రోజు కొక ప్యాకెట్ మాత్రం. వెంకట్రామయ్య : దాని ఖరీ దెంత? సత్యనారాయణ : పదణాలు. వెంకట్రామయ్య (ముక్కుపై వేలువేసుకుని) : పదణాలే! అయితే, నెలకి ఇరవై రూపాయలు సిగరెట్లకే చెల్లి పోతుంది. నెలకి యాభై రూపాయలు యింటి బాడుగ, ఇరవై రూపాయల సిగరెట్లు, ఇక నూరురాళ్ళతో ఇద్దరెలా బ్రతకడం? సత్యనారాయణ (కోపంగా మంచంపై నుంచి చరాలున లేచి) : మీకంత యిష్టం లేకపోతే, మీ అమ్మాయిని పంపించడం మానెయ్యండి! ఈ ప్రశ్నలన్నీ దేనికి? (అప్పుడే ముట్టించిన సిగరెట్టును గోడమూలకు విసిరి పారేస్తాడు. వెంకట్రామయ్య (ధోరణి మార్చి) : అదికాదు, నాయనా! పెద్దవాణ్ణి, కావలసినవాణ్ణి. నేను గాకపోతే మీ యోగక్షేమాలు మరెవరు విచారిస్తారు? నీకింత కోపం వస్తున్నప్పుడు నేనిఖ... సత్యనారాయణ (తెప్పరిల్లి, తనుకూడా ధోరణి మార్చి) : అబ్బే! నాకు కోపమేమిటండీ? ఆ వెంకట్రామయ్య : సర్లే, నాయనా! ఇంతకూ మీరిద్దరూ సుఖంగా వుండడమే నాకు కావల్సింది. పెద్దపిల్లలు ముగ్గురూ కాపరానికి వెళ్ళేటప్పుడు అయిదేసి వేల రూపాయ లిచ్చి పంపించాం. కట్నాలనుకున్నా, కానుక లనుకున్నా, ఇంతే మే మిప్పు డివ్వగలిగింది, మాకున్నదేమో నలభై అయిదెకరాల కొండ. దానిలో పదెకరాలు హైకోర్టు వ్యాజ్యంలో వుంది. వ్యాజ్యం మన పక్షమైతే, మా తదనంతరం నలుగురు కూతుళ్ళకు తలొక.... ? సత్యనారాయణ : దేనికండీ ఇప్పుడీ పంపిణీలు వెంకట్రామయ్య : ఈ కాలపు వాళ్ళతో కాపరంలోని కష్ట సుఖాల్ని చెప్పుకోవడం కూడా తప్పే! మే మేమి తిప్పలు పడ్డా, అది మీకోసం... (సత్యనారాయణ ఇంకొక సిగరెట్టును తియ్య బోవడాన్ని చూచి) మళ్ళీ అప్పుడే ఇంకొక సిగరెట్టా? సత్యనారాయణ (తప్పుచేస్తూ పట్టుపడినవానివలె ప్యాకెట్ జేబులో పెట్టివేసుకుంటూ) : ఆఁ! లేదులెండి. వెంకట్రామయ్య : మానడం దేనికి? కాల్చు, నాయనా! కాల్చు. ఆరోగ్యం చెడిపోతుందేమోననే నా భయం. అన్నట్టు, మీ అత్తకు ప్రయాణం మాట తెలుసో, లేదో? - చెప్పొస్తా! (వెంకట్రామయ్య పడమటింటిలోకి వెడతాడు. సత్యనారాయణ విజయగర్వంతో సిగరెట్టు ముట్టించి, గట్టిగా దమ్ములాగుతూ వుండగా, చిట్టిగారెలు, పంచదార, నేతిగిన్నె పుచ్చుకుని రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరి : ఫలహారం తెస్తుంటే ఇంతలోనే మళ్ళీ సిగరెట్టు ముట్టించా రేమండీ? సత్యనారాయణ : చూశావ్! నాటక మెంత రక్తిగా నడిపించానో! రాజేశ్వరి : ఏమైం దప్పుడే? ఇంకా మొదటి అంకంలోనే వున్నారుగా! సత్యనారాయణ : భరతవాక్యంవరకు ఇంత రక్తిగానూ మనం నడిపించగలంలే! రాజేశ్వరి (నవ్వుతూ ఫలహారాన్ని మంచంపై పెట్టి) : నవ్వులాటలకేమిగాని, నా కెందుకో భయంగా వుందండీ! సత్యనారాయణ : పిచ్చిదానా! భయం దేనికి? రాజేశ్వరి (భర్త సరసను కూర్చుంటూ) : మీ కుద్యోగం పోయిన సంగతి మా నాన్నకు తెలిస్తేనో? సత్యనారాయణ : అందుకనేగా ఇవ్వాళ రాత్రికే ప్రయాణమని పథకం వేసింది. చీకటి పడకముందే ఉడాయిస్తాం; తెల్లవారేసరికి మూడువందల మైళ్ళ దూరాన వుంటాం.

రాజేశ్వరి :  అయినా, నాకేమో భయం....

సత్యనారాయణ (కాస్త చికాకుగా) : ఏమిటి అర్థంలేని భయం! రాజేశ్వరి : తర్వాతనైనా మా నాన్నకి మీకుద్యోగం పోయినమాట తెలిస్తే, ఏమంత బాగుంటుంది? మీరే చెప్పండి! ఆయన కానివాడు గనకనా? దాపరికం లేకుండా వున్నమాట చెప్పి... సత్యనారాయణ : మహ మంచిమాట చెప్పావులే! నా కుద్యోగం పోయినమాట తెలిస్తే మీ నాన్న నిన్ను మద్రాస్ పంపుతాడనే? రాజేశ్వరి : పంపకేం చేస్తాడేమిటి? ఎల్లకాలం యింట్లో పెట్టుకు కూచుంటాడా? సత్యనారాయణ : అయితే, నువ్వనే దేమిటి? “నా కుద్యోగం లేదు, సద్యోగం లేదు. నా పెళ్ళాన్ని పెట్టుకుని మద్రాసులో వూరేగాలనుకొంటున్నా, తే తేవయ్యా! డబ్బు తే!” అని అడగమనేనా? రాజేశ్వరి : చాల్లెదురూ! ఒక్క మనకే యిస్తున్నా డేమిటి? తక్కిన తన ముగ్గురు కూతుళ్ళ కిచ్చుకోలా? సత్యనారాయణ : నువ్వు వెయ్యిచెప్పు; లక్షచెప్పు, డబ్బివ్వమంటూ ఆయన్ని నా నోటితో నే నడగను. ఆయనకు లోకువ కావడం నాకిష్టం లేదు. రాజేశ్వరి : అబ్బో! ఎంత బెట్టుసరండీ! సత్యనారాయణ : కాక? కాలు చచ్చి వున్నా మనుకున్నావా? రాజేశ్వరి : ఇస్తే పుచ్చుకుంటారటగాని, యివ్వమనడం లోకువట! ఏం చోద్య మండీ? పోనీ, మీ రడగడం దేనికి? నే నడుగుతా! సత్యనారాయణ : చాల్లే! నా పరువు తియ్యకు! “ఉద్యోగం ఖాయమేనా? జీత మెంత? అదేం సరిపోతుంది? ఎన్ని సిగరెట్లు కాలుస్తావ్? ఎంత కాఫీ తాగుతావ్? ఎన్ని సినిమాలు చూస్తావ్?" ఈ లాయర్ ప్రశ్నలన్నీ అయ్యాక, ఉద్యోగం పోయిందని ఈ చెబుతావుగా! ఇహ నే నేమైనా తలెత్తుకు తిరగాలా! రాజేశ్వరి : ఏమండీ! ఆయనేమో పరాయివాడన్నట్టు... (వెంకట్రామయ్య పడమటింటిలోనుంచి వస్తూ తన రాకను సూచించడానికి పొడిదగ్గు దగ్గుతాడు. మాట సగంలో మింగివేసి, మంచంపై నుంచి రాజేశ్వరి దిగ్గున లేస్తుంది. వెంకట్రామయ్య (చావడిలోకి వచ్చి) : చిట్టెమ్మా! చింతా లెక్కడమ్మా? రాజేశ్వరి : గొడ్లచావిడిలో వున్నట్టున్నాడు. నాన్నా! వెంకట్రామయ్య : వెళ్ళి, కాస్త పిలు వమ్మా! (రాజేశ్వరి పెరటి గుమ్మం గుండా వెంకట్రామయ్య (సిగరెట్టు కాల్చుతున్న సత్యనారాయణను చూచి, తల పంకిస్తూ) : ముందు ఫలహారం పుచ్చుకో, నాయనా! (వెడుతుంది.

(కాల్చుతున్న సిగరెట్టును చప్పున నోట్లో నుంచి తీసి, దాన్ని కాస్త వెనగ్గా పెట్టి, సత్యనారాయణ ఫలహారం చెయ్యడం ప్రారంభిస్తాడు. వెంకట్రామయ్య (రెండవ నవారు మంచాన్ని వాల్చుకుని దానిపై కూర్చుంటూ) : ఇంత తొందర ప్రయాణ మేమిటని మీ అత్త చాలా నొచ్చుకుంటున్నది. కడసారి కూతురు - దానికైనా అచ్చట్లూ, ముచ్చట్లూ తీరొద్దూ? కాని, “వాళ్ళుభయులూ ప్రయాణానికి ఉబలాట పడుతూ వుంటే, మనకు దేనికే?” అని సర్ది చెప్పాం! మేము పాతకాలపువాళ్ళం, మాకు... చింతాలు (పెరటి గుమ్మంగుండా వచ్చి) : ఏమయ్యగోరూ! వెంకట్రామయ్య : చూడు, చింతాలూ! మన చిట్టెమ్మ కాపరానికి వెడుతున్నది. మరి నువ్వు.... చింతాలు : ఎప్పుడయ్యగోరూ? వెంకట్రామయ్య : ఇవ్వాళ రాత్రి బండికేరా! చింతాలు : అదేమి టయ్యగోరూ! అంత యవదానం లేకుండానే! వెంకట్రామయ్య : ఔనురా! ఈ కాలపువాళ్ళు మన మాటల్ని వింటారా, పెడతారా? సరిగాని... (ఇంతలో చావడిలోకి వచ్చిన రాజేశ్వరిని చూచి వెంకట్రామయ్య మాటకు చింతాలు అడ్డువస్తాడు. చింతాలు : సిట్టెమ్మగోరూ! మీ రెల్లిపోతే, మే మేం గావాలమ్మా? రాజేశ్వరి (చిరునవ్వుతూ) : అదేమిటి, చింతాలూ! మిమ్ముల నందర్నీ నేనే పోషిస్తున్నా నేమిటి? చింతాలు : అది కా దమ్మగోరూ! మీ రెల్లిపోతే, యిల్లు సిన్నబోదూ? మీరు కంటి కాపడకపోతే, మన సిన్నావు... రాజేశ్వరి : ఔను, నాన్నా! మన చిన్నావు... సత్యనారాయణ : చిన్నా వేమిటి? చింతాలు : సిట్టెమ్మగోరు కంటి కాపడకపోతే, సిన్నావు నీలూ మేతా ముట్టుకుంటుందనే? దాని పాణాలన్నీ ఆ తల్లిమీదే. సత్యనారాయణ : అయితే, నువ్వు ఆ ఆవును మావెంట పట్నం తోలుకు రావోయ్. చింతాలు : సత్తెం, బాబూ! తోలుకు రానా? వెంకట్రామయ్య : పిచ్చి వెధవ్వి! ఆయన నవ్వులాట కంటున్నాడు. చింతాలు : అదేటో అయ్యగోరూ! నా కేమీ తోసడం లేదు. సిట్టెమ్మగోరు లచ్చిలా తిరుగుతూ వుంటే యిల్లూ వాకిలీ కళకళలాడుతూ వుంటుంది. ఆమెగోరు ఎల్లిపోతే అంతా బావురుమందండీ? వెంకట్రామయ్య : నిజమేరా! కాని, తప్పుతుందా? సరిగాని, తొందర ప్రయాణం. లక్ష పనులున్నాయ్. నువ్వెళ్ళి, మీ అమ్మగారు చెప్పినట్టు, బియ్యం, పప్పులూ సంచుల కెత్తి, మూతులు కుట్టు; కారం, పసుపు వగైరాలన్నీ గుడ్డ మూటలు కట్టు. అటకమీది నుంచి అమ్మాయి పెళ్ళినాడు చదివించిన సామానంతా కిందికి దించు. కుర్చీపీటలు, భోజనం పీటలు వగైరా కొయ్యసామాన్లు ఆ మూల గదిలో వున్నాయ్. వాటిని బయట పెట్టించి, దుమ్మూ, దుట్రా దులిపి.... సత్యనారాయణ : ఇప్పుడెందుకండీ మా కీ సామానులన్నీ? వెంకట్రామయ్య : ఏఁ! మీ బస్తీ కాపరానికి మా పల్లెటూరి సామాను లేవీ పనికి రావేమిటి? సత్యనారాయణ: అద్దెకు పుచ్చుకున్నది చాలా చిన్న యిల్లు. దానిలో ఈ సరంజామంతా.... ( మాట పూర్తి కాకుండానే ఆపివేస్తాడు. ..... చింతాలు : లంకంత యిల్లు - ఇదే మా సిట్టెమ్మగారికి సాలడం లేదు. ఆ కూపీ యింటికి మా బుల్లి దొరసా న్నెట్టా తీసి కెడతావ్, బాబయ్యా! వెంకట్రామయ్య : కాస్త యిల్లో, కూస్త యిల్లో! అద్దె కొంపైనా అది వాళ్ళది; ఇది కాదు! రాజేశ్వరి : ఊఁ! చాల్లే నాన్నా. వెంకట్రామయ్య : సర్లేరా! చింతాలూ! మన బసివిగాణ్ణి పంపి, బండి భీమన్నని పెందరాళే పిలిపించు. స్టేషన్ దాకా సామాన్లు తీసుకు వెళ్లడానికి మన బండీ కావాలి. జల్ల వేసి, మన వెంకాయిని ఒక బండి సిద్ధంగా వుంచమను. పనులన్నీ త్వరగా తెమలాలి సుమీ! చింతాలు (నీరసంగా) : సరే, అయ్యగోరూ! : (పోబోతాడు. వెంకట్రామయ్య : ఆఁ! అన్నట్టు, మొన్న వాళ్ళపిల్ల అన్నప్రాశనానికి సుబ్బక్కగా రబ్బాయి - నాగేశ్వర రావ్ మన వెండి సామాను పట్టుకుపోయాడు గాని, దాన్ని తిరిగి పంపించమన్నానని చెప్పిరా! నువ్వు చమురు వాడి వని నాకు తెలుసుగాని, తేమాణం చెయ్యకు! చింతాలు : ఏమో, అయ్యగోరూ! నాకు కాళ్ళూ సేతులూ ఆడ్డంలేదు. (వెడతాడు. వెంకట్రామయ్య : నిజమే! ఇక, యిల్లంతా బావురు మంటుంది. (సత్యనారాయణకు వెక్కిళ్ళు వస్తాయి. అంతట వెంకట్రామయ్య కుమార్తె నుద్దేశించి) మంచినీళ్ళు పెట్టలేదేమి, తల్లీ? రాజేశ్వరి : మర్చిపోయా, నాన్నా! ఇదుగో, చిటికలో తెస్తా! (చకచక పడమటింటిలోకి వెడుతుంది. వెంకట్రామయ్య : వెర్రిబాగులి! ప్రయాణం సంతోషంలో దానికి పనే తోచడంలేదు. కంటాం; పెంచుతాం; ప్రాణాలన్నీ వాళ్ళ మీదే పెట్టుకుంటాం. అయినా, వయస్సొచ్చేసరికి రెక్కలు కట్టుకు యెగిరిపోతారు. మాకు మిగిలేది దొర్లిగూడు. ఆడపిల్లల్ని కన్నవారి బ్రతు కింతే. (రాజేశ్వరి మంచినీళ్ళతో, కాఫీతో తిరిగి వస్తుంది. వెంకట్రామయ్య (కొత్తగా ఏదో జ్ఞాపకానికి వచ్చినట్టు) : చింతాలూ! చింతాలు (లోపలినుంచే) : వొచ్చే, అయ్యగోరూ! వొచ్చే! వెంకట్రామయ్య (రాజేశ్వరితో) : వెళ్ళమ్మా, వెళ్ళు! నువ్వుకూడా కాస్త పలహారం చేసిరా. రాజేశ్వరి : నువ్వుకూడా రా, నాన్నా! వెంకట్రామయ్య : నే నొస్తాలే - నువ్వు వెళ్ళు తల్లీ! ఇక మా బ్రతుకు దేనికి? తిండికేగా?? రాజేశ్వరి : ఏం మాటలవి, నాన్నా! ఒకేసారిగా సత్యనారాయణ : ఏమిటండీ అది! వెంకట్రామయ్య : పసివాళ్ళు మా కడుపు తీపి మీకేం తెలుస్తుంది? సర్లే, తల్లీ! నువ్వు వెళ్లు. - (రాజేశ్వరి పడమటింటిలోకి వెడుతుంది చింతాలు (పడమటింటి గుమ్మంగుండా వచ్చి) : ఏమయ్యగోరూ? వెంకట్రామయ్య : అరే! చూడు! అటొక అడుగేసి, కొట్టప్పయ్యను ధోవతులు, ఉత్తరీయాలు, చీరలు మొదటి రకం సరుకు చూచి - మనింటికి పది, పదిహేను జతలు పంపించమను కావల్సినవాటి నుంచుకుని, మిగతావి వాపసుచేస్తామని చెప్పేఁ! వెళ్ళు - ముందు ఈ పని చూడు! చింతాలు : సరే నయ్యగోరూ! (సింహద్వారంగుండా వెడతాడు. వెంకట్రామయ్య : కాస్త ఉత్తరం ముక్కైనా రాశావు కాదు; అన్ని యేర్పాట్లు ముందుగా చేసుకునే వాళ్ళం. (సత్యనారాయణ జవాబు చెప్పడు) ఏమో, నాయనా! అంతా హడావుడి ప్రయాణమై పోతున్నది. రాజేశ్వరి (పడమటింటిలో నుంచి వచ్చి) : నాన్నా! నిన్నొకసారి అమ్మ రమ్మంటున్నది. వెంకట్రామయ్య : దేని కిప్పుడు? రాజేశ్వరి : పచ్చళ్ళు పెట్టడానికి జాడీలు చాలలేదట. పెదనాన్నగారింటినుంచి రెండింటిని తెప్పిం చాలట. వెంకట్రామయ్య : అలాగే, తల్లీ! సత్యనారాయణ : ఇంత దూరాభారం - ఎందుకండీ ఇప్పుడు పచ్చళ్ళు, గిచ్చళ్ళు? రాజేశ్వరి : నేనూ ఆమాటే అంటూ వుంటే వినడం లేదండీ! వెంకట్రామయ్య : వెర్రిబాగులవాళ్ళు! మీ రిద్దరు ఏమి నిర్వాకం చేస్తారో గదా! సత్యనారాయణ :  ! రాజేశ్వరి : } ఒకేసారిగా { చాల్లే, నాన్నా మీదంతా వింత వెంకట్రామయ్య (దైన్యంగా చిరునవ్వు నవ్వుతూ) : నలుగురు బిడ్డల్ని యెత్తితే మీకూ తెలిసొస్తుంది లెండి... మరి, నే వెళ్ళి, పెద్దవాడు - మా అన్నగారితో ప్రయాణంమాట చెప్పి, ఆయన్ని తోడుకొస్తా. అలాగే జాడీలుకూడా పట్టించుకొస్తాలేఁ ! తల్లీ నువ్వు జాగు చెయ్యక మరి చప్పున ప్రయాణం కా. (సింహద్వారంగుండా వెడతాడు . రాజేశ్వరి : ఏమోనండి నా కెంతో భయంగా వుంది. సత్యనారాయణ : మీ నాన్న కట్టి పంపుతున్న ఈ సామానంతా ఎక్కడ పెట్టుకోగలమనేనా? రాజేశ్వరి : ఆ! అంతా మీకు హాస్యమే! సత్యనారాయణ : (వెంకట్రామయ్య గొంతుతో) సరి సరి! (తన మామూలు గొంతుతో) నే నింత నాటకం నడిపించిన తర్వాత వెనక్కితీసి భంగపాటు చెయ్యవుగదా? రాజేశ్వరి : అబ్బ! వస్తాలెండి. కాని... సత్యనారాయణ : కానీ, అర్ధణా ఏమి టది? రాజేశ్వరి : మా అమ్మ, మా నాన్న... సత్యనారాయణ : మంచిది! వాళ్ళనే అంటి పెట్టుకుండు. నాదారిని నే పోతా. రాజేశ్వరి : అబ్బ! అది కాదండీ! సత్యనారాయణ : అయితే, మరి చిన్నావుమాటా? రాజేశ్వరి : చాల్లెద్దురూ! నేను రానూ లేను; వుండనూ లేను. మీకేం తెలుస్తుంది నా బాధ? సత్యనారాయణ : ఏడ్చినట్టే వుంది! (“చిట్టెమ్మా” అని పిలుస్తూ, సింహద్వారం గుండా వెంకట్రామయ్య తిరిగి ప్రవేశిస్తాడు) రాజేశ్వరి : ఏఁ నాన్నా! వెళ్ళలా? వెంకట్రామయ్య : లేదమ్మా! అడుగు పడనేలేదు. మన వాకిట్లోనే సుబ్బక్కగారి చిన్నాడు, వా డెదురు పడితే, వాడికి చెప్పి పంపించా. వెంకట్రామయ్య : ఎవరది?

(వీధిలోనుంచి “సత్యనారాయణా!” అని పిలుపు.

రాజేశ్వరి : నాగేశ్వరరావు బావయ్యలా వున్నాడు. ఫలహార పాత్రల్ని తీసుకుని రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోతుంది. నాగేశ్వరరావు (చావడిలోకి వస్తూ) : ఏం, సత్యనారాయణా! ఎప్పుడు రావడం? సత్యనారాయణ : ఇంతకుముందే. వెంకట్రామయ్య : కూర్చోరా, అబ్బాయ్, కూర్చో! నాగేశ్వరరావు (సత్యనారాయణ కూర్చునివున్న మంచం పైనే కూర్చుంటూ) : ఏమిటీ చెన్నపట్నం విశేషాలు? సత్యనారాయణ : ఆఁ, విశేషాల కేమున్నవి? నాగేశ్వరరావు : ఏమిటీ అవ్యవధి ప్రయాణం? చిట్టెమ్మను తీసుకుని ఇవ్వాళ రాత్రికే తిరిగి వెడుతున్నావట! : వెంకట్రామయ్య : నేనూ ఆ మాటే ఎంతో దూరం చెప్పి చూశారా. కాని, వెళ్ళితీరా లంటున్నాడు! సత్యనారాయణ : వెళ్ళాలి, మరి!... కొత్త ఆఫీసుగదూ? సెలవు దొరకదు. నాగేశ్వరరావు : సెలవు దొరక్కపోవడ మేమిటి? అప్పుడే మీ పత్రికను... సత్యనారాయణ (మాటకు చటుక్కున అడ్డంవచ్చి) : మీ తమ్ముడు ఇప్పుడు బి.ఏ. జూనియరా? సీనియరా? నాగేశ్వరరావు : అబ్బే! వాడింకా ఇంటరైనా ప్యాసు కాలేదు. సత్యనారాయణ : అన్నట్టు, ఇంకొక పార్టు మిగిలిపోయింది కాబోలు! నాగేశ్వరరావు : పార్టూ లేదు; గీర్దూ లేదు. చదువూ, సంధ్యా లేకుండా అడ్డగాడిదలా ఊరుపట్టుకు తిరిగాడేమో సెలెక్షన్ లోనే డిటెయిన్ చేశారు, వాడి మాట కేమి కాని... సత్యనారాయణ : మాసూలు పూర్తిచేశావా? నాగేశ్వరరావు : వ్యవసాయ మెత్తివేసి, పొలమంతా మూడేళ్ళనాడే కట్టుబడి కిచ్చేశాగాం! సత్యనారాయణ : కట్టుబడి కివ్వడం దేనికి? సొంత వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదా? నాగేశ్వరరావు (ఈ ప్రశ్నను వినిపించుకోకుండానే) : చూడు! నీకు సెలవు... సత్యనారాయణ : అయితే, ఈ మధ్య మీ అమ్మాయికి అన్నప్రాశన చేశావటగాఁ - నన్ను పిలవలేదేం? నాగేశ్వరరావు : పిలవలేదన్న నెపమేగాని, పిలిస్తే నువ్వు వచ్చేవాడివి గనకనా? ఇంతకూ మీ... సత్యనారాయణ : ఊళ్ళోకి వచ్చికూడా మాయింటివైపు తొంగైనా చూశాడు కాదని మీ అమ్మ నెపం వేస్తుందేమో! మీ యింటికి వెళ్ళాద్దాం - పద! నాగేశ్వరరావు : మా అమ్మ ఊళ్ళో లేదు. సత్యనారాయణ : పోనీ, మీ పిల్లల్ని చూద్దాం. నాగేశ్వరరావు : వాళ్ళూ నాయనమ్మ వెంట వూ రెళ్ళారు. సత్యనారాయణ : అయితే, మీ ఆవిడను పలకరించి వస్తారా! నాగేశ్వరరావు : కొత్త చుట్టరికమని ఆవిడ నీకు చాటు వెడుతుందిగా పోదాం. సత్యనారాయణ : ఇంతకీ మీ యింటికి రావద్దంటావ్! మంచి మర్యాదస్థుడివే! సర్లే - రా! (చెయ్యి పట్టుకుని నాగేశ్వరరావును లేవదీస్తాడు. అతడు తిరిగి మాట్లాడరాదనే ఆతురతకొద్దీ) ఆఁ! అన్నట్టు, నువ్వు మద్రాస్ చూడ్డానికి వస్తానని వచ్చావ్ కాదేఁ? చాలాకాలంగా ఇదుగో, అదుగో అనడమే తప్ప... వెంకట్రామయ్య (ఈసరికి సింహద్వారాన్ని చేరిన సత్యనారాయణవంక ఆశ్చర్యంగా చూస్తూ) : పైపంచె మర్చిపోయావ్. వేసుకెళ్ళు, నాయనా! సత్యనారాయణ (వీపుపై కంచీదెబ్బ పడ్డట్టు వెనక్కి తిరిగి) : దేనికి లెండి - ఈ అడుగు దూరంకోసం! వెంకట్రామయ్య : అడుగైనా, ఆమడైనా పై పంచె లేకుండా వీధిలోకి వెళ్ళడం మంచిది కాదు. సత్యనారాయణ : సరిలెండి. (చక చక ఉత్తరీయాన్ని తీసి, పైన వేసుకుని, రెండడుగులలో నాగేశ్వరరావును కలుసుకుని) ఆఁ! ఇప్పుడు పడ్ల ధర ఎలా వుంది? బస్తాకు పదహారు, పదిహేడు రూపాయలైనా పలుకుతున్నదా? అంతమాత్రమైనా లేకపోతే... (గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే నాగేశ్వరరావును వీధిలోకి ఈడ్చుకుపోతాడు. సత్యనారాయణ వైఖరి కొంత అనుమానాన్ని కలిగించగా, లాల్చీ జేబులోంచి పుగాకు తీసి, చుట్ట చుట్టుకుంటూ వెంకట్రామయ్య ఒక మంచం పై కూర్చుంటాడు. బండి భీమన్న (వీధిలోనుంచి) : బాబయ్యా! వెంకట్రామయ్య : ఎవర్రా అది? బండి భీమన్న (చావడిలోకి వస్తూ) : నేనే బాబయ్యా! బండి భీమన్నని. వెంకట్రామయ్య : బండి కట్టుకొచ్చావట్రా? బండి భీమన్న : లేదు బాబయ్యా! వెంకట్రామయ్య : ఏఁ? బండి భీమన్న : ఏం లేదు, బాబయ్యా! మరిగలే, బండి బేగి తోలుకు రమ్మని బసివిగా డొచ్చాడు. మరి నే నేమో ట్నం బాబయ్యగార్ని మద్దాన్న మడిగితే ఎల్లుండి పొద్దున్నే మెయిల్ బండికి రమ్మన్నారండీ. వెంకట్రామయ్య (అప్పటివరకు రెండు మోకాళ్ళ పై రెండు మోచేతుల్ని ఆన్చి ముందుకు వంగి, తల వంచుకుని, చుట్ట చుట్టుకుంటూ వున్నవాడు చప్పున నిటారుగా కూర్చుని, సగం చుట్టిన చుట్టను లాల్చీజేబులో కుక్కి బండి భీమన్నను గుచ్చి చూస్తూ) : వెధవ! నువ్వు తిన్నగా వినలేదు కాబోలు! బండి భీమన్న : అయ్యొ బాబయ్యా! తిన్నగా యినకేఁ! సిట్టెమ్మగోరు ఎల్లుండి ఈల్లేదంటే, ఆ అయ్యగోరు ఎల్లి తీరాలని తెగేసి సెప్పారు బాబయ్యా! వెంకట్రామయ్య : నిజమట్రా? బండి భీమన్న : ఏ బొట్టు పెడితే ఆ వొట్టు, బాబయ్యా! వెంకట్రామయ్య (తల పంకిస్తూ) : సరి సరి! బండి భీమన్న : మరి బండెప్పుడు కావాలి, బాబయ్యా! వెంకట్రామయ్య (ఇంకా తల పంకిస్తూ) : సరి సరి! రాజేశ్వరి (పడమటింటిలోనుంచి వచ్చి) : ఏం, భీమన్నా! బండి తోలుకొచ్చావా? బండి భీమన్న : ఇప్పుడే కావాలా అమ్మా! రాజేశ్వరి : మరి కాసేపటికే మా ప్రయాణం. బండి భీమన్న : అయితే, సిటికలో తోలుకొస్తా. వెంకట్రామయ్య : సర్లే! భీమన్నా! నువ్వెళ్ళు. బండి భీమన్న : సిత్తం, బాబయ్యా! సిత్తం! రాజేశ్వరి : నాన్నా! ఆయ నేరీ? (వెడతాడు. వెంకట్రామయ్య : మన నాగేశ్వరరావుగా రింటికి వెళ్ళాడమ్మా! ఇప్పుడే తిరిగొస్తా నన్నాడు గాని, సత్య నారాయణ తన ఉద్యోగం సంగతులు నీకేమైనా చెప్పాడా? రాజేశ్వరి (తెల్లబోయి, దాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్న పూర్వకంగా): లేదు, నాన్నా! ఏమీ అనలేదే! ఎందుకు? వెంకట్రామయ్య : ఆఁ! ఏం లేదమ్మా! రాజేశ్వరి (ఒకవేళ రహస్యం తెలుసుకున్నాడేమో కనిపెట్టాలని) : నువ్వు ఉత్తినే అడగవు, నాన్నా! ఏమిటీ సంగతి? వెంకట్రామయ్య : అబ్బే! ఏం లేదు, తల్లీ! (ఇంతలో సత్యనారాయణ తిరిగి వస్తాడు) ఏం, నాయనా! అప్పుడే తిరిగొచ్చావ్? సత్యనారాయణ : ప్రయాణానికి వ్యవధి లేదుగదండీ! వెంకట్రామయ్య : ఆ మాట నిజమే! మరి నే వెళ్ళి, పైకాని కేర్పాటు చేసొస్తా. సత్యనారాయణ (అలక్ష్యాన్ని నటిస్తూ) : ఏమో, మీ యిష్ట మది. వెంకట్రామయ్య (చిరునవ్వుతో) : సరి సరి! సత్యనారాయణ(మంచంపై చతికిలబడుతూ):అమ్మయ్యవాణ్ణి వొదిలించుకునేసరికి తాతలు! దిగొచ్చారు. రాజేశ్వరి : ఎవరండీ అది? సత్యనారాయణ : వాడే, ఆ పీనుగ, మీ నాగేశ్వరరావు, రాజేశ్వరి : ఏం చేశాడండీ? సత్యనారాయణ : మా పత్రిక కట్టివేసినమాట వా డెక్కడో ఇవ్వాళే చూచాయగా విన్నాడు. ఆ మాటని కాస్తా మీ నాన్న ముందు... రాజేశ్వరి : కొంపతీసి అనెయ్యలేదు గదా? సత్యనారాయణ : లేదులే! కాని, అనకుండా వాణ్ణి పట్టుకునేసరికి బ్రహ్మప్రళయమైంది. తనదంతా మునిగి పోతున్నట్టు దేభ్యంలా సరిగా ఇప్పుడే వా డిక్కడికి తయారయ్యాడు! రాజేశ్వరి : అత నెప్పుడూ అంతేనండీ! ఒకరి పచ్చనచూచి వోర్వలేడు. కాని, మా నాన్నకు కొంచెం అనుమానం తగిలినట్టున్నదే! సత్యనారాయణ : నిజం! ఏమన్నా డేమిటి? రాజేశ్వరి : మీ ఉద్యోగం సంగతులు మీరు నాకేమైనా చెప్పారా అని అడిగాడు. సత్యనారాయణ : అడిగితే? రాజేశ్వరి : “నా కేమీ చెప్పలేదు నాన్నా!” అని చూస్తూ చూస్తూ పచ్చి అబద్ధమాడాను. సత్యనారాయణ : అయ్యో పాపం! నీ కెంత ముప్పు వచ్చింది! రాజేశ్వరి : మీకేఁ? మీ కలాగే వుంటుంది. నానోట అబద్ధం రాదని అందరితో చెప్పుకుని మా నాన్న ఎంత మురుస్తాడో మీ కేం తెలుసు? సత్యనారాయణ : ఓహోహో! సత్య హరిశ్చంద్రుడటు; తమ రిటు. రాజేశ్వరి : సంతోషించాం - చాల్లెద్దురూ! ఏమిటి సంగతి నాన్నా?” సత్యనారాయణ : అయితే, మీనాన్న మరేమైనా అడిగాడా? రాజేశ్వరి : ఉహుఁ! ఆయన మళ్ళీ మాట్లాడే లేదు. నేనే “గుచ్చిగుచ్చి అడిగినా, “అబ్బే! ఏం లేదమ్మా! ఊరికేనే” అని చప్పరించేశాడు. సత్యనారాయణ : అయితే, ఏమీ ఫరవా లేదులే! పైగా, పైకం కోసం వెళ్ళాడుకూడాగా! రాజేశ్వరి : అయినా, ఏమోనండీ! నాకు బెదురుగా వుంది. మన ప్రయాణానికి మేమీ కలగదుగదా? సత్యనారాయణ : కలిగితే మంచిదే! రావాలని నీకు ఎలాగూ లేదయ్యె! రాజేశ్వరి : అదేమన్న మాటండీ! సత్యనారాయణ : ఏం మాటో - ను వ్వన్నదేగా! - రాజేశ్వరి : చాల్లెద్దురూ! నే ననకేం! ఇంతకూ మా నాన్నకి నిజం తెలిసిందంటారా? సత్యనారాయణ : అబ్బే! లేదు. నేను ఆ నాగేశ్వరరావు నోరు కట్టేశా! మా పత్రిక ఆగిపోలేదని వాడికి నచ్చ జెప్పా! నాటకం నడిపించడంలో ఎవరైనా మన తర్వాతే! రాజేశ్వరి : మా నాన్న సంగతి మీకు తెలియదండీ! ఆయన అసాధ్యుడు. ఆవలిస్తే పేగులు లెక్టెడతాడు. సత్యనారాయణ : మీనాన్నకంటె నేను రెండాకు లెక్కువే చదివానంటావా? రాజేశ్వరి : మీరు ఎంత బి.ఎ. చదివినా, తెలివికి మా నాన్న తర్వాతే! సత్యనారాయణ (వెంకట్రామయ్య గొంతు పెట్టి) : సరి సరి! రాజేశ్వరి : వెక్కిరింతకూడా దేనికి లెండి? ఇప్పుడు కాకపోతే, మరొక్కప్పుడైనా మీకే తెలిసి రాకపోతుందీ? సత్యనారాయణ (దర్పంగా) : ఓహోహో! రాజేశ్వరి : సర్లెండి! మరి నే వెళ్ళి పెట్టి బేడా సర్దుకోనా? సత్యనారాయణ : నన్ను సాయం రమ్మంటావా? రాజేశ్వరి : అడ్డం రాకుండా వుంటే సాయం వచ్చినంత ఫలం! సత్యనారాయణ (తిరిగి వెంకట్రామయ్య గొంతుతో) : సరి సరి! రాజేశ్వరి : నాటకాల్లో వేషాలకు బాగానే పనికొస్తారు. (నవ్వు ముఖంతో రాజేశ్వరి పడక గదిలోకి వెడుతుంది. ఇంతలో “ఆరి వాడి తస్సా చెక్కా!” అంటూ వెంకట్రామయ్య వీధి గుమ్మంగుండా చావడిలోకి వస్తాడు ఆశ్చర్యంగా సత్యనారాయణ అతని వంక చూస్తాడు. రాజేశ్వరి (పడకగదిలో నుంచి తిరిగి వచ్చి) : ఏమిటి, నాన్నా? వెంకట్రామయ్య : ఆ షాహుకారు రత్తయ్య - చూడమ్మా! ఇప్పుడు తనదగ్గిర చిల్లి గవ్వయినా లేదంటున్నా డు. డు . ఎప్పుడడిగితే అప్ప డిస్త అని పాత పంటమ్మిన దస్తంతా వాడి దగ్గిర పెడితే - అయ్యయ్యయ్యయ్యో! - ఎంత పని చేశాడు? రాజేశ్వరి (ఆశాభంగంతో) : నిజం? వెంకట్రామయ్య : ఔను, తల్లీ! రాజేశ్వరి (తెలివితక్కువగా) : అయితే, మా ప్రయాణం? వెంకట్రామయ్య : దానికేమమ్మా? మీరు వెళ్ళండి. వెనకా ముందుగా నే పంపిస్తాం! రాజేశ్వరి : అది కాదు, నాన్నా! మరి... (సత్యనారాయణ చూపులతో వారిస్తాడు. రాజేశ్వరి మాటమధ్యలో ఆగిపోతుంది. వెంకట్రామయ్య : ఏమిటమ్మా అది? (జవాబు చెప్పకుండానే నీళ్ళు కారుతూ రాజేశ్వరి పడక గదిలోకి వెళ్ళిపోతుంది. సత్యనారాయణ : దాని కేం లెండి. మీ కెప్పుడు వీలైతే అప్పుడే పంపించొచ్చు, కాని... కాని... వెంకట్రామయ్య : ఏమి టది, నాయనా? సత్యనారాయణ : “ఇంత అవ్యవధిగా ఈ ప్రయాణం చేయించడం తగునా?” అని మళ్ళీ నాకే సందేహం తోస్తున్నదండీ! వెంకట్రామయ్య : దాని కేమిలే, నాయనా! పిలుచుకెళ్లాలని నువ్వు, వెంటరావాలని మా అమ్మాయి ఉబలాట పడుతున్నారుగా! సత్యనారాయణ : అయినా, చూడండి! అచ్చట్లు ముచ్చట్లు తీరలేదని మా అత్తగారు అనుకుంటారయ్యే. ఆమె మనస్సునైనా నొప్పించడం భావ్యమా అని... వెంకట్రామయ్య : కూతుళ్ళను కన్నతల్లికి ఆ విషయంలో సంతృప్తి ఎక్కడికిలే! సత్యనారాయణ : ఇంత హఠాత్తుగా మిమ్మల్ని విడిచిపెట్టడమంటే రాజేశ్వరికీ కష్టంగానే వుంది. పోనీ మరొక నెల తర్వాత తీరుబాటుగానే... వెంకట్రామయ్య : ఏమైనా, అయినప్రయాణాన్ని ఆపడం మంచిది కాదు, నాయనా! సత్యనారాయణ (ఉడుకుబోతుతనంతో) : బయల్దేరాలని అనుకున్నామే తప్ప, ఇంకా బయల్దేరలేదు గదండీ! వెంకట్రామయ్య : మంచిది, నాయనా! మాదే మున్నది? నీ యిష్టం;దాని యిష్టం. (ముఖాన్ని తిప్పుకుని, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పడమటింటిలోకి వెడతాడు. రాజేశ్వరి గదిలో నుంచి తిరిగి వస్తుంది. ప్రయాణం ఆగిపోయినందుకు విచారం ఒక వైపున, తండ్రి లౌక్యానికి గర్వం మరొక వైపున పై చెయ్యి కావాలని ఆమెలో పెనగులాడుతూ వుంటాయి. రాజేశ్వరి: ఏమండీ! ఇక, నాటకమెలా నడిపిస్తారు? సత్యనారాయణ : ఇంకేమి నాటకం? నాటకం వికటించింది. రాజేశ్వరి (తండ్రి లౌక్యాన్ని చూడగా కలిగిన గర్వానిదే పై చెయ్యి కాగా) : అయితే, ఎవరు రెండాకు లెక్కువ చదివినట్టు? సత్యనారాయణ : ఆఁ! చాల్లే. సంతోషించాం. రాజేశ్వరి : ఆవలిస్తే ఆయన పేగులు లెక్కెడతాడని నేను ముందే చెప్పలేదండీ? సత్యనారాయణ (ఉడుకుబోతు తనంతో) : ఔను! ఆ తానులోదేగా ఈ ముక్క రాజేశ్వరి : చాల్లెద్దురూ! మా నాన్నతో వ్యవహారమంటే నాటకాల్లో వేషాలనుకున్నారా?

(రాజేశ్వరి గదిలోకి వెళ్ళిపోతుంది. సత్యనారాయణ సిగరెట్టును ఆశ్రయిస్తాడు.

బండి భీమన్న (వీధిలోనుంచి) : బాబయ్యా! సత్యనారాయణ (కోపంగా) : ఎవర్రా అది? బండి భీమన్న ( చావడిలోకి వచ్చి) : బండి తోలుకొచ్చా, బాబయ్యా!

సత్యనారాయణ :  ఎల్లుండి పొద్దున రమ్మంటే ఇప్పు డెందుకొచ్చావ్! వెధవా! పో పో! బండి భీమన్న :  

అయ్యొ! ఇదేటి సిత్రం, బాబయ్యా!

సత్యనారాయణ :  పొమ్మనేది నిన్ను కాదట్రా!

(కోపంగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. బండి భీమన్న (బుర్ర గోక్కుంటూ వెనకడుగు వేస్తూ) : సిత్తం! సిత్తం! కోపం సెయ్యకండి, బాబయ్యా! మరిగలే ఎంకట్రామయ్య బాబయ్య... సత్యనారాయణ (ముందు కురికి, భీమన్న మెడపై చెయ్యివేసి) : డాం పూల్! పోతావా, లేదా? బండి భీమన్న : పోతున్నా, బాబయ్యా! పోతున్నా! (చకచక సింహద్వారం వైపుకు నడుస్తాడు. దాటుతూ) : ఇదేదో సాలాసిత్రంగానే వుందే! రాజేశ్వరి (పడకగది గుమ్మంలోకి వచ్చి) : ఏమిటండీ, అది? పాపం! మధ్య వాడేం చేశాడు? సత్యనారాయణ : చాల్లే! నువ్వు కట్టి పెట్టు! బండి భీమన్న (సింహద్వారాన్ని (వీధిలోనుంచి "సత్యనారాయణా!” అంటూ నాగేశ్వరరావు కేక. సత్యనారాయణ : మళ్ళీ ఎందుకో తయారౌతున్నాడు, ఈ శనిగాడు! (పడమటింటి గుమ్మంలో నిలబడివున్న రాజేశ్వరి చాటుకు వెడుతుంది. నాగేశ్వరరావు (చావడిలోకి వచ్చి) : ఇప్పుడేనా ప్రయాణం? నాగేశ్వరరావు : అయితే, మీ పత్రిక తెప్పించాలనుకుంటున్నా. నెల చందా యెంత? రెండుంబావలా కాదూ? సత్యనారాయణ (విసుగ్గా, కోపంగా) : ఊఁ! (సత్యనారాయణ జవాబు చెప్పడు. నాగేశ్వరరావు : ముందు ఒక నెలపాటు తెప్పించి చూస్తాలే. (జేబులోనుంచి డబ్బు తీస్తూ) కాస్త దీన్ని మీ ఆఫీసులో కట్టు. సత్యనారాయణ : నా చేతికి దేనికి? మనియార్డర్ ద్వారా పంపించు. (పైక మివ్వబోతాడు. నాగేశ్వరరావు : ఆఁ! రెండుంబావలా చందాకి రెండణాల మనియార్డర్ కమీషన్ దండగ దేనికి? మీ పత్రికే, మీ ఆఫీసే కదూ? ఏమంత శ్రమ? కాస్త కడుదూ! సత్యనారాయణ : ఉహుఁ! నువ్వే పంపించు. కావాలంటే, ఆ గెండణాలు నే నిస్తా! నాగేశ్వరరావు (నవ్వుతూ) : ఏదో పనిలో పని చేస్తావనుకున్నా గాని... వెంకట్రామయ్య (పడమటింటిలోనుంచి వస్తూ) : ఏమిటిరా అబ్బాయ్? నాగేశ్వరరావు : ఎలాగూ తమ ఆఫీసుకు వెడుతున్నాడు గదా అని, వాళ్ళ పత్రిక్కి ఒకనెల చందా కట్టమని నేను పైక మివ్వబోతే.... వెంకట్రామయ్య : లేదురా! హడావుడి ప్రయాణమౌతున్నదని కూకలేసి ప్రస్తుతానికి నేనే ఆపుచేయించా. నాగేశ్వరరావు : మరి ఆమాట చెప్పడేం! అందువల్లే కాబోలు చెడ్డ చికాగ్గా వున్నాడు. (సత్యనారాయణతో) సరే, ఇంకా రెండు, మూడు రోజులపాటు వుంటావుగా! రేపొచ్చి కనబడతాలే. కరణంగారింటికి తొందర పనిమీద పోతున్నా. (నాగేశ్వరరావు వెళ్ళిపోతాడు. ఇక అక్కడ వుండడానికి ముఖంచెల్లక, గట్టిగా సిగరెట్టుదమ్ము పీకుతూ సత్యనారాయణ పడక గదిలోకి చక్కాపోతాడు. దీన్ని చూచి, తల పంకిస్తూ వెంకట్రామయ్య చిరునవ్వు నవ్వుతాడు). వెంకట్రామయ్య (మంచంపై కూర్చుని, సగంచుట్టి జేబులో పడవేసిన చుట్ట పైకితీసి, దాన్ని చుట్టడాన్ని పూర్తిచేస్తూ) చిట్టెమ్మా! రాజేశ్వరి (గదిలోనుంచి) : వస్తున్నా, నాన్నా! వెంకట్రామయ్య : నువ్వు నాకొక ముచ్చట తీర్చాలమ్మా! పెద్దపిల్ల కడుపు పండనేలేదు, రెండోదానికీ, మూడో దానికీ అంతా ఆడపిల్లలే. మరి, నీ కడుపు నైనా ఒక మగపిల్లవాడు పడితే... రాజేశ్వరి : ఊఁ! చాల్లే, నాన్నా! (మాట అంటూనే వస్తుంది. వెంకట్రామయ్య : అంత సిగ్గు దేనికమ్మా! ఇలా చూడు! తాతకు దగ్గులు నేర్పడానికి ఒక మనమడు కావొద్దూ ? (రాజేశ్వరి ముసిముసి నవ్వులతో నిష్క్రమిస్తుంది. వెంకట్రామయ్య తృప్తితో చుట్ట ముట్టించి, గుప్పుగుప్పున పొగ వదలుతూ వుండగా - తెర)


  ఇంటిగుట్టు (లైట్ కామెడీ)

పాత్రలు: శివరావు - బ్యాంకి గుమాస్తా, కృష్ణవేణి - శివరావు భార్య,వెంకాయమ్మ - అతని తల్లి, శ్రీరాములు – ప్లీడర్ గుమాస్తా,సత్తిగాడు, క్లబ్ ప్యూన్. పచారు కొట్టు గుమాస్తా స్థలం : శివరావు అద్దెకున్న భాగంలో ఒక గది కాలం: వర్తమానం అది శివరావు అద్దెకున్న భాగంలో పెద్ద గది. కుడిచేతివైపుది వీధితల వసారా, ఎడమచేతివైపుది వెనక వక్క వసారా. వంటిల్లు వెనకపక్క వసారాలో సగం భాగమే. ఉన్నది ఒక్క గదే కనక, అది పెద్దదైనా, ఒక మంచంతో, ఒక వెదురు పుల్లల టేబుల్ తో, ఒక ఈడిచెయితో, ఒక కుర్చీపీటతో, రెండు కుర్చీలతో, నాలుగైదు పెట్టెలతో ఇరకాటంగా వుంటుంది. తెర లేచిన క్షణానికి సినిమా పాట పాడుకుంటూ, శివరావు ప్రవేశిస్తాడు. అతడు యించుమించు పాతికేళ్లవాడు. సన్నగా, పొడుగ్గా, నాజుకైనవాడు, నీటుగోటులు హెచ్చు. లోతులేనివాడు కాబట్టి, ఇట్టే ఉబ్బిపోగలడు; ఇట్టే కుంగిపోగలడు. సూట్ వేసుకున్నాడు. మిఠాయి పొట్లాలతో నింపిన గుడ్డ సంచి వెంట తెచ్చాడు) శివరావు (చేతిలోని గుడ్డసంచి టేబుల్ మీద పెడుతూ) : కృష్ణా! కృష్ణా! (హాట్ తీసి, చెలాకీగా చిలక కొయ్యపైకి విసిరివేసి) అమ్మా! అమ్మా! క్షణం ఆగి) ఎవ్వరూ పలకరు. ఎక్కడి కెళ్లారో? (ఈలవేస్తూ, టై కొంచెం వదులు చేసుకుని, మరింత బిగ్గరగా) కృష్ణా!! (వెనక వాకిలిగుండా కృష్ణవేడి వస్తుంది. ఆమె పద్దెనిమిదేళ్ల పల్లెపడుచు. కాని, వేష భాషలలో బస్తీ కాపురం తళుకు బెళుకులు కొంతవరకు కనబడుతూ వుంటాయి.

కృష్ణవేణి (ముక్తసరిగా) : దేనికండీ? శివరావు : తమ రేం చేస్తున్నారేమిటి? బదులే లేదు! కృష్ణవేణి : చెయ్యడానికి నాకు మ రేముంది? వంట చేస్తున్నా, శివరావు : నీ కొక శుభవార్త తెచ్చా! ఏమిటో చెప్పుకో? కృష్ణవేణి : ఏమి టది? మీరే చెప్పండి. శివరావు : ఉహుఁ! నువ్వు చెప్పుకోవాలి. కృష్ణవేణి : బాగుంది. నామొహం నా కేం తెలుసు? శివరావు : ఊహించుకు చెప్పు. (కృష్ణవేణి చెప్పనన్నట్టు తల తిప్పుతుంది. శివరావు : ఉహుఁ! చెప్పుకోవాలి. కావాలంటే మూడు ఛాన్సు లిస్తా. కృష్ణవేణి : నా కేమీ వొద్దులెండి. శివరావు : అహం! చెప్పుకోవాలి. ఏదీ... వన్! కృష్ణవేణి : చాల్లెదురూ! శివరావు : టూ! కృష్ణవేణి : చెబితే చెప్పరాదా? లేకపోతే, మానరాదా? ఏమిటీ నన్ను ఆడించడం? శివరావు (నవ్వుతూ) : త్రీ! కృష్ణవేణి : పిచ్చిదాన్ని చేసి ఆడించండి! ఆడించండి!! శివరావు : ఛా! ఏమిటది? సర్లే! నువ్వు చెప్పుకోలేవన్న మాట! మరి, నే చెప్పనా? కృష్ణవేణి : కొందరి కళ్ళకు కోతికంటె కూడా కనాకష్టమైనదాన్ని గానే కనబడుతున్నా లెండి! శివరావు : వద్దన్న వాళ్ళకి చెప్పడం దేనికి? తిరిగి వంటింటిలోకి నడవండి! కృష్ణవేణి : రమ్మన్నా, పొమ్మన్నా మీకే చెల్లు! శివరావు : ఆడించడానికి కోతివి కాదుగా! కృష్ణవేణి (చేతుల్ని విడిపించుకుని) : వద్దులెండి. (వెనక వసారావైపు ఒక అడుగు వేస్తుంది. శివరావు (రెక్కపట్టి చెంతకు లాక్కుంటూ) : దేవిగారికి... కృష్ణవేణి : దేవీ లేదు! గీవీ లేదు. ఈ దెయ్యపు గుడ్లదానికి అంత పెద్ద పేరు దేనికిలెండి! శివరావు : ఏం కృష్ణా! కోప మొచ్చినట్టుందేం? కృష్ణవేణి : నాకుతోడు కోపం కూడానా? శివరావు : చీర తేలేదనే ఇంత ఆగ్రహం? కృష్ణవేణి : చీరా గీరా నే తెమ్మన్నానటండీ? శివరావు : నేనే తెస్తానన్నాననుకో. కాని, శుభవార్త వెంటనే చెప్పాలని ఆఫీసునుంచి ఇవ్వాళ సరాసరి ఇంటి కొచ్చా. రేపు తప్పకుండా నీ కొక ఉప్పాడ జరీచీర కొనుక్కొస్తాగా! కృష్ణవేణి : నా కొద్దులెండి. శివరావు (కృష్ణవేణి గుండెదగ్గిరిగా చెవి పెట్టి, ఏదో వింటున్నట్టు నటించి) : నోరు వద్దంటున్నా గుండె మాత్రం “తే! తే!” అంటూ కొట్టుకుంటున్నదే! కృష్ణవేణి (ఒక అడుగు వెనక్కు జరిగి) : కట్టండి; ఇంకా తాటాకులు కట్టండి. ఎవరికైనా నేనేగాకువ? శివరావు : ఈ పూట విసుగ్గా వున్నావేఁ? సర్లే! శుభవర్తమాన మేమిటో చెప్పనా? కృష్ణవేణి : చెత్తే చెప్పండి; మాస్తే మానండి. నన్నడిగి చెబుతారేమిటి? శివరావు : చెబితే నా కేమిస్తావ్? కృష్ణవేణి : నాదగ్గ రేముంది మీ కివ్వడానికి? శివరావు : ఉంటే యిస్తావా? కృష్ణవేణి : ఏమి టది? శివరావు: ఒక... కృష్ణవేణి : నాకు చెప్పొద్దులెండి. (ముద్దు అన్నట్టుగా పెదవులతో సూచిస్తాడు. (వెళ్ళిపోబోతుంది. శివరావు(భుజంపై చెయ్యివేసి ఆపి):ఎక్కడికలా పరిగెత్తుతానంటావ్? కాస్త ఆగు! చెబుతాగాం! అయితే, మా అమ్మేదీ? కృష్ణవేణి : ఏమో, నాకు తెలవదు. శివరావు : నీకు తెలవకపోవడ మేమిటి? ఎక్కడికి వెళ్లింది? కృష్ణవేణి : ఎక్కడికీ లేదు. అదుగో! ఆ వెనక వసారాలో వున్నట్టుంది శివరావు : అమ్మా! నిన్నే! ఒకసా రిలా రా! వెంకాయమ్మ (లోపలినుంచే) : ఇప్పుడు నాతో పను లేమొచ్చాయ్ ? శివరావు : ఒకసారి రమ్మంటూ వుంటే! వెంకాయమ్మ (వస్తూ) : పానకంలో పుడకలా మీ ముచ్చట్ల మధ్య నేను దేనికి? శివరావు (వసారా వైపుగా రెండడుగులు వేసి) : అమ్మా! వెంకాయమ్మ (రాకుండానే బరువుగా) : ఆఁ! శివరావు: అమ్మా! నిన్నే! ఒక్కసారిలా రా! వెంకాయమ్మ : (లోపలి నుంచే) ఇప్పుడు నాతో పనులేమొచ్చాయ్? శివరావు : ఒకసారి రమ్మంటూ ఉంటే! వెంకాయమ్మ: ( వస్తూ) పానకంలో పుడకలా మీ ముచ్చట్ల మధ్య నేను దేనికి? (తర్వాత ఒక అరనిమిషానికి చిరిగిన చొక్కా కుడుతూ వెంకాయమ్మ వస్తుంది. ఆమె పల్లెటూరి యిల్లాలు. జీవితం అంతా కూడా గీసిగీసి సంసారం చేయడం వల్ల శుష్కించి అచ్చమైన పోయినట్టు కనబడుతూవుంటుంది. ఏదో చింతకూడా ఆమె ముఖాన్ని ఆవరించి వుంటుంది. వితంతువైనందున తెల్ల చీర, తెల్ల రవికె. వేలుముడి జుట్టు, సగం నెరసిన తల శివరావు (తల్లి ప్రవేశించగానే) : నీ కొక శుభవర్తమానం తెచ్చానమ్మా! వెంకాయమ్మ : నాకు శుభవర్తమాన మేమిటిరా? శివరావు : నా కివ్వాళ ఆఫీసులో యింక్రిమెం టిచ్చారమ్మా! వెంకాయమ్మ : మెట్టేమిటి? ఇవ్వడ మేమిటి? శివరావు : పదిహేను రూపాయలు హెచ్చించారమ్మా! ఇక నెలకి నూటతొంభై యిస్తారు. వెంకాయమ్మ : పదిహేనేనా! హెచ్చింపంటే ఏ పాతికో, ముప్పయ్యో అనుకున్నా. శివరావు (నవ్వుతూ) : మెట్టూ, గట్టూ కాదమ్మా! ఈ నెలనుంచి నాకు జీతం హెచ్చించారు. వెంకాయమ్మ : ఓహో! అదా సంగతి! శివరావు : ఆఫీసులో నాకు తప్ప మరెవ్వరికీ యివ్వనే లేదమ్మా! నన్నూ, నా పనినీ మెచ్చుకుని నా కొక్కడికే ప్రత్యేకంగా యిచ్చారు. వెంకాయమ్మ (మాట తెంచివేస్తున్నట్టు) : మంచిదిరా, అబ్బాయ్! ఇదంతా నీ పెళ్ళాం అదృష్టం. శివరావు : రేపు నీ కోడలి కొక ఉప్పాడ జరీ చీర, నీ కొక సైను చీర.... వెంకాయమ్మ : నాకు సైను చీరలూ వొద్దు; రవికెలూ వొద్దు. మీ ఆవిడకే తెచ్చుకో మరొక జరీ చీర. కృష్ణవేణి : నా కేమీ తే నఖర్లేదు. (వెనక వసారాలోకి దారితీయబోతుంది. శివరావు : ఇదుగో! కృష్ణా! బ్రహ్మానందాన్ని, మాధవరావుగార్ని, శ్రీనివాసరావుగార్ని కాఫీకి పిలిచా. వాళ్ళిప్పు డొస్తారు. బజారు నుంచి స్వీట్స్ కొనితెచ్చా గాని, కాసేదైనా సేవరీ చేసి, కాఫీ పెట్టు. కృష్ణవేణి : ఏమి చెయ్యమంటారు? ఇంట్లో యేమీ లేదు. శివరావు : మొన్నొక రోజున వాళ్లెవరో వచ్చినప్పుడు తెప్పించిన ఉప్మారవ్వ లేదూ? కృష్ణవేణి : కాస్త మిగిలింది. అదేం సరిపోతుంది? శివరావు : వస్తున్నది ముగ్గురేగాఁ? దాన్నే ఎలాగో సరిపెడుదూ. (కృష్ణవేణి వెడుతుంది. శివరావు (కోటు, టై తీసి చిలకకొయ్యకు తగిలిస్తూ) : ఈ గది ఒకసారి ఊడుస్తావమ్మా? వెంకాయమ్మ : ఇంతకు ముందేరా పనిమనిషి ఊడ్చి వెళ్ళింది. శివరావు : ఎక్కడి దుమ్ము అక్కడే ఉంది. దాని మొహం! ఇదేనా ఊడ్చడ మంటే? వెంకాయమ్మ : అది అణిగి మణిగి పనిచేస్తేగాఁ? ఇక్కడొక చీపురూ, అక్కడొక చీపురూ చేసి చక్కాపోతుంది. చూస్తూ ఊరుకోలేక అ దేమిటని నే నడిగితే మూతీ, ముక్కూ విరిచి, ఏ డెక్కిరింపు లెక్కిరిస్తుంది. నేను పెట్టి పోషించడం లేదుగా? అది నా మాటినడానికి! శివరావు : అంత వొళ్ళు పొగ రెక్కివుంటే, దాన్ని పని మాన్పించవమ్మా! వెంకాయమ్మ : నాకు దేనికిరా, అబ్బాయ్! నే నిక్క డుండొచ్చానా, పెట్టొచ్చానా? దాన్ని అదుపు చెయ్యడానికి నే నెవతిని? శివరావు : అదేమిటమ్మా! అలా అంటావ్? (వెదురు పుల్లల టేబుల్ గదిమధ్యకు లాగుతూ) అమ్మా! టేబుల్ క్లాతేదీ? వెంకాయమ్మ : ఏమోరా, నా కేం తెలుసు? ఇది నా కొంపా, గోదా? శివరావు (పడకకుర్చీని టేబుల్ దగ్గరికి తెచ్చివేసి) : కృష్ణా! (వెనక వాకిలిగుండా వెడుతుంది. కృష్ణవేణి (తిరిగివస్తూ) : దేనికిప్పుడు? ఉప్మా చెయ్యమన్నారుగా! చేస్తున్నా. శివరావు : ఆఁ! ఏం లేదు. టేబుల్ తేదీ? కృష్ణవేణి మురికై పోయిందని మొన్న చాకలికి వేశా! శివరావు : అయితే, పాత దేమైంది? కృష్ణవేణి : అ దెన్నడో చిరిగి పోయింది. శివరావు : మరి, ఇప్పు డేమిటీ చెయ్యడం? పోనీ, ఒక ఉత్తరీయమైనా కప్పుదాం. ఏదీ, ఒక టేదైనా తే! ఏమీ కప్పకపోతే, ఇది చెడ్డ అసహ్యంగా వుంటుంది. (పై రెండు ట్రంకుల్ని కిందికి దించి, అడుగుదాన్ని ఉత్తరీయం కోసం కృష్ణవేడి గాలిస్తూ వుంటుంది. శివరావు కుర్చీపీటను ఈడ్చుకొచ్చి, కుర్చీలను వాటిని టేబుల్ దగ్గర చక్కగా అమర్చడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. కృష్ణవేణి : డబ్బుకు పాలవాడు తొందర చేస్తున్నాడండీ! శివరావు : ఇవ్వాళేగా ఒకటో తారీఖు. ఆ వెధవకి అప్పుడే ఏం తొందర? కృష్ణవేణి : పోయిననెల వాడికి సగమేగదండీ యిచ్చాం. వాడూ సతాయిస్తున్నాడు. నేతివాడికి కూడా బకాయిపెట్టాం. శివరావు : కాస్త వెనకా ముందూ అయితే, వెధవలు ఆగలేరూ? ఈ అలగా జనంతో యింతే! మర్యాదా మన్నూ లేదు. కృష్ణవేణి : కూరగాయలదైతే బతక నివ్వడమే లేదు. దానికి పాత బాకీతో చేరి నాలుగు రూపాయలదాకా అయింది. తెల్లవారేసరికి రాక్షసిలా వచ్చి అది వాకిట్లో కూర్చుంటుంది. శివరావు : రానీ, వెధవముండని! దానిడబ్బు దానిముఖాన గిరగిర తిప్పి కొట్టి, ఇక మా గడప తొక్కొద్దని మెడమీద కర్రవేసి గెంటుతా! కృష్ణవేణి : పచారీ కొట్టు గుమాస్తా ఇవ్వాళప్పుడే నాలుగు దఫాలొచ్చి వెళ్ళాడు. వాళ్ళిఖ ఆగరట. శివరావు : మొన్నేగా ఒక యిరవై వాడికి జమ కట్టింది? కృష్ణవేణి : ఏమో? ఇంకా పాతికదాకా యివ్వాలట! శివరావు : దొంగ లెక్కలు రాస్తున్నాడు కాబోలు! స్కౌండ్రల్! రేపు వెళ్ళి, వాళ్ళ అంతు కనుక్కుంటా! కృష్ణవేణి : ఏ నెల కా నెల ఎవళ్ళ డబ్బు వాళ్ళకి పారేస్తే, మనకు ఏ చికాకూ వుండదుగదండీ? శివరావు : ఆ జీతమేమో తెచ్చి నీ చేతికే యిస్తున్నాగా! ఆరిందావి! అంతా చక్కగా దిద్దుకురారాదూ? కృష్ణవేణి : అంతే లెండి! నేను మంచిదాన్నయితే మీ కిన్ని చిక్కు లెందుకొస్తాయ్? పాపం! నావల్ల మీరు... (కళ్ళను గిర్రున నీళ్ళు తిరగ్గా, మాటమధ్యలో ఆగిపోతుంది. శివరావు : కృష్ణా! (దగ్గరకు లాక్కుని) నువ్వు వొట్టి వెర్రిదానివి సుమీ! కృష్ణవేణి (పట్టు విడిపించుకుని, దూరంగా జరిగి, కోపంగా) : చాల్లెద్దురూ! ముందు జీతం తెచ్చిస్తున్నారేమో! తర్వాత సిగరెట్లకనీ, సినిమాలకనీ గుంజు కొడుతున్నారేమో! అదేదో మీ దగ్గరే పెట్టుకోండి; మీరే వాడుకోండి. మీరు సంపాయించి తెస్తుంటే కిందూ మీదూ కానకుండా నేను ఖర్చు చేస్తున్నానని నన్నందరు ఆడిపోసుకోవడం దేనికి? శివరావు (అనునయిస్తూ) : నేను తలకుమించిన ఖర్చుల్ని చేస్తూవుంటే - పాపం! నువ్వేం చేస్తావులే. తప్పు నాదే! కృష్ణవేణి : అబ్బే! మీ తప్పేముంది లెండి? ఇంతకూ నేను దరిద్రపుగొట్టుదాన్ని. శివరావు : ఛీ! ఏమిటా మాటలు? కృష్ణవేణి (ట్రంకును వెదకడం తిరిగి ప్రారంభించి, దాని అడుగునుంచి ఉత్తరీయాన్ని తీసి) : ఇదుగోనండీ ఉత్తరీయం! శివరావు (దాన్ని అందుకొని, మడత విప్పిచూచి) : అబ్బే, ఇదీ చిరిగిందేనేఁ! వేరే లేదూ? కృష్ణవేణి (ట్రంక్ మూతవేస్తూ) : మ రెక్కడిదండీ? మీకున్నదే అదొక్కటైతే! శివరావు : ఊఁ! సరే! (కృష్ణవేణి ట్రంకుల్ని తిరిగి దొంతరగా పెడుతూ వుంటుంది. చిరుగులు కనబడకుండా, ఉత్తరీయాన్ని మడత పెట్టి, టేబుల్ పై పరచడానికి శివరావు ప్రయత్నిస్తూ వుంటాడు. శివరావు : అయితే, టిఫిన్ తయారైందా? కృష్ణవేణి : మొదలెట్టిన యెడ మెక్కడండీ? ఇంతలోనే మీరు పిలిస్తిరయ్యే! శివరావు : మంచిది - త్వరగా సిద్ధం చెయ్యి! అల్లం సన్నగా తరిగి, జోరుగా వెయ్యి. డాక్టరు శ్రీనివాసరావుగారికి అల్లమంటే చాలా యిష్టం. జీడిపప్పుకూడా బాగా వెయ్యాలి. కృష్ణవేణి : ఇంట్లో బద్దయినా లేదు, బాగా నే నేం వేస్తాను? శివరావు : గట్టి చిక్కేనేఁ! జీడిపప్పు లేందే ఉప్మాకు రుచీ పచీ వుండదు. ఆ బ్రహ్మానందం అసలే ఉలిపి నోటివాడు. ఊరికేనే పేర్లు పెడతాడు. కృష్ణవేణి : అయితే, త్వరగా వెళ్ళి, రెండు తులాలు కొనుక్కురండి. శివరావు : ఇప్పుడు టైం లేదులే. ఎలాగో పూర్తిచేశెయ్! (కృష్ణవేణి వెనక గుమ్మంగుండా వెడుతుంది. శివరావు : ఛా! ఎలా మడత పెడదామన్నా ఈ పాడు చిరుగు తప్పడమే లేదు! వెంకాయమ్మ (చీపురుకట్టతో తిరిగివచ్చి) : దుమ్ము పైకొస్తుందేమో. కాస్త తప్పుకోరా, అబ్బాయ్! శివరావు : రాదులే, అమ్మా! ఆ మూలనుంచి ఊడ్చుకురా! (వెంకాయమ్మ ఒక మూలనుంచి గది జిమ్మడాన్ని ప్రారంభిస్తుంది. శివరావు (ఉత్తరీయాన్ని నాలుగ్గా మడత పెడుతూ) : ఇవ్వాళ మనింటికి పెద్ద పెద్దవాళ్ళొస్తున్నారమ్మా! వెంకాయమ్మ : మంచిదిరా, అబ్బాయ్! శివరావు (చిన్నదిగా మడత పెట్టడం వల్ల చాలీ చాలకుండాపోయిన ఉత్తరీయాన్ని టేబుల్ మీద వేసి, దాని అంచును ఒకవైపున కిందికి లాగబోతే, రెండోవైపున అది పైకి పోతూవుండగా); బ్రహ్మానందాన్ని పిలిచానమ్మా! మే మిద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము. వాడిప్పుడు మునిసిపల్ కమీషనర్. నెలకు నాల్గు వందల జీతం తెచ్చుకుంటున్నాడమ్మా! వెంకాయమ్మ : వాడి పెళ్ళాం అదృష్టమది! శివరావు : మాధవరావుగారూ వస్తున్నా రమ్మా! ఆయన త్వరలో డిప్టీ కలెక్టర్ కాబోతున్నాడు. నన్ను మించి చదువుకున్నవాడేమీ కాదు. అయినా, అప్పుడే పెద్ద పదవిలోకి పోబోతున్నాడు. ఆయనింకా పైకి పోతాడు. వెంకాయమ్మ : ఊఁ! చదువులు సమానమైతే సరేనా? నసీబు సమానం కావొద్దూ? శివరావు : శ్రీనివాసరావుగార్ని కూడా రమ్మన్నా. ఆయన పెద్ద డాక్టరు. నెలకి వెయ్యిదాకా కళ్ళ జూస్తున్నాడు. వెంకాయమ్మ : సర్లే! ఊళ్ళోవాళ్ళ సంపాదన చూసి మురిస్తే, మన కేం వొరుగుతుంది లేరా, అబ్బాయ్! శివరావు : అది కాదమ్మా! పెద్దవాళ్ళ స్నేహముంటే, ఎందుకైనా మంచిది కాదూ? వాళ్ళ శిఫార్సు దొరికితే ఉద్యోగంలో ఎంత పైకైనా పాకి పోవచ్చు. వెంకాయమ్మ : ఏమోరా, అబ్బాయ్? ఆ గొడవలేమిటో నా కేం తెలుస్తాయ్? శివరావు : పెద్ద పెద్ద వాళ్ళందరికీ మా బ్యాంకిలో ఖాతా లున్నా యమ్మా! అందువల్లనే పెద్దవా ళ్లెందరో నాకు స్నేహితులయ్యారు. (బయటి నుంచి “శివరావుగారూ” అని కేక. శివరావు : మాధవరావుగా రనుకుంటా. అన్న వేళకంటే ముందే వచ్చారు. ఇం కేం వూడుస్తాలే, అమ్మా! నువ్వెళ్ళు (వెంకాయమ్మ చీపురుకట్ట అక్కడే పారవేసి వెళ్ళబోతుంది. శివరావు : అమ్మా! అదేమిటి? ఆ చీపురుకట్ట తీసుకుపో. (వెనక్కువచ్చి వెంకాయమ్మ చీపురుకట్ట తీసుకు వెడుతుంది. “శివరావు గారూ!” అని తిరిగి బయటి నుంచి కేక. శివరావు : మాధవరావుగారా? రండి, రండి. మా గృహం పావనమైంది. . పచారీ కొట్టు గుమాస్తా (లోపలికి వస్తూ) : నేనండీ పచారీకొట్టు పరంధామయ్య గుమాస్తాని. శివరావు (ముందు తెల్లబోయి, అంతలోనే కోపం తెచ్చుకుని) : ఏమి టయ్యా! వేళా పాళా లేకుండా మళ్లీ తయారయ్యావ్! దేనికీ ఇన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగడం? పచారీకొట్టు గుమాస్తా : ఎందుకండీ మధ్య నా మీద కోపం? షాహుకారు వెళ్లిరమ్మంటే నే నొస్తానా? నా అంతట నేనే వొస్తానా? శివరావు : మొన్నేగా ఒక యిరవై జమ కట్టింది. ఇంతలోనే ఏమి తొంద రొచ్చింది? పచారీకొట్టు గుమాస్తా : ఇంకా ఇరవై అయిదు రూపాయల తొమ్మిదణాల ఏడు పైసల బాకీ వుంది. సంవత్సరాది వస్తున్నది. కొత్త ఖాతా పుస్తకాలు పెట్టుకోవాలి. పాత బాకీలన్నీ అణా పైసలతో సహా చుప్తాగా వసూలుచేసుకు రమ్మని మా షాహుకారు దండిస్తున్నాడు. శివరావు : మా దేమీ పాతబాకీ కాదేఁ? పచారీ కొట్టు గుమాస్తా : పాతదో కొత్తదో, మా షాహుకారు మరి ఆగడండీ! శివరావు : సర్లే! ఆ లెక్కా డొక్కా యేమిటో చూచి, రేపే బాకీ ఫైసల్ చేస్తానని చెప్పు. పచారీ కొట్టు గుమాస్తా : చిట్టా, ఆవర్జాలు చూసి మేము సరిగానే లెఖ్క వేశామండీ. మా లెఖ్ఖలో తేడా వొస్తుందని ఇంతవర కెవ్వరూ అనలేదు. శివరావు : పోనీ, ఇప్పుడు నే నంటున్నాగా! సరే, ఇఖ వెళ్ళు. ఏమో ననుకున్నా! మంచి మర్యాదస్తులే. పచారీకొట్టు గుమాస్తా : ఇది లోకంలో రివాజే లెండి. బాకీ అడక్కపోతే మర్యాదస్తులు. అడిగితే..... శివరావు : చాల్లే! అధికప్రసంగం చెయ్యకు. పచారీ కొట్టు గుమాస్తా : అడిగితే మీకు కోపం, అడక్కపోతే ఆయనికి కోపం.ఈ బాకీ వసూళ్ళంతటి పాడుపని మరి లేదు! శివరావు (తెప్పిరిల్లడానికా అన్నట్టు ఒక క్షణం ఆగి) : అమ్మా!... అమ్మా! వెంకాయమ్మ (వస్తూ) : ఎందుకురా, అబ్బాయ్! శివరావు : గది సగమే ఊడ్చి వెళ్ళావ్. మళ్ళీ ఒకసారి ఆ చీపురు పట్టుకురా! వెంకాయమ్మ : ఎవ రేమిటిరా, ఇప్పుడొచ్చి వెళ్ళింది? శివరావు : ఆఁ! ఎవరూ లేదమ్మా! పచారీకొట్టు గుమాస్తాగాడు. పుట్టి మునిగినట్టు ఇంటి చుట్టూ తెగ తిరుగు తున్నాడు - బుద్దిలేని వెధవ! వెంకాయమ్మ : వాళ్ళకి బాకీవుంటే వాళ్ళు తిరగరట్రా? కాస్త వెనకా ముందూ చూసి కాపరం చేసుకోవాలి. “ఆడపెత్తనం తంబల దొరతనం” అన్నారు. (చీపురుకోసం వెడుతుంది. శివరావు (చిలక కొయ్యనున్న కోటుజేబులోనుంచి చిన్న దువ్వెన తీసుకుని, తల దువ్వు కుంటూ) : కృష్ణా! (కృష్ణవేణి పలకదు. చీపురుతో వెంకాయమ్మ మాత్రం వచ్చి, గది జిమ్మడాన్ని పూర్తిచేస్తూ వుంటుంది. శివరావు (మొదటిసారికంటె బిగ్గరగా) : కృష్ణా! (“వస్తున్నా!” అంటూ కృష్ణవేణి ప్రవేశిస్తుంది. శివరావు : ఏఁ! పలకవ్. ఏం చేస్తున్నావ్? కృష్ణవేణి : వినబడలేదు; ఉప్మా చేస్తున్నా. శివరావు : అయితే, మనకి మూడే కుర్చీలున్నాయ్. మరొకటి కావాలి. పక్కింటి వాళ్ళ నడిగి ఒక కుర్చీ తీసుకురా! కృష్ణవేణి : ఏమో! వాళ్ళని నమ్మడానికి వీల్లేదండీ! మంచి గుణాన వుంటే యిస్తారు; పోతే విసుక్కుంటారు. (వీధి వాకిలిగుండా వెడుతుంది. శివరావు : అమ్మా! పింగాణీ ప్లేట్లు ఎక్కడున్నవో చూసి, కడిగి పట్టుకురా! వెంకాయమ్మ : మీ ప్లేట్లు, గీట్లు ఎక్కడున్నవో, ఏమిటో నాకు తెలవదురా, అబ్బాయ్! శివరావు : వంటింటి అలమరలో లేవూ? వెంకాయమ్మ : వోటి చేతులదాన్ని. చెయ్యిజారి పగిలే మీచేత మాటలు పడాలి, మీ ఆవిణ్ణి రానివ్వరా! అది తెస్తుందిలే! (గది జిమ్మడాన్ని పూర్తిచేసి వెళ్ళిపోతుంది. వెనక వాకిలిగుండా చీపురుతో ఆమె వెళ్ళిపోవడమేమో, తల వాకిలిగుండా కృష్ణవేణి కుర్చీతో రావడమేమో. శివరావు : మా అమ్మ చికాగ్గా వుంది. టీ పార్టీకి డబ్బు తగలేస్తున్నాననే కాబోలు! కాని, పెద్దవాళ్ళు మనింటి కెందు కొస్తారు? ఇవ్వాళ ఏదో సాకు దొరికింది కనక, వాళ్ళని మనం పిలవడం పడింది. పిలిచినా వాళ్ళు అంద రిళ్ళకు వెళ్ళరు. పిలిచింది మనం కాబట్టే “ఎందుకోయ్! నీకు లేనిపోని ఖర్చు!” అన్నారు. వాళ్లు అనవలసిన మాటే అది! మా ఆఫీసు బడుద్ధాయిల మాదిరిగా యింక్రిమెంట్ వచ్చిన మాట వినగానే “మా కెప్పుడు టీపార్టీ చేస్తావ్? మా కెప్పుడు డిన్న రిస్తావ్?” అంటూ ఈగల్లా ముసురుకోడానికి వాళ్ల కేం తక్కువ? (కృష్ణవేణి ఔననిగాని, కాదనిగాని అనకపోవడాన్ని గమనించి) ఏం, కృష్ణా! పలకవ్, ఉలకవ్! ఇది వొట్టి దుబారేనని అత్తాకోడళ్ళిద్దరు కలిసే తీర్మానించుకున్నారేమిటి! కృష్ణవేణి : అడక్క అడక్క మా అత్తాకోడళ్ళమాటే అడగాలి! శివరావు : సర్లే! ఏవీ పింగాణీ ప్లేట్లు పట్టుకురా! స్వీట్స్ వాటిలో పెట్టి సిద్ధంగా వుంచుదాం. (కృష్ణవేణి వెడుతుంది. శివరావు తన వెంట తెచ్చిన గుడ్డసంచి అందుకుని, దానిలోనుంచి ఒక పొట్లాన్ని పైకి తీసి, దాన్ని విప్పుతూ వుంటాడు. చిన్నవి, పెద్దవి ఎనిమిది ప్లేట్లతో కృష్ణవేణి తిరిగి ప్రవేశిస్తుంది. శివరావు (ప్లేట్లు నింపి) : ఉప్మా అయిందా?

కృష్ణవేణి :  ఆఁ!   

శివరావు : ఈ ప్లేట్లు అన్నీ అన్ని సైజులుగా వున్నాయేఁ! కృష్ణవేణి : ఏం సైజులో, మన కున్న వవీ. శివరావు (ఒక దాన్ని యెత్తి) : దీని అంచు నొక మొర్రి వున్నది (మరొకదాన్ని పరీక్ష చేస్తూ) ఇది బీటిచ్చింది. (వేరొకదాన్ని తీసి) ఇదేమో వంకర తిరిగింది. (ఇంకొక దాన్ని వేలితో చూపుతూ) దానికి రంగు పోయింది. వీటిని చూశాక ఆ బ్రహ్మానందం అందరివద్ద మనల్ని రేపటినుంచీ వెక్కిరిస్తాడు! కృష్ణవేణి : ఈ కాస్తకే వెక్కిరించాలీ! మరి అలాంటి వాణ్ణి - మనకు లేని పోని కుమ్ము - మీరు పిలవడ మెందుకండీ? శివరావు : పిలవకుండా వదిలి పెడితే వాడు మరింత అల్లరి చేస్తాడు. మా కాలేజీ హాస్టల్ లో వాడి నోటి కందరూ జడిసేవారు. కృష్ణవేణి : మంచి స్నేహితుడే సంపాయించారు! శివరావు : నీకు తెలవదు. వాడు భలేవాడు. అయితే, కాఫీ పెట్టావా? కృష్ణవేణి : ఆఁ! (ఇద్దరూ చేరి ప్లేట్లలో స్వీట్సు పెడుతూ వుంటారు. శివరావు : డికాక్షన్ చిక్కగా పెట్టు. ఫిల్టర్ చేస్తే తప్ప, మాధవరావుగారికి కాఫీ నచ్చదు. ఫిల్టర్ చెయ్యరాదూ? కృష్ణవేణి : మనకి ఫిల్టరెక్కడిదండీ? శివరావు : పక్కింటి వాళ్ళకు లేదూ? కృష్ణవేణి : వాళ్ళివ్వరండీ? కుర్చీ అడిగినందుకే ఆవిడ ముఖం ధుమధుమ లాడింది. ఉప్మాకూడా ప్లేట్లలో వొడ్డించివుంచనా? శివరావు : అందర్నీ రానీ! ఇప్పటినుంచీ వడ్డించి వుంచితే చల్లారి పోతుంది. కృష్ణవేణి : అందరూ వొస్తారంటారా? శివరావు : మనం పిలవడమూ, రాకపోవడమూనా? మన కెంత పలుకుబడి లేకపోతే, చిన్నపనికీ, పెద్దపనికీ మా ఏజంట్ నన్ను ప్రతి ఆఫీసర్ దగ్గిరికీ తరుముతాడు! ఎంత పెద్ద ఆఫీసరైనా మనం వెళ్ళామంటే, ముందు మన పనిచేసి పంపిస్తాడు. మన సూటూ, మన బూటూ, మన హ్యాటూ చూసేసరికి ఎంతటివాడైనా సీటిస్తాడు. నువ్వేమైనా అనుగాని, వేషంలో కొంత డాబూ దర్పం కావాలి. లేకపోతే, మన ముఖం చూసేవాడెవడు? కృష్ణవేణి : ఏం డాబూ, దర్పాలో! ఊరినిండా బోలెడన్ని అప్పులూ, మనమున్నూ! శివరావు : ఇలాంటి యింక్రిమెంట్లు త్వరత్వరగా మరి రెండొస్తే ఈ అప్పు లేం చేస్తాయ్! వెధవప్పులు! (చిటిక వేస్తూ) ఇట్టే తీర్చిపారెయ్యం! కృష్ణవేణి : ఆఁ! రెండేళ్ళకు ఇప్పుడేగా కాస్త జీతం హెచ్చించారు. శివరావు : మన సత్తా వాళ్ళకి ఇప్పుడిప్పుడేగా తెలిసొచ్చింది! ఇఖ, చూడు! చకచకా, చకచకా పైకి ఎలా వెళ్ళిపోతామో! నాలుగేళ్ళు పోయేసరికి ఏజెంట్ పని! అప్పుడొక కారు, బంగళా, టెలిఫోన్, నౌకర్లు, చాకర్లు..... కృష్ణవేణి : ఎవరైనా వింటే గప్పాలనుకుంటారు. అయినప్పు డనుకోవచ్చు, ఇప్పుడెందుకులెండి - ఈ మాటలన్నీ. శివరావు : ఆగు! నువ్వే చూద్దువుగానిగా! ఈ యేడు నాకు యింక్రిమెంట్ వచ్చి తీరుతుందని నేనంటే, నువ్వు నమ్మావూ? అలాగే..... (బయటినుంచి “శివరావ్!" అని కేక. శివరావు : బ్రహ్మానందం వచ్చినట్టున్నాడు. సరే - నువ్వు లోపలికిపో. కాఫీ కూడా రెడీ చెయ్యి! (కృష్ణవేణి వెడుతుంది) రావోయ్! బ్రహ్మానందం! రా! పిలవగా, పిలవగా నీ పుణ్యమాయిరి - మా యింటి కిప్పటికైనా వచ్చావ్! శ్రీరాములు (మందుసీసాతో లోపలికివస్తూ) : నేనురా, శ్రీరాముల్ని. ఏఁ! అంత కొత్త వాణ్ణి అయిపోయానూ నా గొంతు ఆనవాలు పట్టలేకపోడానికి! శివరావు : ఓరి పీనుగ! నువ్వట్రా! ఎక్కడినుంచి ఊడిపడ్డావిప్పుడు? ఆ మందెవరికి? శ్రీరాములు : మా ఆడవాళ్ళకు మొన్నటినుంచి జ్వరం తగులుతున్నదిరా! మందు తెద్దామంటే ఉదయం తీరనే లేదు. అందుకని కోర్టు పని కాగానే ఎకాయెకి డాక్టర్ గారింటి కెళ్లా. ఏమిటిరా, నువ్వేమిటో టీపార్టీ చేస్తున్నావట? శివరావు : నీ కెవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడా? శ్రీరాములు : నువ్వు చెప్పకపోతే మాత్రం దాగుతుందట్రా! ఇంతకూ విశేష మేమిటి? శివరావు : ఆఁ! మరేమీ లేదురా! ఇవ్వాళ మనకు స్పెషల్ ఇంక్రిమెంట్ వచ్చింది. అందుకని.... శ్రీరాములు : అదృష్టవంతుడివిరా! అయితే, టీపార్టీకి నన్ను పిలవనే లేదేం! శివరావు : నువ్వు కనబడి యేడిస్తేనా? శ్రీరాములు : అంతేలే! నీకు నే నిప్పుడు కనబడను. ఇప్పుడు నీ స్నేహాలన్నీ పెద్ద పెద్ద వాళ్ళతోనే. ప్లీడర్ గుమాస్తాగాణి నాబోటి బక్కవా ళ్ళిప్పుడు నీ కంటికి ఆనరులే. శివరావు : అఘోరించావ్! ఇప్పుడు మాత్రం మించిపోయిన దేముంది? వుండు - నువ్వుకూడా వుండరా టీపార్టీకి! శ్రీరాములు : నే నొచ్చి అడిగితే నన్ను పిలుస్తావన్నమాట! ఏం మర్యాదస్తుడివిరా! శివరావు : ఏడ్చావులేరా! బొట్టూ, కాటుకా పెట్టి పేరంటానికి పిలిచినట్టు నిన్ను పిలవాలా? అయితే, డాక్టరుగారు బయల్దేరారా? శ్రీరాములు : ఊహుఁ! లేదు. ఏదో అర్జెంటుకేసు వచ్చిందట. “నీ కది దారేగదా! రా లేనని ఆ శివరావుతో చెప్పిపో!” అని ఆయనంటే, ఇంటికైనా పోకుండా నే నిలా వచ్చా. శివరావు : అయ్యొ! ఆయన తప్పకుండా వస్తాడనుకున్నారా! ఏమిటో అంత అర్జెంటు కేసు? శ్రీరాములు : ఏమో! నాకేం తెలుసు? ఆయన చెప్పమన్న మాట చెప్పాను. శివరావు : ఏదో పెద్ద ఆటంకం కలిగివుండకపోతే, ఆయన ఆగిపోయేవాడు కాదు. మనమంటే ఆయన చాలా ఫ్రెండ్లీగా వుంటాడు. వాళ్ళ యింట్లో ఏ పార్టీ జరిగినా, ఏర్పాట్లన్నీ మనకే అప్పజెబుతాడు. శ్రీరాములు : మరి నే నెళ్ళాస్తారా! శివరావు : కాస్త ఆగరా! వెడుదువుగానిలే! శ్రీరాములు : లేదురా! వెళ్ళాలి! అదెలా వుందో, ఏమో గొడవ! పొద్దుటికే జ్వరం మంటలు మండుతున్నది. శివరావు : మాధవరావుగారు, బ్రహ్మానందంగారు మన పార్టీకి వస్తున్నారు. అలాంటి పెద్ద వాళ్లతో పరిచయం కలగడానికి ఇంత మంచి ఛాన్సు నీకు మరెలా వస్తుంది? పోనీ, కావాలంటే ఒక పావుగంట తర్వాత వెళ్ళిపోవచ్చులే! శ్రీరాములు : ఆగడానికి వీల్లేదులేరా! ఇంట్లో మందు అప్పగించి, వీలుపడితే, ఏదో ఒకవేళకు అందుకుంటాలే! కృష్ణవేణి (తిరిగి వచ్చి) : ఎవరండీ అది? శివరావు : ఆఁ! శ్రీరాములుగాడు. కృష్ణవేణి : అంటే? (వెడతాడు. శివరావు : వాడి వూరూ, మా వూరూ పక్కపక్కనే వున్నాయిలే! మా కేదో బీరకాయపీచు చుట్టాన్నని చెబుతాడు. రెండు, మూడు నెలలైంది ప్లీడరుగుమాస్తాగా వా డిక్కడి కొచ్చి. రెండో గుమాస్తాగా ఒక యాభై రాళ్ళు తెచ్చుకుంటున్నాడు. చచ్చుపీనుగ! నన్ను పూసుకు పూసుకు తిరగాలంటాడు. నే నెంత పెద్దవాళ్ళమధ్య వున్నా “ఏరా” అంటూ తయారౌతాడు. ఎప్పుడో బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళని దగ్గరికి చేరనిస్తే మన పరువు తీసేస్తారు. చేసినా స్నేహాలు పెద్దవాళ్ళతో చెయ్యాలి. ఇలాంటి ప్లీడరు గుమాస్తాగాళ్ళతోనా! కృష్ణవేణి : ఆయనేమిటో డాక్టరంటా డేమిటి? శివరావు : డాక్టర్ శ్రీనివాసరావుగారికి అర్జెంటు కేసొచ్చిందట. అందువల్ల మన టీపార్టీకి రాలేమని

ఆ శ్రీరాములుగాడి ద్వారా కబురు చేశారు.

కృష్ణవేణి : అయిందీ? అప్పుడే ఒకరు జారుకున్నారన్నమాట. తక్కిన యిద్దరేరీ? శివరావు : ఆఫీసర్లు కాదూ? వాళ్లకి ఊపిరిసలపని పను లుంటాయ్. వస్తారు కాస్త వెనకా ముందుగా. తీరుతుందో, లేదో అని నేను పిలిచినప్పుడే అన్నారు. “ఎలాగైనా సరే తీరుబాటు చేసుకొనక తప్ప”దని నేను గట్టిగా చెప్పేసరికి “ఇంత బలవంతం చెయ్యాలటోయ్?" అన్నారు. అన్న మాట తప్పే రకం కాదు; తప్పకుండా వస్తారు. శివరావు: అదెవరు? కృష్ణవేణి : ఏమోనండి! నేతివాడేమో! (బయటనుంచి “శివరావుగారూ!" అని కేక. శివరావు : ఆరి వెధవ! వీడికి వేరే వేళ కుదరలేదు కాబోలు! వీడిప్పుడు తయారయ్యాడు! (“శివరావుగారూ!" అని తిరిగి కేక. శివరావు (బిగ్గరగా) : బయటనుంచి అరుస్తావ్ దేనికి? లోపలికిరా! (కంఠస్వరం తగ్గించి) నీ కాళ్లు విరగ్గొట్టి పంపుతాలే! రా!! క్లబ్ ప్యూన్ (దణ్ణం పెడుతూ లోపలికి వచ్చి) : నేనయ్యా! సత్తిగాః! మరిగలే మాధవరావుగార్ని, బమ్మానందంగార్ని తమరు టీపార్టీకి దయసెయ్య మన్నారంట. (బుర్ర గోక్కుంటూ) కాని, ఆరి కేదో తొందరపని తగిలిందంట. ఆ మాట మీతో సెప్పిరమ్మన్నా రయ్యా! శివరావు (మనిషి చచ్చిపోయి) : ఏడ్చినట్టే వుంది! ఎక్కడున్నా రేమిరా వాళ్ళిద్దరూ? క్లబ్ ప్యూన్ : క్లబ్బులో వున్నారయ్యా. శివరావు : ఏం చేస్తున్నారురా! క్లబ్ ప్యూన్ : ఏమో నయ్యా! శివరావు : ఏమో యేమిటి? నీ తలకాయ్! వాళ్లేం చేస్తున్నారు? క్లబ్ ప్యూన్ : సెబ్రే, నన్ను తెగ్గిస్తారేమో నయ్యా! శివరావు : ఫరవాలేదురా, చెప్పు! క్లబ్ ప్యూన్ : నే సెప్పానని తమరు... శివరావు : చెప్పనులేరా! నీ కేమీ భయమొద్దు. క్లబ్ ప్యూన్ : పేదోణ్ణయ్యా! తమరు నిగ్గదీస్తే సెప్తాగాని... శివరావు : మ్! నీ కేమీ ఫరవా లేదు! నీకు మాట రానివ్వను. సరే - నువ్వు పో! క్లబ్ ప్యూన్ : వెళ్ళేస్తా నయ్యా! దయుంచండి. శివరావు : రాస్కెల్స్! క్లబ్ ప్యూన్ : ఆ రిద్దరూ పేకాటలో కూకున్నారయ్యా! శివరావు : స్కౌండ్రల్స్, (దణ్ణం పెట్టి వెళ్ళిపోతాడు. కృష్ణవేణి : వీళ్ళూ ఎగవేశా రన్నమాట. నే చెట్లే వింటారటండి? ఉత్తిపుణ్యానికి డబ్బుకు డబ్బూ ఖర్చుపోతారు; మనస్సుకి మనస్సూ హైరాన పెట్టుకుంటారు. మన యెత్తువాళ్ళతో మనం వుండాలిగాని, పై కెగరబోతే... శివరావు : ఊఁ! చాల్లే -! సంతోషించాం! పోపో!! కృష్ణవేణి : అంతే లెండి! అమ్మకీ నేనే లోకువ! కొడుక్కీ నేనే లోకువ. (కృష్ణవేణి వెడుతుంది. శివరావు “ఉస్!” అంటూ పడక కుర్చీలో జేరగిలబడతాడు. శివరావు : (పడకకుర్చీలో జేరగిలబడినవాడు, హఠాత్తుగా నిటారుగా కూర్చుని) అమ్మా.... అమ్మా! వెంకాయమ్మ (వచ్చి) : దేనికిరా, అబ్బాయ్! శివరావు : ఈ ప్లేట్లు తీసుకుపో! వెంకాయమ్మ : అదేమిటిరా? అంతా యేరీ? : శివరావు : ఆఁ! ఏం తగలడ్డారో! వీటిని పట్టుకుపో! వెంకాయమ్మ : పట్టుకొచ్చింది పట్టుకుపోలేదూ? - మీ ఆవిడొచ్చి పట్టుకుపోతుందిలే! (ఒకక్షణం ఆగి) ఎల్లుండి మంచిరోజటరా, అబ్బాయ్! నేను మన వూరు వెడతా. శివరావు : ఎందుకమ్మా, యిప్పుడక్కడికి? అక్కడేం ముంచుకు పోతున్నది? వెంకాయమ్మ : లేదురా, అబ్బాయ్ నే నెళ్ళాలి. శివరావు : రాకరాక మొన్నే గదమ్మా, నువ్వొచ్చావ్! అప్పుడే వెళ్లాలా? మరొక నెలరోజులైనా వుండగూడదూ? వెంకాయమ్మ : ఇక్కడ కిది చాల్లే. శివరావు : ఇక్కడ నీకు బాగా లేదే మమ్మా! వెంకాయమ్మ : బాగేమిటి. వోగేమిటి? ఎక్కడైనా నేను పొట్టకూటి దాన్నేగా! ఇంత పని చేయించుకుంటారేమో, ఇంత ముద్ద వేస్తారేమో! శివరావు : నిన్ను పనెవ్వరు చెయ్యమన్నారమ్మా? మహరాజులా కాలిమీద కాలువేసుకు కూర్చోక. వెంకాయమ్మ : ఆఁ! కాలిమీద కాలువేసుకు కూర్చుంటే నెత్తిని బండపెడతారు. శివరావు : ఏమి టమ్మా? ఈ పూట నువ్వు చాలా చిత్రంగా మాట్లాడుతున్నావ్! వెంకాయమ్మ : చిత్రంగా మాట్లాడ్డానికి నే నేమీ చిత్రాంగిని కాదు. (విసురుగా వెళ్ళిపోతుంది. శివరావు : మా అమ్మ ఊరు వెళ్ళిపోతానంటున్న దేమిటి? కృష్ణవేణి : ఏమో నాకేం తెలుసు? శివరావు: ఆమెతో పోట్లాడావా? కృష్ణవేణి : ఉహుఁ! శివరావు : నిజం చెప్పు. కృష్ణవేణి : లేదండీ! ఆమే ఉత్తిపుణ్యానికి న న్నన్నీ దులపరించింది. శివరావు : అకారణంగా ఆమె నీతో తన వెందుకు పెట్టుకుంటుంది? కృష్ణవేణి (వచ్చి) : దేనికండీ? శివరావు : అసలు తగవెలా ప్రారంభమైం దేమిటి? కృష్ణవేణి : ఏమో, న న్నడిగితే? శివరావు (కుర్చీనుంచి లేచి) : కృష్ణా! కృష్ణవేణి : ఆమెగారితో తగవెవరు పెట్టుకున్నారండీ? కృష్ణా, రామా అంటూ మీకు ఒక్కటే స్మరణైపోయిందని ఆమే సాధింపు ప్రారంభించింది. శివరావు : ఊరికే ఆమె ని న్నెందుకు సాధిస్తుంది? నేను అదు. ఆమె అదృష్టం వల్లనే మీకు పెద్ద చదువొచ్చిందట; నా ముంపలు మీకు పిచ్చ ఉద్యోగ మేదీ రాకుండా పోయిందిట. పెచ్చబ్బాయికి అన్యాయం చ కాన్ని ఆులు పాల్గొని, మిమ్మల్ని చదిమించిన వెలుగేమీ కనబట్టంలేదట. . ఏ చినీ కలలు ఎనైనా FENUగా అనుకుంటే, ఈ గుమాస్తాగిరి దొరికిందట. పెద్ద MANA AAVుకు పెద్ద కొలువులో చేరి, అన్నయ్యను అనుకుంటా రనుకుంటే, మీ సంపాదన మీకు exy Akుగా వుందట సరే నింగారం లేకపోయినా, అప్పుల Nomu కనబడుతున్నదట పెట్టి సోనించకపోయినా, ఏదో వొస్తూ పోతూ వుందామంటే, పరాయి కొంపకంటె కనాకష్టమై పోయిందట. శివరావు ; ఆమెను నువ్వేమి నొప్పించానో, లేకపోతే ఆమె ఇంత నిష్టూరంగా మాట్లాడేది కృష్ణవేణి ; ఏ బొట్టు పెడితే ఆ సొట్టు! నే నేమీ అనలేదండీ! శివరావు : చాల్లే! నువ్వేమీ అనకపోతే ఆమె మనస్సు కింత కష్టమెందుకు కలుగుతుంది? వొంటిమీద వెండి బంగారాలు తెగనమ్మికూడా నాకు చదువు చెప్పించింది. ఆమెను పువ్వుల్లో పెట్టి పూజించేది పోయి, మనం కాపరం పెట్టిన ఇన్నాళ్ళకొకసారొస్తే మంచి మర్యాదే చేశావ్.. కృష్ణవేణి ; నాతోడు! నే నొక్కమాటైనా అనలేదండీ! శివరావు : ఉహు! నువ్వేమీ అనలేదు; మా అమ్మే గయ్యాళి గంప, మా అమ్మే నీతో పోట్లాటకు బొడ్డుకు మసి పూసుకు కూర్చున్నది. (కక్ష వెంట నీళ్లు కాల్వ కాగా, మారు మాట్లాడకుండా కృష్ణవేణి వెడుతుంది శివరావు ; ఇంకా నా దగ్గిర దాపరికం దేనికమ్మా? ఎందుకొచ్చింది పోట్లాట ? వెంకాయమ్మ : మీ యింటి కొచ్చి, ఎదురు మీతో పోట్లాట కూడానా? శివరావు (అశాంతిగా నాలుగైదుసార్లు పచారుచేసి) : అమ్మా ! వెంకాయమ్మ (వస్తూ) : ఎందు కేమిటి? శివరావు : అత్తాకోడళ్లకు జగడ మెందుకు వచ్చిందమ్మా! వెంకాయమ్మ : మాకు జగడ మేమిటిరా? శివరావు : అదేమిటమ్మా? ఇది నీ యిల్లు కాదూ? వెంకాయమ్మ : ఆఁ! నాయిల్లు కాకేఁ! మీ ఆవిడ మా యిల్లు, మా వాకిలి, మా కంచాలు, మా మంచాలని నేనొచ్చిన కాడినుంచీ అంటున్నది - నువ్విన లేదూ? ఇక్కడ నా దేముంది? శివరావు : ఇంతేనా? మరేమైనా అనిందా? వెంకాయమ్మ : ఇది చాలదూ? ఇంకే మనాలి? రోస మున్న దేవతైనా పిసుక్కు చావడాని కిది చాలు! శివరావు : ఈ మాట తప్పుకాదని నే ననడం లేదమ్మా! ఇది తప్పే. కాని, ఇంతే అనిందా? ఇంకేమైనా కూడా నోరు పారవేసుకున్నదా? వెంకాయమ్మ : నోరు మెదపకుండానే చుర్రున వాత లంటించ గలిగినప్పుడు నో రెందుకు పారేసుకుంటారు? శివరావు : అయితే, నువ్వు దాన్ని మన్నించవచ్చు. కావాలని అది నీ మనస్సు నొప్పించలేదు; తెలియక చేసింది. వెంకాయమ్మ : చెప్పొచ్చావులే - మా లావు తీర్పు! పెళ్లాం బెల్లం, తల్లి విషం - లోకంలో వున్న సంగతేగా? శివరావు : అది కాదమ్మా? ఇక్కడ మన చుట్టాలా, పక్కాలా? మేము కాపరం పెట్టి రెండేళ్ళు కావొస్తున్నా. ఇప్పటికిగాని నువ్వు వచ్చావ్ కాదయ్యె. ఈలోపున ఇరుగు పొరుగువాళ్ళతో మా యిల్లనడం దానికి అలవాటై పోయింది. మరొక విధంగా వాళ్ళతో అది మాట్లాడానికి వాళ్లు మన చుట్టాలా? పక్కాలా? అదే అలవాటు చొప్పున నీతో కూడా.... వెంకాయమ్మ : చాల్లే! వెనుకేసుకొచ్చావ్! (మూతీ, ముక్కూ విరుస్తూ వెడుతుంది. శివరావు : అమ్మా! (కాస్త ఆగి) అమ్మా! (ఎంతకూ బదులు లేకపోగా) పొరపాటుగా అన్న మాట కింతకోప మెందుకమ్మా! ( క్షణం ఆగి) కృష్ణా! (నాలుక కరుచుకుంటూ) కృష్ణవేణీ! కృష్ణవేణి (కళ్ళు తుడుచుకుంటూ వచ్చి) : దేనికండీ? శివరావు : మా అమ్మ మనస్సుకు ఎందుకు కష్టం కలిగిందో తెలుసా? (కృష్ణవేణి జవాబు చెప్పదు. శివరావు:ఆవిడతో మాట్లాడుతూకూడా మాయిల్లు, మా వాకిలి, మా మంచాలు, మా కంచాలు అంటావట! అలా అంటే... కృష్ణవేణి : అబ్బే! నే ననలేదండీ! శివరావు : అలవాటుచొప్పున అన్నావేమోలే! కాని, పొరపాటుగానైనా పరాయిదాన్నిగా చూస్తే ఆమె మనస్సుకు... కృష్ణవేణి : నాకామె కాదు; ఆమెకు నేనే పరాయిదాన్ని. చిన్నదైనా తమ్ముడి కూతుర్ని చేసుకుంటే, మాలో అతుక్కు పోయేదని ఆమె సూటీ పోటీగా అనని రోజు లేదు. శివరావు : చాల్లే! ఇఖ కయ్యానికి కాలుదువ్వకు! కృష్ణవేణి : అంతే లెండి! మీరూ మీరూ ఒక్కటే. నేనేగా పరాయిదాన్ని! (గిర్రున నీళ్ళు తిరిగిన కళ్ళతో ఒక్కసారి తలెత్తి చూచి, కృష్ణవేణి వెళ్ళిపోతుంది, “అబ్బబ్బ” అంటూ శివరావు తిరిగి పడక కుర్చీలో జేరగిలబడతాడు. శ్రీరాములు (చడీ చప్పుడు కాకుండా వచ్చి) : ఏరా, అప్పుడే అంతా వచ్చి వెళ్లి రేమిటి? శివరావు (విసుగ్గా) : ఊఁ! శ్రీరాములు : వేళకు అందుకో లేనేమోనని అక్కడికీ ఆదరాబాదరా పడొచ్చారా? అసలు రాకే పోదును. కాని, నువ్వు ఏమనుకుని పోతావోనని తెరిపి చేసుకొచ్చా. అడుగూ బొదుగూ కాస్త నా కేమైనా మిగిలిందా? శివరావు : కాస్త ఖర్మ మేమిటి? అంతా నీకే మిగిలింది! శ్రీరాములు (కంఠం వరకూ మెక్కడానికి అన్నట్టుగా తాపీగా ఒక కుర్చీలో కూర్చుంటూ) : నిన్ను చూస్తే నా కెంతో ముచ్చటరా! శ్రమలేని ఉద్యోగం, ఒకటో తేదీకి ఠంచనగా జీతం, అప్పుడప్పుడూ స్పెషల్ యింక్రిమెంట్లు, త్వర త్వరగా ప్రమోషన్లు, పెద్ద పెద్దవాళ్ళతో స్నేహాలు, రవ్వారట్టూ  భావకవి (వ్యంగ్య నాటిక)

పాత్రలు: తెరపైకి వచ్చేవారు : మోహనరావు, అనసూయ, నేపథ్యంలో నిలిచేవారు : బిచ్చగాళ్ళు, సీతారామయ్య, తులశమ్మ స్థలం : మోహన్ రావ్ యింటిలో ముందు గది కాలం: వర్తమానం మోహన్ రావు యింటిలో ముందరి గది. కుడిచేతివైపు ద్వారం వీధితల వరండాలోకి; ఎదురుగానున్న ద్వారం పడకగదిలోకి; ఎడమ చేతివైపు ద్వారం భోజనాలగది, వంటిల్లు మొదలైన వాటిలోకి. (వీధి తల వరండాలో నుంచి ముందరి గదిలోకి ఒక ద్వారం వుంటే, పడక గది లోపలికి మరొక ద్వారం వున్నదన్నమాట.) ఎదురుగుండా వున్న ద్వారానికి రెండుపక్కలా రెండు కిటికీలు. గదిలో ఒక పక్కగా రోజ్ వుడ్ టేబుల్, దాని వెనక కుర్చీ. గది మధ్యగా రెండు, మూడు పాత పేము కుర్చీలు. గోడలకు చౌకబారు క్యాలెండర్లు. తుక్కు పుస్తకాలతో అద్దం తలుపుల బీరువా. తెర లేచేసరికి మోహన్ రావు టేబుల్ వద్ద కూర్చుని ఏదో వ్రాయడానికి ప్రయత్నం చేస్తూవుంటాడు. కుడిచేతిలో కలం; ఎడమ చేతిలో సిగరెట్టు. వ్రాత సాగడం కష్టమైపోయిన కొద్దీ సిగరెట్టు దమ్మును లాగుతూవుంటాడు మరింత గట్టిగా. అతని వయస్సు ముప్ఫయి అయిదు ప్రాంతాల. కాశ్మీర్ శాలువ వల్లె వాటుతో సహా పక్కా బెంగాలీ బాబు వేషం. అనసూయ వయస్సు పాతిక సంవత్సరాలు. అందకత్తె. లేనిపోని ఆడంబరాలకు పోక, సంసార పక్షంగా వుంటుంది. మాటకారి కాని, మెత్తని మనస్సు,

మోహనరావు (వ్రాసే ప్రయత్నం విరమించి) : అనూ! అనూ! అనసూయ (ప్రవేశిస్తూ) : "అనసూయ" అంటూ నాకు శుభ్రమైన పేరుండగా, ఏమిటండీ, ఈ అనూ, వినూ! మోహనరావు : వినడానికే నిన్ను పిలిచింది. అనసూయ : మీ కవిత్వమేనా? “నా సఖీ! ఓ సఖీ! ఓహో సఖీ!” ఎన్నిసార్లు విననండీ? చెంతనున్న ఈ సఖిని కన్నెత్తి చూడ్డానికి ఫురసత్ లేకపోయినా, ఏ సఖినిగురించో అదే పనిగా కలవరిస్తూ వుంటారు. మోహనరావు : నేను బాధపడతానని తెలిసికూడా నా సఖిని అవహేళన చేయడం నీకు తగునా? అనసూయ : అబ్బే! నే నేమీ హేళన చెయ్యడం లేదు. అయినా చేస్తే మాత్రం తప్పేమున్నది? - నా కామె సవితై నప్పుడు? ఎప్పటి కప్పుడు ఆమె సంగతి సందర్భాలు విచారిద్దా మనుకుంటూనే వివరంగా అడగలేదు. ఆ సఖిగా రెవరండీ? మోహనరావు : ఆమె నా కవితాసఖి; గగన సీమంతిని. అనసూయ : రెండు పేర్లు చెబుతున్నారు. ఇంతకీ, ఒక్కరా? ఇద్దరా మోహనరావు : ఒక్కతే! కాని, ఆమెకు సహస్రనామాలున్నాయి? అనసూయ : అందుకనేనా మీ రామెకు సహస్రనామ పూజ చేస్తూ వుంటారు. మీ పూజ లందుకోడానికి ఆమెగా రెక్కడ బైఠాయించారు? మోహనరావు : నా హృదయపీఠంపై. అనసూయ : నాకు తెలిసినంత వరకు అది నలుసంత పీట. దాని మీద కూర్చోడానికి ఆమె నలుసంత మనిషా? మోహనరావు : ఆమె సూక్ష్మాతి సూక్ష్మ; విశ్వవిశాల. అనసూయ : విన్నకొద్దీ ఆవిడ సంగతి మహ చిత్రంగా వుంది. అంత చిన్నదీ, అంత పెద్దదీ కూడా కావడానికి ఆమె హనుమానులవారికి తోబుట్టువు కాదుగదా? మోహనరావు : ఇది ఆమెపట్ల మహాపచారం! అనసూయ : ఆమె రూపురేఖలు తెలుసుకోవాలని అడుగుతున్నానండీ! ఈ మాత్రానికే తప్పు పట్టాలా? ఆమె చూడచక్కనిదేనా? ముక్కూ ముఖమూ అందంగా వుంటాయా? మోహనరావు : ఆమె అశరీరవ్యక్తి; ఆద్యంతరహిత శక్తి. అనసూయ : అంటే మీరనే దేమిటి? ఆమెకు రూపమే లేదూ? మోహనరావు : కాని, కోటి రూపాలతో కోటానుకోట్ల ప్రియులకు ఆమె సాక్షాత్కరిస్తూ వుంటుంది. అనసూయ : మీ రొక్కరే అనుకున్నా! ఆమెగారికి నా తలలో వెంట్రుక లంతమంది మొగుళ్ళున్నా రన్నమాట! మోహనరావు : నన్ను నొప్పించడానికే నీవీ మాటలంటున్నా, ఆమె నా భావనావీధిలోని ప్రియాంగన కాని, నీవు చిత్రించ గోరుతున్నట్టు, బజారులోని పణ్యాంగన కాదు. అనసూయ : నాకు తెలియ కడుగుతాగాని, వీధి అంటే బజారు కాదండీ? ఏమైనా తుకిడీలు, తుకిడీలుగా ఇంతమందిని ఆమె తనకు గులాముల్ని చేసుకోవడం గొప్ప సంగతే! ఆమె వయస్సెంత? పడుచుదేనా? లేక, ఆమె విషయంలో అన్నీ విడ్డూరాలైనట్టు, ముసిలిదా? మోహనరావు : ఆమెకు జరలేదు; మృతిలేదు, ఆమె నిత్యయౌవని; నిత్యనూత్న; నిత్యప్రణయిని; నిత్యవిరహిణి, ఏజాతికీ ఆమె చెందదు! ఏ నీతీ ఆమెను బంధించదు. అనసూయ : అలా చెప్పండి. ఆమెకు నీతీ లేదు; జాతీ లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి, చివరికి మీరూ నే నన్న మాటకే వచ్చారు! మోహనరావు : మానవమాత్రకాని ఆ తేజోమూర్తిని సామాన్య మానదండాలతో కొలవడానికి ప్రయత్నించబోకు. అనసూయ : దండాలు పెట్టి, ప్రాణాచారాలు పడి, మీరు దాన్ని కొలుస్తున్నారు చాలదూ? నేను కూడా కొలవడం దేనికి లెండి. నాకు వేరే కొలువున్నది; వంటింటి కొలువు. నే పోతున్నా, మోహనరావు : వంటిల్లే నీకు వైకుంఠం. అనసూయ : లేకపోతే విస్తరిలోకి మెతుకులెలా వస్తాయండీ! మోహనరావు: తిండి! తిండి! పాడు తిండి! పొట్ట నింపుకోవడమే ప్రధానమా? అయితే మనకూ, శుపక్ష్యాదులకూ భేదమేమిటి? జీవితం విలువలు తెలిసినవారికి అన్నవస్త్రాదులు ముఖ్యం కావు; ఉషఃకాలం, సూర్యోదయం... అనసూయ : పొద్దు బారె డెక్కేదాకా మీరు నిద్ర లేవరయ్యె! లేచిన తర్వాత గంటకైనా మంచంపై నుంచి కాలు కింద పెట్టరయ్యె! సూర్యోదయాలతో మీకేం పని? మోహనరావు : నీ భౌతిక ప్రపంచంలో ఒక్క సూర్యుడే కాని, నా మానసిక జగత్తులో శత సహస్ర సూర్యు లుదయిస్తూ వుంటారు. నా సూర్యుల కాంతి తీక్షమైంది కాదు; కవోష్ఠమైంది, అది తృష్ణ కలిగించదు; తృప్తి నిస్తుంది. అనసూయ : నేను మామూలు మనిషిని. నాతో మామూలుగా మాట్లాడరాదటండీ? మీ కవితాసఖితో మీరు కాలక్షేపం చెయ్యండి; నేను చక్కా పోతున్నా. (పోబోతుంది. మోహనరావు (ధోరణి మార్చి) : ఆఁ! ఆఁ! లేదులే. కాస్త నిదానించు. కొత్తగా నే నొక నాటకం ప్రారంభించా. అనసూయ : మన బ్రతుకే ఒక నాటకంగా, ఒక బూటకంగా వున్నదయ్యె! ఇప్పుడు మీరు కొత్తగా ప్రారంభించడం దేనికి? మోహనరావు : చాల్లే! నువ్వు ప్రతిదానికీ విపరీతార్థాలు తీస్తావ్! అనసూయ : మీ కింత విసుగు దేనికి లెండి! నన్ను పోనీయండి! మోహనరావు : లేదులే, ఆగు! ఇదివర కెన్నడూ నేను నాటకం రాయలేదు. ఇవ్వాళే కొత్తగా ఒకదాన్ని ప్రారంభించా. అనసూయ : ఏఁ! మీ కవితాకన్యకు విడాకు లిచ్చారేమిటి? మోహనరావు : నేనా? కవితాకన్యకు విడాకు లివ్వడమా? అదెన్నటికీ జరగదు. అనసూయ : ఔనులెండి! మీ రొకవేళ విడిచిపెట్టాలన్నా, అది మిమ్మల్ని విడిచి పెట్టదు. పుట్టుమచ్చలు పోతాయి కనకనా, పుట్టుకతో వచ్చిన కవిత్వం పోవడానికి! మోహనరావు : నిజం, అనూ! నిజం! నీ వన్నది నిజం! నేను పుట్టుకతోనే కవిని. జన్మ జన్మాంతరాలనుంచీ కవిత నంటి నేను వస్తున్నాను; న న్నంటి కవిత వస్తున్నది. కవితే నాకు ప్రాణం; కవితే నాకు ప్రపంచం; కవితే నాకు సర్వస్వం. కవిత కానిది కల్ల. అనసూయ : ఔనండీ! ఔను! ఈ సంగతి నాకు బాగా తెలుసు. ఇల్లూ, వాకిలీ మీకు కల్ల! ఇల్లాలూ కల్ల! ఇంతకీ మన కవితా కన్యకు చెల్లుచీటీల ప్రమాదమేమీ లేదంటారు! మోహనరావు : నా కవితారాధనలో ఒక భాగమే ఈ నాటక రచనా ప్రయత్నం. “కావ్యేషు నాటకమ్ రమ్యమ్”. కాళిదాస మహాకవికూడా మేఘసందేశాది మహాకావ్యాల తర్వాత అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం మొదలైన నాటకాలు రాశాడు. అనసూయ : అయితే మీరూ రాసుకోండి! మీ దేవకన్యల్ని గురించి వినడానికి నా కిప్పుడు తీరుబాటు లేదు. మోహనరావు : ఉహుఁ! నా నాటకం దేవకన్యల్ని గురించి కాదు. అనసూయ : మీ రాజపుత్రికల గొడవైనా నాకు పట్టదండీ! మోహనరావు : అబ్బే! కాదు. ఇది పూర్తిగా కొత్త నాటకం. కథావస్తువులో, కథా సంవిధానంలో, పాత్రకల్పనలో, పాత్రపోషణలో, సంభాషణల గతిలో, సన్నివేశాల రతిలో - అంతా కొత్త, క్రొత్త నడలతో, క్రొంగొత్త నుడులతో, రసస్ఫోరకంగా, రసోజ్వలంగా, రసైక్యంగా నడుస్తుందిలే! అనసూయ : నడవనివ్వండి. మీ మాటలే నాకు కొరుకుడు పడనప్పుడు మీ నాటకం నడకలు నాకేం తెలుస్తాయ్! నే వెళ్లి నా వంటపని చేసుకుంటా; మీరు రాసుకోండి. మోహనరావు : రాయడానికే ప్రయత్నం. కాని, కృత్యాద్యవస్థలో పడ్డాను. అనసూయ : అంటే? అనసూయ (నవ్వుతూ) అయితే, అట్లకాడ తేనా, అడ్డు కుళ్ళగించడానికి? మోహనరావు : ఆదిలోనే అట్టింది. మోహనరావు : పరిహాసంలో గట్టిదానివేలే! కాని, నా కిప్పుడు పట్టిన ప్రశ్న పరిహాసం కాదు; ప్రణయం. అనసూయ : అంత ప్రళయ మేమి వచ్చిపడిందండీ? మోహనరావు : అదుగో! తిరిగి పరిహాసమా? ఇహ చాలించి, రాసినంతవరకు నా నాటకాన్ని సావధానంగా విని, ఒక సలహా చెప్పు. అనసూయ : అయ్యొ రామ! నేను మీకు సలహాలు చెప్పేపాటి దాన్నా? అయినా చదవండి. మోహనరావు : ఈ నాటకంలోని రసస్ఫూర్తి నీ వనుభవించాలంటే, ముందు కొంత ఉపోద్ఘాతం అవసరం. (ఉపోద్ఘాతం ప్రారంభించడానికి గభీర ముద్ర ధరించి, అర్ధనిమీలిత నేత్రు డౌతాడు. అనసూయ : ఏమండోయ్! నా కవతల చేతినిండా పనుంది. మీరిప్పుడు మబ్బుల్లోకి పరుగులెత్తి, చుక్కల్ని పుణుకుతూ కూర్చుంటే... మోహనరావు (విసుగ్గా) : అబ్బ! రసభంగం చేస్తావ్! అనసూయ (నాలిక కరుచుకుంటూ) : అయ్యొ రామ! తప్పే! మోహనరావు : సరే! ఇకనైనా ఉపోద్ఘాతం చెప్పనిస్తావా? అనసూయ : ఊఁ! కానివ్వండి. మోహనరావు (ఈసారి పోజ్ పెట్టకుండానే) : అతడు కురూపి. కాని కవి, రసజ్ఞుడు, వ్యుత్పన్నుడు. కళాసంపత్తి ఎక్కువ. కవిత్వం కోసం బ్రతుకుతాడు. రుచిగలవాడు. అనసూయ : రుచిగలవా డేమిటండోయ్! మీరు కొరుక్కు తిని చూశారేమిటి? మోహనరావు (“కాస్త ఆగు!” అన్నట్టు సంజ్ఞచేసి) : అతడు స్నిగ్ధ హృదయుడు, సౌందర్యోపాసి. అనసూయ : ఒక్కరూపులో తప్ప, అచ్చంగా మీ లాంటివాడే అందురూ! మోహనరావు (అంతవరకు కాల్చుతున్న సిగరెట్టును నేలపై పారవేస్తూ) : కొంతవరకు అంతే ననుకోవచ్చు. అనసూయ : ఎక్కడబడితే అక్కడ మీలా యిలాగే సిగరెట్టు పీకలు పారవేసేవాడా? మోహనరావు : సౌందర్యోపాసనకు, సిగరెట్టు పీకలు పారవేయడానికి సంబంధ మేమిటి? అనసూయ : ఆఁ! నిజమే! వాటికి సంబంధ మేమీ లేదు. కాని, అద్దంలా పూడ్చి పెట్టుకున్న నేలమీద సిగరెట్టు పీకల్ని చూస్తే నా కెందుకో వొళ్ళు గరపొడుస్తుంది. ఇంతకూ, మీ నాటకంలోని ఈ అత డెవడండీ? మోహనరావు: నా నాటకానికి కథానాయకుడు. అనసూయ : అతనికి ఊరూ, పేరూ లేదేమిటి? మోహనరావు : అతనిపేరు చంద్ర. అనసూయ : అదేమిటండీ ఆడపేరు! మోహనరావు : అతడు కవి, రసజగత్తును సృష్టించే కవికి రసధుని వంటి పేరు పెట్టడమే రసౌచిత్యం. అనసూయ : సర్లే! ఆ చంద్రప్పగారి మాటేమిటి? మోహనరావు : అబ్బబ్బ! నేను ఎంతో ఆలోచించి పెట్టిన పేరు సొగసు ఇట్టే చెడగొట్టేశావ్! అనసూయ : ఆ సొగసు లేవో నా కేం తెలుస్తాయి లెండి. సరే కానివ్వండి! మోహనరావు : చెప్పాను కదూ? - అతడు కురూపి. - అనసూయ : వొళి కోతిలా వుంటాడేమిటి? మోహనరావు : అబ్బ! ఇంత కటువుగా మాట్లాడతావేఁ? అనసూయ : మీరే అంటిరిగా అతడు కురూపివాడని. మోహనరావు : సర్లే! విను! బాహ్యసౌందర్యం లేకపోయినా, అంటే, పైపై అందం లేకపోయినా... అనసూయ : పై పై అందమొకటి, లోపల అందమొకటి - ఇన్ని వుంటాయటండీ? మోహనరావు : ఔనౌను! ముక్కు, ముఖాల అంద మొక అందమా? అనసూయ : ఓహో! అలాగేఁ! అందువల్లనే కాబోలు... (మాట పూర్తి చేయకుండానే ఆగిపోతుంది. మోహనరావు : ఏమి టది? అనసూయ : ఆఁ! ఏమీ లేదులెండి. మోహనరావు : ఏ మాటకూ లేని సంకోచం దీని కెందుకు? అనసూయ : ఆఁ! మరేమీ లేదు. ముక్కు ముఖాల అంద మొక అందం కాకపోబట్టే కాబోలు నేనున్నదీ, లేనిదీ కాననట్టుగా మీరు సంచరిస్తూ వుంటారు. మోహనరావు : కానక పోవడమేమిటి? కళ్ళెదట తిరుగుతూ వుంటే! అనసూయ : కళ్ళెదట ఎంత తిరిగితే మాత్రమే? మీ లోకమేమిటో! మీరేమిటో! రాత్రి నే నేమి పువ్వులు జడలో పెట్టుకున్నానో చెప్పండి? చూద్దాం! మోహనరావు : నువ్వు జడలో పెట్టుకున్న పువ్వుల పేర్లు జ్ఞాపకం వుంచుకోవడం తప్ప నాకు పని లేదా? అనసూయ : కవిత్వం రాసేవారికి పెళ్ళాం పెట్టుకున్న పువ్వుల పైకి కన్నే పోదన్నమాట. అయితే, మరి పువ్వుల పైన పాటలూ, పద్యాలూ అల్లడం దేనికో! మోహనరావు : ఇవి పెద్ద సంగతులులే! ఇవి నీకు అర్థం కావడం కష్టం. రసజ్ఞ హృదయంవల్ల, రసోపాసక జీవితంవల్ల, రసపారవశ్యంవల్ల సిద్ధించే ఆత్మసౌందర్యమే వాస్తవికమైన సౌందర్యం. అదే అనుపమ సౌందర్యం; అదే అలౌకిక సౌందర్యం. రసోపాసకు లందరు ఆశాజీవులు. ఊహాతీతమైన దేనికో వారు అర్రులు జాస్తారు. దూర దూరాలకు, రహస్తీరాలకు వారు పరుగు పెడతారు. వారినే కవిత్వం వరిస్తుంది. వారు బాధలో హృదయం చీల్చుతారు; బ్రతుకులో కవిత్వం ఏరుకుంటారు. ప్రతి పదం జీవించే పలుకుతారు. అనసూయ : తక్కినవాళ్లు చచ్చికూడా పలుకుతా రేమిటి? ఏమీ అర్థంకాని మొద్దుని. ఆ చెప్పే దేదో నాకు కాస్త తెలిసేటట్టు చెబుదురూ! మోహనరావు : రసోద్వేగంలో పడిపోయాలే! సరే, విను! చంద్ర పైకి అందగాడు కాకపోయినా, నిజానికి అందమైనవాడే. అనసూయ : కాబోలు! మోహనరావు : కాబోలు కాదు; ముమ్మాటికీ.

అనసూయ :  మంచిది; అచ్చుకున్నానండీ! అతడు బాలచంద్రుడే!

మోహనరావు : ఒక యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఆమె దివ్యసుందరమూర్తిని తన హృదయపీఠంపై ప్రతిష్టాపించుకుని, ప్రేమసుమాలతో, రక్తోదకాలతో అహర్నిశలు అర్చిస్తున్నాడు. అనసూయ : రికామీగా కూర్చోడానికి మీవలె జరుగుబా టున్నవా డేమిటి? మోహనరావు (ముఖం చిట్లిస్తూ) : నీకు తోచే వన్నీ యిలాంటి అవకతవక ప్రశ్నలే! అనసూయ : నాకు తెలియకడుగుతా గాని, తిని కూర్చోడానికి తగు స్థితి లేనివాడైతే, రాత్రింబగళ్లు ఏదో ఒక అమ్మాయిని గురించి జపం చేస్తూ కూర్చోగలడటండీ! మోహనరావు : చాల్ చాల్లే! ఈ విషయాలు నీకు తెలియవ్. అనసూయ : అయితే, మరి నాకు చెప్పడం దేనికి? మోహనరావు : ఆ మాట నిజమే! నా మూడ్ చెడగొట్టేశావ్. అనసూయ : అయ్యొ రామ! మళ్ళీ మాడుపోటు వచ్చిందేమిటి? మోహనరావు : ఊఁ! మాడుపోటూ లేదు; గీడుపోటూ లేదు. (మోహన్ రావు సిగరెట్టు ముట్టిస్తాడు. అనసూయ “ఏఁ! కోపమొచ్చిందా?” అని అడుగుతుంది. అతడు జవాబు చెప్పడు. ఇంతలో ఈ కింది పాట పాడుకుంటూ తలవాకిలిలోకి ఇద్దరు ముగ్గురు బిచ్చానికి వస్తారు. “బిచ్చగాళ్ళామండి నారాయణా! కాసిని బియ్యం పెట్టించండి నారాయణా! పట్టెడన్నం లేదు నారాయణా! మాకు కట్ట గుడ్డలేదు నారాయణా!

కొంపగోడూలేదు నారాయణా!

చింపిగుడ్డ లిప్పించండి నారాయణా!

ఆకలికి చస్తున్నాము నారాయణా!

మేము చలికి నొస్తున్నాము నారాయణా!

లేనివాళ్ల మండి నారాయణా!

మాకు లేదన బోకండి నారాయణా!” ఆమె (బిచ్చగాళ్ళ పాటమధ్య “నిజంగా ఇదంతా కోపమే?” అని అనసూయ అడుగుతుంది. మాట విననట్టు మోహనరావు నటిస్తాడు. ఒక క్షణం తర్వాత “చాల్లే! పొండోయ్” అని బిచ్చగాళ్ళను కసురుకుంటాడు. అయినా వాళ్లు పాటసాగిస్తూ పోతూవుండగా, “మీక్కాదూ చెప్పేది! చచ్చు పీనుగుల్లారా! పో పొండి!” అని గద్దిస్తాడు.

అప్పటికీ బిచ్చగాళ్ళు పాట మానరు. అంతట “వస్తున్నానర్రా! ఆగండి!” అని అనసూయ కదులుతుంది. పాట ఆపి, “అమ్మా! మా అమ్మా!! కాశీ అన్నపూర్ణమ్మా! గుప్పెడు గింజలు” అని బిచ్చగాళ్లు అర్థిస్తారు. సిగరెట్టు కాల్చుతూ మోహనరావు గదిలో పచారుచేస్తూ వుంటాడు. బిచ్చగాళ్లకు ముష్టి పెట్టి పంపించిన అనసూయ తిరిగి వస్తుంది. అనసూయ : పాపం! వాళ్ళ దేశంలో కరువు వచ్చిందటండీ! మూడేళ్ల నుంచి వరసగా వానలు లేవట. వాగులు, వంకలు, చెరువులు, దొరువులు - దేనిలోనూ చుక్క నీళ్ళైనా లేవట. వానదేవుడు దయచూడక పోతాడా అని ఈ మూడేళ్ల నుంచీ ఏటేటా పైర్లు పెట్టుకుంటే, ఏటేటా పెట్టిన పైర్లు పెట్టినట్టే మలమల మాడిపోయినవట. అమ్ముకు తినగలదల్లా అమ్ముకు తిన్నారట. మరేమీ దారి కనబడక, ఊరూ, నాడూ విడిచి పెట్టి, కొంపా గోడూ పాడు పెట్టి, “అమ్మా - అయ్యా!” అంటూ పట్టెడు మెతుకులకోసం గడప గడపకు తిరుగుతున్నారు. కళ్లు లోతుకు దించుకు పోయి, ముఖాలు చప్పగా డోక్కుపోయి, పొట్టలు వెన్నుకు అతుక్కుపోయి, పక్కటెముకలు బయటికి పొడుచుకొచ్చి, వీనుగులంటే పీనుగులుగా... మోహనరావు (చెవులు మూసుకుంటూ) : ఈ పాడు మాటలు నాకు చెప్పకు! అనసూయ : పాడు మాట లేమిటండీ! పాపం! తినడానికి పట్టెడు మెతుకులు లేక, తాగడానికి చిట్టెడు గంజైనా లేక, చెట్టుకొక పక్షిచొప్పున అయిపోయి, “అమ్మా! తల్లీ!” అంటూ వాళ్లు అఘోరిస్తుంటే! వాళ్ళ వొంటిని ఎక్కడైనా ఇంత కండన్నమాట వుంటే బొట్టు. వొళి ఎముకలగూళ్ళు. ఎండి వొరుగై, కాసేపో, కూసేపో అన్నట్టుగా వున్నారు. వాళ్ళని చూస్తే నాగుండె చెరువై పోయింది. మోహనరావు (కోపంతో సిగరెట్టు విసిరికొట్టి) : చాల్ చాలు! ఇఖ కట్టి పెట్టు! కూడులేక ఎన్ని కుక్కలు చావడం లేదు! వాటి సంగతి నేను పట్టించుకో బోతున్నానా? అనసూయ : అయ్యొ రామ! మనుష్యులు, కుక్కలు ఒఖ్ఖటే నటండీ! మోహనరావు : ఆఁ! అంతే! సంస్కారం లేకపోతే, రసజ్ఞత లేకపోతే! నేను కవిని. కమనీయ వాతావరణం నాకు కావాలి. అందాన్ని నేను ఆరాధిస్తాను; ఆనందాన్ని నేను అన్వేషిస్తాను. వాటిని నా రచనల ద్వారా లోకానికి పంచి పెడతాను. నా దృష్టి మేఘాల పైకేగాని, మురికి గుంటలపైకి పోరాదు. నేను వినవలసినవి కోకిల పాటలు గాని, కూటికై అరుపులు కావు. ఈ వికృత ప్రపంచంతో, దీని వికార జీవితంతో సంబంధం లేకుండా, అనంతాకాశాల లోకి కరగని ఒక ఆవేదనతో, దొరకని ఒక తేజస్సుకై... నేను... నేను... అనసూయ (తెల్లపోయి) : ఎందుకండీ అంత కోపం? (లెంపలు వాయించుకుంటూ) బుద్ధి పొరపాటైంది. (అనసూయ వెళ్ళిపోతుంది. మోహన్ రావు కుర్చీలో కూర్చుని కొత్త సిగరెట్టు ముట్టిస్తాడు. టేబుల్ వద్ద కూర్చుని వ్రాయడానికి ప్రయత్నించగా ఒక్క అక్షరమైనా రాలదు. అంతట కుర్చీలోనుంచి లేచి, గదిలో నాలుగైదుసార్లు పచారు చేస్తాడు. పిమ్మట “అనూ" అని వరసగా రెండు, మూడుసార్లు పిలుస్తాడు. అనసూయ (వస్తూ) : మళ్ళీ ఎందుకండీ? మోహనరావు : ఏఁ! కోప మొచ్చిందా? అనసూయ : కోపమైనా, తాపమైనా మీకే చెల్లు! నా దేముంది? మొద్దురాచ్చిప్పను! మోహనరావు : నాది సున్నితమైన మనస్సని నీకు తెలుసుగదా? తెలిసీ, కరువు, కాటకాల మాటలు నాకు చెప్పవచ్చునా? అనసూయ : తప్పేనని చెంపలు వాయించుకున్నా గదండీ! మోహనరావు : సరే! ఇలాంటి పాడుమాటలు చెప్పి, నా మనసు మరి నొప్పించకు. ఆఁ! అన్నట్టు నా నాటకం కథ ఎంత వరకు చెప్పాను? ఆఁ! ఆమె... అనసూయ : ఆమె యెవతండీ? (అంతలో నాలిక కరచుకుని) ఆఁ! ఎవతైతే నాకు దేనికిలెండి! ఊరుకోలేక నవ్వులాటకు నేనేమైనా అంటే, ఇట్టే మీకు తట్టెడు కోప మొస్తుంది. . మోహనరావు : అబ్బే! సందేహం వస్తే అడగనూ వచ్చు; తీర్చుకోనూ వచ్చు. నా మనోవీధిలో ఈ పాత్రలు స్పష్టంగా, సజీవంగా మూర్తిమంతమై వున్నందున నీకూ సుపరిచిత వ్యక్తులే అన్నట్టు పొరపడుతున్నాను. ఆమె ఎవరో నీకు చెప్పనే లేదు. ఆమె సరళ. చంద్ర ప్రేమిస్తున్న దివ్యసుందర యువతి. అనసూయ : ఓహో! మోహనరావు : పేరు చక్కగా కుదిరింది కాదూ! ఆమెది సరళాతి సరళ హృదయం. అందువల్ల “సరళ” అని నామకరణం చేశాను. అనసూయ : ఓఁ! దివ్యమైన పనిచేశారు. మోహనరావు : ఆమె ఎంత రూపవతో అంత గుణవతి; ఎంత గుణవతో, అంత విద్యావతి. ఇక, ఆమె సిరి సంపత్తు లింతంత కావు. అనసూయ : పాడుదేవుడు! అన్నీ ఒక్కరికే అమిర్చి పెడతాడు! మోహనరావు : ఆమె మహదైశ్వర్యానికి ప్రలోభపడి ఒక జిత్తులమారి... అతడి పేరు శాస్త్రి ... జంబుక శాస్త్రి అని ధ్వనించాలే! ధ్వని ప్రధానమైనదే ఉత్తమకావ్య మౌతుంది... చంద్ర, సరళ, శాస్త్రి అని పేర్లు పెట్టడంలోనే నేను గొప్పగా ధ్వనించాను కాదూ?... ఆమె సంపత్తికి ప్రలోభపడి ఆమెను వశీకృతను చేసుకోవాలని శాస్త్రి సకల మాయోపాయాల ద్వారా ప్రయత్నిస్తున్నాడు; సమస్త సమ్మోహనాస్త్రాలను పుంఖానుపుంఖాలుగా ఆమెపై సంధిస్తున్నాడు. సరళ హృదయ గనక, అతడి కపటాన్ని ఆమె కానలేక పోతున్నది. అతడి పైపై మెరుగులకు బ్రమసి, అతడి మాయ మాటలకు మురిసి, అతడే తనకు వరుడని ఆమె భావిస్తున్నది. హృదయం లేని ఒక మహానీచుడు, సంస్కారంలేని ఒక పరమతుచ్చుడు సరళ మధుర జీవితాన్ని బలిగొన బోతున్నాడే అని చంద్ర ఆఁదోళన పడుతున్నాడు; ఆవేదన చెందుతున్నాడు; ఆక్రోశిస్తున్నాడు. ఈ ఘట్టంలో నేను నా నాటకాన్ని యెత్తుకుంటు న్నాను. ఏఁ! ఈ యెత్తుగడ రసవత్తరంగా వుంటుంది కదూ? అనసూయ : మీ మాటలు నాకు రావు గాని, బలే పసందుగా వుంటుంది. మోహనరావు : నిజమేనా? పరిహాసం చేస్తున్నావా? అనసూయ : అయ్యొ రామ! ఇ దెక్కడి పాపమండీ! నే నే మాటన్నా పరాచక మంటారు! మోహనరావు : సరే! నా నా మొదటి రంగం, - సరళ దివ్యసౌధాన్ని పరివేష్టించివున్న పుష్పోద్యానవనం. దానిలో ఒక సుందర లతానికుంజం. ఆ నికుంజంలో ఒక చంద్రశిలావేదిక. ఆ వేదికపై దేవకన్యవలె విశ్రమించివున్న సరళ. ఆమె సహజ సౌందర్యానికి శీతల సుధాచంద్రికలు ఒక నూత్న శోభను తెస్తున్నాయి. ఆమె పాదపద్మ యుగ్మం వద్ద శాస్త్రి కూర్చుని వున్నాడు. అతడు ఒక ప్రేమగీతాన్ని ఆలపిస్తూ వున్నాడు.

అనసూయ :  అది మీరు రాసిందేనా?

మోహనరావు : ఔను. నేను రాసిందే. “సఖీ! సఖీ! నీ సఖుడనే” అంటూ రాశానే - ఆ ప్రేమ గీతం. ఆ గీతంలోని అవ్యక్త మాధుర్యానికి మందానిలంతో మావిచిగురువలె ఆమె చలించి పోతున్నది. చంద్రశిలా వేదికపై నుంచి అశాంతిగా లేచి, ఆమె లతానికుంజం వెలుపలికి వస్తుంది. మరింత తేనె లూరేటట్టు ప్రేమగీతాన్ని ఆలపిస్తూ శాస్త్రి ఆమెను అనుసరిస్తాడు అప్పుడు... అనసూయ : ఆ అమ్మాయికి అమ్మా, బాబూ లేరేమిటి? మోహనరావు (పిడుగుపై బడ్డట్టు) : అదేమిటి? అనసూయ : అమ్మా బాబూ వుంటే అదుపాజ్ఞలలో పెట్టుకోరటండీ? పెళ్ళికాని పిల్లను తోటలెంట వాళ్ళతోను, వీళ్ళతోను కలిసి తిరగనిస్తారా? మోహనరావు : అబ్బబ్బ! నీ సామాన్యపు కొలత బద్దలతో నేను సృష్టిస్తున్న ఆదర్శజీవులను కొలవాలంటావ్! అనసూయ : మీ కొలతబద్దలకైతే గజానికి ఆరడుగు లుంటాయి కాబోలు! మోహనరావు : నీ పరిహాసాలకేమి గాని, నేను చెప్పబోతున్న దాన్ని కాస్త చెప్పనీ! “శాస్త్రి కపటి, అతడు ప్రేమిస్తున్నది నిన్ను కాదు; నీ సంపత్తిని” అని సరళను హెచ్చరించడం తన విధ్యుక్త ధర్మమని ఒక నిశ్చయానికి వచ్చి, సరిగా అదే వేళకు చంద్ర వస్తాడు. రసకందాయపు పట్టులో చంద్ర వచ్చాడని శాస్త్రి ఆగ్రహపరవశు డౌతాడు. అన్యాపదేశంగా చంద్రను నిందించాలని,... సరే, ఇక నేను రాసింది చదువుతా విను. (తను వ్రాసిన కాగితాలు తీసుకుని, నాటకంలో వేషధారి వలె ఫోజ్ పెట్టబోయి, అంతలోనే ఆగుతాడు. మోహనరావు : ఆఁ! అన్నట్టు నీ కిక్కడ ఒకమాట చెప్పాలి. లేకపోతే, నా ఉపక్రమణికలోని రసవద్విశేషం నీకు బోధపడదు. చంద్ర నల్లటి వాడు. నల్లటి వాడని శాస్త్రి అతణ్ణి వెక్కిరిస్తున్నాడన్నమాట. అనసూయ : ఓహో! మోహనరావు : ఇక చదవనా? (అనసూయ “సరే” అన్నట్టు తల ఊపగా, నాటక వేషదారి పోజ్ పెట్టి) మంచిది. సావధానంగా విను! శాస్త్రి : సరళా! ఆ నీల మేఘశకలాన్ని చూడండి. క్రూరవన్యమృగం వలె అది పైకి దూకుతుంటే, భీతహరిణాలవలె ఆ చుక్క కన్నెలు ఎలా చలించిపోతున్నవో! అనసూయ : అతని మాటలు మన మాటలుగా లేవేఁ? మోహనరావు : చంపేశావ్! ఎత్తుగడలోనే నేను కాళిదాసు పోకడ పోయాననుకుంటే, నువ్వు చేసే వ్యాఖ్యాన మిదేనా? అనసూయ : ఆఁ! నా మొఖం, నా కేం తెలుసులెండి! చదవండి. మోహనరావు : మధ్య మధ్య నువ్వు వ్యాఖ్యానాలు చెయ్యనంటే గాని చదవను. (అలాగే నన్నట్టు అనసూయ తల వూపుతుంది)ఈ మాటమీదే నిలబడాలి సుమా! (సరే నన్నట్టు అనసూయ తిరిగి మౌనంగానే సూచిస్తుంది.) అయితే విను! సరళ (నవ్వుతూ) : చంద్రగారిని మించిన కవిచంద్రు లౌతున్నారే మీరు!

(ఇంతలో ఎవరో ఉక్కిరిబిక్కిరై దగ్గుతున్నట్టు వినబడుతుంది...

మోహనరావు : ఎవరది? అనసూయ : సీతారామయ్యగారు కాబోలు! మోహనరావు (చప్పున రెండుచేతులతో రెండు కళ్లు మూసివేసుకుంటూ) : ఖర్మం! సరాసరి ఇక్కడికే రాడుగదా! వెళ్ళి ఆయన్ని పంపించిరా! ముందు వెళ్లు! అనసూయ : అంత భయం దేనికండీ! ఆయ నేం దెయ్యమా? భూతమా? మోహనరావు : ఆ శవాకారాన్ని నేను చూడలేను. నా కళ్ళ బడకుండా తక్షణం పంపించి రా! అనసూయ : అయ్యో రామ! వెడుతున్నాలెండి. (అనసూయ వెడుతుంది. ఆమె వెళ్ళిన క్షణానికి మోహనరావు ముందు వేళ్ళసందుగుండా గుమ్మంవంక చూచి, భయంలేదని గుండె దిటవు చేసుకుని, తర్వాత కళ్ళకు కప్పుకొన్న చేతుల్ని తీసివేసుకుంటాడు. సిగరెట్టు కేసు, అగ్గి పెట్టి అందుకోబోయేసరికి అనసూయ తిరిగి వస్తుంది. అనసూయ : సీతారామయ్యగారే నండీ! ఈ ఉత్తరమట కాస్త చదివి పెట్టండి. మోహనరావు (ఉత్తరాన్ని అందుకుంటూ) : తెలుగు ఉత్తరమేగాఁ? నువ్వే చదివి చెప్పకపోయావూ? అనసూయ : ఆ గొలుసుకట్టు రాత నాకు తెలిస్తేనా? మోహనరావు (ఉత్తరాన్ని చకచక లోపల చదువుకుని): ఆఁ! ఏంలేదు. ఆడబిడ్డ లాంఛనాలకింద నూటపదహా ర్లివ్వకపోతే వాళ్ళు పెళ్ళిసంబంధం వదులుకుంటారట. అనసూయ : ఏమి అఘాయిత్య మిది? (సీతారామయ్య తిరిగి ఉక్కిరి బిక్కిరిగా దగ్గుతాడు. మోహనరావు : సరే! నువ్వెళ్ళి తక్షణం ఆయన్ని సాగనంపిరా! అనసూయ : ఇలాంటి కష్టాలు మరి నాలుగు చుట్టుకుంటే ఆ పిచ్చి మారాజు తనే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ సాగనంప నఖ్ఖరలేదు. (అనసూయ వెడుతుంది. సీతారామయ్యగారికి తిరిగి దగ్గు తెర వస్తుంది. మోహనరావు (ముఖం చిట్లిస్తూ) : అబ్బబ్బ! (విసుగుదలతో గదిలో పచారు చేస్తుంటాడు. దగ్గుకుంటూ సీతారామయ్య వెళ్ళిపోతాడు. అనసూయ (తిరిగి వచ్చి) : పాపం! మాటవినగానే ఆయన నిలువునా నీరైపోయాడండి. చేతి కక్కరకొచ్చిన చెట్టంత కొడుకు నిరుడు పోయినప్పటి నుంచీ ఆయన పడుతున్న కష్టాలు ఆ పగవాడికైనా వద్దు. “కట్నం వెయ్యిన్నూట పదహార్లకే గిజ గిజలాడుతుంటే, మరొక నూటపదహార్లు నే నెక్కడ తెస్తానమ్మా?” అని - పాపం! - ఆయన కంట తడి పెట్టుకున్నాడు. కాని, ఏం చేస్తాడు? రక్తం పిండుకునైనా ఆ నూటపదహార్ల ముడుపుకూడా చెల్లించుకోవాలి. ఈడు ముదిరి పోతున్న పిల్ల మరెంతకాలం పెళ్ళీ పేరంటం లేకుండా యింట్లో పెట్టుకుంటాడు. తల్లి చాటున బ్రతకడానికి తల్లీ లేదయ్యె! ఆ కోడలున్నదంటే, అదొక రాక్షసి, ఆడబిడ్డను అష్టకష్టాలు పెడుతున్నది. కడుపునిండా కూడైనా పెట్టకుండా మల మల మాడ్చి వేస్తున్నది, “నా ఆయుస్సు కూడా పోసుకుని మా అన్నయ్య చల్లగా వుండి, నేనైనా పోకపోయాను. మా నాన్నకు ఈ ముసలితనంలో ఈ కష్టాలైనా తప్పే” వని మొన్న ఆ పిల్ల నా దగ్గిర ఆవురుమన్నది. అందరి కాళ్ళూ, కడుపూ పట్టుకుని, అవస్థ లెన్నో పడితేగాని, ఈ సంబంధం కుదిరింది కాదు. ఇప్పుడిది తప్పిపోతే, ఆ పిల్ల ఏంకాను? ఆ తండ్రి ఏంకాను? అయ్యొ రామ! ఆడపిల్లల్ని కనడమే మహాపాతకమైపోతే! చేతనైతే లోకానికి సిగొచ్చేలా దీన్ని గురించి ఒక నాటకం రాయరా దటండీ? మోహనరావు : వెర్రిదానా! ఇలాంటి సామాన్య విషయాలు కావ్య వస్తువు లౌతాయా? అనసూయ : అయితే, లోకంలో లేని విషయాల్ని గురించి రాయడం ఎవర్ని ఉద్ధరించడానికండీ? మోహనరావు : ఉద్ధరిం పేమిటి? ఆ ప్రశ్న లేనే లేదు. కళ కళ కోసమే. పువ్వు ఎందుకు విచ్చుతుంది? కోకిల ఎందుకు పాడుతుంది? సెలయేరు ఎందుకు ప్రవహిస్తుంది? అనసూయ : ఇంకా నయం! “నువ్వెందుకు అన్నం తింటున్నావ్? ఎందుకు గుడ్డ కడుతున్నావ్?” అన్నారు కాదు. మోహనరావు : ఎంత గొప్ప సంగతినైనా ఇట్టే కూడుగడ్డల లెవెల్ కు దించేస్తావ్! ఇందుకు పూర్తిగా భిన్నమైనదే సాహిత్యం. జీవితాన్ని కవి యథామాతృకంగా చిత్రించరాదు. లోకానికి అతీతుడై, అతిలోకాన్ని సృష్టించాలి. అనసూయ : ఆఁ! ముందు ఈ లోకంలో కడతేరితే గదా, తర్వాత ఏ లోకమైనా. మోహనరావు : దుఃఖం, దైన్యం, దారిద్ర్యం, కల్ల, కపటం, కాఠిన్యం ఇదేగా లోకమంటే? ఈ పాడు లోకంనుంచి ఎంత దూరానికి పారిపోగలిగితే, అంత గొప్ప కవి కావచ్చు. అప్పుడే కవి రసాధిదేవతను ప్రసన్నం చేసుకోగలుగుతాడు! రసం లేనిదే... అనసూయ : ఏం రసమో? నీరసం! మోహనరావు : మ్! నిన్ననే పనిలేదులే. ఇంతకూ తప్పు నాది! నేను నీతోనా సాహిత్యమీమాంస చెయ్యవలసింది? అనసూయ : పోనీ. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. నేను పోతున్నాలెండి. వంటకు వేళ మించిపోతున్నది. (నాలు గడుగులు వేస్తుంది. మోహనరావు : అనూ! అనూ! ఆగు!.... నీ వంట కేమిలే! అనసూయ : మీ వంటేనా ముఖ్యం. మీరు తొమ్మిది రసాలే పెట్టగలరేమో కాని, నేను తొంభై రకాలు పెట్టగలను. నేను ఏ రసం పెట్టినా నోటికి కమ్మగా వుంటుంది. మోహనరావు : సరే! ఒక్కమాట విని వెళ్లు. నా నాటకంలోని ఒక ఘట్టంలో... (తాను వ్రాసిన కాగితాలు తిప్పివేస్తూ) ఈ మధ్య భాగాలు వదిలేస్తున్నాలే! శ్రద్ధగా నీవు విననప్పుడు చదివి మాత్రం ప్రయోజన మేమిటి? చివరి భాగం మాత్రం చదువుతా. చంద్ర సరళతో... ఈ ఏం! చదవ మంటావా?

(నాటకంలోని వేషధారివలె పోజ్ పెట్టి గడగడ చదువుతాడు.

చంద్ర: “సరళా! నేను మిమ్ము మనసారా ప్రేమిస్తున్నాను; పూజిస్తున్నాను. నాది కాముకుని తుచ్ఛ ప్రేమకాడు; కవికుమారుని స్వచ్ఛ ప్రేమ; కళాజీవి మహోచ్చప్రేమ. కవితా కన్యకోసం, కళాదేవికోసం భువన భవనాలను యుగ యుగాలనుంచి అన్వేషిస్తున్నాను. కోకిల పాటలో, కేకిని ఆటలో ఆమెను కానలేక వేగిపోయాను. పున్నమ తోటలో, వెన్నెల తేటలో ఆమెను కానలేక వేసారిపోయాను. ఎన్నో వింత కలలు కన్నాను; వంత కథే మిగిలింది. వదనశ్రీని చూచినంతనే, నా తపస్సు ఫలించింది. తుది మొదలులేని అగాధ తమస్సులను చీల్చుకుంటూ మీ తరళలోచనాలు మెరుపులై మెరసినవి; పలుకులై పిలిచినవి. మీరు నన్ను స్వీకరించవచ్చు; లేదా తిరస్కరించవచ్చు. కాని, నా ప్రేమ మేరువుకంటె నిశ్చలమైనది, నయాగరాకంటె మహోద్వేగమైనది; సాగరం కంటె అగాధమైనది. మీరు ఆనతిస్తే, ప్రళయాగ్ని గుండంలోనైనా దూకగలను; కాలకూట విషమునైనా గ్రోలగలను. కాని, మీ సిగపువ్వు వాడినా నేను సహించలేను. శాస్త్రి మీ పాదరజాన్ని ఔదలదాల్చడానికైనా తగడు. అతడు ధనలోభి, కామాంధుడు, సంస్కార శూన్యుడు, రసజ్ఞతా విహీనుడు. అతడి కపటానికి మీరు బలి కావలదని నా ప్రార్ధన”. మోహనరావు : ఈవిధంగా చంద్ర అనేసరికి... అనసూయ : సరళ “అమ్మయ్యా!” అంటుంది. మోహనరావు (ఆశ్చర్యంగా) : అదేమిటి? ఆ పిచ్చిమాట ఎందుకంటుంది? అనసూయ : జడివాన కురిసి కురిసి వెలిసిందిగదా అని? మోహనరావు : హాస్యానికి నీకు సమయాసమయాలు లేవు గాని, చంద్ర తనను ప్రేమిస్తున్నట్టు సరళ ఎన్నడూ శంకించనైనా లేదు. అట్టిది మహాగ్నిపర్వతమే బ్రద్దలైనట్టుగా అతడు తన ప్రేమను ప్రకటించాడు. కవి కుమారుడని, రసజ్ఞహృదయుడని అతడంటే ఆమెకు గౌరవాదరాలు లేకపోలేదు గాని, అతని సౌందర్యవిహీనత కారణంగా, ప్రియునిగా ఆమె ఎన్నడూ అతనిని భావించలేదు. ఈ పరిస్థితిలో ఆమె మనోగతభావాలు ఏవిధంగా వుంటాయి? అనసూయ : ఏమో నాకేం తెలుసు? ఆ వైనం ఆ సరళమ్మగారినే అడిగి చూడండి మోహనరావు : ఆ పరిస్థితిలో నీవే కాసేపు వున్నావనుకో. అనసూయ : అంత దౌర్భాగ్యం నాకెందుకు పడుతుందండీ? మోహనరావు : నువ్వు చెప్పకపోతే పోయావుగాని, నే నేమని ఊహిస్తున్నానంటే... అనసూయ : మీకు తెలియని సంగతులు, మీకు అనుభవంలో లేని విషయాలు మీ రెందుకు రాయాలండీ? మోహనరావు : అదే కవి ప్రత్యేకత! సమస్త విషయాలను అతడు ఊహిస్తాడు. అతడి ఊహకు అందనిది ముల్లోకాలలో లేదు. అతడి మనోనేత్రం మహాశక్తిమంతమైంది; అతడి అంతశ్చక్షువు మహామహితాత్మమైనది! అనసూయ : అందువల్లే కాబోలు మామూలు కళ్ళతో చూడరు! మామూలు చెవులతో వినరు!! మోహనరావు : ఇలాంటి మాటలంటేనే నాకు కోప మొస్తుంది! అనసూయ (భయం నటించి, లెంపలు వాయించుకుంటూ) : అపరాధం! మహాపరాధం!! మోహనరావు : శాస్త్రిపట్ల అసూయతోనే అతడి నింత నికృష్టమైనవాణ్ణిగా చంద్ర చిత్రించినట్టు సరళ శంకిస్తుందని నేను ఊహిస్తున్నాను. నా ఊహ సరైనదే అంటావా? అనసూయ : మీరు ఏమైనా అనుకోవాలేగాని, మరి దానికి తిరుగేమిటండీ? మోహనరావు : అనుకోవటాలు, గినుకోవటాలు కాదు. ఇక్కడే నన్ను కొంత సంశయం పీడిస్తున్నది. అందువల్లే నా నాటకం నడవడంలేదు. నువ్వే సరళ స్థితిలో... అనసూయ : అయ్యొ రామ! వద్దన్న కొద్దీ దానికీ, నాకూ సాపత్యం పెడతా రెందుకండీ? మోహనరావు : నాకోసమని మాట వరసకు నువ్వే... (బయట నుంచి ఎవరో “అనసూయమ్మా!” అని పిలవగా) వీ రెవరు? అబ్బబ్బ! అంతా రసాభాస! అనసూయ : ఏమండీ తులశమ్మగారూ! మీరా? (అనసూయ వెడుతుంది. ముఖంలో విసుగుదల కనబడుతూ మోహనరావు తను వ్రాసిన కాగితాలు తిరగవేస్తూ వుంటాడు. కొన్ని క్షణాల తర్వాత సిగరెట్టు ముట్టిస్తాడుకూడా. అనసూయ (తిరిగివస్తూ) : పాపం! ఆ తులశమ్మ వలవల యేడుస్తున్నదండీ! “మాది అవిభక్త కుటుంబం. ఇక్కడ నీ దేముంది?” అని ఆవిడను... వాడులేడూ?... ఆవిడ మరిది... వా డొర్ధి కర్కోటకుడు... ఈపూట ఇంట్లో నుంచి గెంటి వేశాడట. భర్తపోయిన ఈ ఆరేడు నెలల నుంచీ ఆ మరిది... వాడి దెంత కటికిగుండో కాని... నానా హింసలు పెడుతున్నాడు. మీ నాన్న గారేనట, వాళ్ళకి నాలుగైదేళ్ళనాడు అన్నాదమ్ముల భాగాలు పంచిపెట్టి, పారీకత్తులు రాసిచ్చింది. ఆ కాస్త కొంపకూడా కలుపుకుపోతే, ఆమె తను వెలా గడుస్తుంది? అడిగేవారు లేకపోబట్టే గదా, వాడు ఆమె నింతగా కాల్చుకు తినడం! మీరు కాస్త జోక్యం కలిగించుకుని, ఆమెకు కోర్టు వ్యవహారం... మోహనరావు (ముక్కుపై వేలు వేసుకుంటూ) : ఔరా! కవిత్వం పలికే నోటితో కూటసాక్ష్యాలు పలకమంటావా? అనసూయ : ఇందులో అబద్ధ మేమున్నదండీ? వాళ్ళు ఏనాడో వేరుపడ్డ సంగతి... మోహనరావు (చేతిలోని కాగితాలను నేలకు విసిరికొడుతూ) : చాల్ చాల్లే! పాపం వాళ్లు, పాపం వీళ్లు అంటూ అందర్నీ తెచ్చి నా నెత్తి నెక్కించు. ఈ వాతావరణంలో కళాసృష్టి ఏం జరుగుతుంది? రసాధిదేవతను ఏమి ప్రసన్నం చేసుకోగలం? రసవాహినులను ఎలా ప్రవహింప జేస్తాం? అందుకే కవి నిర్జనప్రదేశానికి పోవాలి; ఏకాంతవాసం చెయ్యాలి. నేనూ పోతాలే ఏ నదీతీరానికో, ఏ పర్వత ప్రాంతానికో, ఏ అరణ్యగర్భానికో! అనసూయ (తెల్లబోయి) : అయ్యొ రామ!! తెర)

  దొంగ: దొర (ఏకాంక నాటిక)

పాత్రలు: సుబ్బయ్య (రంగస్థలం పై), గుమాస్తా (నేపథ్యంలో) గమనిక : ఒక పాత్రను రంగస్థలంపై నిలిపి, రెండవ పాత్రను నేపథ్యంలో వుంచి, అమెరికన్ నాటక కర్త యూజీన్ ఓనీల్ “బిఫోర్ బ్రేక్ ఫాస్ట్” అనే ఏకాంక నాటికను రచించాడు. కేవలం ఆ టెక్నిక్ మాత్రం ఈ నాటికలో అనుసరించబడింది. టెక్నిక్ లో తప్ప, తక్కిన అన్ని విషయాలలో ఇది స్వతంత్ర రచన. శ్రీరామరాజ్యం రైసుమిల్లు ఆఫీసు రూమ్. కుడివైపున వీధితల ద్వారం, ఎదురుగా రెండు పెద్ద కిటికీలు. ఆ కిటికీలగుండా దూరాన చెట్లూ, ఆకాశమూ కనబడుతూ వుంటాయి. ఆఫీసు రూమ్ ఎడమపక్క గుమాస్తాల గది. పైభాగంలో రంగు అద్దాలు అమర్చబడిన బల్లకూర్పుతో (గ్లాస్ పేస్ట్ వుడెన్ పార్టిషన్ తో) ఆఫీసు రూమ్ లోని ఎడమభాగమే గుమాస్తాల గదిగా ఏర్పాటు అయివుంటుంది. బల్లకూర్పు మధ్య ఒక ద్వారం. రానికి “స్వింగ్ డోర్స్” (స్ప్రింగ్ తలుపులు). ఈ తలుపులకు రెండు వైపుల కోట్లు తగిలించుకోడానికి రెండు చిలకకొయ్యలు. గది మధ్యగా ఒక పెద్ద టేబుల్. దానిమీద టెలిఫోన్, లెటర్ బాక్స్, వ్రాతపరికరాలు, రబ్బర్ స్టాంపులు వగైరా. టేబుల్ కు ఒకవైపున (ప్రేక్షకులకు సమ్ముఖంగా) ఒక చేతులున్న కుర్చీ; తక్కిన వైపుల మరి అయిదారు చేతులులేని కుర్చీలు. తెర లేచిన ఒక క్షణానికి శ్రీరామరాజ్యం రైసుమిల్లు యజమాని సుబ్బయ్య ప్రవేశిస్తాడు. అతని వయస్సు నలభై పైన, నలభై అయిదు లోపు. పొట్టిగా, పలచగా వుంటాడు. 'కోలముఖం, చిన్న నుదురు, చింకి కళ్లు, పీచు మీసం. పంచె కట్టి, కోటు తొడిగి, మెడచుట్టు నాలుగైదు మెలికలు చుట్టి ఉత్తరీయాన్ని వేసుకున్న సుబ్బయ్య ఆఫీసు రూమ్ లో ప్రవేశిస్తూనే ఒక చిలక కొయ్యవద్దకు వెళ్లి, ఉత్తరీయాన్ని తీసి దానికి తగిలిస్తాడు.

సుబ్బయ్య (స్వింగ్ డోర్సులో ఒకదాన్ని బయటికి లాగి, లోపలికి తొంగిచూస్తూ, లోపలున్న గుమాస్తాతో) : ఏఁ! ఇంకా పెన్సిళ్లు చెక్కడం కాడే వున్నావ్? ఒక బద్దీకత్తి పుచ్చుకుని పొద్దస్తమానం పెన్సిళ్ళు చెక్కిపారెయ్యడ మొక్కటే కనబడుతుంది. పనీ పంగూ లేదు. (స్వింగ్ డోర్ ను అతడు విడిచి పెట్టగా అది రఫీమని మూసుకు పోతుంది. కోటు విప్పి, దాని జేబులో నుంచి కళ్లజోడు తీసుకుంటాడు. ఉత్తరీయాన్ని తగిలించిన చిలకకొయ్యకే కోటు కూడా తగిలించి, అతడు టేబుల్ వద్దకు వెడతాడు. సుబ్బయ్య (టేబుల్ పై పెట్టివున్న టపాను అందుకుంటూ, గదిలోని గుమాస్తాను ఉద్దేశించి) : రెండో గుమాస్తా యివ్వాళ కూడా రానట్టేనా? ఇంకెన్ని రోజు లింట్లో పడుకుంటాడు! (లోపలనుంచి ఏదో జవాబు వస్తుంది. అది మనకు వినబడదు; ఇంతలో ఒక ఉత్తరాన్ని విప్పి దాన్ని చదువుకోసాగిన సుబ్బయ్య ఆ జవాబు వినిపించుకోడు. సుబ్బయ్య (ఆ ఉత్తరాన్ని పూర్తిచేసి, మరొకదాన్ని విప్పుతూ) : ఆఁ! ఏమన్నావ్?

( జవాబుకోసం నిరీక్షించకుండానే మూడవ ఉత్తరాన్ని చదవ నారంభిస్తాడు. సుబ్బయ్య : చందాలట! చందాలు!! ఇక్కడ పోగేసుకు కూర్చున్నాం అందరికీ పందేరం పెట్టడానికి! (ఆ ఉత్తరాన్ని ముక్క ముక్కలుగా చించి, బుట్టదాఖలు చేస్తూ) వెధవలు! తెంపి వెధవలు!! నిమ్నజాతి సంఘమట. హాస్టలు పెడతారట. అడ్డమైనవాడికీ ఇప్పుడు చదువులు కావాల్సొచ్చాయ్! ఈ పాడు చదువులొచ్చాకే అలగాజనానికి కాల్గొచ్చాయ్. ధర్మఫండు ఇలాంటివాళ్లకి దొబ్బబెట్టడానికేనా! ఏ రామభజన కూటానికో, ఏ సాయిబాబా భక్తసంఘానికో ముట్టజెబితే పుణ్యం, పురుషార్థం. అంతే కాని... (తర్వాత ఒక కార్డు అందుకుని, దాన్ని చదువుకుని, కలర్ పెన్సిల్ తో దానిమీద ఏదో రిమార్కు వ్రాసుకుంటూ గుమాస్తాతో) ఆఁ! అయితే? (సందర్భంలేని ఈ మాటతర్వాత మరొక కవరు చించి, కవరులోనుంచి ఉత్తరం త్వరగా బయటికి రాకపోగా విసుక్కుంటాడు. సుబ్బయ్య (ఉత్తరాన్ని ఎలాగో బయటికి లాగి దాన్ని చదువుకుంటూ గుమాస్తాతో) : మొన్నరాత్రి హోటల్ వాడి లారీరాలా?... ఆఁ?... అంకిలి నొక్కుకుపోయిం దేమిటి? నోటమాటే పెగలడంలేదు! (ఈమాటలు అంటూనే ఉత్తరాన్ని కంటితో చదువుతూ) వచ్చి, వెళ్లిందటగా! ఆమాట వీడే రాస్తున్నాడు. “మొన్నరాత్రి పెద్దయ్య ఇక్కడికి సుఖంగా చేరాడు.” పెద్ద లారీనే పంపించాడూ? (గుమాస్తాతో) అయితే ఓ దేభ్యం! పనిలో పని, ఆ రేషన్ కొట్టువాడికి కూడా ఒక పదిమూట లెత్తించకపోయావూ? (ఉత్తరం మొదటి పేజీ పూర్తి చేసి, రెండవదాన్ని లోలోపల చదువుకుంటూ) మళ్ళీ అప్పుడే సరుకు కావాలంటాడేమిటి? వెధవ! దొంగ వెధవ! తన హోటల్ కని ఖరీదుచేసి, అక్కడ మారుబేరం సాగిస్తున్నట్టున్నాడు. వీడి హోటలే ఒక నల్ల బజారు. నల్ల బజారే అన్నమా టేమిటి? పిల్ల బజారు కూడా. వాటికి తోడు బియ్యం బజారుకూడా పెట్టాడు కాబోలు! దొంగ లాభాలు పోసుకోడానికి కాకపోతే, అప్పుడే మళ్లీ వీడికి సరుకెందుకు? టౌన్ స్టేషన్' సబిన స్పెక్టరు నిన్నే బదిలీ అయ్యాడని ఎవరో అన్నారు. కొంచెం నోటి దురుసుతన మున్నా, బోళా మనిషి. తన మామూలు తనకు ముట్టజెపితే, మళ్ళీ మన జోలి కొచ్చేవాడు కాదు. కొత్తవాడు ఏ బాపతో మన కింకా తెలవదు. వాణ్ణి ఆకట్టుకోందే సరు కెలా పంపిస్తాం? (ఆ ఉత్తరాన్ని ఒక పక్కగా పెట్టి, ఆనాటి టపాలో మిగిలి వున్న కార్డును చదువుకుంటూ) ఆరి వీడి తస్స దియ్య! ఈ పెద్ద గుమాస్తా మరి వారం, పదిరోజుల దాకా రాలేడటేఁ! ఒక దారీ తెన్నూ లేకుండా లెక్కలన్నీ తీన్ రాగా వున్నాయి. ఇన్కమ్ టాక్సు వాళ్లు లగాలగీ అంటున్నారు. (ఆనాటి ఉత్తరాలను డ్రాయర్ లో ఒకమూల భద్రంచేస్తూ) అబ్బబ్బ! ఈ గుమాస్తాగాళ్ళతో చెడ్డ బెడదైపోతే! పెద్ద గుమాస్తాకి కూతురు పెళ్ళిస్తే, రెండోవాడికి రోగ మొచ్చిందట! ఏం రోగమో, మాయరోగం! పని తొందరు న్నప్పుడే వీళ్ళకి రోగాలూ, నెప్పులు వస్తాయ్. వొళ్లు బలిస్తే సరి, రోగాలొస్తాయ్! రావూ? మందు తింటానంటే వాడి కొక నెలజీతం ముందే పారెయ్యడం పొరపాటై పోయింది. అది చేతిలో పడ్డాక రెండు, మూడు రోజులైనా వాడు తిన్నగా ఆఫీసు కొచ్చాడో, లేదో! ఆ రెండు, మూడు రోజులైనా వాడు మిడికిన పనేముంది? ఖంగ్ ఖంగ్ మంటూ చెవికింద దగ్గుతూ కూర్చోడం తప్ప. ఆకలి చచ్చిపోయిందట! ఆకలి!! ఎక్కడ చచ్చిందీ ఆకలి! మొన్నేగా ఈ మూడో గుమాస్తా బడుద్ధాయ్ గాణ్ణి కూడగట్టుకుని తమకు జీతం చాలడం లేదంటూ తెగబారెడు పిటిషన్ పెట్టాడు. ఈ యుద్ధం రోజుల్లో కాగితాలకు అసలే కరువుగా వుంటే, రెండు రావులు ఖరాబు చేశాడు. తమ అబ్బగాడి సొమ్మేమీ పోలేదుగా! ఎన్ని పిటిషనులైనా పెడతారు. ఆ కాగితాలు నావి, ఆ కలాలు నావి, ఆ పాళీలు నావి, ఆ సిరాబుడ్లు నావి. నా ఖర్చుతో నాకే అర్జీలు! సాయంత్ర మయ్యేసరికి ఆ ముచ్చుముఖం వాడికి కాక తగిలినట్టుగా వుంటుందట! ఇద్దరికి ముగ్గురై పని తగ్గేసరికి ఎన్ని రోగాలైనా పుట్టుకొస్తాయ్! వెధవలు! అంట్ల వెధవలు!! (గుమస్తాతో) సర్లే! ఆ చిట్టా, ఆవర్జా లిలా తగలెయ్! ఈ రెండు రోజుల నుంచీ లెక్కలేమైనా సరిచూశావా? గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా? బద్దీ కత్తితో పెన్సిళ్ళు చెక్కి పారెయ్యడం తప్ప, నీకు పనెక్కడ కదులుతుందిలే! నిన్ను నమ్ముకుంటే ఇన్ కమ్ టాక్సు వ్యవహారం నిర్వాకమైనట్టే!

(గుమాస్తా గదిలోపలవుండే చిట్టా, ఆవర్జాలను అందిస్తాడు. అతని చెయ్యిమాత్రం మనకు కనబడుతుంది. అది పుల్లలాంటి చెయ్యి. సగంవరకు దాన్ని కప్పివున్న చొక్కొ చిరిగిపోయి వేలాడుతూ వుంటుంది. చిట్టా, ఆవర్జాలను అందిస్తుండగా ఆ చెయ్యి కొంచెం వణుకుతున్నట్టు మనం గమనిస్తాముగాని, సుబ్బయ్య దాన్ని కానడు.

సుబ్బయ్య (చిట్టా, ఆవర్జాలను అందుకుంటూ) : ఏఁ? లోపల నక్కుతున్నావే దొరికిందిగదా అని చెప్పినపని సున్నా చుట్టి, ఊరట్టుకు అడుక్కుతిన్నా వేమిటి?

			(చిట్టా విప్పి కొన్ని పేజీలు చకచక తిప్పివేస్తాడు. ఎక్కువ పేజీలు తిప్పివేసి నందువల్ల 

వెనక్కి వచ్చి, ఒక పేజీ వద్ద ఆగుతాడు. సుబ్బయ్య (గుమాస్తాతో) : ఏం రాతిది? బ్రహ్మరాత! తెలిసేటట్టు అక్షరాలు విడివిడిగా రాయమంటే, గొలుసుకట్టు అఘోరిస్తావ్ దేనికి? (నొసలు ముడివేసి) ఏమి టిది? బొబ్బా?... ఉహుఁ!... బొప్పన?...ఆఁ! బొప్పనే... లింగన్నగారికి వంకసన్నాలు నలభై రెండు బస్తాలకి బస్తా ఒకటింటికి పన్నెండు రూపాయల రెండణాల ఆరు పైసల చొప్పున అయిదు వందల పది రూపాయల... (టెలిఫోన్ గంట గణగణ మోగుతుంది. సుబ్బయ్య (రిసీవర్ అందుకుని) : హలో! ఆఁ! శ్రీరామరాజ్యం రైసుమిల్లే... ఊఁ! ఊఁ! సుబ్బయ్యనే... ఏమిటది?.... సర్కిల్ గారు మాట్లాడతారా? అయ్యొ! అంతకంటేనా! మాట్లాడమనండి... నమస్కారమండీ! నమస్కారం! అమ్మగారు కన్నారింటినుంచి తిరిగొచ్చారా?... మొన్న హెడ్డు చెప్పాడు లెండి, రేపో మాపో వొస్తున్నారని - ఆఁ! చిత్తం! చిత్తం! అలాగే లెండీ, అదెంత భాగ్యం!... ఆఁ! ఆఁ! అరమూట చాలంటారా? పనిలోపని ఒక మూట... సరే, అలాగే!... ఢిల్లీ భోగాలే. వంక పెట్టడానికి వీల్లేదు. నాణ్యమైన సరుకు... అబ్బే! అవల్ రకమండీ! ఎంతమాట! తమకి కొత్తవి పంపిస్తామా? పాతవే. పాతరేసినొడ్లు. మనింట్లోకని స్పెషల్ గా రెండు పుట్లు కొన్నాం లెండి. మొన్నే నాలుగుబస్తా లాడించాను. వాటిలో నుంచే...ఆఁ? కిందటిసారి కొత్త బియ్యం...ఆఁ! ఔనౌను! హెడ్డు ఆ మాట చెబితే నే నెంత నొచ్చుకున్నానని! నే నూళ్ళో వుంటే అలాంటి పని జరిగేదా? మా రెండో గుమాస్తాగాడికి చెప్పి, ఇన్కమ్ టాక్స్ వాయిదాకని నేను ... వా డొర్రి వెధవలెండి! చచ్చు వెధవ! అయ్య!.... అయ్య.... ఆఁ! ఆఁ! వాడే మింగ మెతుకులేదుగాని మీటింగు లెడతాడు.... ఆఁ! తీసి పారేద్దునుగాని, మనిషిపోతే మనిషి దొరకడం లేదండీ! ఈ యుద్ధ మొక టొచ్చాక గుమాస్తాగాళ్ళకీ గిరాకీ వచ్చిందయ్యె.... ఆఁ! ఆఁ!... చిత్తం! చిత్తం! మరొక గంటకి మూట మీ యింటి దగ్గరుండకపోతే న న్నడగండి! మా లారీ రాగానే...మంచిదండీ, అయ్యా! సెలవ్!! (టెలిఫోన్ రిసీవర్ పెట్టివేస్తాడు. సుబ్బయ్య (చిట్టా తిరిగి అందుకుంటూ) : తేర సొమ్ము తెగతిని బలిసి కొట్టుకుంటున్నాడు. వీడి కథ, వీడి కమామిషు ఎవడికి తెలవదు! నిన్న మొన్నటిదాకా వీడు కనిస్టేబులేగా? కాంగ్రెసు వాళ్ళకి మతులు పోబట్టే వీడి గీత బయటపడింది. ఉన్నచోటుండక ఆగస్టు ఉద్యమం, వాళ్ళ తలకాయ అంటూ బుడ్డగంతులేస్తే, వాళ్ళ మక్కి లిరగొట్టి వీడు సర్కిలయ్యాడు. లేకపోతే, ఎక్కడుండేవాడో! కొత్త బియ్యం తినలేడట! అన్నం కాస్త చిమిడితే వీడి గొంతు పట్టు కుంటుంది కాబోలు! మహమహవాళ్ళే ఇప్పుడు కొత్తపాతా చూడ్డంలేదు. దుమ్మూ, దుట్రా కలిసినా గింజొకటి దొరికితే చాలని కళ్ళ కద్దుకుంటున్నారు. తెల్లారి లేస్తే ఏదో ఒక పని పడుతుంది గదా అని, అడగ్గానే నంబర్లు పంపిస్తే, కొత్త బియ్యమట! కొత్త బియ్యం!! వీ డబ్బుగాడి సొమ్ము ఇక్క డేదో దాచిపెట్టినట్టు! తేరగా తెమ్మనేది కాకుండా తప్పు పడుతు న్నాడయ్యా, తప్పు!! (చిట్టా ఒక పక్కని పెట్టి, ఆవర్జా తెరుస్తాడు. చిట్టా చూస్తూ, ఆవర్జా పేజీలు తిప్పుతూ, కలర్ పెన్సిల్ తో టిక్కులు పెడుతూ పోతాడు. సుబ్బయ్య : కళ్ళు పోతున్నాయ్ ఈ రాత తెలవక. ఏం రాత? పాడురాత! (గుమాస్తాల గదివైపుకు తిరిగి) ఇదుగో నబ్బాయ్! ఇఖ నువ్విలా రాశావంటేనా; యింటికి నడవొచ్చు. (మళ్లీ చిట్టావైపుకు తిరిగి) “ఈడ్పుగంటి రాఘవయ్యగారి ఖాతాకు ధనిగుజారున చెల్లించిన రొక్కం ఏడువందల యాభై రూపాయలు". మళ్ళీ వీడు ఏడున్నరవందలు పట్టుకుపోయాడూ? మరీ లెక్కాపత్రం లేకుండా వాడుకుంటున్నాడేఁ! వీడు తోలింది ముప్పై పుట్టేగా? ఖాతా వాడుకోవడంలో ఈ ధరాటా యేమిటో వీణ్ణి కాస్త కనుక్కోవాలి. (ఇంతలో టెలిఫోన్ తిరిగి మోగుతుంది. సుబ్బాయ్య (రిసీవర్ అందుకుని) : హలో! హలో.... ఆఁ?... అబ్బే! మర్చిపోలేదు. తెప్పించి పంపిస్తా.... ఎప్పుడోనా? అబ్బే! ఇదుగో! ఇప్పుడంటే యిప్పుడే... (ఆ నంబర్ డిస్కనెక్ట్ చేసి, కొత్త నంబర్ డయిల్ అడుగుతాడు. సుబ్బయ్య : హలో! రావుగారేనా?... ఆఁ! నేనండీ! శ్రీరామరాజ్యం రైసుమిల్లు సుబ్బయ్యగారిని. మా చిన్న పిల్లవాడు కొన్ని రోజులుగా నలతగా వుంటున్నాడు. డాక్టరుగారికి చూపిస్తే, పాలలో పంచదార మానేసి, గ్లూకోజ్ వాడమన్నారు. ఒక పౌను డబ్బా... మీరే ఇలాగంటే ఎలాగండి? ఈ సాయం మీరు చెయ్యాలి. మాట తీసెయ్యొద్దు... పోనీ, ఒక అరపౌను డబ్బా... కనీసం పాతిక పౌను... అయ్యయ్యొ! మీవల్ల కాకపోతే, మరెవరివల్ల... ఏ ధరకైనా సరే... అబ్బెబ్బే! మీ షాపులో వుందని కాదు. మీపరంగా మరెక్కడైనా తెప్పించి... కాస్త వాకబు చేసి చూడండి, మీకు దొరక్కపోతుందీ!... ఎంతైతే తప్పుతుంది? - మన కవసర మొచ్చినప్పుడు! మీ రెలాగైనా మాట దక్కించాలి... వుంటానండీ, వుంటాను! (రిసీవర్ పెట్టివేస్తాడు. సుబ్బయ్య : వెధవ! ఆశపాత్రపు వెధవ! దొంగలాభాలు దొబ్బమరిగి, వుంచుకునే లేదంటున్నాడు! మరెక్కడో తెప్పించానంటే, అక్కడికి పెద్ద మెహర్బానీ చేసినవాడూ అవుతాడు; నల్లబజారు ధర పుచ్చుకున్నవాడూ అవుతాడు! పిల్లవాడికి కావాలని చెప్పినా, వాడి లేకి బుద్ధి వా డెందుకు పోనిస్తాడు. వెధవ! బందిపోటు వెధవ!! (చూపు మళ్ళీ చిట్టా, ఆవర్జాలమీదికి పోతుంది. మౌనంగా కాసేపు పద్దుల్ని సరిచూచుకుంటాడు. సుబ్బయ్య (గుమాస్తాను ఉద్దేశించి) : ఏం పనిది? తిరపతి మంగలి పని! చిట్టాలో పద్దులు ఆవర్ణాలోకి ఒక టెక్కితే ఒక టెక్కలేదు. నువ్వు వొళ్ళాంగి పనిచేస్తేనా? చుంచు ముఖమూ, నువ్వూను! కూటికైన గతి లేదంటూ కాళ్ళా, వేళ్ళా పడ్డావని దగ్గరికి తియ్యడంగాని, నిన్ను పనిలో పెట్టుకోమనున్నదీ? ఎప్పుడు చూసినా, ఈదురోమంటూ వుంటావ్. ఏల్నాటి శని నీ ముఖానే వుంటుంది. ఒక్కరోజు ఆ పెద్దగుమాస్తా రాకపోతే అంతా ఖంగాళీయే! ఈ ముష్టిపనికే వీళ్ళకి జీతాలు చాలవట. నెలకి పాతిక, ముప్ఫై చొప్పున పోసుకుంటున్నా నెప్పే! వీళ్లు ప్యాసయిన బి.ఏ.లు, యం.ఏ.లు హితాయి పోతున్నాయా? వెధవలు! పింజారీ వెధవలు!! వీళ్ల నసలు రామరామ అనగూడదు. ఎందు కీ ఆవర్జా? అంతా తిన్నగా మండబెట్టినట్టు చేతికిచ్చావ్! (ఆవర్జాను ఫెడేలున మూసి ఒక పక్కకు తోసివేస్తాడు. సుబ్బయ్య (చిట్టా మాత్రమే చూస్తూ) : “తవుడు ఖాతాకు జమ : వెరసి అమ్మకం పదకొండు బస్తాలకు, బస్తా ఒకటింటికి...” ఏ తారీఖు నిది? పదహారు - ఏడు - పందొమ్మిదివందల నలభై నాలుగు ఈ మధ్య ఏనాడూ యాభై, అరవై బస్తాలకు తక్కువ అమ్మడంలేదేం! (గుమాస్తాను ఉద్దేశించి) ఇదుగో! ఓ చవట పెద్దమ్మా! నిన్నే! కూడికలు తిన్నగా మిడికావా? కునికిపాట్లు పడుతూ చేతి కెంతొస్తే అంత వేశావా? నిద్ర మొఖం, నువ్వూను! (టెలిఫోన్ మోగుతుంది. సుబ్బయ్య (రిసీవర్ అందుకుని) : హలో!... ఎఫ్.ఐ. గారా? అయ్యా! నమస్కారమండీ! నమస్కారం! అబ్బే లేదండీ! మూడురోజులనుంచీ ఫ్యాక్టరీ ఆడ్డంలేదు. ఇంజను పిస్టను దెబ్బ తినింది.రిపేరుకు పంపించాం...ఆఁ?...ఆఁ! ...రేపో, మాపో తిరిగి ఆడతాం... లేదండీ! రెండు రోజుల నుంచీ ఊళ్లో లేను. ఇవ్వాళ పొద్దున్నే తిరిగొచ్చాను... అబ్బే! పద్దు పుస్తకాలు చూచు కుందామని... ఇన్ కమ్ టాక్సు లెక్కలొచ్చి నెత్తిని కూర్చున్నాయ్! ... ఆఁ! అన్నింటికీ నేనే నుంచోవాలి. పెద్ద గుమాస్తా లిద్దరు సెలవుమీ దున్నారు. చిన్నవాణ్ణి పెట్టుకుని నేనే దేవులాడు తున్నా... (నవ్వుతూ) అయ్య! తమకేమండీ? తమరు మహరాజులు.. అయ్య!... అయ్య!... చిత్తం!... అబ్బబ్బే! తమకు మాట రానిస్తామా?... మొన్న బళ్లారికి బట్వాడా చేసిన వెయ్యిబస్తాల మాటేనా? ... ఆ బియ్యంలో సగానికి సగం మట్టేనన్నారూ? రామరామ! అం తెక్కడిదండీ? వుంటే, గింటే ఏ కొంచెమో వున్నదేమో! నిజంమాటకి అస లిప్పుడు రైతు సజావుగా గింజ అమ్ముతున్నా డండీ! తప్పా, తాలూ, దుమ్మూ, దూగరా, మానుకాయా, మసిని కాయా - అన్నీ కలిపి... అబ్బే! మనం ఎగుమతి చేసినప్పుడు పురుగులేదు. గాలిపాటుకు తర్వాత ఏమైనా పుట్టిందేమో!... అబ్బే! మేకు లెక్కడివండీ? ఇను మిప్పుడు అసలే కరువుగా వుంటే!... చిత్తం!... అయ్య!... చిత్తం!... అయ్య!... వారంనాటికే?... మూడువేల బస్తా పచ్చిబియ్యమా?... అంత ఆర్డరుకు మన దగ్గర ధాన్యం స్టాకులేదేఁ!...మొత్తం స్టాకు ఎంతంటారా?... హోల్‌ మొత్తం అయిదువేల రెండువందల బస్తాలండీ!... చిత్తం, అంతేలెండి! అయిదువేల రెండువందల బస్తా ధాన్య మాడితే, కటాకటిగా రెండు వేల అయిదువందల బస్తా బియ్యమే దిగుబడి!... ఆఁ! అయితే, తమ దయ వుండాలేకాని, ఆ సరుకునే మరొక వంద బస్తా దేకించి, రెండువేల ఆరువందలు చెయ్యకపోతామూ?... ముతకలే అనుకోండి. కాని, మీరు సర్టిఫై చేస్తే ముతకలు సన్నాలై పోవటండీ.... ఆఁ! మద్రాసుకైతే మరీ మంచిది! అక్కడ సన్నాలేవో, ముతకలేవో ఏ విధ తెలుసండీ.... అయ్య! మరొక ఆర్డరుకూడా వుందా?... ఆఁ? ఉప్పుడు బియ్యానికా?... కాని, రైతు ధాన్యమమ్మితేనా? వాళ్ళ ఆశకి అంతులేదు. పోసుకున్న కొద్దీ ఇంకా పోసుకోవా లంటున్నారు. కార్తీక మాసం నాటికి మరింత గిరాకీ వస్తుందేమోనని నిల్వపోసుకు కూర్చున్నారు.... బ్లాకు చెయ్యడంలో వాళ్ళ తర్వాతే. తమ రిప్పిస్తానంటే, సరుకు చూపించడ మెంత పనండీ!... ఓఁ! చాలా వుంది... రామ్మూర్తిలేడూ? అతనిదగ్గిర... ఆఁ! ఆఁ! ఆ ఊరువాడే! ఆ ఊరు మొత్తంమీద అతనే మోతుబరి ఆసామి. బాగా మదాయించి వున్నాడు...ఆఁ! అతనే! అత నొక్కడిదగ్గిరే వెయ్యిబస్తాదాకా ధాన్యం వుంది. తలవాకిట్లో వామిలాంటి పురికట్టుకు కూర్చున్నాడు. తమరు దాన్ని రిక్విజిషన్ చేసి మన కప్పిస్తే... అయ్య! చిత్తం! చిత్తం!! దయమట్టుకు వుంచండి. తమరొక కంటితో కనిపెట్టకపోతే... నమస్కారమండీ! నమస్కారం! (రిసీవర్ పెట్టివేస్తాడు. సుబ్బయ్య : వీడికి బుద్ధి లేదు. ఇలాంటి సంగతులు టెలిఫోన్లో మాట్లాడొద్దురా అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినడు. అన్నీ మనరోజులే వుంటాయా? వెధవ! బుర్రలేని వెధవ. తెలివి తేటలకు ఆ జి.పి.ఓ.నే చెప్పుకోవాలి. పురుగునైనా దరిదాపులకు చేరనివ్వనట్టే వుంటాడు; అయినా, లక్షలకు లక్షలే దండుకుంటున్నాడు. ఆ జి.యం.ఒ. కూడా గడుసువాడే! మడి కట్టుకున్న వాడిలా బలే నాటకమాడతాడు. లొడలొడ వాగుడుగాళ్లు ఫుడ్ ఇన్ స్పెక్టరూ, ఆ లోడింగ్ క్లర్కుగాడూ వున్నారుగాఁ! వసూళ్లు చెయ్యడం వీళ్ళ పని; వాటాలు పంచుకోవడం వాళ్ళ పని. ఎగుడు దిగుడేమైనా వస్తే బొక్కలో వీళ్ళే కూర్చుంటారు, పైవాళ్ళిద్దరికేఁ? వాళ్ళకొచ్చే ప్రమాద మేమీ లేదు. (చిట్టా అందుకుని. కళ్ళజోడు సరిచేసుకుంటూ) ఎంత పోసుకున్నా వీళ్ళ దాహం తీరదు. ఎదురింకా మట్టీ గిట్టీ అంటాడు. ఏదో ఒక కొత్తడం చెయ్యందే వీళ్ళకు గుమ్మరించే సంచులన్నీ ఎక్కడి నుంచొస్తాయ్! ఈ యఫ్.ఐ. గాడు మరీని! నిన్నకాక మొన్నొచ్చాడు. అప్పుడే ఒక లకారం చేతబట్టాడు. దాని పుణ్యమా అని యుద్ధ మొక టొచ్చి బాగుపడ్డాడు గాని, వీడి నెత్తిని కానీ పెట్టి వేలంవేస్తే యేగాణీకి కొనేవాడుండేవాడా? వెధవ! లంచగొండి వెధవ!! (చిట్టా పేజీలు తిరగవేస్తూ వుంటాడు. సుబ్బయ్య (విసుగెత్తి పోయినట్టు చిట్టాను కూడా రపీమని మూసి, దాన్ని ఒకపక్కకు నెట్టి వేస్తూ) : అబ్బబ్బ! కళ్ళు పోతున్నాయ్, ఈ పాడురాత తెలవక! కోడి కెలికిన పేడలానే వుంది. నీ దెవసం రాత! అసలు నీ వల్ల ఏం పని కదులుతుందిలే! రేపు ఆ పెద్ద గుమాస్తా దగ్గిరికి మనిషి నురికించాలి, చప్పున తెముల్చుకు రమ్మని. ఆ పెళ్ళీ పెటాకులూ ఎప్పుడో అయిపోయాయిగా! వీ డింకా అక్క డేమి అఘోరిస్తున్నాడు? పోనీలే, కూతురు పెళ్ళంటున్నాడని ధర్మపండు ఖాతాలో ఖర్చురాసి, నాలుగు బస్తాల బియ్యం కొలిపించా. అవి తినేశేదాకా కదలడు కాబోలు! వెంటనే బయల్దేరి రాకపోతే నాగాలు కట్టి, జీతం తెగీస్తే సరి! అప్పుడుగాని బుద్ధిరాదు. సర్లే! ఆ అనామతుఖాతా పుస్తక మిలా తగలెయ్! (ఒక క్షణం ఆగి) లోపల ఏం మిడుకుతున్నావ్? వెధవ! చచ్చు వెధవ!! తే! త్వరగా తే!! (లోపలవుండే గుమాస్తా అనామతుఖాతా పుస్తకం అందిస్తాడు. ఈసారి అతని చెయ్యి గజగజ వణికి పోతూ వుంటుంది. సుబ్బయ్య : ఏఁ? చెయ్యికి వొణుకు పుట్టింది? నీక్కూడా మాయరోగ మేదైనా వచ్చిం దేమిటి? - పని మన్నాచేసి ఇంట్లో పడుకోడానికి! (అనామతుఖాతా పుస్తకం తెరిచి, దాన్ని మౌనంగా ఒకటి, రెండు నిమిషాలు తిరగవేస్తాడు. సుబ్బయ్య : మళ్లీ ఈ ప్లీడరు అరమూట బియ్యం వేయించుకు పోయాడూ? ఏమిటి మనకి ఈ మెహర్బానీ! ఏదో శుభకార్యం వచ్చిందని మొహమోట పెడితే, నాలుగు బస్తాలు రాయితీగా యిచ్చామని వరస సాగుతున్నాడేం! తన ఫీజు తను తగ్గుతున్నాడా? ఈసారొస్తే నాకు తెలవదు, మా ఖామందు నడగమను! తన ప్రాక్టీ సేమో తను చూసుకోకుండా, ఈ ముండమోపి కాంగ్రెసు ప్రచార మంటాడు! ఈ కాంగ్రెసు వాళ్ళు కాదూ దేశాని కిన్ని తిప్పలు తెచ్చింది. స్వరాజ్యం కావాలట; యుద్ధం వొద్దట! స్వరాజ్య మొచ్చి బువ్వ పెడుతుందా? దాని పుణ్యమా అని ఈ యుద్ధ మొచ్చాకే ఎవడికైనా నాలుగు డబ్బులు కళ్ళబడుతున్నాయి. ఆగకుండా మరి నాలుగేళ్ళు ఇలాగే యుద్ధం సాగాలని మొక్కుకునేది పోయి... (మాట పూర్తిచేయకుండానే, కలర్ పెన్సిల్ పుచ్చుకుని, మొదటి పేజీలోని పద్దుల్ని కూడ నారంభిస్తాడు. సుబ్బయ్య (కూడిక సరిగా వున్నందున ఆ పేజీ తిప్పివేస్తూ) : ఊఁ! సరే! (రెండో పేజీ తిప్పి, దానిలోని పద్దుల్ని పైనుంచి కిందికి ఒకసారి చూస్తూ). మొన్నరాత్రి హోటల్ వాడికి తోలిన సరుకు పద్దు ఎక్కడా కనబడదేం? (మళ్ళీ ఒకసారి పైనుంచి కిందికి పద్దులన్నీ చూచి, వెనక పేజీలోకి వెళ్లి, దాన్ని కూడా తనిఖీ చేసి కుర్చీలోనుంచి చరాలున లేస్తూ) ఆరి వెధవ! దొంగ వెధవ! ఇదేమిటి? ఇలారా! ఎదటికి రా! ఇందుకేనా పొద్దుటి నుంచీ గదిలో నక్కి నక్కి కూర్చున్నావ్! ఇందుకేనా అనామతు ఖాతా తెమ్మంటే చేతులు గజగజలాడిపోయాయ్! నేను మరేమిటో అనుకున్నా! వెధవ! దగాకోర్ వెధవ! రావేరా? రా! బయటికి రా! (ఎంతకూ గుమాస్తా బయటికి రాకపోగా స్వింగ్ డోర్సు వద్దకు వెళ్ళి, ఒక తలుపును లోపలికి తోసి పట్టుకుని) దొరగారూ! అయితే, మొన్నరాత్రి హోటల్ వాడికి వేసిన సరుకు పద్దు అనామతు ఖాతాలో కనబడదేఁ? మాటాపలుకూ లేకుండా అలా గుడ్లు అప్పగించి చూస్తారేమండీ?... ఆఁ! ... ఎక్కించడం మర్చిపోయావూ? ముండమోపి! ? అయితే, క్యాషుందా? ఏదీ, క్యాషుబాక్సు బీగ మేదీ? క్యాషు తిన్నగా లేకపోతే, చూసుకో నీపని? ఈ పూట నీ పెళ్ళి చేశానన్న మాటే! (గుమాస్తా యివ్వగా క్యాష్ బాక్స్ బీగం అందుకుని, స్వింగ్ డోర్‌ను చరాలున వదిలివేస్తాడు. అది ఠపీమని మూసుకుపోతుంది. తన టేబుల్ పైనే వున్న క్యాష్ బాక్స్ తెరిచి, దానిలోని పైకాన్ని సుబ్బయ్య లెఖ్ఖ పెడతాడు. తర్వాత ఆ మొత్తాన్ని అనామతు ఖాతాలోని మొత్తంతో సరిచూస్తాడు. సుబ్బయ్య : వెధవ! దగుల్బాజీ వెధవ!! నువ్వు పద్దురాయడం మర్చిపోతే, క్యాషులో పెచ్చు కనబడదే? (ఒక్క గంతులో వెళ్ళి, స్వింగ్ డోర్ బయటికి లాగిపట్టుకుని, పట్టరాని కోపంతో మండిపడుతూ) వెధవ! బటాచోర్ వెధవ!! పన్నెండొందలు దొబ్బేశావ్! రా, బయటికిరా! నే నేం గుడ్డివాడి ననుకున్నావా? పన్నెండొందలు జేబులో వేసుకొని, క్యాషు బ్యాలెన్సుకూ, అనామతు ఖాతాకూ సరిపెడితే, ఆపాటి నేను కనిపెట్టలేననుకున్నావ్! ఇంతకీ తప్పు నాదేలే! బికారి వెధవ్వి - నీకు తాళాలప్పగించి వెళ్ళడం తప్పుకాదూ? ఏమిటి ఆ దెయ్యపు గుడ్లూ, నువ్వూనూ! గుడ్లు పెద్దవి చేస్తే, నేనేం భయపడతాననుకున్నావా? పళ్లు కూడా బిగిస్తున్నావ్! ఏఁ! వొంటిరిగా వున్నానని పైబడి కొడదా మనుకుంటున్నావా? వెధవ! చచ్చువెధవ! నీలాంటి వాళ్లని చాలామందిని చూశాలే! ఈ పప్పులు మనదగ్గి రుడకవ్. మర్యాదగా ఆ పైకం అప్పగించు. రద్ది మాస్తుంది. లేకపోతే, పాత చెప్పు పుచ్చుకుని ఈ దవడ, ఆ దవడ... ఆరి వెధవ! రౌడీ వెధవ! పైపై కొస్తావటరా? (స్వింగ్ డోర్‌ను వదిలిపెట్టి, చల్లగా యివతలికి వస్తాడు. సుబ్బయ్య (టేబుల్ వద్దకు చేరి, ముఖాన్ని పట్టిన చెమటను చొక్కాకే తుడుచుకున్న తర్వాత) : ఎందు కబ్బాయ్ చెడిపోతావ్! ఒక్కసారి చాలా డబ్బు కంటబడేసరికి ఎంత లావాడికైనా మనస్సు రెవరెవ లాడుతుందిలే! ఇలాంటి బుద్ధిపొరపాట్లు ఎవరికైనా వస్తాయ్! పెద్దవాళ్లు చెప్పినప్పుడు సర్దుబాటు చేసుకోవాలి! కాస్తా, కూస్తా పన్నెండొందలు. (స్వింగ్ డోర్ వద్దకు వెళ్ళి దాన్ని తెరుస్తూ) కాజేసిన పైకం బుద్ధిమంతుడిలా వాపసు చేశావంటే... చేతిలో ఆ బద్దీకత్తేమిటి? (ఒక అడుగు వెనక్కి వేస్తూ) ఆరి వెధవ! రాక్షసి వెధవ!! అది పెట్టి నన్ను పొడుస్తావా యేమిటి?

( భయంతో చేతిలోని స్వింగ్ డోర్‌ను చప్పున వదిలి వేస్తాడు. ఠపీమని అది మూసుకు పోతుంది. సుబ్బయ్య (వీలైనంత దూరానికి జరిగి) : ఉండు, వెధవ! పొగరుబోతు వెధవ! పోలీసులకు రిపోర్టిచ్చి నిన్ను బొక్కలో తోయిస్తా! పిల్లా జిల్లాతో కూటి కిలేక మలమల మాడి చస్తున్నావని నీ కొక దిక్కు చూపించినందుకు ఇదట్రా నువ్వుచేసే పని? నేను దగ్గరికి తియ్యకపోతే, నీకు పొయ్యిమీద కుండైనా యెక్కేద ట్రా? అన్నం పెట్టే చేతినే కరుస్తావూ? పన్నెండొందలు దొబ్బింది కాకుండా కత్తి చూపిస్తావూ! కాటా వాళ్ళుంటే, నిన్నిప్పు డిక్కడ పాతేయించేవాణ్ణి కాదూ? ఏమైనా ఈపూట నీ అంతు కనుక్కోకపోతే నన్ను సుబ్బయ్యని పిలవొద్దు. (టెలిఫోన్ రిసీవర్ అందుకుంటాడు. సుబ్బయ్య : హలో! హలో! పోలీసు స్టేషన్... ఔను! టౌన్ పోలీసు స్టేషన్ (కనెక్షన్ రాగానే) హలో సర్కిలుగా రున్నారా? ... అయ్యా! నేనండీ! శ్రీ రామరాజ్యం రైస్ మిల్లు సుబ్బయ్యని... సర్కిలుగారు లేరూ? అయితే, మీ రెవరు?... కొత్త సబిన స్పెక్టరుగారా? నమస్కారమండీ! నమస్కారం! మీ దర్శనమింకా చేసుకోలేదు.... నేను నిన్నా, మొన్నా ఊళ్ళో లేనండీ! నమ్మి, మా మూడో గుమాస్తాగాడికి తాళంచెవి అప్పజెప్పి వెళ్లితే, మొన్న రాత్రి లారీలో... ( తాను చేస్తున్న పని తప్పని తనకే తోచగా మాట తిప్పివేసుకుంటూ) అయ్యా! మ రేం లేదు. ఈ గుమాస్తాలను నమ్మడానికి వీల్లేదండీ! వీళ్లు పచ్చి దొంగ వెధవలు కారండీ! అందువల్ల... (గదిలోనుంచి ఏదో విరుచుకుపడ్డ చప్పుడు వస్తుంది. సుబ్బయ్య (గదివంక ప్రశ్నార్ధకంగా చూస్తూ) : సర్కిల్ గారు బియ్యం పంపించమన్నారు. ఈ గుమాస్తాగాళ్ళని నమ్మడానికి వీల్లేదు. మంచి పాతబియ్యం దగ్గరుండి పంపిద్దా మను కుంటున్నా. ఇంకా మా మిల్లు లారీ రాలేదు... అయ్య! చిత్తం! చిత్తం! (ఒక కంటితో గుమస్తాల గదివైపు చూస్తూ టెలిఫోన్ డిస్ కనెక్ట్ చేసి, సబ్ ఇన్ స్పెక్టరుతో ఇంకా మాట్లాడు తూనే వున్నట్టు నటనచేస్తూ) నేను ఊళ్ళోలేని సందుచూసి, మా మూడో గుమస్తా గాడు పన్నెండొందల రూపాయలు రొక్కం కొట్టేశాడండీ! ... ఆఁ! ఆఁ! అవునండీ! పన్నెండొందలు. ఎదురు, పొడిచేస్తానంటూ బద్దీ కత్తి పుచ్చుకుని పై పైకొచ్చాడు...ఆఁ! ఇక్కడున్నట్టు పంపించండి నలుగురు జవానుల్ని... మీరే వస్తానంటరా? చిత్తం! అంతకంటేనా? సెలవ్! నమస్కారమండీ! నమస్కారం! (అంతటితో టెలిఫోన్ లో మాట్లాడుతున్న నటన చాలించి రిసీవర్ పెట్టివేస్తాడు. సుబ్బయ్య (ఒక క్షణం ఆగి, గుమాస్తాల గదివైపుకు బెదురు బెదురుగా రెండడుగులువేసి) : వస్తున్నారులే నీ మొగుళ్ళు, చేతులకు బేడీలు తొడిగి, బొక్కలో తోస్తారు! ఒంటిరిగా చూసి నన్ననుకున్నావా బద్దీకత్తితో బెదిరించడానికి! వెధవ! పోకిరీ వెధవ!! పిల్లలుగల వాడివి, ఎందుకు చెడిపోతావుగాని, ఇప్పటికైనా బుద్ధికలిగి ఆ డబ్బు వాపసు చెయ్యి. ఇప్పుడైనా మించుకు పోలేదు. నా పైకం నాకిచ్చి, నా కాళ్ల మీద పడ్డావంటే, వాళ్ళకేదో సర్దిచెప్పి పంపిస్తా! తీరా వాల్గొచ్చి పట్టుకుపోయారంటే, మరి నీగతి కుక్కలొల్లవ్! పిల్లా పీచుతో గంపెడు సంసారమూ, నువ్వూనూ! తింటున్న కూటిలో మట్టి పోసుకోబోకు. నీ మంచికే చెబుతున్నా. పీకమీదికి తెచ్చుకున్నాక పస్తాయించి లాభం లేదు. (నెమ్మదిగా స్వింగ్డోర్స్ వద్దకు వెళ్లి, వాటిలో ఒకదాన్ని కొద్దిగా తెరిచి) నామాట విన్నావంటే జెయిల్ తప్పిస్తా! సర్కిలు మనచేతిలో వాడే నయ్యె! మన మాట దాటిపోడు. ఏఁ మాట్లాడవే? (బెదురు బెదురుగా లోపలికి తొంగి చూచి) ఆఁ! ఆఁ! కత్తితో మెడకోసుకు వచ్చాడు! చచ్చాడి! చచ్చాడు!! ఆరి వెధవ! పింజారీ వెధవ! నన్ను పీక్కుతినమని నా కొంపమీదికి పోలీసోళ్ళను తోలడానికట్రా! ఓరి వెధవ! దొంగ వెధవ!! (వెర్రిగంగిర్లు యెత్తినవాడివలె ఆఫీసురూమ్ లో గంతులు వేస్తుండగా తెర)   ఆడబ్రతుకు (ఏకాంక నాటిక)

పాత్రలు : సుందరి - పెళ్ళి ఈడు పిల్ల, సీతమ్మ - సుందరి తల్లి, రాజమ్మ - సుందరి మేనత్త, రంగమ్మ - సుందరి నాయనమ్మ. తమ “సుమంగళి", "స్వర్గసీమ” ఫిల్ములలోని మూడు పాటలను ఈ నాటికలో నేను ఉపయోగించుకొనడానికి అనుమతించిన వాహినీ పిక్చర్స్ లిమిటెడ్ వారికి కృతజ్ఞుడను.

1

అది సుందరిగారి యింటిలో ముందుగది. ఎదురుగా వున్నది సింహద్వారం. దానికి రెండు వైపుల రెండు కిటికీలు. కుడి చేతివైపు ద్వారం పడకగదిలోకి; ఎడమ చేతివైపుది భోజనాల గది, వంటిల్లు మొదలైన వాటిలోకి.

గోడలకు కొన్ని రవివర్మ పటాలు. పడకగది గోడసరసను ఒక స్టూల్. దానిమీద ఒక గ్రామఫోన్. భోజనాల గది గోడకు ఆన్చి ఒక టేబుల్. దానిమీద ఏవో కొన్ని ఆఫీసు రికార్డులు. తెర లేచినంతనే మనకు కానవచ్చే సుందరి పెళ్ళి ఈడు వచ్చిన పిల్ల. పేరుకు తగినట్టు అందకత్తె. కల్లా, కపటం యెరగదు. పగటి కలలు కనడంలో దిట్ట. చౌకపారు నేతచీర కట్టుకున్నది చేతికి ఒక జత బంగారం గాజులు, చెవులకు లోలకులు, మెడలో ఒంటిపేట గొలుసు.

తెర లేవబోతుందనగా ఈ కింది గ్రామఫోన్ రికార్డు “లో వాల్యూమ్"లో ప్రారంభమై, క్రమంగా “హై పిచ్" లోకి వస్తుంది.

    “వస్తాడే మాబావ - వస్తాడే - రేపో - మాపో – వస్తాడే

ఢిల్లీ నుంచి వస్తాడే పరీక్షపాసై వస్తాడే।। ఉల్లాసముగ ఆడిపాడి, మల్లెపూవులా దండలువేసీ తీయతీయనీ పండ్లానొసగీ, చందమామలా అందము చిలికే బావకు స్వాగతమిస్తానూ - ఇస్తానూ - బావకు స్వాగతమిస్తానూ।। పూలతోటలో కోయిల పలుకూ క్రొత్తపాటతో మేళవించీ పాడి ఆడుకొనగా, చిలుకలు కిలకిల నవ్వేనూ।। బస్తీనుంచీ వస్తావె, చీరెలు నగలూ తెస్తావా? కోరినవన్నీ తెస్తావా? తెస్తాడూ, అడిగినవన్నీ తెస్తాడూ రేపో మాపో వస్తాడూ వస్తాడూ, వింటాడూ నీ మువ్వల మ్రోతలు వింటాడూ, నీ మువ్వల మ్రోతలు వింటాడు నీ తెస్తాడు, నీ కిస్తాడూ వెన్నా మీగడ లిస్తాడు, వెన్నా మీగడ లిస్తాడు వస్తాడే మా బావ, వస్తాడే మాబావా నవ్వుతాడే, నవ్విస్తాడే హాహాహాహా హహహాహా నన్ను పెళ్ళి చేసుకుంటాడే గ్రామఫోన్ రికార్డుల్తో గొంతుకలిపి పాటపాడుతూ సుందరి గిరగిర తిరుగుతుంది. ఇలా తిరగడంవల్ల కళ్లు బయిర్లు కమ్మగా తూలిపడిపోబోతుంది. కాని, నిలదొక్కుకుని ఒక క్షణంపాటు కళ్లు మూసుకుంటుంది. ఆ తర్వాత శూన్యాన్ని చూస్తూ “రా అత్తయ్యా! రా! ఇదేనా రావడం? అంతా బాగున్నారా? మా మామయ్య, మా బావ... (“బావ” అనే సరికి సిగ్గుపడి, మాట మధ్యలో ఆగిపోయి) “అమ్మా! అత్తయ్యొచ్చిందే!” అని కేకవేస్తుంది. ఈ ఘట్టంలో చప్పున అన్ని లైట్స్ ఫేడ్ ఔట్ అయిపోతాయి.

2

తిరిగి లైట్స్ ఆన్ అయ్యేసరికి సీతమ్మ, రాజమ్మ చిరిచాపపై కూర్చుని మాట్లాడుకుంటూ వుంటారు. సీతమ్మ వయస్సు ఇంచుమించు ముప్పై; రాజమ్మ వయస్సు దాదాపు నలభై. సీతమ్మ మాసిన చీరతో, చెరగిన జుట్టుతో వుంటుంది. బోసిమెడ. చేతికి ఒక జత బంగారం గాజులైనా లేవు. రాజమ్మ చక్కగా ముస్తాబై వుంటుంది. మెడ తిరగనన్ని నగలు.

సీతమ్మ : మీ అన్నయ్య చూపంతా నీమీదే పెట్టుకున్నారు. మరి నువ్వేమి చేస్తావో రాజమ్మొదినా! రాజమ్మ : ఆఁ! నా దేమున్నదే, సీతమ్మా! సీతమ్మ : అదేం మా టొదినా! నువ్వు కావాలంటే... రాజమ్మ : నేను కావాలన్నవన్నీ అవుతున్నాయటే? - ఇది కావడానికి! సీతమ్మ : అయినదానివి నువ్వే ఇలా మాట్లాడితే, ఇఖ ఏం సానుకూల మౌతుంది? సుందరి భూంమీద పడ్డప్పటినుంచీ దాన్ని మేనల్లుడి కిచ్చి చెయ్యాలని మీ అన్నయ్య ముచ్చట పడుతున్నారు. మేనల్లుడంటే ఆయన కెంత అపేక్షో నీకు తెలియం దేమున్నది? రాజమ్మ : అయితే, ఇప్పుడు నే నే ఈ సంబంధం వొద్దంటున్నానటీ! కన్నారితో వియ్యమంది వస్తూ పోతూ వుండాలని నాకుమాత్రం వుండదూ? సీతమ్మ : నువ్వు వద్దనడం లేదనుకో. కాని, అదే సరిపోతుందా? కావాలని పట్టు పట్టాలి. నువ్వు పట్టుపడితే మా అన్నయ్య నీమాట తోసేస్తాడా? రాజమ్మ : మావారి సంగతి నీకేం తెలుసు! తన కెంత తోస్తే అంతే! ఎవరేం చెప్పినా వినిపించు కోరు. నాలుగేళ్ళనాడు భూమీపుట్రా అమ్మొద్దని చెవి నిల్లుకట్టుకు పోరినా విన్నారూ? సీతమ్మ : అప్పు డమ్ముకోవడం మంచిపనే అయిందిగా! ఆనాడు ఆ రెండెకరాలమ్ముకుని వ్యాపారం చెయ్యబట్టేగా ఈనాడు లక్షన్నర సంపాయించారు! రాజమ్మ : ఆఁ! అప్పుడు మూడువేలకు తెగనమ్ముకున్న ఆ చేనే యిప్పుడు అయిదువేలు చేస్తున్నది! ఆయన చేసే బేరాలన్నీ యింతే! ఏం బేరాలో - బెండిత్తులు! సీతమ్మ : మా అన్నయ్య బేరాలకే నువ్వు వంక పెడుతున్నావుగా! ఆ నాలుగెకరాలు పోతేనేం? ఇప్పుడు కావాలనుకోవాలేగాని, పాతి కెకరాలు కొని వెయ్యగలడు! రాజమ్మ : ఏమైనా తాతలనాటి గడ్డ పోయిందిగా! దాన్ని తొందరపడి అమ్మివేసుకోకుండా, తనఖా పెట్టుకుంటే పనికి పనీ జరిగేది; పొలానికి పొలమూ మిగిలేది. సీతమ్మ : నీ మాటల కేమిలే, వొదినా! తెగింపు చెయ్యబట్టే మా అన్నయ్యకు బాగా కలిసొచ్చింది. మా పని చూడరాదూ? ఎప్పుడొచ్చినా ఆ జీతపురాళ్లేగా? యుద్ధానికి ముందు ఏదో కాస్త పచ్చపచ్చగా కనబడ్డా, ఇప్పుడు నీళ్ళు కారిపోతున్నాం. ఏం కొనబోయినా ధరలన్నీ మండిపోతున్నాయయ్యె! రూపాయి మార్చడమే కనపడుతున్నది కాని, ఇంటి కొచ్చేది ఏమీ మిగలకపోతే పాయె! ఎప్పుడు మిగిలింది కాబట్టి ఇప్పుడు మిగలడానికి! కాని, ఇదివరలో జరిగినట్టు జరగడమైనా కష్టమై పోతున్నది. మాపని దిగదియ్యబట్టేగా మేం మీకు దూరమై పోతున్నాం! మే మిప్పుడు మీ కంటిలో దూరంలే! కనబడ్డం లేదు. రాజమ్మ : అదేమిటే! మాకు కొత్త భాగ్య మొచ్చిందని మాకళ్లు పైకి పోయాయా? సీతమ్మ : అబ్బే! ఎంతమాట! కాని, మాతో సంబంధం చెయ్యడమంటే, ముందు నీకే యేమంత యిష్టం లేనట్టున్నది. రాజమ్మ : నే నిష్టపడితే సరేనా? ఆయ నిష్ట పడొద్దూ? సీతమ్మ : మా అన్నయ్య కేమీ అభ్యంతరం లేదట. ఈ మధ్య మావారు కదిలిస్తే “ఆఁ! నాడే మున్నది? నీ యిష్టం, నీ చెల్లె లిష్ట" మన్నాడట. రాజమ్మ : ఆయ ననవలసినమాట అంతేగా! సీతమ్మ : అయితే, మా అన్నయ్యకే మాతో సంబంధం చెయ్యాలని కడుపులో లేదన్నమాట! రాజమ్మ : ఆఁ! మా మాటకేమిలే? అసలు పిల్లవా డిష్ట పడొద్దూ?ఈ కాలపువాళ్లు అమ్మా బాబూ కుదిర్చిన పిల్లల్ని చేసుకుంటున్నారూ? తమకు నచ్చినదాన్ని తామే ఏరి, కోరి కట్టుకుంటున్నారు గాని! సీతమ్మ : అబ్బాయిని కూడా మావారు కదిలించి చూస్తే, తన కిష్టమే నన్నాడట. నిన్ను, మా అన్నయ్యను, అడిగి చూడమన్నాడట. రాజమ్మ : ఆఁ! పసివాడు! తెలి సొక మాట, తెలియ కొకమాట, అయినా, ఇప్పుడేం తొందర? వాడి చదువైనా పూర్తికాలేదింకా. మరి రెండు మూడేళ్ళదాకా వాడి పెళ్ళిమాట మేముతల పెట్ట బోవడం లేదు. సీతమ్మ : అదేమిటి రాజమ్మొదినా? గుడివాడవా రెవరితోనో సంబంధం మాటలు నలుగు తున్నా యటగా! రాజమ్మ : ఎవ రన్నారు? సీతమ్మ : ఆఁ! ఎవరంటే నేమిలే! మీరు ఎంత కమ్మిపెట్టాలన్నా ఆ నోటా, ఆ నోటా తెలియక పోతుందీ? రాజమ్మ : మరి అన్నీ తెలిసినదానివి న న్నడగడం దేనికి? సీతమ్మ : ఊరుకుంటుందీ పాడు మనస్సు, ఆశ పీడిస్తుందిగా? “ఇంకొకసారి అడిగి చూడండి. వాళ్ళమాట వాళ్ళకే వుంటుం” దని నలుగు రనబట్టే, ఇంకా మీవెంట బడుతున్నాం. రాజమ్మ : వాళ్ళెవరో మొ న్నొచ్చారులే! - పదెకరాల మాగాణి, పాతికవేల రొక్కం యిస్తామంటూ. పిల్ల వొంటిని నూట యాభై నవర్సుల బంగారంకూడా వుందట. సీతమ్మ : మీ చూపు కట్నాలమీదికి పోతే, మే మెక్కడ తూగగల మొదినా? మా అన్నయ్య చుట్టరికం చూసుకుంటాడు గాని, డబ్బు కాశపడతా డనుకోలేదు. రాజమ్మ : ఏఁ! డబ్బంటే ఎవరికైనా చేదా? సీతమ్మ : అయితే మీకూ, మాకూ ఇంతటితో తీరిపోవలసిందేనా, వొదినా? ఇక మమ్మల్ని మీ గడప తొక్కొద్దంటారా? రాజమ్మ : నీదంతా చోద్యమే, సీతమ్మా! ఇంతమాత్రానికే మా అన్నయ్య నాకు అన్నయ్య కాకపోతాడా? నేను చెల్లెల్ని కాకపోతానా? సీతమ్మ : సుందరిని నీ చేతిలో పెడితే, అది సుఖపడుతుందని మీ అన్నయ్య... రాజమ్మ : ఎవరి కెక్కడ రాసి పెట్టివుంటే అక్క డౌతుంది. మన మనుకున్న వన్నీ అవుతాయటే! సీతమ్మ

అది వొ? మెతకపిల్ల. నోట నాలిక లేదు. అయినవాళ్ళ యింట్లో పడితే కడుపులో పెట్టుకు కాపాడతా రనుకున్నాం. కానీలే - దాని గీత ఎలావుంటే అలాగే జరుగుతుంది.

రాజమ్మ : దానికేమేఁ? పుత్తడిబొమ్మ! దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకు చేసుకుంటారు. సీతమ్మ (నిట్టూరుస్తూ) : ఇప్పు డంద మెవరికి కావాలి? చదువు లెవరికి కావాలి? బుద్ధు లెవరికి కావాలి? కట్నాలు కావాలి; కాన్కలు కావాలి. మాకు లేవుగా సంచులు? గుమ్మరించడానికి! రాజమ్మ : ఆఁ! దానికి తగినవా డెవడో దాని కొస్తాడు. పేదపిల్ల లందరు పెళ్ళిళ్లుకాకుండా అట్టే వుంటున్నారటే! దాని కెవడో, ఎక్కడో పుట్టేవున్నాడుగాని, పుట్టబోడుగా? సీతమ్మ : ఇంకా మీ అన్నయ్య గంపెడాశతోనే వున్నారు. “మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళెక్కడికి పోతారే?” అని మొన్న కూడా నాతో అన్నారు. ఈ మాట వింటే ఆయనకు నడుం విరిగినంత పని అవుతుంది. రాజమ్మ : ఆఁ! మా అన్నయ్యకు అల్లుడే కరువౌతాడా! సీతమ్మ : అల్లుడు దొరక్క అట్టే వుండడులే! కాని, బుద్ధిమంతుడని మేనల్లుడంటే, ఆయన కెంతో యిది! ఇంట్లో పెట్టుకుని నాలుగేళ్లు చదువు చెప్పించుకున్నారు కూడా. రాజమ్మ : ఎవరి మేనల్లుడిమీద ఎవరికి బ్రమత లుండవు లేవే! నాలుగేళ్లు చదువు చెప్పించినందుకు అయిదారొందలు అయ్యాయేమో! సుందరి పెళ్ళికి అంతకంత మే మేదో ఒక రూపంలో ముట్టజెప్పక పోములే! నేను ఆయనకు చెప్పేవుంచా - సుందరికి పెళ్ళినాడు వెయ్యిన్నూట పదహార్లు చదివించాలని. - సీతమ్మ : మీరు ముందెప్పుడో అంతకంత మాకు ముట్టజెబుతారని మేము మేనల్లుడికి చదువు చెప్పించుకోలేదు. మీ కట్నాలు, కాన్కలు మా కొద్దులే, తల్లీ! ఏదో ఒక విధంగా దాన్ని విరగడ చేసుకోలేక పోతామా? రాజమ్మ : సరే! మీరు మమ్మల్ని తోసెయ్యదల్చుకుంటే... సీతమ్మ : ఎదురు ఈమాట కూడానా? ఎవరు ఎవర్ని తోసేస్తున్నారో లోకానికి తెలవదూ? మీ అన్నయ్య వన్నీ పిచ్చి బ్రమలుగాని, ఇప్పుడు మీ చూపుకు మే మెక్కడ ఆనతాం! మీ రిప్పుడు కోటీమీద కూర్చున్నారయ్యె! మిమ్ము అందుకోవాలన్నా మేము... (ఫేడ్ ఔట్.

  3

(మొదటి దృశ్యంలో ఎక్కడ, ఏ భంగిమలో నిలబడిందో అక్కడే, ఆ భంగిమలోనే నిలబడి సుందరి “అమ్మా! అత్తయ్యొచ్చిందే!” అని కేక వేస్తుంది. ఈ కేక విని సీతమ్మ ప్రవేశిస్తుంది.

సీతమ్మ : ఏమిటే నీ కేకలు సుందరీ? సుందరి : అత్త య్యొచ్చిందే, అమ్మా! సీతమ్మ : ఏదీ? ఎక్కడ? సుందరి (శూన్యాన్ని చూపిస్తూ) : అదే! ఎదురుగుండా! సీతమ్మ : నీకు పిచ్చేమైనా పట్టిందేమేఁ! ఎవరున్నా రక్కడ? సుందరి (నిద్రలోనుంచి మేల్కొంటున్నట్లు కళ్లు నులుముకుంటూ) : ఔనమ్మా! ఎవ్వరూ లేరు. కాని,ఇంతకుముందు - ఒక్క క్షణానికి ముందు - అత్త య్యొచ్చినట్టు.... సీతమ్మ : ఆవిడ మనింటి కెందుకొస్తుందే! వాళ్ళ చూపుకు మన మిప్పుడు ఆనం! వాళ్ళిప్పుడు కోటీమీద కూచ్చున్నారయ్యె! సుందరి : అత్తయ్య రాలేదుగాని, సినిమా తెరమీద బొమ్మ కనబడ్డట్టు... సీతమ్మ : నీకు మతి పోతున్నదేమే? వాళ్ళు అస లిప్పుడు కింద నడుస్తున్నారూ? దొంగవ్యాపారం చేస్తేనేఁ? లోకుల కొంపలు కూల్చితేనేఁ? తమ కింత పోగు పడింది. ఇప్పుడు మన మంటే వాళ్ళ కెంత చులకన! ఈ పాడు సినిమాలతో నీ మతి సగం చెడుతున్నది. కాసేపు మురిపించి డబ్బు పోసుకోడానికి వాళ్ళకేఁ? తెరమీద బొమ్మల్ని తైతక్క లాడిస్తారు! సుందరి : అయితే, సినిమాలలో మనం చూసినట్టు జరగనే జరగదంటావా, అమ్మా? సీతమ్మ : అది పచ్చి బూటకం! బ్రతుకు దొకదారైతే, సినిమా దొకదారి. దానికీ, దీనికీ సాపత్యమెక్కడ? ప్రేమలనీ, పెళ్ళిళ్ళనీ వాళ్ళు ఏమేమో అంటారు. ప్రపంచంలో ప్రేమ లెక్కడివి, తల్లీ? డబ్బే ప్రధానం, డబ్బులేనివాడు డుబ్బుకు కొరగాడు. సుందరి : ఆఁ! డబ్బేనా ప్రధానం! సీతమ్మ : ఔను తల్లీ! మీ మామయ్యకు, అత్తయ్యకు మన మెందుకు దూరమైపోయాం? మనకి డబ్బు లేకపోబట్టేగా? డబ్బుంటేనే ప్రేమలైనా, బంధుత్వాలైనా. సుందరి : ఆఁ! నీమాట నేను నమ్మలే నమ్మా! సీతమ్మ (సుందరిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ) : ఇంత పిచ్చితల్లివి! నువ్వేం కడతేరతావో! సుందరి : పోనీ, అత్తయ్యా, మామయ్యా చెడ్డవాళ్ళనుకో! వాళ్ళకి డబ్బే ప్రధాన మనుకో! కాని, బావయ్య కూడా... సీతమ్మ : అతడు మంచివాడైతే కావచ్చు. కాని, అతని మాటేమి సాగుతుంది? తల్లీ, తండ్రీ చాటుబిడ్డ. వాళ్లు రావడం తగ్గించుకోగానే తనూ తగ్గించుకున్నాడుగా మనింటికి రావడం! మొన్న మీ నాన్న వీధిలో యెదురుపడితే, చూసీ చూడనట్టు వెళ్ళిపోయాడట. మీ సుందరి ( తల్లి మాటలు అంతగా రుచించక, సంభాషణ వేరొక ధోరణికి మార్చాలని):అయితే, అమ్మా... సీతమ్మ : ఏమిటి, తల్లీ? సుందరి : నే నొక కొత్త సినిమా పాట నేర్చుకున్నా నమ్మా. సీతమ్మ : అలాగేఁ? సీతమ్మ : అంత చక్కనిదా? సుందరి : అది చాలా చక్కని పా టమ్మా! సుందరి : ఔనమ్మా! దాని బాణీ నేనింకా బాగా పట్టుకోలేదు గాని, పాడి వినిపించనా! సీతమ్మ : సరే! పాడవమ్మా! వింటాను. (సుందరి ఈ కింది పాట పాడుతుంది; గృహమేకదా స్వర్గసీమా! మహనీయమౌ ప్రేమ మహిమమ్ము వెలసిన ఈ గృహమే కదా, మన గృహమే కదా స్వర్గసీమ! ఇలలోన లేదంచు తలపోయనేలా? కలలందు దర్శింపగా కోర నేలా? జపమేల, తపమేల, వ్రతపూజలేలా? సాధించితే ప్రేమ సామ్రాజ్యమౌ నీదు. జగతిని యశ మంది, సంపద లంది, ప్రియమున లాలించి, పాలించు విభుడు.” (పాట పూర్తికావస్తుండగా ఫేడ్ ఔట్.

4

తిరిగి లైట్స్ ఆన్ అయ్యేసరికి రంగమ్మ నీళ్ల బిందెతో ప్రవేశిస్తుంది. ఆమె వితంతువు. వయస్సు యాభై అయిదు. కాని, సందర్భానుసారంగా ఆమె దాన్ని యాభయ్యో, అరవయ్యో చేస్తూ వుంటుంది. రంగమ్మ : గంపెడు చీకటి నెత్తినేసు కెళ్లినా, పాడుమూక అప్పుడే పంపుచుట్టూ చేరింది. బిందెడు నీళ్లు పట్టుకొచ్చే సరికి తలప్రాణం తోక కొచ్చింది. మాయదారి గుంపు! ముదనష్టపు గుంపు!! కాస్త సందిస్తేనా? పై పైకి తోసుకు రావడమే! అ దున్నది - ఆ పుట్టుకుంక - దాని ముఖం మండ! అది మరీనీ! పంపుకింద బిందెట్టుకుంటే లాగి పారేస్తుంది.

దాన్ని అమ్మోరమ్మ తల్లి యెత్తికెళ్ళ! దాని వొలికిల్లో జిల్లేళ్లూ, పల్లేళ్లూ మొలవ! పోట్లాటకు అది రయ్యిఁమని పైకొస్తుంది. దానికంటె కాట్లకుక్క నయం. దాని దెవసం చెయ్య! దేవసం చెయ్యడానికైనా ఆ పుట్టుకుంక కెవ రున్నారులే! (బిందె యింటిలో దింపి వచ్చి) ఈ నీళ్ళు నేను జేరబొయ్యలే నమ్మా! పాడు నీళ్లు! అయినా, పంపులేని కొంపలో వుండడంకంటె బుద్ధి తక్కువున్నదీ? రెండు, మూడు రూపాయ లెక్కువ అద్దె అయినాసరే పంపున్న యిల్లు చూడరా అంటే, మా సన్నాసి నా మాట వింటాడా, పెడతాడా? నే నున్నానుగా మండిన నీళ్లు ఎన్నైనా జేరబొయ్యడానికి! వాడి కేం నెప్పి? నేను నెత్తిని నోరెట్టుకు మొరిగినా, చీమైనా కుట్టనట్టు ఊరుకుంటాడు. ఎంతకాలం చేస్తాను నే నీ అరవ చాకిరి? అంతకంతకు ఒక ఏడు పైబడుతున్నది కాని, తగ్గడం లేదుగా!... అప్పుడే అరవై యేళ్లోచ్చాయి. ఒసేయ్! నిన్నే... ఏమేయ్! సీతమ్మా!... ఉహుఁ! అదెందుకు పలుకుతుంది? వినిపించుకునే మెదలకుండా వూరుకుంటుంది. అమ్మో! అదెంత నాలిముచ్చు! ఒసేయ్! సీతమ్మా! ఒసేయ్! నిన్నేనే!... నే నెంత గొంతు చించుకుంటే మాత్రం దాని కెందుకు వినబడుతుంది? నా పిలుపంటేనే దాని చెవుల్లో చెట్లు మొలుస్తాయ్! అమ్మ! ఎంత కానరాని దది! నోట్లో బెల్లంరాయి కొట్టుకున్నట్టు నిలబడే, తేలులా చిటుక్కు పొటుక్కున కొండి అంటిస్తుంది. లోకులకు రాగదాన్ని నేనే! అది చేసేపనులు వాళ్ళకేం తెలుస్తాయ్! రంగమ్మ నోరే అందరికీ వినబడుతుంది. సీతమ్మా! ఏమేయ్!!... (సీతమ్మ వస్తుంది. కిందటి రంగంలో మనం చూచినప్పటి కంటె ఆమె దాదాపు పదిహేడేళ్లు చిన్నది.

సీతమ్మ : ఎందు కత్తయ్యా? రంగమ్మ : ఎంత అరచినా పలకవే? అంకిలి నొక్కుకు పోయిందా? సీతమ్మ : కళ్లాపి జల్లుతున్నా నత్తయ్యా! నీ కేక వినబడలేదు. రంగమ్మ : తెచ్చిన నీళ్ళన్నీ అప్పుడే దిమ్మరించేశావ్! ఆ పాడు పంపుదగ్గిరి కెళ్లి, ఆ పాడు ఆ ముండలందరితో చెలిగి, తెచ్చే దున్నదిగా! దిమ్మరించడానికి నీకేం నెప్పి! సీతమ్మ : లేదత్తయ్యా! నాలుగంటే నాలుగు చెంబుల నీళ్లు... రంగమ్మ : నీకు నాలుగు చెంబులుగానే కనబడతాయ్! ఒక్కొక్క బిందెడు నీళ్లెత్తు కొచ్చేసరికి నా నడుము లిరుగుతున్నాయ్! ఇంకా ఎంతకాలం చేస్తాను నేనీ గాడిది చాకిరి? పాచినీళ్లట! పాచినీళ్లు!! జీతం బత్తెం లేకుండా తెచ్చి పొయ్యడానికి నౌకరుదాన్ని నే నున్నానుగా! ఇంట్లో కూర్చుని బుడబుడ ఎన్ని నీళ్లినా పారబోస్తావు! ఒక్క చెంబుడునీళ్ళు పట్టుకురా, నీకే తెలుస్తుంది ఆ కష్టమేమిటో, సుఖమేమిటో! సీతమ్మ : అంత కోపం దేని కత్తయ్యా! పోనీ, నేనే నీళ్ళు తెచ్చుకుంటాను. రంగమ్మ : నీకు ముచ్చటగా వుందటే? నన్ను నలుగురి నోళ్ళలో పడెయ్యాలని! రంగమ్మ కొత్తగా కాపరానికొచ్చిన కోడల్ని బజార్లెంట తిప్పుతున్న"దని అమ్మలక్క లందరు మూతీ ముక్కూ విరుస్తుంటే చూడాలని ముచ్చటగా వుందా? సీతమ్మ : తప్పు మాటంటే, మన్నిం చత్తయ్యా! రంగమ్మ : ఎంత వగలాడివే! అన్నిటికీ ఇదొకటి నేర్చుకున్నావ్! ఉలిపి, చిలిపిమాట లనడం! “మన్నించత్తయ్యా!” అని చిలక పలుకు పలకడం! రంగమ్మ : ఏం నంగనాచివే! కల్లిబొల్లి యేడ్పులుకూడా మొదలెట్టావ్! 'రంగమ్మ కోడల్ని కాల్చుకు తింటున్న”దని నలుగురిచేత నన్ను ఆడిపోయించమ్మా! ఆడిపోయించు!! రద్దీ రవ్వా లేకుండా బతికిన ముండని, నన్ను అల్లరి పెట్టందే నీకళ్ళు చల్లబడవులే! (సీతమ్మ కళ్లు తుడుచుకుని వెళ్ళిపోబోతుంది. రంగమ్మ : ఎక్కడికే పోతున్నావ్? (సీతమ్మ కళ్ళవెంట గిర్రున నీళ్లు తిరుగుతాయి. సీతమ్మ : వాకిట్లో ఒక ముగ్గుకళ్ సొస్తా. రంగమ్మ : మాట్టాడేదాన్ని నేను మనిషినేనా? ఒక పక్కని మాట్లాడుతూవుంటే దులపరించుకు పోతున్నావ్! సీతమ్మ : తప్పే, అత్తయ్యా! మన్నించు. రంగమ్మ : అదుగో! మళ్ళీ... (సీతమ్మ గుడ్లనీళ్లు గుడ్లలో కుక్కుకుంటుంది. రంగమ్మ : సర్లే! నీకు నీ అమ్మా, బాబూ నేర్పిపంపిన చిలకపలుకులు ఇవ్వాళ పొమ్మంటే ఎక్కడికి పోతాయిగాని, కాఫీ పెట్టావా? సీతమ్మ : ఇంకా లేదత్తయ్యా! రంగమ్మ : బారెడు పొద్దెక్కినా నీకు కాఫీ పెట్టడానికే తీరలా! సీతమ్మ : చేతిలో పని కాగానే పెడతా నత్తయ్యా! రంగమ్మ : అబ్బే! ఎందుకులే! పెట్టొద్దు! నా కూతురు పల్లెటూరిదయ్యె! మన్ను పిసుక్కు నేదయ్యె! అది నీలో ఉద్యోగస్థుడి పెళ్ళామా? బస్తీ కాపరం చేస్తున్నదా? అది కాఫీ ముఖమేమెరుగున్నది? సీతమ్మ : రాజమ్మొదిన ఇంకా నిద్ర లేవలే దయ్యా! ముందే పెడితే చల్లారిపోతాయని పెట్టలేదు. ఇదుగో! పెడుతున్నా! ఇప్పుడే పెడతా! (సీతమ్మ వెడుతుంది. రంగమ్మ (వెనకనుంచి) : దానికి కాసిని కాఫీనీళ్ళివ్వడానికి చేతులు రాక ఎన్ని వేషాలు వేస్తున్నావే! ఇంతకూ నిన్ననే పనేమిటి? నా కొడుకు మంచివాడైతే నువ్వు ఆడిందే ఆటగా సాగుతుందా? వాడొఠ్ఠి దద్దమ్మ! పెళ్ళానికి చాల్లేడు. మొన్న మట్టుకు మొన్న నేను వద్దంటున్నా, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో చేరి అది నాటకానికి వెళ్లిస్తే కుక్కిన పేనులా వూరుకున్నాడు గాని, పల్లెత్తుమా టన్నాడూ? మనం సంసారులం; నాటకాలు, గీటకాలు మన కెందుకు? ఇది డబ్బు దండగచేటేనా? మ రేమైనానా? అది ఎన్ని దండగలు పెట్టినా వాడి కిష్టమే. కచ్చేరీకి వెళ్ళిన ఆ కాసేపు తప్పితే, దాని కొంగుచ్చుకు తిరగాల్సిందే! పట్టపగలే దాంతో పకపకలు, వికవికలై పోతే! ఇంతకూ నాకు చావు రావడంలేదు. కూతురు రాకరాక చుట్టపుచూపుగా ఒకసారొస్తే దాని కిన్ని కాఫీనీళ్ళకు గతిలేకపోయె! ఇంకా నా బతు కెందుకు? పాడు బతుకు! ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటే అందరికీ పీడ విరగడై పోతుంది. నలుగురిచేత ఔననిపించుకున్న ముండని. నా కెన్ని తిప్పలొచ్చాయ్! నా కెన్ని తిప్పలొచ్చాయ్!! (రాని కన్నీళ్లను తుడుచుకుని, వేలు విదిలిస్తుంది. రంగమ్మ (మూలనున్న చీపురు తీసుకుని, గది కొంత జిమ్మి) : ఒసేయ్! నిన్నే... ఏమేయ్! సీతమ్మా! ఊహుఁ! అదెందుకు పలుకుతుంది? నా పిలుపంటేనే దాని చెవుల్లో చెట్లు మొలుస్తాయ్! అమ్మ! ఎంత కానరాని దది! ఏమేయ్! నిన్నేనే!!

("గృహమే స్వర్గసీమ” అంటూ నేపథ్యంలో నుంచి పాట ప్రారంభమౌతుంది.

ఫేడ్ ఔట్.

5

లైట్స్ ఆన్ అయ్యేసరికి సుందరి, సీతమ్మ నాల్గవ రంగంలో కూర్చున్నట్టుగానే కూర్చునివుంటారు. సుందరి గృహమే స్వర్గసీమ” పాట చివరి చరణాలలో వుంటుంది. సీతమ్మ చెమ్మగిలిన కళ్ళను పైటచెంగుతో ఒత్తుకుంటూ వుంటుంది.

సుందరి : అదే మమ్మా, కంట తడిపెడుతున్నావ్? సీతమ్మ : ఆఁ! ఏం లేదు, తల్లీ! సుందరి : ఎందు కమ్మా? నాకు చెప్పవ్? సీతమ్మ : పాట బాగున్నది, తల్లీ! సుందరి : చాలా బాగున్నది కాదూ! సీతమ్మ : ఉఁ! సుందరి : మరి సినిమా పాటలన్నీ పిచ్చిపాట లంటావ్? ఒక్కొక్క పాట వింటుంటే, నాకూ కళ్ళు చెమ్మగిలతా యమ్మా! సీతమ్మ : నువ్వింత వెర్రిబాపమ్మ వేమే? సుందరి : అదేమి టమ్మా? సీతమ్మ : సంసారమంటే మాటలు కాదు, తల్లీ! మంచి చెడ్డలు ఎన్నెన్నో వుంటాయ్. పడివున్న వాళ్ళకేగాని అవి తెలియవ్.. పదహారు, పదిహేడేళ్ళనాడు నాది నీ ఈడే. అప్పుడు అచ్చంగా నీ మాదిరిగానే వుండేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తే అప్పుడు నన్ను చూడ నఖఖరలేదు. ఈ సినిమాలు మేమప్పు డెరగంగాని, నీకు మల్లేనే నాకూ కష్టం, సుఖం తెలిసేది కాదు. తల్లీ తండ్రి ఆదరించినట్టే లోక మెల్లా ఆదరిస్తుందనుకున్నా, కాపరాని కొచ్చి, సంసార మీదడం ప్రారంభించిన తర్వాతగాని తెలిసి రాలేదు. బ్రతుకులు వెళ్ళమారడ మెంత కష్టమో! నేను పడ్డ పాట్లు నిన్ను చుట్టుకోరాదని నే నెందరి దేవుళ్ళకు మొక్కుకుంటున్నానో నీకేం తెలుసు? ఒక ఆటగానో, పాటగానో తనువు గడుస్తుందని లేనిపోని బ్రమతలకు పోవద్దు, తల్లీ! సుందరి : అమ్మా, ఈపూట నువ్వింత యిదిగా మాట్లాడుతున్నావే? మనస్సు బాగుండలేదా? సీతమ్మ : ఔను, తల్లీ! సుందరి : అదేమో నమ్మా! ఒక్కొక్కసారి పాటేదైనా వింటుంటే కడుపులో చెయ్యి పెట్టి దేవుతున్నట్టుగా వుంటుంది. అదే మరొక్కొక్కసారి పాట వినగానే ఎంత కలతగా వున్నా మనస్సు ఇట్టే తేటపడుతుంది. అది మరి పాటలో వుంటుందో, మనం వినే వేళా విశేషంలో వుంటుందో! సీతమ్మ : ఏమో నమ్మా! నే నేం చెప్పగలను? సుందరి : ఒక కమ్మనిపాట వున్నదమ్మా? దాన్ని వింటే చాలు, గాలిలో తేలిపోతున్నట్టుగానే వుంటుంది నాకు. అదెంత మంచిపాటనుకున్నావ్! సీతమ్మ (మందహాసం చేస్తూ) : అబ్బో! అంత గొప్ప పాటా! సుందరి : ఔనమ్మా! నాన్న నాకు దాని రికార్డ్ తెచ్చి పెట్టాడు. సీతమ్మ : ఎప్పుడు? : సుందరి : నిన్న సాయంత్రం. సుందరి : బాబూ, కూతురూ చేరి, నా కీ మాట తెలియకుండా ఇప్పటిదాకా దాచిపెట్టారన్నమాట! మనం కలవాళ్ళమా? ఎందుకమ్మా మీ నాన్నచేత నువ్విలా డబ్బు తగలేయించడం? ఈ రికార్డులకని నెలనెలకి దండగ పెట్టే డబ్బు కూడబెట్టుకుంటే, మెడరోత తీరడానికి ఏదో ఒక చిన్న నగ యేర్పడదూ? సుందరి : తెచ్చి పెట్టమని నే నడగలేదమ్మా! అది మంచి రికార్డని నే నంటే... సీతమ్మ : ఆయన కొనుక్కొచ్చారు. అంతేనా? నీకు ఏ లోపం చెయ్యరాదని ఆయన ఎన్ని చిక్కులైనా పడతారు. సుందరి : ఇంకెప్పుడు నాన్న దగ్గిర రికార్డుల మాట యెత్తనులే, అమ్మా! సీతమ్మ (నవ్వుతూ) : చూస్తానుగా ఎన్ని రోజులు నిలుస్తావో ఈ మాటమీదే! నిన్ననగా మీ నాన్న రికార్డు తెస్తే దాన్ని యింతవరకు పెట్టనే లేదని నువ్వెంత ఆరాటపడుతున్నావో! ఏదీ, ఆ రికార్డు వినిపించు! (సుందరి ఈ కింది గ్రామఫోన్ రికార్డ్ పెడుతుంది: ఆడబ్రదుకే మధురమ్ వయసూ, వలపూ, సొగసు కులికే యువతి బ్రదుకే మధురమ్ పసుపు కుంకుమా నొసటను వెలిగే ఆడబ్రదుకే మధురమ్ పతి కౌగిటిలో పరవశమయ్యే భార్యబ్రదుకే మధురమ్ పసికూనకు పాలొసగుచు మురిసే తల్లి బ్రదుకే మధురమ్ ఆఁ ఆడబ్రదుకే మధురమ్ విరజాజులతో, చిరు నగవులతో కుంకుమరాగము, అనురాగముతో సిరిసంపదతో, పసిపాపలతో అనుగతపతియై, ఆనందవతియై అలరు సుమంగళి బ్రతుకే మధురమ్ ఆ ఆడబ్రదుకే మధురమ్।। ఆదిలో పాట “లో వాల్యూమ్”లో వస్తుంది. సుందరి : అమ్మా! ఇది చాలా మంచిపాట కాదూ? సీతమ్మ : పాటకే? మంచిపాటే! కాని, బ్రతు కొక పాటా, ఆటా కాదు, తల్లీ! పైకి సాఫీగానే నడుస్తున్నట్టు కనబడ్డా, అడుగడుక్కీ చిన్నచిన్న చిక్కులూ, చిల్లర యిబ్బందులూ ఒక లక్ష వస్తుంటాయ్. వడ్డించిన విస్తరిలా బ్రతుకు లున్న వాళ్లకే ఏవో కొన్ని వొడుదుడుకులు తప్పవంటే, ఆస్తిపాస్తులు లేనివాళ్లమాట వేరే చెప్పాలీ? కొద్దికొద్ది సంసారాలనే సరికి అన్నీ కొరతలే! అయినా, పరువుకోసమని ఏ లోపం లేనట్టు దేవులాడాలి. ఇక, అత్తపోరూ, ఆడబిడ్డపోరూ వుంటే సరేసరి! ఒక యింటి దానివై నీ సంసారం నువ్వు దిద్దుకుంటున్నప్పుడు మంచిచెడ్డలన్నీ నీకే తెలుస్తాయిలే!

(లైట్స్ ఫేడ్ ఔట్ అయిపోతాయి. ఆ వెంటనే పాటకూడా నిలిచిపోతుంది. పిమ్మట ఒక క్షణానికి ఒక్క సుందరిమాత్రం స్పాట్ లైట్ లో నిలబడి వుంటుంది. ఆమె చుట్టుపక్కల కటిక చీకటి. ఆ చీకటిలో నుంచి వేర్వేరు గొంతులు ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాన్ని మరొకటి తరుముతున్నట్టు వినబడతాయి.

మొదటి గొంతు (సుందరికి కాగల భర్తది) : ఇంకా నీ వంట తెమల్లేదటే? సుందరి (గొంతు వినవచ్చినవైపుకు తిరిగి) : అయిపోతుంది ఒక చిటికలో! మొదటి గొంతు : చాల్ చాలు! ఆఫీసుకు వేళ మించిపోతున్నది. రోజూ ఇదే యేడుపు! సుందరి : అయ్యో! అయిపోయిందంటే! మొదటి గొంతు : ఏమైపోయింది? నీ మొఖం! ఆఫీసులో నాకు మాటొస్తున్నది సుందరి : ఒక్క అయిదు నిమిషాలండీ... మొదటి గొంతు : చాల్లే! నే పోతున్నా! సుందరి : అయ్యొ! అయ్యొ!

  • * *

రెండవ గొంతు (పాలమ్మిది) : ఏమిటమ్మా ఈ తిప్పించుకోడం?? రెండవ గొంతు : ఏఁ! నేను మీకు అచ్చివున్నా నేమిటి మీ కొంప చుట్టూ తిరగడానికి! సుందరి (అటు తిరిగి) : రేపిస్తాంగా తప్పకుండా! రెండవ గొంతు : రోజూ రేపురేపేనా? అంత గతిలేనివాళ్ళు పాలెందుకు పోయించుకోవాలి సుందరి : ఏమిటమ్మీ! మాటలు మహ రానిస్తున్నావ్!

  • * *

మూడవ గొంతు (సుందరికి కాగల అత్తగారిది) : కాస్త నేలమీద ఆని నడువమ్మా! నడువు!! మిడిసిపాటు తగదు. ఏం కట్టుకొచ్చావని అంత పొంగు! (సుందరి అటు తిరిగి గుడ్లు అప్పగించి చూస్తుంది.

  • * *

నాల్గవ గొంతు (పిల్లవాడిది) : అమ్మా! అమ్మా! పండక్కి నాకు కొత్త చొక్కాయేఁ! సుందరి (అటు తిరిగి) : నాన్న రేపు తెస్తాడులే, బాబూ! నాల్గవ గొంతు : అహం! నా కిప్పుడే కావాలి. పండ గివ్వాళే! వాళ్ళ కిష్టిగాడు కొత్త దేసుకున్నాడు. సుందరి : మా నాన్నవుగా! రేపు నీకు... నాల్గవ గొంతు : ఉహుఁ! పిల్ల లందరు కొత్త చొక్కా లేసుకున్నారు. నా కిప్పుడే కావాలి!

  • * *

తిరిగి మొదటి గొంతు : మొన్నేగా వీసెడు నెయ్యి మండబెట్టింది! సుందరి (అటు తిరిగి) : అయ్యొ! అయిపోయిందండీ! మొదటి గొంతు : వెనకా ముందూ చూసుకోవద్దూ? ఇలాగైతే నే నెక్కడ ఛస్తాను.

  • * *

తిరిగి మూడవ గొంతు : చంకల్లోకి ఆ రవికేమిటి? ఆ బెత్తెడు పమిటేమిటి? చెవుల పైకి జారుతూ ఆ జుట్టు ముడేమిటి? ఏం వేషా లివి? దొమ్మరి వేషాలు! ఎక్కడైనా సంసారుల కివి తగునా? దానికి బుద్ధిలేకపోతే, ఆ అత్తకు బుద్ధిలేదా అని నలుగురూ నన్ను దెప్పడానికా? (సుందరి అటు తిరిగి దిగాలుపడి చూస్తుంది.

  • * *

అయిదవ గొంతు (పిల్లవానిది) : బడిలో జీతం తెమ్మన్నా రమ్మా! సుందరి (అటు తిరిగి) : రేపిస్తాం లే, బాబూ! అయిదవ గొంతు : ఊఁ! ఊఁ! ఇవ్వాళ కట్టకపోతే, పేరు కొట్టేస్తామన్నారే, అమ్మా!

  • * *

మరొకసారి మొదటి గొంతు : మళ్ళీ డాక్టరా? సుందరి (అటు తిరిగి) : అయ్యొ! నా తండ్రి కెక్కువగా వున్నదండీ! మొదటి గొంతు : తడవకి మూడేసి రూపాయలు పొయ్యాలి. సుందరి : అయ్యో! అయ్యో! నా బాబేం కాను!! మొదటి గొంతు : చాల్లే! నీ ఖంగారు! (“ఆడబ్రదుకే మధురం” అని రికార్డ్ ఫుల్ బ్లాస్ట్ తో ప్రారంభం కాగా తెర)     వంతెన (ఏకాంక నాటిక)

పాత్రలు: అప్పయ్య - పల్లెటూరి రైతు, కోటమ్మ - అతని భార్య, చలపతి - అతని కొడుకు,

   పొన్నమ్మ - ఇరుగు పొరుగు యిల్లాలు, భూషయ్య - ఊరు పెత్తందారు.

స్థలం : అప్పయ్యగారి యింటి చావడి కాలం: వర్తమానం అది అప్పయ్యగారి మండువా చావడి. మండువా నాలుగు వైపులా నాలుగు స్తంభాలు. ఆ స్తంభాలను కలుపుతూ పిట్టగోడ. మండువా మధ్య తులసికోట. ప్రేక్షకులకు సమ్ముఖంలో - మండువాకు అవతలగా - కానవచ్చేది సింహద్వారం. ఎడమ చేతివైపునున్న రెండు ద్వారాలు గదులలోకి, కుడిచేతివైపునున్న మరి రెండు ద్వారాలలో ఒకటి వంటింటిలోకి, రెండవది పెరటిలోకి. చావడిలో రెండు నవారు మంచాలు మాత్రం వున్నాయి. తెర లేచిన క్షణానికి పొన్నమ్మ ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు నలభై అయిదు ప్రాంతాల. పూర్వకాలపు ముత్తయిదువ ముస్తాబు.

పొన్నమ్మ : పిన్నామ్మా. కోటమ్మ పిన్నామ్మా! కోటమ్మ (లోపలినుంచే) : నువ్వటే పొన్నీ! చేతిలో కాస్త పనుంది. చేసుకొస్తాగాని, కూకోవే, కల్లాలా! పొన్నమ్మ : ఇంత పొద్దుగూకేళ అంత వంటేమి చేస్తున్నావ్, తల్లీ! చుట్టపా డెవడైనా వొచ్చా డేమిటి? (పొన్నమ్మ ఈ ప్రశ్న వేసిన తర్వాత ఒక క్షణానికి కోటమ్మ ప్రవేశిస్తుంది. ఆమె వయస్సు ఇంచు మించు యాభై అయిదు సంవత్సరాలు. అభం శుభం తెలియని పల్లెటూరి యిల్లాలు, కోటమ్మ (ప్రవేశిస్తూ) : సుట్టాలూ లేరు; పక్కాలూ లేరు. ఉలవల్లో తవుడు కలుపుతున్నా, పొన్నమ్మ : ఏఁ? మా బాబాయి లేడూ? కోటమ్మ : ఉహుఁ! పేట కెళ్ళాడు. పొన్నమ్మ : మరి మా తమ్ముడో? కోటమ్మ : ఆడు మంచాడైతే మా కిన్ని తిప్ప లెందుకొస్తాయ్! ఆయనగార్కి బద్ధకంగా వుండి “అబ్బాయ్! పేట కెళ్ళి వొడ్లమ్ముకు రారా!" అని మొన్ననగా పంపిస్తే అజా పజా లేడు. తెల్లారగట్టే ఆ గింజల్ని తోలుకెళ్ళిన బళ్ళు ఆవాళ రేత్రికే తిరిగొచ్చేశాయి. ఎళ్ళీ ఎళ్ళగానే ఆ గింజలేవో బేరమిచ్చేశాడని బళ్ళాళ్ళు చెప్పారు. మరి ఆడేమయ్యాడో ఆ డబ్బేమైందో! ఇదుగో వొస్తాడు, అదుగో వొస్తాడని చూసి చూసి మా కళ్ళు కాయలు కాసినా ఆడి పత్తా లేదు. ఆడి సంగతి తెలిసుండీ ఆడి నెందుకు పంపించానని తన్ను తాను ఒక పది తిట్టుకుని మీ బాబాయి సీకటితో లేచి పేటకి లగెత్తాడు. సందేళకి తిరిగొస్తా నన్నాడు. ఇంకా రానే లేదు. గొడ్లు యిళ్ళకొచ్చేయాళకు ఒక బస్సొస్తుందటగా! అది రానేలా? పొన్నమ్మ : ఆఁ! అదింకా మండిందో, లేదో! ఏం బస్సులో పాడు బస్సులు! ఇవేమంటూ వొచ్చాయోగాని, మన ఊరికే శని పట్టుకుంది. పనీ పోయింది; పాటూ పోయింది. బస్సెక్కి బుడిగీ బుడిగీ బస్తీకి దౌడుతీస్తున్నారు. నడవాలా? పెట్టాలా? ఇక్కడ గడపలో యెక్కడం, అక్కడ బజార్లో దిగడం. ఒక అర్థరూపాయి మన్ది కాదునుకుంటే బుర్రున పోయి, బర్రున రావొచ్చయ్యె! కోటమ్మ : ఔనే, కల్లాలా! ఈ మాయదారి బస్సులు మన కెక్కడ దాపరించాయోగాని, ఊరొక అందాన లేదు. పొన్నమ్మ : కాదటే, పిన్నామా? మొన్నొకనాడు ఏం జరిగిందనుకున్నావ్! మా రెండో పిల్లదానికి పురుడొయ్యడానికని ఏటవతలి కెడుతుంటే, ఆ మీసాల యెంకడు పెదమాలపల్లి యెంకడు- ఆడి పెళ్ళామొచ్చి, రింగు రంగా అంటూ పక్కని కూర్చుంది. ఏం సెయ్యను? మాట్టడానికి మనవల్లా? ఇంకా దాని పుణ్యమాయిరి! పక్కనే కూకుందిగాని, వొళ్ళో కూకుంటే మాత్రం దాన్ని అడిగేవాళ్ళెవరు? పిసుక్కు చచ్చి, నేనే కాస్త ఒక పక్కకి వొత్తిగిలా! అదే మన మెక్కిన బల్లకట్టుమీ దెక్కితే, దాన్ని కాళ్ళిరగగొట్టేవాళ్లు కాదూ? కోటమ్మ : ఇది మాయ కలికాలం కాదటే, కల్లారా! ఒక కట్ట డెక్క డేడ్చింది? కుడీ, యెడ మెక్క డేడ్చింది? ఆ మాటకొస్తే, సిన్నా పెద్దా అయినా చూస్తున్నారటే! మా అబ్బాయి మానానికి మా అబ్బాయి బాబు మాట యింటున్నాడూ? ఈయేడు ఆ డసలు మాసూల్లోకి యెళ్ళితేనా? "కళ్ళాం తొక్కించరా!” అంటే చెవి నట్టించుకోలేదు. "కుప్ప దింపించరా!” అంటే గోడకి చెప్పినట్టే! ఏమిటో సినిమాలట! మాయదారి సినిమాలు!! ఈటిని మరిగాక ఆడింటిపట్టు నుంటేనా!

పొన్నమ్మ : ఆడికేమే పిన్నామా! ఎంత చెడ్డా మగబిడ్డ. కాని, ఈ ఆడముండల కేం తిప్ప లొచ్చాయ్! 

కొత్త సినిమా ఆడుతున్నదని టము కొస్తే చాలు, తంబలకి తంబ లిరగ బడుతున్నారు. వాటిని చూసొచ్చిన కాడినుంచీ ఆ పాపట్లు పాపట్లు కావు; ఆ పమిటలు పమిటలు కావు. రోజు కొక రకం. నిన్న చూద్దునుగదా ఆ ఎత్తుపళ్ల సుబ్బి కోడలిచేతిని కిందినుంచి పైదాకా అన్నీ గాజులే. లంబాడీముండా. లంబాడీ యాసమున్నూ! కోటమ్మ : ఇంకా అది నయం కాదటే, కల్లాలా? ఆ మెరకీది నరిసి కూతురు... పొన్నమ్మ : చల్లనేళ ఆ పుట్టుకుంక పేరెందు కెత్తావే, పిన్నామా! పాపం చుట్టుకోడానికా! అది ఆ బస్సు కండక్టర్ని - దుబ్బు జట్టుతో గణాసారిలా వుంటాడే! - ఆణ్ణి... కోటమ్మ : ఎవడే ఆడు? పొన్నమ్మ : ఉన్నాడులే వొకడు చీంబోతులా! - ఆడి జిమ్మడ! ఆణ్ణి పగలు చూస్తే, రాత్రి కలలో కొస్తాడు – ఆణ్ణి అది పెట్టుకుంది. మల్లెపువ్వు లేమిటి? మిఠాయిపొట్టా లేమిటి? - ఆడు నడిపే బుట్టలు బుట్టలు కావు. అన్నీ తెచ్చి యింటి నిండా పడేస్తున్నాడని ఆణ్ణి ఇంటి అల్లుణ్ణి చేసుకున్నారు. కోటమ్మ : చీ! మద్దెపు ముండలు. మరి దాని మొగుడెలా వూరుకుంటున్నాడే? పొన్నమ్మ : ఆడు గాజులు తొడిగించుకొన్న యదవ కాదంటే, పిన్నామా! పెళ్ళాం ఏంకూళ్ళు కుడిస్తే ఆడికేఁ? దమ్మిడీ ఖర్చులేకుండా బస్సులెక్కి గడేకారిలా తిరుగుతున్నానని ఆడి కులుకాడిది. కోటమ్మ : అంత సన్నాసటే ఆడు! పొన్నమ్మ : సన్నాసా! సన్నాసిన్నరా!! నెరీదిగా ఇలాంటి తప్పుడు పనులు సాగుతుంటే, ఇదివరకైతే ఊరుకునే వాళ్ళటే, పిన్నామా! నిలువునా తెగ్గేసి, ఉప్పుపాతర్లో ఊరేసేవాళ్ళు కదూ? కోటమ్మ : ఇంతకీ ఈ తిప్పలన్నీ పెదనాగన్నగారి బూసయ్య తెచ్చి పెట్టాడు. ఏటిమీద వొంతిన కట్టి, రోడ్డొస్తే, ఊరుకేదో వొరుగుతుందని గడప గడపకి తిరిగి చందా లోగుజేసి చట్టు బండలయ్యాడు. అంతకు ముందు ఆ పేట ఎక్కడ మండిందో ఎవళ్ళకి తెలుసు? నామట్టుకు నేను ఇన్నేళ్ళోచ్చినా దాని ముక్కూ ముఖ మెలా వుంటుందో యెరగను. పొన్నమ్మ : అంతేనే, పిన్నామా! మనకి బస్తీలతో పనేమిటి? ఏటి కొకసా రెళ్ళితే గింజా గిట్రా అమ్ముకోటాని కెళ్ళాలి. పెళ్ళికీ, పబ్బానికీ గుడ్డా గుడుసూ తెచ్చుకోడాని కెళ్ళాలి. అప్పుడైనా ఎవళ్లు బడితే ఆళ్ళే యెళ్ళేవా? పెద్ద తలకాయలు ఒకరో, యిద్దరో పొద్దున్నే చద్దన్నం తినెళ్ళితే, సందేళకి ఆ పనేమిటో చూసుకుని చక్కా వొచ్చేవాళ్ళు. ఇప్పుడేముంది? అడ్డమైనాళ్లూ ఆసులో గొట్టం తిరిగినట్టు ఈ సందుకీ, ఆ సందుకీ తిరుగుతున్నారు. ఎన్ని బస్సులు నడిచినా, నిలుచోటానికైనా సందుంటేనా! కోటమ్మ : ఇంతకీ మా కొంపకి తిప్పలు తేవటానికే వొచ్చిపడ్డాయి ఈ పాడు బస్సులు! తన పనేమో, తనేమో ఒకరి జోలీ సొంటీ లేకుండా దొరలా వుండే నా బిడ్డ ఇవొచ్చాక చప్పగా చెడిపోయాడు. వారానికి రెండు, మూడు సార్లయినా బస్తీ కెళ్ళి రాకపోతే ఆడికి నిద్ద రట్టడం లేదు. పొన్నమ్మ : మన పెత్తందారు బూసయ్య దొంతి నేయించాక, మనాళ్ళందరు - నీళ్ళకు చేప లెదురెక్కినట్టు - బస్తీ కెళ్ళడమేనా, మన కొచ్చిపడ్డ తిప్పలు? ఆ బస్తీయే వొంతినమీదగా వొచ్చి, మన గొంతుమీద కూకోడం లేదటే, పిన్నామా? అంతకుముందు బీడీలు, సిగరెట్లు, సోడాలు, కిళ్ళీలు మన వూళ్లో అమ్మేవారూ? ఇప్పుడు ఆ మండి నొంతినదగ్గిర అన్నీ ఈ కొట్లే. రెండో, మూడో బట్టల కొట్లు కూడా కొత్తగా యెలిశాయిగాఁ! ఇఖ కాపీ వోటళ్లు సరేసరి. రోజు కొకటి కాడి కొస్తున్నది. వోటల్, వోటల్లోను పొనిగ్రాపులంట - పొట్టోయేదాకా ఒక్కటే రొద. ఈ లెక్కని మరి నాల్గు రోజులు పోతే, ఇదే పెద్ద బస్తీ కాకపోతే న న్నడుగు. కోటమ్మ : అవునే, కల్లాలా! ఈ మాయదారి వొంతె నొచ్చాక ఊరే తలకిందులై పోతున్నది. మా అబ్బాయి మానానికి మా అబ్బాయి వుంటే ఆ బస్తీలో వుంటాడు; లేకపోతే ఆ వొంతెనదగ్గ రుంటాడు. ఇల్లంటేనే ఆడికి కంపరంగా... అడుగో! ఆ డొచ్చాడు. ఏరా, అబ్బాయ్! ఎన్ని రోజులైంది నువ్వెళ్ళి! రేపటికి నాలుగు! ఇదుగో తిరిగొస్తానన్న బిడ్డ రానే లేదని మా మనసెంత పీకిందో నీకేం తెలుస్తుంది! ఇట్టాగైతే ఎట్టారా, బాబూ! ఏడీ, మీ బా బేడీ? (ఈ ఘట్టంలో ప్రవేశించిన చలపతి ఇరవై రెండు, ఇరవై మూడు యేళ్ళవాడు. మనిషిలో నాజూకుతనం లేకపోయినా, వేషంలో నాజూకుతనం కోసం చాలా ప్రయత్నం కనబడుతుంది. కుబుసంలాంటి ధోవతి; ఆ ధోవతికంటె కూడా సన్నని లాల్చీ; ఆ లాల్చీలో నుంచి తొంగిచూస్తూ చేతులులేని అల్లిక బనియన్; వల్లెవాటుగా సన్నని జరీ ఉత్తరీయం, కాళ్ళకు ఆకు చెప్పులు; చేతికి గడియారం; కళ్లకు గాగుల్స్. చలపతి : ఏమో, నాకేం తెలుసు? కోటమ్మ : నీయెంట రాలేదట్రా? చలపతి: నావెంట రావడ మేమిటి? కోటమ్మ : ని న్నెతుక్కుంటూ, పొద్దున్నే పేటకి రాలేదట్రా మీ బాబు? చలపతి : నన్ను వెతుక్కుంటూ తను రావడం దేనికి? నేనేం పాపాయినా దారితప్పి పోవడానికి? కోటమ్మ : అది కాదురా, బాబూ! పంటమ్మి డబ్బు తెమ్మని పంపిస్తే.... చలపతి : పంపిస్తే, ఆ డబ్బు పుచ్చుకుని, దేశం తెగించి పారిపోయాననుకున్నాడా? కోటమ్మ : చూడవే, పొన్నీ! ఆడిమాటలు! మొన్న పొద్దున్ననగా వొడ్లు తోలించుకెళ్ళి తను బస్తీలో కూకుంటే కూకున్నాడు గాని.... చలపతి : అక్కడ ఆ రైసుమిల్లు వాళ్లు డబ్బివ్వకపోతే నన్నేం చెయ్యమంటా రేమిటి? పొన్నమ్మ : అంత కోపం దేనికిరా తమ్ముడూ? ఇప్పుడు పిన్నా మేమనిందని? కోటమ్మ : అక్కడ పైక మందకపోతే, అందలేదని - తెల్లారి లేస్తే లచ్చా తొంబైమంది వొస్తూ పోతూ వుంటారుగదా! - ఎవళ్ళ చేతనైనా కాస్త కబు రంపితే మే మెందుకు గుంజాటన పడతాం! పొన్నమ్మ : నిజమే తమ్ముడూ! కాకితోనైనా కాస్త కబురు చేస్తే కాదూ? చలపతి : కబురెలా చెయ్యడం? ఏపూట కాపూట మీపని చేసి పంపిస్తామని వాళ్ళంటూవుంటే! కోటమ్మ : సర్లే, బాబూ! నువ్వు సుకంగా తిరిగొచ్చావ్! అదే పదేలు గాని, నిన్నెతుక్కుంటూ యెళ్ళిన బాబు నువ్వు తగల్లేడని యెంత గాబరా పడుతున్నాడో, ఏమో, ఖర్మం! పైకెంత బోకరించినా, వొట్టి బయస్తుడు. కాస్తికీ కూస్తికీ గుండె బేజారౌతాడు. సందేళకి తప్పకుండా తిరిగొస్తానని చెప్పెళ్లాడు గాని, నువ్వు కనిపించలేదని ఇవాల్టి కిఖ రాడేమో. చివరి బస్సొచ్చేసిందా? పొన్నమ్మ : వచ్చే వుండాలి. నువ్వొచ్చింది చిట్టచివరి బస్సేగా, అబ్బాయ్ ? చలపతి : ఉఁహుఁ. అది మరి కాసేపటికిగాని రాదు. నే నొచ్చింది. దారిలో చెడిపోయి,గంటన్నర ఆలస్యమైంది. పొన్నమ్మ : అంతే మరి! ఏదైనా సాగితే బండి, సాగకపోతే మొండి. కోటమ్మ : సర్లేరా, బాబూ! రా! కాళ్లు కడుక్కురా బువ్వ పెడతా! చలపతి : ఉఁహుఁ! ఆక లెయ్యడం లేదు. కోటమ్మ : అయ్యొ, ఖర్మ! ఆక లెయ్యకపోవట మేమిట్రా? పెరుగోసుకైనా రెండు ముద్దలు... చలపతి : నా కేమీ వద్దు! కోటమ్మ : మా నాన్నవుగా రెండంటే రెండే ముద్దలు. చలపతి (చిరాకుగా) : నా కాకలి లేదంటూంటే! (బయటికి వెళ్ళబోతాడు. కోటమ్మ : మళ్ళీ యిప్పుడు బయటి కెక్కడికిరా? కాసేపటికో, కూసేపటికో మీ బాబొస్తాడేమో! ఆయి నొచ్చేయాళకి నువ్వింటికాడ లేకపోతే... పొన్నమ్మ : ఔను, తమ్ముడూ! బాబాయి యిప్పు డొస్తాడేమోగా! నువ్విప్పు డెక్కడికి? చలపతి : ఎక్కడికీ లేదు - ఇక్కడికే! ఇప్పుడే తిరిగొస్తా. (తిరిగి కదులుతాడు. కోటమ్మ : సరేగాని, ఆ దస్తు యెంట దేనికిరా, బాబూ! ఇంట్లో బద్రంచేసి పో! చలపతి : దస్తేమిటి? వాళ్ళు డబ్బివ్వందే! కోటమ్మ : ఆళ్ళ జిమ్మడ! ఇన్ని రోజు లట్టి పెట్టుకుని ఆళ్లు డబ్బివ్వనేలా? చలపతి : ఉఁహుఁ! (వెడతాడు. కోటమ్మ : చూశావటే, పొన్నీ! ఆడొచ్చిన యెడ మెక్కడ? ఎళ్ళిన యెడ మెక్కడ? కూసేపైనా కొంపలో ఆడికి కాలు నిలిస్తేనా? ఈ మండిన వొంతిన పడి, ఈ మాయదారి బస్సు లేమంటూ వొచ్చాయో గాని, నాబిడ్డ చప్పగా చెడిపోయాడు. ఏ మేసి పెట్టినా సుబ్బరంగా పళ్లెం తుడుసుకు తినేవాడు. ఇప్పు డెంత కమ్మగా కూరొండినా, ఆడికి రెండు ముద్దలైనా దిగందేఁ! కూకున్నాడు కూకున్నట్టే లేసి చక్కాపోతున్నాడు. ఈపూట గత్తే అసలన్నమే వొద్దన్నాడు! పొన్నమ్మ : ఆఁ! కాపీవోటళ్ళకి మరిగినాళ్ళకి మన కూరా నారా నచ్చుతాయటే, పిన్నామా! ఇడ్డెన్లని, దోసెలని - ఆటి పేర్లయినా -- మండిన పేర్లు! - మనకి తెలవ్వు - అక్కడేమిటో వర్రగా పెడతారట! కోటమ్మ : ఏం తిళ్ళో పాడు తిళ్లు! ఇల్లాంటి తిళ్లు ఎన్ని తిన్నా అన్నమౌతుందటే, కల్లాలా! పొన్నమ్మ : కాదనుకో! కాని అడ్డమైనాళ్ళకి ఇప్పుడు కాపీ వోటలు ఒక పెద్ద రందై పోయిందిగా! బస్తీకి తిరిగేవాళ్ళు సగం సినిమాలకైతే, సగం కాపీవోటళ్ళకి. ఈ పాడు వోటళ్ళ మూలంగానేగా, ఊళ్లో పాలూ, పెరుగూ, మజ్జిగా కరువైపోయాయ్! నెయ్యిమాత్రం కావాలంటే దొరుకుతున్నదా? ఇప్పుడు పాడిచేసుకోవడం తాగడానికటే, పిన్నామా? అమ్ముకు మూటలు కట్టుకోడానికిగాని! తెల్లారకముందే వాడిక వాళ్ళోచ్చి పాలు, పెరుగూ, యెన్నా, అన్నీ బస్సులమీద యెక్కించుకు పోతున్నారు. కోటమ్మ : నిజమేనే, పొన్నీ! మొన్నొకనాడు సుట్టపాడొస్తే పావు సేరు నెయ్యికోసమని పిడతెట్టి ఊరంతా తిప్పించినా దొరికితేనాం! మీ రమ్మేదానికి కానీ, అర్ధణా యెక్కు వేసుకు పొయ్యమన్నా, ఎవ్వతీ పొయ్యలేదు. పొన్నమ్మ : నీదంతా పిచ్చిగాని, ఇప్పు డసలు అర్ధ శేరు పాలు పొయ్యమన్నా పోస్తున్నారటే, పిన్నామా? ఒకపూట వాడిక తప్పిస్తే, వాడిగ్గా వొచ్చేవాళ్లు అలిగి బిగదీసుకు పోతారట! అడిగితే మాట వోటుపోవడమే తప్ప, ఒక్క బొట్టయినా రాల్చరు. కోటమ్మ : అయ్యొ! కాలాని కెన్ని కడగళ్లొచ్చాయే. కల్లాలా!! పొన్నమ్మ : పిల్లా జిల్లా నోట గడ్డ కట్టి, ఆ అమ్ముకునే పాడైనా ఒక తీరూ దారీగా అమ్ముతున్నారా? అన్నీ కల్తీలేగా! అంతా తొత్తడమేగా! కోటమ్మ : ఔనే, పొన్నీ! మొన్న యెవతో చెప్పింది. యెన్న తీశాక, దాన్లో యింత మజ్జి గోసి, కవ్వంతో గిలకొడితే, ఆ మజ్జిగంతా యెన్నలో కెక్కి ఆటొస్తుందటగా! పొన్నమ్మ : అదొక్కటేనా? మైదాపిండి మెత్తగా ఉడకబెట్టి యెన్నలో కలిపేస్తున్నారు! కోటమ్మ : ఇంత పాపం మూట కట్టుకుంటే ఏం ముందు కొస్తారులే! ఈ మండి నొంతెన పడి, ఈ మాయదారి బస్సు లొచ్చి, ఈ ముదనష్టపు బస్తీల కెక్కడం ఎక్కువైనాకేగాని, అంతకుముందు ఈ పాపా లెరగమే, పొన్నీ! ఎటొచ్చీ ఈ ఏణ్ణర్ధం, రెండేళ్ళ నుంచేగా ఈ యిడ్డూరాలన్నీ! పొన్నమ్మ : నిజమేనే పిన్నామా! నాలుగేళ్ళనాడు మా రెండో పిల్ల పెళ్ళికి కానీ పెట్టి కూర కొన్నామూ? ఇరుగు పొరుగాళ్ళే గుమ్మడికాయలు, సొరకాయలు, దోసకాయలు, వంకాయలు, బెండకాయలు, దొడ్లలో కాసినాటిని, అడక్కుండానే పట్టుకొచ్చి యిల్లు నింపారు. అదే పోయినేడు మా మూడోపిల్ల పెళ్ళికి తోటకూర కాడ సుద్దా అన్నీ బస్తీ కెళ్ళి కొనుక్కోవా ల్సొచ్చింది! కోటమ్మ : అంతేనే, కల్లాలా! ఇదివరకంటే మంచొచ్చినా, చెడొచ్చినా ఒకళ్ళ కొకళ్లు ఆదుకునే వాళ్లు. ఇప్పుడేముందీ? డబ్బుకు మరో డబ్బు ముడేసి.... పొన్నమ్మ (కాళ్ళ అలికిడి విని, వీధిగుమ్మంవైపు ముఖంతిప్పి) : అడుగోనే, పిన్నామా, మా బాబాయి! (అప్పయ్య ప్రవేశిస్తాడు. వయస్సు దాదాపు అరవై సంవత్సరాలు. అయినా, శరీరపటుత్వం కొంచెమైనా సడలనివాడు. పొలంలో వంగితే, పడుచువాళ్లను మించి పాటుపడగలవాడు. అప్పయ్య (లోపలికి అడుగు పెడుతూనే కోటమ్మతో) : ఏమేఁ! వాడు పేటలో లేడు! ఏమైపోయినట్టు? కోటమ్మ : ఇంటి కొచ్చాడు. పొన్నమ్మ : ఇంతకు ముందేనే, బాబాయ్! అప్పయ్య : దొర దిగాడన్నమాట! ఏడీ, మరి? కోటమ్మ : వాకిట్లో వాడు వాకిట్లోనే ఊరిమీదికి పోయాడు. ఎంత బతిమిలాడినా తిండైనా తిర్లేదు! అప్పయ్య : అప్పుడే ఇంటికి రావడమూ, ఊరిమీదికి పోవడమూ జరిగిందన్నమాట! ఆ దస్తు ఇంట్లో భద్రంచేసి పోయాడా! కోటమ్మ : ఆళ్ళింకా డబ్బివ్వలేదటగా! అప్పయ్య : డబ్బివ్వకపోవడ మేమిటి? సొమ్ము సంచులమీద పెట్టామని వాళ్ళు చెబితే! పొన్నమ్మ : అబ్బే! లేదటే బాబాయ్! ఆళ్ళు తెగ తిప్పి, ఉత్తచేతుల్తో పంపించారని అబ్బాయి అంటేనే! అప్పయ్య : వీడింత దొంగ వెధ వయ్యాడే! ఒక్కమాటైనా నిజం లేదుగదా? బేరం పుచ్చుకోగానే, డబ్బిచ్చేశామని వాళ్ళు నాతో సొష్ఠంగా చెప్పారు! కోటమ్మ : అయ్యొ ఖర్మ! అయితే ఆడు డబ్బేం చేసినట్టు! కాస్తా, కూస్తా! మూడేల సిల్లర! అప్పయ్య : వా డొంటికి బాగా నీరుపట్టింది. కళ్లు పసరెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాస్త బద్ధకించి, వొడ్లు అమ్ముకు రారా అని పంపిస్తే, నన్నింత రొష్టు పెడతాడూ? ఎక్కడున్నాడో చూసి, సిగ పాయతీసి, వాణ్ణి ఈ పూట సున్నంలోకి ఎముకలేకుండా నలగ బొడవకపోతే నా పేరు అప్పయ్య కాదు. (మండువా చూరులోనుంచి కోలుపుకర్ర తీసుకుని, వీధిలోకి బయల్దేరబోతాడు. కోటమ్మ (అడ్డు వచ్చి): సర్లే! నువ్వూరుకో! కన్నూ మన్డే; యేలూ మన్డే. ఆడ్డి పట్టుకు కొడితే పోయిన డబ్బొస్తుందా? అప్పయ్య (కోటమ్మను తోసివేసి వెళ్ళిపోతూ) : ఎప్పటికప్పుడు నువ్వే వాణ్ణి చెడగొట్టింది. నువ్విచ్చిన అలుసు చూసుకునేగా వాడు మేకై కూర్చున్నాడు. కోటమ్మ (నెత్తి కొట్టుకుంటూ) : ఇది నా ఖర్మ. పొన్నమ్మ : ఆఁ! నీకు తెలవదులేవే, పిన్నామా! ఆపాటి భయం లేకపోతే మాటింటారటే! కోటమ్మ : చాల్లే! చెప్పొచ్చావ్! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని. ఆడి కాలో,సెయ్యో యిరిగితే ఎవళ్లకీ తిప్పలు? మాక్కాదూ? పొన్నమ్మ : ఆఁ! బాబాయిది బుసబుస పొంగు? ఎదో తామస మొచ్చి కేకలేస్తూ పోయాడు గాని, పెరిగొచ్చిన కొడుకు పై చెయ్యి చేసుకుంటాడటే, పిన్నామా! కోటమ్మ : ఏమో కర్మ! మండిపడుతూ యెళ్ళాడు. పిచ్చి కోపంలో నా కొంప కేమి తిప్పలు తెస్తాడో! ఇంతకీ ఈ పీడంతా ఆ పెదనాగన్నగారి బూసయ్య... భూషయ్య (ప్రవేశిస్తూ) : ఏమిటీ, కోటమ్మక్కా నా పేరెత్తు తున్నావ్! (భూషయ్య వయస్సు నలభై అయిదు ప్రాంతాల. మనిషిలో ఎంతో హుందాతనం కనబడుతూ వుంటుంది. తాతవలె, తండ్రివలె తానుకూడా తన హుందాతనంవల్లనే పోరుకు పెత్తందారై, వయస్సులో తనకంటె పెద్దవారినుంచి కూడా మన్నన లందుకొంటున్న వాడు. కోటమ్మ : వొచ్చావ్, బాబూ, నువ్వు! మాటలో మూటేసుకుని! నువ్వే మా కిన్ని కడగళ్లు తెచ్చావ్!

భూషయ్య (నవ్వుతూ) : అంత పాపం చేశానూ? కోటమ్మ : నీకిది నవ్వులాటగా వుందటరా, బూసయ్యా? కూచయ్య ఇంతకీ, ఏమిటమ్మా సంగతి? కోటమ్మ - ఏమిటి? గింజలమ్ముకురారా అని పిల్లాడిని పేటకి పంపిస్తే, ఆటినమ్మి ఆ డబ్బంతా మంగళం చేసుకొచ్చాడు. ఈ మాటినేసరికి మీ బావయ్యకి వాళ్లు మండుకొచ్చి కడుచ్చుకు కొడుకు మీది కెళ్లాడు. భూషయ్య : ఆ మా బావయ్యకి అంత వొళ్లు తెలియని కోప మొచ్చింది? పొన్నమ్మ: వళ్ళు నా పుట్టుకొస్తుంది రేచిక్క ఇట్టాంటి పన్లు చూస్తే, కోటమ్మ : అబ్బాయ్. నువ్వు కాస్తెల్లి మీ బావయ్యకి సర్దిచెప్పి తీసుకురారా. మంగళమైన సొమ్మేమో మంగళమైంది. ఆణ్ణి బాదితే పోయిన డబ్బీస్తుంది? భూషయ్య : ఇప్పుడు నీ కొడుక్కొచ్చిన భయమేమి లేదు, కోటమ్మక్కా వాడు మాయింట్లో భద్రంగా వున్నాడులే. కోటమ్మ: ఆడ మీఇంటి కాడున్నాడు. అయితే, పరవాలేదులే. భూషయ్య : పరదా లేదూ? ఇంతకు ముందేగా నేమ మీకు కడగళ్లు తెచ్చా నన్నావ్! కోటమ్మ : ఆ మాట ఇప్పుడననూ? నువ్వు ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వొంతె నేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించాకే కాదట్రా, ఊళ్ళో కొంపకొంపకీ ఇన్ని కడగళ్ళొచ్చాయ్. అంతకుముందు ఈ యిడ్డూరా లెరిగున్నామూ? పొన్నమ్మ : అట్టా అడుగు, పిన్నామ. బాగా ఆడుగు! భూషయ్య : అయితే, పొన్నమ్మా నువ్వు పాడిమీద ఎంత సంపాయిస్తున్నావ్? . పొన్నమ్మ : ఆయా ఈ యేడు మాకు పా డెక్కడిది? భూషయ్య : పోనీ, ఈ యేడు కాకపోతే నిరుడెంత మూటగట్టావ్? పొన్నమ్మ : ఆఁ. చాలా మూట గట్టాం! వాటికి పోసిన తవుడుకే చాల్లేదు కోటమ్మ : అదేంటే, పోన్నీ! పాడికుండమీద నాలుగు డబ్బులు కళ్ళబడితేనేగాఁ ఆ నానుపేట చేయించుకుని మెళ్ళో పెట్టుకున్నావ్! భూషయ్య (నవ్వుతూ) : అలా అడుగు, కోటమ్మక్కా బాగా అడుగు! పొన్నమ్మ : అడగడానికీ, కడగడానికి నే నెవరి యింట్లోనైనా కన్నామేశానా! భూషయ్య : ఎవరింట్లో కన్నంచేస్తే ఎవ రూరుకుంటారమ్మా? పాడి అమ్ముకోబట్టి.... పొన్నమ్మ : అమ్ముకోక పందేరం పెడతా రేమిటి? ఊరికే మా కెవ్వరేమీ పంచిపెట్టడం లేదే? భూషయ్య : ఊరికే పంచి పెట్టమని నేనంటానా? రోడ్డు పొయ్యబట్టే, వంతెన పడబట్టే నాలుగుడబ్బులు అందరికళ్లా పడుతున్నా యంటున్నాను, అందరూ కాస్త పచ్చపచ్చగా వున్నారంటున్నాను.. కొత్తగా చేతిలో నాలుగు డబ్బులు గురగుర లాడుతుంటే, ఎంతటివాళ్లకైనా మతులు పోతాయ్! అంతమాత్రానికి చేతిలోకి నాలుగు డబ్బు లొచ్చేదారి చూపించడమే తప్పా? కోటమ్మ : మా లావు చూపించావులే దారి! ఆ మండిన బస్తీ నుంచి ఒక కానీ ఇక్కడికొస్తే, ఇక్కడి నుంచి రూపాయి అక్కడికి పోతున్నది. ఇంతేనా సంబరం! వాళ చూశావుగా! కాస్తా, కూస్తా! మూడేల చిల్లర. చల్లా పెరుగూ అమ్ముకుని కానీ కానీకాడికి ముడేస్తే, ఎప్పటికి కాను మూడేలు! ఈ మాయదారి బస్సులు తగలడకముందు మా అబ్బాయి బస్తీ ముఖ మెరుగున్నాడూ? పొన్నమ్మ : అట్టా అడుగు, పిన్నామా! బాగా అడుగు! భూషయ్య : నేను తిరగమన్నానటే, కోటమ్మక్కా మీ అబ్బాయిని బస్తీ చుట్టూ! నామాట విని, ఎక్కడైనా మంచి పిల్లను చూచి వాడికి తొందరగా ముడిపెట్టండి. గుదిబండ మెడని పడితే, ఇంటి నతికి వుంటాడు. కోటమ్మ : ఆడింత గాలిగా తిరుగుతుంటే ఆడికి పిల్ల నెవరిస్తారు? పొన్నమ్మ : ఆడికి పిల్లనిచ్చేవాళ్లే కరువటే, పిన్నామా? మా పెద్దమ్మాయి దగ్గర వుందిగా ఎదిగిన పిల్ల. నువ్వు “ఊఁ" అనాలేగాని, పదేనేలు కట్నంపోసి.... కోటమ్మ : కట్నాల కేమొచ్చెలే! అంత దూరం సమ్మందం.... పొన్నమ్మ : ఎంతదూరమే, పిన్నామా! పది ఆమడలైనా లేదు. ఈ ఊరునుంచి ఆ ఊరుదాకా బస్సులు నడుస్తూనే వున్నాయిగాఁ! పొద్దు నిక్కడ బయల్దేరితే, పొద్దుగూకేళకుముందే అక్కడ దిగొచ్చు. కోటమ్మ : ఎందుకురా బూసయ్యా! నీకంత నవ్వుగా వుంది? (భూషయ్య నవ్వుతాడు. భూషయ్య : ఏం లేదు, కోటమ్మక్కా ఈ ముదనష్టపు బస్సులు రాబట్టే గదా, పొన్నమ్మ పెద్దమ్మాయిగారి వూరు ఇంతదగ్గరి కొచ్చిందని నవ్వొచ్చింది. పొన్నమ్మ : మన పెత్తందారుగారి ఎకసక్కాలకేం గాని, అయిన సమ్మందం! పిల్ల వొంటిని డెబ్బై నవర్సుల బంగారం వుంది. ఏమంటావే, పిన్నామా? కోటమ్మ : ఆఁ! ఇప్పు డేం తొందర లేవే! పొన్నమ్మ : వచ్చేనెల్లో రెండే లగ్గా లున్నాయి. ఆ రెండూ తప్పనిడిసి, మరి ఈ యేటికి లగ్గమే లేదంటున్నారు. ఈపూట నే నసలు ఈ మాట కదలేసిపోదామనే సగ మొచ్చానే, పిన్నామా! కోటమ్మ: సరే సూద్దాం లేవే, పొన్నీ! పొన్నమ్మ : సూద్దామంటే కాదు; తొరగా ఏదో ఒకమాట తేల్చాలి నువ్వూ, మా బాబాయీ కూడా బలుక్కుని. నోరు తెరిచి అడిగినందుకు, నామాట దక్కించాలి. పొట్టోయింది. మరి నే నెళ్లొస్తా. (వెడుతుంది. భూషయ్య : అంత కట్నం పోస్తామంటే, ఆ సంబంధం వొద్దంటా వేమే, కోటమ్మక్కా కోటమ్మ : కట్న మొస్తే సాలట్రా? మంచీ సెబ్బరా లేదూ?? భూషయ్య : వాళ్ళకేఁ? పొన్నమ్మ పెద్దల్లుడికి ఈ మధ్య బాగా కలిసొచ్చిందటగా! కోటమ్మ : ఆఁ! ఎంత కొత్త భాగ్య మొస్తేనేరా, అబ్బాయ్! ఆడిగుణం మంచిది కాదు. ఆడు బోగం కొంపలకి తిరుగుతూ, పెళ్ళాన్ని కాపరానికి తీసికెళ్లకుండా, మొదట్లో రెండు మూడేళ్లు ఈ పొన్నిని నానాగడ్డి తినిపించలేదట్రా? ఈ మాయదారి సమ్మందం మా కెక్కడ దాపరించిందని కనబడ్డాళ్లందరికీ చెప్పుకుని ఆవురావురని ఇది అప్పు డేడ్చేదికాదూ? ఇవ్వాళ గతే, నా అల్లుడు పదేనేలు కట్నమిస్తాడంటూ చెప్పొచ్చింది! భూషయ్య: కట్నం అక్కర లేదనుకుంటే, మా పిల్లని చేసుకో! కోటమ్మ : నీకేం తక్కువరా? - కట్న మివ్వక పోవటానికి! భూషయ్య : ఇవ్వలేక కాదుగాని, యివ్వను. కోటమ్మ : నీ కూతురికి నువ్వేమీ పెట్టుకోవట్రా? అయితే, అది ఉసూరుమన్దూ? భూషయ్య : నా కూతురికి నే నేమైనా పెట్టుకుంటానో, లేదో అది నా యిష్టం. ఇంత కట్నం, అంత కట్న మని ముందుగానే బేరాలు మాత్రం నాకు గిట్టవ్. బేరాలకు ఇదేం బర్రెగొడ్డా! కట్నం పేరు పెట్టి నే నొక చిల్లిగవ్వైనా యివ్వను! కోటమ్మ : కట్నం లేందే నీపిల్ల మాకు దేనికి? ఆడికి పాతికేలు పోస్తామంటూ ఎన్నో సమ్మందా లొస్తున్నాయి. నిచ్చేపంలాంటి బిడ్డ! నిలువెత్తు డబ్బోసినా, నా బిడ్డంటి అల్లుడు నీకు , దొరకుతాడూ? భూషయ్య (ఈ ఘట్టంలో ధుమధుమలాడుతూ లోపలికి వచ్చిన అప్పయ్యతో): అప్పయ్యబావా! నిలువెత్తు డబ్బు పోసినా దొరకని కొడుకుతో లేనిపోని పేచీ లెందుకు.... అప్పయ్య : వాడా నా కొడుకు! ఇఖ, వాణ్ణి నా గడప తొక్కనిస్తానూ? కోటమ్మ : చాల్లే! ఏం మాటలు! ఎవరైనా యింటే నవ్విపోతారు! భూషయ్య : ఎందుకే. అప్పయ్యబావా, అంత టెంపరు! అప్పయ్య : ఈపూట వాడి గీత బాగుంది! లేకపోతే, రక్తం కళ్ల జూచేవాణ్ణి కాదూ? కలెత్తేసరికి నలుగురూ పోగై పట్టుకున్నారు గాని.... భూషయ్య (నవ్వుతూ): నలుగురూ పోగయ్యేవరకు ఆగినాడివి నువ్వేం రక్తం కళ్ల జూస్తావ్, అప్పయ్యబావా! కోటమ్మ : నీ యెకసక్కాలకు యేళా పాళా లేదట్రా, బూసయ్యా! అప్పయ్య : ఆ వెధవని ఈపూట పాతేసేవాణ్ణి కాదూ! ఆ వంతెనకాడ పదిమంది వుండబట్టిగాని.... భూషయ్య : చలపతి వంతెనవద్ద వున్నాడటే, అప్పయ్యబావా? నేను తిరిగొచ్చేదాకా మాయింట్లో నుంచి కదలొద్దని చెప్పొస్తే వాడికి కాలు నిలవలే దన్నమాట! కోటమ్మ : ఆ డొకచోట కాలు నిలిచే గున్నైతే మా కిన్ని తిప్పలెందు కొస్తాయిలే! భూషయ్య : మాట్లాడితే తిప్పలు తిప్పలంటావ్. ఇప్పుడు నీకొచ్చిన ప్రమాద మేమిటి, కోటమ్మక్కా? కోటమ్మ : చూస్తూనే వున్నావుగా! ఇ దేమిట్రా? కొంపకి తిప్పలు కావూ? అప్పయ్య : శిస్తుకైనా రికానా లేకపోబట్టేగా ఈ తక్కువ ధరల్లో సగం పంట అమ్ముకుంది! “ జాగ్రత్తగా, అబ్బాయ్!” అని మరీమరీ చెప్పి పంపిస్తే, అంతా జలగడుక్కొస్తాడూ? పైగా, వాళ్లు డబ్బివ్వలేదని అబద్ధాలా! భూషయ్య : అబ్బే! లేదే, అప్పయ్యబావా! వాడు మొత్తమంతా ఖర్చు పెట్టలేదు. ఏదో కొంచెం బొర్రి పడింది. చేబదులుచేసి దాన్ని పూడుద్దామనే ఈపూట నాదగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. బుద్ధిమంతుడిలా నాదగ్గరికి రాబట్టి సరిపోయిందిగాని, అదే ఏ షాహుకారు సుబ్బయ్యలాంటి వాడిదగ్గిరికో వెళ్లితే రూపాయి చేతిలో పెట్టి, రెండు రూపాయలకు ప్రోనోటు రాయించుకునే వాడు కాదూ? కోటమ్మ : నే ననుకుంటూనే వున్నారా, బూసయ్యా! చిన్న సన్నాసి ఏ యాబయ్యో, వందో ఏ ఖర్చు పెట్టుకుంటాడేమో గాని, ఆడు మూడే లేం చేస్తాడు! ఆడేం తాగుతాడా? తలకు బోసు కుంటాడా? అప్పయ్య (మొత్తం సొమ్ము గల్లంతు కాలేదని విన్నంతనే కోపం కొంత చల్లారిపోగా) : బొర్రి పెట్టుకొచ్చాడూ? ఏపాటి? భూషయ్య : ఆఁ! ఎంతోనా, అప్పయ్య బావా! సాదరుకింద తను వాడుకున్న బాపతు ఏవో చిల్లరమల్లర అప్పులుంటే, వాటిని ఆపడానికి వీల్లేక, ఒక నాలుగు వందలు వాటికింద జమకట్టాడట. ఈ మాట తెలిస్తే నువ్వెక్కడ కోప్పడతావో అని నీ యెదటపడ్డానికి వాడు నీ జంకుతున్నాడు. అప్పయ్య : అలాగేఁ! కోటమ్మ : ఏదో చిన్న సన్నాసి! ఆపాటి వాడు వాడుకున్నాడేమోలే! అప్పయ్య : వాడా చిన్న సన్నాసి! ఈ మధ్య నీటుగోటులు తెగబలిసిపోతే! ఇస్త్రీ మడతలు తప్ప పనికి రావడం లేదు. తలకి వాసన నూనెలు కావాల్సొచ్చాయి. వీడు ఉద్యోగాలు చేస్తున్నాడా? ఊళ్ళేలుతున్నాడా? వీడికి చేతికొక గడియారం దేనికి? నాకు అరవై యేల్గిస్తున్నాయ్! ఇంకా కళ్లజోడుతో పనిపడలేదు. నాకురాని చత్వారం వీడి కొచ్చిందా? వీడికి కళ్లజోడు దేనికి? షోకు బలిసి, ఎంత నాజూకు తేలాడని! ఎండ తగిలే వొళ్ళు కందిపోతుంది కాబోలు - పొలంవైపు తొంగైనా చూడ్డంలేదు. భూషయ్య : అదీ ఒక చిన్నతనమే! ఏమైనా నువ్వంటే వాడికి భయభక్తులేనే, అప్పయ్య బావా! లేకపోతే, ఈపూట ఇంత గజగజలాడ్డం దేనికి? అప్పయ్య : వాడి భయకు లేవో కనబడుతూనే వున్నాయ్! నమ్మి గింజలు తోలించి పంపిస్తే..... భూషయ్య : వాడు చేసింది తప్పేననుకో. కాని, నువ్వు కానకుండా ఏ రాత్రివేళో కళ్లాంలోనుంచి ఒక పదిబస్తా లెత్తించివేస్తే ను వ్వేం చేసేవాడివి? అలాంటి పాడు పని చెయ్యనందుకు సంతోషించక.... కోటమ్మ : బొర్ర సుబ్బయ్యగారి రెండోవాడు మొన్న మాసూలులో అంత పనీ చేశాడు. పాలేరుని కట్టుకుని, బాబుకి తెలియకుండా పందుమొడ్లు కోమటి మల్లయ్యకి పోశాట్ట! భూషయ్య : ఆఁ! నేను చెప్పవచ్చిందీ అదే, బావా! ఊళ్లో సన్నాసుల కంటె మన చలపతి చాలా మెరుగ్గాదూ? అలాంటి తప్పుడు పను లేమీ చెయ్యకుండా తనింత వాడుకున్నానని పబ్లికుగా చెబుతున్నాడు. వాడి ఖర్చులేవో అయిటంవారీగా నాకు చెప్పాడు. కాస్త దుబారా అయినా, అంత చెడ్డ ఖర్చు లేమీ కావు. సినిమాలు, కాఫీ హోటళ్లు, సోడాలు, సిగరెట్లు, కిళ్లీలు - ఇలాంటివే! అప్పయ్య : సర్లే! ఏం తగలడ్డాడోగాని, ఆ మిగతా సొమ్మైనా భద్రంగా వుందా? భూషయ్య : ఆఁ! కాస్త యించుమించుగా. అప్పయ్య : మళ్లీ అదేమిటి? భూషయ్య : ఏదో బస్తీ అనగానే తలలు మార్చేవాళ్లు వుంటారుగా! పేటలో ఆ పార్కుపక్కని నీకు తెలుసుగా, పెద్ద బజారులోని శివాలయం - దానియెదట - ఎవళ్ళో వచ్చి ఫెయిరీలాండ్స్ అనో, వాళ్ళ తలకాయ లాండ్స్ అనో పెట్టారు. అందరూ విరగబడుతుంటే, ఏమిటోనని మన చలపతికూడా ఒకపూట లోపలికి వెళ్లాడట. కళ్లు జిగేల్ మంటూ ఎలక్ట్రిక్ దీపాలు పెట్టి పాటలని, డ్యాన్సులని, ముందు నలుగుర్నీ లోపలికి రాబడతారు. ఆ తర్వాత బంతులూ, బాణాలు విసరడమని ఏవేవో ఆటల్లోకి దించి, డబ్బు గుంజుతారు. మనవాడు వాళ్ళ మాయలో పడి.... అప్పయ్య (కోపంగా) : చప్పగా గొరిగించుకొచ్చాడా? కోటమ్మ : అయ్యొ, ఖర్మ! భూషయ్య : వరసగా నాలుగుసార్లు పందెం పోయేసరికి మరొకడైతే వేడెక్కి మొత్తానికి మొత్తాన్నే పోగొట్టు కొచ్చేవాడే! మనవాడు బుద్ధిమంతుడు గనక, చప్పున గుక్కతిప్పుకున్నాడు. వా డోడింది - అబ్బే! ఎంతోనా? - ఒక్క ఆ రొందలు! అప్పయ్య : వొళ్లు తెగబలిసి జూదంకూడా మొదలెట్టాడన్నమాట! ఇక తాగుడొక్కటే తక్కువ! వీడు నాకడుపున చెడబుట్టాడు! ఈ నీతిమాలినవాణ్ణి ఇక నా గడప తొక్కనివ్వను, అదేమైనా గాని! భూషయ్య : ఎందుకే, అప్పయ్య బావా, అంత టెంపరు! తెలిసో తెలియకో వాడు కాస్త దారితప్పాడే అనుకో! పెద్దవాళ్ళం మనం వాణ్ణి నయానా, భయనా మళ్ళీ సరైన దారికి తెచ్చుకోవాలేగాని, శరిస్తే చప్పగా చెడిపోడూ? అప్పయ్య : వాడిఖ ఎలా తగలబడితే నాకేం! జూదాలుకూడా మొదలెట్టిం తర్వాత! భూషయ్య : అదుగో! అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావ్. అప్పయ్య బావా! తనుచేసింది తప్పేనని వాడు నొచ్చుకుంటున్నాడు. వాడొచ్చి కన్నీళ్ళ పర్యంతమైతేనే నేను పనికట్టుకొచ్చాగాని, లేకపోతే జమీందారొచ్చినా ఈ వేళప్పుడు యింట్లో నుంచి కదిలేవాణా? , నువ్విప్పుడు తొందర పడొద్దు. అప్పయ్య : తొందరలేదు; గిందరలేదు. ఈ పూటతో వాడికీ, నాకూ సరి! కోటమ్మ : ఆఁ! ఏం మాట లవి? ఆడింకా చిన్న సన్నాసి! ఈ మండిన రోడ్డు పడి, ఈ మాయదారి వొంతె నేర్పడి, ఈ ముదనష్టపు బస్సు లొచ్చాక ఆడు కాస్త గాలిగా తిరుగుతున్నాడు గాని, అంతకముందు ఆడు ఏ పక్కిని పడుండేవాడో అసలు అజుండేదీ? అప్పయ్య : ఈ మాటలు నాదగ్గిరిక చెప్పకండి. ఆరు నూరైనా, నూరు ఆరైనా ఇక వాడిదారి వాడు చూసుకోవాల్సిందే! కోటమ్మ (నెత్తి కొట్టుకుంటూ) : ఇంతకీ నాకొచ్చి పడ్డాయి ఈ తిప్పలు! భూషయ్య : నువ్వూరుకో వమ్మా! బావ టెంపరులో వుండి అలా అంటున్నాడుగాని, కొడుకు నింట్లో నుంచి వెళ్లగొట్టేస్తాడనే! మొదటి సంబంధం కొడుకు లిద్దరితో పంచుకున్న పదెకరాల్ని రాత్రింబగళ్ళూ దేవులాడి పాతికెకరాలు చేసింది ఈ కొడుకు మీద మమకారంతో కాదూ? కోటమ్మ : నువ్వేమైనా అనుకోగాని, బూసయ్యా! నువ్వేరా నిచ్చేపం లాంటి నాబిడ్డ కీ తిప్పలు తెచ్చి పెట్టావ్! భూషయ్య (నవ్వుతూ) : ఔను, కోటమ్మక్కా! ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వంతెన వేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించి.... అప్పయ్య : నవ్వులాట కాదురా, అబ్బాయ్! ఊరు నుద్ధరిస్తానని బయల్దేరి, నువ్వే ఈ పీడలన్నీ తెచ్చి మా తలకు చుట్టావ్! ఈ పాడు బస్సు లొచ్చాక ఏ తండ్రి మాటా ఏ కొడుకూ వినడం లేదు. ఊరే నాశనమైపోతున్నది. భూషయ్య : అయితే, అప్పయ్యబావా! నిన్న పొద్దున నువ్వు తూర్పు చెరువుగట్టున ఏమిటీ చేయిస్తున్నావ్? అప్పయ్య : ఆఁ! ఏం లేదు. చెరువు నీళ్లన్నీ పసరెక్కి పోయాయని, తూము తెరిపించి, కాల్వలోనుంచి కొత్త నీళ్ళు... భూషయ్య : ఆఁ! నేను చేయించిందీ అంతే! పాత పసరనీళ్ళని కొట్టేసినా, కొత్త నీళ్ళెంట వొండు రాదూ? చెత్తా చెదారం కొట్టుకురాదూ? అలాగని పసరునీళ్ళే తాగుతామా? కొత్త నీళ్ళెంట వచ్చే వొండు విరిగి, చెత్తా, చెదారం పోయి, మంచి నీళ్ళు తేరుకోడానికి కొంత కాలం పట్టదూ? కోటమ్మ : పసరు నీళ్ళేమిటి? వొండు నీళ్ళేమిటి? ఏమిట్రా నీమాటలు, బూసయ్యా! భూషయ్య : నీ కెలాగే విడమర్చి చెప్పడం, కోటమ్మక్కా? సర్లే, నువ్వే చెప్పు - లోకం ఆరోజు కారోజు తెలివి మీరిపోతున్నదా? లేదా? - కోటమ్మ : ఆఁ! తెలివి మీరిపోకేఁ? ఈ బస్సులు, ఈ సినిమాలు, ఈ కాపీవోటళ్ళు... భూషయ్య : అబ్బే! ఇంతే కాదు. ఇతర విధాలకూడా ప్రపంచం చకచకా ముందుకు సాగిపోతూ వుంది. మనం కూడా దానితో పాటు నడవాలి. లేకపోతే, అది మనపైగా నడిచిపోతుంది. అందుకని బస్తీలతో మనకి సంబంధం తప్పదు. కోటమ్మ : ఇదివర కల్లా గడవలేదేమిటి? - బస్తీలకి పోకపోతే! భూషయ్య : ఇదివరకటి దారి వేరు; ఇప్పటి దారివేరు. కాలానితో పాటు మనమూ పోవాలి; దానికి ఎదురీదలేము. సరే, అప్పయ్య బావా! నేను వెళ్ళిస్తాగాని, నువ్వు కాస్త తమాయించుకో! లేకపోతే, వాడు మరీ తెగబడి చప్పగా చెడిపోతాడు. అప్పయ్య : పోనీ, ఇక వాడు ఏ యేట్లో కలిస్తే నాకేం! కోటమ్మ : చూశావట్రా, బూసయ్యా, ఆ మాటలు! భూషయ్య : అదుగో! ఆ టెంపరే వద్దంటున్నాను. తెగేవరకు లాగడం మంచిది కాదు. బ్రహ్మయ్య, బ్రహ్మయ్య కొడుకు వీధికెక్కడం చూస్తూనే వున్నాంగా! తలలు బద్దలు కొట్టుకుని ఛార్జీలదాకా వెళ్లారు. తండ్రీ కొడుకులకైనాసరే తగవులు పెంచి, కొంపలు తియ్యడానికి ఎంతమంది టౌట్లు మన ఊళ్లో తయారయ్యారో నీకు నేను చెప్పాలటే? అప్పయ్య : సర్లే! ఆకాడికొస్తే ఎవరి పసెంత వుందో తెలుస్తుంది! కోటమ్మ : అయ్యొ ఖర్మ! ఆ డెవడని ఆడిమీద నువ్వు పగపట్టడానికి! పెద్దాళ్ళకి మనకే యింత మర్రతనముంటే, సిన్నాడు ఆడికి... పొన్నమ్మ (హుటాహుటిగా ప్రవేశిస్తూ) : పిన్నామా! కోటమ్మ పిన్నామా! కోటమ్మ : ఏమిటే పొన్నీ! ఏమిటి? పొన్నమ్మ : ఆడు లేడంటే, పిన్నామా! ఆ సీపురుకళ్ళ శేషయ్య, ఆడు... ... (అప్పయ్యను ఆ ( చూచి) మా బాబాయి ఇక్కడే వున్నాడూ! బాబాయ్! నువ్వు అబ్బాయిని పట్టుకు కొట్టావని చెప్పి, నీమీద ఆ సీపురుకళ్ళ శేషయ్య కేసు పెట్టించబోతున్నాడటే! కోటమ్మ : ఆరి! ఈడి జిమ్మడ! ఈడి కేం పోయేకాలం? పొన్నమ్మ : దెబ్బలు తగిలినట్టు దొంగ సర్టిఫికెట్టు పుట్టిస్తానని రెండొందలో, మూడొందలో అబ్బాయి దగ్గిరి నుంచి అప్పుడే ఆ డొడుక్కున్నాడట. కోటమ్మ : ఆరి! ఈడి పెళ్లాంతాడు పుటుక్కున తెగ! ఈడు మా కెక్కడ పోగయ్యాడేం! భూషయ్య : నా నోట్లోమాట నోట్లో వుండగానే నే నన్నంత పనీ జరిగింది, చూశావా, అప్పయ్య బావా! అప్పయ్య : అబ్బే! ఆణ్ణి నేను కొట్టిం దెక్కడ? భూషయ్య : కొట్టాలటే కేసు బనాయింపుకు! దీన్తో సరేనా! చీపురుకళ్ళ శేషయ్య అంటే సామాన్యుడా! రేపు పార్టిషన్ దావాకూడా పడేయిస్తాడు! అప్పయ్య : అరవై ఏళ్ళోచ్చినై. నే నెన్నడూ సాక్ష్యానికైనా బో నెక్కలేదు. ఇవ్వాళ వీడు నన్ను కోర్టు కీడుస్తాడూ? కోటమ్మ : ఆడి తలకాడ దీపమెట్ట! ఆ చీపిరి కళ్లయెదవెంత చేయిస్తున్నాడు! భూషయ్య : ఔను! వా డెంతైనా చేయిస్తాడు! తంపులు పెట్టందే, తగవులు పెంచందే వాడి పొయ్యిలో పిల్లి ఎలా లేస్తుంది? వాడి కదే బ్రతుకయ్యె! ఇంతకీ, అప్పయ్య బావా, మొదటే నువ్వు నా మాట వింటే, పంట అమ్ముకున్న మూడువేల చిల్లరలో పోయిన వెయ్యి పోగా, మిగిలిందైనా దక్కేదా? ఇప్పుడు మరొక రెండొందలో, మూడొందలో బొక్క! ఇంకా మన మాలస్యం చేస్తే.... పొన్నమ్మ : మన పక్కూరు డాక్టరుగారి దగ్గిరికి అబ్బాయిని తీసికెళ్లటానికని ఆ శేశిగాడు ఒంటెద్దుబండి కట్టిస్తున్నాడటే, బాబాయ్! కోటమ్మ : ఆడికి బిడ్డలు లేరూ! ఆడింట్లో పీని గెళ్ళ! : అప్పయ్య : ఇందాక కుర్రవాడు మీ యింటి కొచ్చినప్పుడు వాడి దగ్గరి డబ్బు తీసుకుని నువ్వెందుకు భద్రం చెయ్యలేదురా, భూషయ్యా? భూషయ్య : నిజమేనే, అప్పయ్య బావా! ఆ పని చేస్తే బాగానే వుండేది. కాని, నాకు తోచి చావలేదు. కోటమ్మ : అయిందేదో అయింది; ఆడ్డి ఎట్టాగైనా కొంపకి చేర్చరా, బూసయ్యా! నీకు పున్నెం వుంటుంది. భూషయ్య : మరి, మా అప్పయ్య బావ కాస్త తగ్గుతాడా, లేదా? లేకపోతే, మధ్య నా మాట పోతుంది. కోటమ్మ : ఆఁ! తగ్గ కేం చేస్తా డేమిటి? పొన్నమ్మ : ఎవరో ఒకరు తగ్గా లిప్పుడు. లేకపోతే, కొంప గుణ్డాన పడిపోదూ? భూషయ్య : కాని, మా అప్పయ్య బావ “ఊఁ!” అనందేనా? పట్నాలని చూచి బాగుపడేదిపోయి, మన కుర్రకారు చెడిపోతున్నారనే ఒక హిందీ స్కూలైనా పెట్టించి, కొంత ప్రపంచ జ్ఞానం కలిగించాలని నే ననుకుంటే, ఊళ్ళో పెద్ద తలకాయలు నలుగురు కలిసొస్తేనా! “తుద కబ్బెరా తురక బాస” అన్నట్టు ఇప్పుడు హిందీ స్కూలొక్కటే తక్కువై పోయిందని నవ్వి, నామాట సాగనిచ్చారు కాదు. సర్లే! అప్పయ్య బావా! ఏమంటావే? ఏవో రెండు మంచి మాటలు చెప్పి, మన చలపతి మనస్సు తిప్పి, ఇంటికి రమ్మన్నా! అప్పయ్య : ఆఁ! తగలబడమను! భూషయ్య : మరి నే వెళ్లోస్తానే. కోటమ్మక్కా ఏమైనా, కొడుకును అదుపులో పెట్టుకోవడం నే మా బావయ్యకి చేతకాదనుకుంటా. ఆయన పాతకాలపు మనిషి. ఊరకేనే కస్సు బుస్సు మంటే, ఈ కాలపాళ్లు అంకికొస్తారా! వాణ్ణి నే నొక దారికి తెచ్చుకుంటా, నాతో సంబంధం చేస్తే. భార్యా భర్తలు మాలోచించుకుని రేపు నాకు కబురు చెయ్యండి. కోటమ్మ : సర్లే! నువ్వేగా ఈ తిప్పలన్నీ తెచ్చింది. ఎలాగో నువ్వే మళ్లీ కాస్త చక్కదొయ్యి! ఊరెంట తిరిగి, చందాలోగుచేసి చట్టుబండలై, ఈ మండిన రోడ్డు పోయించి, ఈ మాయదారి వొంతి నేయించి, ఈ ముదనష్టపు బస్సులు తెప్పించి...(తెర అర్థాంగి (ఏకాంకిక)

పాత్రలు : ప్రొఫెసర్ రాధాకృష్ణ, మిసెస్ శ్యామలా రాధాకృష్ణ స్థలం : మద్రాసులో ప్రొఫెసర్ రాధాకృష్ణ డ్రాయింగ్ రూం కాలం: వర్తమానం

అది ప్రొఫెసర్ రాధాకృష్ణ డ్రాయింగ్ రూమ్, కుడివైపున బయట వరండాలో నుంచి ద్వారం; ఎడమవైపున డైనింగ్ రూమ్, కిచెన్ మొదలైన వాటిలోకి ద్వారం. ఎడమవైపునే ఒక మూలగా మేడపైకి మెట్లు. ఒక సెటీ, రెండు చెయిర్స్, ఒక సెంట్రల్ టేబుల్, రెండు పెగ్ టేబుల్స్, ఒక స్టాండర్డ్ ల్యాంప్, ఒక బుక్ షెల్ఫ్, రెండు పామ్ స్టాండ్స్, ఒక పెద్ద తివాచీ, ఒక సైడ్ టేబుల్ మొదలైన ఫర్నిచర్ తో, యాటీ తో, ఒరిజనల్ పెయింటింగ్స్ ” అది అధునాతన సంస్కృతి తొలుకాడుతున్న డ్రాయింగ్ రూమ్. తెరలేచిన ఒక క్షణానికి మోటారు కారు వచ్చి వాకిట్లో ఆగిన శబ్దమౌతుంది. ఆ వెంటనే బయటి వరండాలో నుంచి ఈ కింది మాటలు వినబడతాయి.

ఆడగొంతు : థాంక్స్ మచ్. మగగొంతు : ఓ, ఇట్స్ ఎ ప్లెజర్. ఆడగొంతు : మరి సెలవు. మగగొంతు : నమస్కారం. ఆడగొంతు : నమస్కారం. (ఆ పిమ్మట మోటారుకారు బయల్దేరి వెళ్ళిన శబ్దం. ఈ శబ్దం అణిగిపోకముందే శ్యామల ప్రవేశిస్తుంది. ఆమెదే వరండాలో నుంచి వినవచ్చిన ఆడగొంతు. శ్యామలకు ఇరవైమూడవ సంవత్సరం నడుస్తున్నా, ఇరవై దాటనట్టు కనబడుతుంది. ఆమెలోని ఆకర్షణకు ఆమె సౌందర్యం కంటె, ఆమె సంస్కృతి అధిక కారణం. హాండ్ బ్యాగ్ తోనూ, ఏదో ఒక పార్సెల్ తోనూ ప్రవేశించిన శ్యామల వాటిని సెంట్రల్ టేబుల్ పైపెట్టి, సోఫాలో కూర్చుంటుంది. శ్యామల : బోయ్! బోయ్! బోయ్ (లోపలినుంచి) : ఆఁ! ఇదుగో వచ్చే, అమ్మా! వచ్చే!! శ్యామల : ఏం చేస్తున్నావ్? బోయ్ (ప్రవేశించబోతూ) : వస్తున్నా నమ్మా! వస్తున్నా! శ్యామల : (బోయ్ రాగానే) వీధితలుపులు వేసుకోమంటే, తెరిచి వుంచావే? దొంగలెవరైనా దూరితేనో! బోయ్ : అయ్యగా రొచ్చారమ్మా! శ్యామల (ఆశ్చర్యంగా) : ఆఁ! ఎంత సేపైంది? బోయ్ : అప్పుడే అరగంట కావొచ్చిందమ్మా! శ్యామల : ఆయ నేరీ? బోయ్ : మేడమీదున్నా రమ్మా! (ఇంతలో రాధాకృష్ణ ప్రవేశిస్తాడు. వయస్సు ముప్పై ప్రాంతాల అందగా డనలేముగాని, చాలా నాజూకైనవాడు. మనస్సులో రేగుతున్న తుపాను దాచిపెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నవాని ముఖ కవళికలతో ప్రవేశిస్తాడు. కాలేజీకి వెడుతూ వేసుకున్న సూట్ లో సగం విప్పిన కోటు గుండీలతో, అతడు బరువుగా అడుగులు పెట్టుకుంటూ వస్తాడు. శ్యామల : ఏమండీ! మీటింగ్ అప్పుడే అయిపోయిందా? రాధాకృష్ణ : ఏఁ! అన్ ఎక్స్ పెక్టెడ్ గా వచ్చా నేమిటి? శ్యామల : ఇవ్వాళ సాయంత్రం మీ కాలేజీ ఎకనామిక్స్ అసోసియేషన్ మీటింగు వుందన్నారుగా! రాధాకృష్ణ : ఆఁ! అది కాన్సెల్ అయిపోయింది. శ్యామల : ఏఁ! రాధాకృష్ణ : ఉపన్యాస మిస్తానన్న వెధవ రానే లేదు. శ్యామల : అయ్యొ! రామారావుగారు వాకిట్లోనుంచే వెళ్ళిపోయారే! మీ రింట్లోనే వున్నట్టు తెలిస్తే, మాట్లాడిపోదురు. రాధాకృష్ణ : అతనికి నాతో ఏం మాట లున్నాయ్? శ్యామల : ఏమో, నాకేం తెలుసు? మీరు సాయంత్రం అయిదు గంటలకు ఆయనతో ఎంగేజ్ మెంట్ పెట్టుకున్నారటగా! రాధాకృష్ణ : ఆఁ! ఔను. కాలేజిలో మీటింగ్ మాట గుర్తులేక... శ్యామల (చిరునవ్వుతూ) : మీ ప్రొఫెసర్ల జాతికి మతిమరుపు మామూలే లెండి! రాధాకృష్ణ : ఎంత మతిమరుపైనా బుద్ధిమాంద్య మింకా రాలేదు. శ్యామల : యం.ఎ.లో ఫస్ట్ క్లాస్, ప్రెసిడెన్సీ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్! మీకా బుద్ధిమాంద్యం! (ఏదో బాధ పీడిస్తున్నట్టు రాధాకృష్ణ ఒక కుర్చీలో చతికిలబడి, దాని చేతిపై మోచేతిని అరచేతిలో తల వాల్చుకుంటాడు. శ్యామల : ఏఁ! అలా వున్నారే? రాధాకృష్ణ : ఎలా వున్నాను? బాగానే వున్నానే! శ్యామల : తల నొప్పిగా వుందా? రాధాకృష్ణ : లేదు. శ్యామల : మరి, అలా వున్నారేమండీ? ఇందా కెప్పుడో కాలేజీ నుంచి వచ్చినవారు ఇంకా సూటైనా విప్పలేదు. రాధాకృష్ణ : ఆఁ! ఏం లేదు. శ్యామల : మళ్ళీ బయటికి వెళ్ళవలసిన పని వున్నదా? రాధాకృష్ణ : లేదు. : శ్యామల (చిరునవ్వుతో):అన్నింటికీ ఒక్కటే ముక్తసరి జవాబుగా “లే"దనే ముక్క కొత్తగా నేర్చుకున్నారేమిటి? రాధాకృష్ణ : కొత్తగా చాలా నేర్చుకుంటున్నాలే! శ్యామల : ఏమిటవి? రాధాకృష్ణ : ఆఁ! ఏం లేదు. శ్యామల : అదుగో! మళ్ళీ అదే జవాబా? రాధాకృష్ణ : సర్లే! నాకు అలసటగా వుంది. శ్యామల : ఆమాట మీరు చెప్పడం దేనికి? కనబడుతూనే వుంది. ఒక కప్పు కాఫీ పెట్టుకురానా? రాధాకృష్ణ : బోయ్ పెడుతున్నాడులే. శ్యామల : నాలుగు బిస్కట్లు తీసుకురానా? (అక్కర లేదన్నట్టు ప్రొఫెసర్ మౌనంగా సూచిస్తాడు) గ్లూకోజ్ బిస్కట్లు మంచి వున్నాయండీ! మీ కవి యిష్టంగా!! ఇవ్వాళ పొద్దున తెప్పించా. (వద్దని మౌనముద్ర వీడకుండానే తిరిగి రాధాకృష్ణ తెలియజేస్తాడు) సరే! అయితే వేడి వేడిగా కాఫీ అయినా పుచ్చుకోండి. బోయ్! క్షణం ఆగి, మరి కొంచెం బిగ్గరగా) బోయ్!! బోయ్ (లోపలినుంచి) : ఆఁ అమ్మా! శ్యామల : కాఫీ పెట్టడం కాలేదూ? బోయ్ (లోపలినుంచే) : అయిపోవచ్చిందమ్మా! తెస్తున్నా! శ్యామల (సెంట్రల్ టేబుల్ పై తానుంచిన పార్సెల్ అందుకుని, దాన్ని విప్పుతూ) : ఈ సిల్క్ చీర చూడండి. చెల్లారామ్స్ లో కొన్నా. లేటెస్ట్ డిజైన్. ఈ అంచులు చూశారా? అజంతా ఫ్రెస్కోప్ నుంచి యెడాప్ట్ చేశారట. కలర్ పేటరన్ కూడా నాకు నచ్చింది. మీకు లౌడ్ కలర్సు గిట్టవ్. దీని రంగులు సాఫ్ట్ గా, ప్లీజింగ్ గా లేవూ? అయితే, ఎంత బిల్లు చేశారో తెలుసా? రెండువందల నలభై రూపాయల చిల్లర. ఖరీదుకు తగినట్టు బాగుందంటారా? లేక, దండగ బేరమా? రాధాకృష్ణ (చీరవంక చూడక, శ్యామలను చూస్తూ) : నాలుగైదు రోజులనాడు కూడా ఒక చీర తెచ్చావ్ కదూ? శ్యామల : అది ఈ కట్టుకున్నదే నండీ! మిసెస్ రాజారాం ఇది ఎంతో మంచి సెలెక్షన్ అని మెచ్చుకుంది. రాధాకృష్ణ (వ్యంగ్యంగా) : ఒక్క నా విషయంలో తప్ప నీవన్నీ మంచి సెలెక్షన్లే! శ్యామల (నవ్వుతూ) : ఏఁ! మీమీద మీకే నమ్మకం తగ్గిపోతున్న దేమిటి? రాధాకృష్ణ : అబ్బే! లేదు. కాని, నీకు మాత్రం... (బోయ్ కాఫీ ట్రేతో వచ్చి, దాన్ని ఒక పెగ్ టేబుల్ పై పెట్టి వెళ్ళిపోతాడు. శ్యామల (కెటెల్ లో నుంచి, ఒక కప్పులోకి కాఫీ పోస్తూ) : ఆఁ! ఏమి టది? నాకుమాత్రం? రాధాకృష్ణ : ఊఁ! ఏం లేదులే. శ్యామల ( కాఫీకప్పు అందిస్తూ) : ఈ పూట మరీ యింత నీరసంగా వున్నారేఁ? బస్సు దొరకలేదని ఎదురెండలో నడిచి రాలేదుగదా? ట్యాక్సీ అయినా చేయించుకొనక పోయారూ? సరే! వేడి వేడిగా కాస్త కాఫీ పుచ్చుకోండి. రాధాకృష్ణ (కప్పు అందుకుంటూ) : నీ కొద్దూ? శ్యామల : నే నింతకుముందే పుచ్చుకున్నా. వద్దన్న కొద్దీ రామారావుగారు కన్నిమరాకు కారు పట్టించారు. తాగింది రెండు కప్పుల కాఫీయే అయినా, అయిదు రూపాయలు బిల్లు చేశారు! రాధాకృష్ణ : లేడీ ఫ్రెండ్స్ విషయంలో అతడు ఖర్చుకు వెనకా ముందు ఆడడులేఁ!

(ఈమాట అంటూనే సగం మాత్రమే తాగిన కాఫీకప్పు ట్రేలో పెట్టివేస్తాడు.

శ్యామల : ఏఁ, మళ్ళీ షుగర్ ఎక్కువ వేశాడా? ఎన్నిసార్లు చెప్పినా - ఈ ఫూల్! - కాఫీని పానకంలా చేసుకొస్తాడు. బోయ్! బోయ్!! రాధాకృష్ణ : ఆఁ! షుగర్ సరిపడే వేశాడు. శ్యామల : అయితే, సగానికి పైగా వదిలి పెట్టేశారేఁ! రాధాకృష్ణ : ఈ ట్రే పట్టుకుపోరా! శ్యామల (బోయ్ ట్రీ అందుకోబోతూ వుండగా) ; బాగానే వుంది. మీరు కాఫీ తాగడం. మరి కాస్త పుచ్చుకోండి - అలసట తగ్గుతుంది. (కప్పు తిరిగి అందించబోతుంది. రాధాకృష్ణ : అహఁ! మరొద్దు. (బోయ్ తో చికాకుగా) పోరా! పట్టుకుపో! (ట్రేతో బోయ్ వెళ్ళిపోతాడు. శ్యామల : కాఫీ బాగుంటే తాగకుండా మీరు వదిలిపెట్టకేఁ? ఆ వెధవ మళ్ళీ పానకం చేసు కొచ్చి నట్టున్నాడు, నేను పెట్టుకురానా? రాధాకృష్ణ : నీకంత శ్రమ దేనికిలే! శ్యామల : శ్రమేమిటండీ? చిత్రంగా మాట్లాడుతున్నారు! మీతో చెప్పకుండా షాపింగ్ కు వెళ్ళానని కోపమే, ఇదంతా? రాధాకృష్ణ : కోపానికైనా, తాపానికైనా నాకు హక్కేముంది? నువ్వు స్వతంత్రురాలివి. శ్యామల (నవ్వుతో) : ఏఁ! స్త్రీ స్వాతంత్ర్యానికి హఠాత్తుగా మీరు విరోధులై పోయారేమిటి? మీకోసమని రామారావుగారొస్తే... రాధాకృష్ణ : ఔను! ఈమధ్య అతనికి నాతో తరుచు పనిపడుతున్నది. శ్యామల : మరి, ఆయన పెడుతున్న కొత్త లిమిటెడ్ కంపెనీ ప్రాస్పెక్టస్ మీ రింకా పూర్తిచేసి పెట్టనేలేదట! రాధాకృష్ణ : వాడి ఆడిటర్సు ఫరమ్ లేదూ? వాడికి కావలసింది ప్రాస్పెక్టస్సే అయితే, - శ్యామల : ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లో మీకు చాలినవారు లేరని ఆయన నమ్మకం. మొన్న మొన్న మీరు డిఫిసిట్ ఫైనాన్ సింగ్ మీద వ్రాసిన వ్యాసాన్ని కాస్మాపాలిటన్ క్లబ్ లో పెద్ద పెద్ద వాళ్ళందరు మెచ్చుకున్నారట. కంపెనీ లాలో కూడా మీ తర్వాతే మరెవరినైనా చెప్పాలని ఆయ నన్నారు. రాధాకృష్ణ : ఏమైనా, నేను బడిపంతుల్నేగా! కాస్మాపాలిటన్ క్లబ్ మెంబర్నా? కన్నిమరాలో కాఫీలు తాగుతానా? నాకు షెవ్రలెట్ కారుందా? శ్యామల : ఏఁ! ఈ పూట చాలా చిత్రమైన మూడ్లో పడ్డారు! మీ రింటికొచ్చేసరికి నేను లేనందుకే ఇంత కోపం రావాలా? మీ మీటింగ్ కాన్సెల్ అవుతుందని నా కేం తెలుసు? మీరు ఎంగేజ్ మెంట్ కీప్ చెయ్యలేదు గనక, క్లబ్బుకైనా పోతానని రామారావుగారంటే, నన్ను చెల్లా రామ్స్ వద్ద డ్రాప్ చెయ్యమన్నాను. తిరిగి రావడానికి ట్యాక్సీ చేయించుకుంటానంటే వినక, మళ్లీ ఆయనే యింటి దగ్గర డ్రాప్ చేశాడు. వద్దన్న కొద్దీ దారిలో ఆయన కన్నిమరాకు కాఫీకి తీసుకు వెడితే కాస్త ఆలస్యమైంది. రాధాకృష్ణ : ఔను. అతను చాలా సరసుడు! నిన్ను వెంటబెట్టుకుని కన్నిమరాలో ప్రవేశించడం కాలేజీ నుంచి వస్తూ నేను చూశాను. (సెంట్రల్ టేబుల్ పై పెట్టివున్న సిల్క్ చీర పైకి కన్ను పోనిస్తూ) అతడు తన లేడీ ఫ్రెండ్ కు కాస్ట్ లీ ప్రెజంట్సు కూడా యిస్తాడు! శ్యామల (చురుకుగా) : అయితే, మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు? . రాధాకృష్ణ : అబ్బే! ఏమీ లేదు. శ్యామల : అయితే, మీ మాటల కర్థం? రాధాకృష్ణ : అతని స్వభావాన్ని గురించే నేను ప్రస్తావిస్తున్నాను శ్యామల (కరుకుగా) : ఆయన స్వభావమేమిటో మీకే తెలవాలి. చిరకాలంగా అతను మీ స్నేహితుడు. మీరు ఇంటర్ డ్యూస్ చేసే వరకూ అతని మూక్కూ మొఖమైనా నే నెరగను. రాధాకృష్ణ : స్నేహితుడు గనకనే చెబుతున్నాను. ఎంతటి సరసుడు కాకపోతే, ఒక్కవారంలో శ్రమ అనుకోకుండా రెండుమార్లు నిన్ను షాపింగ్ కు తీసుకు... శ్యామల (“షాపింగ్” వద్ద మాటను తెంచివేస్తూ) : మీరు సూచిస్తున్న దేమిటి? రాధాకృష్ణ : అబ్బే! ఏం లేదు. శ్యామల : నిజంగానా? రాధాకృష్ణ : ఆఁ! శ్యామల : ముమ్మాటికీనా? రాధాకృష్ణ : ఊఁ! శ్యామల : సర్లెండి!


(ఈమాట అంటూనే సెంట్రల్ టేబుల్ పైనుంచి సిల్క్ చీర తీసుకుని శ్యామల వెళ్లిపోతుంది. ఆమె తన హాండ్ బ్యాగ్ అక్కడే విడిచి పెట్టి వెడుతుంది. ఆమె వెళ్ళిన తర్వాత మానసిక వేదనతో సోఫాలో జేరగిలబడి, రాధాకృష్ణ కళ్లు మూసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత గట్టిగా నిట్టూర్చి, కళ్ళు తెరిచే సరికి శ్యామల హాండ్ బ్యాగ్ పై అతని కన్ను పడుతుంది. దాన్ని తెరిచి చూడాలనే దుర్భుద్ధి అతనికి వెంటనే పుడుతుంది. చరాలున ముందుకు వంగి, దాన్ని అందుకోబోయి, తన సంస్కారం అడ్డురాగా అంతలోనే ఆగిపోతాడు. కాని, అనుమాన పిశాచం సంస్కారం కుత్తుకను నులిమివేయగా, హాండ్ బ్యాగ్ అందుకుని, తప్పు చేస్తున్న వాడివలె మేడ మెట్ల పైకి ఒకసారి చూస్తాడు. పిమ్మట హ్యాండ్ బ్యాగ్ తెరిచి దాన్ని గాలిస్తాడు. ఏవో రెండు, మూడు ఉత్తరాలు అతనికి కనబడతాయి. వాటిని చదివి మళ్ళీ లోపల పెట్టివేస్తాడు. ఇంకా గాలించి, ఒక మని యార్డర్ కూపన్ పైకి తీస్తాడు. దాన్ని చదువుకునేసరికి అతని ముఖం విప్పారుతుంది. ఇంతలో మేడమెట్లపై కాలి అలికి డౌతుంది. చప్పున మని యార్డర్ కూపన్ అతడు తన కోటు జేబులో పెట్టివేసు కుంటాడు. జేబులోని చెయ్యి పైకి తీయకముందే శ్యామల ప్రవేశిస్తుంది. భర్త చేసిన పనిని చూచినందున ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ, ఒక్కసారిగా కనపడతాయి.

రాధాకృష్ణ (శ్యామలను కన్నెత్తి చూడ్డానికి సిగ్గుపడి, పెడముఖం పెట్టి, టై విప్పుకుంటూ) : ఆ వెధవ పెట్టిన కాఫీ నిజంగానే బాగా లేదు. మరికొంచెం కాఫీ పెడతావా, శ్యామలా? (శ్యామల జవాబు చెప్పదు. రాధాకృష్ణ (ఏదో ఒకటి మాట్లాడాలనే ఆతురతకొద్దీ) : ఇంకా వస్తాడేమో, ఇంకా వస్తాడేమో నంటూ అరగంటసేపు వెయిట్ చేసినా, ఆ స్పీకర్ డామ్ స్కౌంట్రోల్ రానేలేదు. మీటింగ్ కాన్సెల్ చేశాక, కారు బ్రేక్ డౌన్ వల్ల రాలేక పోతున్నానని టెలిఫోన్ చేశాడు. తన కారు లేకపోతే, ఏ టాక్సీలోనో రాగూడదూ? మన ఇండియన్సుతో యిదే చెడ్డ చికాకు. ఎంగేజ్ మెంట్స్ కీప్ చెయ్యరు, ఆ రాస్కెల్ కోసం ఎదరుచూస్తూ కూర్చోబట్టే చెడ్డ తలనొప్పి వచ్చింది. నిన్ను వెంటబెట్టుకుని కాసేపు అలా బీచ్ వైపుకైనా పోదామని యింటికొస్తే ఇక్కడా డిసప్పాయింట్ మెంట్ అయింది. (కణతలు నొక్కుకుంటూ) అబ్బ ఇంకా తలనొప్పి తగ్గనే లేదు. (మెడపై చెయ్యి వేసుకుని) మెడలు కూడా పీక్కుపోతున్నాయి. (సానుభూతి కోసం ఒక క్షణం ఎదురు చూచి, నిరాశ చెంది) నేను పోయి బట్టలు మార్చుకొస్తానుగాని, కాస్త కాఫీ పెట్టు. డబుల్ డోస్ కావాలి. (కోటు విప్పి భుజం పైన వేసుకుంటూ రాధాకృష్ణ మేడ పైకి పోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత పెదవి కొరుక్కుంటూ, తల పంకిస్తూ కొన్ని క్షణాలపాటు నిలబడి, తుదకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు శ్యామల కనబడుతుంది. శ్యామల : బోయ్! బోయ్ (ప్రవేశిస్తూ) : ఎందుకమ్మా? శ్యామల : పొద్దుటి “ఎక్స్ ప్రెస్” యేదిరా? బోయ్ : అదుగోనమ్మా! ఆ పుస్తకాల బీరువామీద. (పత్రిక చేతికిచ్చి బోయ్ వెళ్ళిపోతాడు. శ్యామల నిలబడివుండే పత్రిక మొదటి పేజీ తిప్పి, రెండవ పేజీ వెదకి, దానిలో తనకు కావలసింది కనబడిన వెంటనే సైడ్ టేబుల్ వద్దకు వెడుతుంది. ఆ టేబుల్ డ్రాయర్ లో నుంచి లెటర్ హెడ్స్ ప్యాడ్ తీసి, ప్రొఫెసర్ రాధాకృష్ణ పేరు అచ్చొత్తివున్న పైభాగాన్ని చించి వేస్తుంది. తర్వాత ఆ డ్రాయర్ లో నుంచి ఒక కవరు కూడా తీసుకుని సోఫాలో కూర్చుంటుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఫౌంటెన్ పెన్ తీసుకుని, ఏదో వ్రాస్తూ వుంటుంది. ఇంతలో రాధాకృష్ణ పైజమాతో,లాల్చీతో మేడమెట్లు దిగివస్తాడు.బట్టలు మార్చుకున్న తర్వాత చక్కగా టాయెలెట్ చేసుకుని మరీ అతడు ప్రవేశిస్తాడు. రాధాకృష్ణ (శ్యామల ముఖాన్ని చూడ్డానికి ఇంకా సిగ్గుపడుతూ, వీధిలోకి చూస్తున్నట్టు గుమ్మంవైపుకు తిరిగి నిలబడి) : కాఫీ పెట్టావా? (శ్యామల జవాబు చెప్పదు. రాధాకృష్ణ : ఆఁ! అన్నట్టు, నీతో చెప్పానా? ఇవ్వాళ ఉదయం మిస్టర్ చెట్టియార్ వీలుపడితే రే పొకసారి తమ ఆఫీసులో తప్పకుండా కలుసుకోమని ఫోన్ చేశాడు. వాళ్ళ జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీ సెక్రటరీ రిటైర్ అవుతున్నాడట. ఆ పోస్ట్ నాకు ఆఫర్ చెయ్యడానికే కాబోలు! అది సౌండ్ కంపెనీయే. ఆ పదవి పుచ్చుకోమంటావా? కమిటీ కాలేజీలలో ఉద్యోగాలకంటె, నిజానికి ఏ పనైనా మెరుగే! ఇచ్చే ఆ కొద్ది జీతాలైనా నెలనెలకు సరిగా ముట్టజెప్పకపోయినా, ప్రతి కమిటీ మెంబరూ మాపై పెత్తనం చలాయించేవాడే! “వీడు నా తమ్ముడి బావమరిది తోడల్లుడు కొడుకు, వీడికి సీటివ్వాలి; వాడు నా అన్నయ్య పినమామ మరద లల్లుడు, వాడిని ప్రమోట్ చెయ్యాలి.” అంటూ సిఫార్సులు చేసి ప్రాణాలు తోడేస్తారు. ఏఁ! శ్యామలా! మిస్టర్ చెట్టియార్ రేపు సెక్రటరీ పోస్ట్ ఆఫర్ చేస్తే పుచ్చుకోమంటావా? (శ్యామల అప్పటికీ జవాబు చెప్పదు. రాధాకృష్ణ (శ్యామలవైపుకు నాలు గడుగులు వేసి) : ఏమిటది, శ్యామలా? అంత దీక్షగా వ్రాస్తున్నావ్! శ్యామల (తాను వ్రాస్తున్నది కనబడకుండా కాగితం పై అంచును మడిచిపట్టుకుంటూ) : ఆఁ! ఏమీ లేదు. ప్రజెంట్స్ యివ్వగల ఫ్రెండ్స్ కు లెటర్స్ రాస్తున్నా. రాధాకృష్ణ (లేని నవ్వు తెచ్చి పెట్టుకుంటూ) : వాట్ నాన్ సెన్స్! శ్యామల : ఇంతకు ముందు మీరే అన్నారుగా, వారం రోజుల లోపల రామారావుగారి నుంచి రెండుసార్లు ప్రెజెంట్స్ పుచ్చుకున్నానని! రాధాకృష్ణ : అబ్బే! ఆ మాట నే నన్నానా? శ్యామల : సరిగా అదేమాట అనకపోతేనేం? ఆ అర్థం వచ్చే మాట మరొకటి! రాధాకృష్ణ : ఆఁ! చెడ్డ తలనొప్పి కొద్దీ నే నేదో అంటే, నువ్వేవో లేనిపోని అర్థాలు తీస్తున్నావ్. నాకు తెలియదూ? మీనాన్న పంపించిన డబ్బుతో నువ్వు షాపింగ్ చేశావని. శ్యామల (సోఫాలోనుంచి చరాలున లేచి, ముఖాముఖిగా నిలబడి) : అయితే, మా నాన్న నాకు డబ్బు పంపించిన సంగతి మీ కెలా తెలిసింది? (తెల్లబోయి రాధాకృష్ణ జవాబు చెప్పడు. శ్యామల (తీవ్రంగా) : నన్ను శంకించి, చాటుమాటుగా నా హ్యాండ్ బ్యాగ్ విప్పిచూస్తే తెలిసింది. అంతేనా? రాధాకృష్ణ : అబ్బే! లేదు. శ్యామల : అయ్యొ! అబద్దం కూడానా? (సెంట్రల్ టేబుల్ ను వేలితో చూపిస్తూ) అదుగో! నా హ్యాండ్ బ్యాగ్ విప్పిలేదూ? దానిలోని నా మనియార్డర్ కూపన్ (కప్పువైపు వేలితో చూపిస్తూ) మేడమీది మీ కోటుజేబులోకి ఎలా నడిచివెళ్ళింది? రాధాకృష్ణ (చిన్న ముఖం చేసుకుని, శ్యామల చేతుల్ని పట్టుకుని) : తప్పే! క్షమించు. శ్యామల (చేతుల్ని విడిపించుకుంటూ) : తప్పు మీది కాదు; నాదే! చేసుకుంటున్న ఉద్యోగం చేతులారా విడిచిపెట్టుకున్న తప్పు నాదే కాదూ? నాకే సంపాదనుంటే మీ రివ్వాళ నన్నెందుకు శంకించేవారు? రాధాకృష్ణ (దీనంగా) : శ్యామలా! నన్ను మన్నించవ్! : శ్యామల : ఇక నన్ను నేనే మన్నించుకో లేను - మిమ్ములను నే నేం మన్నిస్తాను! భర్త యివ్వందే భార్యవద్ద డబ్బుంటే, దొంగతనమో, రంకుతనమో చేసిందని తీర్మానించుకుంటారు. చదువుకున్నదాన్నని, తెలిసినదాన్నని అనుకున్నాగాని, ఈ పాటి గుర్తించగల జ్ఞానం నాకు , లేకపోయింది. (ఉద్వేగంతో చలించిపోతూ పెడముఖం పెట్టుకుంటుంది. రాధాకృష్ణ : శ్యామలా! ఇటు చూడు! (ఆమె తిరిగి చూడకపోగా బలవంతాన ఆమె ముఖం తనవైపుకు తిప్పుకుంటూ) “బిలీవ్ మి, మై డియర్. ఐ యామ్ ఫీలింగ్ అట్టర్లీ ఎషేమ్ ఆఫ్ మైసెల్ఫ్”. శ్యామల : నన్ను చూచుకుంటే నాకు మాత్రం సిగ్గువెయ్యడం లేదండీ? మన మిద్దరం విద్యావంతులమే; ఇద్దరం సంస్కృతిపరులమే. ఒకరి నొకరు ప్రేమించుకున్నాం; ఒకరి నొకరు పూర్తిగా అర్థం చేసుకున్నా మనుకున్నాం. కాని, మన విద్య, మన సంస్కృతి, చివరికి మన ప్రేమైనా, మీరు నన్ను శంకించడానికి అడ్డుకాలేక పోయింది. అయినా, తప్పు మీది కాదు. నా ఆర్థిక బానిసత్వమే మన మధ్య విషం చిలికింది. దాన్ని తొలగించుకో గలిగితేనే నేను తిరిగి మీ ముఖం చూడగలిగినా, మీరు నా ముఖం చూడగలిగినా! ఒకరు భరించేవారై, మరొకరు భరించబడే వారైనంత వరకు హృదయాలు నిజంగా కలవవ్. రాధాకృష్ణ : అయితే, ఇప్పుడు తిరిగి... శ్యామల : ఔను! తిరిగి ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తాను. (సగం వ్రాసిన ఉత్తరం వద్ద తిరిగి కూర్చుంటూ) గుంటూరు విమెన్స్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఖాళీగా వుందట. దానికి అప్లయి చేస్తున్నా. రాధాకృష్ణ : ఉద్యోగం తిరిగి చేసి తీరాలంటే ఇక్కడే ఏదైనా దొరికేవరకూ పోనీ ఆగవచ్చుగాఁ? శ్యామల : ఎక్కడైతేనేమి లెండి! ఉన్న వూళ్ళోనే అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? రాధాకృష్ణ : ఎక్కడైనా ఒక్కటేనా? మనం కలసి వుండడం, దూరమైపోవడం ఒక్కటేనా? శ్యామల : మైళ్లనుబట్టి ఇద్దరి మధ్య దూరాలను, దాపులను కొలవగలమా? మనస్సులు కలిసిపోతే ఎంత దూరాన వున్నా, కలిసి వున్నట్టే, లేకపోతే, ఒకచోటనే వున్నా, వేర్వేరు ప్రపంచాలలో వున్నట్టే. రాధాకృష్ణ : ఇంతగా నీ మనస్సు విరిగిపోయిందా, శ్యామలా? ఇంతగా నేను నీకు దూరమై పోయానా? శ్యామల : మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఇవ్వాళే నేను కన్ను తెరిచా; నాది కల్లబ్రతుకని తెలుసుకున్నా. నాకు అర్థం లేనంతవరకు నేను మీకు అర్ధాంగిని కాలేను. ఆ అర్హతను సంపాదించుకోవడంలో నేను ఆలస్యమెందుకు చెయ్యాలి? రాధాకృష్ణ : శ్యామలా! ఇవ్వాళ నీపట్ల మహాపచారమే చేశానని ఒప్పుకుంటున్నాగా! శ్యామల : మీపట్ల నేను చేసింది కూడా మహాపచారమే. నన్ను నేను ఆర్థిక దాస్యంలో పెట్టుకోబట్టేగదా, మీనోట ఇవ్వాళ అబద్ధం పలికించడం జరిగింది. ఇది మీకూ, నాకూ కూడా ఫాల్స్ పొజిషన్. ఇది మన యిద్దరి నైతిక పతనానికి సమానంగా కారణమౌతున్నది. రాధాకృష్ణ : మన్నించవలసిందిగా బ్రతిమాలాడుకుంటున్నా, నన్ను మన్నించలేవా, మైడియర్? శ్యామల : ఇది కేవలం మీ, నా ప్రశ్న మాత్రమే కాదండీ. చదువుకునే భాగ్యం -ముఖ్యంగా పెద్ద చదువులు చదువుకునే భాగ్యం - మా స్త్రీ జాతిలో ఎంతమంది కబ్బుతుంది? నేను చదువుకున్న చదువుకు సార్ధక్యం పదిమంది స్త్రీలకు దాన్ని చెప్పినప్పుడే అనుకున్నా. ఆ ఉద్దేశంతోనే టీచర్ గా ప్రవేశించాను. కాని, మన వివాహం స్థిరపడగానే “నా సంపాదన చాలదా? నువ్వు శ్రమపడ్డం దేనికి?” అని మీరంటే నా సుఖాన్నే, నా స్వార్థాన్నే చూచుకుని, నా లక్ష్యాన్నే మరిచిపోయాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూచుకుంటే ఒకనాటి ఆశయాలన్నింటికీ ఎంత దూరమైపోయానో తెలిసొస్తున్నది. ఆ పాపాని కిప్పుడు పరిహారం చేసుకోబోతున్నాను. (అప్లికేషన్ పై సంతకం పెట్టి, దాన్ని మడిచి కవరులో పెడుతూ వుంటుంది. రాధాకృష్ణ : మన కొక బిడ్డేవుంటే నువ్వింత తొందరపడేదానివా? శ్యామల : ఔను! అంతవరకు అదృష్టవంతురాలినే! రాధాకృష్ణ : అదీ ఒక అదృష్టమే! శ్యామల : కాదటండీ! మీరే ఇప్పు డన్నట్టు, మనకు ఒక బిడ్డేవుంటే ఈ పాటి తెగింపైనా నేను చెయ్యగలిగేదాన్నా? ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలిగేదాన్నా? రాధాకృష్ణ (వాదంలోకి దించితే, మనస్సు మార్చవచ్చుననే ఆశతో) : ఆత్మగౌరవాల కేమిగాని, మాతృత్వమే స్త్రీ జీవితానికి శోభైనా, సాఫల్యమైనా, అసలు స్త్రీ పురుష ప్రేమకు వైశిష్ట్యాన్ని కూర్చేదే సంతానాపేక్షే, ఆ అపేక్షే లేకపోతే... శ్యామల (పట్టరాని కోపాన్ని అణచివేసుకోడానికి ప్రయత్నిస్తూ) : “ఆత్మ గౌరవాల కేమిగాని...", ఔను! మీ దృష్టిలో స్త్రీకి ఆత్మే వుండదు. ఇక, ఆత్మగౌరవం ఎక్కడినుంచి వస్తుంది లెండి! రాధాకృష్ణ : ఇది న్యాయమేనా, శ్యామలా? నే నేమన్నా దానికి పెడర్థాలు తీస్తున్నావ్! శ్యామల : ఇందులో పెడర్డా లేమున్నై! నేనే తల్లినైవుంటే, బిడ్డలపై మమకారం కొద్దీ మీ రేం చేసినా పడివుండేదాన్నని మీ రంటున్నారు - అంతేగా! రాధాకృష్ణ : నీతో వాదానికి నే నెక్కడ నిలవగలను గాని, నీ నిర్ణయం మారదా, శ్యామలా?

(ఈ ప్రశ్నకు జవాబు అన్నట్టుగా శ్యామల కవరుపై అడ్రసు వ్రాస్తుంది. 

రాధాకృష్ణ : “లుక్ హియర్, మై డియర్!” శ్యామల : బోయ్! బోయ్ (లోపలినుంచి) : వస్తున్నానమ్మా! రాధాకృష్ణ : పోనీ, రేపటివరకైనా ఆగరాదా? ఈలోగా ఆ ఉద్యోగ మెక్కడికీ పోదు. శ్యామల : పోకపోవచ్చు. కాని, వెంటనే అప్లికేషన్ పంపకుండా ఆగవలసిన అగత్యం నాకేమీ కనబడ్డం లేదు. రాధాకృష్ణ : నా తప్పు అంగీకరించిన తర్వాత కూడా ఇంత క్రూరమైన శిక్ష విధించాలా? శ్యామల : ఇది శిక్షే అయితే, మీకు కాదు; నాకు. నా ఆర్థిక దాస్యాని కిది శిక్ష: నా అబద్ధపు బ్రతుకు కిది శిక్ష. రాధాకృష్ణ : మరొకసారి అడుగుతున్నా - నన్ను మన్నించు, శ్యామలా! నాకు దూరం కావద్దు. శ్యామల : నన్ను మీరు అర్థం చేసుకోవడం లేదు. నా ప్రయత్నమంతా మీరు మరింత దగ్గరగా – నిజంగా దగ్గరగా - రావాలనే. రాధాకృష్ణ (శ్యామల రెండు చేతుల్ని పట్టుకుని) : డోన్ట్ టార్చర్ మి, మై డియర్. బోయ్ (ప్రవేశిస్తూ) : ఎందుకమ్మా! (శ్యామల చేతుల్ని విడిపించుకుని, అవతలికి జరుగుతుంది. శ్యామల (కవర్ అందుకుని, దాన్ని బోయ్ చేతి కిస్తూ) : ఈ ఉత్తరం పోస్ట్ చేసిరా! బోయ్ (ఉత్తరాన్ని అందుకుంటూ) : అలాగే నమ్మా! రాధాకృష్ణ : తొందర లేదు లేరా! ఆగు! (బోయ్ వెళ్ళబోతాడు. శ్యామల : ఉహుఁ! వెళ్ళరా, వెళ్లు! (బోయ్ ఆగిపోతాడు. రాధాకృష్ణ : నీక్కాదురా చెప్పేది? రేపు వెయ్యొచ్చులే! (బోయ్ తిరిగి కదులుతాడు. శ్యామల : ఔను! వాడికి జీతభత్యా లిస్తున్నది మీరేగా? వాడికి పనిచెప్పడానికి నాకు హ కేముంది? తేరా! తే! ఆ ఉత్తరమిలా తే! నేనే పోస్ట్ చేసుకుంటాలే! రాధాకృష్ణ : వెళ్ళరా, వెళ్ళు! వేసిరా! (బోయ్ మళ్ళీ నిలిచిపోతాడు     ఆశాపాశం (ఏకాంకిక)

పాత్రలు: భూషయ్య : మోతుబరి రైతు, మాధవరావు : భూషయ్య కుమారుడు, వీరభద్రయ్య : పైకి పెద్దమనిషి, కృష్ణమాచార్యులు:పౌరాణికుడు, వెంకటశాస్త్రి : జ్యోతిష్కుడు. స్థలం : భూషయ్యగారి మండువా చావడి కాలం: వర్తమానం భూషయ్య మండువా చావడిలో పడక కుర్చీపై కూర్చుని వుంటాడు. ఆయనకు దగ్గరగా మామూలు కుర్చీలో కూర్చుని కృష్ణమాచార్యులు బమ్మెర పోతన భాగవతం నుంచి వామనావతార ఘట్టాన్ని వినిపిస్తుంటాడు. చావడిలో మరి రెండు కుర్చీలు, ఒక బెంచీ వుంటాయి.

కృష్ణమాచార్యులు : “అని మరియు నిట్లనియె.” బలి చక్రవర్తి ఇంకా ఏ ప్రకారంబుగా అంటున్నాడయ్యా... తెర) “వసుధాఖండము వేడితో, జగములన్ వాంఛించితో, వాజులన్ నెస నూహించితో, కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేర వీ వడుగ నీ భాగ్యంబు లీసాటి గా కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే!” ... అయ్యయ్యో! వెర్రి బ్రాహ్మడా! ఏమిటయ్యా యిది!! నీకు మడులు కావాలా? మాన్యాలు కావాలా? అగ్రహారాలు కావాలా? అర్ధభాగమే కావాలా? ముల్లోకాలు జయించినవాణ్ణి. కనీస మొక లోకాన్ని అడిగి పుచ్చుకోరాదటయ్యా? పోనీ దొడ్లమీదా, దోవలమీదా నీకు మమత లేదే అనుకో! ఊళ్ళమీద, నాళ్ళ మీద బ్రమత లేదే అనుకో! అయితే, “వాజులన్”, గుర్రాలను అడగరాదటయ్యా? వాయువేగ మనోవేగాలతో ప్రయాణించే ఉత్తమాశ్వాలు ఒక వంద - ఒక వెయ్యి - ఒక లక్ష - ఎన్ని కావాలి? చెప్పవయ్యా! సంకోచం దేనికి? గుర్రాలూ, ఏనుగులూ నే నేమి చేసుకొంటాను. నాకు దేనికంటావా? అయితే, పడుచుపిల్ల లెవ్వరూ నీకంట దూరనే లేదటయ్యా? ఎవ్వరి పైకీ నీ మనస్సు పోనేలేదటయ్యా? పద్మిని. నీ చిత్రిణి, శంఖిని, హస్తిని ఏ జాతి స్త్రీలు నీకు కావాలి? ఎంత మంది కావాలి? ఇంతకూ నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి. ఒక చెంప పాలు, మరొక చెంప నీళ్ళు. అభం శుభం యెరగవు. “నేర వీ వడుగ!”. అడగడమైనా సరిగా చేత కాదయ్యె. ఇచ్చేవారున్నా పుచ్చుకొనడానికీ, అనుభవించడానికి నీకు ప్రాప్తం లేదు కాబోలు. “బుద్ధిః కర్మానుసారిణీ”. కర్మనుబట్టే బుద్ధి. కాకపోతే దానచక్రవర్తిని; ముల్లోకాధిపతిని. నన్నేమిటి? ముష్టి మూడడుగుల నేల అడగడ మేమిటి? ఇంత స్వల్పాన్ని నువ్వు అడిగితే మాత్రం నే నెలా యివ్వగలనయ్యా! నాది భారీ చెయ్యి. నన్ను భారీగా అడుగు. భారీగా పుచ్చుకో, “అనిన మొగంబునం జిరునగవు మొలకలెత్త గృహమేధికి మేధావి యిట్లనియె”... బలి చక్రవర్తి ఈ ప్రకారంబున పలుకగా ఆయనతో ఆ వామనమూర్తి ఆ లీలామానుష విగ్రహుడు - ఆ జగన్నాటక సూత్రధారి - ముఖం పై చిరునవ్వులు మొలకలెత్తుతుండగా ఏ విధంబుగా అంటున్నాడంటే... “గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో వడు గే నెక్కడ? భూము లెక్కడ? కరుల్ వామాక్షు లశ్వంబు లె

క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూ 

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నాపాలికిన్” ... చేత పట్టుకోడానికి ఒక గొడుగో, మెడలో వేసుకోడానికి ఒక జంధ్యమో, మంచి... పుచ్చుకోడానికి ఒక కమండలమో, మొలకు కట్టుకోడానికి ఒక ముంజియో... అంటే మరేమీ లేదు, భూషయ్య బాబూ.... దర్భలతో పేనిన మొలత్రాడు... “గొడుగో, బన్నిడమో, కమండలువొ, నాకు ముంజియో, దండమో.”... లేదా జపతపాలకు అక్కరకు రావడానికి ఒక దండమో - ఇలాంటి దేదైనా నే నడిగినా, తమరిచ్చినా అదొక అందం, చందంగాని, బ్రహ్మచారిని, నాకు మడులు దేనికి? మాన్యాలు దేనికి? అగ్రహారాలు దేనికి? అర్ధాసనాలు దేనికి? గుర్రాలూ, ఏనుగులూ నే నేమి చేసుకొంటాను. స్వామీ? అందకత్తెలు నాకు దేనికి? నెత్తిని పెట్టుకొని ఊరేగడానికా? “కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం? అన్నట్టు, ఈ బాదరబందీ యావత్తూ నాకు దేనికి, ప్రభూ? నామొర విని నా విన్నపాన్ని నేను కోరిన మూడడుగుల నేలను దేవరవారు నా కనుగ్రహిస్తే, అదే నాకు బ్రహ్మాండాన్ని కట్టబెట్టినట్టు ... ఆయన ఆ వామనమూర్తి - ఆ మాయామానుష విగ్రహుడు సాక్షాత్తు జగదీశ్వరుడు. “జగత్సర్వం మయాసృష్టం." సమస్త జగాలూ ఆయన సృష్టించినవే. మాయలోపడి “ఇది నాది - అది నాది” అని అనుకోడమే గాని, సర్వం ఆ జగన్నాథునిదే. సకల చరాచర జీవకోటికీ ఆయన పెట్టిందే భిక్ష. అయినప్పుడు ఆయన్ని ఏం కావాలో కోరుకో మనడ మేమిటి? ఆయన కోరుకున్నది స్వల్ప మనడ మేమిటి? “ఓయి! వెర్రివాడా! నీవు మాయామోహపాశాలలో చిక్కుకున్నావు. నేను సర్వేశ్వరుడ నని గుర్తెరగలేక పోతున్నావు. నీ ముల్లోకాలూ నాకు మూడడుగులే సుమీ!” అని ఆయన ఆ వామనమూర్తి “మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేరయ త్రోవ కిచ్చు టది బ్రహ్మాండంబు నా పాలికి ” అని సూచిస్తున్నాడు... “అదియునుంగాక...” “వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం దృప్తింజెందని మనుజుడు సప్తద్వీపములనయిన జక్కంబడునే?" ...ఇంకా, ఇంకా పోగుజేసుకోవాలి. ఇంకా ఇంకా మీట వేసి పోవాలి, ఇంటిమీద ఇల్లు వచ్చిపడాలని తాపత్రయ పడకుండా తనకు ప్రాప్తంబయ్యేది... అది తృణమైనా, పణమైనా - అదే పదివేలని సంతుష్టి పడనివారు... “సప్త ద్వీపములనయిన జక్కంబడునే” ...ఏడు ద్వీపాలలోనైనా ముందుకు రాగలరా? “దురాశ దుఃఖం చేటు”. వెనకటి కెవడికో తనకులేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట; ఎదటివాడి కున్నదని ఏడిస్తే రెండో కన్ను పోయిందట. సంతోషం సగం బలమని పెద్దలన్నారుగాని, సంతుష్టి పూర్తిబలం.

“ఆశాపాశము దా గడున్ నిడుపు, లేదంతంబు, రాజేంద్ర! వా రాశిప్రావృతమేదినీవలయసా మ్రాజ్యంబుసే కూరియుం గాసిం బొందిరిగాక వైన్యగయభూ కాంతాదులు న్నర్థకా మాశం బాయగ నేర్చిరే మును, నిజాశాంతంబులం జూచిరే?” ... ఆశ అనే పాశం బహు పొడవైనది. పల్నాటి చేంతాడుకైనా అంతు వుంటుందేమోగాని, ఆశకు మాత్రం అంతే లేదు. (“ఆశాపాశము దా గడున్ నిడుపు” అనే పద్యాన్ని కృష్ణమాచార్యులు ప్రారంభించబోయే సమయానికి వీధిలో కారు హారన్ మోత వినపడుతుంది. తర్వాత కొన్ని క్షణాలకు వీథిగుమ్మంలో మోటారు కారు ఆగుతుంది. ఆ వెనువెంటనే మాధవరావు, వీరభద్రయ్య, వెంకటశాస్త్రి చావడిలోకి వచ్చి, ఒక పక్కగా ఒదిగి కూర్చుంటారు. వారి రాకను చూచి, కృష్ణమాచార్యులు తన వ్యాఖ్యానం మధ్యలో ఆగిపోతాడు.

వీరభద్రయ్య : ఆపివేశా రేమండీ, ఆచార్యులుగారూ! కానివ్వండి. భూషయ్య (వీరభద్రయ్యతో) : కానిస్తారులే! ఏం? ఇలా వేంచేశారు? వీరభద్రయ్య : అబ్బే! ఊరికేనే, బాబాయ్! భూషయ్య : “ఊరకరారు మహాత్ము” లన్నారు. ఊరికే నువ్వెందు కొస్తావ్? కృష్ణమాచార్యులు : భూషయ్యబాబూ, వీ రెవ్వరు? భూషయ్య : అయ్యో! మీకు తెలియదటండీ? ఈయన పెద్ద నాయకుడు. దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు. మన తిరపతయ్యకు - మన చినతిరపతయ్యకు - సయానా మేనత్త కొడుకు. కృష్ణమాచార్యులు: ఓహో! వీరభద్రయ్యగారా? పేరు ప్రఖ్యాతులు వింటమే తప్ప ఎన్నడూ దర్శనం చేసుకోలేదు. భూషయ్య : ఈయన దర్శనం మనబోటి సామాన్యులకు దొరుకుతుందటండీ! కలెక్టర్లు, గవర్నర్లు, మినిస్టర్లు -ఎంతెంత పెద్దఫాయావారితో ఈయనిప్పుడు భుజాలు రాసుకుంటూ తిరుగుతున్నాడని! పేరు ఇతరులదైనా, ప్రభుత్వ చక్రం ఇప్పు డీయన చేతిలోనే వుంది. వెంకటశాస్త్రి : మనవాడి కిప్పుడు బృహస్పతి రాజ్యంలో వున్నాడు. భూషయ్యబాబూ! రాజయోగం పట్టింది. మహర్దశ అందుకుంది. పదహారేళ్లు దేదీప్యమానంగా వెలుగుతాడు! భూషయ్య : ఇంకేం? ఈ సారి ముఖ్యమంత్రి ఛాన్సు మనవాడిదే. వీరభద్రయ్య : నీ యద్దేవకేమిగాని... నీ భూషయ్య : అబ్బే! యద్దేవ కాదురా! నిజం మాటే. నేను.... వీరభద్రయ్య : ఇప్పుడు మినిస్టర్లుగా వున్న వాళ్ళందరూ మన కంటె పొడిచేశా రేమిటి? వెంకటశాస్త్రి : ఇంతకీ ఎవరి ప్రయోజకత్వ మేమున్నది? దేనికైనా రాజయోగం కలిసిరావాలి. భూషయ్య : సరేనయ్యా! ఇప్పు డిక్కడ ఈ గ్రహ సంయోగానికి కారణ మేమిటి ? మాధవరావు : మరేమీ లేదు, నాన్నా! కొత్త బస్సు రూటుకు... (మాటను మధ్యలో మింగివేస్తాడు. భూషయ్య : పాతది నిర్వాకం చేస్తున్నావ్. ఇఖ, కొత్తది... వీరభద్రయ్య (తెచ్చి పెట్టుకొన్న నవ్వుతో) : నోట్లో మాట నోట్లో వుండగానే నువ్వు వాణి కసురుకొంటావేమే, బాబాయ్! నువ్వెక్కడ కూకలేస్తావోనని ఈ పూట వా డసలు నీ దగ్గరికి పెద్దపులిదగ్గిరి కొచ్చినట్టొచ్చాడు. భూషయ్య : తోడేళ్ల సావాసం చేస్తున్నవాడికి పెద్దపులంటే అంత భయమట్రా? కృష్ణమాచార్యులు : భూషయ్యబాబూ! ఇవ్వాళికి పురాణ కాలక్షేపం చాలిద్దామా? భూషయ్య : ఆఁ! ఈ పురాణంలో పడినాక మరి అదేమి సాగుతుంది లెండి. కృష్ణమాచార్యులు : అది పొద్దున వాకిట చేరింది. పిల్లలే చెయ్యి కాల్చుకుంటున్నారు. ఏమి తీన్ తేరా చేస్తున్నారో! నేను వెళ్ళొస్తాగాని, వంట చిచ్చుమాట మర్చిపోబోకు సుమీ! ఒక వంద పిడక, ఒక మోపుడు పుల్లలు... దుంగలైతే వాటిని మళ్ళీ పగలేయించడానికి నా కెవ్వరూ పలకరు... సన్నటి పుల్లలు చూచి... భూషయ్య : మెరకపొలాన తుమ్మ చస్తే, మొన్నే దాన్ని కొట్టుకొచ్చి దొడ్లో పడేశారు. అన్నీ దుంగలే. పాలేళ్ళు పొలం నుంచి వచ్చే వేళైంది. మళ్ళీ మీ రొకసా రొచ్చి, దగ్గరుండి వాళ్ళచేత పగలేయించుకొని, మీకు కావల్సినన్ని పట్టించుకు వెళ్ళండి. కృష్ణమాచార్యులు : సరే, భూషయ్యబాబూ! సరే. (వెళ్ళిపోతాడు. వెంకటశాస్త్రి : భూషయ్యబాబుది ఎముకలేని చెయ్యి. “లేదు” అనేమాట ఆయన ఇంటా, వంటా లేదు. అడగనివానిదే పాపం; యథోచితంగా అందరినీ సత్కరిస్తారు. వీరభద్రయ్య : ను వ్వూరుకోవయ్యా, శాస్త్రులూ, కాసేపు. వ్యవహారం మాట్లాడుతుంటే, మధ్య ను వ్వేమిటి పానకంలో పుడకలా! రా! మాధవరావ్! ఊరికే నీళ్ళు నములుతావు దేనికి? చెప్పరాదట్రా? - ఇది ఫస్టుక్లాసు రూటనీ, డెయిలీ కలెక్షన్ రెండు మూడొందల పైమాటనీ, ఈ ఛాన్సు పోగొట్టుకుంటే మళ్ళీ రాదనీ, నోట్లో నాలిక లేదట్రా? - మాటే పెగలదు. మాధవరావు : ఔను, నాన్నా! ఇది లాంగు రూటు. ఇది మనకొస్తే... (మళ్ళీ మాట మింగివేస్తాడు. భూషయ్య : అయితే, పుచ్చుకో! పాతది నన్నడిగి పుచ్చుకున్నావా - కొత్తదానిమాట నన్నడగడానికి! ఇందులో నా పెత్తన మే మున్నది? వీరభద్రయ్య : అబ్బే ! అదేంమాటే, బాబాయ్! నీవంటే వాడికెంత భయభక్తులని!! భూషయ్య : భయభక్తులున్నవాడైతే నేను నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా నామాట ఖాతర్ చెయ్యకుండా, ఈ వ్యాపారంలో వేలు పెట్టేవాడా? ఇది మనకు లాయకేనా? మన తాత ముత్తాతలు వ్యాపారాలే చేశారా? ఆ దేవు డిచ్చింది మన కేదో ఇంత వున్నదిగా! మనం తిననూ వచ్చు; నలుగురికి పెట్టనూ వచ్చు. నోటి దగ్గిరి కూడు బోర్ల దోసుకోవడం కాకపోతే, వీడికీ వంకర బుద్దు లేమిటి? వీరభద్రయ్య : అదేం మాటే, బాబాయ్! డబ్బుకు నాలుగు డబ్బులు చేర్చి వాడు ప్రయోజకుడు కావాలనుకొంటుంటే! భూషయ్య : ఆఁ! ప్రయోజకుడో, అప్రయోజకుడో కనబడుతూనేవుంది. చదువుకని పెడితే, మిటికేషన్లో మూడు పిల్లి మంతరాలు కొట్టి, నెత్తిని గుడ్డేసుకుని కొంపకి చేరాడు. అయిదారువేలు ఖర్చు పోతే అబ్బిం దేమిటి? సిగరెట్లు, సినిమాలు, షోకులు - ఇవేగా? వ్యాపారం వంక పెట్టుకొని మళ్ళీ బస్తీ కెక్కితే, ఏం కనబడుతున్నది? కట్నంగా వచ్చిన యాభైవేలు గంగలో కలిసిపోవడమేనా? మేదకురాలని పెళ్ళాన్ని బెదిరించి, సదిరించి, దాని నగా, నాణెం పట్టుకుపోయి తెగనమ్ముకోడమేనా? సిగ్గూ, యెగ్గూ లేకపోతే సరి! వీరభద్రయ్య : నీకు మేము చెప్పేపాటి వాళ్ళమటగాని, వ్యాపార మన్నాక, లాభనష్టాలు తప్పుతాయటే, బాబాయ్? వాడు కుర్రసన్నాసి. అనుభవంలేక ముందు కొంత దెబ్బతిన్నాడే అనుకో, కాని, ఎల్లకాలం నష్టమే వస్తుందా? వెంకటశాస్త్రి : పోయిన రెండేళ్ళు వ్యయాధిపతి భుక్తి, నష్టం రాకేమి చేస్తుంది? భూషయ్య : ఇంత తెలిసినవాడివి, “ఇప్పు డిది తగ"దని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదయ్యా? వెంకటశాస్త్రి : ఒకవేళ నేను చెప్పానే అనుకోండి! అయినా దుష్టగ్రహ వీక్షణం తీక్షంగా వుండగా నామాట చిల్లిగవ్వకైనా చెల్లేదా? భూషయ్య : ఔను. మావాణ్ణి చాలా దుష్టగ్రహాలు చుట్టుకొన్నాయి. అందుకనే ఇంత భ్రష్టుడయ్యాడు! వీరభద్రరావు : ఇదుగో! వెంకటశాస్త్రీ! మధ్య ను వ్వేమిటయ్యా? వసపోసిన పిట్టలా వాగొద్దని నీక్కాదూ చెప్పేది! వెంకటశాస్త్రి : ఇంతకీ మన కివ్వాళ శకునం బాగుండ లేదులెండి. భుజాన పంచె వేసుకొని, చెప్పులో కాలు పెట్టానో లేదో, ఎదురుగుండా... వీరభద్రయ్య : చాల్లేవయ్యా! పెద్దమనిషి! కట్టి పెట్టమంటుంటే!! (వెంకటశాస్త్రి కుక్కిన పేనువలె అయిపోతాడు. వీరభద్రయ్య : భూషయ్య బాబాయ్! నే నొక్కమాట చెబుతా, విను! తప్పో, ఒప్పో! మనవాడు వ్యాపారంలో వేలు పెట్టాడు. కొంత నష్టం వచ్చింది. ఇప్పుడు ఊరికే రొష్టుపడితే, వచ్చిన నష్టం పూడుతుందా? మళ్ళీ కాస్త పెట్టుబడి పెట్టి ఈసారి పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తే... భూషయ్య : దాని కేమిరా! పోయినదానితో జతకావడానికి ఎవడి కొంపైనా తీసి మళ్ళీ పెట్టుబడి పెట్టండి. వీరభద్రయ్య : అదేం మాటే, బాబాయ్! లేకపోతే, అసలుకే మోసం రాదటే? భూషయ్య : అసలు లేదు; సిసలు లేదు. తను అల్లరిపడి, న న్నెందుకు అల్లరి పెడతాడుగాని, తట్ట తగలేసి చక్కా రమ్మను. వీరభద్రయ్య : అదిమాత్రం మాటలటే, బాబాయ్! ' రావలసిన బాకీలు, యివ్వదేలిన బాకీలు, ఎన్ని లావాదేవీలు లేవు? వ్యాపారం కట్టి వేయడమంటే ఎంత పీకులాటపని!! చిన్నవాళ్లం, ఈ విషయాలు మేము నీకు చెప్పాలటే? మనవా డొచ్చి నోరు తెరిచి అడిగాడనిగాని, ఇదే మరొకడో, మరొకడో అయితే, వా డెంత కొమ్ములు తిరిగిన వాడైతే మాత్రం - నేను కల్పించుకొనేవాడినటే, బాబాయ్? ఫలానా కొత్త బస్సురూటు యిప్పిస్తే, కాస్త కాలూ, చెయ్యీ కూడ దీసుకుంటానని మనవాడు రాబట్టి, మినిస్టరు చెవిని ఒకమాట వేశాను. భూషయ్య : ఇకనేఁ! పని అయిపోయినట్టే! మీ స్నేహితుడి రొట్టె నేతిలో విరిగిపడ్డట్టే! . వీరభద్రయ్య : మినిస్టరు మనం ఎంత చెబితే అంతే ననుకో. ఆ మాటకొస్తే, చీఫ్ మినిస్టరైనా మనం ఎక్కడ బరి గీసి నిలబడమంటే, అక్కడ నిలబడాల్సిన వాడే. కాని, ఆ సెక్రటరీ గా డొకడున్నాడు. వా దొ? తెంపి!! వా డేవో అడ్డుపుల్లలు వేస్తున్నాడు. వాణ్ణి కట్టుకోవాలి. మేత పడందే వాడు మెత్తపడేటట్టు లేడు. ఒక్క పదివేల రూపాయీలు మనవి కావనుకొని గిరగిర తిప్పి, వాడిమొఖాన కొడితే... భూషయ్య : కాంగ్రెసువాది నంటావ్; దేశభక్తుడి నంటావ్; ప్రజాసేవకుడి నంటావ్. ఈ పాడు పని నీకు తగునట్రా? ఎవరైనా వింటే, కాండ్రించి ముఖాన ఉయ్యరట్రా? వీరభద్రయ్య : ఆఁ! ఎవడు మడికట్టుకు కూర్చున్నాడు? ఎవడిని చూడబోయినా లంచమో, పంచమో పెట్టి, అక్కర గడుపుకొనేవాడే! ఇది పోలిటిక్స్ బాబాయ్, పోలిటిక్స్. ఇప్పుడు ప్రపంచమే ఇలా నడుస్తున్నది. భూషయ్య : ఔనౌను. దిక్కుమాలిన ప్రపంచం. కుడీ యెడమూ; మంచీ చెడ్డా; పాపం పుణ్యం - ఏమీ లేని పాడు ప్రపంచం. వీరభద్రయ్య : సత్యకాలపువాడివి నీ కన్నీ పట్టింపులు గాని, పని కావడమే ప్రధానం, బాబాయ్! ఈ రూ టొచ్చిందంటే మన వాడి పంట పండిందన్న మాటే! వెంకటశాస్త్రి : మన మాధవరావుగారికి ప్రస్తుతం భాగ్యాధిపతిభుక్తి. వాడు రాజ్యంలోనే వున్నాడు. వాడిని ధనాధిపతి చూస్తున్నాడు. వాహన, భాగ్యాధిపతులు కలిసేవున్నారు. అసలు జాతకానికే పంచానన యోగం పట్టింది. బ్రహ్మాండమైన యోగకాలం. ఇక పట్టిందల్లా బంగారమే. భూషయ్య : సరే! సంతోషం! ఆ బంగారంలో నువ్వొక పది తులాలు అడిగి పుచ్చుకో! ఆ పెళ్ళాం బిడ్డలకు నాలుగు వస్తువు లేర్పరచుకోవచ్చు. వీరభద్రయ్య : నీ ఎకసక్కాల కేమిగాని, బాబాయ్! చిన్నవాడినో, పెద్దవాడినో నేను చెబుతున్నాను. కాదు, కూడ దనకు. ఆ పదివేలకూ నువ్వు మాట దక్కించుకో. భూషయ్య : ఈ మాట ఎప్పుడు ఎప్పుడు బయటి కొస్తుందా అని ఇందాకటినుంచి ఎదురుచూస్తున్నాను. పదివేల రూపాయలు కాదు కదా, పది దమ్మిడీలైనా నే నివ్వను. వీణ్ణి సంపాయించుకురమ్మని ఎవ రేడ్చారు? నిక్షేపంలాంటి కొండ్ర నూ రెకరాలున్నది. దాన్ని కనిపెట్టుకుంటే బంగారం పండదూ? అంతకంటే మన కేం కావాలి? ఒంటిగాడ్డి నే నెన్నిటికని దేవులాడతాను? “నా" అని నిలబడేవాడు లేకపోబట్టేగా కోతలు, కట్టివేత వేళకు కాక, నోటి దగ్గర కొచ్చిన గింజలు ఈ యేడు నీళ్ళపాలైంది? మనది మనం జాగ్రత్త పెట్టుకుంటే, మనం రాజాగా బ్రతకవచ్చునే! పది మందిని బ్రతికించనూ వచ్చునే!! అంతులేని ఆశకు పోవడం దేనికి? బోర్లపడ్డం దేనికి? వెధవ వేషాలు కట్టి పెట్టి, ఇఖనైనా కొంపకు చేరమను! మాధవరావు (కోపావేశాలతో) : చేరకపోతే? భూషయ్య : నీ ఖర్మ! నే నేం చేస్తాను? మాధవరావు : అంతేనా? భూషయ్య : అంత కాకపోతే, మరెంతరా? నా కడుపున పుట్టింది నువ్వొక్కడివే కాదు. నువ్వు ఒక్క వెలుగు వెలుగుతావని నీకోసం - చిన్నవాళ్లు - వాళ్ళకు అన్యాయం చేస్తానా? మాధవరావు : నేను చచ్చినా ఇంతేనా? భూషయ్య : సరే! ఒకడు తక్కువ పుట్టాడనుకొంటాను. వీరభద్రయ్య : చిన్న సన్నాసి. తెలిసీ తెలియని మేళం. పెద్దవాడివి - నువ్వెందుకే కాకపడతావు. బాబాయ్? నలభై యాభై వేలు వ్యాపారం మీద పెట్టనే పెట్టాడా? అది సున్నా చుడుతుంటే ఎవరైనా చూస్తూ చూస్తూ ఎలా వూరుకోగలరే. బాబాయ్? పెట్టిన మొత్తమైనా రాబట్టుకోగలిగితే, చల్లగా తప్పుకొందామనే వాడూ చూస్తున్నాడు. పైకం అర్జంటుగా కావాల్సొచ్చిగాని, నాలుగైదు రోజుల యెడ ముంటే వాడే రకం ఫిరాయింపు చేసుకొనేవాడు కాదూ? అవతల మరొకళ్ళు ఆ సెక్రటరీగాడికి రెట్టింపు మొత్తం ఆశ చూపుతున్నారు. “ఖబడ్డార్” అని చెప్పి, ఆర్డర్ వాళ్ళకు పడకుండా ఇప్పటిదాకా పట్టుకొస్తున్నాను. నువ్వు "ఊ" అను! టెలిఫోన్ లో ఒక్కమాట చెప్పి, ఆర్డర్ని తెల్లవారేసరికి మన వాడి కాళ్ళ దగ్గిరికి తెప్పిస్తానో, లేదో! వెంకటశాస్త్రి : సిరి వస్తుంటే మోకా లడ్డకూడదు, భూషయ్య బాబూ. భూషయ్య : మీరు వెయ్యి చెప్పండి, లక్ష చెప్పించండి. నేను చిల్లిగవ్వైనా చెయ్యిజారను. వీరభద్రయ్య : నీమాట నీదేనట, బాబాయ్? నే నొక్కమాట... భూషయ్య : ఈ సంగతి మరి నా దగ్గిర మాట్లాడ వద్దురా, అబ్బాయ్! ఏదో నీతిగా, నిజాయతీగా కాలక్షేపం చేస్తున్నా. ఈ ఘటం ఇలాగే వెళ్ళమారిపోనీ! లంచాలు, పంచాలు, ఆ పాపానికి ప్రాణం మీది కొచ్చినా నే నొడికట్టను. ఏ జన్మాన ఏం పాపం చేస్తే (మాధవరావును చూపిస్తూ) వీడు నా కడుపున చెడబుట్టాడో! అందుకు జత ఇంకో పాపం దేనికి? పుట్టుగతులు లేకుండా పోవడానికా? మాధవరావు (దిగ్గున లేచి) : సరే! నే నేమైపోతేనేఁ! నువ్వు పుణ్యం మూటకట్టుకుని స్వర్గానికి వెళ్లు! రావయ్యా, శాస్తుర్లూ రా! రండి, వీరభద్రయ్యగారూ! రండి! ఇక్కడ మరొక క్షణమైనా ఆగడానికి వీల్లేదు. వెంకటశాస్త్రి : బయలుదేరిన వేళా విశేషం! నాకు ముందే దుశ్శకునమయింది. వీరభద్రయ్య : నల్లపిల్లివి - నిన్ను వెంటపెట్టుకు రావడమే దుశ్శకునం! సరిగాని, మాధవరావ్! నీ వాలకం నా కేమీ బాగాలేదు. పెద్దవాడు - ఆయన నిన్ను పది అననూ వచ్చు; నువ్వు పడనూ వచ్చు. పెద్దవాళ్లు తిట్టినా, అవి దీవనలే. అబ్బే! నువ్వు తొందర పడకూడదు. కాస్త నిదానించు! మాధవరావు : అదంతా నాకు తెలవదు. మీరు వెంటనే కదులుతారా, లేదా? వీరభద్రయ్య : పోనీ, ఈ రాత్రి ఆలోచించి, రేపటికి చెబుతావటే, బాబాయ్! నన్ను మళ్ళీ రమ్మంటే రేపు పొద్దున్నే వస్తాను. రమ్మంటావా? భూషయ్య : ఊహుఁ! : వీరభద్రయ్య : అంత తేలిగ్గా తోసెయ్యబోకవే, బాబాయ్, నా మాట! వ్యాపారరీత్యానే కాక, మరొక విధంగా కూడా మనవాడు చిక్కున పడ్డాడు. . భూషయ్య : మరొక చిక్కు కూడానా? ఏమిటది? వీరభద్రయ్య : ఏదో వున్నదిలే! తెలిసీ తెలియనితనంవల్ల పెద్ద ఊబిలో దిగబడ్డాడు. వెంకటశాస్త్రి : దశబాగున్నా, గోచారంలో అష్టమ గురుడు. వాడు ఊబిలోకి దించడ మొక లెక్కా? మెడకు ఉచ్చునే బిగిస్తాడు. భూషయ్య : మన బుద్ధుల్నిబట్టే మన జాతకా లుంటాయి. చేతులారా చేటు తెచ్చుకుంటూ నెపం నక్షత్రాల మీదికి తొయ్యడం దేనికి? వీరభద్రయ్య : నువ్వలా అంటే కాదే, బాబాయ్! మాధవరావు మెడ నిజంగా ఉచ్చులో చిక్కుకున్నదంటే నమ్ము! భూషయ్య : మంచిది. నువ్వెన్ని చెప్పినా, దాన్ని తీసి నేను నా మెడకు తగిలించుకో బోవడం లేదు. మాధవరావు (దిగ్గున లేచి) : నే పోతున్నా. (రివ్వున వెడతాడు. వీరభద్రయ్య : దూకుడుకుగా పోతున్నాడు. ఏమి తిప్పలు తెచ్చుకొంటాడో? నేనూ పోతానుగాని, ఎందుకైనా మంచిది. కాస్త వెనకా ముందు పరకాయించవే, బాబాయ్! లేకపోతే పస్తాయిస్తావ్. వెళ్ళొస్తా మరి. (వెళ్ళిపోతాడు. వెంకటశాస్త్రి (తనొక అడుగు వెనక్కి తగ్గి) : భూషయ్యబాబూ! పేద బ్రాహ్మణీ! పిల్లా జిల్లాతో గంపెడు సంసారం. తాము దయ వుంచాలి. తమ జాతకం ఒకసారి దయచేయిస్తే - (బయటినుంచి మాధవరావు “ఏమయ్యా! శాస్తుర్లూ!! తగలబడవే” అని అరుస్తాడు. వెంకటశాస్త్రి (బయటి మాధవరావుతో) : వస్తున్నా, బాబూ వస్తున్నా! (ఎదటి భూషయ్యతో)సూరేకారం పాలు, భూషయ్యబాబూ! తొందరపాటు తగదని అబ్బాయిగారికి చెవినిల్లు కట్టుకుని నేను చెబుతానే వున్నా. దశానాధుణ్ణి అష్టమాధిపతి చూస్తున్నాడు. అంచేత అదృష్టమేమో పడుతుంది కాని, అష్టకష్టాలలో పడక తప్పదన్నట్టు కనిపిస్తూ వుంటుంది. నే నొస్తా, భూషయ్య బాబూ! సెల విప్పించండి. (నమస్కరించి వెంకటశాస్త్రి వెళ్ళిపోతాడు. వెంటనే మోటారుకారు బయలుదేరి వెడుతున్న చప్పుడు వినబడుతుంది.

భూషయ్య : ముఖంలో కలత కనబడుతుంది. కొన్ని క్షణాల తర్వాత, అప్రయత్నంగా శ్రీమదాంధ్ర భాగవతం అందుకొని, కృష్ణమాచారి గుర్తు పెట్టి వెళ్ళిన పేజీ వద్ద దానిని విప్పుతాడు, మనస్సు కలత తీరడానికన్నట్టు, “ఆశాపాశము దాగడున్ నిడుపు"... అనే పద్యం చదువుతాడు. ఆ పిమ్మట సీసపద్యాన్ని అందుకొని “సంతుష్టు డీ మూడు జగముల బూజ్యుండు, సంతోషి కెప్పుడు జరుగు సుఖము, సంతోషి గాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తసతియు దొరకు” అనే మొదటి రెండు చరణాలూ పూర్తి చేస్తుండగా కృష్ణమాచార్యులు తిరిగి ప్రవేశిస్తాడు. కృష్ణమాచార్యులు : భగవత్కథా కాలక్షేపానికి విఘ్నం దేనికని వామనావతార ఘట్టాన్ని పూర్తి చేస్తున్నావా, భూషయ్యబాబూ? భూషయ్య : అబ్బే, లేదండీ! మనస్సు చికాగ్గావుంటే, యదాలాపంగా... కృష్ణమాచార్యులు : చికాకే మరి! ఇదెంత అప్రతిష్ఠ! ఇదెంత అప్రతిష్ఠ! మీ కుటుంబ గౌరవానికి, మీ వంశమర్యాదకూ - అయ్యయ్యో!! - ఎంత మచ్చ! ఇంతకీ ఇది విధి వైపరీత్యం. భూషయ్య బాబంటే సాక్షాత్తు ఆ ధర్మరాజని లోకమంతా మ్రోగిపోవడ మేమిటి, అట్టి ధర్మప్రభువు కడుపున ఫోర్జరీకి పాల్పడే కొడుకు పుట్టడ మేమిటి? భూషయ్య (మిన్ను విరిగి మీద పడ్డట్టు) : ఆఁ! ఫోర్జరీ యేమిటి? కృష్ణమాచార్యులు (తెల్లబోతూ) : ఏఁ? భూషయ్య బాబూ! ను వ్వింకా విననే లేదా? భూషయ్య : అయ్యో ఖర్మ! ఫోర్జరీ యేమిటండీ? కృష్ణమాచార్యులు : నాలుగైదు రోజుల క్రితమే నేను కర్ణాకర్ణికగా విన్నాను. పాపం, పుణ్యం ఆ భగవంతుడి కెరుకని నీ చెవిని వెయ్యలేదు. కాని, ఈపూట ఊరంతా గుప్ మంది. ఎక్కడ వినబోయినా ఈమాటే మహా విడ్డూరంగా... భూషయ్య : అబ్బ! అసలు విషయమేమిటండీ? కృష్ణమాచార్యులు : వస్తున్నా, భూషయ్యబాబూ! దానికే వస్తున్నా. నీ సంతకాన్ని అబ్బాయి ఫోర్జరీ చేశాడట. భూషయ్య : నా సంతకాన్నా? ఎప్పుడు? ఎందుకు? కృష్ణమాచార్యులు : ఆ దుష్టుడు లేడూ? - వీరభద్రయ్య! - అతగాడు - ఏదో బస్సురూటట పర్మిటట వాడి శ్రాద్ధమట ఆ గొడవలు నాకు తెలియవ్ మనచేతిలో పని - చిటికలో అయిపోతుంది - నాదీ పూచీ - ఒక్క పదివేలు పట్టుకురావోయ్” అన్నాడట. “అదెంత భాగ్యం? భూషయ్య : ఔను, ఇప్పుడేగా - మీ రిక్కడుండగానే - ఆ పదివే లిమ్మని నా దగ్గరి కొచ్చి - వెళ్లారు. మరి, ఫోర్జరీ యేమిటి? కృష్ణమాచార్యులు : అబ్బాయి నెలనాడే పదివేలు అప్పుచేసి యివ్వడం, దాన్ని ఈ ఖర్చులని, ఆ ఖర్చులని వీరభద్రయ్య గుటకాయస్వాహా చేసివెయ్యడం జరిగిపోయిందట, భూషయ్యబాబూ! భూషయ్య : సరే, ఏం తగలబడ్డాడో గాని, ఫోర్జరీ యేమిటండీ? కృష్ణమాచార్యులు : ఆ అప్పు పెట్టినవాళ్ళు “మీది అవిభక్త కుటుంబం - నోటుమీద మీ నాన్న సంతకం కూడా కావా” లన్నారట. సూర్యుడు ఇటు అటు పొడిచినా నువ్వు సంతకం పెట్టేది లేదని తెలుసుగనక "ఆఁ! ఎవరు చూడొచ్చారులే!" అని నీ బదులు కూడా అబ్బాయే సంతకం చేశాడట. భూషయ్య : ఆరి భడవ! ఎంత పని చేశాడు! కృష్ణమాచార్యులు : వస్తుతః అబ్బాయి మంచివాడే. కాని, ఆ భ్రష్టాకారి ముండావాడు వీరభద్రయ్య స్నేహం చేసి చెడిపోతున్నాడు. ఈ చిక్కు అతగాడు తలకు చుట్టిందే. భూషయ్య : అయితే, నీ డింకా వాడి చంకే నాకుతున్నాడేం? కృష్ణమాచార్యులు : పసితనం, బాబూ! పసితనం!! భూషయ్య : ఇంకేం పసితనం? పాతకేళ్ళిస్తే? (ముక్కున వేలు వేసుకొని) అన్ని విధాలా నన్నెంత నగుబాట్లుపాలు చేస్తున్నాడు! కృష్ణమాచార్యులు : లోకానుభవం తక్కువ, భూషయ్య బాబూ. లోకానుభవం తక్కువ! ఆ వీరభద్రయ్య మైరాముణ్ణి చంపి పుట్టాడు. అతగాడు బట్టలో పేలాలు వేయిస్తాడు; అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. తిమ్మిని బ్రహ్మి చేయగల సమర్ధుడు. మహామహా కొమ్ములు తిరిగినవాళ్ళే అతగాడి మాయలో పడిపోతారు. ఇహ, మన మాధవరావుమాట చెప్పాలీ? జరిగిందేదో జరిగింది. పస్తాయించి లాభం లేదు. రెండోకంటి వాడికి తెలియకుండా ఆ పదివేలూ పంపించి, తెల్లవారక ముందే ఆ నోటు మన చేతి కొచ్చేటట్టు... భూషయ్య (ఆందోళనాపూర్వకంగా) : అది పరాయివాళ్ళ చేతిలో వుండడం ప్రమాదమే! కృష్ణమాచార్యులు : ప్రమాద మని నెమ్మదిగా అంటావేమి, భూషయ్యబాబూ! దాన్ని మన చేతికి రాబట్టుకోకపోతే కుత్తుక పట్టుకుంటుంది. వాళ్ళు "మా పదివేలు మాకు తెస్తావా? సివిల్, క్రిమినల్ చర్యల్ని జరపమంటావా?” అని దూకుడు చేస్తున్నారట. మీ రిహ తాత్సారం చేస్తే కాదు. తలలో నాలికవంటి మనిషి నెవరినైనా చూచి, అతగాడి చేతికి పైక మిచ్చి, తెల్లవారేసరికి ఎలాగైనా సరే... భూషయ్య (బాధతో బరువుగా) : కొడుకు రాసిన దొంగనోటు తెప్పించ మంటారు! కృష్ణమాచార్యులు : లేకపోతే, కొంప లంటుకోవూ, భూషయ్య బాబూ? దుష్టసహవాసం చేసి, చెయ్యరాని పని చేశాడనుకో! అయినా జ్యేష్ఠుడు, జెయిల్లో పడ్డాడంటే, వంశానికే తరతరాలకూ తలవంపులు కావూ? భూషయ్య : ఇప్పుడు అంతపనీ జరగలేదటండీ? ఫలానా వారబ్బాయి ఫోర్జరీ చేశాడంటూ లోకం కోడై కూస్తున్నదని మీరేగా ఇంతకుముందు చెప్పారు!! జెయిలుకు వెళ్ళడం ఇంతకంటె అప్రతిష్ఠ కాదుగా? ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, నా కొడుకు రాసిన దొంగనోటు నా కివ్వమని నేను అడ్డమైనవాడి కాళ్లా వేళ్లా ఎక్కడ పడతానులెండి? వీడు రాసిన దొంగనోటు ఇదొక్కటే నన్నమాటేమిటి? ఎన్నున్నవో! కృష్ణమాచార్యులు : అబ్బే! వోడు వోడంటే కంచమంతా వోడేనా, భూషయ్యబాబూ? ఇందాక నీదగ్గరి కొచ్చినప్పుడు అబ్బాయి ముఖాన కత్తివేటు వేసినా నెత్తురు చుక్క వున్నదా? పాపం! చాలా సిగ్గుపడిపోతున్నాడు! భూషయ్య : వాడు సిగ్గు బిడియాలున్నవాడైతే, అన్ని అబద్ధాలాడతాడా? “ఏదో బుద్ధి తక్కువైంది. గడ్డి కరిచాను. నన్ను ఒడ్డుకు చేర్చ” మంటే, అదొక దారి. ఆ మాట వాడి నోటివెంట వచ్చిందా? (లోపలినుంచి పదిహేను, పదహారేళ్ల కుర్రవాడి గొంతు “నాన్నా! చెల్లాయి మందుపొట్లం వేసుకోనంటున్నది”. భూషయ్య : అది చేదు పుట్ట. కాస్త తేనెలో కలిపి వెయ్యండిరా! కృష్ణమాచార్యులు : అమ్మాయికి నెమ్మళ్లించ లేదా భూషయ్య బాబూ? భూషయ్య : ఆఁ! కొంత నెమ్మళించింది. నిన్న సాయంత్రం నుంచి జ్వరం తిరుగుముఖం పట్టింది. కృష్ణమాచార్యులు : మొత్తంమీద చాలా పెద్ద ఖాయలా తీసింది. రత్నంవంటి పిల్ల. ఎక్కడ దాపురించిందో ఈ విషజ్వరం. పైకి అనలేదుగాని, పోయిన వారం నాకు మనస్సులో కొంత డొక్కు పడింది. భూషయ్య : ఎవరెంత ఖంగారు పడితే నేమండీ! వాడు వాకిట్లో వాడు వాకిట్లోనుంచే వెళ్ళిపోయాడు గాని, లోపలికి తొంగైనా చూశాడా? అన్నయ్యను చూడాలని అది కలవరిస్తే, అక్కడికీ మొన్న కబురుకూడా చేశాను. తన షోకు, తన దర్జా, తన సుఖం, తన గొడవేతప్ప మరొకరి ఊసే వాడికి పట్టదు. ఏమిటో ఈ విపరీతపు బుద్ధులు. కాలమహిమ కాబోలు! కృష్ణమాచార్యులు : ఇంకా పసివాడు, భూషయ్యబాబూ! పసివాడు. ఎలాగైనా, ఈ ఉచ్చు మీరు తప్పించాలి. భూషయ్య : అయితే, వీడికంటే పసివాళ్ళు లేరూ? వాళ్ళ మాటేమిటి? వీడికోసం వాళ్ళకు చిప్ప చేతి కివ్వమంటారా? కృష్ణమాచార్యులు : ఆమాట నిజమే ననుకో, భూషయ్యబాబూ! కాని మాధవరావు... భూషయ్య : వాడు నా పెద్దబిడ్డ; వాడిమాట మీరు నాకు చెప్పాలటండీ? పైపై గాంభీర్యమేగాని, వాడి

విషయమై నేనెంత కుమిలిపోతున్నానో మీకేం తెలుసు? ఇప్పుడు మీరు చెప్పిన మాట వినేసరికి నవనాడులూ క్రుంగి నేను సగం చచ్చానంటే నమ్మండి. కాని, నీతీ నిజాయితీ లేనివాడిని - కొడుకైతే మాత్రం - కాపాడాలన్న తాపత్రయం మనకు తగునా? అట్టివాడు ఏ గంగ కలిసినా ఒక్కటే. “మన కున్నది మనకు చాలదట్రా?" అని ఎంత మొత్తుకున్నా గోడకు చెప్పినట్టే అయింది. వాణ్ణి దురాశ పీడిస్తున్నది; దుర్మార్గుడౌతున్నాడు. సరే, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. ఎవరి కర్మ కెవరు కర్తలు? సర్లెండి ఆ పద్యం - దాన్ని మళ్లీ వినిపించండి : “ఆశాపాశము దా గడుకొనిడుపు...” కృష్ణమాచార్యులు : ధర్మరాజువని నీకు ఊరికే పేరొచ్చిందీ భూషయ్యబాబూ! నీబోటి వాళ్ళింకా మిగలబట్టే... భూషయ్య : మీ మాటలకేమిలెండి. ఆ పద్యం వినిపించండి. (కృష్ణమాచార్యులు “ఆశాపాశము దా గడున్ నిడుపు” అని ఉచ్సైస్స్వరంలో యెత్తుకొన్నంతనే –

గమనిక : ఈ నాటికను రెండవ ముద్రణలో చేర్చారు.                                                    తెర)

  జీవజ్వాల పాత్రలు: మనుమడు, అతని తల్లి, అతని తాత. స్థలం : వార్సా సమయం: 1939 సెప్టెంబరు 10వ తేది ఉదయం

ఈ నాటికలోని పాత్రలు మార్షల్ పిల్సుడ్ స్కీ పట్ల చాలా భక్తిభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది సహజం. రష్యాపై దండెత్తడానికి 1914లో పిల్సుడ్ స్కీ కూడదీసిన మొదటి లీజియన్ కు చెందిన ఒక సైనికుడు మార్షల్ జీవితాంతం వరకు ఆయన వాలెట్ గా పనిచేశాడని "న్యూ స్టేట్స్ మన్ అండ్ నేషన్”లోని ఒక వ్యాసంలో ఆ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ నాటికలోని తాతను సృష్టించాను. మార్షల్ కు అంత, విశ్వాసపాత్రంగా సేవచేసిన వ్యక్తి అతనిపట్ల విపరీతమైన భక్తిని ప్రదర్శించడం సహజం. తాతనుబట్టి తాత కుటుంబంలోని ఇతరుల వైఖరి కూడా వుంటుందనడంలో దోషంలేదు. చదివాను. అయితే, ఈ పాత్రలతోపాటు మనం మార్షల్ ను స్తోత్రం చెయ్యలేము. మాతృదేశ స్వాతంత్ర్యసిద్ధికి పిల్సుడ్ స్కీ కఠోర తపస్సు చేశాడనడం నిజం. కాని, జాతీయాభిమానమే అతనిలో ఒక పెద్ద లోపమైంది. సోషలిస్టుగా అతడు జీవితాన్ని ప్రారంభించాడు. ఎంతవరకు సోషలిస్టుల సాహచర్యం తన జాతీయోద్యమానికి వినియోగించిందో, అంతవరకు దాన్ని వినియోగించుకున్నాడు. ఆ తర్వాత అసలు సోషలిస్టు సిద్ధాంతాలకే విరోధి అయ్యాడు. ఇది ద్రోహమని ఒక సోషలిస్టు మిత్రుడు నిందిస్తే, “నీవూ నేనూ సోషలిజం అనే రైలును అందుకున్నాం. నేను పోలిష్ స్వాతంత్ర్యం అనే స్టేషన్ దగ్గర దిగిపోయాను; నువ్వు యూటోపియాకు (ఆదర్శ రాజ్యానికి) నీ ప్రయాణాన్ని సాగించు” అని అవహేళన చేశాడు. 1772లో రష్యా, జర్మనీలు మొట్టమొదటిసారిగా పోలెండ్ ను పంచుకున్నాయి. అప్పటి నుంచి 1815 వరకు మరి మూడుసార్లు పోలెండ్ పంపకం జరిగింది. నాల్గవ పంపకంలో రష్యా, జర్మనీ, ఆస్ట్రియాలు భాగస్థులు, 1918 వరకు ఈ నాల్గవ పంపకం అమలులోనే వుంది. ఏదో ఒక విదేశ రాజ్య దాస్యానికి లోబడి ఉండటమే దుర్భరం. ఇక, మూడు విదేశ రాజ్యాలకు గులాం కావడం సంగతి చెప్పనక్కర్నేలేదు. అంచేతనే పోలిష్ వారిలో జాతీయత మూర్తీభవించి, చివరికి అది ఒక జాడ్యంగా పరిణమించింది. పిల్సుడ్ స్కీ ఈ జాడ్యానికి అందరికంటే ఎక్కువగా గురి అయ్యాడు. జాతీయాభిమాన జాడ్యం ముదిరినప్పుడు అది జాతీయదురహంకార మౌతుంది. పిల్సుడ్ స్కీ విషయంలో ఇదే జరిగింది. పోలిష్ జాతికి చెందిన వారినందర్నీ, పోలిష్ భాషను మాటాడే వారినందరినీ ఒక రాజ్యం కిందికి తేవడంలో సంతృప్తిపడక, అతడు పోలెండ్ ను యూరప్ లో ఒక మహారాజ్యంగా చెయ్యాలనుకున్నాడు. ఇందుకోసం జర్మన్ జాతివారు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల్ని ముందుగానే పోలెండ్ లో కలుపుకున్నాడు. ఆ తర్వాత రష్యాలోని అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని, దానిపై దండెత్తి వెళ్ళి, 1920లో దానిదగ్గరి నుంచి వెస్టన్ యూక్రెయిన్ రాష్ట్రాన్ని అపహరించాడు. ఆతర్వాత లిథువేనియాపై కత్తికట్టి, 1927లో దానిదగ్గరి నుంచి విల్నా జిల్లాను వశపరుచుకున్నాడు. ఈ దురాక్రమణలతో పోలెండ్ కు అతడు ఎన్నో కొత్త సమస్యల్ని కల్పించాడు. ఇంతేకాదు. విదేశ ప్రభుత్వాలతో సంఘర్షణల్ని సాగించడంలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చినవాడు కావడం వల్ల పిల్సుడ్ స్కీలో సైనిక ప్రవృత్తి ప్రబలింది. అంచేత అతడు పోలెండ్ ను ఒక పెద్ద సైనిక శిబిరంగా చెయ్యాలనే ధోరణిలో పడిపోయాడు. ప్రభుత్వ వర్గంలో ముఖ్య స్థానాల నన్నిటిని సేనాధిపతులకు కట్టబెట్టాడు. సైనిక వ్యయం కోసం విపరీతంగా పన్నుల్ని వేశాడు. సైన్యాభివృద్ధి కోసం చూపిన శ్రద్ధలో వీసమంతైనా సాంఘిక, ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి పట్ల చూపలేదు. చండశాసనునివలె ప్రజలను పరిపాలించాడు; వారిని పీడించాడు; ఏడిపించాడు. 1939లో నాజీ సైన్యాల ఢాకకు పట్టుమని పక్షం రోజులైనా పోలెండ్ నిలవలేకపోవడానికి పిల్సుడ్ స్కీ నింద్య జాతీయ విధానాలే, నిరంకుశ పరిపాలనా పద్ధతులే కారణం. అంచేత ఈ నాటికలోని పాత్రలు చేసే ప్రశంసనుబట్టి పిల్సుడ్ స్కీని ఆదర్శమూర్తిగా భావించడం కంటే పొరబాటు వుండబోదు. నిజానికి ఇది పిల్సుడ్ స్కీ నాటికకాదు; పోలెండ్ నాటిక. పోలెండ్ నాటిక కూడా కాదు; స్వాతంత్ర్య సంపాదన కోసం, సంరక్షణ కోసం పోరాడే ప్రతిదేశం నాటిక. సీన్ : వార్సాలో ఒక డ్రాయింగ్ రూం. కుడివైపుది సింహద్వారం. దాని రెండుపక్కల వీధిలోకి రెండు కిటికీలు. ఎడమవైపున మరి రెండు కిటికీలు. వాటిమధ్య ఫైర్ ప్లేస్. వెనక భాగాన మేడమెట్లు, గదిమధ్య నుంచి కొంత ఎత్తు లేచిన తర్వాత రెండు వరసలుగా చీలి, ఒక వరస కుడివైపుకూ, మరొక వరస ఎడమవైపుకూ పైకి వెడుతున్నాయి. మెట్ల వరసలలో ఎడమ దానికింద బీరువా, కుడిదానికింద సైడ్ టేబుల్, ఆ టేబుల్ పైన రేడియో, దాని ఎదట ఒక కుర్చీ. సైడ్ టేబుల్ వున్న గదిమూల ఒక కబర్డ్. గది మధ్యలో ఒక సెటీ, నాలుగు కుర్చీలు, వాటి మధ్య గ్లాస్ టాప్లు సెంట్రల్ టేబుల్. దానిమీద చప్పగా వాడిపోయిన పువ్వులతో ఫ్లవర్ వాస్. గదిలో ఒకపక్కగా పామ్ స్టాండ్. దానిమీద మార్షల్ పిల్సుడ్ స్కీ బస్ట్. గది మధ్య చక్కని తివాచీ. సెటీలో ఒక మూలకు వొది? కాత కూర్చుని వుంటాడు. వయస్సు డెబ్బై ప్రాంతాల, తాత ముఖం చింతాక్రాంతంగా వుంటుంది. టీ ట్రీ పుచ్చుకుని మనమడు ప్రవేశిస్తాడు. అతడు పధ్నాలుగేళ్ళవాడు. మనుమడు : తాతా! తాతా! తాత (ఆలోచనలు అన్నీ ఎక్కడో వున్నట్టు) : ఆఁ! మనుమడు : నీ టీ ఇదుగో! పిలిచేది నిన్నే, తాతయ్యా! తాత : ఊఁ! మనుమడు : అమ్మ పనితొందరలో వుంది. టీ కోసం కిందికి రాలే నంది. తాత : ఊఁ! మనుమడు : బ్రెడ్ లేదు. కబలో బిస్కట్లు వున్నవేమో చూడమన్నది, తాతయ్యా! (కబర్డ్ ను తెరిచి చూస్తాడు. మనుమడు : బిస్కట్లు అయినా లేవు, తాతయ్యా! తాత : సర్లే, బాబూ! మనుమడు : మరి, నేను పోనా? తాత : మంచిది, బాబూ! తాత : బాబూ! (మనుమడు మేడమీదికి వెళ్ళడానికి నాలుగు మెట్లు యెక్కుతాడు. మనుమడు : ఆఁ! తాత : ఇలా ఒకసారి రా! మనుమడు (మెట్లు దిగుతూ) : దేనికి? తాత : మన గరాజ్ లోకి వెళ్ళి, ఆయిల్ కాన్ పట్టుకురా! మనుమడు : ఆయిల్ కాన్ దేని కిప్పుడు? తాత : చెబుతాగా! పట్టుకురా! తాత (మెట్ల దగ్గరికి వెళ్ళి కుమార్తె నుద్దేశించి) : అమ్మా! అమ్మ (మేడపై నుంచి) : దేనికి నాన్నా? తాత : బీరువా తాళంచెవి ఎక్కడున్న దమ్మా? అమ్మ : సైడ్ టేబుల్ డ్రాయర్ లో వుంది. (మనుమడు వెడతాడు. (తాత తాళం చెవి తీసుకుని బీరువా తెరుస్తూ వుండగా మనుమడు తిరిగి వస్తాడు. మనుమడు : ఇదుగో, తాతయ్యా! ఆయిల్ కాన్. (ముట్టకుండా వున్న టీ వంక చూచి) టీ తాగనే లేదేమి, తాతయ్యా! చల్లారిపోతున్నది, తాత : తాగుతా, బాబూ! మీ అమ్మ నడిగి డస్టరుంటే పట్టుకురా! మనుమడు : దేనికి? తాత : పట్టుకురా, చెబుతా. మనుమడు : ఊహుం! ముందు చెబితేనేగాని తేను. తాత (బీరువాలోనుంచి ఆర్మీరైఫుల్ బయటికి తీస్తూ) : ఈ రైఫుల్ వాడుకలేక తుప్పు పట్టిపోయింది; తుడవాలి. మనుమడు : అందుకా! తెస్తాను. (మేడమీదికి వెడతాడు. తాత రైఫుల్ పుచ్చుకువచ్చి, సెటీలో చతికిలబడి, రైఫుల్ బారెల్ పరిశీలిస్తాడు. తర్వాత ట్రిగ్గర్ ముమ్మారు పైకిలాగి నొక్కుతాడు. ఇంతలో మనుమడు తిరిగి వస్తాడు. మనుమడు : నిన్ను అమ్మ చప్పున ప్రయాణం కమ్మంటున్నది, తాతయ్యా!

తాత : ప్రయాణమా? ఎక్కడికి?

మనుమడు : ఎక్కడి కేమిటి? మన వార్సాను ముట్టడించబోతున్నారనీ, సైనికులు కానివాళ్ళందరు వెళ్ళిపోవాలనీ రేడియోలో చెప్పలేదూ? తాత : ఆఁ! ఔనౌను! నే నామాటే మర్చిపోయాను. మరి, చప్పున ప్రయాణమై వెళ్ళండి. మనుమడు : అదేమిటి? నువ్వు రావా? తాత : రేడియోలో చెప్పిందేమిటి? సైనికులు కానివాళ్ళు వెళ్ళిపోవాలని - అంతేగా? మనుమడు : ఔను. తాత : మరి నేను సైనికుణ్ణి. ఎలా వస్తాను నువ్వే చెప్పు? మనుమడు : ముసిలివాడివి నువ్వేమి సైనికుడివి, తాతయ్యా? తాత : సైనికుడు కావడానికి ముసిలివాడేమిటి? పడుచువాడేమిటి? ఒకసారి సైనికుడైనవాడు బ్రతికినంతకాలమూ సైనికుడే? మనుమడు : నువ్వేమి సైనికుడివి తాతయ్యా! నీ చేతులు... తాత : ఔను. నా చేతులకు వణుకు పుట్టింది. అయితే నేం? గుండెమాత్రం గట్టిగానే వుంది. మనుమడు : నీకు చూపైనా... తాత : నిజమే. నాకు చూపైనా తిన్నగా ఆనడం లేదు. కాని, నా దారిమాత్రం సూటిగా కనబడుతున్నది. (ఈ మాటల్ని అంటూ రైఫుల్ కు ఆయిల్ రాస్తూ ఉంటాడు. మనుమడు : నీకేమైనా పిచ్చిపట్టిందా, తాతయ్యా? ఇంత ముసిలివాడివి నువ్వేం యుద్ధం చేస్తావు. తాత : ఏమంత వయస్సు? ఇంకా డెబ్బై నిండలేదు. మనుమడు (నవ్వుతూ) : అదేమిటి, తాతయ్యా! నువ్వింకా చిన్నవాడివనే ! మనుమడు : ఏమో! అంత వయస్సులో ఆయనైనా ఇంత సాహసాన్ని చేసేవాడు కాదు. తాత : కాదనుకో! కాని, ఆ మహామహుడు జీవించివుంటే... మనుమడు : ఎవరది, తాతయ్యా? తాత : మార్షల్ పిల్సుడ్ స్కీ. మనుమడు : ఆయన జీవించేవుంటే తుపాకి పట్టేవాడంటావా? తాత : అందుకు సందేహమా? మనుమడు : నీకంటె ఆయన మూడు సంవత్సరాలు పెద్దవాడని చెప్పావ్ కాదూ, తాతయ్యా? తాత : ఔను. ఇప్పటికి డెబ్బై రెండు నిండేవి. తాత : ఆయనకు ఇదొక సాహసమా? కేవలం మూడువందల మందితో జార్ సామ్రాజ్యంపై దండెత్తాడు! ఆ మూడు వందల మందిలో నుంచే మూడు లక్షలమంది వీరు లుద్భవించారు; శతాబ్దం పై నుంచీ దాస్య బాధతో క్రుంగిపోతున్న మన దేశం స్వతంత్ర రాజ్య మైంది. మనుమడు : కాని, అప్పుడాయన వయస్సెంత? తాత : అప్పుడా? (ఆలోచిస్తున్నట్టు క్షణం ఆగి) ఆయన జన్మించింది 1867లో. ఇక, రష్యాపై దండెత్తింది 1914లో. అంటే... మనుమడు : 1914లో 1867 పోతే... ఆఁ!... ఉండు తాతయ్యా.... చెబుతాను... అదొక 33... ఇదొక 14... మొత్తం 47... అంటే, అప్పటికి నడి వయస్సన్నమాట! తాత : తర్వాతనైనా ఆయన పౌరుషం చచ్చిందా! పిల్సుడ్ స్కీ సంగతి నీకు తెలియదు, బాబూ? పోలెండే ఆయన; ఆయనే పోలెండ్. దాస్య బాధ నుంచి ఆయన విముక్తి చేసిన పోలెండ్ పై ఈనాడు నాజీమూకలు... ("పేపర్" అంటూ న్యూస్ బాయ్ పత్రిక పడవేసి వెడతాడు. అది పడిన చప్పుడుకు ఇద్దరూ అటు చూస్తారు. మనుమడు : పత్రిక వచ్చింది, తాతయ్యా! స్పెషల్ ఎడిషన్ కాబోలు. (వెళ్ళి దాన్ని తెచ్చి. హెడ్డింగుల్ని దువుతాడు). “వార్సా సరిహద్దులలో జర్మన్ సైన్యాల ప్రవేశం"... “పలాయనమౌతున్న ప్రజలపై ఫిరంగులు"... “మన సైన్యాల వీరోచిత ప్రతిఘటన”... తాత (ఉద్రేకంతో కూడిన ఉచ్చైస్వరంతో) : పారిపోతున్న ప్రజలపై ఫిరంగులు! ఇది యుద్ధం కాదు, హత్యా కాండ! హంతకులు! రాక్షసులు!! (ఉద్రేకం మరీ హెచ్చి, ఉక్కిరి బిక్కిరై పోతాడు. చెడ్డ దగ్గు వస్తుంది. మనుమడు : అయ్యొ తాతయ్యా! (చప్పున టీకప్పు దగ్గరికి తీసుకువెళ్ళి) కాస్త టీ పుచ్చుకో! టీ దగ్గు తగ్గుతుంది! తాత (గుక్క తిప్పుకుంటూ) : వద్దు, బాబూ! వద్దు. మనుమడు : వద్దక పోవడమేమిటి, తాతయ్యా! కొంచెం తాగు మంచిది. తాత (కప్పు అందుకుని, రెండు గుక్కలు తాగి) : మరి చాలు బాబూ! (కప్పు టేబుల్ పై పెడుతూ) ఇప్పు డాయనే జీవించివుంటే... మనుమడు : వుంటే, ఆయనైనా మాత్రం ఏం చేశేవాడు? తాత : ఏం చేశేవాడా? 1920లో ఏం చేశాడో. ఇప్పుడూ అదే చేశేవాడు. అప్పుడు వార్సాకు ఆరుమైళ్ళ దూరంలోకి వచ్చిన బోల్షివిక్ సైన్యాల్ని ఆయన తరిమికొట్టలేదా? మనుమడు : ఆయన శక్తి అంటే నీ కెంత విశ్వాసం తాతయ్యా! తాత : ఆయన సంగతి తెలిస్తే నీకూ... మనుమడు : నాకు తెలియకేమి? తెలుసు. తాత : ఏమి తెలుసు, బాబూ? మనుమడు : అంతా తెలుసు. ఆయన విల్నాలో పుట్టాడు. ఆయన తండ్రి ఆస్తిని జార్ ప్రభుత్వం జప్తు చేసింది; ఆయన అన్నకు ఉరిశిక్ష వేసింది; ఆయన్ని రెండు సార్లు జైలులో పెట్టింది. మొదటిసారి సైబీరియాలో ఐదేళ్ళపాటు సీసం గనిలో కూలీగా పనిచేయించింది. రెండోసారి వార్సాలోనే చీకటి కొట్టులో పడవేసి అష్టకష్టాలు పెట్టింది. అప్పుడాయన పిచ్చెత్తి పోయినట్టు నటన చేసి, ఒక డాక్టర్ సహాయంతో జైల్ నుంచి తప్పించుకున్నారు. ఇంకా చెప్పనా? తాత (మనుమడి ధోరణికి చిరునవ్వుతూ) : ఊఁ! చెప్పు! మనుమడు : 1914లో యుద్ధం ప్రారంభం కాగానే “మీరు మా పక్షాన చేరి రష్యా పై యుద్ధం చేస్తే, మీ దేశాన్ని స్వతంత్ర రాజ్యం చేస్తా” మని జర్మనీ, ఆస్ట్రియాలవారు వాగ్దానం చేశారు. దీన్ని నమ్మి ఆయన ష్యాపై దండయాత్ర సాగించాడు. 1917లో రష్యా వోడిపోగానే, ఇక పోలెండ్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించమని ఆయన కోరాడు. ఇందుకు జర్మనీవా రిచ్చిన జవాబు, - ఆయన్ని ఖైదులో పెట్టడం. తాత (నవ్వుతూ) : ఇంకా తేదీలు జ్ఞాపకం లేవూ? మనుమడు (గారాబంగా) : కాదు, తాతయ్యా! ఇంకా చెబుతా, విను! ఆయన జైలుకు వెడుతూవుంటే, కష్టకాలంలో ఆయన సరసను నిలవాలని నువ్వు వెంట బయల్దేరావు. నువ్వు వెంట రావడానికి వీల్లేదని అడ్డుచెప్పగా “నేను పిల్సుడ్ స్కీ వాలెట్ ను; ఆయన వెంట ఉండితీరా” లన్నావు. 1918లో జర్మనీ వోడిపోయింది. వెంటనే పిల్సుడ్ స్కీ విడుదలయ్యాడు. పోలెండ్ స్వతంత్ర రాజ్యమైంది. తర్వాత నీకు పెద్ద హోదా నిస్తానంటే “వద్దు! నేను వాలెట్ గానే వుంటా” నన్నావు. పిల్సుడ్ స్కీ మొదటి లీజియలోని మూడు వందల మందికీ ఇంత తక్కువ హోదాతో సంతృప్తి పడింది నువ్వొక్కడివే. నువ్వు... తాత (నవ్వుతూ) : నువ్వు చెబుతున్నది పిల్సుడ్ స్కీ చరిత్ర కాదు; మీ తాత చరిత్ర. మనుమడు : కాదు; తాతయ్యా! పిల్సుడ్ స్కీ జీవితచరిత్ర అంతా నాకు తెలుసు. తాత : నీకు తెలిసిన విషయాలు ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య స్థూలఘట్టాలు మాత్రమే, బాబూ? ఆయన అంతర్జీవితం నీకు తెలియదు. ఆయన జీవితం మీద, ఆయన జీవిత లక్ష్యాల మీద వెలుగు ప్రసారించగల చిన్ని చిన్ని సంఘటనలు ఎన్నో నా కళ్లెదట జరిగాయి. వీటి సంగతి లోకానికి తెలియనే తెలియదు. మనుమడు : ఏం సంఘటన లవి, తాతయ్యా? ఏదీ ఒకటి చెప్పు! తాత : సరే! చెబుతా విను. ఒకనాడు వీధిలో నవ్వుతూ కేరుతూ ఆడుకుంటున్న పిల్లల్ని చూచి ఆయన నిట్టూర్చాడు. మనుమడు : ఆడుకుంటున్న పిల్లల్ని చూచి నిట్టూర్చడం దేనికి? తాత : నేనూ అదే ఆశ్చర్యపోయాను. అయితే అప్పటికి మాట్లాడకుండా వూరుకుని, ఆ రాత్రికి “ఉదయం నిట్టూర్చారు దేనికి?” అని అడిగాను. అమ్మ (మేడపై నుంచి) : బాబూ! మనుమడు : ఆఁ! అమ్మ : ఒకసారి చప్పున పైకిరా! మనుమడు : దేనికి? అమ్మ : ఈ ట్రంక్ కిందికి దించాలి. తాత : వెళ్ళు, బాబూ! సాయం పట్టు. మనుమడు : వెడతానుగాని, ఆయన... తాత : ముందు వెళ్ళు! మనుమడు : వెడతాలే, తాతయ్యా! ఆయన... 264 diagram undi.... తాత : వెళ్ళిరారా, బాబూ? మనుమడు : సరే! వెడుతున్నా! (నాలుగైదు మెట్లు ఎక్కుతాడు. అమ్మ : బాబూ! రానక్కర లేదులే! మనుమడు (తిరిగివచ్చి) : నీ ప్రశ్నకు మార్షల్ ఏం జవాబిచ్చాడు. తాతయ్యా? తాత : చాలా గొప్ప జవాబిచ్చాడు. “మనం దాస్యబాధ అనుభవించాం. అంచేత స్వాతంత్ర్యం కోసం పరితపించాం. ఎలాగో దాన్ని సాధించాం. నవ్వుతూ, కేరుతూ ఆడుకుంటున్న ఆ పిల్లలకు దాస్య బాధ తెలియదు. అంచేత వాళ్ళు స్వాతంత్ర్యం విలువ గ్రహించగలరా అని సందేహం తోచింది” అన్నాడు. “ఈ సందేహం ఇంకా మిమ్మల్ని బాధిస్తున్నదా?” అని నే నడిగాను. “లేదు; అప్పుడే పోయింది” అంటూ ఆయన మందహాసం చేశాడు. తర్వాత చప్పున కుర్చీలోనుంచి లేచి, గదిలో పచారుచేస్తూ “మూడుసార్లు పంపకం జరిగినా పోలెండ్ నశించలేదు. మరి ముప్ఫయిసార్లు పంపకం జరిగినా అది నశించలేదు. అజేయమైంది నా పోలెండ్! అమరమైంది నా పోలెండ్!!” అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. మనుమడు : అయితే, తాతయ్యా! మా బడిలో... తాత (కొంచెం చికాకుగా) : ఊఁ! ఆ వెధవ వాగుడు మళ్ళీ నాకు చెప్పకు. మనుమడు : అదికాదు, తాతయ్యా! మార్షల్ చాలా గొప్పవాడే. దేశం కోసం చాలా త్యాగాలు చేశాడు. కాని, చండశాసనుడుగా పరిపాలించాడటగా? ప్రజాస్వామ్యాన్ని పీడించాడటగా! తాత : ఆఁ! తెలిసీ తెలియక ఏవో పేలుతూ వుంటారు? నెత్తిని ఆమాత్రం మొట్టకపోతే, అలకాజనం మాట వింటారూ? దెబ్బకే దెయ్యం జడిసేది. మనుమడు : అలకాజన మేమిటి, తాతయ్యా! నువ్వు, మా నాన్నా పోరాడింది ప్రజలకోసం కాదూ? మార్షల్ కోసమేనా? ఆయన జనరల్స్ కోసమేనా? తాత : నువ్వు పసివాడివిరా, బాబూ! ఈ పెద్ద విషయాలు నీకు తెలియవ్, పోలెండు సైనికశక్తిని కూర్చి, తూర్పు యూరప్ లో దాన్ని మహారాజ్యం చెయ్యాలని... విమానాల రొద. మనుమడు : అవిగో, తాతయ్యా! విమానాలు! (కిటికీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి) ఒకటి... రెండు... మూడు... నాలుగు... అయిదు... ఆరు... ఆరు విమానాలు, తాతయ్యా! (చెవులు చిల్లులు పడేటట్టు (విమానాలు దాటి వెళ్ళిపోతున్నట్టు క్రమంగా రొద తగ్గుతుంది. తాత : తప్పు, బాబూ! తప్పు!! విమానాలు దాడిచేస్తూండంగా కిటికీ వద్ద నిలబడరాదు. ఇలారా! ఆ కిటికీ మూసెయ్యి! మనుమడు (కిటికీ వద్దనే నిలబడి) : ఊరు మధ్యకు వెడుతున్నట్టున్నాయి, తాతయ్యా! ఉదయం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద చాలా బాంబుల్ని వేశాయట. ప్రాగా ఆసుపత్రి కూలిపోయిందట. మార్షల్ పాలెస్ బూడిదై పోయిందట. తాత : మార్షల్ పాలెస్ బూడిదైపోతే పోవచ్చు గాని, మార్షల్ సృష్టించిన పోలెండ్ బూడిద కాదు. బాబూ, బూడిద కాదు. (దగ్గుతూ) బూడిద కాదు, ముమ్మాటికీ! (మళ్ళీ విమానాల రొద. మనుమడు : అవిగో, తాతయ్యా! మళ్ళీ వస్తున్నాయి. (కిటికీ దగ్గరికి జరిగి) ఈసారి మూడు. (కొంచెం ఆగి) కాదు, తాతయ్యా! ఈసారికూడా మళ్ళీ ఆరు! (దూరానికి వెళ్ళిపోతున్నట్టు విమానాల రొద క్రమంగా తగ్గుతుంది. మనుమడు : తాతయ్యా! (దగ్గరికి వచ్చి) మరి, మానాన్న విమానం ఎక్కడున్నదో? తాత (విచారం ధ్వనిస్తున్న కంఠంతో) : ఏమో, తెలియదు, బాబూ! మనుమడు : తరచు వుత్తరాలు వ్రాస్తూ వుంటానని చెప్పాడు. ఒక్క వుత్తరమైనా వ్రాశాడు కాదు. తాత : ఎక్కడ తీరుతుంది, బాబూ? మనుమడు : ఒక్క వుత్తరమైనా రాలేదని కాబోలు అమ్మ చాలా బెంగగా వుంటున్నది, తాతయ్యా! నువ్వు ధైర్యం చెప్పకపోయావూ? ( తాత జవాబు చెప్పడు. తాత : ఏం లేదురా, బాబూ! ఏం లేదు (కొంచెం ఆగి) ఏమి టది వీధిలో గలభా? మనుమడు : ఏం, తాతయ్యా! జవాబు చెప్పవు? మనుమడు (కిటికీ దగ్గరికి చెక చెక వెళ్ళి) : జనం గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నారు తాతయ్యా! కొందరికి చేతులలో పెట్టెలున్నాయి. కొందరు ఉత్తి చేతులతోనే వెడుతున్నారు. కోటైనా లేదు కొందరికి, (కొంచెం ఆగి) అదేమిటి?... హెచ్చర్! గాయపడ్డ ముసిలివాణ్ణి స్ట్రెచర్ మీద ఎత్తుకు వెడుతున్నారు. (మరికొంచెం ఆగి) అబ్బబ్బ! ఘోరం! చేతికి దెబ్బతగిలింది. రక్తం కాల్వలు కడుతున్నది! అయినా, రెండో చేతితో అయిదేళ్ళ పిల్లను నడిపించుకు వెడుతున్నాడు. చెల్లాయి. కాబోలు! నా ఈడే వున్నట్టున్నది, తాతయ్యా! ఆ అబ్బాయికి పాపం! చెయ్యి పోయిందేమో! (ఉద్వేగంతో చలిస్తూ) అదిగో! ఇంకొక స్ట్రెచర్, దానివెనక ఇంకొకటి. (హారన్ల మోత) యాంబ్యులెన్సు కార్లు... ఒకటి... రెండు... మూడు... వాటినిండా గాయపడ్డవారే కాబోలు! (మరింత గొంతెత్తి) అబ్బబ్బ! దారుణం! అతి దారుణం, తాతయ్యా! దవడకు దవడ ఎగిరిపోయింది, ఆ అమ్మాయికి! పాపం! ఏడుస్తూ... తాత : రారా బాబూ! నీ విలా రా! కిటికీ దగ్గరి నుంచి కదిలి రా! మనుమడు (వినిపించుకోకుండా) : ఇంకా వస్తున్నారు, తాతయ్యా! ఇంకా వస్తున్నారు జనం! అదిగో! ముసిలిది! నడుంకూడా వంగిపోయింది. కాలికి నెత్తురుతో తడిసికట్టు! పాపం! అలాగే కుంటుకుంటూ, కుంటుకుంటూ... తాత (విసుగు, ఆందోళన మిళితమైన కంఠంతో) : ఇలారా బాబూ! కిటికీ మూసెయ్యి! మనుమడు : వస్తా, తాతయ్యా! వస్తా.... అబ్బబ్బ! ఇది మరీ ఘోరం... మూడేళ్ళ పిల్లవాడు... వొంటినిండా నెత్తురే! చచ్చిపోయాడు కాబోలు! మెడ వేలాడుతూ ఉంది. తల్లి బిడ్డను గుండెకు హత్తుకుని తాత : ఇవతలికి రమ్మనేది నిన్ను కాదటరా! (రెక్కపట్టుకు ఇవతలికి లాగి, కిటికీ మూసివేస్తాడు. మనుమడు : కిటికీని మూశావేగాని, నా కళ్ళనూ, చెవుల్నీ మూశావా తాతయ్యా! ఆ దారుణ దృశ్యాలు నా కళ్ళకు కట్టినట్టే వున్నాయి! ఆ దీనాలాపాలు నా చెవులలో మారుమోగుతూనే వున్నాయి. అదిగో! అది తెగిపోయిన చెయ్యి! అది మెడ వేలాడవేసిన బిడ్డ. అదిగో! అది ముసిలిదాని మూలుగు! అది పసిపిల్ల తల్లి ఏడుపు! తల్లి (గబగబ మేడమెట్లు దిగివచ్చి) : ఏమిటది, బాబూ! కేకలు వేస్తున్నా వేమిటి! తాత : ఏం లేదమ్మా! గాయపడి వెళ్ళుతున్నవారిని చూచి ఉద్రేకపడుతున్నాడు. తల్లి : ఔను! నాన్నా! అప్పుడే ముట్టడి ప్రారంభమైనట్టుంది. మనం చప్పున బయల్దేరి వెళ్ళాలి. నేను పెట్టి బేడా సర్దేశాను. (తండ్రివంక పరీక్షగా చూచి) మీ రింకా ప్రయాణం కాలేదేం నాన్నా? (కొడుకువంక తిరిగి) ప్రయాణంకమ్మని తాతతో చెప్పనే లేదా? మనుమడు : చెప్పానమ్మా! తాత : ఔనమ్మా! చెప్పాడు. కాని, నేను రాను. మీరు బయల్దేరి వెళ్ళండి. తల్లి : అదేమి మాట నాన్నా! మీరు రాకపోవడ మేమిటి? తాత : ముసిలివాణ్ణి. ఇవ్వాళ కాకపోతే రేపు నా ప్రాణం పోతుంది. ఎక్కడైతే నేమిటి చచ్చిపోవటానికి! నే నిక్కడే యిల్లు కనిపెట్టుకుంటాను. ఒంటరిదానివి - పిల్లవాణ్ణి ఎలా కాపాడతావో! వాణ్ణి వెయ్యికళ్ళతో సంరక్షించు. వెళ్ళమ్మా! వాణ్ణి వెంటబెట్టుకు త్వరగా వెళ్లు! మనుమడు : లేదు, తాతయ్యా! నేనూ వెళ్ళడం లేదు. తల్లి : } ఒకేసారిగా { ఆఁ! తాత : మనుమడు : ఔను. నేనూ వెళ్ళడం లేదు. తాత : తప్పు, బాబూ! అలా అనబోకు, కాటికి కాళ్ళు జాచినవాణ్ణి; నీకు నాతో వంతా? మనుమడు : వంతుకాదు, తాతయ్యా! తాత : మరి? మనుమడు : నా ధర్మం. తాత : అదేమిటి? మనుమడు : అదేమిటా? మార్షల్ ఎందుకు నిట్టూర్చాడు? కొత్త తరంవారు స్వాతంత్ర్యం విలువ గ్రహిస్తారో, లేదో అనేగా! అలాంటప్పుడు నేను పారిపోవడం తగునా? నువ్వే చెప్పు, తాతయ్యా? తాత : అదికాదు, బాబూ! నువ్వింకా చాలా చిన్నవాడివి. మనుమడు : నేను చాలా చిన్నవాడినైతే, నువ్వు చాలా పెద్దవాడివి. సైనికుడు కావడానికి ముసిలివాడేమిటి, పడుచువాడేమిటి అని ఇప్పుడేగా నువ్వన్నది. తల్లి : తల్లి : నా కిదంతా అయోమయంగా వుంది. పిల్లవాడికి మీరేం నూరిపోశారు? మనుమడు : ఏం లేదమ్మా! తాత నా కన్ను విప్పాడు. ఏమిటది, నాన్నా! వీడింత వింతగా మాట్టాడుతున్నాడు. వీడికి ఏం బోధచేశారు? (కన్నీరు పెడుతూ) నా ఒక్క కొడుకూ నా క్కాకుండా చేస్తారా? వీడినైనా చూచుకు నేను బ్రతుకుదా మనుకున్నాను. తాత (మనమడి దగ్గరికి వెళ్ళి భుజం నిమురుతూ) : బాబూ! నువ్వు మంకుపట్టు పట్టవద్దు. పెద్దవాణ్ణి, నా మాట... మనుమడు : తాతయ్యా! మార్షల్ బ్రతికున్నంతకాలం ఆయన సేవ చేశానన్నావు. ఆయన చచ్చిపోయాడుగదా అని ఇప్పుడు ఆయనకు ద్రోహం చేస్తావా? నీమాటల్ని వింటే, ఆయన ఆత్మ విలపించదూ? తాత (కన్నీరు కురుస్తున్న గొంతుతో) : లేదు, బాబూ! లేదు. ఆయనకు నేను ద్రోహం చెయ్యలేను. మనుమడు : అయితే నేను నీతోపాటే ఉండిపోతాను. తాత (విషాద గంభీర కంఠంతో) : సరే, బాబూ! వుండు. తల్లి : అదేం మాట, నాన్నా! నీకు మతిపోయిందా? నన్ను దిక్కులేని పక్షిని చేస్తావా? ఈ పాడు యుద్ధంలో భర్తపోనే పోయాడు. ఇక... మనుమడు : ఆఁ! ఆఁ! మానాన్న చచ్చిపోయాడా? (ఎవ్వరూ జవాబు చెప్పరు. మనుమడు (శోకోద్వేగంతో) : జవాబు చెప్పరేమి?... ఏమమ్మా! ఈ మాట నిజమా?... తాతయ్యా! నువ్వైనా చెప్పవూ? ఎందుకు నా దగ్గిర దాపరికం? చెప్పండి! చెప్పండి!! తాత : నిజమే, బాబూ! మనుమడు : నాన్న చచ్చిపోయాడు... నాజీ రాక్షసులకు బలి అయిపోయాడు... బలి... ఘోరబలి... నేను వెళ్ళను, తాతయ్యా! ఏమైనా సరే వెళ్ళను. వెళ్ళమని నువ్వూ అనలేవు. నాకు తెలుసు... వెళ్ళమనలేవు నువ్వు. తల్లి : అది అన్యాయం! ఘోరాన్యాయం!! భర్త పోనే పోయాడు. కొడుకునైనా నా క్కాకుండా చెయ్యవద్దు. వెళ్ళమని వాడితో చెప్పు. నాన్నా! (దగ్గరికి వెళ్ళి చేతుల్ని పట్టుకుని) నన్ను కనికరించు. మనుమడు : లేదమ్మా! తాతయ్య నోటివెంట ఆమాట రాదు. అమ్మ : నాన్నా! నీకు దణ్ణం పెడతాను. తాత (దుఃఖవివశుడౌతూ) : క్షమించు, తల్లీ! నన్ను క్షమించు దుఃఖంతో నాగుండె పగిలిపోతున్నది. కాని, ఆ మాటమాత్రం అనలేను. తల్లి (తండ్రి యెదట మోకరిల్లి) : నాకోసం అను, నాన్నా! నాకు పుత్రభిక్ష పెట్టు. తాత : క్షమించు, తల్లీ! అనలేను. తల్లి (చప్పున లేచి కోపావేశంతో) : అనలేవా? అనలేవా? కూతురునైన నాపై దయలేకపోతే పోయె - చచ్చి స్వర్గాన వున్న అల్లుడి పైనైనా నీకు దయలేదా, నాన్నా? ఆయనే ఇప్పుడుంటే, నిన్ను ఎంతగా అసహ్యించుకునేవాడో? - తాత : నన్ను అంటే అనుగాని, అతన్ని అలా అవమానించకు తల్లీ! అతడి హృదయం నాకు తెలుసు. నేనూ, అతడూ అనేక యుద్ధాలలో కలిసి పోరాడాము. అప్పటి కతడు ఇరవై ఏళ్ళవాడు. ఒకనాడు తీవ్రంగా గాయపడి, మరి ఆశ లేదన్న స్థితిలో ఆసుపత్రిలో వుండగా నేను వెళ్ళి “ఇంత చిన్నతనంలోనే నీకెంత అన్యాయం జరిగింది?” అన్నాను. అతడు “విచారించకండి. నా కేమీ చింతలేదు. నా పోలెండ్ కోసం నేను మరణిస్తున్నాను. నేను పోతే మాత్రమేమి? నా పోలెండ్ చిరస్థాయిగా ఉంటుంది” అన్నాడు. లేదు, తల్లీ! అతడు నన్ను అసహ్యించుకోడు. పైపెచ్చు మెచ్చుకుంటాడు, మనుమడు : తాతయ్యా! ఒకమాట చెబుతాను - నువ్వు కోప్పడనంటే. తాత : ఏమిటది, బాబూ? మనుమడు : నిన్ను చూచి నేను గర్వపడుతున్నా! తల్లి : అయ్యయ్యో! ఇది ఘోరం! ఘోరాతి ఘోరం! నన్ను అనాధను చేస్తారా? మనుమడు : అమ్మా! నీతోనూ ఒకమాట చెప్పాలి - నువ్వు మన్నిస్తే! తల్లి : ఏమిటది, బాబూ! తల్లి ,తాత.(ఒకేసారిగా): ఆఁ! తప్పు, నాయనా! అలా అనబోకు. మనుమడు : నిన్నుచూచి ఎంతో సిగ్గుపడుతున్నాను. మనుమడు : ఇలా అన్నందుకు క్షమించు, అమ్మా! కాని... తల్లి : నీవు పసివాడవు, బాబూ! నీకు స్త్రీ హృదయం లోతులు తెలియవ్. ఈ యుద్ధం ప్రారంభమైన నాటినుంచీ, నే నెంత బాధపడు తున్నానో నీ కెలా తెలియజెప్పడం! వారం రోజుల నాడు మన వార్సామీద విమానాలు బాంబులు వేస్తూవుంటే, నీవేమన్నావో జ్ఞాపకం తెచ్చుకో! “నాజీలు మన వార్సాను ధ్వంసం చేస్తున్నారు. మనం వాళ్ళ బర్లిన్ ధ్వంసం చెయ్యాలి. దానికి అదే ప్రతీకారం. అంతేకా దమ్మా!” అన్నావు. మనుమడు : ఔను. నేనలా అంటే, “నిజమే బాబూ?” అన్నావ్ నువ్వు. తల్లి : పైకి అలా అన్నప్పటికీ, లోపల నాకు ఎన్నో ఆలోచనలు పోయాయి. “నాజీ వైమానికుల దురాగతాల వల్ల ఇక్కడ ఎందరో తమ బిడ్డల్నీ, భర్తల్నీ, ఆప్తుల్నీ పోగొట్టుకుని విలపిస్తున్నారు. బర్లిన్ పై మనం బాంబుల్ని వేసివచ్చినా ఇంతేగా జరిగేది? పోలిష్ స్త్రీల దుఃఖమెంతో, జర్మన్ స్త్రీల దుఃఖమూ అంతేగా? యుద్ధం ఎంత ఘోర వ్యాపారం!” అని నేను అనుకుంటూ ఉండగానే ఉత్తరం వచ్చింది. దాన్ని చూడగానే ఎంచేతనో నా గుండెలో రాయి పడింది. “నాన్న దగ్గరినుంచేనా?” అని నువ్వన్నావు. మనుమడు : కాదని నువ్వు చెప్పావు. కాని, అది నాన్నదగ్గరి నుంచే వచ్చిందన్నమాట! తల్లి : కాదు, బాబూ! ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి. పైకి పట్టుకు వెళ్ళి, ఉత్తరాన్ని విప్పి చదువుకుందునుగదా... ఆ క్షణం నుంచీ నాకు జీవితంపై అసహ్యం పుట్టింది. అయితే, నిన్ను చూచుకుని నీకోసం - నీలో జీవించాలనుకున్నాను. ఒక్కసారి గట్టిగా విలపిస్తే హృదయభారం కొంత తగ్గేదేమో! కాని, నువ్వు ఈ దుర్వార్త ఎక్కడ తెలుసుకుంటావో నని నా దుఃఖాన్ని దిగమింగాను. ఈ వారం రోజుల నుంచీ... లాభం లేదు, బాబూ! చెప్పినా నీకిది అర్థం కాదు. మనుమడు : అర్థం కాకేం! అర్థమౌతూనే వున్నదమ్మా! కాని, నాన్న ఏ ఆదర్శం కోసం జీవించాడో, దేనికోసం మరణించాడో, దాన్ని మనం మర్చిపోవచ్చా? నాన్న బయల్దేరి వెడుతుంటే, నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నావు. అప్పుడు నాన్న కన్ను కూడా చెమ్మగిలింది గాని, దానిలో గొప్ప వెలుగు కనబడింది. అప్పుడు దాన్ని నేను అర్ధం చేసుకోలేక పోయాను. కాని, తాత మాటల్ని విన్నమీదట “నేనుపోతే మాత్రమే? నా పోలెండ్ చిరస్థాయిగా వుంటుంది” అని నాన్న ఆ క్షణంలో అనుకుంటూ వున్నాడని తెలిసింది. నాన్న ధైర్యాన్ని, త్యాగాన్ని మార్షల్ పిల్సుడ్ స్కీ జీవించివుంటే ఎంతగా... అమ్మ : పిల్సుడ్ స్కీ... పిల్సుడ్ స్కీ... రాత్రింబవళ్ళు పిల్సుడ్ స్కీ సంస్మరణే! దీనితోనే నా బ్రతుకంతా వెళ్ళమారిపోతున్నది. కూతురుగా నేను తండ్రి ప్రేమకు నోచుకోలేదు; భార్యగా భర్త ప్రేమకు నోచుకోలేదు. వారి హృదయాలలో పిల్సుడ్ స్కీకే గాని, నాకు స్థానం లేకపోయింది. చివరికి కొడుకు ప్రేమనైనా పొందలేక పోతానా అనుకుంటే, వాడి మతినికూడా విరిచేశారు (తండ్రివైపు తిరిగి) నాకెంత అన్యాయం చేశావ్, నాన్నా! తాత : పిల్సుడ్ స్కీని ఒక వ్యక్తి అనుకుని నువ్వు పొరపడుతున్నావమ్మా! ఆయన ఒక భావం; ఒక లక్ష్యం; ఒక ఉద్యమం. ఆయన ఒక విప్లవం; ఒక వెల్లువ. పోలెండ్ ఆయనలో మూర్తీభవించింది. మేము ఆయన్ని ప్రేమించామంటే పోలెండ్ ను ప్రేమించామన్న మాట. ఆయనను స్తుతించామంటే పోలెండ్ ను స్తుతించా మన్నమాట. ఇది నీకు అర్థం కాదేమోగాని, పురుషులమైన మేము దేశదాస్యాన్ని సహించలేమమ్మా! అది మా వ్యక్తిత్వానికే అవమానం; మా జీవితానికే అపవాదు. దాస్య జీవనం కంటె మరణమే మాకు మేలుగా కనిపిస్తుంది. తల్లి : కాని, నామాటేమిటి నాన్నా? (జవాబు చెప్పక పోవడాన్ని చూచి) ఏమి, నాన్నా! , జవాబుచెప్పవు? తాత : నే నేమి జవాబు చెప్పగలనమ్మా? (తర్వాత ఒక క్షణం అంతా ప్రశాంతం. అంతలో ఆ గంభీర ప్రశాంతిని చీల్చుకుని 'స్విష్' 'స్విష్' అంటూ వరసతప్పని వికృతధ్వని. సమీపంలో మార్చ్ చేస్తున్న నాజీ సోల్జర్ల బూట్లు చేస్తున్న ధ్వనే అది. నెమ్మదిగా ప్రారంభమై, క్రమంగా అది హెచ్చుతుంది. తాత : అదుగో నమ్మా! నీ ప్రశ్నకు అదే జవాబు! నాజీ రాక్షసి తన ఇనపపాదాల కింద మన పోలెండ్ స్వతంత్ర రాజ్యాన్ని రాచెయ్యాలని చూస్తున్నది. దీన్ని నువ్వు సహించగలవా? సహించ వచ్చా? (“స్విష్”, “స్విష్” ధ్వని మరీ దగ్గరగా వస్తుంది; మరీ భయంకర మౌతుంది. ఆ ధ్వనిని మించి కూడా హాండ్ గ్రెనేడ్స్ ప్రేలుడు, భయారుల ఆక్రందనాలు వినబడతాయి. తల్లి చప్పున కొడుకు దగ్గరికి జరిగి, అతణ్ణి కౌగిలించుకుంటుంది. తల్లి : అబ్బ! ఏం ఘోరమిది! తాత : ఔనమ్మా! ఘోరమే! అయితే, ఇది మన పోలెండ్ కు కొత్త కాదు. ఈ నాజీల తలదన్నినవారు మన దేశాన్ని దాస్యబద్ధం చెయ్యాలనుకున్నారు; దాని ఆత్మను నశింపజెయ్యాలనుకున్నారు. కాని, నీ భర్త, నీ కుమారుడు లాంటి వారిని కన్నదేశం చచ్చిపోతుందా? పోదు! ఈ ప్రళయం తర్వాత పోలెండ్ పునర్జన్మ నెత్తుతుంది. ("స్విష్", "స్విష్" ధ్వని అంతకంతకూ దూరమై, అసలే వినబడకుండా పోతుంది) కాని, నా స్థితిని చూచుకుంటే నాకే సిగ్గూ, నా విచారమూ కలుగుతున్నది. నా దేశానికి ఘోర సంకటం తటస్థించిన ఈ సందర్భంలో దాని రక్షణకు నిలబడ్డానికి నాకు యవ్వనం లేకపోయింది. నే నెంత దౌర్భాగ్యుణ్ణి! (తాత కళ్లనుంచి కన్నీరు కాల్వలు కడుతుంది. తల్లి : అదేమి, నాన్నా! కంట తడి పెడుతున్నారు. నాకుమాత్రం మన దేశంపైన అభిమానం లేదూ? కన్నకడుపు కాబట్టి, ఈ పసివాడి విషయమై దిగులుపడుతున్నా గాని... మనుమడు : నా విషయమై మాత్రం నీకు దిగులు దేనికమ్మా? నేనూ, నావంటివారూ సుఖంగా, గౌరవంగా, జీవించడానికి తగిన స్వతంత్ర పోలెండ్ రాజ్యాన్ని కాపాడ్డానికే గదా నాన్న ఆత్మార్పణ చేసింది. దీనికోసమే గదా తాత ఇంత పెద్దతనంలో కూడా తుపాకి పట్టబోతున్నది!! మాకోసమై జరుగుతున్న ఈ ప్రయత్నంలో నేను పాల్గొనవద్దా? తల్లి : నిజమే, బాబూ? కాని... మనుమడు : కాని, గీని అని ఇంకా సంకోచం దేనికమ్మా? (ఇంతలో తిరిగి విమానాల రొద, ఆ రొదను మించేలా అతడు గొంతెత్తుతాడు) తాత ద్వారా నువ్వు వీరపుత్రికవైనావు. నాన్నద్వారా వీరపత్నివైనావు. ఇక, నా ద్వారా వీరమాతవుకా గోరతావా, లేదా? తల్లి : తప్పక కోరతాను, బాబూ? మనుమడు : అయితే, అమ్మా! మాతో చేరి విజయధ్వానం చెయ్యి. తాత:తల్లి : మనుమడు: ఒకేసారిగా పోలెండు జై! "పోలెండ్ కు జై”. (ముమ్మారు అంటారు. తర్వాత తాత బీరువాలో నుంచి తుపాకి గుళ్లు తెచ్చి, రైఫుల్ లోడ్ చేసి, వీధితల కిటికీలలో ఒక దాని వద్దకు వెళ్ళి, వీధి వెంట మార్చ్ చేస్తున్న నాజీ దళంపై వణకుతున్న చేతులతో కాలుస్తాడు. వెంటనే రవై, ముఫ్ఫై రైఫుల్స్, కొన్ని హాండ్ గ్రెనేడ్స్ వీధిలోనుంచి జవాబు చెబుతాయి. గది పొగలు కమ్ముకుపోతుంది. ఆ పొగలు కాస్త తగ్గే సరికి తాత చచ్చి పడివుంటాడు. తల్లి వెంటనే భయవిభ్రమాలతో తాత పక్కన మోకరిలుతుంది. తాత చేతిలోని తుపాకి తీసుకుని, కిటికీ వద్ద నిలబడి మనుమడు దాన్ని ఎక్కుపెడుతుండగా ...తెర గమనిక : ఈ నాటికను రెండవ ముద్రణలో తొలగించారు.