ఆ భా 1 7 31 to 1 7 60

Wikibooks నుండి

కందము:

అడుగకయు విప్రవరులకు
నడరఁగ నద్దేశమున గృహస్థులు భక్తిం
గుడువఁగఁ బెట్టుదు రెప్పుడుఁ
గడుహృద్యము లయిన మోదకంబులతోడన్.  

1-7-32
వచనము:
అందులకుం బోవుద మనినం గొడుకులెల్ల వల్లె యని మీపంచినవిధంబ
చేయంగలవార మని యొడంబడి తమయున్న యింటి బ్రాహ్మణునకుం జెప్పి 
వీడ్కొని. 

-: పాండవులు ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట:-

1_7_33
చంపకమాల:
ఉరుసరసీవనంబులు మహో గ్రనగంబులు నేఱులున్ సుదు
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్ నిరం
తరగతి నేఁగుచుం గనిరి ధర్మసమేతుఁ బితామహుం దమో
హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రుఁ బరాశరాత్మజున్. 

1_7_34
కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందఱు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారసపూరితాంతఃకరణుం డయి వ్యాసభట్టారకుం డిట్లనియె. 

కందము:
ధర్మసుతుఁ డున్నచోటను
ధర్మువునకు హాని గలదె ధారుణినైనన్
ధర్మువ తాత్పర్యముగా
నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 

1_7_36
సీసము: 
తా నొక్కమునికన్య దనకర్మవశమునఁ
	బతిఁ బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన 
	దానికి శివుఁడు ప్రత్యక్ష మయ్యు 
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన 
	మని యేనుమాఱు లయ్యబల వేఁడె
నట్లేని నీకు దేహాంతరంబునఁ బతు
	లగుదు రేవురు పరమార్థ మనియు 

ఆటవెలది:
హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల
పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం
వరము సేయుచున్నవాఁడు నేఁడు. 

1_7_37
వచనము:
మీరు ద్రుపదుపురంబునకుం జక్క నరుగునది యందు మీకు ల గ్గగు నని 
చెప్పి కృష్ణద్వైపాయనుం డరిగినఁ బాండునందనులు జననీసహితం బనవర 
తంబు రాత్రులుం బగళ్ళును బయనంబు బోవువా రొక్కనాఁ డర్థరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్నానార్థు లై యర్జునుండు ప్రకాశార్థంబును రక్షణార్థంబునుం గా నొక్కకొఱవి సేతఁ బట్టుకొని ముందఱం బోవ నందఱు నరుగునెడ నంగారపర్ణుఁ డను గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రొద్దు జలక్రీడార్థంబు వచ్చినవాఁ డప్పాండవుల పాదధ్వని విని యలిగి విల్లు గొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. 

1_7_38
కందము:
ఇల నర్థరాత్రమును సం 
ధ్యులు రెండును భూతయక్షదానవ గంధ
ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు 
వెలయఁగ నిం దవనిచరులు వెఱతురు నడవన్. 

-:అర్జునుఁ డంగారపర్ణుని జయించుట:-
సం: 1_158_9
వచనము:
ఇవ్వేళలయందుఁ గ్రుమ్మరియెడువారి నెంతబలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము నన్ను డాయకుం డెడగలిగి పొం డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ గుబేరుసఖుండ నెప్పుడు నిందు విహరించుచుండుదు నన్నెఱుంగరె యివ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులునా జగద్విదితంబులు దీని మానవులు సొరనోడుదు రనిన వాని కర్జునుం డి ట్లనియె. 

1_7_40
కందము: 
నడురేయి సంధ్యలందును 
నడ్వఁగ నోడుదు రశక్తనరు లొరులు భయం
పడుదుమె యే మెయ్యెడ నె
ప్పుడు నడతుమ యధికశక్తిపురుషుల మగుటన్. 

1_7_41
కందము:
అడవులు నేఱులు నివి నీ
పడసినయవి యట్టె పుణ్యభాగీరథి యి
ప్పుడమిఁ యట్టె పుణ్యభాగీరథి యి
ప్పుడమిఁ గలజనులకెల్లను 
నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే. 

1_7_42
సీసము: 
హైమవతోత్తుంగహేమశృంగంబున
	నుండి భూమికి వచ్చి యుదధి గూడె 
గంగనా మూఁడుదెఱంగుల నదియు మం
	దాకిని నాసత్పథంబునందు
సురసిద్ధమునివియచ్చరసేవ్య యయ్యె న
	య్యధమలోకంబునయందు భోగ
వతి యన నొప్పె నున్నతి నిట్లు త్రిభువన
	పావని యైన యిప్పరమమూర్తి 

ఆటవెలది:
బార్వతీశమకుటబంధబంధురతరా
వాస గంగ నాడ వచ్చి నీవు 
వలవ దనిన నుడుగువారము గాము నీ
విఘ్నవచనములకు వెఱతు మెట్లు. 

1_7_43
వచనము: 
అనుచు నిజజననీభాతృసహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు నయ్యర్జునుపయి నంగారపర్ణుం డతినిశితసాయకంబు లేసిన నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిల్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచికొని వానికి ట్లనియె. 

1_7_44:

ఆటవెలది:
వెడఁగ యిట్టిపాటి వెఱపించుటలును మా
యలును నేమి సేయు నస్త్ర విదులఁ 
బెక్కు లయ్యు నీబిభీషికల్ నుఱువులు 
విరియునట్టు లిందు విరియుఁ జూవె. 

1_7_45
అగ్ని దేవుండు బృహస్పతి కిచ్చె ము
	న్నతఁడు భరద్వాజుఁ డనఁగఁ బరగు 
ముని కిచె నమ్మహాముని భార్గవున కిచ్చె
	భార్గవుండును గుంభభవున కిచ్చె
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని
	య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర
గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ
	దద్రథం బప్పడ దగ్ధ మయిన 

ఆటవెలది:
నగ్నిదాహభీతి నంగారపర్ణుండు 
బమ్మరిల్లి నేలబడిన వానిఁ
గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు
కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి. 

1_7_46
కందము:
వానిమనోవల్లభ కుం
భీనసి యనునది గరంబుభీతి నశేషో
ర్వీనాథులార దయఁ పతి
దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్. 


1_7_47
కందము:
అని యఱచుచున్న దానికి 
ననఘుఁడు గరుణించి పాండవాగ్రజుఁ డయ్య
ర్జునుఁ జూచి వీని విడువుమ
యని నోడినవాని హీను నపగతశౌర్యున్. 

1_7_48
ఆటవెలది:

అనిన నరుఁడు వల్లె యని వాని కనియె గం
ధర్వ నిన్నుఁ గరుణ ధర్మరాజు
కురుకులేశ్వరుండు శరణశరణ్యుండు
విడువఁ బనిచె నింక వెఱవకుండు. 

వచనము:
అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుం డై యర్జునున కంగారపర్ణుండి ట్లనియె. 

:- అంగారపర్ణుం డర్జునితో సఖ్యము సేయుట:-
సం: 1_158_35
మత్తేభము:
అని నీచేతఁ బరాజితుండ నయి నాయంగారపర్ణత్వ మిం 
కను దాల్పన్ మది నంత నిర్లజుఁడనే గర్వం బడంగన్ రణం 
బున ము న్నోడియుఁ బూర్వనామనునఁ బెంపున్ గర్వముం దాల్చువాఁ
డనఘా సత్సభలందు మెచ్చబడునే హాసాస్పదీభూతుఁ డై. 

వచనము: 
నీయాగ్నేయాస్త్రంబున దగ్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేకరత్న విచిత్రితం బైన రథంబు వడసి యిదు మొదలుగాఁ జిత్రరథుండ నయ్యెద నీ పరాక్రమంబునకు మెచ్చితి నీతోడిసఖ్యంబు నాకభిమతం బయినది నాతపంబునం బడయంబడిన చాక్షుషి యనువిద్య నీ కిచ్చెద దీనిం దొల్లి మనువు వలన సోముండు వడసె సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె నాతనివలన నేను బడసితి నెవ్వండేని మూఁడులోకంబులుం జూడనిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వంబునుం జూచు నేము దీననచేసి కాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపబడక జీవించెద మిది కాపురుషప్రాప్తం బై ఫలియింపదు. నీవు తాపత్యవంశవర్థనుండవు మహాపురుషుండవు నీకు సఫలం బగు నీదివ్యవిద్య గొను మిచ్చెద దీనిఁగొనునుప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు నీవు నాకు నాగ్నేయాస్త్రంబిచ్చునది మఱి మహాజవస్త్త్వంబులుఁ గామగమనంబులు నయిన గంధర్వ హయంబులు మీకేవురకుం బెఱు నూఱేసి యిచ్చెద. 

సీసము: 
వృత్రుపై గీర్వాణవిభు డల్గి వజ్రంబు 
	వైచిన నది వాని వజ్రకఠిన
పటుమ స్తకంబునఁ బడి పాతరయమునఁ
	బదివ్రయ్య లైనఁ దద్భాగచయము
క్రమమున బ్రాహ్మణక్షత్త్రవిట్ఛూద్రుల
	యందు వేదంబులు నాయుధములు 
హలము శుశ్రూషయు నయ్యె వజ్రంబులు 
	వాహంబులందు జవంబు నయ్యె

తేటగీతి:
నట్టిజవమున నభిమతం బగుచు నున్న
యట్టి హయసమూహం బయ్యె యవనిపతుల
కఖిలభువనముల్ రక్షించునపుడు సకల
సాధనములలో నుత్తమసాధనంబు. 

వచనము: 
అనిన వాని కర్జునుం డిట్లనియె. 

1_7_54
ఆటవెలది:
ఎంతమిత్రు లైన నెన్నండు నొరులచే
విద్యయును జయంబు విత్తచయము
గొనఁగ నొల్ల నాకుఁ గూర్తేని యనలాస్త్ర
మనఘ నీవు గొనుము హయము లిమ్ము. 

1_7_55
వచనము: 
నీతోడ సఖ్యంబుఁ జేసెద మఱి మమ్ముఁ బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమికారణంబున నుదరిపలికి తనిన గంధర్వుం డి ట్లనియె. 

కందము: 
విమలము లయి లోకత్రిత
యమునఁ బ్రవత్రిల్లు మీమహాగుణములు ని
త్యము విందు నారదప్రము
ఖమునీశ్వరసిద్ధసాధ్యగణములవలనన్. 

1_7_57
కందము: 
మేరునగోత్తంస మహీ
భారదురంధరుల మిమ్ముఁ బాండవుల గుణో
దారుల ధీరుల నెఱుఁగని 
వా రెవ్వరుఁ గలరె భరతవంశోత్తములన్. 

వచనము: 
ఏను మిమ్ము నెఱింగియు మీకు నగ్నిపరిగ్రహంబును బ్రాహ్మణసంగ్రహంబును లేమిం జేసి పరుసంబులు పలికితి మఱియును. 

1_7_59
ఉత్పలమాల:
ఇంతులగోష్టి నున్నయతఁ డెంతవివేకము గల్గెనేని య
త్యంతమదాభిభూతుఁ డగు ధర్మువు దప్పు బ్రియం బెఱుంగఁ డే
నెంత వివేకినయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్
వింతయె కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్. 

కందము: 
సురగరుడవిషోరగయ
క్షరాక్షసపిశాచభూతగంధర్వులు నో
పరు ధిక్కరింప బ్రాహ్మణ
పురస్కృతులఁ బుణ్యమతుల భూతలపతులన్. 



"https://te.wikibooks.org/w/index.php?title=ఆ_భా_1_7_31_to_1_7_60&oldid=2542" నుండి వెలికితీశారు