ఆ భా 1-7-1 To 1-7-30
స్వరూపం
శ్రీ మదాంధ్ర మహాభారతము ఆదిపరవము-సప్తమాశ్వాసము 1-7-1 శ్రీరాజరాజ వీర శ్రీరమణీరమ్యగంధసింధురహయశి క్షారూఢిదక్ష దక్షమ ఖారిదయాలబ్ధసుస్థిరైశ్వర్యపదా. 1-7-2 -:ధృష్టద్యుమ్నద్రౌపదుల యుత్పత్తివృత్తాంతము:- సం. 1_153_1 1-7-1 వచనము: అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు పాండవులు విప్రవేషం బున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదుపురంబుననుండి చను దెంచి విశ్రమార్థి యైన నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతఁ గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతి ప్రీతి నుపాసించి యయ్యా మీర లెందుండి వచ్చితి రేదేశంబులు రమ్యంబు లెందులరాజులు గుణవంతు లని యడిగిన నవ్విప్రుండిట్లనియె. 1-7-3 చంపకమాల: సొలయక యెల్ల దేశములుఁ జూచితి నందుఁ బ్రసిద్దు లైన రా జుల సుచరిత్రసంపదలుఁ జూచితి నా ద్రుపదేశుదేశముం బొలుపున నొండు దేశములు పోల్పఁగ నెవ్వియు లేవు సద్గుణం బులఁ బరు లెవ్వరున్ ద్రుపదుఁ బోలఁగలేరు ధరాతలంబునన్. 1-7-4 వచనము: ఆ ద్రుపదుండు దనకూఁతు నగ్నికుండసముద్భవ యైన దాని నయోనిజ నగణ్య పుణ్యలావణ్యగుణసమన్విత సమరూపుఁ డైన రాజపుత్త్రునకు వివాహంబు సేయంగానక స్వయంవరంబు రచియించుచున్నవాఁ డనినం గుంతియు ధర్మ తనయుండును విస్మితు లై యది యేమి కారణంబున నయోనిజ యయ్యె నక్కన్య నెవ్విధంబున ద్రుపదుండు వడసె దీని సవిస్తరంబుగాఁ జెప్పు మనిన నవ్విప్రుండు వారలకి ట్లనియె. 1-7-5 సీసము: ఆదిభరద్వాజుఁ డను మునికలశంబు నం దుర్భవించిన యనఘమూర్తి ద్రోణుండు మఱి పృషతున కుద్భవించిన ద్రుపదుండు నొక్కటఁ దొడఁగి యిష్ట సఖులయి వేదముల్ సదివి ధనుర్వేద మగ్ని వేశులతోడ నర్థిఁ గఱచి చని ద్రుపదుండు పాంచాలభూములకు రా జైన భారద్వాజుఁ డతనికడకు ఆటవెలది: నరిగి వానిచేత నవమానితుం డయి హస్తిపురికి వచ్చి యఖిలకురుకు మారవరుల నెల్ల మానుగా శస్త్రకో విదులఁ జేసె లోకవిదితయశుఁడు. 1-7-6 వచనము: ఇట్లు దనవలన విలువిద్య గఱచిన పాండవకౌరవకుమారులం జూచి ద్రోణుండు నా కవమానంబు సేసిన యప్పాంచాలు నోడించి పట్టికొని తెం డిదియ నాకు గురుదక్షిణ యగు నని పంచిన వల్లె యని యందఱు నా ద్రుపదుపయిం బోయి వానిచేత నిర్జితు లయిన నర్జునుండు ద్రుపదుతోడ మహాయుద్ధంబు సేసి వానిం బట్టికొని వచ్చి ద్రోణున కొప్పించిన నతండును. 1-7-7 ఆటవెలది: ఉల్లసంబు లాడి యోడకు పొ మ్మని ద్రుపదు విడిచిపుచ్చె ద్రోణుచేత నట్లు విడువఁబడి తదవమానతప్తుఁ డై పృషతనందనుండు పెద్దయలిగి. 1-7-8 వచనము: రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును నర్జునునకు దేవి యగునట్టి కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాఁడు గంగాకూలంబు నందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజులనువారి నిద్దఱ ననవరత వ్రతవ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి యందుఁ గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్ద యైనవాని నుపయాజు నుపాసించి యి ట్లనియె. 1-7-9 కందము: మునినాథ నాకు సత్సుత జననం బగునట్టిక్రతువు సద్విధిఁ గావిం చినఁ గృతకృత్యుఁడ నగుదుం గొను మిచ్చెద నీకు లక్షగోధేనువులన్. 1-7-10 వచనము: అనిన నుపయాజుం డే నిట్టిఫలంబు న పేక్షించ నెవ్వరేని ఫలార్థు లగుదు రందుల కేఁగు మనిన ద్రుపదుండు వెండియు వానిన యొక్కసంవత్సరం బారాధించిన నమ్ముని వాని కి ట్లనియె. 1-7-11 తేటగీతి: అనఘచరితుఁడు మాయన్న వనములోనఁ జనుచు నొక్కనాఁ డొక్కపం డొనరఁ గాంచి కొనియె శుచి యగు శుచియుఁ గా దని యెఱుంగఁ బడని భూమితలంబుపైఁ బడినదాని. 1-7-12 వచనము: ఫలార్థి యయినవాఁడు తత్ఫలానుబంధంబు లయినదోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ కభిమతంబు సేయుం బొ మ్మనిన ద్రుపదుం డరిగి సంగితాధ్యయనాదిపంచమహాయజ్ఞంబులు సేయుచు శిలోంఛవృత్తి భైక్ష సంపాదితకుటుంబభారుం డై ఘోరతపోవృత్తి నున్న యాజుం గని నమ స్కరించి యిట్లనియె. 1-7-13 కందము: మునినాథ నాకు సత్సుత జననం బగునట్టి క్రతువు సద్విధిఁ గావిం చినఁ గృతకృత్యుఁడ నగుదుం గొను మిచ్చెద నీకు లక్షగోధేనువులన్. 1-7-14 వచనము: అని ప్రార్థించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. 1-7-15 కందము: భారతవంశాచార్యుఁడు భారద్వాజుండు నా కపాయము సేశెన్ ఘోరాజి నతని నోర్చున పారపరాక్రము సుపుత్త్రుఁ బడయఁగవలయున్. 1-7-16 కందము: షడరత్ని ధనుర్ధరుఁ డె య్యెడ నజితుఁడు గాన వాని హీనుంగాఁ జే యుఁడు నాకుఁ జతుర్వర్గము వడయుట యని పృషతసుతుఁడు ప్రార్థించె మునిన్. 1-7-17 వచనము: అయ్యాజుండును యాజకత్వంబున కొడంబడి నీకోర్కికిం దగిన యట్టి కొడు కునుం గూఁతురు బుట్టుదు రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమ కట్టికొని యథావిధి నుపయాజుండు సహాయుండుగా సౌత్రామణి యయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన నందు మంత్రాహుతు లం దృప్తుం డయిన యగ్నిదేవువలన. 1-7-18 కందము: జ్వాలాభీలాంగుఁడు కర వాలబృహబ్చాపధరుఁడు వరవర్మకిరీ టాలంకారుఁడు వహ్నియు పోలె రథారూఢుఁ డొక్కపుత్త్రుఁడు పుట్టెన్. 1-7-19 వచనము: మఱియు. 1-7-20 తరలము: కులపవిత్రసితేతరోత్పలకోమలామలవర్ణయు త్పలసుగంధి లసన్మహోత్పలపత్త్రనేత్ర యరాళకుం తలవిభాసిని దివ్యతేజముఁ దాల్చి యొక్కకుమారి ద జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్. 1-7-21 వచనము: ఇట్లు పుట్టినయక్కొడుకునకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు ననునామంబు లాకాశవాణి జనవిదితంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధసంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్తదక్షిణ లిచ్చి బ్రాహ్మణు లం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత నక్కన్య యిపుడు వివాహసమయప్రాప్త యయిన. -: ద్రౌపదీవివాహప్రయత్నము:- అమూలము. 1-7-22 ఉత్పలమాల: మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా నానరనాయకుండు విని యాతతశోకమహానలజ్వల న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహితవిప్రసన్నిధిన్. 1-7-23 వచనము: మఱియును. 1-7-24 సీసము: ఇంద్రసమానున కిందీవరశ్యామ సుందరాంగున కింద్రనందనునకు దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁగాంచితి నని యున్నచో విధాతృనకు నిట్లు పాడియె విఘ్న మాపాదింప నమ్మహా ధ్వరమునఁ బుట్టినసరసిజాక్షి నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ పరవశుఁ డయి యున్న ధరణిపతికిఁ ఆటవెలది: దత్పురోహితుండు దా నిట్టు లనియె న ప్పాండవులను గుఱించి బహువిధంబు లగు నిమిత్తములు నయంబునఁ జూచితి నెగ్గు లేదు వారి కెల్ల లగ్గు. 1-7-25 వచనము: తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన నతని గానక శచీదేవి శోకింపంబోయిన సుప్రశ్రుతింజేసి బృహస్పతి దానికి దేవేంద్రా గమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం గావున నేను నుపశ్రుతిం జూచితి నిది దప్పదు పాండవులు పరలోకగతులు గారు పరమానందంబున నున్నవారు వార లెందుండియు నిందులకు వత్తురు నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం బనినం బురోహితువచనంబునం జేసి యూఱడి ద్రుప దుండు నేఁటికి డెబ్బదియే నగు దివసంబునం బౌషమాసంబున శుక్ల పక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి. 1-7-26 కందం: ఎవ్వరికిని మోపెట్టను దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్ దవ్వై దివమునఁ దిరిగెడు నవ్విలసత్కనకమత్స్యయంత్రముఁ జేసెన్. 1-7-27 కందము: ధరణిఁ గలరాజులెల్లను బురుడునఁ గాంపిల్యనగరమున కరిగెద రొం డొరులం గడవఁగ నని భూ సురవరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథ యెల్లన్. 1-7-28 వచనము: దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యిట్లనియె. -: పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట:- సం. 1_156_2 1-7-29 కందము: కడుఁ బెద్దకాల ముండితి మొడఁబడి యిం దెంతకాల మున్నను మన క య్యెడులాభ మేమి మఱి యె ప్పుడు నుచితమె యొరులయిండ్లపొత్తున నుండన్. 1-7-30 వచనము: దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును బాంచాలపతి పరమధార్మికుం డనియుని వింటిమి మఱి యత్లుంగాక.