అడివి బాపిరాజు రచనలు/నారాయణరావు

Wikibooks నుండి

నారాయణరావు తెలుగు నవలను ప్రముఖ సంగీతవేత్త, సాహిత్యకారుడు, చిత్రకారుడు అడవి బాపిరాజు రచించారు. 1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైంది.

ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణ రైతు కుటుంబం యువకుడు నారాయణరావు కథ ఇది. మద్రాసులో న్యాయవిద్యార్థిగా ఉన్న నారాయణరావు స్నేహితులతో కలిసి తన స్వగ్రామం కొత్తపేటకు రైల్లో వెళ్తుండగా నవల ప్రారంభమవుతుంది. విశ్వలాపురం జమీందారు, జస్టిస్ పార్టీ సభ్యుడు లక్ష్మీ సుందర ప్రసాదరావు తన మొదటి కుమార్తెకు జమీందారీ వివాహం చేసి దెబ్బతిని ఉండడంతో సామాన్యుడైన, యోగ్యుడైన వరుణ్ణి అన్వేషణ చేస్తూండగా నారాయణరావు కనిపిస్తాడు. నారాయణరావు, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనకు తన చిన్న కూతురు శారదను ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటాడు. శారదకు ఇంట్లోనే సంగీతంతోపాటుగా చదువు కూడా చెప్పిస్తూంటారు. ఆమెను జమీందారీ కుటుంబం నుంచి అందునా తన మేనల్లుడు జగన్మోహనరావు ఇచ్చి పెళ్ళి చేయాలని తల్లి కామేశ్వరీ దేవి భావించడంతో ఈ సంబంధం ఆమెకు నచ్చదు. తండ్రికి మాత్రం జగన్మోహనుని ప్రవర్తన నచ్చక అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయడం ఇష్టం ఉండదు. ఐనా తల్లి చెప్పినదే సరైనదని అనిపించినా శారద తండ్రి మాట ఎదురాడలేక ఈ పెళ్ళికి అంగీకరిస్తుంది. నారాయణరావు తండ్రి సుబ్బారాయుడిని ఒప్పించి జమీందారు పెళ్ళి చేస్తారు. ఐనా తల్లి వల్ల ముందుగా తనలో ఏర్పడ్డ వ్యతిరేకత వల్ల నారాయణరావుతో సంసారం సజావుగా సాగించలేక పోతుంది శారద. ఆత్మగౌరవంతో ఈ విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడు నారాయణరావు. చివరకు ఆ సంసారం ఏమైందన్నది కథలో మిగిలిన భాగం.