Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/slokam

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

ప్రారంభశ్లోకం

[మార్చు]
బ్రహ్మగ్రంధిజమారుతానుగతినాంచిత్తేనహృత్పంకజే
సూరీణామనురంజకశ్రుతిపదంయోయంస్వయంరాజితే
యస్మాద్గ్రామవర్ణరచనాలంకారజాతిక్రమో
వందేనాదతనుంతముద్దురజగద్గీతంముదేశంకరం

ఇది ప్రారంభశ్లోకం.

మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని అనేది కావ్యలక్షణంగా పూర్వకావ్యాలలో చెప్పబడింది. దీనిని పూర్వకవులందరూ పాటించారు. ఏగ్రంధంలోనైనా మొదట మంగళంగా దైవప్రార్ధన చేయబడుతుంది. సంగీత రత్నాకరాన్ని రచించిన శార్జ్ఞదేవుడు కూడా ఆ సంప్రదాయంలో తాను రచించే గ్రంధంలోని విషయాన్ని సమాసోక్తి అనే అలంకారం ద్వారా సూచించారని అనువాద కర్త శ్రీరామమూర్తిగారి అభిప్రాయం . ప్రస్తుత విషయాన్ని వాచ్యంగానూ చెప్పవలసిన విషయాన్ని వ్యంగ్యార్ధంలోనూ రెండు అర్థాలను సమన్వయం చేస్తూ ఈ శ్లోకం చెప్పబడింది. మొదటి అర్థం శంకరుని పరమమైనది. బ్రహ్మ విష్ణువులకు సమానుడై వారి మధ్య పిల్లతెమ్మెర వలె నిండి సూర్యుని వలె ఏ దేవుడు స్వయంప్రకాశమానుడగుచున్నాడో ఏ దేవుని వలన వర్ణములు జాతులు మొదలయిన విభాగములన్నీ క్రమ పధ్దతిలో జరుగుచున్నవో ఆ నాద స్వరూపుడయిన శంకరునికి నమస్కరిస్తున్నాను.

రెండవ అర్థం సంగీత శాస్త్ర పరమైనది. బ్రహ్మగ్రంధి అనేది నాభిస్థానం. ఓంకారానికి , ప్రణవనాదానికీ పుట్టుక. సంగీతపరంగా శృతి మంద్రస్థాయిలో అక్కడే మొదలవుతుంది. హృదయపద్మం వద్ద విప్పారి వికసించిన నాదం తనకు తానుగా స్వయంభువై కంఠం నుంచి బయటకు వినిపిస్తుంది. అక్కడ వర్గాలుగా అంటే అక్షరాలుగా వర్ణమాలలోని అన్ని వర్గాక్షరాలుగా విభజింపబడి నవరసభావాలను పలికించే మాటలుగా , పాటలుగా మారి రాగరంజితమై తన్మయమై తారస్థాయికి చేరి బ్రహ్మానంద స్వరూపమవుతుంది. ఆనందస్వరూపమైన ఆ నాదాత్మకునికి నమస్కరిస్తున్నాను

ఈ రెండు అర్థాల సమన్వయంతో ఇష్టదేవతా స్తుతి , గ్రంధంలోని విషయం రెంటినీ శ్లోక రూపంలో వివరించారు రచయిత. అన్నం విడిచిందో లేదో తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూసినట్లు ఈ ఒక్క శ్లోకాన్ని మనం అర్థంచేసుకోగలిగితే ఈ పుస్తకంలో సిధ్ధాంతపరమైన సంగీతలక్షణాలను ఎంత తేలికగా వ్రాయగలిగిన రచయిత పాండిత్యప్రతిభ మనకు అవగతమవుతుంది.

ఈ శ్లోకంతో ప్రారంభమయిన గ్రంథం సంగీతకళకు మనకు దొరికిన అతి ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఒకటి. రచయిత శార్జ్ఞదేవుడు. ఆయనే సారంగదేవుడని కూడా చెప్పబడ్డాడు.

పదార్ధ సంగ్రహ ప్రకరణం:
మొదటిదైన పదార్ధసంగ్రహ ప్రకరణంలో 49 శ్లోకాలున్నాయి. అందులో మొదటి 20 శ్లోకాలలో కవి, అతని తల్లిదండ్రులు , గురువులు , రాజాస్థానము , పూర్వపు కవుల ప్రశంస చెప్పబడ్డాయి. అందులోని ప్రత్యేకత ఈ కవి సాహిత్య, సంగీత, వాద్య, నృత్య కళాకారులందరి ప్రశంసా చేసాడు. అందువలన మనకు 2 విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఆ కాలానికి గాయకులు వాగ్గేయకారులు, గీతాకారుడు విభజన స్పష్టంగా లేదు. అందరూ కళాకారులుగా చెప్పబడేవారు. రెండవది భాషలు కూడా సంస్కృతం నుంచి పూర్తిగా వేరుపడలేదు. అందువలన సంస్కృత , ప్రాకృత భాషల భేదం మాత్రమే చెప్పబడింది. శాస్త్రప్రామాణికగ్రంధం కనుక సంస్కృత భాష వాడబడింది. 14 వ శతాబ్దానికి ముందు సాహిత్యంలోని అన్ని భాషా గ్రంధాలలోని ప్రయోగాలను క్రోడీకరించడం వలన మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. 20 వ శ్లోకం నుంచి 49 వ శ్లోకం వరకు కవి తాను విషయ సంగ్రహణ ఏయే వ్యక్తుల నుంచి ఏయే ప్రామాణిక ప్రయోగాల నుంచి స్వీకరించారో వాటిని ఏవిధంగా విభజించారో తెలియజేసారు.

ఆ శ్లోకాల వలనే మనకు ఈ లక్షణగ్రంధం 7 అధ్యాయాలుగా విభజింపబడిందనీ, ఒక అధ్యాయం మళ్లీ 8 ప్రకరణాలని తెలుస్తుంది. దాని పేరు స్వరగతాధ్యాయము. సంగీత స్వరరచనకు సంబంధించిన లక్షణాలన్నీ ఈ అధ్యాయంలో వివరింపబడ్డాయి.ఇక్కడితో పదార్ధ సంగ్రహ ప్రకరణం ముగిసింది. రెండవది పిండోత్పత్తి ప్రకరణము.

పిండోత్పత్తి ప్రకరణము:
ఇది వైద్యశాస్త్రంలోని శరీర నిర్మాణాన్ని చెప్పే ప్రకరణము. రచయిత అయినశార్జ్ఞదేవుడు రసవాదాన్ని అభ్యసించిన వైద్యునిగా మెదటి ప్రకరణంలో చెప్పుకున్నాడు. ఆ కారణం వల్లనే కావచ్చు. గర్భస్థ శిశువు పిండంగా వున్నప్పటి స్థితినుంచి జ్ఞానేంద్రియాల పుట్టుక, ఏ ఏ నాడులతో అనుసంధానం వుంటుంది. ఆ అనుసంధానం ఏ రకంగా వుంటే వారు ఉచ్చారణ దోషాలు లేకుండా పలుకగలుగుతారు, ఏయే నాడులను రంజింపచేయడం వలన గాయకులుగా ఆత్మానందాన్ని కలిగించగలరు అనే విషయాలను కూడా చెప్పగలిగారు.

చాలామంది సంగీత విద్వాంసుల చేత చెప్పబడే సంగీత వైద్యం అనే ప్రక్రియకు మూలం ఇదే. ఇదే ప్రకరణంలో ఛాయామాత్రంగా శరీరంలోని షట్చక్రాల గురించి ఆ షట్చక్రాలలో పలికే ధ్వనులు, అవి నాదంగా స్వరంగా మారే పధ్ధతి చెప్పబడింది.ఇక్కడితో రెండవదైన పిండోత్పత్తి ప్రకరణం పూర్తయ్యింది. ఇక్కడివరకు ఈ పుస్తకానికి ఉపక్రమణిక మాత్రమే. మూడవ ప్రకరణం నుంచి కేవలం సంగీత శాస్త్రానికి సంబంధించినది. సంగీత పారిభాషిక పదాలతో మాత్రమే ఆ ప్రకరణాలను అర్థం చేసుకోగలుగుతారు.

__________________________________________________________________________________________________________________

ముందు పేజీ తరువాత పేజి