Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/5

Wikibooks నుండి

గ్రామమూర్ఛనాక్రమతాన ప్రకరణము

1

గ్రామః స్వరసమూహః స్యాన్మూర్ఛనాఆదేసమాశ్రయః

తౌద్వౌధరాతలేతత్రస్యాత్షడ్జగ్రామ ఆదిమః

ఆరోహణము , అవరోహణము కలిసి మూర్ఛన అనబడును. మూర్ఛనలకు ఆశ్రయమైన స్వరసమూహము గ్రామమగును. ఆ గ్రామములు ప్రస్తుతము ప్రచారములో వున్నవి రెండు.

షడ్జగ్రామము. మధ్యమగ్రామము.

2

ద్రితీయోమధ్యమగ్రామస్తయోర్లక్షణముచ్యతే

షడ్జగ్రామః పంచమేస్వచతుర్ధశ్రుతిసంస్థితే

షడ్జగ్రామము మొదటిది. మధ్యమ గ్రామము రెండవది. రెండింటి లక్షణములు చెప్పబడును.

పంచమ స్వరము ( ప ) స్వచతుర్ధశ్రుతియందున్నప్పుడు ( శుధ్ధమధ్యమము ) షడ్జగ్రామమగును.

3

స్వోపాంత్యశ్రుతిసంస్థేఅస్మిన్ మధ్యమగ్రామఇష్యతే

యద్వాధస్త్రిశ్రుతిః షడ్జేమధ్యమేతు చతుఃశ్రుతిః

తన కడపటిదాని సమీపమున నుండు తృతీయ శ్రుతియందు పంచమ స్వరమున్నప్పుడు

మధ్యమ గ్రామమగును. దైవతము ( ద ) త్రిశ్రుతిలోను ( ద 3 ) మధ్యమము చతుశ్రుతి యందు ( మ4 ) వున్నప్పుడు మధ్యమ గ్రామమగును.

4-5

రిమయోః శ్రుతిమేకైకాం గాంధారశ్చేత్సమాశ్రితః

పశ్రుతింధోనిషాదస్తుధ శ్రుతిని సశ్రుతింశ్రితః

గాంధారమాచష్ట తదాతం నారదోమునిః

ప్రవర్తతేస్వర్గలోకే గ్రామోసౌనమహీతలే

ఋషభము ( రి ) మధ్యమము ( మ ) ల శ్రుతిని గాంధారము (గ ) ఆశ్రయించినపుడు , పంచమశ్రుతిని ( ప ) దైవతము ( ద ) ఆశ్రయించినపుడు , నిషాదము ( ని ) దైవతమును( ద )

ఆశ్రయించినపుడు దానిని గాంధార గ్రామమని నారదముని చెప్పెను. ఇది భూతలమున వర్తించదు. ప్రస్తుత కాలపు సంగీతమునందు ప్రచారములో లేదని అర్థము.

6

షడ్జః ప్రధానమాద్యత్వాదమాత్యాధిక్యస్తథా

గ్రామేస్యాదవిలోపిత్వాన్మధ్యమస్తు పురః సరః

షడ్జగ్రామము మొదటిది. సంవాది స్వరముల బాహుళ్యమును బట్టి షడ్జగ్రామము ప్రధానమైనది.

లోపించునది కాకపోవుట వలన మధ్యమగ్రామము కూడ అగ్రగణ్యమైనది.

7

ఏతత్కులప్రసూతత్వాద్గంధారోఅగ్రణీర్దివి

క్రమాద్గ్రామత్రయే దేవాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః

మొదట పుట్టుట మరియు ప్రాచుర్యము పొందుట వలన గాంధారగ్రామము అగ్రగణ్యమైనది. ఈ మూడు గ్రామములకు క్రమముగా బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు అధిదేవతలు.

8

హేమంతగ్రీష్మావర్షాసుగాతవ్యాస్తేయధాక్రమమ్

పూర్ణాహ్వకాలేమధ్యాహేఅభ్యుదయార్ధినిః

క్రమముగా ఈ రాగములు మూడు హేమంత గ్రీష్మ వర్షా కాలములలో పాడదగినవి. అభ్యాసము సాధన చేయువారిచే పూర్ణాహ్వ ( పొద్దున ) మధ్యందిన ( మధ్యాహ్న ) అపర్ణాహ్వ ( సాయంత్రము ) కాలములలో చేయదగినవి.

9

క్రమాత్స్వురాణాంసప్తానామారోహశ్చావరోహణమ్

మూర్ఛనేత్యుచ్యతేగ్రామద్వయేతాః సప్తసప్తచ

ఆరోహణ ( సరిగమపదని ) అవరోహణ ( సనిదపమగరి ) యందు క్రమముగా ఏడు స్వరములు వచ్చుట

మూర్ఛన అని చెప్పబడును. రెండు గ్రామములలో (షడ్జగ్రామము , మధ్యమ గ్రామము) ఒక్కొక్క దానికి

7 మూర్ఛనలుండును.

10

షడ్జేతూత్తరమంద్రాదౌరజనీచోత్తరాయతా

శుధ్ధషడ్జామత్సరీకృదశ్వక్రాంతాఅభిరుద్గతా

షడ్జగ్రామములో మొదట ఉత్తరమంద్ర , రజని , ఉత్తరాయత , శుధ్ధషడ్జ , మత్సరీకృతీ, అశ్వక్రాంత , అభిరుద్గత అను పేర్లు గల మూర్ఛనలు కలవు.