సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/3.7
| ప్రారంభం | 1.పదార్థ. | 2.పిండోత్పత్తి. | 3.నాద. | 4.సాధారణ. | 5.గ్రామ. | 6.వర్ణా. | 7.జాతి | 8.గీత. |
|---|
నాదస్థానస్వరజాతికులదైవతర్షి ఛందోరస ప్రకరణము
[మార్చు]39వ శ్లోకం నుంచి 45 వరకు
39
తేమంద్రమధ్యతారాఖ్య స్థానభేదాత్రిధామతాః
తఏవ వికృతావస్థా ద్వాదశప్రతిపాదితాః
సప్తస్వరములు మంద్రము, మధ్యము, తారము అను పేర్లు గల స్థాయీభేదములుగా 3 విధములు. శుధ్దములు 7 స్వరములు మాత్రమే. కొన్ని స్వరములు వికృతిని పొంది మొత్తము 12 అవుచున్నవి.
40
చ్యుతోనచ్యుతోద్విధాషడ్జో ద్విశ్రుతిర్వికృతోభవేత్
సాధారణేకాకలీత్వేనిషాదస్యచదృశ్యతే
'స' స్వరమునకు 2 శ్రుతులు. చ్యుతము, అచ్యుతము. సాధారణముగా చ్యుతమైన 'స' పలుకబడును. కాకలీత్వమున నిషాదముతో కలిసి అచ్యుతమగును.
41
సాధారణే శ్రుతింషాడ్జీమృషభం సంశ్రితోయదా
చతుఃశ్రుతిత్వ మాయాతి తదైకో వికృతి భవేత్
'స' స్వరము సాధారణముగా పలుకునపుడు 'రి' స్వరము దానిని వెన్నంటి వచ్చి వికృత స్వరముగా పలుకును.
42
సాధారణే త్రిశ్రుతిః స్యాదంతరత్వేచతుఃశ్రుతిః
గాంధారఇతితద్భేదేద్వౌ నిశ్శంకే నకీర్తితౌ
సాధారణమైన 'మ' శ్రుతిని 'గ' స్వరము గ్రహించును. అప్పుడు వికృతియై త్రిశ్రుతి యగును. (గ3) దాని భేదములు రెండు ప్రయోగమున నిశ్శంక శార్జ్ఞదేవునిచే నిరూపింపబడినవి.
43
మధ్యమః షడ్జవద్ ద్వేధాఅంతరసాధారణాశ్రయాత్
పంచమోమధ్యమ గ్రామేత్రిశ్రుతిః కైశికేపునః
అంతర గాంధార, సాధారణ గాంధార శ్రుతులు ఆశ్రయించుట వలన 'మ' స్వరము కూడ 2 విధములగును.
44
మధ్యమస్యశ్రుతిం ప్రాప్యచతుఃశ్రుతిద్విధా
దైవతోమధ్యమగ్రామేవికృతః స్యాచ్చతుః శ్రుతిః
మధ్యమ గ్రామమున పంచమము వికృతిగా మారి 'ద' స్వరము 'మ' గా పలుకబడును. అది చతుశ్రుతి దైవతమై వికృతిని పొందును.
45
కైశికేకాకలీత్వేచ నిషాదస్త్రిచతుఃశ్రుతిః
ప్రాప్నోతి వికృతే భేదౌద్వావితి ద్వాదశస్మృతాః
సాధారణ షడ్జమున (స) నిషాదము (ని) ప్రధమ శ్రుతియందున్నప్పుడు (అనునాదముగా వినబడినపుడు) వికృతిగా త్రిశ్రుతిని పొందును.(స3). కాకలి యయినప్పుడు (ని2) షడ్జశ్రుతిద్వయమును పొంది చతుశ్రుతి (స4) అగును. ఈ రెండు భేదములను కలుపుకొని స్వరములకు 12 వికృతి భేదములు.
_______________________________________________________________________________________________________________
| ముందు పేజీ | తరువాత పేజీ |
|---|