సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/4
సాధారణ ప్రకరణము
[మార్చు]సాధారణముగా సప్త స్వరములు ఏ ఏ స్వరస్ధానములుగా ధ్వనించునో అవి సాధారణములు.
ఉదా: స రి గ మ ప ద ని నాభి స్థానమున మొదలై హృదయము , కంఠము , అంగిలి , నాలుక దంతమూలము , దవడలు , నాసిక ఆయా స్థానములలో పలికించు ధ్వనులను ఒక ప్రామాణికమైన స్థాయిలో ఉచ్చరింపబడే స్వరస్ధానములు . వీటినే శ్రుతులుగా పేర్కొంటారు. ఇవే సాధారణములని చెప్పబడ్డాయి.
1
సాధారణంభవేద్ ద్వేధాస్వరజాతివిశేషణాత్
స్వరసాధారణమ్తత్రచతుర్ధాపరికీర్తితమ్
సాధారణములైన స్వరములు స్వరములు, జాతులు అని 2 విధములు.అందులో స్వరసాధారణము మరల 4 విధములు చెప్పబడినది.
2
కాకల్యంతరషడ్జైశ్చమధ్యమేన విశేషణాత్
సాధారణః కాకలీహిభవేత్షడ్జనిషాదయోః
కాకలీసాధారణము ( ని2) , అంతరసాధారణము( గ2) , షడ్జసాధారణము ( స2 ) , మధ్యమసాధారణము ( మ2 ) ఇవి 4 విధములు . కాకలీ స్వరము ( ని3 ) షడ్జ నిషాదములకు సమాన స్థితి కలదగును.
3
సాధారణ్యమతస్తస్యయత్తత్సాధారణంవిదుః
అంతరస్యాపిగమయోరేవంసాధారణంమతమ్
ఈ కారణమున కాకలిని సాధారణముగా సంగీతజ్ఞులు చెప్పుదురు. అట్లే గాంధార మధ్యమమునకు సమాన దూరములో నున్న ( గ2 ) సాధారణము.
4
ప్రయోజ్యౌషడ్జముచ్చార్య కాకలీ దైవతౌక్రమాత్
ఏవంమధ్యమముచ్చార్య ప్రయుంజీతాంతరర్షభౌ
షడ్జమును మొదట పలికించి పిదప కాకలి,దైవతములను ప్రయోగింపవలెను. అట్లే మధ్యమము పలికించి తరువాత గ రి ఉచ్చరింపవలెను.
5-6
షడ్జకాకలినౌయద్వోచ్చార్యషడ్జం పునర్ర్వజేత్
తత్పఠాన్యతమంచైవం మధ్యమం చాంతరస్వరమ్
ప్రయుజ్య మధ్యమోగ్రాహ్యస్తత్పరాన్యతమోఅథవా
అల్పప్రయోగః సర్వత్రకాకలీచాంతరః స్వరః
షడ్జమును ( స ) కాకలిని ఉచ్చరించి ( ని ) తరువాత ఉచ్చరింపజేయవలెను. అన్యములైన రి గ మ ప ద లను విడివిడిగా ఉచ్చరించవలెను. మ ను మొదట గ పలికించి తరువాత పలికించవలెను. అన్యములైన ప ద ని స రి లను విడివిడిగా పలికించవలెను. కాకలీ స్వరము , అంతర స్వరము జాతులు రాగములయందు అల్పముగా ప్రయోగింపబడును.
7
నిషాదోయదిషడ్జస్యశ్రుతిమాద్యంసమాశ్రయేత్
ఋషభస్త్వంతిమాంప్రోక్తంషడ్జంసాధారణంతదా
నిషాద స్వరము ( ని ) మొదటిదైన షడ్జశ్రుతిని ( స ) ఆశ్రయించినపుడు , లేదా రిషభము యొక్క ( రి ) చివరి శ్రుతి ఆశ్రయించినపుడు ఆ షడ్జము సాధారణ షడ్జము.
8
మధ్యమస్యాపిగపయోరేవంసాధారణంమతమ్
సాధారణంమధ్యమస్యమధ్యమగ్రామగంధ్రువమ్
గాంధారము ( గ ) మొదటి మధ్యమ శ్రుతిని ఆశ్రయించినపుడు లేదా పంచమము ( ప ) చివరి మధ్యమ శ్రుతిని ఆశ్రయించినపుడు అది మధ్యమ సాధారణము. అది మధ్యమ గ్రామమున మాత్రమే పలుకును. అట్లే షడ్జ సాధారణము షడ్జగ్రామముననే పలుకును.
9
సాధారణేకైశికేతేకేశాగ్రవదణుత్వతః తేఏవకైశ్చిదుచ్యేతేగ్రామసాధారణేబుధైః
మంద్ర ద్వనులు , సూక్ష్మ ద్వనులగుట వలన ఈ రెండు సాధారణములు కైశికములు. వాటినే గ్రామ సాధారణములుగా ( వాడుకలోనున్న శ్రుతులుగా ) చెప్పుదురు.
10
ఏకగ్రామోద్భవాస్వేకాంశాసుజాతిషుయద్భవేత్
సమానంగానమార్యాస్తజ్జాతిసాధారణంజగుః
ఒక గ్రామమున అన్ని శ్రుతులు సమానముగా పలికిన అది జాతి సాధారణమని చెప్పుదురు.
11
జాతిసాధారణంకేచిద్రాగానేవప్రచక్షతే
కొందరు జాతులనే రాగములు అని కూడ చెప్పుదురు.
స్వరగతాధ్యాయము-సాధారణ ప్రకరణము సమాప్తం.