Jump to content

సంగీత రత్నాకరము-శ్లోకాల వివరణ/1.2

Wikibooks నుండి
ప్రారంభం 1.పదార్థ. 2.పిండోత్పత్తి. 3.నాద. 4.సాధారణ. 5.గ్రామ. 6.వర్ణా. 7.జాతి 8.గీత.

పదార్థసంగ్రహ ప్రకరణము

[మార్చు]

11వ శ్లోకం నుండి 36 వరకు

 
11
నానాస్థానేషుసంభ్రాంతాపరిశ్రాంతాసరస్వతీ
సహవాసప్రియాశశ్వద్విశ్రామ్యతితదాలయే.

పలువురు పండితులు,కవుల యింట తిరిగి అలసిపోయిన సరస్వతీ దేవి శార్జ్ఞదేవుని స్నేహము చేయుటకై వారి యింట స్థిరనివాసము ఏర్పరచుకొన్నది.

12
సవినోదైకరసికోభాగ్యవైదగ్ధ్యభాజనమ్
ధనధాన్యేనవిప్రాణామార్తింసంహృత్యశాశ్వతీమ్

తన పాండిత్యము చేత ధనవంతుడైన శార్జ్ఞదేవుడు తన దానముల చేత ఆర్తులను సంతృప్తి పరిచాడు. 7 నుంచి 12 వ శ్లోకం వరకు రాయబడిన ఈ పేజీలో రచయిత తన వంశాన్ని,తల్లిదండ్రులను పుట్టుపూర్వోత్తరాలను చెప్పుకున్నాడు.

13
జిజ్ఞాసూనాంవిద్యాభిర్గదార్తానాంరసాయనైః
అధునాఖిలలోకానాంతాపత్రయజిహీర్షయా

విద్యాదానము చేసి జిజ్ఞాసువులను, రసాయన దానము చేసి రోగార్తులను రంజింపజేసినాడు.ఉపాధ్యాయుడు,వైద్యుడు.

14
శాశ్వతాయచధర్మాయకీర్త్యైనిశ్రయేయసాప్తయే
ఆవిష్కరోతిసంగీతరత్నాకరముదారధీ

ఇప్పుడతడు సకల లోకములకు తాపత్రయములను తగ్గించుటకు (tensoion free )శాశ్వత కీర్తిని కలిగించు ధర్మమును ప్రబోధించుటకు సంగీత రత్నాకరమును ప్రకటించుచున్నాడు.

15-21
సదాశివఃశివాబ్రహ్మాభరతఃకశ్యపోమునిః
మతంగోయష్టీకోదుర్గాశక్తిఃశారదూలకోహతా

విశాఖిలోదత్తిలశ్చకంబలోఅశ్వతస్తథా
వాయుర్విశ్వావసూరంభాఅర్జునోనారదతుంబురూ

ఆంజనేయోమాతృగుప్తోరావణోనందికేశ్వరః
స్వాతిర్గణోబిందురాజఃక్షేత్రరాజశ్చరాహులః

రుద్రటోనాన్యభూపాలోభోజభూవల్లభస్తథా
పరమర్దీచసోమేశోజగదేకమహీపతిః

వ్యాఖ్యాతారోభారతీయేలోలటోద్భటశంకుకాః
భట్టాభినవగుప్తశ్చశ్రీమత్కీర్తిధరఃపరః

అన్యేచబహవఃపూర్వేయేసంగీతవిశారదాః
అగాధబోధమంథేనతేషాంమతపయోనిధిమ్

నిర్మథ్యశ్రీశార్జ్ఞదేవఃసారోధ్ధారమిమంవ్యదాత్
గీతంవాద్యంతథానృత్తంత్రయంసంగీతముచ్యతే

సదాశివుడు, పార్వతి, బ్రహ్మ, భరతుడు, కశ్యపముని, మతంగుడు, యష్టీకుడు, దుర్గాశక్తి,శార్దూలుడు,కోహలుడు, విశాఖిలుడు, దత్తిలుడు, కంబలుడు, అశ్వతరుడు, వాయువు, విశ్వావసువు, రంభ, అర్జునుడు, నారదుడు, తుంబురుడు, ఆంజనేయుడు, మాతృగుప్తుడు, రావణుడు, నందికేశ్వరుడు, స్వాతిర్గణుడు,ిందురాజు, క్షేత్రరాజు, రాహులుడు, రుద్రటుడు, నాన్యభూపాలుడు భోజరాజు, పరమర్ది, సోమేశుడు, జగదేకభూపాలుడు, లోలటుడు, ఉద్భటుడు, శంకుకుడు, భట్టాభినవగుప్తుడు, శ్రీమత్కీరితిధరుడు మొదలయిన వారందరు పూర్వపుసంగీతప్రవీణులు, వ్యాఖ్యాతలు, వాగ్గేయకారులు, సంగీతకర్తలు. పూర్వము పరంపరాగతముగ ఈ భారతీయ సంగీతకారులందరు నిర్మించిన సంగీత శాస్త్రమును మధించి, శార్జ్ఞదేవుడు సంగీతసారమునునవనీతముగ (వెన్న) వెలువరించాడు. వీరి మతమున ప్రధానముగా గీతము, వాద్యము, నృత్తము అను మూడు విషయములు చెప్పబడును. ఈ మూడు విషయములు కలిసి సంగీతమని చెప్పబడును

22-24
మార్గోదేశీతితద్ద్వేధాతత్రమార్గస్ఉచ్యతే
యోమార్గితోవిరించాద్యైఃప్రయుక్తోభరతాదిభిః

దేవస్యపురతశ్శంభోర్నియతాభ్యుదయప్రదః
దేశదేశజనానాంయద్రుచ్యాహృదయరంజకమ్

గీతంచవాదనంనృత్తంతద్దేశీద్యభిధీయతే
నృత్తంవాద్యానుగంప్రోక్తంవాద్యంగీతానువర్తిచ

మూడూ కలిసిన సంగీతం మార్గము, దేశి అని రెండు విధములు.బ్రహ్మ మొదలైనవారిచే సృష్టింపబడి,భరతముని మొదలయిన వారిచే ప్రయోగింపబడిన సంగీతము. మార్గము. అది శంకరుని ఆమోదమై అభ్యుదయమును కలిగించును. వివిధ దేశములలో మనోరంజకమై ప్రయోగింపబడు సంగీతము దేశి అని చెప్పబడును. అది నృత్త వాద్య గీతమయము. నృత్తము వాద్యముననుసరించును. వాద్యము గీతముననుసరించును

25
అతోగతంప్రధానత్వాదత్రాదావభిధీయతే
సామవేదాది సంగీతంసంజగ్రాహపితామహః

ప్రధానమయినది కనుక గీతము మొదట చెప్పబడును. బ్రహ్మదేవుడు సామవేదము నుండి సంగీతమును గ్రహించెను.

26
గీతేనప్రీయతేదేవఃసర్వజ్ఞఃపార్వతీపతిః
గోపీపతిరనంతోపివంశధ్వని వశంగతః

పార్వతీపతియైన శివుడు గీతముల వలన ప్రీతిని పొందును.గోపీవల్లభుడు శ్రీకృష్ణుడు, ఆదిశేషుడు వేణునాదమునకు వశపడుదురు.

27
సామగీతిరతోబ్రహ్మావీణాసక్తాసరస్వతీ
కిమన్యేయక్షగంధర్వదేవదానవమానవాః

బ్రహ్మదేవుడు సామగాననిరతుడు. సరస్వతీదేవి వీణాసక్త. అన్యులైన యక్షులు, దేవతలు, మానవులు రాక్షసుల గురించి వేరే చెప్పడం దేనికి?

28
అజ్ఞాతవిషయాస్వాదోబాలఃపర్యంకికాగతః
రుదన్గీతామృతంపీత్వాహర్షోత్కర్షంప్రపద్యతే

ప్రాపంచిక విషయములేమీ ఎరుగని పసిబాలుడు మంచములోనుండి ఏడ్చుచు కూడా గీతామృతము వీనులవిందుగా వినిపించగానే దానిని గ్రోలి ఏడ్పు మాని పరమానందమును పొందును.

29
వనేచరస్తృణాహారశ్చిత్రంమృగశిశుపశుః
లుబ్ధదోలుబ్ధకసంగీతేగతేయచ్ఛతిజీవితమ్

అడవిలో తిరిగే వనచరాలైన లేడి,దుప్పి మొదలయిన జంతువులు కూడా వేటగాడి బారిన పడ్డా అతని పాటకు వరవశించిజీవితాపేక్షను మరచి వలలో చిక్కుకుంటాయి.

30
తస్యగీతస్యమహాత్మ్యంకేప్రశంసితుమీశతే
ధర్మార్థకామమోక్షాణామిదమేవైకసాధనమ్

అంత శక్తికలిగిన గీతమహిమను వర్ణించ సాధ్యమా.?గీతమొక్కటే ధర్మార్థకామమోక్షములనే నాలుగు విధాలైన పురుషార్థములను సాధించుటకు ముఖ్య సాధనము.

31
తత్రస్వరగతాధ్యాయేప్రథమేప్రతిపాద్యతే
శరీరంనాదసంభూతిఃస్థానానిశ్రుతయస్తథా

ఈ పుస్తకంలో మొదటగా చెప్పబడిన అధ్యాయం స్వరగతాధ్యాయము. ఈ అధ్యాయంలో శరీరం నుంచి నాదం పుట్టుక,నాదోత్పత్తి స్థానాలైన శ్రుతులు వీటిని గురించి చెప్పబడుతుంది.

32-36
తతశ్శుధ్ధాస్వరాస్సప్త వికృతాద్వాదశాప్యమీ
కులానిజాతయోవర్ణాద్వీపాన్యార్షంచధైవతమ్

ఛందాంసివినియోగాశ్చస్వరాణాంశ్రుతిజాయతః
గ్రామాశ్చమూర్ఛనాస్థానాఃశుధ్ధాఃకూటాశ్చసంఖ్యయా

ప్రస్తారఃఖండమేరుశ్చనష్టోదిష్టప్రబోధకః
స్వరసాధారణంజాతిసాధారణమతఃపరమ్

కాకల్యంతరియోఃసమ్యక్ప్రయోగోవర్ణలక్షణమ్
త్రిషష్టిరప్యలంకారస్త్రయోదశవిధంతతః

జాతిలక్ష్మగ్రహాంశాదికపాలానిచకంబలమ్
నానావిధాగీతయేశ్చేత్యేతావానీవస్తుసంగ్రహః

శుధ్ధ సప్తస్వరములు,ద్వాదశ వికృతి స్వరములు, కులములు,జాతులు,వర్ణములు,ద్వీపములు,ఆర్షము,దైవతముఛందస్సులు, స్వరవినియోగములు, శ్రుతిజాతులు, గ్రామములు,మూర్ఛనలు, శుధ్ధతానములు, కూటతానములు, ప్రస్తారము, ఖండమేరువు, నష్టోద్దిష్ట ప్రబోధకము, స్వరసాధారణము, జాతిసాధారణము, కాకల్యంతర సమ్యక్ప్రయోగము, వర్ణలక్షణము, త్రిషష్ట్యలంకారములు, త్రయోదశ విధజాతి లక్షణములు, గ్రహాంశములు, కపాలములు, కంబలము, నానావిధ వస్తుగీతములు ఇవి సంగీత పారిభాషిక పదములు(Technical terms). ఈ పదముల వివరణ, ప్రయోగముల గూర్చి స్వరగతాధ్యాయమున వివరింపబడును.

_______________________________________________________________________________________________________________
ముందు పేజీ తరువాత పేజి