ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)
ఈ పుస్తకములో దాదాపు 5000 శబ్దములకునూ, 500 ధాతువులకునూ ఉపసర్గపూర్వకముగా అర్ధములను వ్రాసితిని. ఈ నూతన విధానము నిట్లు అనుసరింపదగును. మనము మాట్లాడు తెలుగు వాక్యములలో అనేక/సగము శబ్దములను ఈ శబ్దకోశమునందు గుర్తింపకలము. ప్రతిపుటలోనూ ఎన్ని శబ్దములు పూర్తిగా తెలుసునో, ఎన్ని సందేహాస్పదములో గుర్తులు పెట్టుకొనవలెను. గురుతులు లేనివి / మిగిలినవి తెలియని శబ్దములు. రెండవమారు చదివినప్పుడు మొదటి మాటు కన్న ఎక్కువ శబ్దములు తెలియును. ఇట్లు చదివిన ప్రతిసారి తెలిసిన శబ్దములను, సందేహాస్పద శబ్దములను లెక్కలు వేయుటచే ఎంత అభివృద్ధి సాధించితిమో అవగతమై అభ్యాసమున ధైర్యము కలిగి ముందుకు సాగుటకు వీలగును. మన మాతృభాష తెలుగుగాన తెలుగులో/అచ్చ తెలుగులో వత్తులు లేకపోవుట వలన వత్తులు పలుకు అలవాటు కొందరలో తగ్గియున్నది. గాని మనము మాట్లాడు తెలుగు భాషలో సంస్కృత శబ్దములనైననూ వత్తులను తేలికగా పలుకు అలవాటు కలిగియున్నాము. బేధము మొదలైన సంస్కృత శబ్దములను తెలియనివారు బేధముగా పలుకుతున్నారు. అనగా బకారమునకు వత్తు తీసివేసి దకారమునకు పట్టుతున్నారు. కాన సంస్కృత శబ్దములేమో తెలుగు శబ్దములేమో ఈశబ్దకోశము వలన తెలిసికొనవచ్చును.